సరళీస్వరాలు(వ్యాసం) – సోమరాజు సుశీల

శ్రుతి కలవని స్వరాలు – సరళీస్వరాలు

సరళీస్వరాల రచయిత్రి శ్రీమతి నందుల సుశీలాదేవి 1940వ సంవత్సరంలో గోదావరీ తీరాన రాజమహేంద్రవరంలో నందుల సోమేశ్వరరావు, సత్యవతి దంపతులకు జన్మించారు. విద్యావంతుల ఇంట పుట్టినందువలన ఆమె విద్యకు ఎటువంటి అవరోధం ఏర్పడలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రంలో ఎమ్‌.ఎస్‌సి., ఎమ్‌.ఫిల్‌. పట్టాలు పొంది అన్నవరం సత్యవతి కళాశాలలోను, ప్రభుత్వ కళాశాలలోను అధ్యాపకురాలిగాను, ప్రిన్సిపాల్‌గానూ పనిచేసి రిటైరయినారు. ఆమె భర్త శ్రీసుసర్ల సుబ్రహ్మణ్యంగారు కొద్ది సంవత్సరాలక్రితం స్వర్గస్థులయ్యారు. వీరి పిల్లలిద్దరు వున్నతోద్యోగాలలో స్థిరపడ్డారు. ఆమెకు చిన్నతనం నుండి సమాజసేవపట్ల అనురక్తి. వృద్ధాశ్రమాలు, వికలాంగుల పాఠశాలలు వంటి ఎన్నో సేవా సంస్థల కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ విశ్రాంత జీవనాన్ని అవిశ్రాంతంగా గడుపుతున్నారు.

సుశీలాదేవిగారి తొలిరచన సోషల్‌ సర్వీస్‌ అనే కథానిక 1958వ సంవత్సరంలో ఆంధ్రపత్రికలో ప్రచురితమయింది. అప్పుడు ప్రారంభమయిన ఆమె సాహితీప్రస్థానం ఇప్పటికీ నిరంతరాయంగా సాగుతూనే వుంది. ఈ యాత్రలో ఆమె రెండువందలకు పైగా కథలూ, చిరుగాలి అనే నాటకం, సుజాత, శ్రావణమేఘాలు, అమృతహస్తం, చిగురాకులు, తరంగం, లాలస, సరళీస్వరాలు అనే నవలలు, శరన్మేఘం, సాయంసంధ్య అనే కథా సంపుటాలు వెలువరించారు. ఈమె రచనలు యువ, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి భారతి వంటి ప్రఖ్యాత పత్రికలలో ప్రచురితమయ్యాయి. పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారి పురస్కారం, ఆంధ్రభాషా సమితి పురస్కారం, చక్రపాణి ఎవార్డు అందుకున్నారు.

ప్రస్తుతం మనం పరిశీలిస్తున్న నవల ‘‘సరళీస్వరాలు’’ 1969వ సంవత్సరంలో ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్‌గా ప్రచురితమై అశేషపాఠకుల ఆదరణ పొందింది. సుశీలాదేవిగారి నవలలన్నిటిలోకీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అది మన తెలుగునాట మధ్యతరగతి ఆడపిల్లలు హైస్కూలు చదువులతో ఆపకుండా కళాశాలలకి వెళ్ళాలని ఆశించే కాలం. కానీ అందులో ఎక్కువ శాతం ఆడపిల్లలకి డిగ్రీ పూర్తికాకుండానే పెళ్ళిళ్ళయిపోయేవి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులంతగా లేని తల్లిదండ్రులు 18`19 సంవత్సరాలకి తమ బిడ్డల పెళ్ళి చేసేవారు. అలా పెళ్ళికాని అమ్మాయిలు డిగ్రీ పూర్తి చేసేవారు. చాలా కొద్దిమంది విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యకోసం విశాఖపట్నమో, హైదరాబాదో, తిరుపతో చేరేవారు. తామివ్వగల కట్నానికి తాము కోరుకునే వరుడందుబాటులో వుండనందువలన కూడా కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను పై చదువులకు పంపి పెళ్ళి బాధ్యతను వాయిదా వేసేవారు. వరకట్న సమస్య ఒక వర్గపు ఆడపిల్లలకి వుపకారమే చేసిందని భావించాలి. ఉన్నత విద్య నభ్యసించిన ఆడపిల్లలు సంపాదనాపరులవడం తల్లిదండ్రులకీ, అత్తమామలకీ కూడా మురిపెంగానే వుండేది. ఆర్థికమంత బలమైన శక్తి మరొకటి వుండదు కదా!

చదువుకుని సంపాదనాపరులైనప్పటికీ స్త్రీల మీద కుటుంబం, సమాజం యొక్క ఆధిపత్యం, నిఘా వుండేవి. డబ్బు సంపాయించే స్వతంత్రం వున్నా స్త్రీలకి ఖర్చు చేసే స్వతంత్రం అంతగా వుండేది కాదు. వారి సంపాదన కుటుంబపు ఆదాయం కిందే భావించేవారు కాని వారికి వేరే ఎకౌంట్లు, ఆస్తుల కొనుగోళ్ళు వుండేవి కావు. స్త్రీలపై మగవారి ఆధిపత్యం వున్నప్పటికీ విద్యావంతులైన యువకులలో గల సంస్కారం వల్ల సంసారాలు సజావుగానే సాగేవి. ఆ స్త్రీలు కూడా తమ ఉనికి కోసం కన్నా కుటుంబపు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చేవారు. మగపిల్లలు తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను పంచుకునేవారు. తోడబుట్టినవారి చదువులకు పెళ్ళిళ్ళకు తమ సంపాదనను ఖర్చు చేసేవారు. కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా వున్నందువలన విడాకులనేవి చాలా అరుదుగా కనిపించేవి. ఎంత కష్టమయినా ఏదో ఒకనాటికి మంచిరోజులు వస్తాయనే ఆశతో దంపతులు కలిసే వుండేవారు. విధవా పునర్వివాహాలు కూడా అంతగా పరిపాటి కాలేదు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే వారు వివాహాన్నే దృష్టిలో వుంచుకుని చేరువయేవారు గానీ స్వేచ్ఛా ప్రణయాలు వుండేవి కాదు. అడపాదడపా కులాంతర వివాహాలు జరిగినా వారికి సమాజం యొక్క అంగీకారం వుండేది కాదు. అధిక సంతానాన్ని కనడం కూడా తగ్గుముఖం పట్టసాగింది.
ఈ పరిస్థితులు విద్యావంతులై పట్టణవాసులైన మధ్యతరగతి కుటుంబాలలో కనిపించేవి. శ్రీమతి సుశీలాదేవిగారు ఈ వర్గానికి చెందినవారి కథనే సరళీస్వరాలు నవలలో వర్ణించారు. ఈ నవలలో కనిపించే వారంతా యువతీ యువకులే. ఆంధ్ర విశ్వవిద్యాలయం, కాకినాడ కాలేజీ నేపథ్యంలో కలుసుకున్నవారే. సుమారు నూట ఎనభై పేజీలున్న ఈ నవలలో రచయిత్రి పదిమంది యువతీ యువకుల జీవితాలను, వారెదుర్కున్న పరిస్థితులను ఆవిష్కరించారు. వేరొకరెవరైనా అయితే ఇన్ని పాత్రలు సృష్టించగలిగినపుడు కనీసం నాలుగువందల పేజీల నవల వ్రాసేవారు. కానీ రచయిత్రి సైన్సు విద్యార్థిని అయినందువల్లనో ఏమో ఒక్క వాక్యం కూడా అనవసరంగా కనబడదు, వినబడదు. ఆమె రచనా శైలి మొదటి నుంచీ చివరి వరకు పాఠకుల ఉత్కంఠను జారనీయకుండా పట్టి వుంచుతుంది.

ఈ నవలా నాయిక శారద. కోనసీమలో కలవారి ఇంట పుట్టిన అమ్మాయి. మంచి ఆలోచనాశక్తి, ధైర్యం, వివేకం గల యువతి. ఆమె తల్లి అందరు తల్లులలాగానే కూతురికి త్వరగా పెళ్ళి చేసి వడ్డున పడదామని చూస్తూ వుంటుంది. శారద అక్కలిద్దరికీ చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసింది. తండ్రిలేని ఆ ఇంటికి పెద్దల్లుడే మగదిక్కు. ఆఖరు పిల్ల అయిన శారద మాత్రం ఎప్పటికప్పుడు తల్లిని ఒప్పించి ఆంధ్రాయూనివర్సిటీలో లిటరేచరు ఎం.ఎ. చదివింది. ఈ కథ శారద ఎం.ఎ. మొదటి సంవత్సరం చదువుతుండగా మొదలయి నాలుగయిదు సంవత్సరాల తర్వాత రిసెర్చి చేయడం కోసం ఆమె అమెరికా ప్రయాణం అవడంతో ముగుస్తుంది. శారదకు మేనరికం చేయాలని తల్లి, మిగతా బంధువులు అనుకుంటారు కానీ శారదకు తన బావ అయిన శేఖరంటే సదభిప్రాయం గానీ, అభిమానం కానీ లేవు. అతని వ్యక్తిత్వం నచ్చక అతనిని తిరస్కరిస్తుంది. శారదకు మాధురి, విజయ అనే ఇద్దరు స్నేహితురాళ్ళుంటారు. ఇద్దరూ చెరోధృవంలాంటివారు. విజయ తను ప్రేమించిన విశ్వనాథాన్ని పెళ్ళి చేసుకోవడం కోసం ఎమ్‌.ఎస్‌సి. బోటనీ రెండవ సంవత్సరం చదువుతుండగా చదువు మానేస్తుంది. అతనిని పెళ్ళాడి కర్నూలులో కాపురం పెడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఇద్దరు పిల్లల్ని కని గృహిణిగా జీవితాన్ని అనుభవిస్తూ ఆనందంగా కాలం గడుపుతుంటుంది. ఇంక మాధురి అతి సున్నిత మనస్కురాలు. కాకినాడలో చదువుకునే రోజుల్లోనే రఘు అనే యువకుడిని ప్రేమిస్తుంది. ఆ విషయాన్ని పసిగట్టిన ఆమె తల్లిదండ్రులు వెంటనే జాగ్రత్తపడి మంచి సంపాదనాపరుడు వృత్తిరీత్యా న్యాయవాది అయిన వేణుగోపాల్‌కిచ్చి పెళ్ళి చేస్తారు. రఘుని మర్చిపోలేక, వేణుని భర్తగా అంగీకరించలేక కుమిలి కుమిలి కృశించి మాధురి మరణిస్తుంది. అలాగే వేణు కూడా కాలేజీలో చదివే రోజులలోనే పద్మజ అనే యువతిని ప్రేమిస్తాడు. కానీ ఆమె వారిద్దరికీ స్నేహితుడయిన వాసుని ప్రేమించి పెళ్ళాడుతుంది. అది కులాంతర వివాహం కావడంతో పెద్దల ఆశీస్సులు లభించవు. ఆ దంపతులు అన్యోన్యంగా, సంతోషంగా నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో రాధ అనే పాపకు జన్మనిస్తారు. వేణుగోపాల్‌ ఆ దంపతులతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూనే వుంటాడు. కానీ విధివిలాసం వలన వాసు క్షయవ్యాధికి లోనై మరణిస్తాడు. పద్మ తమ బిడ్డ రాధను వేణు చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఇంక శారదకు జోసఫ్‌ అనే ఒక ఉన్నతోద్యోగితో స్నేహం ఏర్పడుతుంది గానీ ఆ స్నేహం ఇంక ముందుకు సాగదు. చివరకు వేణు ` శారద ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవడం, అమెరికాలో ఆమె మూడు సంవత్సరాలు పరిశోధనలు చేసి భారత దేశం తిరిగి వచ్చాక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంలో కథ సుఖాంతమవుతుంది.

స్వతహాగా స్నేహశీలి, మృదుస్వభావి అయిన సుశీలాదేవిగారి రచనలలోని పాత్రలు కూడా ఆమెవలెనే వుంటాయి. ఈ నవలలో ప్రత్యేకించి చెడు పాత్రలు అంటూ ఏమీ లేవు. అందరూ పరిస్థితుల కనుగుణంగా తమ జీవితాన్ని దిద్దుకున్నవారే! ఒక్క మాధురి మాత్రం ఎదురీదలేక హఠాత్తుగా నిష్క్రమిస్తుంది. కాలేజీలోనూ, యూనివర్సిటీలోనూ యువతీయువకులు స్నేహంగా వున్నప్పటికీ వారి స్నేహాలు పెడదారి పట్టవు. ఒకరికొకరు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటూ వారి స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంటారు. అనుమానాలు, అపార్థాలు, కుట్రలు వగైరాలు కనపించవు కానీ నేను ఒక్కటి గమనించాను. యువకులందరూ సిగరెట్లు కాలుస్తారు. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా! అంటే 60`70 దశకాలలో మగవాళ్ళు సిగరెట్లు కాల్చడం అతి సాధారణం అని భావించేవారనుకుంటా, ఇప్పటి యువత మద్యపానం లాగా!

నవలలోని పాత్రల మాధ్యమంగా అనేక చోట్ల అప్పటి సమాజపు తీరు తెన్నుల గురించీ, మహిళల స్థితిగతుల గురించీ రచయిత్రి కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఏ యుగంలోనయినా వరకట్నం గురించయినా, కన్యాశుల్కం మయినా వేదనపాలయేది స్త్రీ జీవితమే. పాత తరపు స్త్రీలకంటే నవీన యువతులే అన్ని అగ్ని పరీక్షలకు గురవుతున్నారు. విజేతలయి ముందుకు సాగుతున్నారు’’ అంటారు. ఇంకొక సందర్భంలో ‘‘కట్నాలకు తూగలేక తమ బాలికలను చదువులో ప్రవేశపెట్టిన తల్లిదండ్రులు తమ కన్యల వివాహం పట్ల ఉదాసీనత చూపిస్తున్నారు. వివాహ ప్రయత్నాలు చేసినవారు కట్నాలు కోరే వరుడి పట్ల యువతుల అభిమానం గాయపడి వారు వివాహానికే విముఖులౌతున్నారు’’ అంటారు. కథలో వేణు అనే పాత్రధారి ‘‘18`19 ఏళ్ళ వయసులో ప్రేమకన్నా ఆరాధన ఎక్కువగా వుంటుంది’’ అంటాడు.

శేఖర్‌ చేసిన పెళ్ళి ప్రస్తావనని తిరస్కరిస్తూ కథానాయిక ‘‘సంగీతాన్ని సరళీస్వరాలతో మొదలుపెడతారు. ఆ సప్తస్వరాలలో సంగీతమంతా ఇమిడి వుందంటే చాలా ఆశ్చర్యంగా వుంటుంది. ఆ అక్షరాల నుండే ఎన్నో స్వరాలు, మరెన్నో రాగాలు అద్భుతంగా పుడుతూ వుంటాయి. మన జీవితాలకీ ఆ సప్తస్వరాలకీ ఏదో సంబంధం వుందనిపిస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ రంగురంగుల ఇంద్రధనుస్సు వంటి కాంక్షలూ, ఆదర్శాలు వుంటాయి. ప్రేమని మించే అసూయ, ద్వేషాన్ని మించే త్యాగశీలత, అనురాగాన్ని నెట్టుకుని క్రౌర్యము, అధికారాన్ని కాదనే ఆప్యాయత అన్ని రకాల అనుభూతులూ మన జీవితాలలోనే ఇమిడి వున్నాయి. అవి సరైన మార్గంలో ఉపయోగించుకున్ననాడు జీవితమంతా మోహనరాగంలాగా సాగిపోతుంది. స్వరకల్పన చేతకానినాడు జీవనరాగం అపస్వరాలమయమైపోతుంది. అందుకనే మానవజీవితపు గతులకీ, సరళీస్వరాలకీ ఏదో అవినాభావ సంబంధముందనిపిస్తుంది. మనిద్దరివీ శ్రుతి కలవని స్వరాల వంటి బ్రతుకులు’’ అంటుంది. ఈ విధంగా శారద నోట తన ఈ నవల యొక్క ఆంతర్యాన్ని పలికిస్తారు రచయిత్రి. ఈ నవల 1950`70 దశకాలలో స్త్రీల జీవితాలకి ఒక చక్కని దర్పణంలా భాసిస్తుందనడంలో సందేహం లేదు.

– సోమరాజు సుశీల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

సాహిత్య వ్యాసాలు ​, , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో