నీలవేణి ఒక్కక్షణం తలవంచుకొని, నిజమే అలాంటి అనుమానం తనకెప్పుడూ రాలేదు. అనుకుంటూ వెంటనే తలెత్తి. ‘‘ కానీ ఆడది తప్పు చెయ్యాలనుకుంటే ఇంటి గడపకి కూడా తెలియకుండా చెయ్యగలదు. తప్పు చేసేముందు నా ముందుకొచ్చేమైనా చేస్తుందా నన్ను చూడమని… అలాంటప్పుడు నాకెలావస్తుంది అనుమానం?’’ అంటూ కోర్టులో ముద్దాయిని నిలదీస్తున్న లాయర్‌లా తల్లి వైపు చూస్తోంది నీలవేణమ్మ,
కూతుర్ని సమర్థించలేక మనవరాల్ని తప్పుపట్టలేక గిలగిల కొట్టుకొంటోంది గోమతమ్మ మనసు…. కూతురి కళ్లు తననే చూస్తూ నిప్పులు కురుస్తుంటే ఇక తట్టుకోలేక… ‘‘స్నేహిత తప్పు చేసిందో లేదో ఎవరికీి తెలియదు. దేవతలు కూడా పిల్లల కోసం తప్పు చేసినట్లు మన పురాణాల్లో వుంది…. దీన్ని ఇక పెద్దది చేసి చూడకు నీలవేణి!’’ అంది గోమతమ్మ.
‘‘ఎవరా దేవతలు?’’ నిలదీసింది నీలవేణమ్మ.
‘‘ఎవరంటే! అంబిక, అంబాలిక….’’ అంది గోమతమ్మ.
వాళ్ల మాటలు కిటికీలోంచి విన్పిస్తుంటే ‘‘ ఏంటర్రా మిావాదన? లోపలకి రండి! మిా ఇద్దరు….’’ అంటూ పిలించింది లక్ష్మిదేవమ్మ.
ఆమె పిలవగానే కంగారుగా కూతురివైపు చూస్తూ ‘‘ఈ విషయాన్ని ఆవిడ చెవిన వెయ్యకు నీలవేణి నువ్వు ఏ మాత్రం ఆవేశపడినా పచ్చిక బయలుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్లు స్నేహిత బ్రతుకు కాలిపోతుంది. విచక్షణ పాటించు….’’ అంది.
తల్లివైపు ఉరిమి చూస్తూ, తల్లి చెయ్యి పట్టుకొని లోపలకి తీసికెళ్లింది నీలవేణమ్మ, వాళ్లు లోపలకి రాగానే అక్కడ కూర్చుని వున్నవాళ్లు బయటకెళ్లారు.
ఏమిటన్నట్లు వాళ్లిద్దరి వైపు చూసింది లక్ష్మిదేవమ్మ.
‘‘ఏం లేదు అత్తయ్యా! పురాణాల్లో అంబిక, అంబాలిక పిల్లల కోసం తప్పు చేశారట…. మా అమ్మ చెబుతోంది.’’ అంది అక్కసుగా తల్లివైపు చూస్తూ. ఆమెకు చెడ్డకోపంగా వుంది తల్లిపైన. గోమతమ్మకు ఏం చేయాలో పాలుపోవటం లేదు.
‘‘మిా వాదన చర్చలోకి మారకముందు మిా సందేహాన్ని నేను తీరుస్తాను. ఇదిగో ఇలా నాకు దగ్గరగా వచ్చి కూర్చోండర్రా!’’ అంది లక్ష్మీదేవమ్మ.
డాక్టర్ మాట్లాడవద్దని ఎంత చెప్పినా ఆమెకు రోజంతా మాట్లాడుతూనే గడుపాలని వుంటుంది. అస్వస్థత వల్ల ఆమె స్వరం చిన్నగా విన్పిస్తుంటే వాళ్లిద్దరు వెళ్లి ఆమెకు చెరొకవైపున కూర్చున్నారు.
… ఆమె వాళ్ల వైపు చూడకుండా తనకి ఎదురుగా కన్పిస్తున్న తైలవర్ణ చిత్రంలో కణ్వమహర్షి ఆశ్రమంలో నడుం దగ్గర కడవ పెట్టుకొని నిలబడి వున్న శకుంతలవైపు చూస్తూ
‘‘శకుంతల, దుష్యంతుల కుమారుడైన భరతుడు మహారాజై భరత వంశ ప్రతిష్టాపకుడు అయ్యాడు. ఆ భరతవంశంలో అనేక రాజులు జన్మించారు. వారిలో విచిత్ర వీర్య, చిత్రాంగదులు సంతానం లేకుండానే మరణించారు. దీంతో అతని భార్యలైన అంబిక, అంబాలికలకు వ్యాసుడివల్ల దృతరాష్ట్రుడు, పాండురాజులు జన్మించారు. కానీ దృతరాష్ట్రుడేమో గుడ్డివాడు. పాండురాజు కుష్టురోగి..’’ అంది.
నీలవేణి ఆశ్చర్యపోతూ ‘‘ అంబిక,అంబాలికలకు భర్త చనిపోయాడు కదా! వ్యాసుడితో పిల్లల్ని కనటం ఏమిటి? పైగా గుడ్డివాడిని, కుష్టురోగిని… ఇది నమ్మదగినదేనా అత్తయ్యా? ఇంతకీ ఆ వ్యాసుడు ఎవరు?’’ అంది నీలవేణమ్మ.
ఆమె భారతం వినటం కాని, చదవటం కాని, సినిమాల్లోచూడటం కాని ఇంతవరకు లేదు…భారతం వినాలన్నా, మాట్లాడలన్నా లక్షీదేవమ్మ ఆమెకు ఆమే సాటి. కోడలి ప్రశ్నకి సమాధానం చెప్పాలని ఒక్కక్షణం కళ్లుమూసుకొని , తెరుస్తూ..
‘‘వ్యాసుడు అంబిక, అంబాలికల అత్తగారైన సత్యవతి కన్యగా వున్నప్పుడు పుట్టిన పుత్రుడు….’’ అంది లక్షీదేవమ్మ.
నీలవేణమ్మ ఇంకా షాక్ తిని వెంటనే తేరుకొని ‘‘కన్యగా వున్నప్పుడు పిల్లల్ని కంటే పెళ్లిళ్లెలా అవుతాయి అత్తయ్యా ఆడపిల్లలకి…? మిాకు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. రెస్ట్ తీసుకోండి!’’ అంది లేవబోతూ….
కూర్చోమన్నట్లు చేత్తో సైగ చేస్తూ ‘‘వాళ్లు దేవతలు నీలవేణీ! వర ప్రభావం వల్ల కన్యత్వం దూషితము కాకుండా గర్భం దాల్చేవారు…. విచిత్రవీర్య, చిత్రాంగుదల తల్లి సత్యవతి కన్యగా వున్నప్పుడు యమునా నదిలో నావను నడుపుతూ వుండగా ఆ దారిన వెళ్తూ పరాశర మహర్షి అమె సౌందర్యాన్ని చూసి చలించాడు. ఆయన అరిషడ్వర్గాలను జయించి, జితేంద్రియుడై తపస్సు చేసుకునే వాడే అయినా ఏకాంతంలో కాంతా దర్శనం అయ్యేసరికి నిగ్రహశక్తిని కోల్పోయి సత్యవతి కన్యత్వం పోకుండానే వ్యాసుడి జన్మకు కారకుడయ్యాడు. వ్యాసులవారు పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించి తనను తలుచుకోగానే దర్శనమిస్తానని తల్లితో చెప్పి పరబ్రహ్మను ఉపాసిస్తూ, వేదాలను విభాగించి, పురాణాలను రచించి లోక కళ్యాణ కాంక్షలో వుండి పోయాడు.
– అంగులూరి అంజనీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~