మన్నె శ్రీనివాసరావు వృత్తి రీత్యా H.G.A భారతీయ జీవిత సంస్థ . రేపల్లె శాఖలో ఉద్యోగి . ప్రవృత్తి మాత్రం తెలుగు నాట్య కళ పై బహుముఖీన కృషి , వీరు రేపల్లె చరిత్ర (పాత రేపేల్ల తాలూకా సమగ్ర చరిత్ర ), పలనాటి వైభవము , దిన్య ధాత్రి , శిఖరిత , మస్తకుడు (స్మృతి కావ్యం ), పద్య కావ్యాలతో పాటుగా ఎత్తుకు పై ఎత్తు , నడ మంత్రపుసిరి , జీవన గీత , సమ్రాట్ అశోక్ , వేదం భూమి మొదలైన నాటికలు , బుద్ధం – అశోకం , బుద్ధం శరణం గచ్చామి , శీమద్వి రాట్ పర్వం , పరశు రామోపాఖ్యానం వంటి పద్య నాటకాలు రచించారు .
ఈ గ్రంధం “రేపల్లె రంగస్థలి “ ఈ పేరులోనే గ్రంధం లోపలి సారాంశం తెలుస్తుంది .
గుంటూరు జిల్లాలోని రేపల్లెకి నాటక , రంగస్థల విభాగాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది . ఆ రేపల్లె మండలంలోని గ్రామాలలో జరిగిన కృషికి నిలువెత్తు సాక్ష్యం ఈ పుస్తకం . నాంది , ప్రస్తావనతో మొదలై న ఈ గ్రంధం రంగస్థల – కళలు గురించి వివరిస్తూ కళ పదం క అనేది వాయు బీజాక్షరం అనగా విషాద హేతువు అని , ళ అనేది ఉడక బీజాక్షరం అనగా ఆనంద హేతువు అని కళ అంటే ఆనంద , విషాదాల సమ్మేళనం . అలాగే మానవ జీవితం సుఖ దుఖాల సమ్మేళనం అని వివరించటంలో రచయిత సూక్మ దృష్టి తార్కారణం .
రేపల్లె రంగస్థలి అనే ఈ పుస్తకంలో నాటకం గురించి వివరణతో పాటు ,నటనకి మూలమైన నాట్యశాస్త్రం , సంప్రదాయాలను సరళమైన శైలిలో అందించారు . అదే విధంగా నాటకావిర్భావ వికాశాలను తెలియజేస్తూ , నాటకం తొలత ఏ రూపంలో ఉండేది . నాటకానికి మూలాలు యక్షగానాలలో ఉన్నాయని , తెలుగులో యక్షగాన పదమును తొలిసారిగా ప్రయోగించి నది శ్రీనాధుని వివరణను “కీర్తింతు రెడ్దాని కీర్తి గంధర్వులు గాంధార్వమున యక్షగాన సరిణి “ వివరించారు . సంస్కృత నాటక సమాచారం తొలి సంస్కృత రూపకం అశ్వఘోషుని శారీ పుత్ర శారద్వాతీ పుత్ర అనే రూపకంలో కొన్ని భాగాలు మధ్యాసియాలో లభ్యమైయ్యాయి .
ఆధునిక తెలుగు నాటకాన్ని సాహిత్యంలో రేపల్లె నాటక రచయితల ప్రస్తావన కన్పిస్తుంది . తెలుగులో స్వతంత్ర రూపకంగా రచించిన కోరాడ రచించిన “మంజరి మధుకరీయం “ 1860 లో రచించబడింది . తరవాతనే విస్తృతంగా నాటక రచన జరిగిందనే చెప్పాలి . నాటక దర్శకత్వంలో రేపల్లె దర్శకుల కృషి మరువలేనిది . తొలి దర్శకునిగా తెలుగు నాటక రంగ చరిత్రలో కందుకూరి నిలిచిపోయారు . రంగస్థలం పై ప్రభావం చూపిన వారు 150 కి పైనే ఉన్నారు . వారిలో సుమారు 117 మంది రేపల్లె ప్రాంతంలోని వారే కావడం విశేషం . 23 మంది ఆ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు .
అలాగే రేపల్లె నటుల గురించి ప్రస్తావిస్తూ పద్య నాటక నటులు మాధవ పెద్ది వెంకట్రామయ్య , బళ్లారి రాఘవాచార్యులు , స్థానం నరసింహారావు , అద్దంకి శ్రీరామ మూర్తి వివరాలతో పాటు మలితరం నట దిగ్గజాల సమాచారం కూడా పొందుపరిచారు రచయిత . నాటకానికి ఇతివృత్తం , నటులతో పాటు సాంకేతిక వ్యవస్తకులు కూడా అత్యంత ప్రముఖం . ఈ శాఖలో కూడా రేపల్లె వాసుల ముద్ర చెరగనిది . ఏ .టి . రామాంజులు (హర్మోనిస్టు ), మారుతి సదారామయ్య , హరిబాబు (అలంకరణ ), ఏ . యెన్ .రాం సేవ మరువనిది . నాటకం ఒక దశలో అత్యంత ప్రజాదరణ పొందడానికి , సామాన్యుని సైతం ఆకర్షించటంలో నాటక సమాజాలు కీలక పాత్ర పోషించాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు .
గుంటూరు లో హిందూ నాటక సమాజం అనేదీ నాటక సమాజాన్ని కొండుభోట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి స్థాపించారు . ఈ సమాజంలో 31 వచన నాటకాలను బలిజేపల్లి లక్ష్మీకాంతం శాస్త్రీగారి నేతృత్వంలో స్థానికేతర ప్రాంతాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు . బళ్లారి లో స్థాపించిన సరస వినోదిని సభ , గుంటూరులో ని విబుభ రంజనీ , శ్రుగార హిందూ నాటక సమాజం కృషి అనితర సాధ్యం . రేపల్లె నాటక సమాజ నిర్వాహకులు మైలవరం రాజారావు మ మో దొరగారు , కోగర సీతారామయ్య , వనారస రామయ్య వివరాలను ఈ గ్రంధంలో అందించారు రచయిత.
నాటక పోటీలలో నాటక కళా పరిషత్తుల కృషి చెప్పడం అసాధ్యం . “ ఆంద్ర నాటక కళా పరిషత్తు “ పోటీలలో తెలుగు నాటక రంగంలో ముఖ్యంగా సాంఘిక నాటకాలలో ఒక సరి కొత్త ఒరవడిని తీసుకు వచ్చింది . ఆంద్ర దేశమంతటా అనేక పరిషత్తులు , సమితులు ఆవిర్భవించడానికి ఆంద్ర నాటక కళా పరిషత్తే కారణం . నాటకాలలో కాంట్రాక్టర్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నటుడికి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి , బుకింగ్ చేసుకుని అనుకున్న ప్రదేశాలలో వారితో ప్రదర్శనలు ఇవ్వడం పరిపాటి . ఆ విధంగా కాంట్రాక్టు నాటకాలకి శ్రీకారం చుట్టుంది కూడా ఈ రేపల్లె వాసులే .
రేపల్లె తాలుకాలోని సుమారు 64 గ్రామాల చరిత్రను సంపూర్ణంగా వివరించారు . ఈ గ్రామాలలో చరిత్ర ఉనికిని తెలియజేస్తూ , ఈ ఊర్లు రేపల్లెకి ఏ దిక్కులో ఉన్నాయి , ఎన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్నయో వివరిస్తూ ఆయా ఊరుల్లోని నాటక సంస్థల వివరాలు , నటుల ప్రస్తావన , సాంకేతిక నిపుణుల వివరాలను పొందుపరిచారు . రంగస్థల రచ్యాలు పేరుతో రేపల్లె లో జన్మించిన వారు , రేపల్లెలో స్థిర పడినవారు , వేరే ప్రాంతాలలో ఉంది రేపల్లెలో నాటకాలలో ప్రదర్శనలు ఇచ్చిన వారు , ఇక్కడ (రేపల్లె ) జన్మించాక పోయిన స్థిర పడిన వారు , ఇక్కడి సమాజంలో సభ్యులై నాటక రంగాన్ని ప్రభావితం చేసిన నటుల జీవిత చరిత్రలను , వారి రచనలను సమగ్రమియన్ వివరణ కూడా అందించారు . దాదాపు 400 మంది నటుల వారి వివరాలను , వారి ఛాయా చిత్రాలతో అందించడం విశేషం .
ఏదైనా పని చేస్తున్నప్పుడు మంచి చెడు రెండు ఎదురవుతాయి . అదే విధంగా గుణదోష విచారణ విమర్శ అవుతుంది . నాటక రచనలో కాని , ప్రదర్శనలో కాని ఈ విమర్శ ఉన్నప్పుడే తరవాత ప్రదర్శనకు మరింత మెరుగులు దిద్దుకోవడానికి , ప్రజలకి మరింత చేరువ కావడానికి విమర్శ నాటకాలకి ఎంతగానో ఉపయోగపడింది . అటువంటి విమర్శకుల ప్రస్తావన కూడా ఈ గ్రంధంలో కన్పిస్తుంది . ఆధునిక తెలుగు నాటక రంగం మీద పరిశోధనా గ్రంధాన్ని రాసిన తొలి వ్యక్తి గండవరం సుబ్బా రామిరెడ్డి “ సత్యము నాటక చరిత్రను పరిశీలించి , విశ్లేషించారు . మిక్కిలినేని రాధ కృష్ణ మూర్తి “ ఆంద్ర నాటక రంగ చరిత్ర “, నారాయణ “బందరు నాటక శిల్పం “, నేతి పరమేశ్వర శర్మ “ నూరేళ్ళ తెనాలి రంగస్థలి “, కందిమళ్ళ సాంబశివరావు “గుంటూరు జిల్లా నాటక చరిత్ర “ముఖ్యమైనవి . ఈ పుస్తకానికి అనుబంధంగా ఇచ్చిన భళా’రే‘పల్లె లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు , తెలుగు నాటక రంగ చరిత్రలో రేపల్లె నాటక కళాకారుల ప్రతిభకి నిదర్శనాలు .
1860 లో మొదలైన ఆధునిక నాటకంలో అనేక ముఖ్యమైన కీలక ఘట్టాలను మనం ఈ గ్రంధంలో చదివి తెలుసుకోవచ్చు . తెలుగు నాటక రంగం తో పాటు , సంస్కృత నారా రంగంలోని విషయాలు , నాట్య శాస్త్రము , దాని సంప్రదాయాలు తోపాటు ,150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆధునిక తెలుగు నాటకంలోని అన్ని విభాగాల్లోను రెప్పల్లీయుల కృషి మరువ లేనిది . ఆధునిక తెలుగు సాహిత్యంలో నాటక సాహిత్యానికి ఎంత ప్రాముఖ్యం ఉందో , తెలుగు నాటక వికాసంలో రేపల్లీయుల పాత్ర కూడా అంటే అనడంలో అతిశయోక్తి లేదు .
ఈ గ్రంధంలో ప్రతి వివరణలో నటులు , దర్శకులు , పరిషత్ నిర్వాహకులు , ఛాయా చిత్రాలను , వాటితో పాటుగా సందర్భాను సారంగా అందించిన అరుదైన చిత్రాలు ఈ గ్రంధానికి ప్రత్యేక ఆకర్షణ . ఈ పుస్తకంలో వివరించిన ప్రతి విషయాన్ని రచయిత క్షేత్ర పర్యటన ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి పొందుపరచటం వలన భావి పరిశోధకులకు ఒక మార్గదర్శకంగా ఈ గ్రంధం నిలుస్తుంది .
– అరసి
ప్రతులకు :
ప్రముఖ పుస్తకాల విక్రయ కేంద్రాలలోను ,
మన్నె లక్ష్మి
w/o శ్రీనివాసరావు
మన్నె వెంకటేశ్వర్లు మెమోరియల్ ట్రస్ట్
ఇసుక పల్లి వారి వీధి ,
రేపల్లె – 522285
గుంటూరు జిల్లా , ఆంద్ర ప్రదేశ్ .
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~