జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

”అరె!అలాగా”

వీళ్ళు వెళ్ళేసరికి ముత్తెమ్మ, పక్కింటి దేవమ్మ ముచ్చట్లు పెడ్తున్నారు. దేవమ్మ మూడేళ్ళ కూతురు తల్లి పాలు తాగుతూ మధ్య మధ్యలో బయటకు చూస్తున్న దేమో కొత్తగా కన్పిస్తున్న విద్యని చూసి ముఖం మీదకి తల్లి కొంగు కప్పేసుకుంది కాస్త భయంగా … మళ్ళీ తనే తొంగి చూస్తూ…

అది గమనించిన విద్య… తానేమి పట్టించుకోకుండా ముత్తెమ్మను పలుకరించి వెనుదిరుగ బోతూంటే అప్పుడే ఆ దొడ్లోకి అడుగుపెట్టాడు ఒకతను. చేతిలో సొరకాయ బుర్రతో చేసిన తంబూర వాయిస్తున్న అతను పంచె చొక్కా, ఆ చొక్కాపై చిరిగిన పాత కోటు, తలకి మజెంటా కలర్‌ పాగా…. మెడలో రుద్రాక్షలాంటి పూసలూ, చెవికి రింగూ, చేతికి వెండితో చేసిన వాచీ బెల్టు లాంటిది. వెండి రంగులో ఉన్న ఉంగరాలు రెండు, రంగు వెలసిన ఆకుపచ్చరాయీతో మరో ఉంగరమూనూ, మొహాన అడ్డంగా పెట్టిన విభూది రేఖలూ,….. భుజాన గుడ్డతో చేసిన జోలె వేలాడుతూ…
అతను శివపార్వతుల కథ ఏదో పద్య రూపంలో చెప్తూండగా… ముత్తెమ్మ లేచి వెళ్ళి చేటలో బియ్యం తీసుకొచ్చి అతని జోలెలో వేసింది.

అతను ముత్తెమ్మను దీవించి వెళ్ళిపోయాడు.
”ముత్తెమ్మా అతను ఎవరు? ” ప్రశ్నించింది విద్య
”గోసం అయ్యవారు”
”అతను ఏం చెప్పాడు… నాకు సరిగా అర్థం కాలేదు” అడిగింది విద్య.

”గోసం అయ్యవార్లు పురాణ కథలు చెప్పుకుంట ఊర్ల ఏసిన బిక్ష తీసుకొని బతుకుతరు” అంది.
గోసం అయ్యవార్లు అంటే ఏమీ అర్థం కాలేదు కానీ ఇదో రకం అడుక్కునే పద్ధతి ఆ ఆచారంగా వచ్చింది కావచ్చు అనుకొంది విద్య. తల్లి పోవడంతో ముత్తెమ్మ మరీ ఒంటరిదైపోయింది. తల్లి దిగులుతో చిక్కిపోయింది. ఆదాయ మార్గం తనకు తానే మూసేసుకుంది. ఇదివరకటిలాగా ‘దేవుడు’ రావడం లేదు. కళ్ళాలలో అడుక్కోవడానికి మనస్కరించలేదు. ‘అమ్మ’ దగ్గరకు వెళ్ళి వచ్చిన నుండి ఆమె తనకు తానే ఎన్నోసార్లు ప్రశ్నించుకుంది. ‘జోగు’ చేయడం మంచిది కాదనీ, కొందరి స్వార్థం కోసం ఈ ఆచారం సృష్టించి పేద ఆడపిల్లల్ని తమ అవసరాలకు వాడుకుంటున్నారు. మరి తనేం చేస్తోంది? తన తోటివారి నమ్మకాలను తన స్వార్థం కోసం, తను బతకడం కోసం, తనకి పూట గడవడం కోసం మోసం చేయడం కాదా.? తనకి నిజంగా దేవత పూనితే…. తనకి దైవ అంశ ఉంటే.. తనకీ కష్టాలు ఎందుకు ఉంటాయి? తను ఈ విధంగా మోసం చేస్తే దేవుడు వచ్చే జన్మలో మరింత నరకంలో పడేయడూ..? ఇలా… ఎన్నో ఆలోచనలు సతమతం చేశాయి. ఏదేమైనా తన స్వార్థం కోసం తన తోటి పేదోళ్ళని మోసం చేయకూడదని నిర్ణయించుకుంది. మరయితే తన బతుకు ఎట్లా…? కళ్ళాలలో అడుక్కోవడం, ఆట ఆడడం మంచిది కాదని ‘అమ్మ’ చెప్తోంది. మరి తన జీవనం ఎలా? పనికి ఊరివాళ్ళు రానివ్వరామె…?

ముత్తెమ్మ పరిస్థితికి జాలిపడి తమకి ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి తెచ్చియిస్తున్నారు ఇరుగు పొరుగు. రేషన్‌ షాపులో వచ్చేబియ్యం, అంతకు క్రితం కళ్ళాలలో అడుక్కున్న గింజలతో కాలం వెళ్ళదీస్తోంది.

ఈలోగా ” అమ్మ” సహకారంతో ప్రభుత్వం నుండి ఎకరం పొలం, పదివేల రూపాయల బ్యాంక్‌ డిపాజిట్‌ వచ్చింది. ముసలివాళ్ళకు ఇచ్చే వృద్ధాప్యం పింఛన్‌కి దరఖాస్తు చేయమని విద్య చెప్పింది. అక్కా… నాకు అమ్మకు, అవ్వకు బీ చేనిచ్చింది. సర్కారుతోని, పైసలుబీ ఇప్పిచ్చింది అమ్మ చెప్పింది… పైసలు కూడా ‘అమ్మ’ ఇచ్చింది. సబిత.

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , , Permalink

Comments are closed.