సమకాలీనం – విజయ భాను కోటే

                                         నీ జీవితపు ఫ్యాక్టరీలో శక్తిని ఉత్పత్తి చేసేది ఏది? వంటరితనమా? ఏకాంతమా?

విజయానికి దారి చాలా ప్రత్యేకమైనది. అన్నింటి కంటే విభిన్నమైనది. అందరూ ఆ దారిలో నిలవరు. నిలిచినా గమ్యం వరకూ చేరరు. ప్రయాణాన్ని గడ్డు పరిస్థితుల్లో సైతం కొనసాగించేదెవరు? వెనుకడుగు వెయ్యకుండా ఆ దారి వెంట మొండిగా, వైఫల్యాలను తట్టుకుంటూ ఆశాజనకమైన క్రొత్త వనాలను చేరడానికి ముందున్న కష్టాలను ఎదుర్కోగలిగేవారెవరు?

పరుగులు పెడ్తున్న మనుషుల్లో నేను గమనించింది ఎక్కువగా వంటరితనాన్నే! ప్రపంచంతో కలిసి నడుస్తున్నా, ప్రపంచంతో తమను తాము వేరుచేసుకునే ఉంటారు. విజయమనే ఒక గొప్ప తోకను పట్టుకుని ఒక దారివెంట నడవడం ప్రారంభిస్తారు. కొంత సేపటికి తమ ప్రయాణంలో ఆగి, వెనక్కి తిరిగి చూస్తారు. తను వంటరిగానే ప్రయాణిస్తున్నానని, తనతో నడక ప్రారంభించినవారెవరూ ప్రయాణాన్ని కొనసాగించలేదని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టదు.

ఇక అప్పుడు మొదలౌతుంది తిరోగమనం. విజయం సంగతి దేవుడెరుగు! నా వాళ్ళంతా కావాలన్న ఆలోచన మొదలౌతుంది. పరుగు కాస్తా, నడకగా మారి, నడక కాస్తా, వెనుతిరిగి నడకగా మరుతుంది. వెనుదిరిగి చూస్తూ, మన భుజాలను తట్టే చేతుల కోసం వెతుక్కోవడం మొదలవుతుంది. ప్రోత్సాహం కరువయ్యి, ప్రేమ లేక, ఆత్మ విశ్వాసం తగ్గి, విజయంపై కోరిక తగ్గిపోతుంది. ఆటిట్యూడ్ మేటర్స్! ఆ వైఖరి మారగానే దారి మారిపోతుంది. ఇక విజయమూ లేదు…వీర స్వర్గమూ లేదు!

ప్రయాణపు మొదట్లో పిచ్చ క్లారిటీగా కనిపించిన గమ్యం నెమ్మదిగా మసకబారిపోతుంది. వెనుతిరగగానే మాయమైపోతుంది. ప్రయాణం మొదలుపెట్టిన చోటికే వెళ్ళి నుంచుని కన్ఫ్యూజన్ తో, వేదనతో నిండిపోతాం.

ఇది వంటరితనమా? వదిలివేయబడ్డామన్న భావనా? ఇలాగే జరుగుతుందా?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక పెద్ద “అవును” మాత్రమే!
నా వరకూ, వంటరితనాన్ని అనుభవించడం చాలా అవసరం. ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆ రఫ్ దారి గుండా నడవాలి. నీ సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది వంటరితనం. అదొక నెగెటివ్ టూల్. నా వరకూ చాలా ఉపయోగకరమైన పనిముట్టది! ఇదే తరుణం. నీలోని నిగూఢ భయాలకు, భావాలకు తెర తీయడానికి. ఆ మార్గం గూండా జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!

వంటరితనపు ప్రతిధ్వని గట్టిగా వినిపిస్తుంది. ప్రోత్సాహించబడాలనీ, ప్రేమించబడాలనీ, మెచ్చుకోబడాలనీ అనిపించి, ఆత్మవిశ్వాసపు గోడలను బ్రద్దలుకొడ్తాయి. సాధించిన విజయం మనుషులనూ, వారి మెచ్చుకోలునూ కోరుకుంటుంది. అందరూ నీ గురించి మాట్లాడుకోవాలి. నీ విజయాలను కీర్తించాలి. ప్రయాణానికి ముందు ఏర్పరచుకున్న అన్ కండీషనల్ గేర్ ఇపుడు కనపడదు.

మనం ఏర్పరచుకున్న నియమాలన్నింటికీ అకస్మాత్తుగా తిలోదకాలిచ్చి, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. ఆత్మ విశ్వాసం గోడలు లోతుగా బీటలువారిపోతాయి. లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయి. చివరికి మనకి తెలిసింది ఒక్కటే, మన నుండి బయటికొచ్చిన ఒక మహత్తర బలహీనత ముందు మనం మోకరిల్లామనే!

ఆ బలహీనతను ఇంకా దగ్గరికి రానీ! క్షణాలన్నింటినీ బిగదీయనీ! ఆ బలహీనత నీకున్న దారులన్నింటినీ అన్ని విధాలుగా మూసెయ్యనీ! ఇప్పుడు నీ సంకల్ప శక్తిని పరీక్షించుకో! నీ నైపుణ్యాలను గుర్తు తెచ్చుకో! ఇప్పటి వరకూ నీ యాత్రలో నువ్వు అంటిపెట్టుకున్న శ్రద్ధనీ, గమ్యం పట్ల ఉన్న గౌరవాన్ని గుర్తుతెచ్చుకో. ప్రయాణంలోని ప్రతి అడుగునూ, ప్రతి అనుభవాన్నీ ఒక కాగితంపై రాయి.

నీ నుండి దూరంగా పోతున్న ఆ స్పార్క్ ని ఒడిసి పట్టి ప్రశ్నించు. వినడానికి ఇది కొంచెం హాస్యాస్పదంగా, ఫన్నీగా అనిపించినప్పటికీ వర్క్ అవుట్ అవుతుంది. ఆ స్పార్క్ ని లాజిక్ అడుగు. ఇప్పుడు ఆ వెలుగు జువ్వ నీ ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరుతుంది. ఆ జవాబులే నీ బలహీనతలను, భయాలనూ పారద్రోలుతాయి.

కుప్పకూలిపోవద్దు. ఆ సమాధానాలను అనలైజ్ చెయ్యి. ఒక్కసారి నీ వ్యక్తిత్వాన్ని ఆ భయాలు, బలహీనతలు లేకుండా ఊహించు. నీ మీద నీకు గౌరవం పెరుగుతుంది. నీ బలాలకు ఊతాన్నిచ్చి, వాటి మీద పట్టు సాధిస్తే చాలు!

న్యాయం దగ్గరికి వచ్చేసరికి మనకెప్పుడూ చాయిస్ ఉంటుంది. ఒక పనిని నిజాయితీగా చేయొచ్చు లేదా నిజాన్ని ధిక్కరించి తప్పు చేయవచ్చు. నీ చాయిస్ మాత్రమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

ఎర్లీ బర్డ్స్ రైజ్ టు ద స్కైస్ బట్ లేజీ వన్స్ కీప్ డ్రీమింగ్ ఇన్ ద నెస్ట్
నువ్వు ఎర్లీ బర్డ్ వా లేక లేజీ బర్డ్ వా అన్నది నిర్ణయించుకోవాల్సింది నువ్వే

నీ జీవనంలో మాడెస్టీ మొలకెత్తిన మరుక్షణం జీవితం సులువౌతుంది.
అంతర్గతంగా ఒక క్రొత్త విత్తనం మొలకెత్తుతుంది.
అదే “సాలిట్యూడ్ ఏకాంతం
ఇదొక మహత్తరమైన గుణం
దాని రెక్కలకు ఏ బలహీనతలూ అంటలేవు
ప్రతి ఆత్మలోనూ కొలువుండే అనంత శాంతి కపోతం అది
ఆ కపోతాన్ని ఒక్కసారి మేల్కొలిపితే చాలు
ఘనమైన మార్పు మన సొంతం

ఏకాంతానికి రంగులు లేవు
అది ఒక నిశబ్ధ తరంగం
తరిగిపోని ప్రశాంతతను నీకు ఇస్తుందది
మనసులో జరుగుతున్న ప్రతి యుద్దాన్నీ జయించేస్తుంది
బాహ్య ప్రపంచంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతిఘటనలన్నింటినీ జయించడానికి కావల్సిన ఆయుధాలను నీకిస్తుందది
అప్పటివరకూ వంటరితనాన్ని అనుభవించి ఏకాంతం వైపు మొగ్గు చూపిన వారికి ఈ రెంటి మధ్య ఉన్న అంతరం తెలుస్తుంది.
ఏకాంతం యొక్క విలువ తెలుస్తుంది.
ఏకాంతం బలాన్నిస్తుంది. ఏకాంతం ధైర్యాన్నిస్తుంది.

ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, దేన్నీ యాచించే పరిస్థితి రానివ్వదు. నిన్ను నువ్వు నమ్ముకునే స్థితిని కల్పిస్తుంది. ఆశకు ఆజ్యం పోసి అది నిలువెత్తుగా వెలుగుతూనే ఉండేలా చేస్తుంది.

నువ్వేం చెయ్యాలి?:
ప్రతి రోజూ ఒక అరగంట నీతో నువ్వు గడుపు. అంతే!
నీ ఆత్మ ఏం కోరుకుంటుందో తెలుసుకో
నీతో నువ్వు ప్రేమలో పడు
రీచార్జ్ కావడానికి కావల్సిన శక్తిని ఉత్పత్తి చెయ్యి
నువ్వేది ఎంజాయ్ చేస్తే అది చెయ్యి
నీ భావాలన్నింటినీ రాయి
రాయడానికి నేను ఎందుకింత ప్రాముఖ్యతనిస్తాను? నేనొక రచయితననా?
కాదు!
రాయడం అనేది ఒక వెంట్ (భావోద్వేగాన్ని బయల్పరచగల మార్గం) ఇది మెదడును నిర్మలంగా మార్చుతుంది.

మంచి పుస్తకం చదవచ్చు
నచ్చిన సంగీతం వినొచ్చు
పసి పిల్లలతో ఆడుకోవచ్చు
నీ ప్రయాణాన్ని సంతోషంగా కొనసాగించొచ్చు
ఏకాంతం ఎవరి ప్రోత్సాహాన్నీ ఆశించదు.
నాకు తెలిసి, ఏకాంతం మానవునిగా విజయాన్ని అందిస్తుంది. ప్రాపంచిక విజయాలు, ఆ విజయం ముందు దిగదుడుపే కదా! మనిషిగా గెలవడం ముఖ్యం
విజయమనే కిరీటానికి ఏకాంతం అనేది మకుటం….
ఈ కిరీటానికి పొదగబడే ఇతర రత్నాలు, మణులు ఈ మకుటం నుండే మెరుపును పొందుతాయి
మానవునిగా విజయం సాధించడం ముందు ప్రాపంచిక విజయాలన్నీ దిగదుడుపే!
నిన్ను నువ్వు గెలవడం….
నిన్ను ఏ మలినమూ అంటలేకపోవడం….
ఇంతకు మించిన సౌభాగ్యం నాకు తెలిసి ప్రపంచంలో లేదు!

ఇప్పుడు సమాధానం చెప్పు!
నీ జీవితపు ఫ్యాక్టరీలో శక్తిని ఉత్పత్తి చేసే వ్యవస్థ ఏది?
వంటరితనమా? ఏకాంతమా?
ప్రశ్నించు….
నీ ఆత్మ నుండి సమాధానాలు రాబట్టు!

నువ్వు బాహ్య ప్రపంచంలో చూసే అందాలు నీ అంతర్గత వ్యవస్థ నుండి వచ్చిన ప్రశాంతత యొక్క పరావర్తనాలు.
ఈ లాజిక్ తో నిన్ను నువ్వు కన్విన్స్ చెయ్యాలి.
పరావర్తనం చెందబడు కారణాలు నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
నువ్వు గమ్యానికి దూరం కావడానికి గల కారణాలు వాటి సాక్ష్యాలతో ముందుకొస్తాయి. ఏకాంతానికి నీ జీవితంలో స్థానం కల్పించాల్సిన ఆవశ్యకతను నీకు విశదంగా తెలియజేస్తాయి.

ఇన్నాళ్ళుగా వంటరితనంలో మ్రగ్గి, ఒక్కసారిగా ఏకాంతం అంటూ రూటు మార్చడం అంత తేలికైన పనా? అంత సులువైతే అందరూ కష్టాలు ఎందుకు పడ్తారు? వేదన నిండిన జీవితాన్నెందుకు గడుపుతారు?

కానీ ఒక్కసారి మనల్ని మనం ప్రేమించడం మొదలుపెడితే, ఆత్మ విశ్వాసం ఇతరులతో సంబంధం లేకుండా ప్రోది చేసుకోగలిగితే, నువ్వు ఏకాకివి కావని తెలుస్తుంది. నీకు నిన్ను మించిన ఆత్మబంధువు లేరని తెలుస్తుంది.
చీకటి దరి చేరే అవకాశమే లేదపుడు
ఇక్కడ పనిచేసే సూత్రం ఒక్కటే- సెల్ఫ్ రినైసెన్స్ ( స్వయం పునరుజ్జీవనోద్యమం ), దాని మంత్రజాల ప్రకృతి!
ఈ సూత్రం జీవితాన్ని నడుపుతుంది.
అప్పుడు విజయం ఒక ఈవెంట్ కాదు…అదొక జర్నీ!
ఒక్కసారి నీ విజయాలకు ఇతరులను కూడా చేర్చినపుడు, వారికి నీ విజయంలో క్రెడిట్ ఇచ్చినపుడు, ప్రపంచం నీతో నడుస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో నువ్వు నీతో వచ్చిన వారిపై ఎమోషనల్ డిపెండెన్స్ కలిగి ఉండవు. డిటాచ్మెంట్ అలవాటుగా మారుతుంది. సమతూకంగా పరిస్థితులను సమన్వయం చేయగల నేర్పు అలవడుతుంది.

ఏకాంతం నీకు జీవిత పరమార్థాన్ని బోధిస్తుంది.
నిన్ను నువ్వు శోధించిన కొద్దీ నువ్వు చేసిన పొరపాట్లు తెలిసొస్తాయి.
సమస్యలను పరిష్కరించడంలో నీ సామర్థ్యం పెరుగుతుంది.
వికృతీకరించబడుతున్న నిన్ను తిరిగి ఆకృతిలో నిలబెడుతుంది.
ఏకాంతపు మంత్రాన్ని పఠించు
దాన్ని ఆత్మ లోతుల్లోకి నింపు
ప్రశాంతమైన చిరునవ్వులు ఇక నీ సొంతం
ఎండమావుల వెంట ఇక పరుగులు ఉండవు
వాస్తవ స్వరూపాలన్నీ ఇక నీ సొంతం

రాళ్ళు నిండిన దారుల వెంట నడిచిన వాడికే పూల బాట విలువ తెలుస్తుంది.
సాలిట్యూడ్ ఈజ్ ద హిమ్న్ ఆఫ్ కరేజ్
ప్రపంచాన్ని ప్రశాంతతతో జయించేందుకు అదొక మంత్రం
అందుకే ఈ ఏకాంతాన్ని నీ జీవితాన్ని కౌగిలించుకోనీ!

– విజయ భాను కోటే 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, సమకాలీనం, , , Permalink

Comments are closed.