బోయ్‌ ఫ్రెండ్‌ – 8(ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

Dr. Jaya prada

Dr. Jaya prada

”ఊహు. మీరు తీసుకోండి” సిగ్గుపడింది అరుణ.
”పరవాలేదు అరుణా. అందరం సరదాగా మన పిక్నిక్‌ గుర్తుగా తీయించుకుందాం రా.” కృష్ణ చాలసేపు బ్రతిమలాడగా వచ్చి మధ్యగా నిల్చుంది అరుణ.

ప్రతి ఫోటో తీయాల్సి వచ్చినప్పుడల్లా అరుణను బ్రతిమలాడాల్సి వచ్చేది. నిర్మల తటస్థంగా ఎవరెలా చెప్తే అలా వినేది. కృష్ణ మంచి చెట్టునో కమనీయమైన దృశ్యాన్నో ఏరుకొని మనుష్యులను అందంగా పేర్చి అప్పుడప్పుడూ ఫోటోగ్రఫీ మీద ప్రయోగాలు ఆరంభించేది. తన నొక్కదాన్నే తెలివిగా తీయడానికి చైతన్య ప్రదర్శిస్తున్న నేర్పును వ్యర్ధం చేస్తూ అతి తెలివిగా గుంపులో కలిసి పోతుండేది. అరుణ అనవసరంగా ప్రదర్శించే అనాసక్తతకు మనసులో విసుక్కునేవాడు చైతన్య. ఒక్కమారు పైకి అనేసాడు కూడా. ”మీ వల్ల మా ఫోటో పోగ్రామ్‌ పాడైంది” అని. దాంతో భానుమూర్తి తమ్ముణ్ణి గట్టిగా మందలించాల్సి వచ్చింది. నిర్మల ఆడబడుచును అర్ధగంట సేపు ఓదార్చాల్సి వచ్చింది. ”అసలే ఆ అమ్మాయి మనస్సు సున్నితం. మీరెందుకు ఏదో ఒకటి అని బాధపెడ్తారు?” అంది కృష్ణ.

చైతన్య దానికి జవాబు చెప్పలేదు. సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు-
”మీకు బాధ కలిగిస్తే మరెప్పుడూ అలా అనను”.
అతని చూపులకు తలవాల్చేసుకోవడం తప్ప మరేమి అనలేకపోరుంది కృష్ణ.

”వీటిని మల్బరీ చెట్లంటారు. వీటి పైనే బ్రతుకుతారు పట్టు పురుగులు” ఆ చిన్న కాంపౌండ్‌లో వున్న రెండు పెద్ద చెట్లను చూపించి చెప్పారు రామారావు గారు.
అక్కడే నిలబడిపోరున ‘గెస్ట్స్‌’ ను ఉద్దేశించి ఆయనే అన్నారు మరలా.

”తర్వాత మల్బరీ తోట చూపిస్తాను ముందు ఈ చిన్న పరిశ్రమ చూద్దాం.”
పట్టు పురుగుల గుడ్ల దగ్గర నుండి అవి లార్వా అయి ప్యూపా స్టేజి కొచ్చే దాకా వివరించారు. రకరకాల జాతుల గురించి చెప్పారు. వాటి నన్నింటినీ విడివిడిగా చూపించారు. ఆయన చెప్తున్నప్పుడు ప్రతివాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ, వాళ్ళ కర్ధమయిందో లేదో గమనిస్తూ చెప్తారు. ఆయన కంఠ స్వరం మృదు గంభీరంగా వుంటుంది. పదజాలం యొక్క అందమైన కూర్పుతో ఎటువంటి దాన్నైనా చాల ఇంటరెస్టింగ్‌గా మలచి చెప్పగల నైపుణ్యముంది అతనిలో. కొన్ని ఏళ్ళ క్రితం స్కూల్లో పట్టు పురుగుల జీవిత చరిత్ర గురించి తన మాస్టారమ్మ కప్పు ఎగిరిపోయేలా అరచి చెప్తునప్పుడు అది జోల పాటలాగా వినిపించి చల్లగా నిద్రపోయి , ఆ నిద్రలో ఆ టీచరమ్మను పట్టు పురుగుగా చేసి తన కసిదీరా కలలు కన్న కృష్ణ ఈ రోజు చాలా ఉత్సుకతతో వింది.
ఆయన’కుకూన్స్‌’ చూపెట్టి చెప్పుకుపోతున్నారు.

పట్టు పురుగు లార్వా స్టేజిలో ఆకులన్నీ మెక్కి ప్యూపాగా మారి తనలో తాను దాక్కుంటుంది. ఆ స్టేజి నుండే మన పరిశ్రమకు కావలసిన పట్టు తయారవుతుంది.

”ఎలాగండీ?” ముందుకు వంగి తెల్లగా మెరుస్తున్న ”కుకూన్‌” వంక చూస్తూ అడిగాడు భానుమూర్తి.
”దాని లాలాజలం నుండి ఈ ఫైబర్‌ తయారర్యు, దాని చుట్టూ అల్లుకుంటుంది.”
”ఒక పట్టు పురుగు లాలాజలం నుండి ఎంత అందమైన పట్టు బట్టలు తయారవుతున్నారు!” అని ఆశ్చర్యపోరుంది కృష్ణ.
”ఛ.ఛ” అసహ్యించుకుంటూ వెనక్కు జరిగింది అరుణ అసంకల్పితంగా.

”మీరు కట్టుకునే చీరలు అందులో నుండే వచ్చాయి అరుణా!” నవ్వారు ప్రసాదరావు.
”ఇరవై ఒక్క రోజుల్లో పురుగు ఈ దారాలను తెంచుకోవడానికి ప్రయత్నించి బయట పడ్తుంది. ఆ లోపల వాటిని మరగబెట్టి దారం తీసుకోవాలి. అని చెప్పి కొద్ది దూరంలో దారం తయారవుతున్న చిన్న కుటీరానికి తీసుకెళ్ళారు. అక్కడ ఒక చిన్న మిషన్‌ సహాయంతో ఒక చిన్న కుకూన్‌ నుండి ఇంత ‘బండిల్‌’ దారాన్ని తీసి దేనికదే విడిగా పెడ్తున్నారు. ఉడకబెట్టాక తెల్లదనంపోయి ఒక రకం క్రీమ్‌ కలర్‌ వచ్చింది. దారాలంతా కట్టలు కట్టి ప్రక్కరూములో పడేస్తున్నారు. ఇంకొక ప్రక్క పెద్ద పెద్ద మూకుళ్ళలో’ కుకూన్స్‌’ మరుగుతున్నాయి .

ఈ సందడిలో అందరూ మర్చిపోరునా, మల్బరీ తోటల గురించి, చైతన్య మటుకు మర్చిపోలేదు.
తిరిగి క్వార్టర్స్‌ వైపు వెళ్ళిపోతున్న రామారావు నుద్దేశించి అన్నాడు-
”మల్బరీ తోట చూపిస్తా నన్నారు”

”అరే! మర్చిపోయాను.” అని నొచ్చుకుంటూ అందరినీ వెనక్కు తిప్పి తోటలోకి తీసుకెళ్ళారు.
ఇంచుమించు పది పన్నెండడుగల ఎత్తులో వున్నాయి ఆ చెట్లు. ఐదారు అడుగుల దూరంలో వరస క్రమంగా వున్నారు. వాటి ఆకులను మాత్రమే పట్టు పురుగుల ఆహారానికి గాను ఉపయోగించుకుని, పండ్లను పారేస్తారట. ద్రాక్ష గుత్తులలా ఒక అంగుళం పొడవులో వున్న ఆ నేరేడు రంగు పళ్ళగుత్తి చూడడానికి చాలా అందంగా వుంది. రుచికి కూడా బాగుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా సరదాపడి కోసుకుని తిన్నారు.

ఒక ఎత్తైన చెట్టు క్రింద నిల్చుని చెయ్యెత్తి పళ్ళ గుత్తి నందుకుంటున్న కృష్ణ దగ్గర కొచ్చాడు చైతన్య.
”అమ్మో ! మీ పెదాలు ఎంత ఎఱ్ఱగా పండి పోయాయో! నావీ అలాగే వున్నాయా?” అతను అతి సాధారణంగా అన్నట్టు నటించినా అతని మాటల వెనకున్న భావాన్ని గ్రహించిన కృష్ణ ఒక్కక్షణం తెల్లబోయి , సర్దుకుని సన్నగా నవ్వి కదిలి గుంపులో కలిసిపోయింది.

గులాబి రంగు ఛాయలో గులాబి రంగు దుస్తులతో క్రొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ తోటంతా తానే అయి తిరుగుతున్న అరుణను చూస్తూ అనుకున్నాడు భాను-

”ఎంత అందమైన అమ్మాయి అరుణ!” ఆ తర్వాత మురళికి పళ్ళు కోసివ్వడంలో మునిగిపోయాడు.
చింతపల్లి అడవులను సర్వే చేసి వచ్చేసరికి సీలేరు వెళ్ళడానికి ఒక వేన్‌, ఒక కారు రెడీగా వున్నాయి .
మిట్ట మధ్యాహ్నమయినా ఆ కొండ మీద మేఘాల నీడలో, కారు చల్లగా కదిలిపోయింది. షుమారు మూడువేల అడుగుల ఎత్తులో వున్న చింతపల్లి నుండి కారు ఇంకా ఎత్తు ఎక్కిపోతోంది. ఈ మారు డ్రైవింగ్‌ రామారావు గారు తీసుకున్నారు. దోవపొడుగునా ఆయన అడవి జాతి మనుష్యుల జీవిత చరిత్ర గురించి చెప్తూనే వున్నారు. కారు కెదురుగా కొందరు అడవి వాళ్ళు. చెంబూ తప్పేలాలతో సహా భార్యా పిల్లలతో తరలిపోతూ కన్పించారు.

”ఎక్కడి కెళ్తున్నారు వీళ్ళు?” కృష్ణ ఆశ్చర్యంగా అడిగింది.
”ఇన్ని రోజులుగా వున్న చోటునుండి మరో చోటు వెతుక్కుంటూ సంసారాలు తరలించుకుపోతున్నారు.”
”ఎంత హాయయిన బ్రతుకులు” నిర్మల అంది.

(ఇంకా ఉంది )

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

55

ధారావాహికలు, , , , Permalink

Comments are closed.