గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహా లక్ష్మి(ఆత్మ కథ)

gouthami ganga మళ్ళీ వచ్చి, అవి మీవి కాదు నేను మరొకరి కోసం తెచ్చాను. నా సరుకులు నాకు ఇవ్వండి అని కూర్చొంది. మేము ఎంత అడిగినా మీకే అని ఇచ్చావు. ఇప్పుడు మేం అవి వాడేసుకున్నాం. కావలిస్తే డబ్బులు ఇస్తాం తీసుకో అంటే ఆమె వినలేదు. నా వస్తువులే కావాలని మూర్ఖించింది. సత్యం తిరగబడి నువ్వసలు మాకేం ఇవ్వలేదు, నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. ఆ అమాయకురాలు సణుక్కుంటూ పోయింది.

తన మరిది సర్వ శ్రేష్ఠుడు కావాలని మనసారా కోరుకుంటూ నీవు చదువు అంతు చూడాలయ్యా అనేది ఆమె. అతడి సహాధ్యాయులకు అతడికన్నా ఎక్కువ మార్కులు వస్తే, ఆమెకు కిట్టేది కాదు. మీరు,

మా మరిది ఒకలాగే చదువుతున్నారు కదా మీకు అతడికన్నా ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయి అనేది ఆమె. పోనీ లేవమ్మా మార్కుల్లో తలో పది అతడి వాటాగా అతడికి ఇచ్చివేస్తాంలే అనే వారు వాళ్లు.
ఇంటి వారిది పెద్ద మేడ, దర్భా వెంకయ్యగారు ప్లీడరు వారి భార్య రమణమ్మగారు దొడ్డ ఇల్లాలు. అద్దెకు వచ్చిన వారిని స్వజనంగా భావించి వారి మంచి చెడ్డలు కనిపెట్టేదామె. మేడమీద ఇంటి వారి మకాం పడకలూను. క్రింద పెద్ద హాల్లో ప్లీడరు గారి కచేరి, ఓ వారగా ఇద్దరు గుమాస్తాలు దస్త్రాలు, డెస్కులు పెట్టుకొని వుండేవారు. పడమటి ఇల్లు, వంట వసారా ఇంటిని చేరే వుండేవి.. మిగతా మూడువైపులా గదీ, ఆ గదిని చేర్చి వరండా, హాలు చుట్టూతా పది, పన్నెండు గదులు వుండేవి. ఆ గదుల్ని చేర్చి చిన్న పెరడు వుండేది. ఆ గదులు అద్దెకు ఇచ్చేవారు. కొందరు తమ అవసరాల్ని బట్టీ రెండేసి గదులు కూడా తీసుకొనేవారు. గదులు, పడక గదులుగా ఉపయోగించుకుంటూ వసారాలో వంట చేసుకొనేవారు. ఆ వసారాను చేరి వున్న పెరట్లో ఇంటి వారే అర్థ రూపాయి ఇస్తే వచ్చే చిన్న రోలుపొత్రం వేయించారు. ఎవరికి వారికి, ఆ పెరట్లో బట్టలు ఆరవేసుకునేవారు. ఓ వారగా రేకుల స్నానాల గదులు ఏ వాటకు ఆ వాటాకు వుండేవి. ఇంటి వారి పెరట్లోకి చిన్న రేకుల తలుపు కూడా ప్రతి వాటాకు ఉండేది. ఇంటి వారి పనిమనిషే ప్రతి రోజూ అందరి వాకిళ్లూ ఊడ్చి, గుమ్మాలు కడిగి ముగ్గు వేసేది. దానికి అద్దెకు వచ్చిన వారు ఏమీ డబ్బు చెల్లించనవసరం లేదు. ఇంటి వారికి పెరట్లో పాడి ఆవు ఎప్పుడూ ఉండేది. ఆ ఆవు పేడ పనిమనిషి చేత రమణమ్మ గారు రోజు వాకిలిలో కాస్త పెట్టించేవారు. నాటి రోజుల్లో భోజనాలు చేసిన చోట శుద్ధి చేయాలన్నా, రజస్వల అయిన స్త్రీలు, క్షురకర్మ చేయించుకున్న మగవారు శుద్ధి స్నానం చేయాలంటే గోమయం కాస్తా రాసుకోవలసిందే.

నేడు మనకు ఆ అలవాటు వెలపరంగా వున్నా నాడు సర్వులు ఆ ఆచారాన్ని పాటించారు. పది గంటలకు భోజనం చేసి, తాంబూలం వేసుకొని జరీ అంచుల ఉప్పాడ ధోవతి దాల్చి, 3 గజాల జరీ అంచులు గల కండువా తలపాగా చుట్టి ధరించేవారు. తెల్లని కమీజు కాలరు ధరించి హఫ్‌ బూట్లు ధరించి కోర్టుకు వెళ్ళే వారు. సాయంత్రం ఇంటికి వస్తూనే దుస్తులు మార్చుకొని ఏమన్నా ఫలహారం తిని తెల్లని , సన్నని అంచుల పంచ, లాల్చీ ధరించేవారు. భుజంపై తెల్లని ఉత్తరీయం ధరించి చేతికర్ర వూపుకుంటూ కక్షీదార్లు తెలిసిన వాళ్లు వెంట రాగా వ్యాహ్యాళికి వెళ్ళి చీకటి పడేవేళకు ఇంటికి వచ్చేవారు. వారు నియోగులు కనుక సంధ్యావందనం బెడదలేదు. ఉదయం మాత్రం స్నానం చేయగానే విభూది, కుంకుమ బొట్టు నుదుట దాల్చి, ఉదయమే తడిపి ఆరవేసిన పొత్తిపంచ కట్టుకొని దేవుని మందిరం వద్ద రెండు వైపులా పెద్ద సైజు ఇత్తడి దీపం సెమ్మలతో, భార్య నూనెలో తడిపి సిద్ధంగా వుంచిన వత్తులు వెలిగించి, పెరటిలోని మందారాలు, పారిజాతాలు, నందివర్ధనాలు, సువర్ణ గన్నేరు రెండు పెద్ద పళ్ళేల నిండుగా వున్నవి పూజా మందిరంలోని వెండి, పంచలోహ అర్ఛామూర్తులకు పూజ చేసేవారు. పెద్ద సైజు అరటాకు కొస వున్నది పీటముందు అడ్డంగా పరచేవారు. దానిలో పదార్థాలు వడ్డించి, వారి భోజనం ముగిసే వేళకు వారి కొఱకు ప్రత్యేకంగా వెండి గిన్నెలో ప్రత్యేకంగా తోడు పెట్టిన పెరుగు, ఆ విస్తరి వద్ద వుంచేవారు. ఎర్రగా పిడికలదాలిపై కాచిన పాలు వారి భోజనానికి 4 గంటల ముందుగా మాత్రమే తోడుపెట్టి సిద్దపరుస్తారు రమణమ్మ గారు. వారికి పెరుగు తీపిగా, వింత రుచిగా వుండాలి అందుకని ఈ ఏర్పాటు. వారి కుమారుడు కూడా న్యాయవాదే. ఆయన తండ్రికి చేదోడువాదోడుగా వుంటారు. అందరూ ఆయన్ను చిన్న ప్లీడరుగారు అంటారు. సామాన్యమైన కేసులకు ఆయన హాజరవుతుంటే కొంత విశ్రాంతిగా వుంటూ ముఖ్యమైన కేసులు మాత్రం చూస్తారు పెద్ద ప్లీడరు గారు. పడమటి ఇంట్లో దక్షిణ ముఖంగా తండ్రి విస్తరి వేస్తే, తూర్పుముఖంగా పడమటి గోడకు చేర్చి కొడుకు పీట వుంటుంది. ఆయన భోజనం వెండి కంచంలో, ఆ కంచం నడుమ బంగారు పువుతో ప్రత్యేకంగా వుంటుంది. కొడుకు పట్టు పంచ దాల్చి భోజనానికి వస్తారు. వారి ప్రక్క కొంచెం దూరంగా మిగతా వారికి వడ్డిస్తారు. భోజనశాల కొంచెం వెడల్పు తక్కువే. ఎదుర పంక్తి వడ్డిస్తే వడ్డించే వారికి ఇరుకు. అందుచేత సామాన్యంగా ఎదుర పంక్తి వేయరు. కొడుకు అగులు బొట్టు ధరించి భోజనానికి వస్తారు. ఆయన కోర్టుకు తెల్లని పంట్లాము ధరిస్తారు. తలపాగ, ఉత్తరీయం ధరించరు.

ప్లీడరు గారూ కొడుకు కోర్టుకు వెళ్లాక ఇళ్లలోని ఆడవారంతా భోజనాలు, పనులు పూర్తి చేసుకొని ఆ హాల్లో చేరితే మధ్యాహ్నం 3 గంటల వరకూ ఒకటే కబుర్లు. రమణమ్మ గారు వారి మంచి చెడ్డలు కనుక్కొని వారికి సలహాలు ఇచ్చేవారు. మా వారికి ఇద్దరు గుమాస్తాలు వున్నా పని తెమలదమ్మా. ఒక రోజు కాని ఒకరు రాకపోతే ఇంక మరీ యాతన. ప్లీడరుకు, గుమాస్త పిల్లల తల్లికి ఇంట్లో సహాయంగా ఓ వితంతు స్త్రీ వుంటే గాని సాగదే అంటారు మావారు అని ఆమె చెప్పేవారు. ఆ రోజుల్లో చాలా మంది యువకులు అకాల మృత్యువు వాతపడటం వలన ఇంట్లో ఇద్దరు, ముగ్గురు వితంతు స్త్రీలు యువతులు, నడి వయస్సు వారు వుండేవారు. వారు అత్తింట్లో, పుట్టింట్లో వుంటూ ఏ విధమైన బాదరబంది లేకుండా పిల్లల తల్లులైన వదినలకు, అప్పా చెళ్లెళ్లకూ సహాయపడుతూ వుండేవారు. సాయంత్రం 5 గంటలకు కోర్టు ముగిసి ప్లీడరు గారు ఇంటికి వచ్చేవరకూ స్త్రీల సభ సాగేది. వారిని వాకిట్లో చూడగానే స్త్రీలంతా మర్యాదగా తలవంచుకొని, చీర చెరుగులు మెడ చుట్టూ కప్పుకొని తొలగిపోయేవారు. రాత్రి వేళ ఆ హాల్లో పెద్ద దీపం వెలిగించి పొడవుపాటి ఊచకు వేళాడతీసేవారు. అద్దెకున్న వారి పిల్లలంతా ఆ హాల్లో చేరి చదువుకునేవారు. వారి ఇళ్లకు చుట్టాలు వచ్చినా ఆ హాల్లో ప్రక్కలు పరుచుకొని పడుకునేవారు. ఆ విధంగా వారు 2 గదులకే అద్దె చెల్లిస్తున్నా ఇంటి వారి ఇల్లు అంతా స్వతంత్రంగా వాడుకొనేవారు.
శాస్త్రి గారి బంధువుల్లో సంపన్నుడు ఒకాయన వున్నారు. ఆయన తన ప్రవర్తన నిర్ధుష్టమైనది కాకపోయినా బంధువులందరిపైనీ పెత్తనం చలాయిస్తూ వుండేవారు. వారి నిజ స్వరూపం తెలియక కొంతా, ధనవంతుడూ, పరపతి కలవాడూ, పరోపకారి కావడం వలన కొంత బంధువులు ఆయన్ను మన్నించేవారు. కొందరు ఎదుట వినయం నటిస్తూ, చాటున తెగడుతూను వుండేవారు. ఆ రోజుల్లో ఆడవారు బయటకు వెళ్లడం, సంప్రదాయ బద్దులకు కిట్టేది కాదు. దిగువ మధ్యతరగతి స్త్రీలు కొంత వీధిలోకి వెళ్లినా సంపన్న స్త్రీలకు ఘోషా ఒక హోదా! ఒకసారి సీత, మరిది నాటక ప్రదర్శనకు వెళ్లిన వేళ ఆయన ఊరి నుంచి వచ్చారు. ఆయన ఊరి నుంచి వస్తే ఆర్ఘ్య పాద్యాలిచ్చి మర్యాద చేయడం అలవాటు. అర్ఘ్య పాద్యాలంటే నిజంగా అర్ఘ్య పాద్యాలే. గుమ్మంలోకి రాగానే మాననీయులైన అతిథులకు ఓ పెద్ద ఇత్తడి చెంబుతో కాళ్లు కడుగుకోవడానికి నీళ్లిచ్చి తెల్లని తువ్వాలు తుడుచుకోవడానికి ఇస్తారు. ఆ తరువాత ఓ కంచు చెంబుతో చల్లని మంచి నీరు తాగడానికి ఇస్తారు. వారు వచ్చిన సమయాన్ని బట్టి పళ్ళో ఫలహారమో పెడతారు. భోజనాల వేళ అయితే మడి బట్ట సిద్ధం చేస్తారు. వారి వెంట ఎప్పుడూ నలుగురైదుగురు అనుచరులు వుంటారు. వారూ వీరి ఇంటనే భోజనం. ఈ సారి వారు వస్తారని ముందుగా తెలియకపోవడం వలన సీత బయటకు వెళ్లింది. శాస్త్రి గారు మనిషిని పంపి ఆమెను నాటకం మధ్యలో రప్పించారు. పెరటి దారిన ఇంటికి వచ్చి, కాళ్లు కడుక్కొంటున్న ఆమెను ఎక్కడికి వెళ్ళావే అని అడిగారు ఆయన. తను చేసిన పనిని దాచుకోవాలని తెలియని సీత గయోపాఖ్యానం నాటకానికి వెళ్లానండీ. మీ అబ్బాయి వెంకటేశ్వర్లుని రప్పించి ఇద్దర్ని వెళ్ళమన్నారు ఎంత బాగుందనుకొన్నారు అంది ఆమె. చాల్లె ఆడాళ్లు నాటకాలకు వెళ్ళడం ఏమిటీ? ఇక ఎప్పుడూ వెళ్ళకు అన్నారు ఆయన.
( ఇంకా ఉంది )

– కాశీచయనుల వెంకట మహా లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
238
ఆత్మ కథలు, గౌతమీగంగ, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో