Horizon Beautiful – శివ లక్ష్మి

HORIZON BEAUTIFUL

Director: Stefan Jäger
Country: Ethiopia, Switzerland
Language: Swiss with English Subtitles
Duration: 91 minutes
Age Group: above 10 years.

siva 11111111111111111111111

ఇతివృత్తం : ఇథియోపియా దేశంలోని ఆడ్మస్సూ అనే ఒక బాలుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆట ఫుట్ బాల్ . ఆ ఆటను ఆడి, “యూరప్ మొత్తంలో అతి గొప్ప సాకర్ క్రీడాకారుడు ఆడ్మస్సూ” అని ఘనకీర్తి తెచ్చుకోవాలనీ, సంగీతంలో నైపుణ్యం సాధించాలనీ అతనికి రెండు గొప్ప ఆశయా లుంటాయి. చూస్తున్నవారికి అవి బొత్తిగా పగటి కల లనిపిస్తాయి.ఎందుకంటే అతనొక వీధి బాలుడు. బాగా దుమ్ము కొట్టుకుపోయి చిరిగి పీలికలైన బట్టలతో,ఒక్కపూటైనా అసలు తినడానికి తిండే లేని పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తాడు. అతనున్న భౌతిక పరిస్థితులకీ, అతని తాహతుకీ ఆ కోరికలు అసాధ్యమైనప్పటికీ ఆశ్చర్యకరంగా అతని కలలు అనుభవం లోకి రావడమే ఈ సినిమా కథాంశం.

ఇథియోపియా యొక్క రాజధాని “ఆడిస్ అబాబ”. అదొక విశాలమైన నగరం . అయితే అంత భారీ నగరమంతా కూడా కోకొల్లలుగా ఉన్న వీధి బాలలతో నిండిపోయి ఉంటుంది. ఆ వీధి పిల్లల్లో ఒక బాలుడు మన హీరో 12 ఏళ్ళ ఆడ్మస్సూ. అతనికి ఫుట్ బాల్ ఆట అంటే ప్రాణం. “మెస్సి” అనే ఫుట్ బాలర్ అతనికి ఆదర్శం. సంగీతం రెండో అభిమాన కళ. ఈ రెండింటి గురించీ తానొక వీధిబాలుడిననీ,తనకెవరూ లేరనీ, ఎటువైపు నుంచి కూడా రవ్వంత ఆసరా లేదనే స్పృహ లేకుండా ఊహల్లో తేలిపోతుంటాడు. మెస్సిలాగా యూరప్ లోనే గొప్ప ఫుట్ బాల్ క్రీడాకారుడు కావాలనే దృఢ సంకల్పంతో అవకాశాలకోసం ఎదురుచూస్తూ జీవిస్తుంటాడు.

ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండే ఆడ్మస్సూ ఒక పెద్ద ముఖ్యమైన ఫుట్ బాల్ బాస్ ‘ఆడిస్ అబాబ’ నగరానికొస్తున్నట్లు కనుక్కుని అతని స్నేహితులకి చెప్తాడు. అతనే సాకర్-పరిశ్రమ ద్రష్ట ఫ్రాంజ్ . ఫ్రాంజ్ అనే అతను ఫుట్ బాల్ ఆటకు సంబంధించిన అన్ని విషయాల్లో నిర్ణయాధికారం గల కీలకమైన వ్యక్తి. అతని మనస్సులో ఫుట్ బాల్ ఆటను దేశ,విదేశాల్లో ప్రమోట్ చేయడానికి అమోఘమైన అనేక ప్రణాళికలున్నాయి. ఆ కారణం గానే సాకర్ ప్రమోట్ చెయ్యడం కోసం ఆడిస్ అబాబ నగరానికొస్తాడు. కానీ ఎంతసేపూ ఎత్తుకి పై ఎత్తు వేసే వ్యాపార వ్యూహాలు తప్ప మానవత్వం,దయ,కరుణ లాంటి అంశాలకు అతని హృదయంలో చోటు లేదు.

ఫుట్ బాల్ షూట్ ప్రారంభమవడానికి చేసిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉంటాయి. చిరిగిన బట్టలతో నున్న ఆడ్మస్సూ ని చూచి ప్రధానద్వారం దగ్గర అడ్డగించి లోపలికి పోనివ్వరు. బయటి నుంచే బాల్ తో తన ప్రతిభను చూపిస్తూ, ఒక ఫుట్ బాల్ ఆటగాడిగా, ఫ్రాంజ్ దృష్టిని ఆకర్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఫ్రాంజ్ అసలు పట్టించుకోడు. అతను ధనవంతుల పిల్లల ఫొటో షూట్ తో బిజీగా ఉంటాడు. దాంతో ఆడ్మస్సూ డీలా పడిపోతాడు.

అతని స్నేహితులు ఆడ్మస్సూ తెలివితక్కువ తనాన్ని రకరకాలుగా ఆట పట్టిస్తూ ఎగతాళి చేస్తారు .
మళ్ళీ రెండవ అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు మన ఆశావాది ఆడ్మస్సూ. వీధి పిల్లల్లోని ఒక దొంగల ముఠా ఎవరైనా ఒక గొప్ప ధనవంతుడిని కిడ్నాప్ చెయ్యాలని ప్లాన్లు వేస్తుంటారు.వాళ్ళకు ఫ్రాంజ్ ని కిడ్నాప్ చెయ్యమని ఆడ్మస్సూ సలహా ఇస్తాడు.ఆ రకంగా ఫ్రాంజ్ ని కాపాడి, అతన్ని నిర్బంధించి ఎలాగోలా తన కలను సాకారం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు ఆడ్మస్సూ. కానీ వాళ్ళు చాలా ఎక్కువ మొత్తం డబ్బడుగుతారు.అది ఆడ్మస్సూ కి సాధ్యం కాదు గనుక ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తాడు.

ఇంతలో మరొక ఫోటో షూట్ ఉందనే ఒక శుభవార్త వింటాడు ఆడ్మస్సూ! అదీగాక ఈసారి ఫోటో షూట్ వీధి పిల్లలతోననే సంగతి తెలిసి మహదానందపడిపోతాడు!! దాని ప్రారంభ ప్రకటన కోసం, ఫ్రాంజ్ ని నేరుగా కలవడం కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటాడు.
అంతలోనే ఆశ్చర్యం! ఏం జరిగింది? “హేమర్ గేంగ్ బాయ్స్” అనే ఒక రౌడీ మూక ఆకస్మికంగా వారి సొంత ప్రణాళిక ప్రకారం ఫ్రాంజ్ ని కిడ్నాప్ చేసేస్తారు!!

ఆడ్మస్సూ- ఫ్రాంజ్ ఎక్కడ ఎలా మధ్యలో కలుస్తారు? ‘ఆడిస్ అబాబ’ నగరంలో మాయమైన ఫ్రాంజ్ ఇథియోపియన్ నిర్జనారణ్యంలో ఆడ్మస్సూని ఎలా కలుస్తాడు? అక్కడ ఏ విషయంలోనూ పొంతన లేని ఈ వింత జంట ఏమేమి సంఘటనలు ఎదుర్కొంటారు? ఇద్దరి మధ్య ఎంత గొప్ప సీన్లున్నాయి? ఒక మాయ లాంతరు దానంతటదే వచ్చి వెలుగు చూపించినట్లు సాకర్ అనుకూల భవిష్యత్తు ఆడ్మస్సూ ముందుకి ఎలా వస్తుంది? చివరకు ఆడ్మస్సూ కలలు కంటున్న సాకర్ స్వర్గం తలుపులు ఎలా తెరుచుకుంటాయి? వాళ్ళిద్దరి నటనా,ముఖ్యంగా ఎగుడు దిగుడుగా ఉన్న కొండలూ,గుట్టల మధ్యలో అడవి జంతువులతో ఆడ్మస్సూ చేసిన సాహసాలూ,నదురూ,బెదురూ లేకుండా ఒక విదేశీ పెద్దమనిషిని తన కనుకూలంగా మలచుకున్న ఆడ్మస్సూ అద్భుత నటనను చూడాలనుకున్న వారందరూ తెర మీద వీక్షించాల్సిందే!

ఆడ్మస్సూ గా నటించిన బాల నటుడు” హెనోక్ టెడేల” (Henok Tadele) నటన అద్భుతంగా ఉండి ఆనందం,ఆశ్చర్యం,సంభ్రమం కలిగిస్తాయి. మనం అప్పుడప్పుడూ మన చుట్టుపక్కల వీధిబాలల్ని చూసే అతి వాస్తవిక వాతావరణంలో సహజాతి సహజంగా అసలు నటనే కాదన్నట్లు అక్కడొక మన చిన్నారి అనాధ బాలుడు గెలుపు కోసం ఆరాటపడుతున్నట్లే అనుభూతి కలిగింది. మామూలుగా అయితే ఆ వయసు పిల్లలు ఏ రకమైన అండా లేని పరిస్థితుల్లో బోలెడంత అభద్రతాభావంతో ఉంటారు.కానీ మన ఆడ్మస్సూ లోకాలన్నీ జయించగలను అన్నంత ధీమాగా ఏ పరిస్థితులకైనా సడలని ఆత్మ విశ్వాసంతో ఉంటాడు!

ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్తగా ఫ్రాంజ్ ఎంత శక్తివంతమైనవాడప్పటికీ మృగరాజుల్లాంటి కౄరజంతువులను అడవిలో చూసి ముచ్చెమటలతో దాదాపు స్పృహ కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటాడు. ఆయన దగ్గరున్న డబ్బంతా బలవంతంగా లాక్కుని,చివరికి చంపాలని ప్రయత్నించిన భయంకర మూకనుంచి తప్పించి ఆ క్షణంలో ఎవరో పంపినట్లే సిద్ధంగా ఉండి కాపాడతాడు ఆడ్మస్సూ.

ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారి ‘హెనోక్ టెడేల’ నిజజీవితంలోనూ వీధిబాలుడే! సినిమా నిర్మిస్తున్న క్రమంలో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది! రోడ్లమీద తినడం,ఎక్కడ బడితే అక్కడ పడి నిద్రపోవడమే తప్ప అంతకుముందు అతనికి ఇల్లనేది తెలియదు. ఈ సినిమా షూటింగ్ తర్వాత అతనికొక షెల్టర్ హోం దొరకడమే కాకుండా ,అక్కడినుంచి స్కూలుకెళ్ళి చదువుకునే అవకాశం దొరికింది. ఆ స్కూలు ఇథియోపియా లోని ‘సేలం’ అనే గ్రామంలో 25 సంవత్సరాలనుంచి అనాధ పిల్లలకోసం అంకిత భావంతో, కర్తవ్య నిష్ఠతో పనిచేస్తున్న ఒక గొప్ప సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందులో ఉండి చదివే బాలలకు వసతి సౌకర్యాలతో పాటు ఏదో ఒక వృత్తిలో జీవనాధారం కోసం నైపుణ్యం సాధించే వరకూ శిక్షణనిస్తారు. ఆ రకంగా మన హెనోక్ కు సేలం స్కూల్లో సంగీతశిక్షణ పొందడానికవకాశం కలిగింది. ఈ సినిమాలో ఆఖరి పాట పాడి, ఒక గాయకుడు కావాలన్న తన కలను నిజం చేసుకునే దిశగా తొలి అడుగులు వేస్తాడు హెనోక్

స్విస్ రచయిత స్టీఫన్ ఏగర్ అవార్డులు గెల్చుకున్న అనేక సినిమా టీవీ ఫీచర్ ఫిల్ములకూ, డాక్యుమెంటరీలకు స్క్రిప్ట్ తో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. అబ్రహం హైలే అనే అతను స్విస్ ఎంబసీ, జర్మనీలోని గోథె ఇనిస్టిట్యూట్ వారి సహకారంతో, ఆడిస్ అబాబ లో స్థాపించిన ‘బ్లూ నైలు ఫిల్మ్ అండ్ టెలివిజన్’ అకాడమీ ఇథియోపియా లోనే గాక ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది. అంతర్జాతీయంగా పలు ప్రశంసలు పొందింది. ఈ చిత్ర దర్శకుడు స్టీఫన్ ఏగర్ అందులో సినిమా పాఠాలు బోధిస్తారు. ఇంత మంచి రచనతో సినిమా తియ్యడమే కాదు, హెనోక్ కి అత్యంత ఇష్టమైన వ్యాపకంతో ఒక జీవనాధారాన్నేర్పరిచి”అతనికి ముందు ముందు మంచి జీవితం ఉంది” అని అనడం అనాధ బాలల పట్ల స్టీఫన్ కున్న ఆర్ధ్రతను తెలియజేస్తుంది.

మొత్తం సినిమా ఇథియోపియా లోని వీధిబాలలుండే స్థానిక ప్రాంతాల్లో చిత్రీకరించారు. నటులు కాని ఆ బస్తీలో సంచరించే మామూలు మనుషుల్ని, బాలల్ని తీసుకుని నటనలో తర్ఫీదునిచ్చి మంచి నటులుగా మలిచారు. ఎంచుకున్న కథకి దన్నుగా ఉండేలా సహజ శబ్దాలనూ,నిజ వాతావరణాన్నీ యధాతధంగా దృశ్యీకరించారు.

ప్రతి సినిమా లోనూ కొన్ని మలుపులుంటాయి.కానీ సినిమా మొదట్లో ఈ చిన్న పిల్లవాడికి ఇంతంత పెద్ద కోరికలేమిటి?అవెలా తీరతాయి? అని అనిపిస్తుంది ప్రేక్షకులకి.సత్యజిత్ రే “పథేర్ పాంచాలి”లో అందరికీ చిన్న చిన్న కోరికలుంటాయి.అయినా ఒక్కటీ తీరదు.కానీ ఆడ్మస్సూ కి ఆకాశాన్నందుకోవాలన్న పెద్ద పెద్ద ఆశయాలు.వాటిని ఏ ఆసరా లేకుండానే ఉత్తిగా కలలు కంటూనే సాధించుకుంటాడు.”కలలు కనండి.ఆ కలలను సాకారం చేయడానికి ప్రపంచంలోని శక్తులన్నీ ఏకమై మీ కలల్ని నిజం చేస్తాయి “అన్న అబ్దుల్ కలాం గారి మాటలిక్కడ రుజువయ్యాయి.

siva 33333333333333333333333
ఫ్రాంజ్ సమాజంలో మంచి స్థితిపరుడు.అతని సాంఘిక హోదా అతనికి సమాజంలో కొండంత గౌరవాన్నిస్తుంది.కానీ ఒంటరిగా నిర్మానుష్యమైన అడవిలో చిక్కుకున్నప్పుడు అతని ధనం, ఉద్యోగం, పదవులేవీ అతనికెందుకూ పనికిరాకుండా పోయాయి.కానీ ఆడ్మస్సూకి సంఘంలో ఏ హోదా లేదు.అనాధబాలుడు.ఒంటరిగా అడవిలో తన శక్తి యుక్తులన్నీ ఉపయోగించి ఫ్రాంజ్ ని రక్షించాడు. మనుషులు నిరాధారంగా రోడ్డు మీదున్నప్పుడు ఎవరి శక్తి, అంతర్నిహిత ప్రతిభా పాటవాలు ఏమిటి?అని ఆలోచించమంటారు డైరెక్టర్ స్టీఫన్ ఏగర్. ఫ్రాంజ్-ఆడ్మస్సూలమధ్య నున్న మానవ సంబంధం రెండు భిన్న సంస్కృతులు, విభిన్న వయస్సులు, ఇద్దరి వేరు వేరు వ్యక్తిగత కలలు- వీటన్నిటినీ అద్భుతంగా ఆవిష్కరించి , వాటి మధ్య సహజంగా ఉండే ఘర్షణనూ , ప్రాథమిక మానవ నైజాల్నీ నిజాయితీగా చిత్రించి ఆశ్చర్యకరంగా,దిగ్భ్రాంతి గొలిపే విధంగా ప్రేక్షకుల కళ్ళకు బొమ్మ గట్టిన తీరు ఎంతైనా ప్రశంసనీయం!

ఫ్రాంజ్-ఆడ్మస్సూలు ఇద్దరూ పుట్టుకతోనే సహజ పథక రచయిత లనిపిస్తారు.వారి వారి స్థాయిని బట్టి ఇద్దరూ తమవైన ప్రణాళికలేస్తుంటారు. కానీ వారిద్దరూ తమను తాము వాస్తవంగా అర్ధం చేసుకోవడానికి ఈ కిడ్నాప్ ఎంతో సహకరించింది.
అసమానమైనకథ తో అద్భుతంగా,తీర్చిదిద్దిన అపురూపచిత్రమిది. చిన్న చిన్న అల్పమైన విషయాలకే నీరుగారిపోతున్న నేటి పెద్దలూ,యువకులూ,బాలలూ అన్నివయసులవారూ చూడవలసిన చిత్రమిది.ముఖ్యంగా టీనేజర్లకు గొప్ప ఆత్మస్థైర్యాన్నిస్తుంది!

పాల్గొన్న చలనచిత్రోత్సవాలు – సాధించిన అవార్డులు
2012 లో తీసిన ఈ సినిమా అదే సంవత్సరంలో ఎన్నో దేశాల్ని చుట్టి వచ్చి 75 ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొని, 10 అవార్డులు గెల్చుకుంది.
2013 లో సాధించిన అవార్డులు-
11Th Children’s and Youth Film Festival ‘Michel’ in Hamburg – Germany,
36 thInternational Children’s Film Festival ‘LUCAS’ in Frankfurt- Germany,
Film festival in Switzerland ,
and the 43rrd Giffoni International Children’s and Youth Festival in Italy
2013 తర్వాతా ఆ ప్రయాణం ఇప్పటివరకూ సాగుతూనే ఉంది.ప్రతిచోటా ప్రశంసల వెల్లువలూ, అవార్డుల పంటలూ పండుతూనే ఉన్నాయి.

– శివ లక్ష్మి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~~~~~~~~~~~~~~~~`

పుస్తక సమీక్షలు, సినిమా సమీక్షలు, , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో