గౌతమి (కథ) – మానస ఎండ్లూరి

Manasa yendluri

Manasa yendluri

 **జై ర తెలంగాణ! జై జై ర! తెలంగాణా…. “అబ్బో!అప్పుడే వీడు హలో ట్యూన్ మార్చేశాడే!వయసు పద్నాలుగు!వీడికో ఫోను!దానికో హలో ట్యూను!!” అనుకుంటూ మా తమ్ముడు బిట్టు గాడికి మళ్ళీ ఫోన్ చేశాను.తియ్యట్లేదు.లాభం లేదనుకుని ఎస్ఎంఎస్ పెట్టాను. “ఒరేయ్ బిట్టు!నేను ట్రైన్ లో ఉన్నా.పొద్దున్నే కలుస్తా.రేపు సాయంత్రమే మళ్ళీ మన రాజమండ్రి ప్రయాణం.అన్నీ సర్దుకుని రెడీ గా ఉండు.గుడ్ నైట్!”.బిట్టు స్వయానా మా బాబాయ్ కొడుకు.తొమ్మిదవ తరగతి పరిక్షలు రాసి సెలవులకు మా ఊరు రాజమండ్రి రావాలని వాడి కోరిక.ఎప్పుడూ మేము వెళ్ళడమే కాని వాళ్ళు వచ్చింది తక్కువ.బిట్టుకి నేనంటే ప్రాణం.నాకూ వాడంతే!చిన్నప్పట్నుంచి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా “అక్కా!అక్కా!” అంటూ నాతోనే ఉండేవాడు.ఎప్పుడో వాడి ఆరవ ఏట వచ్చాడు రాజమండ్రికి.మళ్ళీ ఇక రేపే  వాడొచ్చేది.

ట్రైన్ ఇక రాజమండ్రికి సెలవు చెప్తోంది. ఎప్పుడు ఈ రైలెక్కినా అందరూ మన వాళ్ళే అన్న భావన!పలకరింపు నవ్వులు, ఆప్యాయంగా “ఎక్కడి దాకండి ప్రయాణం?”, “భోం చేసే బయల్దేరారా?” అనే ప్రశ్నలు…ఎవరికైనా లగేజి సర్దడంలో సహాయం చేస్తే “చల్లగా ఉండమ్మ!” అనే ఆశీర్వాదాలు…చాలా ఉత్సాహంగా ఉంటుందీ ‘కాకినాడా టూ సికింద్రాబాద్’ రైల్లో ప్రయాణం!బిట్టు రిప్లై ఇస్తాడేమో అని ఫోన్ పద్దాకా చూసుకుంటున్నా. ఈ లోగా ఒక యాభై ఏళ్ళు దాటిన పెద్దావిడ నా దగ్గరకొచ్చి

“అమ్మా నీది లోయర్ బెర్తేనమ్మా?” వినమ్రంగా అడిగింది.

“అవునండి!మీకు అప్పర్ బెర్త్ వచ్చిందా?నేను తీసుకుంటాను.నెంబర్ చెప్పండి” అలవాటైన సమాధానం అలవోకగా చెప్పాను.

“అప్పుడే వద్దమ్మా!టి సి వచ్చి వెళ్ళాక వద్దువుగాని” అని ఒక నవ్వు నవ్వేసి మాయమైంది.

చూస్తూనే కొవ్వూరు పలకరించింది నిశ్సబ్దంగా చీకట్లో.కొవ్వూరు స్టేషన్ దాటి దాటగానే టి సి వచ్చి అందరి టికెట్స్ చెక్ చేసుకుని వెళ్ళిన రెండు నిమిషాలకి మళ్ళీ ఆ అప్పర్ బెర్త్ ఆవిడ ప్రత్యక్షమైంది బ్యాగ్ తో సహా!నేను నా బ్యాగ్ తో ఆమె చెప్పిన అప్పర్ బెర్త్ కు వెళ్లి పైకెక్కి పడుకున్నాను.ఆఖరి సారి ఫోన్ చూసుకున్నాను.బిట్టు రిప్లై ఇవ్వలేదు. “సర్లే ఎటూ నేను వస్తున్నానని తెలుసు కదా!” అనుకుని ఆరు గంటలకి అలారం సెట్ చేసుకుని నిద్రకి ఉపక్రమించాను.అదేంటో!ఎన్ని వందల సార్లు ప్రయాణం చేసినా కళ్ళు మూసే సరికి హటాత్తుగా నేనున్న బోగిలోనే మంటలు రేగినట్టు,హ్యాండ్ బ్యాగ్లో నా పర్స్ పోయినట్టు ,చేతికున్న ఉంగరమో మెళ్ళో గొలుసో మాయమైనట్టు పిచ్చి పిచ్చి ఆలోచనలతో పడుకునేసరికి ప్రతి సారి విజయవాడ దాటాల్సిందే!అందుకే దిగేది ఆఖరి స్టేషన్ అయినా మెలకువ వస్తుందో లేదో అని అలారం పెట్టుకుని పడుకుంటాను ఎప్పడూ.అయినా అలారం మోగక ముందే గోదావరి వారసులు కాకినాడ,సామర్లకోట,రాజమండ్రి,నిడదవోలు,తాడేపల్లిగూడెం,ఏలూరు వాసులంతా ఉదయం ఐయిదు గంటలకే దినపత్రికల్లా మారిపోతారు కదిలే రైల్లో.అలారం అవసరం లేకుండా!

***                                   ***                                       **                                    ***

“అమ్మా బుజ్జీ! సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసింది” చటుక్కున లేచి కూర్చున్నాను! నిద్రలేపిన అంకుల్ కి “థాంక్స్ అండి” అని చెప్పి బ్యాగ్ తీసుకుని రైలు దిగాను. కూలీలంతా నా తక్కువ లగేజిని చూసి నిరుత్సాహంగా తప్పుకుంటూ నాకు దారిచ్చారు.మళ్ళీ రాత్రి బండికి ప్రయాణం కావడంచేత చిన్న బ్యాగే కాబట్టి చక చకా మెట్లెక్కి ఒకటో నెంబర్ ప్లాట్ఫారం వైపునుండి స్టేషన్ బయటకొచ్చి ఆల్ఫా హోటల్లో ఛాయ్ తాగి ఆటో మాట్లాడుకుని విద్యానగర్ లోని మా బాబాయ్ ఇంటికి చేరుకున్నాను. ఆ వీధి పిల్లలంతా రకరకాల స్కూల్ యూనిఫోర్మ్స్ లో ఆటోల్లో,బస్సుల్లో,ద్విచక్రవాహనాల్లో హడావిడిగా పాటశాలలకి బయల్దేరుతున్నారు.గుమ్మం దగ్గరే పిన్నీ బాబాయ్ నాకోసం ఎదురుచూస్తున్నారు.

“మంచిగున్నవా బేటా?” అంటూ నా తల మీద చేత్తో నిమురుతూ ఆశీర్వదించాడు మా బాబాయి.

“బావున్నాను బాబాయి,ఎలా ఉన్నావ్ పిన్ని?”

“మంచిగున్నా బిడ్డా!” ఆప్యాయంగా కౌగిలించుకుని లోనికి ఆహ్వానించింది పిన్ని.లోపలికి వెళ్లి కుర్చీలో కూర్చుంటూ వేసిన నా మొదటి ప్రశ్న “పిన్నీ!బిట్టు ఎక్కడ?”

“అగో!సానం జేస్సున్నడమ్మా!ఇయ్యాల్తోని ఇస్కూల్ ఖతమైతదని జెప్పిండు.పరీక్ష అయితే మంచిగ రాయాలె గదమ్మ!గది తెలుస్తలేదు బద్మాష్ గాన్కి. ‘రేపక్కొస్తది రాజమండ్రి పోవాలె!’ దినాం గిదే లొల్లి!” వేడి వేడి చాయ్ ఇస్తూ సహనజంగానే కటువుగా ఉండే స్వరం తో సమాధానమిచ్చింది పిన్ని.

“చిట్టీ!ఉస్మానియా బిస్కెట్లు తింటవా అమ్మ?” చేతికందిస్తూ అడిగింది పిన్ని.

“వద్దు పిన్నీ!తర్వాత తింటాను”

“ఏందమ్మా?అంతా పరాయోల్ల లెక్క జేస్తవు! మీ నాయన గోర్నమెంట్ జాబ్ వచ్చిందని హైద్రవాద్ ని , మా అందర్నీ ఒద్లి పెట్టి పొయ్యిండు.నువ్ జూస్తె మొత్తం ఆంధ్రోల్ల లెక్కనే పెరిగినవ్!గిది నీ ఇల్లు బేటే!గా బిట్టు గాడు నీ తర్వతనే గద!నువ్వే నా పెద్ద బిడ్డవి!తిను మంచిగ తిను” అంటూ బిస్కెట్లు నా నోట్లో పెట్టబోయాడు బాబాయి.ఎన్ని ఏళ్ళు గడిచినా చిన్నప్పుడు ఎత్తుకుపెంచిన మమకారం ఏ మాత్రం తగ్గలేదు బాబాయికి.

“బాబాయి!నేనింకా బ్రష్ చేయలేదు” ఆయన చెయ్యినెడుతూ అన్నాను.

“ఆ!చాల్ చెయ్యిగ!మొకం కడగకుండ ఛాయ్ తాగినవ్ బిస్కెట్లు తింటె ఏమైతది …”బాబాయ్ మాట ఇంకా పూర్తికానేలేదు.

“అక్కా!ఎప్పుడొచ్చినవే?” అరడజను ఇళ్ళకి వినబడేలా అరుచుకుంటూ వచ్చాడు బిట్టు.

“ఇందాకే రా! బావున్నావా?” వాడి బూరెల్లాంటి బుగ్గలు నొక్కుతూ అడిగాను.

రెండు చేతులూ జోడించి “ఆ బాగున్నమండి!మీరు బాగున్నారా అండి?పెద్దమ్మ పెద్నాన్న బాగున్నారా అండి?” కళ్ళు రెప రెపలాడిస్తూ నా యాసని అనుకరిస్తూ ముద్దు ముద్దుగా అడిగాడు.

“చాల్లేరా!వెళ్లి రెడీ అవ్వు!టైం అవుతున్నట్టుంది” అన్నాను గడియారం చూస్తూ.వాడు మళ్ళీ లోపలికి పరుగుతీసి ఒక్క క్షణంలో వచ్చాడు.

“అక్కా! ఇగో దోష తిన్పియ్యే!” అంటూ ప్లేటు నా చేతిలో పెట్టాడు. వాడు నేనున్నన్ని రోజులు మూడేళ్ళ బాలుడైపోతాడు.నా కోసం స్కూల్ మానేస్తాడు.ఏడాదంతా జరిగిన విషయాలు చెప్తాడు.అన్నం నేనే తినిపించాలంటాడు.నాకేం కావాలన్నా చేసిపెడతాడు.బహుశా ఇద్దరం ఏక సంతానం కావడం వల్లనేమో అంత అనురాగం!ఇవన్నీ ఆలోచిస్తూ బిట్టు మాటలు వింటూ దోశలు తినిపించేశాను.ప్లేటు పిన్ని చేతికిచ్చి చేతులు కడిగాను.

“అక్కా! జల్ది రా!స్కూల్ టైం అయితుంది.” పిన్ని వాడే స్కూటీ తాళాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బిట్టు.పిన్ని చూడనే చూసింది.

“ఒరె వారీ!ఏం రా?నఖ్రాలు షురు జేష్ణావ్ మల్లా?రాత్రికి వోతున్నావ్ గద రా!ఇంకేంది?సప్పుడు జెయ్యకుండ పొయ్యి ఇస్కూల్ బస్ ల కూసో!”పిన్ని కాస్త కోపంగానే అంది.

“ఐమె అట్లనె అంటది నువ్ రా!” నా చేయి లాగాడు బిట్టు.

పిన్ని మొహం ఎర్రబడింది!పెను ప్రమాదం ముంచెత్తనుందని అర్ధమైంది బిట్టుకి.వెంటనే ముఖం మాడ్చుకుని నాకు ‘టాటా’ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు.నేనూ వాడికి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పలేకపోయాను పిన్ని ధాటికి జడిసి! నేను ప్రయాణం చేసొచ్చి కనీసం స్నానాలు జపాలు చెయ్యకుండా స్కూల్ కి దింపే పని పెట్టడం పిన్నికి ఇష్టం లేదని నాకూ తెలుసు!!

***                                    ***                                     ***                                   ****

“’అ’ కారానికి ఇ,ఉ,ఋ లు అనేటివి పరమైనప్పుడు వాటికి క్రమంగ ఎ,ఒ,అర్ లు ఒస్తై!గిది గున సందైతది! ఉదాహర్నకు ఉషోదయము- ఉష+ఉదయము!”

బిట్టు క్లాస్ రూమ్ బయటే నిలబడి ఉన్నాను!వాడికి సర్ప్రైస్ ఇద్దామని!ఇవ్వాల్టి సోషల్ పరీక్ష అయిపోయాక ముందు జరిగిన తెలుగు పరీక్ష లో వచ్చిన సందేహాలు తీరుస్తోంది పంతులమ్మ.ఇంతలో బెల్ మోగడంతో ఒక్క సారిగా క్లాస్ రూముల్లోంచి బయటకు దుసుకొచ్చారు పిల్లలంతా…పదులు పదులుగా మొదలై వందలమంది పిల్లలు ఒకే రంగు బట్టలతో సీతాకోకచిలుకల్లా సంతోషంతో పరుగులు పెడుతున్నారు.ఇవాళ ఆఖరి పరీక్ష.రేపట్నుంచీ సెలవులు!ఇక ఎవరాపగలరు ఈ ఉత్తేజాన్ని!!వాళ్ళందరినీ చూస్తూ నా పక్కనే ఉన్న బిట్టు ని గమనించలేకపోయాను!

“రేయ్!ఎప్పుడొచ్చావు రా?” వాడ్ని కిందకి పైకి చూస్తూ అడిగాను.

“ఏందే అంత గనం ఎం జుస్సున్నవ్?ఎప్పుడు జూడలే పొరల్ని?”

“ఆ!చూళ్ళేదు రా!పద వెళదాం”

“కం రే!వి విల్ గో!” వాడు ఇరు వైపులా ఇద్దరి ఫ్రెండ్స్ భుజాల మీద చేతులు వేసి నడక ప్రారంభించాడు.

స్కూల్  బయటకొచ్చి ఆటో ఎక్కాం.బిట్టు వాడి బస్ ఫ్రెండ్స్ అందరికీ రాత్రి రాజమండ్రి వెళ్తున్నట్లు చెప్పి వదల్లేక వదల్లేక వచ్చాడు.దారంతా ఎవేవో ప్రశ్నలు కబుర్లు.వాడి మాటలకు అంతే ఉండదు!

 

***                                    ***                                     ***                                   ****

“గిదేందే తల్లీ! ఇప్పుడే రాజమండ్రిల ఉన్నట్లుంది!”

ట్రైన్ లో జనాల సంభాషణలు వింటూ అడిగాడు బిట్టు.ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ దాటుతుంది.

“హహ్హ! మరి రాజమండ్రికే కద రా రైలెల్లేది.అందరూ గోదావరి జిల్లాల వాళ్ళే ఉంటారు.”

“ఏందో ఏమో!” ఎదురుగా పులిహోర పొట్లం విప్పుకుని తింటున్న పెద్దాయన్ని విచిత్రంగా చూస్తూ అన్నాడు.

టైం పదింపావు  దాటుతుంది.బిట్టు కి నిద్ర రావడం గమనించి వాడి మిడిల్ బెర్త్ మీద బెడ్ షీట్ పరిచి సిద్ధం చేశాను.నాది మళ్ళీ లోయర్ బెర్తే.ఎవరైనా అప్పర్ బెర్త్ వాళ్ళు అడుగుతారేమో అని ఎదురుచూస్తున్నాను.రైలు మెల్లగా ఆగింది.కిటికీలోంచి చూసాను.వరంగల్ స్టేషన్ అది.కిందటి ఏడాది జై తెలంగాణా పోరాటం జరిగినప్పుడు ఇక్కడే అనూహ్యంగా పెద్ద పెద్ద రాళ్ళు కిటికీల్లోంచ్చి చొచ్చుకుపడ్డాయి.అప్పుడు నా పక్కనే కూర్చున్న ఓ మధ్య వయస్కుడి తల పగిలింది!కిటికీ దగ్గరలో కూర్చున్న వాళ్లందరి మీదా కిటికీ అద్దం పెంకులు ముక్కలు ముక్కలుగా పడ్డాయి.చేదు జ్ఞాపకాలను వెనక్కినెడుతూ రైలు ముందుకి కదిలింది.ఇక ఎవరూ రారని నిశ్చయించుకుని అలారం ఐదున్నర కి సెట్ చేసుకుని పడుకున్నాను.

సరిగ్గా నిద్ర పట్టలేదు.ఐదింటికే లేచి కూర్చున్నాను.నా ఎదురు బెర్త్ లో పెద్దాయన “గుడ్ మార్నింగ్”అన్నట్టుగా చిరునవ్వు ఇచ్చాడు.

“ఎక్కడ దిగుతావమ్మ? కాకినాడా?” నేనూ నవ్విన వెంటనే అడిగాడు.

“లేదండి!రాజమండ్రి”

“ఓహో!రాజమండ్రిలో ఎక్కడమ్మా?మా బావమర్ది గారిది కూడా రాజమండ్రే!”

“ఇన్నీసుపేటండి.గూడెం దాటినట్టుందే!”పొగమంచుతో పచ్చని పొలాలు దాటిపోవడం గమనిస్తూ అన్నాను.

“ఆ!దాటిందమ్మ!ఒక్కదానివే వెళ్తున్నావమ్మ?”

“లే!నేను భీ ఒస్సున్న!”పై నుండి జోక్ చేస్తూ అన్నాడు బిట్టు!

“వీడెప్పుడు లేచాడు!?మా తమ్ముడండి!”వాడ్ని చూపిస్తూ అన్నాను ఆయనతో.

రైలు గోదావరి బ్రిడ్జి ఎక్కుతోంది.ఆ మూడ్నిమిషాల హోరు వేరుగా ఉంటుంది.

“అక్కా!ఆ సౌండ్ ఏందే గట్లోస్తుంది ?ఏమైతుంది?” కంగారుగా అన్నాడు బిట్టు.

“తప్పు బాబు!పెద్దవాళ్ళని అలా అమర్యాదగా మాట్లాడకూడదు.అక్క కదా!” కాస్త కళ్ళెర్ర జేసినట్టే అన్నాడు ఆయన.

“ఏమంటుoడే?” అమాయకంగా ముడి పడ్డ భ్రుకుటితో అడిగాడు బిట్టు.

ఫక్కున వచ్చే నవ్వుని పంటి కింద నొక్కి పెట్టి “ఏం లేదు రా!గోదావరి చూద్దువు గాని కిందకి రా” అని పిలిచాను.వాడు కిందకొచ్చి మిడిల్ బెర్త్ కిందకి తీసి కూర్చున్నాడు.నిండు గోదావరిని చూడగానే ఆశ్చర్యంతో కొద్దిగా భయంతో వాడి కళ్ళు పెద్దవైయ్యాయి! రైలు రెండు వైపుల కిటికీల్లోంచి మార్చి మార్చి చూస్తున్నాడు!

“ఏందే ఇంత గనం నీలు!!ఏడికెల్లోచ్చినయే తల్లీ!”

ఎదురుగా ఉన్న పెద్దాయన గుప్పిట్లో చిల్లర పట్టుకుని మనసులో ఎదో స్మరించుకొని నదిలోకి విసిరాడు.

బిట్టు తదేకంగా చూస్తున్నాడు.

“నువ్వు కూడా వేస్తావేంట్రా?అని బ్యాగ్లోంచి రెండు రూపాయల బిళ్ళ తీసిచ్చాను.

“ఏందీ!దిమాక్ గిట్ల ఖరాబైందా?బూమర్ కొన్కుంట ఇక్కడీ!”అంటూ నా చేతిలోంచి బిళ్ళ లాక్కుని వాడి జేబులో పెట్టుకున్నాడు.ఆ పెద్దాయన కి వీడి భాష, చేష్టలు చాలా చిత్రంగా అనిపిస్తున్నాయి. రైలు గోదావరి నది దాటి పుష్కరాల రేవు,శివలింగం దాటి ఊర్లోకి వస్తుంది.అక్కడనుంచే మా ఇంటికి దారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను బిట్టు కి.గోదావరి స్టేషన్ దాటింది.రాజమండ్రి రాగానే దిగి బయటకు వచ్చాం.బిట్టు అంతా పరిశీలిస్తున్నాడు.

“అక్కా! ఈడ స్టేషన్ ల కూలీలే లేరేంది ?హైదరాబాద్ ల మస్తు మందున్నరు గద!”

“ఇక్కడెక్కువ ఉండరు రా!హైదరాబాద్ కంటే చిన్న ఊరు కదా!”

“ఆయ్!!అలాగండి!హిహ్హిహ్హి” చిలకలా నవ్వాడు బిట్టు.

ఇంతలో ఓ ఆటోడ్రైవర్ వచ్చాడు. “మేడం గారు!ఎక్కడికెళ్లాలండి?”ఎక్కేది ఇద్దరే అని అర్ధం చేసుకుంటూ అడిగాడు.

“దానవాయిపేట”

“ఓ ఎనభై రూపాయిలివ్వండి” బేరం పాట మొదలుపెట్టమన్నట్టుగా అడిగాడు డ్రైవర్.

“వద్దులే వెళ్ళు బాబు” అతడి ఆశల మీద నీళ్ళు చల్లాను.

“ఏమిస్తారో చెప్పండి మేడం గారు”

“యాభై!”

“దానవాయిపేట పక్కనే లేదు కదండీ!మళ్ళీ వెనక్కి ఖాళీగా రావాలి.పోనీ డెబ్బై ఐదు చేస్కోండి మేడం గారు”

వేరే ఆటో రావడం చూసి ఒకవేళ మేం వెళ్లిపోతామేమో అనుకుని మా బ్యాగులు తన ఆటోలో పెట్టేసి

“ఎక్కండమ్మా!డెబ్బై ఇచ్చేయండి” అనేశాడు.

బిట్టు గాడు ఉండడం వల్ల ఎక్కువ వాగ్వాదానికి దిగలేదు.ఎక్కేశాము!ఎక్కిన వెంటనే బిట్టుగాడి మొదటి ప్రశ్న-

“అక్కా!రైల్ల అయినకి పిన్నీసు పేట అని ఏమో చెప్పినవ్ గదనే?”

“హిహ్హి!పిన్నీసు కాదురా ఇన్నీసు పేట!”

“హా!గదే!”

“ఆ!మరి ఇంటి అడ్రస్ ఫోన్ నంబర్ బ్యాంకు ఎకౌంటు నెంబర్ అన్నీ చెప్తారు మరి!”

“మస్తు షానున్నవ్ అక్కా!” భుజం మీద తడుతూ అన్నాడు.

దారి పొడుగునా స్కూల్స్, హాస్పిటల్స్, కరీ పాయింట్లు,బట్టల షాపులు అన్నీ చూస్తున్నాడు.ప్రతిదీ వివరంగా చెప్తున్నా.మాటల్లోనే ఇల్లోచేసింది.ఆటో దిగి అరవై రూపాయలిచ్చాను.డ్రైవర్ ఖంగు తిన్నాడు.

“ఏంటండీ! మేడంగారు?డెబ్బై అన్నారు కదా!”

“నేనెక్కడన్నాను?” కళ్ళెగరేస్తూ అన్నాను.

“సరే ఇంకో పదన్నాఇవ్వండి” నిట్టూర్చాడు.

పది రూపాయలిచ్చి ఇంకో పది గెలిచానన్న గర్వంతో లోపలికి నడిచాను బిట్టుతో పాటు.

***                                    ***                                     ***                                   ****

సాయంత్రం ఐదున్నర కావస్తోంది.బిట్టుని వెనుక కూర్చోబెట్టుకుని నా స్కూటీ పై గౌతమి ఘాట్ కు తీసుకువెళ్తున్నా.తక్కువ జనం,కాలుష్యం లేని గాలి,ప్రశాంతమైన రోడ్లు,పెంకుటిళ్ళు,స్త్రీలు,యువతులు చీరలు సల్వార్ కమీజ్ ల్లోనే కనబడడం,ప్రతి వీధిలో ఓ పిడత కింద పప్పు బండి,చిలక జ్యోతిష్యం,కాషాయ వస్త్రాలలో విదేశి భక్తులు,సాధువులు అన్నిటినీ చూస్తున్నాడు బిట్టు.ముఖ్యంగా గోదావరి మాటల్ని!వచ్చేటప్పుడు అమ్మ కొబ్బరన్నం చేయడానికి కొబ్బరికాయ,పచ్చిమిర్చి,కర్వేపాకు ఇంకా ఏవో చెప్పింది.దార్లో కనిపిస్తాయేమో అని పక్కన చూసుకుంటూ వెళ్ళడం వల్ల ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ ని గుద్దేసాను!రెండు బళ్ళకి ఏమి కాలేదు కాని నా గుండె కొట్టుకోవడం ఒక్క క్షణం ఆగినట్టైంది.

“ఓయ్!ఏం వా?కండ్లు కన్పిస్తలేవా?సీద ఒచ్చి మా బండిని గుద్దినవ్!?మా అక్కకి దెబ్బ తాకితే ఏం జెయ్యాలే?”బండి దిగి మోటార్ బైక్ పై ఉన్న సుమారు పద్దెనిమిదేళ్ళ అబ్బాయి మీద విరుచుకుపడ్డాడు బిట్టు గాడు.

“భలేటోరే!నేను కాదండీ ఆవిడే చూస్కోకుండా నా బండికి డాష్ ఇచ్చారు.”యదార్ధంగా చెప్పాడు ఆ అబ్బాయి.

నేను వద్దని వారిస్తున్నా వినకుండా నోరు పారేసుకుంటున్నాడు బిట్టు.

“బాబు!నువ్వెళ్ళమ్మా!నేనే చూస్కోలేదు” సర్ది చెప్పి ఆ అబ్బాయిని పంపేసాను.

“అరే!ఏందక్క అట్లా జేష్నవూ!?గిదే మన హైదరాబాద్ ల అయితే పోలిసోల్తోని మెత్తగ్గొట్టిపిస్తుండే!ఈడ ఓలు కన్పిస్తనేలేరు!”

“సర్లే రా!” వాడి మాటలు పట్టించుకోలేదు నేను.

ఎదురుగా రామాలయం బైట కొబ్బరికాయలు కనబడుతున్నాయి.ఇద్దరం వెళ్లి కొబ్బరికాయలు కొనుక్కుని బండి మీద ముందుకి సాగాం. ‘ఇదిగో భద్రాద్రి…గౌతమి అదిగో చూడండి…ముదముతో సీతా ముదిత లక్ష్మణులు…’ వెళ్ళే కొద్దీ పాట సన్నగా వినిపిస్తూ వాహనాల శబ్దాలో మాయమైంది.

గోదావరి గట్టు ముందు రోడ్ పక్కకు బండి పార్క్ చేసి ఒక ఇరవై మెట్లు దిగి స్టీమ్ బోటు ఎక్కాం.బిట్టు కి మాటలు రావడం లేదు.అంత పెద్ద నది,పడవల్లోంచి పెద్ద పెద్ద వలలు చేపల వేటకు విస్తారంగా పరుచుకుంటున్నాయి.అందంగా సూర్యాస్తమం!నీళ్ళలో బోటు షికారు…ఎదురుగా రోడ్ కం రైల్వే బ్రిడ్జి లో పైన లారీలు,బస్ లు,స్కూటర్లు,సైకిళ్ళు, కింద రైళ్ళు తిరగడం ఆ కింద నీళ్ళలో పడవలు..ఒకేసారి మూడు వేర్వేరు రవాణా సాధనాలని చూసి ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు బిట్టు.

“ఏమన్న ఉన్నదా అక్క!మమ్మొస్తే పరెషానైతది మీ గోదావరి జూషి!ఖతర్నాక్ ఉంది” వాడి కళ్ళు బ్రిడ్జి ని నది ని తప్ప దేన్నీ చూడనంటున్నాయి.గోదావరి కి ‘టాటా’ చెప్పేసి ఇంటికి బయల్దేరాం.దార్లో పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకోవాలని మాత్రం మర్చిపోలేదు నేను!సగం దూరం వెళ్ళాక రోడ్డుకి అవతల వైపు ఒక ముసలమ్మ బుట్టలో కొన్ని ఆక్కూరలు,మిర్చి,నిమ్మకాయలు అమ్మడం చూసి బండి ఆపాను.

బిట్టు గాడు బండి దిగి “నువ్వీడనే ఉండక్కా!నేను పొయ్యి తెస్సా” అంటే చేతికి పది రూపాయలిచ్చి “ఐదు రూపాయలకి పచ్చిమిర్చి,ఐదు రూపాయలకి కొత్తిమీర” అని చెప్పాను.

వాడు జాగ్రతగా డివైడర్ దాటి ఆ ముసలమ్మ దగ్గరకు వెళ్ళాడు.

“ఓ అవ్వ!ఐదు రూపాల్ మిర్పకాయలు ఇంకా ఐదు రూపాల్ కోత్మీరియ్యి!”

“ఏటి బాబు?”ఈ భూమ్మీద ఎప్పుడూ వినని మాటలు విన్నట్టు అయోమయంగా అడిగిందామె.

రోడ్డు చిన్నదే అవడంతో వారి సంభాషణ కొద్దో గొప్పో వినబడుతునే ఉంది.బిట్టు అప్పటికే నాలుగైదు సార్లు చెప్పినా ఆమెకు అర్ధం కాలేదు.ఇక ఇది అయ్యేపని కాదని నేనే రంగంలోకి దిగాను.

“ఐదు రూపాయలకి పచ్చిమిర్చి,ఐదు రూపాయలకి కొత్తిమీర ఇవ్వమ్మా” అన్నాను వెళ్లి.

“ఆహా!మిరపకాయలమ్మా!!ఈ బాబు మాటాడేది ఏటి బుర్రకెక్కలేదమ్మా!”అమాయకపు నవ్వుతో అంది ముసలమ్మ.

***                                    ***                                     ***                                   ****

పది పదిహేను రోజులు బిట్టుకి కడియం పూల తోటలు,ధవళేశ్వరం కాటన్ బ్యారేజి,గౌరిపట్నం చర్చి,పాపికొండలు,పట్టిసీమ,కోరుకొండ,రాజమండ్రి ఎయిర్ పోర్ట్,మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియా అక్కడి బొంగు చికెన్,అంతర్వేదిలో నది సముద్రంలో కలిసే ప్రాంతం,ఆత్రేయపురం పూతరేకులు,మడత కాజా,కాకినాడ కాజా,రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ స్పెషల్ రోజ్ మిల్క్ దాదాపు అన్నీ రుచులు తినిపించాను.చుట్టు పక్కల ప్రాంతాలు అన్నీ చూపించాను.పదిహేను రోజులు నిర్విరామంగా గడిపాం. వాడి ఫోన్ కెమెరాకు విశ్రాంతి లేదు!వాడి ఆనందానికి అవధుల్లేవు!కాని ఇంతలోనే వాళ్ళమ్మ ఫోన్ తో నీరుగారిపోయాం.టెన్త్ సమ్మర్  స్పెషల్ క్లాసెస్ మొదలవుతున్నాయి రమ్మని!

బిట్టు గాడి కంటే నాకెక్కువ బాధగా ఉంది.ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా గడిపాం.ఒకే తల్లికి పుట్టకపోయిన ఒకే వృక్షానికి కాసిన కాయలం కదా! ప్రాంతాలు వేరైనా,దూరం అడ్డున్నా వాడు నా ఒక్కగానొక్క తెలంగాణా తమ్ముడు. వాడి తండ్రిదీ నా తండ్రిదీ ఒకే రక్తం!ఇంకొన్ని రోజులు ఉంటాడేమో అనుకున్నాను.ఇంత త్వరగా వెళ్లిపోతాడనుకోలేదు!వాడ్ని పంపిచాలని లేదు!కానీ ఇది వాడి భవిష్యత్తుకి అభివృద్ధికి ముఖ్యమైన దిశ!వాడు వెళ్ళాలి.ఎదగాలి!కష్టపడాలి!ఎన్నో మెట్లు ఎక్కాలి!ఎన్నో విజయాలు చూడాలి.వాడిప్పుడే పదవ తరగతిలో అడుగుపెడుతున్నాడు.ఇంకా చదవాల్సింది ఎంతో ఉంది!జీవితం లో చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి!తప్పటడుగులు వేయడనే ఆశిస్తున్నాను.వేలు పట్టి నడిపించడానికి ఈ అక్క ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్న భరోసా ఇచ్చి బిట్టుగాడ్ని మొదటిసారి ఒంటరిగా రైలెక్కించి వాడి ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటూ కన్నీళ్ళతో నా ఇంటికి నేను వెళ్ళిపోయాను.

– మానస ఎండ్లూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలు, తొలి కథ, , , , , , , , , , , , , , , , , , , Permalink

33 Responses to గౌతమి (కథ) – మానస ఎండ్లూరి

 1. G.venkatakrishna says:

  కథ బాగుంది అనేకంటే , హృద్యంగా ఉంది అనాలి .మాండలికాన్ని పట్టుకోవడంలో ,సున్నితంగా వైరుధ్యాల్ని చెప్పడంలో పరిణితి కన్పిస్తుంది .అభినందనలు మానసా .

 2. యువ రచయిత్రి ఒక చక్కని కథాంశం తీసుకుని సమన్వయంతో కథనల్లడం బావుంది. మానసా! తెలుగువారి మనసు తెలిపేలాంటి కథ రాసినందుకు అభినందనలు!

 3. Uma says:

  మానసా, తెలగాణా యాస బానే ఉంది. తూగోజి కూడా.
  ఆయితే, తెలంగాణా యాస ఉన్న ప్రతి పాత్రనూ ఐ క్యూ తక్కువగా ఉన్నవాళ్ళ తీరుగ చిత్రించని కథ ఇంతవరకు చదవలేదు. ఇదొక misinterpretation … ఎందుకో కథలూ సినిమాలు ఈ విధంగ పొరపాటు పడుతున్నయి. అమ్మల్లారా, అయ్యల్లార, ఒక్కసారి మన అభిప్రాయం మూసల బోసినట్టు గాకుండ మనసిప్పి రాస్తె యెట్లుంటదంటరు?
  అదే మరి! లైట్ లో జీ!
  ఉమా

 4. Wilson Sudhakar says:

  బాగుంది
  కధకురాలి ప్రతిభ కనబడుతోంది.కంగ్రాట్స్ Manasa.

 5. satya says:

  Nice

 6. Ravi Prakash Nallagonda says:

  చిరంజీవి మానస,
  అభినందనలు. మా ఆత్మీయులు, సహృదయులు, నా అభిమాని శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారి కుమార్తె రచన ఈరోజు చదివీ అవకాశం సంతోషాన్ని కలిగించింది. మట్టివాసన, గోదావరి జలాల కమ్మదనము రచనలో కనపడింది. చాలా సంతోషంగా వుంది. ఈ ఒరవడి కొనసాగాలని కోరుకుంటూ….
  రవిప్రకాష్ 9440596966, రాజమండ్రి.

 7. akbar mohammad says:

  కథ బావుంది

  ………………..

 8. jagaddhatri says:

  డియర్ మానస ! కథ సింబాలిక్ గా చాల బాగా రాసావమ్మా…ముఖ్యంగా ఆఖరి వాక్యాలు ….చాలా మంచివి రాయగలవు ఇంకా ఇంకా రాయి …ప్రేమతో జగద్ధాత్రిరామతీర్థ

 9. Atchuth says:

  ఈ రోజే నేను అనుకోనుండా ఈ వెబ్ సైట్ పత్రికను చూసి , మానస గారి కధ చదివాను , చాలా హాయి అనిపించింది . తల్లడిల్లుతున్న తెలుగు హృదయాలకు ఇలాంటి కధలే ఊరట. మానస గారి భాషా పరిజ్ఞానం బాగుంది . అభినందనలతో ..అచ్యుత్ ..ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు విజయనగరం \ హైదరాబాద్

 10. Atchuth says:

  ఈ రోజే అనుకోకుండా ఈ ప‌త్రిక సైట్‌,ఆపై మాన‌స గారి క‌ధ చ‌దివాను. చాలా హాయి అనిపించింది. త‌ల్ల‌డిల్లుతున్న తెలుగు హృద‌యాలకు ఇలాంటి క‌ధ‌లే ఊర‌ట‌. అభినంద‌న‌లు….అచ్యుత్‌..ఇండియ‌న్ జ‌ర్న‌ల‌స్ట్స్ యూనియ‌న్ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, విజ‌య‌న‌గరం/ హైద‌రాబాద్‌

 11. kalyani says:

  చాలా బాగుంది కథ.,

 12. arjunarao bontha says:

  మానస,
  కధ బాగుంది. అనుబందాలకు ప్రాంతాలు , భాషలు అడ్డుకాదని ఆత్మీయతలు అనురాగాలు mukhyamani చెప్పడం baagundi. అల్ ది బెస్ట్ మానస.
  అర్జునన్నయ్య
  గుంటూరు.

 13. అమ్మ!నువ్ రాసిన కథ బాగుంది ,కథను చెప్పిన విధానం ఇంకా బావుంది. రెండు భాష-యాసల పట్ల నీకు వున్నమక్కువ చక్కని సన్నీ వేషాలను
  సృష్టించ గలిగింది. రాజమండ్రిని-పరిసర ప్రాంతాలను బాగా పరిశీలించి ఉన్నందున కళ్ళకు కట్టినట్టు చిత్రించ గలిగావు. పెద్దవాళ్ళు రాసిన కథలు
  బాగా చదువు.మరిన్ని పదునయిన ,పుష్టికరమయిన కథలు రాయగాలుగుతావు .
  అభినందనలతో,
  డా. కె. ఎల్. వి. ప్రసాద్ ,
  హనంకొండ-4
  8886991784

 14. deepak says:

  బిట్టు చాల బాగున్నది …మల్లి ఇంకోసారి రాజమండ్రిలో తిరిగినట్టు ఉంది

 15. sirisha says:

  చాల బాగుంది… Characters చాల బాగున్నై… ఇరు భాషల గొప్పతనం చాల బాగా చెప్పావు… బిట్టు నువ్వు సూపర్… ఇంకా ఇలాంటివి రాసి మాకు పంపించు… అల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మానస…

 16. manasa yendluri says:

  అందరికి పేరుపేరునా ధన్యవాదాలు.మీ ఆశీస్సులు ముందు ముందు నాకధలకి స్పూర్తినిస్తాయి.thank you very very much.

  • desmond christopher says:

   యువర్ స్టొరీ ఇస్ సింపుల్ అండ్ నైస్. ది affection between బ్రదర్ అండ్ సిస్టర్ nerrated వెల్. త్వో రీజినల్ languages are గుడ్. మై నేమ్ ఇస్ డెస్మండ్ క్రిస్టోఫర్,christian కథలు అండ్ డ్రామా అండ్ సాంగ్స్ రైటర్ అండ్ వర్కింగ్ as ఎడిటర్ జువేట్ విజయన్ patrika మంత్లీ జువేట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఒంగోలు .సుధాకర్ గారికి friendని కూడా. మా పత్రికకు వీలైతే ఓ చిన్ని కథ రాసి పంపమ్మ

 17. Pothuraju; Lecturer(Rtd) says:

  కధలోని కాన్సెప్ట్ బాగుంది.తలచుకుంటే చాలా బాధగా వుంటుంది .మన అన్నల్నో ,చెల్లినో ఎవరో కిడ్నాప్ చేసినట్లు,ఇక ఎప్పుడూ కనపడరు అన్నట్లుగా వుంది .మంచి కధను అందించినందుకు అభినందనలు

 18. Beautiful మానసా,కొన్ని కోట్లతెలుగు వారి గుండెల్లో బాధ ని చాలా చక్కగా ,అది నీదిగా చేసుకుని యెంత బాగా వ్యక్తపరచావో! Hatsoff తల్లి.

 19. Suresh Kumar Digumarthi says:

  బావుంది మానస. కధనం చాలా నచ్చింది. చదువుతున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. ఎందరో అనుభవాల్ని గుండెకు హత్తుకునేలా రాసిన మీకు మా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.

 20. vijay kumar p says:

  ఒకే వృక్షానికి కాసిన కాయల ట్రావెలోగ్ లో
  గౌతమీ లో ప్రయాణం, రాజధాని కీ రాజమండ్రి కి తేడా కళ్ళకు కట్టావు

  కథ ను నదిపినవ్ బిడ్డ

  గిట్ల మస్త్ గా కధల్రాయాలే

  • vijay kumar p says:

   ఒకే వృక్షానికి కాసిన కాయల ట్రావెలోగ్ లో
   గౌతమీ లో ప్రయాణం, రాజధాని కీ రాజమండ్రి కి తేడా కళ్ళకు కట్టావు
   కథ ను కథ ను మంచిగ నడిపినవ్ బిడ్డ
   గిట్ల మస్త్ గా కధల్రాయాలే

 21. కధ బాగుంది . కంగ్రాట్స్ మానస.

 22. mercy margaret says:

  బాగుంది మానస best wishes …
  .. విడిపోయిన రాష్ట్రాల నేపద్యం లో ఇంకా చాల కధా వస్తువులు దొరికే అవకాశం ఉంది కదా ..
  hope you will write more and more..
  keep writing

 23. vijaya bhanu kote says:

  చాలా బాగా రాసావ్ మానసా….కీప్ గోయింగ్ 🙂

 24. Marlapudi Vara Prasad Rao says:

  మానస మనస్సు ద్వారా తెలుగు ఇంటి ఆడపడుచు మనస్సుని ఇలా ప్రాక్టికల్ గా చూపించావు. యు అర్ గ్రేట్!!!

 25. nani says:

  కథ చాల బాగుంది..నా ముందే జరుగుతునట్టుంది..చాల అంటే చాల బాగుంది..
  ప్రేమలు,ఆప్యాతలు,మర్యాదలూ,మన తెలుగు వారికే సొంతం మరి ముక్యంగా మన అందమైన గోదావరి జిల్లాల వాళ్ళకే సొంతం..
  తెలుగు వారిగా గర్విద్దాం..

 26. Krishna Veni Chari says:

  కథా, కథనం -చాలా బాగున్నాయి

 27. devi says:

  హాయ్ మను చాల బాగుందే . కుష్వంత్ సింగ్ ‘ట్రైన్ టు పాకిస్తాన్’ గుర్తొచింది .

 28. vedvyas says:

  అరె ఏం రాసినవ్ బిడ్డా ! మస్తుగున్నది కథ. ఈ బాబాయ్ దిల్కుష్ జేసినవ్ తీ. కవితల్ గూడ మంచిగా రాస్తవ్లె. కవితల్ని ఇడిసిపేట్టకు. నాయన లెక్క అ దరగోట్టా లే, ఏం బిడ్డా ? పులి కడుపున ఏం పుట్డతో మాకు మంచిగా ఎరికనే. సెహబాస్ బిడ్డా……మంచిగా గిట్లనే రాస్తుండు. కథ కి మంచిగా మాచింగ్ అయినట్లు …….ట్రైన్ ల కిటికీ పక్కనే కూసున్నట్లు ( సింగల్ సీట్ల ) పిక్ ( ఫోటో ) పెట్టుంటే మరింత మంచిగుండెదెమొ జరా సోమ్చాయించు.

  ఆల్ ది వెరీ బెస్ట్

  బాబాయ్

 29. n v p s s lakshmi says:

  ఎ గూటి చిలుక ఆ పలుకే పలుకుతుందట..! చాల బాగుంది ఈ కథా గానం, గమనం, చాలా రోజుల తరువాత సొంతూరు వఛినట్టు ఉంది. చిట్టి మానసకి అభినందనలు. ఎన్.వి.పి.ఎస్.ఎస్.లక్ష్మి. (పద్మ), రాజమండ్రి.

 30. n v p s s lakshmi says:

  మన రాజమండ్రి అమ్మాయి రాసిన మన ఇరు రాష్ట్రాల అక్క తమ్ముళ్ళ కథ. తప్పక చదవండి.

  ఎ గూటి చిలుక ఆ పలుకే పలుకుతుందట..! చాల బాగుంది ఈ కథా గానం, గమనం, చాలా రోజుల తరువాత సొంతూరు వఛినట్టు ఉంది. చిట్టి మానసకి అభినందనలు. ఎన్.వి.పి.ఎస్.ఎస్.లక్ష్మి. (పద్మ), రాజమండ్రి.

 31. ఇంద్రసేనా says:

  తెలుగువాళ్లు రెండు రాష్ర్టాలుగా విడిపోయినా.. తొబుట్టువులే అనే ఆత్మీయ అనుబంధాన్ని చాటిచెప్పిన కథ ఇది.
  రచయిత్రి మానసగారికి అభినందనలు.
  కేవలం ప్రయాణాన్ని ఆధారం చేసుకొని, ఆ ప్రయాణంలో ఎన్నో విషయాలను బలంగా చిత్రించారు. ఇలా రెండు రాష్ర్టాలతో అనుబంధం ఉన్నవాళ్లకి ఎన్నో తీపిగుర్తులను మిగులుస్తుంది ఈ కథ.
  ఇకపోతే…
  భాష విషయంలో చాలా సహజాతి సహజంగా రాయగలిగారు రచయిత్రి. అటు కోస్తా భాష పట్ల, ఇటు తెలంగాణ భాష పట్ల పట్టు ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. అయితే తెలంగాణ భాష అంటే సినిమాల్లో రౌడీలకు పెట్టేది కాదు. ఈ కథలోనే చల్లగా ఉండు అని బెర్త్‌ సాయం పొందిన ముసలావిడ మాటల్లో మాదిరిగానే ఇక్కడ కూడా సల్లగుండు బిడ్డా అనే అంటారు. ఆ తేడాను సరిగానే గుర్తించినందుకు రచయిత్రిగారికి మరోసారి అభినందనలు.
  తెలుగుసాహిత్యం గర్వించతగ్గ ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్‌ గారు అనేక సందర్భాల్లో చెప్పినట్టు ”శ్రీకాకుళం నుండి సికిందరాబాద్‌ వరకు మనమంతా ఒక్కటే…” ఆయన విశాల భావాలను పుణికిపుచ్చుకున్న వారసురాలిగా మానసగారు నిరూపించుకున్నారు. ఇలాగే మరెన్నో మంచి రచనలు చేయాలి, చేస్తారని విశ్వసిస్తూ..
  -ఇంద్రసేనా, హైదరాబాద్‌‌