ఇద్దరు సాధికార మహిళలు

vadrevu veera lakshmi devi

vadrevu veera lakshmi devi

నా చిన్నప్పటి నుంచి  నాకు ఆ ఇంటి మట్టి అరుగులతో ఎంతో అనుబంధం ఉంది.నేను సరళ ఎన్నో రోజులు ఆ అరుగుల మీద చింత పిక్కల ఆట ఆడుకున్నాం.సాయంత్రాలు పందిరి మల్లె చెట్టు నుంచి మొగ్గలు కోసి ఆ అరుగుల మీదే మాలలు  గుచ్చుకున్నాం.మా ఊరికి అప్పటికి ఇంకా కరెంటు లేదు.ఆ రోజుల్లో రాత్రుళ్ళు ఆకాశం లో వెలిగే చుక్కల్ని చూస్తూ ఆ అరుగుల మీదే కూచుని అడవి బాపిరాజు గారి నవలల గురించి చర్చించుకున్నాం.ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత మేం ఇద్దరం ఎక్కడెక్కడో?! సరళ వంటరి ప్రయాణం చేస్తోంది.నేను తోడూ ఇవ్వగలిగే తీరిక లో లేను.ఎవరి దారిన వాళ్ళున్నాం.
          చాలా కాలానికి నేను మళ్ళీ మా ఊరు వెళ్లి ఆ మట్టి అరుగుల ఇంటికి వెళ్లాను.మట్టి అరుగులు మాయం అయ్యాయి.కానీ అదే విధం గా సిమెంట్ అరుగులు ఉన్నాయి.ఆ తాటాకుల ఇల్లు చిన్న డాబాఇల్లు అయింది. గుమ్మం లో ఎప్పట్లానే విరజాజి తీగ,పందిరి మల్లెపూల పందిరి .
        అరుగుల మీద ఇద్దరు  వృద్ద స్త్రీలు తీరుబడి గా మామిడి కాయలు కోస్తూ కనిపించారు.ఇద్దరి ముందూ రెండు కత్తి పీటలు.మాగాయి కి మామిడికాయ ముక్కలు కోస్తున్నారు.మరొక అబ్బాయి కత్తితో ఆవకాయకి మామిడి కాయ ముక్కలు కొడుతున్నాడు.మరో కొండకాపు స్త్రీ ఆ పక్కనే కుర్చుని కోసిన మామిడి కాయ ముక్కలు పొడి గుడ్డ తో తుడుస్తోంది.చితికిన రాచ కుటుంబపు స్త్రీ కూడా ఒక ఆమె  అక్కడే ఓ పక్కగా కూర్చుని ఉంది
          చెప్పొద్దూ!ఆ దృశ్యం నా గత జన్మ జ్ఞాపకం లా అనిపించింది.మా ఉళ్ళోలో దాదాపు నలభై ఏళ్ళ క్రితం మా  ఇంటి అరుగులు ఇలాగే ఉండేవి..ఉళ్ళో  వాళ్ళు , ఇంట్లో వాళ్ళు కలగలిసి యేవో సామూహిక గృహ కృత్యాలు తీరు బడిగా చేసుకుంటూ కబుర్లాడుకుంటూ,నవ్వుకుంటూ మధ్యాహ్నన్ని సాయంత్రం దాకా సాగదీసేవారు,
           మేం ఆ ఊరు వదిలి వచ్చేసినా  ఇప్పటికీ అక్కడ అదే వాతావరణమ్ ఉండే సరికి నా ఉపిరి లోకి మరింత ఆక్సిజన్ చేరింది. అందరూ ఎంతో సంబరం తో నన్ను పలకరించేరు.నాకూ  అదే సంబరం.సంబరం కంటే నేను విన్న మరో సంగతి  మరెంతో ఆనందం కలిగించింది.
      ఆ ఇంటి ఆమె భర్త పోయి పదేళ్లు అవుతోంది.పిల్లలు ఇద్దరూ ఎక్కడో దూర తీరాల ఉన్నారు.ఆమె వయస్సు డెభై ఏళ్ళకి మరికొంత  కలపవచ్చు. ఆమె అక్కడే ఉంటూ విస్తరాకులు కుట్టించే కుటీర పరిశ్రమ నిర్వహిస్తూ దానిమీదే జీవిస్తూ ఉంది.జీవించడమేమిటి,ఈ చిన్న డాబా ఇల్లుకూడా దాని ఫలమే.
          ఈమె పూర్వం నుంచీ నాకు బాగా తెలుసు.కానీ ఆ రెండో ఆమెను మాత్రం వెంటనే గుర్తు పట్టలేక పోయాను.ఆమెకు ఎనభై ఏళ్ళు ఉంటాయనుకు న్నాను.కానీ తర్వాత  తెలిసింది.తొంభై  దాటాయని.మొదటి ఆమె పేరు పార్వతి అనుకుంటే ఈ రెండో ఆమె పార్వతి ఆడపడుచు,ఇద్దరికీ మధ్య ఇంచు మించు పదిహేను ఇరవై ఏళ్ళ వ్యవధి ఉంది.
    పార్వతి కాస్త లేచి కొంచెం కుంటుతూ నాకు మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది.ఆమె ఆడపడుచు మెడకి బెల్టు తో ఉంది.ఏది ఏమైన ఇద్దరూ పెద్దగా అనారోగ్యాలతో లేరు.నవ్వుకుంటూ,కబుర్లు చెప్తూ వాళ్ళ చిన్న చిన్న అనారోగ్యాల మీద జోకులు వేసుకుంటూ నా సంగతులన్నీ అడుగుతూ మామిడి కాయలు కొయ్యడం పూర్తి చేసారు. నేను పది నిముషాల్లో చూసివెళ్లి పోదామనుకున్న డాన్ని ఆ వాతావరణం లోని  మానవీయ పరిమళానికి కట్టుబడి అలాగే కూర్చుండి పోయాను.
          భోజనం చెయ్యమన్నారు.చేసేవచ్చాను కానీ ఈ పెద్దవాళ్ళు ఇద్దరూ మళ్ళీ ఇప్పుడు వేళగాని వేళ  నా కోసం వంట చెయ్యడానికి సిద్ధం  కావడం నన్ను అబ్బుర పరచింది.
      వచ్చేస్తుంటే అనిపించింది.తొంభై ల లో ఉన్నఆ  ఆడపడుచుకి ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ ఉన్నారు,నగరాల్లోని జీవితాల్లో నిండా ములిగి పోయి ఉన్నారు.ఈవిడ వాళ్లకి బరువు. కానీ డెబ్భైలు దాటినా ఈ పల్లెటూరి మరదలికి బరువు కాలేదు. ఆఇద్దరు వృద్దురాళ్ళు ఊరి జనాన్ని మంచి చేసుకుని ఎంత కులాసాగా, ధైర్యంగా  బతుకుతున్నారో చూ స్తే నాకు చెంప దెబ్బ తగిలినట్టు అనిపించింది.నేను సరళా  ఇలా ఉండలేకపోయేం కదా అని.ఆఇద్దరి స్త్రీల కంటే గొప్ప సాధికార మహిళలు మనకి ఎక్కడ దొరుకుతారు?అని ఆచెంప దెబ్బ చెప్పినట్టు అయింది.

– వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , , , , , , , , Permalink

2 Responses to ఇద్దరు సాధికార మహిళలు

  1. సువర్చల చింతలచెరువు says:

    చాల బాగుందండి. చిన్నప్పడు సాయంకాలాలు కలిసే స్నేహితురాలి కబుర్లకు మల్లే.. !

  2. mercy margaret says:

    నిజమేనండి .. ఆఇద్దరి స్త్రీల కంటే గొప్ప సాధికార మహిళలు మనకి ఎక్కడ దొరుకుతారు?అని ఆచెంప దెబ్బ చెప్పినట్టు అయింది. –