గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గ్రహణ సమయంలో సమస్త వస్తువులూ మైల పడిపోతాయి. బిందెలలో నీరు బయట పారబోసి ఆ బిందెలు తోమాలి. ఆహార పదార్థాలు ఏమన్నా మిగిలితే బైట పారవేయాలి కాని తినరాదు. ఊరగాయ కుండలు మైల పడకుండా వాటి వద్ద దర్భ గడ్డి వుంచుతారు. ఇంటి చూరులో ఓ దర్భ పుల్ల వుంచుతారు. గ్రహణం విడిచాక పూజా విగ్రహాలు తోముకొని దేవునిగది, వంటగది కడుగుకొని విడుపుస్నానం చేసాకనే శుద్ధి అవుతుంది. గ్రహణ సమయంలో ఏ విధమైన ఆహారం భుజించరాదని, తింటే గ్రహణ శూల అనే కడుపు నొప్పి వస్తుందని ఆ రోజుల్లో నమ్మకం. గ్రహణానికి 3 గంటల ముందు నుంచి ఏ విధమైన ఆహారం తినరాదు. గ్రహణం విడిచాక పవిత్ర స్నానాలు చేసి వంటలు చేసుకొని తినాలి. ఈ ఆచారాన్ని సనాతనాచార పరులు నేటికి నమ్ముతున్నారు. జంతువులూ, పక్షులూ కూడా గ్రహణ సమయంలో ఆహారం తినకపోవటం మనం గమనించవచ్చు. తడి బట్టలు అపర కర్మల సమయంలో మాత్రమే ధరిస్తారు. శుభ కర్మలకు అవి నిషిద్ధం. అందుచేత మడి బట్టకు ఓ దర్భపుల్ల ముడి వేసి ఆరవేస్తే అది గ్రహణం విడిచాక కూడా మడి నూలు బట్టలు తాకితే మడి కాదు. అందుచేత పట్టుబట్టలు, బరంపురంలోనూ, పెద్దాపురంలోనూ కొంత ముతకగా వున్న పట్టుదారంతో ఎక్కువ ఉతుకులు వోర్చే పట్టుచీరలు, ధోవతులు నేసేవారు. వాటిని పొత్తుపంచలు, పొత్తు చీరలు అనేవారు. ఇంటిలో పూజించే దేవతార్చనాసంపుటిని ఆడవారు పూజించే గౌెరీదేవి పెట్టె లేక మహాలక్ష్మీ పెట్టె అనే ఇత్తడి విగ్రహాలు, రాతి గౌరీదేవి కూడా తోమి పులికాపు చేస్తారు.

దేవాలయాలలో జాము ప్రొద్దెక్కాక గాని, అర్థరాత్రి దాటాక కాని, గ్రహణం సంభవిస్తే ఆ రోజు పెందరాళే పూజాదికాలు కానిచ్చి మహానివేదన చేస్తారు. మళ్ళీ గ్రహణం విడిచాక మరునాటి ఉదయాన పులికాపుచేసి శుద్ధిమంత్రాలు ఏకరువుపెట్టే వరకూ పూజా, నివేదనలు చేయరు.

సీతమ్మ గారు మిత్రురాండ్రు సముద్ర తీరాన పట్టుస్నానం చేసాక పూజలు చేసుకొని తమకు వచ్చిన కీర్తనలు, స్త్రోత్రాలు చదువుకుంటూ కూర్చొని విడుపు ప్రారంభం కాగానే విడుపుస్నానాలు చేసి తిరుగు ప్రయాణం అయ్యారు. పిఠాపురంలో పూరుహూతికాశక్తినీ, కుంతీమాధవ స్వామిని దర్శించారు. పిఠాపురం పాదగయా క్షేత్రం. శ్రీ మహావిష్ణువు గయాసురుణ్ణి సంహరించినపుడు చక్రధారిచే ఖండితమైన అతడి శిరస్సు కురుక్షేత్రం వద్ద గయాక్షేత్రంలోనూ, పాదాలు ఈ పాదగయలోను పడ్డాయట. అంచేత ఇచ్చట పితృ కార్యాలు చేస్తే గయలో చేసిన ఫలం కలుగుతుందని తమ గృహాలలో పితృదేవతల తిధులలో అర్పించడం కుదరని వారు ఈ పాదగయలో నిర్వర్తిస్తారు ఆ ప్రాంతాలలో. గ్రహణ వేళ ఆరుబయట పళ్ళెంలో నీరు పోసి పెట్టి అందులో రోకలి పెడితే గ్రహణసమయ ప్రభావం వలన అది నిలబడుతుందని అంటారు. ఓ గ్రహణ సమయంలో అలా రోకలిని నిలబెట్టి అది ఓ నిముషం సేపు నిలబడిరదని ఆమె అంటారు. గ్రహణ సమయంలో పట్టే గ్రహణ గౌరీ అనే నోము వుంది. దాని విధానం ఈ ప్రకారంగా వుంటుంది.

గ్రహణం పట్టగానే స్నానం చేసి బియ్యం జల్లించుకునే జల్లెడలో 9 ప్రత్తి పింజలు, ( పత్తి విళ్ళు) 9 పోకచెక్కలు, పసుపూ కుంకుమ, అక్షతలకు బియ్యం, పద్మాలకు వరిపిండీ పెట్టి పైన ఓ వెదురు పేళ్ళ. జల్లెడ మూత పెట్టి ఓ పందిరి క్రింద పెట్టాలి. గ్రహణం విడిచాక విడుపు స్నానం చేసి, పెరట్లో తులసి కోట వద్ద ఈ పూజా ద్రవ్యాలతో 9 పద్మాలు పెట్టుకొని, 9 పోగులు వత్తి వెలిగించి గ్రహణ గౌరీని పూజించాలి. మరో 8 రోజులు ఈ విధంగా ఉదయం వేళ పూజ చేయాలి. సూర్య గ్రహణంతో ప్రారంభించి, సుర్య చంద్ర గ్రహణాలు ఏవైనా మొత్తం 9 గ్రహణాలకు ఈ విధంగా పూజ చేయాలి. ఉద్యాపన 9 మినప అట్లు, వెదురు పేళ్ళ జల్లెడలో పెట్టి మీదో వెదురుపేళ్ళ జల్లెడతో మూత పెట్టి చీర, రవికల గుడ్డ దక్షిణ తాంబూలాలలో ముత్తయిదువుకు అందివ్వాలి.
ఈ నోము కథ ఈ విధంగా వుంది.

ఓ బాలిక పూర్వ జన్మలో రజస్వల అయి ఇంటిలో సంచరించిన పాపం వలన ఈ జన్మలో పగలల్లా మనిషిగా వుండి రాత్రి అయ్యేసరికి పురుగులుగా మారిపోయేది. తల్లి ఈ రహస్యం ఎవరికీ తెలియనీయకుండా రాత్రుల్లో పురుగులు చెదిరిపోకుండా కాపాడుతూ వుండేది. ఓ సారి ఆమె తప్పనిసరిగా పుట్టింటికి వెళ్లవలసి వచ్చింది. పెద్ద కోడలికి ఈ రహస్యం చెప్పి బిడ్డని జాగ్రత్తగా కాపాడమని చెప్పి అప్పగించి వెళ్ళింది ఆ ఇల్లాలు. ప్రతి రోజూ భార్య రాత్రి వేళ గదిలోకి రాకపోయే సరికి పెద్ద కొడుక్కి అనుమానం వచ్చింది. రాత్రి వేళ ఆమెను జాగ్రత్తగా కనిపెట్ట సాగాడు. యదార్థ దృశ్యాన్ని చూచిన అతడి గుండె ద్రవించి పోయింది. అర్థానపడవిలోకి వెళ్లి, పార్వతీ, పరమేశ్వరుల గూర్చి తపస్సు చేయసాగాడు. ఆది దంపతులు ప్రత్యక్షమై కారణం అడిగారు. అతడు తాను చూసింది చెప్పి నా చెల్లెలు ఏ పాపం చేయడం వలన ఈ విధంగా దుర్థశ అనుభవిస్తుంది. దానికి విమోచన మార్గమేమిటో చెప్పి దయచూడమని వేడుకొన్నాడు అతడు. నీ చెల్లెలు పూర్వ జన్మలో గ్రహణగౌరీ నోము పట్టి ఉల్లంఘన చేసింది. అందుచేత ఈ పాపం వచ్చింది. నీవు ఇంటికి వెళ్లి నీ భార్య చేత గ్రహణగౌరీ నోము పట్టించి యధావిధిగా వ్రత విధీ ఉద్యాపన చేయించి ఆ ఫలం నీ చెల్లెలికి ధార పోయిస్తే ఆమెకు ఈ దుర్ధశ తొలుగుతుందని చెప్పారు. ఆ బ్రాహ్మణ యువకుడు ఆ ప్రకారంగా చేసాడు.

బాలిక పురుగుల రూపం పోయి పగలు రాత్రి ఒకేలా వుండసాగింది. తల్లిదండ్రులు బ్రహ్మానందపడ్డారు. ఈ కథ ఇంటి పెద్ద కొడుకూ, కోడళ్లకు సంసారం పట్ల గల బాధ్యతను తెలియజేస్తుంది. గ్రహణం గర్భిణీ స్త్రీలు చూడరాదనీ, తెలిసో, తెలియకో చూస్తే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడతారని జనం నమ్మకం. గ్రహణమొర్రి అని అటువంటి పిల్లలకు ఏర్పడుతుంది. పెదవులుకాని, చెవికాని, కలవకుండా మధ్యలో కాళీ ఏర్పడి రెండు ముక్కలుగా వుంటుంది. అప్పటి రోజుల్లో నేటి ప్లాస్టిక్‌ సర్జరీ విధానం లేకపోవడం వలన ఆ అంగవైకల్యానికి చికిత్స లేదు. ‘గ్రహణపు మొర్రి సంసారం మొర్రి తీర్చలేరని’ సామెత. సంసారంలో ఎంత సమర్థంగా నేర్పుగా చేసినా ఏదో ఒక వెలితి వుంటూనే వుంటుంది కదా. గ్రహణ సమయంలో సూర్య చంద్రుల నుండి వెలువడే కిరణాలు గర్భిణీ స్త్రీలకు చెరుపు చేస్తాయని తెలిసిన శాస్త్రిగారు తమ ఇంటిలోని స్త్రీలు గర్భవతులుగా వున్నప్పుడు వారిని గ్రహణం చూడవద్దని, ఆ సమయంలో ఏ పనీ చేయవద్దనీ ఆదేశించి, వారిని విశ్రాంతిగా పడుకోమని వారికి అవసరమైన సదుపాయాలు సమకూర్చేవారు.

సీతమ్మగారు నిత్యవిద్యార్థినీ, లక్ష్మీ సరస్వతులు ఆమె నెచ్చెలులు. బాల్యంలో తాను ఎంతో ఆసక్తితో నేర్చిన సంగీత విద్యను ఆమె జీవితాంతం వీడలేదు. ‘నవ నవోన్మేష శాలినీ, నిత్య నూతనీవిద్యా’ ఎప్పుడూ నూతన వికాసంతో వుండేదే విద్య అన్న అర్య వాక్కు ఆమె పట్ల నిజం అయ్యింది. నలభయ్యవ దశకంలో ఆవిర్భవించిన భావ కవిత, జాను తెనుగు ఆమెను విశేషంగా ఆకర్షించాయి. ఎన్నో గీతాల్ని విని, నేర్చుకొనితాను పాడటమే కాక, సాటి స్త్రీలకు, బాలికలకు నేర్పేవారామే. ఇరుగు పొరుగు బాలికలు ‘మా రమణా మా రమణా హృదయములో నిను మరువనురా। గోవింద రమణా రారా। రారా।’ అనీ వేంకటేశా నిన్నే నమ్మినారా ప్రభో। నిన్నే నమ్మినారా। నిన్నే నమ్మినారా। నిత్యాకళ్యాణ। నీదారి చూపరా వెంకటేశ్వరా॥వెంక॥ ఏడుకొండలేశ। ఏడుకొంమడలేశ వేగరావయ్యా। ఎరుగనూ నీ మహిమా వెంకటేశ్వరా॥వెంక॥ శ్రీనివాస నా శ్రీనివాస నా చింతా దీర్పరా నీ దారి చూపరా వేంకటేశ్వరా ॥వెంక॥ శుక్రవారపు సేవ మీదికొండమీది వేంకటేశా। శనివారపు సేవమీది మంగ తల్లితో వేంకటేశ॥వెంక॥ దీన జనుల బ్రోవ దిక్కు నీవేరా నీదారి చూపరా నిత్య కళ్యాణా ॥వెంక॥ లక్ష్మీ తోడగూడి శ్రీ లక్ష్మీ తోడగూడి॥వెంక॥ అని పాడుతుంటే విని తాను పాడుతూ..

– కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, గౌతమీగంగ, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో