బోయ్‌ ఫ్రెండ్‌ – 7(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

Dr. Jaya prada

Dr. Jaya prada

”అయితే ఈ రోజు మనం వెళ్ళినట్లే” అందరూ తయారయి అరగంటగా ఎదురు చూసాక, తన టాయలెట్‌ పూర్తి చేసుకుని ఇవతల కొచ్చిన అరుణ ముఖం చైతన్య వ్యంగ్యబాణానికి నల్లగా అయిపోయింది.

గులాబి రంగు మెటల్‌షిఫాన్‌ చీర కట్టుకుని, అదే రంగు ‘టుబైటు’ జాకెట్టు వేసుకుంది. కుడి చేతికి ‘పింక్‌’ గాజులు వేసుకుంది. ఎడమ చేతికి నల్ల స్ట్రాప్‌తో రిస్ట్‌వాచ్‌ పెట్టుకుంది. మెడలో పింక్‌మణులు, ఆరురోస్‌ ట్విస్ట్‌ చేసి మెడచుట్టూ అలంకరించుకుంది. పొట్టి జుట్టును ముంగురులు చెంపల మీద అందంగా ఎగిరేలా దువ్వుకుని ఒక్క జడ కుదురుగా అల్లుకుంది. గులాబిరంగు గులాబి నొకదాన్ని ‘టి.బి.’ ముంగిట వున్న గులాబి మొక్కనుండి తుంచుకొచ్చుకొని ఆ జడ మొదలులో ఓ ప్రక్కగా పిన్ను వేసి పెట్టుకుంది. తన పెద్ద పెద్ద కళ్ళకు నిండుగా కాటుక పెట్టుకుని ఐ షేడ్‌ వేసుకుంది.

ఎంతో సామాన్యంగా వున్నా, ఆర్టిస్టిక్‌గా అందంగా అలంకరించుకున్న అరుణను తదేకంగా చూస్తున్న కృష్ణకాంతి ఆమె ముఖం ఒక్కక్షణంలో ముడుచుకు పోవడంతో గబగబ అరుణ దగ్గరగా వచ్చి ఆమెను పట్టుకుంటూ అంది.
”మా ఇష్టం. మేమెంతసేపయినా అలంకరించుకుంటాం. అలంకరణ మా జన్మహక్కు. మీరూ మాలా తయారవండి చూద్దాం. చస్తే మా ఆర్టిస్టిక్‌.. మైండ్‌ మీకు రమ్మన్నా రాదు.” అలా అనేసి అరుణను గబగబ లాక్కుంటూ బయటకొచ్చేసింది. సిగ్గుతో కుంచించుకపోయిన అరుణకు ఆ క్షణంలో కృష్ణ ఎంతో ఆత్మీయురాలుగా అన్పించింది. చిరుకోపంగా అన్న కృష్ణ మాటలకు చైతన్య చిన్నబుచ్చుకోలేదు. అరుణ ప్రక్కనే తన సౌందర్యాన్ని అట్టె పట్టించుకోకుండా, చలాకీగా నడచిపోతున్న కృష్ణను రెప్పవెయ్యకుండా చూస్తున్నాడు. కోరా రంగుకు సన్న పచ్చ రిబ్బన్‌ బార్డర్‌ సౌత్‌ కాటన్‌ చీర మిద, కోరా రంగు జాకెట్టు వేసుకుని పొడవాటి జడతో వెళ్తున్న నల్లటి కృష్ణ అతని హృదయంలో చోటుచేసుకుని ఆగిపోయిందక్కడే.

కొండమీద పాములా మెలితిరిగిన రోడ్డు మిదుగా రామారావుగారి వెనగ్గా ఒక్కొక్కరే నూతనోత్సాహంతో నాగరికతకు దూరంగా నడిచిపోతున్నారు. చుట్టూ పొదల్ని, పుట్టల్ని ఆకాశాన్నంటే చెట్లనీ చూస్తూ వెనకబడిపోరుంది కృష్ణ. తెలివిగా అందరిలో నుండి తప్పించుకుని ఆమె ప్రక్కగా నడుస్తున్నాడు చైతన్య.

”అబ్బ! ఆ పూలెంత అందంగా వున్నాయో! తలపైకెత్తి ఆకాశాన్ని చుంబిస్తున్న చెట్ల నిండా విరగబూసిన ఎఱ్ఱగుత్తుల పూవులను చూచి, తనను తను అదుపులో పెట్టుకోలేనట్టు చేతులు రెండూ, గుండెల కదముకుంటూ, మెరిసే కళ్ళతో అంది కృష్ణ.

”వాటినే మంటారో తెలుసా? అంతవరకు తన ప్రక్కన నడుస్తున్న చైతన్యను గుర్తించలేదామె. ఉలిక్కిపడి ‘ఏమంటార’న్నట్లు చూచింది.
”ఫ్లేమ్‌ ఆఫ్‌ది ఫారెస్ట్‌’ అంటారు.”

”’క్వీన్‌ ఆఫ్‌ది ఫారెస్ట్‌’ అనొచ్చు” తన్మయత్వంతో గొణిగింది. దారి పొడుగునా ఆమెకు అలాటి చెట్లు చాలా కన్పించారు. కన్పించినప్పుడల్లా తన పరవశాన్ని అదుపులో పెట్టుకోలేక పోయేది. చిన్న పిల్లలా గెంతుతున్న ఆమెను ఆసక్తిగా చూస్తూ నడుస్తున్న చైతన్య వున్నట్టుండి అడిగాడు.
”కోసివ్వనా?”

”ఊహు” తల అడ్డంగా తిప్పింది కృష్ణ. ఆ పూలను విడిచి వెళ్ళాలని లేదు ఆమెకు. అలా అని ఆ పూలను కోసి నలిపేయాలని లేదు. నాలుగు అడుగులేశాక ఎక్కడనుండో అడవి మల్లెల వాసన గుప్పున కొట్టింది.
”అది దిల్‌ బహారా అయ్యుండాలి” అంటూ పొదల్లోకి దూరి ఒక గుత్తి కోసుకొచ్చాడు చైతన్య. ఆమె కళ్ళల్లోకి ఆశగా బెరుగ్గా చూస్తూ అన్నాడు-

”మికు అభ్యంతరం లేకపోతే తీసుకోండి.”
అతని కళ్ళల్లోకి సూటిగా చూచిన ఆమెకు తన కింతవరకు అనుభవం కాని అపూర్వభావమేదో కన్పించి ఒక్కక్షణం తటపటారుంచింది. మరు క్షణంలో నవ్వేస్తూ అంది;
”ఇందులో అభ్యంతర మేముంది? ఇవ్వండి చాలా అందమైన పూలు” ఆ పూల గుత్తిని అందుకుంటున్నపుడు ఆమెకు అతని కళ్ళల్లో సంతృప్తి కొట్టవచ్చినట్లు కనిపించింది. అంతవరకు ‘టెన్షన్‌’ లో వున్న అతను హారుగా గాలి పీల్చుకోవడం కూడా ఆమె గమనించింది. అంతవరకు తను పరారు మగవాడి ప్రక్కన ఒంటరిగా నడుస్తున్నాననే భావం ఆమెకు మధురమైన భయాన్ని కలిగించి అడుగులు త్వర త్వరగా వేసేలా చేసింది. నాలుగు అడుగులు ముందు నడుస్తున్న నిర్మల భానుమూర్తి అరుణలతో కలసి పోరుంది. మురళి కన్పించినపొద దగ్గరకల్లా వెళ్ళి మంచిపూలు ఏరితెచ్చి వాళ్ళమ్మకిస్తున్నాడు.

”అమ్మా ఇది పెట్టుకో” అంటూ విరామం లేకుండా తల్లిని తన చిన్నారి ప్రేమతో ముంచెత్తుతున్నాడు.ఆమె కొడుకు వంక ఆపేక్షగా చూస్తోంది. ఆమె ఎక్కువగా మాట్లాడదు. ఆసక్తిగా వింటుంది. తను సరదాగా ఎవ్వరినీ నవ్వించలేదు. ఇతరుల హాస్యానికి మనస్ఫూర్తిగా ఆనందిస్తుంది. ఆమె మంచి ప్రేక్షకురాలు అంతకంటె మంచి శ్రోత.

ఇంత దిల్బహారా పూల గుత్తి తెచ్చి అమ్మ చేతికిస్తున్న చిన్న మురళిని ఆసక్తిగా చూస్తూ హాస్యానికి అన్నాడు భానుమూర్తి-
”ఏరా నాన్నా ! అన్నీ మి అమ్మకేనా? అత్తయ్య కేమి ఇవ్వవా?” అతని సున్నితమైన హాస్యోక్తి అరుణ లేత గుండెల్లో మల్లె పందిరి వేసింది. వెనగ్గా నడుస్తున్న చైతన్య తొందర తొందరగా ముందుకు వచ్చేసి, తన కెమెరా తీసి ముందుకు నడుస్తున్న వాళ్ళ ఎదురుగా వచ్చి ఫొటో తీయబోయాడు. అంతవరకు పొదల్లో వున్న మురళి గబగబ వచ్చి అమ్మ చెర్యు పట్టుకుని, ”నన్ను కూడా తియ్యాలి అంకుల్‌” అన్నాడు. వాడి మాటలకు ముచ్చటపడి వాడిని ఇంత ఎత్తుకు ఎత్తి
”ఇక్కడ కాదురా నీ ఫొటో. నిన్ను పులిమిద ఎక్కించి తీస్తాను. సరా?” అన్నాడు భానుమూర్తి.

”ఓకె నాకేం భయమా?”
ఈ గొడవల్లో అరుణ ఒక ప్రక్కగా వెళ్ళి నిల్చుంది. ”ప్లీజ్‌! ఫీల్డులోకి రండి.”

(ఇంకా ఉంది )

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

53
ధారావాహికలు, , , , , Permalink

Comments are closed.