Habanastation (సినిమా సమీక్ష) – శివలక్ష్మి

డైరెక్టర్ : ఇయాన్ పాడ్రన్
దేశం : క్యూబా
సినిమా నిడివి : 95 నిమిషాలు.
భాష : స్పానిష్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో)
వయసు : 10 సంవత్సరముల పైబడిన బాల-బాలికల కోసం.

pic 1ఇతివృత్తం : సోషలిస్టు క్యూబాలో ప్రజల మద్య పెరిగిపోతున్న అసమానతల గురించి చర్చించిన చిత్రమిది.
క్యూబన్ సమాజంలోని ధనిక-పేద సాంఘిక పరిస్తితుల్లో జీవిస్తున్న ఇద్దరు బాలుర మధ్య స్నేహాన్నీ, వారి రోజువారీ జీవితాల ద్వారా సమాజంలోని ధనిక,పేద ప్రజల మద్య పెరుగుతున్న అంతరాలనూ,విద్యా విధానా న్నీ కూడా ఈ సినిమా ప్రశ్నిస్తుంది.
మయిటొ తండ్రి పెపె అంతర్జాతీయంగా ప్రముఖుడైన జాజ్ పియానిస్ట్. అతి సంపన్నుడు. కొడుక్కి ఏ లోటూ రానివ్వకుండా అపురూపంగా పెంచుకుంటుంటారు పెపె దంపతులిద్దరూ. అతనికి అమెరికా లాంటి చోట్లకి వెళ్ళి తాజాగా మార్కెట్లో కొచ్చిన ప్రతి ఎలెక్త్రానిక్ వస్తువునీ కొని తెస్తుంటాడు తండ్రి. మయిటొ కి అతని వయసు పిల్లలు ఊహించటానిక్కూడా అలవి కానన్ని ఆధునిక సౌకర్యాలున్నాయి. ఒక ఫ్లాట్ స్క్రీన్ టి.వి, ఒక సోనీ ప్లేస్టేషన్ 3, మయిటొ సొంతం. మయిటొ ప్రతి ఉదయం పాఠశాలకి ఒక కొత్త బ్రాండ్ SUV కార్ లో అతని తల్లి నడుపుతుండగా స్కూలుకి వెళతాడు.వెళ్ళేదారి లోనే కార్ లో టి.వి. చూస్తాడు. అతనంత అదృష్టవంతు డుండడని తోటి పిల్లలందరూ అతన్ని చూసి అసూయ పడుతుంటారు. పాఠశాలలో ప్రతిరోజూ ఉదయం క్లాసెస్ మొదలవడానికి ముందు యూనిఫాం లో ఉన్న విద్యార్ధుల చేత “మేము చే గెవారా లాగా తయరవుతామని” ప్రతిజ్ఞ చేయిస్తారు. ప్రతిజ్ఞ ప్రతిజ్ఞే పిల్లలూ వాళ్ళ పిల్ల చేష్టలూ మామూలే కాబట్టి ఒకరోజు ఆ ప్రతిజ్ఞ తర్వాత “ప్లేస్టేషన్” అంటే ఏమిటి? అని కార్లోస్ అనే ఒక బాలుణ్ణి, మయిటొ ,అతని స్నేహితులు ప్రశ్నించి అతనికి అదేమిటో ఎలాంటి అవగాహనా లేనందుకు ఆట పట్టించి,ఎగతాళి చేస్తారు. అది కార్లోస్ అజ్ఞానమని రెచ్చగొట్టినందుకు మయిటొ కి- కార్లోస్ కి మద్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంటుంది.

మయిటొ విప్లవం స్క్వేర్లో మే డే సెలబ్రేషన్స్ సమయంలో సరైన బస్సనుకుని తప్పు బస్సులో ఎక్కి దారి తప్పుతాడు. హవానా శివార్లలోని ఒక పేద పొరుగు వాడకి చేరతాడు.ఆ ప్రదేశమంతా వీధి ముఠాలతో, త్రాగుబోతులతో, ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్తతో, నిండిపోయి మయిటొకి భీతి గొల్పుతూ ఉంటుంది.తీరా చూస్తే అతని సహచర సహాధ్యాయి కార్లోస్ అనే బాలుడు జీవించే ప్రదేశమే అది!కార్లోస్ అంటే మయిటొ ఒకప్పుడు ప్లేస్టేషన్ అంటే ఏమిటో తెలియదని తన స్నేహబృందం సమక్షంలో ఆట పట్టించిన తన క్లాస్ మేటే! కార్లోస్ కదేమీ పట్టదు. చాలా సహజంగా,ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటాడు! అల్లరి మూకలనుండి మయిటొను రక్షిస్తాడు.కార్లోస్ మే డే సెలబ్రేషన్స్ కి వెళ్ళడు,ఎందుకంటే ఇంటికి గ్యాస్ అదే సమయంలో తేవలసిన బాద్యత అతనిమీద పడుతుంది, అతడు తన తల్లి మరణించినప్పటి నుండి తన అమ్మమ్మతో నివశిస్తున్నాడు. అతని తండ్రి ఏవో దురదృష్టకర మైన కారణాల కోసం దీర్ఘకాల జైలు శిక్షననుభవిస్తున్నాడు. ఆ మురికి వాడను చూడగానే మొదట చాలా అసౌకర్యంగా భావిస్తాడు మయిటొ. ఇరుగ్గా,మురిగ్గా ఉన్న ఇంటిని చూసి అసహ్యించుకుంటాడు. తనకున్న కొద్దిపాటి ఆహారం పాస్తా,గుడ్లు నుంచి కొంత ఇస్తానంటాడు కార్లోస్.కానీ అది ఇష్టం లేక తన బ్యాగ్ లోని శాండ్విచ్ తిందామనుకుంటాడు మయిటొ.కానీ అది కాస్తా బాత్ రూం బౌల్ లో పడిపోతుంది.ఇక కార్లోస్ దగ్గరున్న తిండి తినక తప్పదు. పిల్లల్లో అప్పటికప్పుడే విరోధాలతో కొట్టుకోవడం, మళ్ళీ వెంటనే కలగలిసిపోయే స్వభావముండడం వల్ల మయిటొ ఆ వాడకట్టు పిల్లల్తో సులభంగా జట్టు కడతాడు. తనలాగా తాజా ఎలక్ట్రానిక్ గేమ్స్,టి.వి.ప్రదర్శనలు ఏమీ లేవు వాళ్ళకి . అయినా సరే వర్షంలో ఫుట్ బాల్ ఆడుకుంటూ ఆనందిస్తున్నారు. కార్లోస్ కి అతని తండ్రి ప్రత్యేకంగా తయారు చేసిచ్చిన ఎగిరే గాలిపటంతో ఒళ్ళు మరిచి గంతులేస్తున్నారు.

ముఖ్యంగా పక్కనున్న ఇరుగు,పొరుగు మనుషులతో ముచ్చట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తున్న ఆబస్తీ పిల్లల్ని చూసి అబ్బురపడతాడు మయిటొ. ఇవన్నీ మయిటొకి పరిచయం లేని సంగతులు. తనకు ఇంతకుముందు గట్టి పోటీ నిచ్చే క్లాస్మేట్ కార్లోస్ ని కలుసు కోవడమే కాదు గాఢమైన స్నేహ బంధాన్ని పెంపొందించుకుంటాడు.అతను విలువైన కొత్త స్నేహాలు పొందుతాడు. మనుషుల మద్య మానవ సంబంధాలు అవగతమవుతాయి. ఆసక్తికరమైన కలయికలు చోటు చేసుకుంటాయి. మయిటొ ఉనికిని గురించి విపరీతంగా భయపడే అతని తల్లిదండ్రులు వచ్చి కలుసుకోవడానికి ముందే,అదే రోజు అతన్ని అదృష్టం వరిస్తుంది. అదేమిటంటే అతని మొదటి”స్నేహితురాలు” అక్కడే కలుస్తుంది. ఆశ్చర్యకరంగా ఆమె తన “మొదటి ముద్దు” కూడా ఇస్తుంది. ఈ పరిసరాలు,ఈ అరుదైన నిత్య జీవిత సంఘటనలు క్యూబన్ సినిమాలో చాలా అపురూపమైనవి. కొన్ని ఆసక్తికరమైన, వినోదభరితమైన సన్నివేశాలు మనోల్లాసం కలిగిస్తాయి. సాధారణంగా క్యూబన్ సినిమాలు సీరియస్ సాంఘిక సమస్యలను, ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను సవాల్ చేస్తూ ఉంటాయి.

ఈ చిత్రం 2011 లో తీసిన క్యూబన్ డ్రామా ఫిల్మ్.దీని డైరెక్టర్ ఇయాన్ పాడ్రన్. ఇది అతని మొదటి చలన చిత్రం. సగం అతని స్వీయచరిత్ర కూడా ఉంది. అత్యంత ప్రసిద్ధ క్యూబా లెజండరీ యానిమేటర్ కార్టూన్ పాత్ర సృష్టికర్త జువాన్ పాడ్రన్ కుమారుడు కావడం వల్ల తన స్వంత పెంపకం నుంచి కూడా స్ఫుర్తి పొంది మయిటొ పాత్ర సృష్టించానని ఒక ఇంటర్వ్యూ లో ఇయాన్ పాడ్రన్ చెప్పారు .

ఈ సినిమాలో మార్క్ ట్వైన్ నవల “రాజు- పేద” నవలలో లాగే, గొప్ప-పేద ఇద్దరు బాలుర కథల్ని చెప్తుంది.వారి రోజువారీ జీవితాల్లోని వ్యత్యాసాల్ని, వారి జీవన విధానాల్ని,వారు నివసించే పరిసరాల్ని అద్భుతంగా దృశ్యీకరించారు డైరెక్టర్ ఇయాన్ పాడ్రన్. ధనవంతుల విలాసవంతమైన జీవన విధానాన్ని మయిటొ తల్లిదండ్రుల ఇంటి వాతావరణం, వారు కుమారుడికి సమకూరుస్తున్న వస్తువుల ద్వారా చూపిస్తారు. మురికివాడల అతుకు బొతుకుల బతుకులనూ,చాలీచాలని తిండితో పూట గడుపుకునే పద్ధతిని పేద విద్యార్ధి కార్లోస్ జీవన విధానం,అతని పరిసరాల ద్వారా చూపిస్తారు.

కమ్యూనిస్ట్ అధికారులు ఒక సమయంలో వివిధ దేశాలతో వ్యాపారాలు, ఆస్తి అమ్మకాల రాత కోతలు మొదలైన మార్కెట్-ఆధారిత సంస్కరణలు చేశారు. ఈ మార్పులు ఫిడేల్ కాస్ట్రో – 1959 క్యూబన్ విప్లవం యొక్క స్ఫూర్తిని పూర్తిగా దెబ్బ తీయడం వల్ల గొప్ప-పేద రెండు వర్గాల ప్రజల మద్య తేడాలు ఉధృత మయ్యాయి. ప్రజల మద్య అంతరాలు పెరిగిపోయాయి. మొత్తంగా చూస్తే క్యూబా పేద దేశం అయినప్పటికీ, ఆ దేశంలో నివశించే ధనవంతులు విస్తృత సామాజిక ప్రయోజనాలు పొందుతున్నారు. లోతైన సాంస్కృతిక రాజకీయ అవగాహనతో రూపొందించిన క్యూబా విద్యా వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలందుకుంది. దాని వాస్తవాలు కొన్ని ఈ చిత్రంలో ప్రేక్షకులకు తెలుస్తాయి. చిత్రంలో ఒక వైపు వార్షిక మే డే మాస్ ర్యాలీలు, ప్రసంగాలు క్యూబన్ సామ్యవాద విలువల్ని కీర్తిస్తూ మీడియా కార్యక్రమాలు ప్రసారమవుతున్న వేళ మరో వైపు మయిటొ విశేష జీవనశైలిని చూపిస్తూ, ప్రభుత్వాలు ప్రసారం చేసే ఆ కార్యక్రమాల బోలుతనాన్ని ప్రేక్షకులకు ఎత్తి చూపుతారు ఇయాన్. సామ్యవాద విలువల్ని సుస్థిరం చేసే దిశగా ఆచరణ లేకుండా పేలవమైన నినాదాలివ్వడం వల్ల ఉపయోగమేమిటి? అని ప్రశ్నిస్తారు.
ఈ సినిమాలోని ఇద్దరు అబ్బాయిలు ఎర్నెస్టో ఎస్కలోనా(మయిటొ), ఆండీ ఫోర్నానిస్ (కార్లోస్) లా కొలెమ్నీట (బీహైవ్) పిల్లల థియేటర్ కంపెనీ సభ్యులు. పిన్న వయసులోనే ప్రపంచ సినీ ప్రముఖుల, ప్రపంచ సినీ ప్రేమికుల ప్రశంసలందుకున్న అద్భుతమైన సహజ నటులు. ఆత్మస్థైర్యం, దృఢ విశ్వాసం, అసాధారణ పరిపక్వతతో నటనలో జీవించారు.

ఈ సినిమా క్యూబాలో బాక్స్ ఆఫీస్ రికార్డ్ లను బద్దలు చేసింది. ప్లేస్టేషన్ పేరు నుండి చలన చిత్రం పేరును హబనాస్టేషన్ గా రూపొందించుకున్నారు మంచి దర్శకత్వ ప్రతిభతో మంచి నటనను వెలికితీసిన ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి ఆలోచనల్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ చిత్రాన్ని ప్రపంచం లోని బాలలందరికీ,మరీ ముఖ్యంగా క్యూబన్ బాలలకు అని ప్రేమగా అంకితం చేస్తారు డైరెక్టర్ ఇయాన్ పాడ్రన్.
ఇప్పుడంటే ఒకవైపు పోగుపడుతున్న సంపదతో- మరోవైపు పెరుగుతున్న పేదరికంతో దేశం అతలాకుతలమై పోతుంది గానీ అసలు క్యూబా లో అంతకుముందే ప్రోది చేసిన సామ్యవాద ఆదర్శాల ఆధారంగా సాటి మనిషికి సంఘీభావం, సహాయ, సహకారాలందించే సంస్కృతి ఉంది. దీన్ని కార్లోస్ పాత్ర ద్వారా ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. స్వయంశక్తి మీద ఆధారపడడం,కష్టపడి శ్రమించే తత్వం,తోటివారికోసం ఏంచెయ్యడానికైనా సిద్ధ పడడం మొదలైన సుగుణాలే కాదు తన ఆహారంలోని కొంత భాగాన్ని తన అతిధి స్నేహితుడికి పంచి పెడతాడు కార్లోస్. “కోలొనెల్” అనే ఒక పెద్ద గాలిపటం కొనుక్కోవాలని అతని కల.ఆకల నెరవేర్చుకోవడం కోసం 300 గాజు సీసాలు కావాలి.వాటికోసం చాలా శ్రమిస్తూ వాటిని తేవడం, కడగడం మొదలైన పనులు చేస్తూ,నిరంతరం కష్టపడుతూ ఉంటాడు.”నా పెద్ద గాలిపటం కోసం నేనింకా చాలా గాజు సీసాలు కూడబెట్టాలి” అని అంటాడు. మయిటో లా కాకుండా ఏదైనా శ్రమించి సంపాదించుకోవాలనే తత్వం కార్లోస్ ది. కార్లోస్ ప్లేస్టేషన్ ని ఎప్పుడూ చూడలేదు గానీ తోటి మనిషి పట్ల ఎలాంటి సహనుభూతితో ఉండాలో,మానవ సంబంధాలగురించి,క్యూబన్ జీవితం గురించి మయిటో కి అవసరమైన పాఠాలు బోధించగలడు.

మూర్తీభవించిన స్వార్ధపరుడిగా ఉన్న మయిటో త్వరలోనే కార్లోస్ మంచితనాన్నీ,తనని బెదిరించిన కార్లోస్ పొరుగువారి మంచితనాన్నీ గుర్తిస్తాడు. మంచి స్నేహితుల్ని సంపాదించుకుంటాడు. తప్పిపోయి హవానా చేరడాన్ని ఒక మరపురాని ప్రయాణం గా మలచుకుంటాడు.

తనని తాను మయిటోగా ఊహించుకున్న డైరెక్టర్ ఇయాన్ పాడ్రన్, కార్లోస్ పేద పాత్రను విలువలతో,నోబుల్ గా రూపొందించడం ఎంతైనా అభినందనీయం!

క్యూబన్ విప్లవం, సంపన్న మధ్య పేద తరగతుల మధ్య సమానత్వాన్ని హామీ ఇచ్చింది. ఆ దేశం నుండి వచ్చిన ఇతర సినిమాల లాగా కాకుండా ఈ సినిమాలో తను తీసుకున్న వస్తువు “క్యూబన్ సమాజంలోని అసమానతలను రూపు మాపాలనే” విషయాన్ని డైరెక్టర్ ఇయాన్ పాడ్రన్. చాలా నిజాయితీగా ట్రీట్ చేసిన విధానం ప్రశంసనీయం. ఈ వ్యవస్థలో కొన్ని లోపాలున్నప్పటికీ వాటిని చిత్తశుద్ధితో క్యూబా పాలకులు – ఆ దేశం యొక్క గొప్ప వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ సరిచెయ్యాలి. “రివల్యూషన్ స్క్వేర్ ,మే డే సెలబ్రేషన్స్ అన్న పదాలూ,క్యూబా ఎర్రని జెండాలతో గొప్ప ఉత్సవంలా మే డే ని జరుపుకోవడాన్ని సినిమాలో చూడడమే చాలా ఉత్తేజాన్నిచ్చింది నాకు!

Festivals and Awards
9th Humberto Solas Poor Cinema International Festival
Founders best of the festival award,Traverse City International Film Festival (2012)
Opera Prima Award_ 013)

– శివలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

సినిమా సమీక్షలు, , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో