ఇండియాలో దాగిన హిందుస్థాన్‌- ` పెరి అండర్సన్‌

Hema venkat rau

Hema venkat rau

జీవనరేఖ అంచున నిలిచి జీవితాన్ని పునఃసమీక్షించుకునే వేళ మనకు తెలుస్తుంది. ఎక్కడ నిలబడిపోయామో ఏ నిస్తేజం మనల్ని ఆవహించిందోనని. కనుమరుగైన సందర్భాలలో మనల్ని మనం వెతుక్కుంటూ మళ్ళీ మళ్ళీ పుంజుకుంటూ మానవ సంబంధాల వరవడిలో ఒంటరితనాన్ని తోడుతీసుకెళుతూ… అదో స్త్రీ జీవనక్రమంగా మారింది. జీవితంలో మనం కోల్పోయిన వాటికంటే మనల్ని హత్తుకున్న సంఘటనలు వ్యాపకాలు మనం పునర్మించుకోవటంలో ప్రధానపాత్ర వహిస్తాయి. అందులో వివిధ సాహిత్య ప్రక్రియలు, రచనా వ్యాసాంగం మనల్ని సేదతీర్చే అద్భుత క్షేత్రాలు. నాకూ అంతే… కాని కదలాడే ప్రతికదలికు, చలింపచేసే ప్రతి చలనాన్కి ప్రాణం పోయడం కత్తిమీద సామే. మొన్నెప్పుడో ఎడిటర్‌ పుట్ల హేమలత మాట్లాడుతూ నిరంతర అధ్యయనమే కాదు అందుకు సహకరించిన తాత్వికతను, దృక్పధాన్ని విసృతపరచి పదనుపెట్టే సాహిత్యాన్ని అందరితో పంచుకోవడం మరింత రిలాక్సింగ్‌ ప్రక్రియ కదా అంటే నిజమే అంటూ మళ్లి ఒకసారి రియలైజేషన్‌.

అందులోనూ ప్రత్యామ్నాయ సంస్కృతికి, అంతిమంగా మానవ సంబంధాలలోని మార్పుకు సాహిత్యం ఓ పనిముట్టుగా ఉపయోగపడుతుందనే భావన మరోసారి ఉత్తేజితురాల్ని చేసింది. ఆ క్రమంలో ఆగిపోయిన పుస్తక పరిచయం వైపు దృష్టి మళ్ళింది. చైతన్యం, అవగాహన, దృక్పధం పెనవేసి వ్యవస్థ మార్పులో ప్రధానపాత్ర వహించే సాహిత్యం పట్ల ఎప్పుడూ ఆసక్తిని చూపే విహంగలో 2013 సంత్సరంలో నేను ‘పుస్తకపరిచయం’ మొదలెట్టి మధ్యలో ఆపివేయడం జరిగింది. మళ్ళి ఒకసారి ఆప్యాయతతో నన్ను తట్టి లేపిన ఆత్మీయ దోస్త్‌ ఎడిటర్‌ పుట్ల హేమలతకు కృతజ్ఞతలు తెలియచేస్తూ…. పాఠకులను యిన్నాళ్ళు పలకరించనందుకు మన్నింపు కోరుతు… మీ ముందుకు మరోసారి మీ హేమా వెంకట్రావ్‌!

IndialoDaginaHindusthan600విహాంగలో పుస్తక పరిచయం లేదా సమీక్ష అనగానే స్త్రీ జీవితానికో లేదా స్త్రీ ఉద్యమాల సంబంధిత పుస్తక పరిచయం లేదా సమీక్షించటం రివాజు. కాని వాటికి తోడుగా సమకాలిన అంశాలు వాటిలోని ప్రాపంచిన దృక్పదం మన స్త్రీ సంబంధిత తాత్వికతను మరింత విశాలపరుచుకొనుటకు ఉపయోగపడే పుస్తకాలపై మౌనం వహించడం అనేది సరైన స్పందన అనిపించుకోదు అని నా ఉద్దేశం. ఇతర అల్ప సంఖ్యాక వర్గాలు, దళితులు, స్త్రీలు, ముస్లింలు తదితరులు ఎంతోకాలంగా సందిస్తున్న ప్రశ్నలను అవగాహన చేసుకొని చైతన్యంతో ముందుకెళ్ళటం మనకు ఎంతో అవసరం. అందుకే గత పుస్తక పరిచయాలలో కూడా కేవలం స్త్రీలు, స్త్రీ ఉద్యమాలకు సంబంధించినవే కాకుండా ఇతర పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది. ఆ కోవలోకి చెందినదే ‘‘ఇండియాలో దాగిన హిందుస్థాన్‌’’ పెరి అండర్సన్‌ రాసిన ఈ పుస్తకం.

నేటి భూస్వామ్య విషపు భావజాలానికి వ్యవస్థికృత రూపమైన కాషాయ సంస్థలు మన దేశంలో
ఉన్నయి. చరిత్రలో వలస దోపిడి మొదలు కార్పోరేట్‌ దోపిడి దాకా ప్రతి సంక్షోభకాలంలో సామ్రాజ్యవాదానికి ఈ వర్గాలు ఊడిగం చేస్తున్నాయి. కుల సంబంధాలలోని చలనాలను ఎప్పటికప్పుడు గ్రహిస్తూ సామాజిక సంబంధాలల్లో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకుంటున్నాయి. కులానికైనా, మతానికైనా కుటుంబం కేంద్ర బిందువు, ఆ కుటుంబ వ్యవస్థను త్యాగాలతో నిలబెట్టేది స్త్రీ మూర్తే కాబట్టి నాటి మనువు నుంచి నేటి మోడీ వరకు తమ ఆధిపత్యం కాపాడుకోవడానికి స్త్రీ స్వేచ్చకు తూట్లు పొడిచి మనువాద ముసుగులో ‘జాతి’ అని ‘జాతీయత’ అనే సిద్దాంతాలు ముందుకొస్తున్నాయి. సంస్కరణల నేపధ్యంలో పెట్రేగిపోతూ, కాషాయికరణ చెందుతున్న బ్రాహ్మణీయ పిత్రృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఈనాడు ప్రతి స్త్రీ నడుం బిగియాల్సి వుంటుంది. అందుకు గతం వర్తమానంలో ఉన్న సామాజిక, రాజకీయ ఆధిపత్య నిర్మాణ మూలాలను, భావజాలాన్ని విస్తృతంగా బహిరంగంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ మాసపు విహంగలో ‘ఇండియాలో దాగిన హిందుస్థాన్‌’ పేరి అండర్సన్‌ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.

మన సమాజంలో చెప్పవలసినంతటి హింస, ద్రిగ్బాంతికర అన్యాయాలన్నీ ఎక్కడో చెదురు మదురుగా తారసపడే పెడదోవలే తప్పించి వాస్తవానికి మనది విజయవంతమైన నమూనానే అని గుడ్డిగా కొట్టిపారేయకుండా ఈ పుస్తకంలో అండర్సన్‌ వీటి మూలాలను లోతుగా పరిశీలించారు. మన వ్యవస్థలో ఉన్న తీవ్రమైన నిర్మాణాత్మక లోపాలతో పాటు స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి దశాబ్దాలుగా వ్యవస్థలను నడుపుతున్న వాళ్ళు అనుసరించిన సామాజిక పక్షపాత ధోరణులను, మూలాల్లోనే వేళ్ళనుకుపోయినా వివక్షతను స్పష్టంగా ఎత్తిచూపారు. ముందుగానే మూతి ముడుచుకొని ముఖం తిప్పేసుకోకుండా, మనసులో దురభిప్రాయాలేవి పెట్టుకోకుండా మనం ఈ పుస్తకాన్ని శ్రద్దాశక్తులతో చదవటం చాలా అవసరం అన్ని అరుంధతీరాయ్‌ అన్న మాటలు మనలోని ఉత్సుకతను రేపి పుస్తక పఠనం వైపు మళ్ళిస్తాయి.

భారత మేధావులను అంతగా యిబ్బందికి గురిచేసిన అంశాలు ఈ పుస్తకంలో ఏమున్నాయి? స్వయంగా అండరసన్‌ చెప్పినట్టే ‘‘సమకాలిన భారతదేశ సాంప్రదాయక ఆలోచనలను ఎదిరించే ఐదు రకాల ప్రధానవాదనలను ఈ పుస్తకం ముందుకు తెచ్చింది. మొదటిది ఆరువేల సంవత్సరాల నుంచీ భారత ఉపఖండం ఒకే దేశంగా సమైక్యంగా వుందనడం ఒక అభూత కల్పనంటుంది. రెండోది గాంధీ భారత జాతీయోద్యంలో మతాన్ని ప్రవేశపెట్టడంతో చివరికి అది ఒక విపత్తుగా మారిందని చెబుతుంది. మూడోది దేశ విభజనకు మూలకారణం బ్రిటీష్‌ ప్రభుత్వం కాదు కాంగ్రేసే అసలు దోషి అని నిరూపిస్తుంది. నాలుగోది భారత గణతంత్రాన్ని నెహ్రూ అభిమానులు అంగీకరించిన దానికంటే ఎక్కువగా ఆయన వారసత్వం నష్టపరిచిందని వివరిస్తుంది. చివరగా భారత ప్రజాస్వామ్యం కుల అసమానతతో విభేదించదనీ పైగా దానితో పెనవేసుకుపోయిందని వాదిస్తుంది. (ప్రచురణకర్తల మాట పేజి. 6)
భారత చారిత్రక రాజకీయ వాస్తవాలను అండర్సన్‌ కొన్నింటి గురించి ముందుగా లండన్‌ రివ్యూ ఆఫ్‌ బుక్స్‌లో 2012 వేసవికాలపు మూడు సంచికల్లో పాదసూచికలు లేకుండా చర్చించారు. ఆ చర్చలే ‘త్రీ ఎస్సేస్‌ కలెక్టివ్‌’ వారి చొరవ వల్ల ఈ పుస్తక రూపాన్ని సంతరించుకున్నాయి. కారల్‌ మార్క్స్‌ జర్మన్‌ ఆలోచనా సరళీపై రాసిన తన పుస్తకానికి ది జర్మనీ ఐడియాలజీ అని పేరు పెడితే దానికి అనుసరిస్తూ ఈ పుస్తకానికి ‘ది ఇండియన్‌ ఐడియాలజి’ అన్న పేరు పెట్టారు. అయితే ఈ పుస్తకం భారతదేశంలో వ్యాప్తిలో వున్న ఆలోచనల గురించే కాకుండా వాటికి కారణమైన, వాటిని ప్రతిబించిన, వాటిని వక్రీకరించిన పరిస్థితులనూ, సంఘటనలనూ కూడా చర్చిస్తుంది.

ఇందులో తొలిచర్చ గాంధీ నమ్మకాలపై, ఆచరణపై వుంది. భారత ఉపఖండంలో జరిగిన స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ కేంద్ర బిందువు కాబట్టి ఆ తర్వాత దేశ విభజన గందరగోళం మధ్య బ్రిటీష్‌ వారి నుంచి అధికారం చేతులు మారిన తీరు గురించిన చర్చ. ఇక చివరి చర్చ నెహ్రూ ఆధ్వర్యంలో భారత రాజ్య వ్యవస్థ రూపు దిద్దుకున్న తీరు గురించినది. ఇటీవలి సంవత్సరాలలో భారతీయ ఆలోచనా విధానంలో ఇదే కీలక పాత్రను పోషిస్తుంది. భారత దేశంలో ప్రజాస్వామ్యానికి సామాజిక ‘లంగరు’గా పనిచేస్తున్న దేమిటి? దానిపై ప్రజాస్వామ్య కులం ప్రభావం ఎలా వుంది? భారత యూనియన్‌ మత స్థానమేమిటి? పైకి వ్యవస్థ అని చెప్పుకుంటున్నా అది ఏ మేరకు ఆచరణలో వుంది? దేశ సమగ్రతకు సహజ చిహ్నాలూ వాటికి చెల్లిస్తున్న మూల్యం ఏమిటి? విదేశీ పెత్తనాన్ని వ్యతిరేకంగా సాగిన జాతీయ విముక్తి పోరాటం ముగిసిపోయి అణచివేత అంతర్గత వ్యవహారంగా మారిన తరువాత పై అంశాలు భారత ఆలోచనా విధానం పట్టిచుకోవడం లేదు. లేదా కప్పి పుచ్చుతుంది. తమకు అనుకూలంగా లేని చారిత్రక వాస్తవాలను అణిచివేయడం అనేది భారతదేశంలో ఏ స్థాయిలో వుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధానమీడియా లోనే కాదు భారత మేధోవర్గంలో కూడా అదే ధోరణి విపరీతంగా వుంది రచయిత అంటారు.
అండర్సన్‌ అన్నట్టు ఈనాటి భారతదేశంలో కేవలం జాతీయవాద ఆలోచనా విధానం ఒక్కటే వున్నదని కాదు. అధికార సాధనకోసం హిందూత్వం మరింత తీవ్రమైన జాతీయవాద దృక్పదాన్ని ముందుకు తెస్తుంది. ఆ దృక్పధం పూర్తిగా పురాణాల మీదనో, భ్రమల మీదనో ఆధారపడి రూపొందించింది కాదని స్పష్టం చేయదలుచుకున్నారు. ఆ సిద్దాంతం పేర్కొనే విలువలు కాల్పనికమైతే వాటి ప్రభావం తక్కువగా వుండేది. కాని ఆ విలువలు అప్పుడప్పుడు వాస్తవికతను తమకు కావలసిన రీతిలలో స్వీకరిస్తున్నాయి. ఒక బావజాలంగా మారి స్త్రీ జీవితాన్ని కొన్ని వందల సంవత్సరాలలో వెనక్కి వచ్చే సంస్కృతిని పెంపొందిస్తుంది. ఆ బావజాలం ఒక మానసిక ధోరణిగా తనను విమర్శించే తనతో విభేదించే విభిన్న దృక్పధాలతో సహజీవనం చేయగలదు.

భారతీయ ఆలోచనా విధానానికి ఆలంబన భారతీయ జీవనంలోని ఉదారవాదం ప్రధానంగా వలస పాలన కాలం నుంచి దానిమీద బ్రిటీష్‌ ప్రభావం వుంటూ వచ్చింది. ఇప్పుడు ఆస్థానాన్ని విభిన్న అమెరికన్‌ అంశాలు భర్తీ చేస్తున్నాయి. అయితే సంప్రదాయిక భారతీయ ఆలోచనను కేవలం పైకి కనిపించే లేదా పైకి కనపించని భారతీయ ఉదారవాదంగా భావిస్తే పొరపాటవుతుంది. అది అంతకంటే ఎంతో విస్త్రతమయ్యిందఅటు ఇప్పటి అఫ్ఘనిస్తాన్‌ వరకూ విస్తరించినా ఇటు దక్కన్‌దాటి కిందకు వెళ్ళలేదు. వాటి మధ్య చెప్పుకోదగ్గ రాజకీయ లేదా సాంస్కృతిక సంబంధాలేమీ లేవు. సామాజిక పద్దతులు, కులం, సాంస్కృతిక విధానం కొనసాగేవి కాని అవి ఎప్పుడూ ఒకే విధంగా మాత్రం లేవు. అసలు ‘ఇండియా అన్న భావన’ యూరప్‌ నుంచి సంక్రమించిందే తప్ప స్థానికంగా రూపుదిద్దుకున్నది కాదు. ఆ పేరే ఈ వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది. ఇండియా అన్న పేరు గాని లేదా తత్సమానమైన ఇతర పేరుగానీ ఏ భారతీయ భాషలోనూ కనిపించదు. 16వ శతాబ్దం వరకూ ఇండియా అన్న పదం ఈ ఉపఖండానికి పరాయిదిగానే వుంది. బ్రిటీష్‌ వారు వచ్చినపుడు ఈ ప్రదేశమంతా చిన్నచిన్న రాష్ట్రాలుగా చీలికలు పేలికలుగా వుంది అంటూ ప్రస్తావిస్తారు.

కాంగ్రేస్‌ హిందూ మత ప్రస్థానం గురించి మాట్లాడుతూ బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి బలప్రయోగం ఒక్కటే సరిపోదు. కాబట్టి దానికి తోడు దీనిని సమర్ధించే మద్దతును కూడగట్టుకోవడం కూడా అవసరం. భారత ఉపఖండంలో ఐదింట రెండొంతుల భూభాగాన్ని, ఐదోవంతు జనాభాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం స్థానిక రాజులకు వదిలి వేసింది. ఆ రాజుల్లో అత్యధికులు హిందు మతానికి చెందినవారే. ఆ సామంత రాజులకు, వారి సంపద రక్షణ, పాలనాధికారం బ్రిటీష్‌ వారి ద్వారానే లభించేది. వాళ్ళు తమ క్రింది పాలేర్లను, శ్రామికులనూ దోచుకునేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం వీలుకల్పించేది. వీరి తర్వాత స్థానంలో కొంత వరకూ వ్యాపారస్తులూ, వస్తు ఉత్పత్తి దారులు వస్తారు. కాలక్రమేణా వీరు పారిశ్రామిక బూర్జువాలుగా మారారు. స్థానికంగా సంపన్నులైన విద్యావంతులైన వర్గాన్ని నాగరిక ప్రమాణాలతో సృష్టించాలనేది బ్రిటీష్‌ అధికారిక విధానంగా వుండేది. రెండు తరాలుగా గడిచే సరికి భారతదేశంలో న్యాయవాదులు, పత్రికా విలేఖర్లు, వైద్యులు వంటి వృత్తి నైపుణ్యాలున్న ఒక నూతన వర్గం తయారయ్యింది. ఆ వర్గమే తదనంతరం కాంగ్రేస్‌ పార్టీకి పునాదిగా మారింది. దేశంలో బ్రిటీష్‌ ప్రభుత్వమే సాధారణ మౌలిక సదుపాయాలనూ, న్యాయపరమైన, సాంస్కృతికపరమైన సౌకర్యాలను కల్పించింది. చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని పరిపాలనాపరంగా, సైద్దాంతిక వాస్తవికతపరంగా అదే సంఘటిత పరిచింది. నిజానికి భారతదేశం అనే భావన అధికారంగా స్థిరపడ్డ తరువాత భారత ప్రజలు దీనినే బ్రిటీష్‌ పాలనకూ వ్యతిరేకంగాఉపయోగించుకున్నారు అంటూ మన సంప్రదాయక ఆలోచనా విధానంపై సవాలు చేసి విశ్లేషణతో కూడిన చర్చను లేవదీస్తారు రచయిత.

భారత జాతీయ విముక్తి పోరాటంలో ఎందరో త్యాగాలు చేసి అమరులైనప్పటికి కేవలం గాంధియే ఎందుకు రథసారధిగా గుర్తింపబడ్డారు. జాతిపితగా పిలవబడ్డాడు. నిజానికి యిది సత్యదూరమేనా? వాటి వెనుక వున్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ కోణాల్ని పరిచయం చేస్తారు చాలా లోతుల్లోకి రచయిత పేరి అండర్సన్‌. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆయనను దాదాపు దేవుడి అవతారంగా భావించి ఆరాధించారు. ఇదొక విశిష్టమైన, అర్షణీయమైన అంశంగా అనిపించవచ్చుగాని ఏ జాతీయోద్యమంలోనైనా ఇలాగే జరుగుతుంది. ఆయన భావోద్వేగపరంగా దాదాపు ఒక నిరంకుశడిలాగా వ్యవహరించారు. గాంధీ దృష్టిలో మతం రాజకీయాల కంటే కూడా ఉన్నతమైంది. ఆ రెండిరటి మధ్య ఏకీభావం లేదు. మతమే రాజకీయాలను అనుబంధంగా చేసుకుంది. ఆనాటి పర్యావాసాలకు అతీతంగా ఆయన ఆచరించే మతం విలక్షణమైన రీతిలో తనే స్వయంగా రూపొందించుకున్నది. ఇటు జైన మత ప్రభావంతో కూడిన హిందూ సంప్రదాయాల్లోంచి అటు చివరి విక్టోరియిన హయాం నాటి (1837`1901) ఆత్మ సంవాదం (సైకోమాన్సీ), మేడమ్‌ బ్లావటాస్కి ప్రచారం, దివ్యజ్ఞానం, క్రైస్తవ గ్రంథులు, క్రైస్తవ సన్యాస జీవితం మొదలైన వాటి సమ్మేళన నుంచి గాంధీ విన్యాసాలు రూపు దిద్దుకున్నాయంటారు. కాథరిన్‌ టిడ్రిక్‌ అన్నట్టు తన జీవిత ఏకైక లక్ష్యం మోక్షసాధన అని మోక్షసాధనకు మార్గం తనకు తాను శారీరకంగా హింసించుకోవడం అనే భావన గాంధీది.

గాంధీ తన కులం నిర్దేశించే శాకాహార నియమాలకంటే ఎక్కువగా శరీరాన్ని హింసించుకోవడమే మేలనీ, ఆయా విమోచనానికి ఆహారమే కాదు సెక్స్‌కూడా పెద్ద అడ్డంకి, ప్రమాదకరమని నమ్మేవారు. శారీరక లైంగిక సంబంధం పట్ల గాంధీకున్న తీవ్ర వ్యతిరేకత క్రైస్తవులు పాపభీతి నుండి, హిందువులు మైలపడతామన్న భయం నుంచి రూపు దిద్దుకొంది. వంశాభివృద్ధి కోసం తప్ప దంపతులు సైతం సంభోగంలో పాల్గొనకూడదు. భారతీయులంతా తప్పనిసరిగా లైంగిక సంబంధాలకు దూరంగా వుండాల్సిందే. ప్రస్తుత జాతీయ పరిణామాల క్రమంలో అదొక తాత్కాలిక అనివార్య పరిస్థితి అన్న గాంధీని ఎలా అర్థం చేసుకోగలం. ఆయన ద్వంద్వ ప్రకృతి చూడండి. డెబ్బై ఏడేళ్ళ వయసులో ఆయన తన మునిమనుమరాలి వరసైన అమ్మాయితో నగ్నంగా ఏకశయాగతుడై తనను తాను పరీక్షించుకునేవారు. పైగా నాలాంటి ఆలోచనలున్న ఘోటక బ్రహ్మచారి ఒక్కరున్నా చాలు ఈ ప్రపంచం ఉద్దరించబడుతుంది అన్న మాటలు గాంధీ మూర్ఖత్వాన్ని మాత్రమే కాదు లైంగిక పైశాచికత్వాన్ని ఆనందించే అతన్ని ఏ నిర్భయ చట్టంలోకి బిగించలేమా అన్న అక్రోషం ఆలోచన మనముందు కొస్తుంది. నిజంగా తన ఆలోచనలు ప్రపంచమంతటా అమలైతే మానవాళి ఉనికి లేకుండా పోతుందనే కాకుండా మానవజాతి మరింత పరివర్తన చెందుతుందనేది ఆయన భావన.

మన జాతిపిత మూర్ఖత్వం ఎంత దూరం పోతుందంటే యంత్రాలు మహాపాపానికి ప్రతీకలు, రైల్వేలు భయానక ప్లేగు వ్యాధిని వ్యాపింపచేస్తాయి. (ఆయన ప్రకారం ఇప్పుడు స్వైన్‌ప్లూ వ్యాపింపకుండా విమానాలను, రైల్వేలను, వీలుంటే బస్సులను రద్దు చేయాలి) ఆస్పత్రులు పాపాన్ని పెంచిపోషించే సంస్థలు, రైతులకు అక్షర జ్ఞానం అవసరం లేదు. అది కేవలం వారిలో తమకున్నదాని పట్ల అసంతృప్తిని పెంచుతుంది. మనల్ని ఉన్నతంగా మలిచేందుకు ప్రాథమిక విద్యగాని, ఉన్నత విద్యాగాని ఏమి అవసరం లేదు. ఈ వినాశకరమైన ఆవిష్కరణలన్ని పాశ్చాత్య పైశాచిక నాగరికత నుంచి అయిన దిగుమతులు గాంధీ లక్ష్యసాధనకోసం చాలా నేర్పుతో ఆధునికతను పక్కకు తప్పించాలి తలంచారు. ఆయన దృష్టిలో స్వయంపాలన రాజకీయాలకు అతీతమైంది. అది ఆత్మపరమాత్మతతో లీనమయ్యేందుకే చేసే ప్రయాణంలో కోరికలమీదో, ఇంద్రియాలమీదో పట్టుసాధించే అంశం. స్వరాజ్‌ మతపరంగా ఒక తప్పనిసరి ఆవశక్యకత. రాజకీయ రూపం అనేది దానిని ముందుకు తీసుకెళ్ళే సాధనం తప్ప మరోకటి కాదు. టాల్‌స్టాయ్‌ భావాలు స్వీకరిస్తూ వాటికి ప్రత్యేకంగా హిందు భావనని అద్దారు. ఈ సహస్రాబ్ది సంప్రదాయాలనూ దేశీయతనూ జోడిరచి మతపర లక్ష్యసాధనకు వినియోగించుకున్నారు. మొదటి నుంచి కాంగ్రేస్‌ పార్టీ రాజకీయ విధానం తిరుగులేని లౌకికవాదం అయితే గాంధీ పార్టీ పగ్గాను చేపట్టిన తరువాత ఆ పార్టీకి అంతకు ముందు ఎప్పడూ లేనంత అపారమైన ప్రజాభిమానాన్ని సమకూర్చటంతో పాటు ఆయన పార్టీలో పెద్ద ఎత్తున మతత్వాన్ని పురాణాలనూ, ప్రతీకత్మకవాదాన్ని, మతధర్మశాస్త్రాన్ని జొప్పించారు అన్న వాదనలు మనకు ధృడపడతాయి.
నిజానికి గాంధీ హిందూ, ముస్లింల పట్ల నిష్పక్షపాతంగా వుండలేదు. రాజకీయ స్థాయిలో ఈ మతం ఆ మతంలో సమానంకాదు. ఒక ముస్లిం యువతిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న తన కుమారునికి అదే ‘ధర్మవిరుద్ధం’ అని హెచ్చరించారు. 1919లో గాంధీ మతపరంగా భారతదేశం ప్రపంచానికి మార్గదర్శి అనడం మత సమానత్వ భావనను ఉల్లంఘించడమే ఆయన మనసులో ఏ మతం ఉందో అందరికి తెలుసు. ఇలాంటి హిందూ మత పునరుద్దరణ సమిష్టి జాతీయోద్యమంలో ముస్లింలను ఎలా భాగస్వాములను చేస్తారు అన్న ప్రశ్న రాకమానదు. అతను (గాంధీ) ఊహించిన పరిష్కారం ఏమిటంటే ముస్లింలంతా ముస్లింజెండా కిందనే బ్రిటీష్‌ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాలి. యిదే ఈనాటి బి.జె.పి. ముస్లిం వ్యతిరేకానికి ఊతం యిచ్చింది.

యిక అహింసావాదిగా పేరుబడ్డ గాంధీ ఏమి మాట్లాడాడో విందాం ‘ఎలా చంపాలో తెలిసినవాడే అహింసను పక్కాగా పాటించగలడు 1914లో బ్రిటీష్‌ యుద్ద సన్నాహాలకు అంబులెన్స్‌ సైన్యాన్ని సమకూర్చడంలో కూడా గాంధీ కీలకపాత్రను పోషించాడు. భారతీయులు సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహిస్తూ 1918లో బీహార్‌ వరకు పాదయాత్ర చేశారు. ఆ అంతర్‌ సామ్రాజ్యవాద నరమేధంలో పాల్గొనేవిధంగా గ్రామీణ యువతను ఉత్తేజపరిచారు. ఒక సందర్భంలో ఆయనే తన అనుచరులతో ‘బానిసత్వమనే విపత్తునుంచి బయటపడేందుకు మనం హింస కైనా తెగించాలి. దేవుడు నన్నొక సాధనంగా మార్చుకొని హింస ద్వారా ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయాలనుకుంటే దానిని నేనెలా ఆపగలను అంటారు. ఎలాంటి ద్వంద్వ మనసత్వమో కదా. 1946లో బ్రిటీష్‌ వైస్‌రాయ్‌ ‘భారతదేశానికి’ రక్తం కావలసివస్తే చెల్లించేందుకు సిద్దమే అంటారు. దానికి కారణాలు లేకపోలేదు. సుభాష్‌చంద్రబోస్‌ చేస్తున్న ఉద్యమ నేపధ్యం కంగారు పెట్టింది. ఇరకాటంలో పెట్టేసింది. తన నాయకత్వ నిరంకుశ ధోరణియే ఎదురు దెబ్బగా నిలుస్తుందేమోననే భయమే అతన్ని ఆవహించింది. రాజకీయ నాయకుడిగా తనని తాను ఒక విచిత్రమైన లక్ష్యానికి ప్రతికగా పేర్కొనడం వల్ల ఆయన ఎదుర్కొన్న విమర్శలకు అందకుండా తప్పించుకోగలిగారు. గాంధీ సత్యాన్ని సదా తనకు ఎలా అనుకూలమనిపిస్తుందో అలా చూశారు. నా లక్ష్యం గతంలో నేను అన్నమాటలకు కట్టుబడి వుండడం కాదు ఏ సమయంలో ఏది సత్యమని అనిపిస్తే దాని ప్రకారం నడవడం అన్నారు. దీనర్థం అంతకు ముందు ఏమి చెప్పావన్న దానితో నిమిత్తం లేకుండా తను ఎప్పుడు ఏది మంచి అనుకుంటే అది చేసే అధికారాన్ని పొందడమే. గాంధీ సామ్రాజ్యవాదానికి ఉద్దేశాలున్నాయని గట్టి నమ్మకంతో వ్యవహరించేవారు. అందుకే ఆయన బ్రిటీష్‌ సామ్రాజ్యవాద యుద్దాల పట్ల సానుకూలతను వ్యక్తం చేసేందుకు ఏ మాత్రం పశ్చాత్తాపపడేవారు కాదు. భారతదేశంలో ఆయన నేతృత్వం వహిస్తున్నంత కాలమంతా రెండు రకాలుగా అంటే ఇటు నిలకడ అనేది లేకుండా వ్యవహరించడం అటు ఒక సత్యం నుంచి మరో సత్యం వైపు మారడం అనే పద్దతిలో ముందుకు సాగారు అని ఎంతో విశిదంగా రచయిత తెలియపరుస్తారు.

భూస్వామ్య వ్యవస్థ ప్రతినిధి అయిన గాంధీ స్వాతంత్య్రం కంటే స్వరాజ్‌నే ఆశిస్తున్నానంటారు. గాంధీ దృష్టిలో బ్రిటీష్‌ పాలన కంటే విప్లవమే ఎక్కువ ప్రమాదకరం. ఆయనలోని వ్యతిరేకత వెనుక మతపరమైన నమ్మకాల ప్రభావమూ, సామాజిక లెక్కలు ఉన్నాయి. హిందు మతం తనను అనుసరించే వాళ్ళందరిని ఒక్క తాటిమీదకు తెచ్చింది. ఆ సమాజంలో అందరికి వారి వారి స్థానము కేటాయించ బడివున్నాయి. ఒక వర్గాన్ని ఇంకో వర్గానికి వ్యతిరేకంగా ఉసికొల్పడం అనేది దేవుడు నిర్దేశించిన నియమావళి విరుద్దం. భూస్వాముల మీద తిరగబడేలా ప్రేరేపించడం అంటే దేవుడు సృష్టించిన వ్యవస్థను విచ్ఛిన్నం చేయడమే. ఈ వర్గాలను చైతన్యపరచడం అంటే దేశంలో నిప్పును రాజేయడమే. అందుకే ఆయన ఎలాంటి రాజకీయ సమ్మెలు వుండకూడదని భూస్వాములకు కౌలుదార్లకు మధ్య ఘర్షణలకు వీలుకల్పించే అన్ని రకాల ప్రయత్నాలకు ఆయన అడ్డుకున్నారు. ఆస్తి అనేది ఒక నిధి. దానిని గౌరవించడం మన విధి. అవసరమైతే ఆస్తికి సంపూర్ణ రక్షణ కల్పించడం. అందుకు ఆయన ఒక నెల శిస్తు చెల్లింపు నిరాకరణఉద్యమాన్ని గుజరాత్‌లో ఎక్కువ ప్రజలు కౌలు దార్లకు, భూస్వాములకు పన్నులు చెల్లించకుండా ప్రభుత్వానికి చెల్లిస్తారో అక్కడే మొదలెట్టారు.

ముస్లింలూ వారి నాయకుడైన మహమ్మద్‌ జిన్నా కాంగ్రేస్‌ పార్టీ పగ్గాలను గాంధీ చేపట్టిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో మతాన్ని చొప్పించడం వలన అసహనంతో దూరమయ్యారు. ఖిలాఫత్‌ ఉద్యమ ప్రచార సమయంలో గాంధీ మతపరమైన వాచలత్వాన్ని చూసి ఏవగించుకున్నారు. ముస్లింలు, సిక్కులు ప్రతిపాదించిన ప్రత్యేక నియోజకవర్గాల డిమాండ్‌ గాంధీకి అసహనానికి గురిచేసింది. 1932లో దళితులకు ప్రత్యేక నియోజవర్గాలను మంజూరు చేస్తున్నట్లు లండన్‌లో ప్రకటించంతో మొదటిసారిగా కులం చర్చనీయాంశం అయ్యింది. కులం మానవులు సృష్టించిందికాదు. ప్రకృతి నిర్దేశించిన చెక్కు చెదరని నియమం. అందుకే ఆయన చాలా స్పష్టంగానే ప్రజాస్వామ్యం స్పూర్తిని పెంపొందించేందుకు కలిసి తిరగడం కలిసి భోజనం చేయడం, కులాంతర వివాహాలు చేసుకోవడం వంటి చర్యలు చేపట్టవలసిన అవసరం లేదని నేను భావిస్తున్నాను అని కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పారు.

అంతేనా గాంధీ మన కులవ్యవస్థ ప్రపంచానికి మానవత్వం లేని పోటీతత్వానికి విరుగుడునూ ధనదాహం దురాశల కారణంగా జరుగుతున్న సామాజిక విచ్చిన్నానికి పరిష్కారాన్ని అందించగలదు అనే మార్గ నిర్దేశం చేసినట్లు తెలిపారు. యిక్కడే అంబేద్కర్‌ తన వర్గం కోసం చేసిన పోరాటాన్ని గాంధీ ఎలా బ్లాక్‌మేయిలింగ్‌ చేసి నీరుకార్చారో తెలియచేసారు. జాతీయోద్యమాన్ని విభజించేందుకు బ్రిటీష్‌ వాళ్ళు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేయడం మహాప్రమాదకరమైనది అని గాంధీ బావించారు. ఎందుకంటే అంటరాని వాళ్ళని గనుక హిందూమతం పరిధి తప్పిస్తే దేశంలోని ముస్లింలమీద హిందువుల ఆధిపత్యం దెబ్బతింటుందని అతని ప్రగాఢ విశ్వాసం అందుకే గాంధీ బ్రిటీష్‌ ఆదేశాలను వెనక్కి తీసుకునేంతవరకు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు. హిందూ మతం గురించి తనదైన ఆలోచనలున్న అంబేద్కర్‌ హిందూ మతం స్వేచ్చకి సమానత్వానికి, సౌభ్రాతృత్తానికి పెద్ద అడ్డంకి అన్నారు. కాని ప్రజలు నుంచి వచ్చిన విపరీతమైన ఒత్తిడికి, తనకీ తన కులాలకు ఎదురైన భౌతిక బెదిరింపులకు, గాంధీ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగిపోకతప్పలేదు. 1932 నాటి సత్యాగ్రహం సందర్భంగా అంబేద్కర్‌ ఆ నిరాహార దీక్షలో ఘనమైనదేమీ లేదు అదొక అన్యాయమైన నీచమైన చర్య అని అంటరానివాళ్ళ ప్రయోజనం కోసం చేసింది కాదు నిస్సాహుయులైన ఎస్‌.సి.లను హిందువుల దయాధర్మాలమీద బతకాలని నిర్దేశించిన నికృష్ట చర్య అని రాశారు. ఈ గాంధీ ఏవర్గాన్ని చెందినవాడో మనకు అర్థం కాకమానదుగా దౌర్భాగ్యం ఏమిటంటే అతడో హరిజనోద్దారకుడు పేరుగాంచిన జాతిపిత.

అయితే దశాబ్ది చివరినాటికే కాంగ్రేస్‌ పార్టీలో గాంధీని ఎదురించే ఒక క్రొత్త వర్గం తయారవ్వడం మొదలైంది. కాంగ్రేస్‌ సామ్యవాదాన్ని అనుసరించింది. కాని గాంధీ పెట్టుబడిదారి సంపదను సామ్యవాదం దెబ్బతీస్తుందని సామ్యవాద మార్గాన్నే కనుక అనుసరిస్తే తను పార్టీని వదలి వెళ్ళిపోతానని బెదిరించేవారు. కలకత్తాలోని మతతత్వ మార్వాడీ వ్యాపారస్తులకు సామ్యవాదమన్నా, ముస్లింలతో పొత్తు అన్నా గిట్టేది కాదు. వాళ్ళలో జి.యం. బిర్లా ఒకడు గాంధీకి అతిప్రియమైన శిష్యుడు. బాహ్య ప్రపంచం గురించిన పరిమితి అవగాహన ఆసక్తి కారణంగా గాంధీ హిట్లర్‌ని అభిమానించారు. రాజకీయంగా చెప్పాలంటే 1945 కల్లా గాంధీ పట్ల ప్రజల్లో ఆసక్తి పోయింది. ఇరవైయవ శతాబ్దపు వలసవాద వ్యతిరేక పోరాటాల్లో చాలా తక్కువ మంది నేతల పోరాటాలు విజయం సాధించగా, ఎక్కువ మంది నేతలు కీర్తిప్రతిష్టలు దెబ్బతిన్నాయి. నాసర్‌, నెహ్రూలు యుద్ధాలలో మొదట ప్రగల్భాలు పలికి ఆ పిదప ఎదురైన ఓటమిని తట్టుకొలేక కుంగిపోయారు. అయితే గాంధీకి అలాంటి దుర్గతి పట్టకుండా ఒక హంతకుడి తూటా కాపాడిరది. గాంధి పేరు మసకబారకుండా, కోరుకున్న వీరమరణాన్ని ఆయనకు ప్రసాదించింది. భారత దేశానికి స్వాతంత్య్రం సత్యాగ్రహం వల్లనో వ్యక్తిగతంగా లేక సామూహికంగా సెక్స్‌ను త్యాగం చేయడం వల్లనో రాలేదు. 1930లలో కాంగ్రేస్‌ అధిష్టానానికి జనామోదం భారత రాజకీయ సమాజంలోని ప్రధానమైన వర్గాలైన పేద రైతులు, ఆదివాసీలు, ఫ్యాక్టరీ కార్మికులు సంస్థాన ప్రజలు మొదలగు వారిని ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచడం వల్లనే లభించింది. ఆ వర్గాల పట్ల కాంగ్రేస్‌ అనుసరించిన వైఖరి అనుమానాస్పదమైనది, అవమానకరమైనది, పితృస్వామిక ఆధిపత్యంతో కూడినదని సోదాహరణంగా వివరిస్తారు.

సొంత పిల్లల పట్ల కఠినంగా వుండే గాంధీ, నెహ్రూను అంతగా అభిమానించడంలో యిరువురికి పరస్పర ప్రయోజనాలున్నాయి. కాంగ్రేస్‌ పరిధిలో పని చేసినంతకాలం తనకు నెహ్రూ వల్ల ఎలాంటి రాజకీయ సమస్యలు రావని గాంధీకి తెలుసు. తను గాంధీకి ప్రీతిపాత్రుడు కాబట్టి ప్రత్యర్థులపై విజయం సాధించి కాంగ్రేస్‌ పార్టీకి తనే అధినాయకుడిని అవుతానని, స్వాతంత్య్రం వచ్చాక తానే ఈ దేశాన్ని పరిపాలిస్తానని నెహ్రూకు తెలుసు అలాగే నెహ్రూకు అంబేద్కర్‌తో పోల్చడం సరికాదు అంటారు. అంబేద్కర్‌ను చదవటం అంటే మనం ఒక విభిన్న ప్రపంచంలో అడుగుపెట్టడం. అంటరాని వాళ్ళని (దళితులు) హిందుమతం నుంచి వెలివేయబడినవారిగా కాకుండా వర్గవ్యవస్థ పరిధిలో విశ్వాసపాత్రులైన హిందువులుగా చూపటంలో గాంధీ అంబేద్కర్‌ని బ్లాక్‌మేయిల్‌ చేస్తున్నప్పుడు నెహ్రూ అంబేద్కర్‌ పక్షాన సానుభూతిగా ఒక్కమారు కూడ మాట్లాడలేదు. అదొక చిల్లర సమస్యగా కొట్టిపారేశారు. అందుకే అంబేద్కర్‌ 1937 ఎన్నికలలో ముస్లింలీగ్‌ కాంగ్రేస్‌లో చేరకుంటే దాన్ని కాంగ్రేస్‌లో విలీనం కావడం అన్న కాంగ్రేస్‌ డిమాండ్‌ మీద స్పందిస్తూ అది గుత్తాధిపత్య హిందూ మనస్తత్వాన్కి ప్రతీక అన్నారు.
పాకిస్తాన్‌, జిన్నా గురించి ప్రస్తావిస్తూ జిన్నా లౌకికవాదిగా చెబుతారు. జిన్నా స్వయంప్రతిపత్తిని సార్వభౌమాధికారాన్ని కోరుకున్నారు గాని పాకిస్తాన్‌ అన్న పదం కూడా 1940లో ముస్లిం లీగ్‌ తీర్మాణాలలో లేనేలేదు. పాకిస్తాన్‌ అన్న పేరును కాంగ్రేస్‌ పార్టీయే తనకు అంటుగట్టిందని జిన్నా ఆ తరువాత వాపోయారంటారు. భారత్‌ను అఖండంగా వుంచడాన్కి బ్రిటన్‌కు సైద్దాంతికపరంగానే కాక పెట్టుబడులకు లావాదేవీలకు సంబంధించిన ఆలోచనలు వున్నాయి. వలస ప్రాంతాల్లో త్వరలో కమ్యూనిస్టు తిరుగుబాటు చోటు చేసుకొని వారి కైవసం అవుతుందనే భయం వుండేది. బ్రిటీష్‌ ఇండియాను విభజించినట్టయితే అందులో పెద్ద దేశమే తనకు ఎక్కువ ఉపయోగపడుతందనేది బ్రిటన్‌ ఉద్దేశం అని తెలియ చెబుతారు.

భారతదేశం కామన్‌వెల్త్‌లో చేరేందుకు ప్రతిఫలంగా మౌంట్‌బాటన్‌ బ్రిటీష్‌ ఆధీనంలోని మెజారిటీ జనాభాను, భూభాగాన్నే కాకుండా రాజధానిని, మిలటరీని అధికార యంత్రాంగాలలో ఎక్కువ భాగాన్ని కూడా కాంగ్రేస్‌ పార్టీకి అప్పగించాలని ప్రతిపాదించారు. సంస్థానాలన్ని పరిమాణ జనాభా రిత్యా పాకిస్తాన్‌తో సమానం కాబట్టి నష్టపరిహారంగా భారతదేశంలో కలిపి వేయాలని కోరారు. పాలకులు ముస్లింలుగా వున్న జునాఘడ్‌, హైద్రాబాద్‌ సంస్థానాలని సైనిక దాడి చేసి విలీనం చేసారు. ఒక అంచనా ప్రకారం ఆ మరణహోమంలో దాదాపు పది లక్షల మంది చనిపోయారు. విభజనకు మతమూ, భౌగోళిక స్థితిగతులే ప్రాతిపదిక అయితే కశ్మీర్‌ భారతదేశాన్కి చెందేలా పాకిస్థాన్‌కు చెందాలా అనే విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదు. ప్రదేశంగా భావించారు. భారతదేశానికి కశ్మీర్‌ దక్కితే మొదటి నుండి చెప్పుకుంటున్నట్టు తమది లౌకిక రాజ్యమనీ, హిందు రాష్ట్రాలతో పాటు ముస్లిం రాష్ట్రం కూడా తమతో సహజీవనం చేయగలదని భారత ఉపఖండాన్నే నిట్ట నిలువున చీల్చిన పాకిస్తాన్‌ మాదిరిగా భారతదేశం ఏకపక్ష రాజ్యం కాదని చాటేందుకు వీలవుతుంది. కశ్మిర్‌ను భారతదేశంలో విలీనం చేయాలని కశ్మీర్‌ మహారాజు తీసుకున్న నిర్ణయాన్ని షేక్‌ అబ్దుహ్ల బలపరచడం వల్ల ఢల్లీి ఆయనను కశ్మీర్‌ ప్రధానమంత్రి పదవిలో కూచోబెట్టింది. అయనవల్ల కశ్మీర్‌లో ప్రజాభిప్రాయం తనకు అనుకూలంగా వస్తుందని నమ్మి భారతదేశ కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతానని అధికారికంగా హామి యిచ్చింది.

అసలు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అయితే తానే గనక నిర్ణయాలు తీసుకునే సర్వాధికారం వుంటే కశ్మీర్‌లో చిన్న పోరాటం కాదు మొత్తం పాకిస్తాన్‌ మీదనే యుద్దం ప్రకటించేవాడ్ని అన్నాడు. అందుకే ఆయన కాంగ్రేస్‌ పార్టీకి చెందిన వాడయినా బి.జె.పి. నెత్తినిపెట్టుకొని ఏషియాలో కెల్లా పెద్ద విగ్రహం కట్టిస్తుంది. కాని అంబేద్కర్‌ మాత్రం ముందు చూపుతో పాకిస్తాన్‌ ఆర్‌ పార్టీషన్‌ ఆఫ్‌ ఇండియా పుస్తకంలో దేశ విభజన అనంతరం కశ్మీర్‌ను కూడా విభజించి ముస్లిం మెజారిటీ ప్రాంతానికి కశ్మీర్‌ లోయతో సహ పాకీస్తాన్‌లో చేరేందుకు అనుమతించాలని అన్నారు. ఆయన అంటే అంబేద్కర్‌ ఇంత సున్నితంగా ఆలోచించడానికి కారణం ఆయన హిందు మతంతో తెగతెంపులు చేసుకుని వుండటమే. అలాగే నెహ్రూ అంత మొండిగా వ్యవహరించడానికి కారణం ఆయన ఇంకా హిందూ మత పరిష్వంగణ లోంచి బయట పడకపోవడమే అంటారు రచయిత. అందుకే భారత సైన్యం హైద్రాబాద్‌ సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు హిందువులు 27000 నుండి40000 వరకు ఊచకోతకు పాల్పడినా నెహ్రూ ఒక్క అంశం కూడా బయటకు పొక్కకుండా నెహ్రూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత 27 నెలల తర్వాత రిపోర్టు వచ్చినా ఇందిరాగాంధీ నిషేదించారు.

జాతీయోద్యమాన్ని నిలువునా చీల్చిన బ్రిటీష్‌వారి విభజించి పాలించు సిద్దాంతమే దేశ విభజనకు మూలకారణమేనేది భారతదేశంలో వున్న ప్రామాణిక జాతీయవాద అభిప్రాయం. నిజానికి బ్రిటనే భారత
ఉపఖండంలో చారిత్రాకంగా ఏనాటి నుంచో వున్న విభజనులపై ఆధారపడి మనుగడ సాగించింది. బ్రిటీష్‌ వలసవాద ప్రభుత్వం రాజకీయంగా, జాతిపరంగా భాషాపరంగా చిన్నవైన సమూహాల జోలికి వెళ్ళిందే తప్ప హిందూ, ముస్లిం సమూహాల జోలికి వెళ్ళేందుకు సాహసించలేదు. యుద్దం ముగిసిన తరువాత బ్రిటన్‌ తాను చారిత్రకంగా ఒక్కతాటిమీదకు తెచ్చిన భారత ఉపఖండాన్ని ముక్కలు చేయకుండ ఏకంగా వుంచాలని కోరుకుంది. పాకిస్తాన్‌ ఏర్పాటుకు భారత దేశంలో విస్తృతంగా ప్రచారంలో వున్న కథలన్ని అభూత కల్పనలే. మొదట్లో ఉన్నత వర్గాలకే పరిమితమైన కాంగ్రేస్‌ పార్టీకి ప్రజా బాహుళ్య పార్టీగా తీర్చిదిద్దే క్రమంలో హిందుమత భావజాలం. ఈనాటి దేశ విభజనకు సంబంధించిన రాజకీయ ప్రక్రియకు బీజం పడిరదనడంలో సందేహం లేదంటారు. భారత ఉపఖండం కేవలం రెండు ప్రధాన, పరస్పర విరుద్ద మత వ్యవస్థల కార్యక్షేత్రం మాత్రమే కాదు. దానితో పాటు ఆ రెండు మతాల రాజకీయ ఆధిపత్యంలోని అసమానతలు, ఆ మతాల హెచ్చుతగ్గుల ఆధిపత్యంలో చోటుచేసుకున్న ఇటీవల తీవ్రమైన మార్పు కూడా అందులో వున్నాయి.

గాంధీ కంటే ఎంతో ముందే బెంగాల్‌లో జాతీయవాద తొలిప్రయత్నాలు మొదలయ్యాయి. బంకించంద్రచటర్జీ రాసిన సుప్రసిద్ద నవల ‘ఆనందమఠం’లో ఆనవల బ్రిటీష్‌ తాబేదార్లు, పరాయి దేశస్థులూ అయినటువంటి ముస్లింలను సమూలంగా నిర్మూలించాలని సందేశాన్నిచ్చింది. జాతీయస్థాయి పరపతి వున్న బాలగంగాధర్‌ తిలక్‌ హిందు దేవుడైన వినాయకుడిని ఆధారం చేసుకొని ఒక సరికొత్త దేశభక్తి సంస్కృతిని ప్రచారంలోకి తెచ్చాడు. దాని నేపధ్యంలోనే 19వ శతాబ్దం చివరిలో మత ఘర్షణలు మొదలయ్యాయి. యిప్పటికి కొనసాగడానికి కారణ భూతమవుతున్నాయి. అని నేటి వర్తమాన రాజకీయాల పునాది గురించి వివరిస్తారు రచయిత.
స్వాతంత్య్రం తర్వాత వున్న పరిణామాల గూర్చి మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యాన్కి నిలకడతనం దేశ స్వాతంత్య్ర నాటి పరిస్థితులు నుంచే వచ్చిందంటారు. ఇక్కడ బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని కూలదోయడం అనేది జరుగలేదు. కేవలం బ్రిటీష్‌ ప్రభుత్వం కాంగ్రేస్‌ పార్టీని తనకు వారసురాలిగా కేటాయించడం ద్వారా భారత్‌లో అధికార మార్పిడి చేసుకొంది. స్వాతంత్య్రం కోసం సమరం చేసిన సోదర భారతీయుల కోసం బ్రిటీష్‌ వలస ప్రభుత్వంలోని చట్టాలు సరిదిద్దే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మి మొదట నుంచీ కాంగ్రేస్‌ పార్టీకి ప్రత్యర్థులుగా వున్నారు. బ్రిటీష్‌ పరిపాలనా కాలంలో ఇటు దేశ ప్రజల అణచివేతలో పాల్గొని అటు సైగాన్‌, సురబాయ ప్రాంతాల్లో సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసిన భారతసైన్యం ఇండియన్‌ నేషన్‌ ఆర్మీ సైనికులను తనలో విలీనం చేసుకోలేదు.

ఈ పుస్తకంలో భారత రాజకీయాలలో కుల ప్రాముఖ్యత గూర్చి విశ్లేషణ వుంది. భారతదేశం కులమనే ఉక్కుని పోతపోసి నిర్మించిన ప్రజాస్వామిక దేశంగా వుంటుంది.. వారసత్వ విధానం, హెచ్చతగ్గుల దొంతరలు, వృత్తితో ముడిపెట్టడం. అనేక రకాల భయాలు, ఆంక్షలు మొదలైనవి అన్నీ హిందూ సామాజిక వ్యవస్థను దాదాపు 5000 కులాలుగా చీలికలు పేలికలు చేసింది. అంబేద్కర్‌ తను ఎంతో కాలంగా దీనికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారో ఆ అసమానతల వ్యవస్థను చాలా తక్కువగా అంచనా వేశారు. మన నాయకులు తమ అనుచరులకు విముక్తి సారాంశాన్ని అందించే బదులు గౌరవ ప్రత్రికలతో సంతృప్తి పరిచారు. ఈ అస్థిత్వ రాజకీయాలు అంబేద్కర్‌ ఆశించిన కుల నిర్మూలనకు ప్రయత్నించవు. పైగా కులాలను మరింత పటిష్టం చేస్తాయి. ఓటర్లుగా చైతన్యవంతులుగా అవుతున్న కొద్ది పేదలు, దిగువ మధ్యతరగతి పేదలు వారసత్వ సమూహాల నిర్మూలనకు కృషిచేయకుండా వాటిని రాజకీయాల సమాజాలుగా సంఘటితం చేస్తారు. అందుకే రాజకీయం తత్వవేత్త జావేద్‌ అలక్‌ చెప్పినట్టు చారిత్రకంగా ‘‘కులం అనేది ఒక స్వేచ్చలేని సమిష్టిరూపం. వాటి నుంచి వ్యక్తులు బయటపడడం బానిసత్వం నుండి భూస్వామ్య వెట్టి చాకిరి నుండి బయటపడటం కంటే కూడా కష్టం’’. భారత ప్రభుత్వం వీటిని చట్టపరమైన చర్యలతో సరిదిద్దేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. పైపై చర్చలతో కులాన్నే చట్టపరంగా మరింత బలోపేతం చేసింది. కుల సంఘాలు ఒక వినూత్న క్రియాశీలతతో శక్తివంతమైన ప్రచారశీల సమూహాలుగా మారడంతో భారత ప్రజాస్వామ్యంలో గతంలో కంటె ఎక్కువగా అడ్డంకిగా మారి ప్రజాస్వామ్యాన్నే స్థీరీకరిస్తున్నాయి.

మండల్‌ కమీషన్‌ వల్ల తమకు కలిగిన నష్టాల పట్ల అగ్రవర్ణాలలో పెల్లుబికిన కోపాన్ని సొమ్ము చేసుకునేందుకు బి.జె.పి. అయోధ్య సమస్యను ముందుకు తెచ్చింది. కాంగ్రేస్‌, బి.జె.పి. పార్టీలు దేశీయంగా తమ మిత్రపక్షాల అనుమతించినంత మేరకు నూతన సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేస్తూ విదేశీయంగా అమెరికాలో వ్యూహాత్మక స్నేహసంబంధాలను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆచరణ రీత్యా చూస్తే ఈ రెండు పార్టీల మధ్య తేడా స్వల్పమే. మతతత్వం వల్ల తరచు లబ్ది చేకూరుతుందను కుంటే రెండు పార్టీలు ఒకే రకంగా వ్యవహరిస్తాయి. రాజకీయ దుందుడుకు చర్యల్లో చురుకుగా పాల్గొనే బి.జె.పి. కారణంగా 2002లో గుజరాత్‌లో జరిగిన మారణకాండలో మరణించిన వారి సంఖ్య కంటే, కాంగ్రేస్‌ కారణంగా 1984లో ఢల్లీిలో జరిగిన ఊచకోతలో చనిపోయిన వారి సంఖ్యా ఎక్కువ. బంధుప్రీతి అనేది ఎంతగా ముదిరిందంటే మూడోవంతు మంది కాంగ్రేస్‌ ఎం.పీ.లు, బి.జె.పిలో ఆరవవంతు మంది సభ్యులు తమ కుటుంబ సంబంధాలతో వారసత్వపరంగా చోటు సంపాదించుకున్నారు.

న్యాయవ్యస్థను గూర్చి మాట్లాడుతూ నెహ్రూ హయాంలో సర్వోన్నత న్యాయస్థానం క్రీయాశీలక పాత్రను పోషించలేదు. అది తనకు తానుగా అత్యవసర పరిస్థితులలో రబ్బరు స్టాంపుగా అవమానించుకుంది. ఆ తరువాత సిగ్గుపడి పూర్తిగా విరుద్దంగా వ్యహరిస్తుంది. ఇప్పుడు పార్లమెంట్‌ చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్దంగా ఉన్నాయని భావించినపుడు మామూలుగా తనకు ఉన్న విశేష అధికారాలతో వాటిని రద్దు చేయడమే కాదు తాను అత్యవసరమని భావించినపుడు కొత్త చట్టాలు చేయమని కూడా లోకసభను డిమాండ్‌ చేస్తుంది. మరే ఇతర దేశాలలోనూ గతంలో న్యాయస్థానాలు ఇలాంటి చర్యలు తీసుకున్న ఉదాహరణలు లేవు. ఇంత అసాధారణ రీతిలో ఆవిధంగా తయారవడానికి కారణం తన చుట్టూ ఉన్న ప్రజాప్రాతినిధ్య సంస్థలు వైఫల్యం చెందడమే.

భారతదేశంను చైనాను పోల్చి మన వెనుకబాటు తనానికి కారణాలను మనముందు ఉంచుతారు. యువతరం భూమి రీత్యా చూసినా చైనా కంటే మెరుగ్గా ఉన్న మనదేశం 1950లలో ఒకే రకంగా ప్రయాణాన్ని మొదలు పెట్టినా చైనాతో పోల్చే ఏమి వెలిగిపోవడం లేదు. చైనా వారి మాధిరిగా భారతీయులు తమ మాతృదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అంత ఉత్సాహం చూపించడం లేదు. కానీ ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందుతున్న సమాజం సృష్టించినంత మంది విభిన్న ఉన్నత మేధోవర్గాన్ని భారతదేశం సృష్టిస్తుంది. అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ విషయంలో భారతదేశానికి సాటి రాలేకపోతున్నాయి. అయినప్పటికి సామాజిక విమర్శతో పోల్చితే రాజకీయ విమర్శ అంత సమగ్రంగా పరిశోధనాత్మకంగా లేదు. ప్రజాస్వామిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అదెంత ప్రజాస్వామికంగా ఉన్నా ఈ ప్రాధినిత్య సంస్థలో అణచివేసే యంత్రాంగాలను ఆసరా చేసుకొని మనుగడను సాగిస్తున్నాయి.

ఈనాటి రాజ్యహింసకు మూలాలు తెలియజేస్తూ 1950లో నెహ్రూ ప్రభుత్వం చేసిన ప్రివెంటీవ్‌ డిటెక్షన్‌ యాక్ట్‌ నుంచి అన్‌ లా ఫుల్‌ యాక్టివిటీస్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ చట్టాలు విశేషమైన అధికారాలను కట్టబెట్టాయి. టెర్రరిజం అండ్‌ డిజరెప్టీవ్‌ యాక్టివిటీస్‌ క్రింద 53 వేల మందిని అరెస్టు చేస్తే ఏడేళ్ళ తరువాత వారిలో కేవడం 434 మంది మాత్రమే నేరం చేసినట్లు రుజువువైంది. పోలీసులు పని చేస్తున్నప్పుడు సైనికులు ఏమి ఖాళీగా ఉండడం లేదు తరచుగా వారిని ఉపయోగిస్తూనే ఉన్నారు. దాని వెనుక ఉన్న ఉద్దేశం ప్రస్తుత రాజకీయ సామాజిక వ్యవస్థను సవాలు చేసేవాళ్ళకు, వ్యతిరేకించే వాళ్ళకు ముప్పుతప్పదని హెచ్చరించడమే అంటారు రచయిత అండర్‌సన్‌.
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడు తిరుగుబాట్లు కశ్మిర్‌, నాగాలాండ్‌, మిజోరామ్‌, పంజాబ్‌లలో అంటే ముస్లిం, క్రైస్తవ, సిక్కు ప్రాంతాలలో జరిగాయి. కశ్మిర్‌ ఈశాన్య ప్రాంతాల్లో జరిగే పాలనలో ప్రజాస్వామ్యం లౌకికవాదం సమగ్రతా అనే మూడు సూత్రాలలో ఏ భాగము లేవు. పచ్చి నిజము ఏమిటంటే స్వాతంత్య్రము వచ్చిన నాటి నుండి భారత సైన్యము పార్లమెంటరీ శక్తులు తమ పౌరులపై సాగిస్తున్న నరమేధం ముందు ఆనాడు స్వాతంత్య్రోద్యమం ఎగిసిపడేట్లు చేసిన జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన నరమేధం చాలా తక్కువ అంటూ ఆర్మీ యొక్క విశేషఅధికారాలు తెలియపరుస్తారు.

ఒకప్పుడు ఆరోగ్యంగా వున్న వ్యవస్థకు సోకిన రాజకీయ జబ్బుల పట్ల నిజమైన దేశభక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు కానీ ఆ జబ్బులు హఠాత్తుగా సోకినవి కావు. భారతదేశాన్ని పరిపాలించిన కుటుంబం, దాని అనుచర గణం, వారి ఆరాధన వారి చుట్టూ ఉన్న అర్థ సత్యాలు, వ్యవస్థ ద్వారా ఈ రాజకీయ రుగ్మతలన్ని పార్టీ ఆవీర్భావం నుంచి పరంపరగా వస్తున్నవే. ఇప్పుడు బి.జె.పి. అంతకంటే ప్రమాధకరమైన శక్తి. ఈ రోజున బి.జె.పి. ప్రభుత్వము ప్రపంచంలో అతిపెద్దదైన సర్ధార్‌ వల్లభభాయి విగ్రహం కట్టడానికి నడుం కట్టింది. ఈయనే ఆర్‌.ఎస్‌.ఎస్‌.ల కాంగ్రేస్‌ విలీనం కావాలని కోరినారు. ఇలాంటి దిష్టి బొమ్మలకు అవి ఇచ్చే సందేశాలకు స్వస్తి పలకాల్చిన సమయం అంటారు రచయిత పేరి అండర్‌సన్‌. సామాజికంగా హిందు మతం ఇతర అస్థిత్వం నుండి విడివడిన విశ్వాసము ఆచరతో కాదు. అది చాపకింద నీరులా ప్రజాజీవితమంతటికి వ్యాపిస్తుంది. నిజమే ఇండియాలో హిందుస్తాన్‌ దాగి ఉంది. రాజకీయాలను హిందూ మత భావనలతో మమేకం చేయడం అన్న గాంధీ విధానం ఏ పార్టీ అయినా కొనసాగిస్తుంది.

ఈ పుస్తకం చదువుతున్నప్పుడు గతం వర్తమానం మనల్ని కలవర పరుస్తుంది. అనాదిగా వస్తున్న మన ఆలోచనా విధానాన్ని మన అవగాహనను సరిదిద్దుతుంది. ఈ పుస్తకాన్ని నిశితంగా పరిచయం చేయడానికి వ్యాసంలో అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. దండలో దారంలా గతాన్ని వర్తమానాన్ని ముడిపెడుతూ ఈ పుస్తకం ఒక విశ్లేషణను అందిస్తుంది. హిందుత్వ భావన ఒక భావాజాలంగా స్త్రీల జీవితాన్ని కమ్మేస్తున్న వైనం ఈనాడు చూస్తున్నాము. ఇండియన్‌ డాటర్‌ బి.బి.సి. తయారుచేసిన డాక్యుమెంట్‌ చూస్తే మధ్యయుగం భావజాలాన్కి కారణం ఈనాటి బి.జె.పి.యే కాదు లౌకికవాద పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రేస్‌ కూడా మూలకారణం అని అర్థమౌతుంది. అందుకే మతవాద బి.జె.పి. కాంగ్రేస్‌ పార్టీకి చెందిన వల్లభాయ్‌పటేల్‌ను పార్టీలకతీతంగా ఎత్తుకోవడంలో ఆశ్చర్యం లేదు.

జాతిపితగా కీర్తించబడ్డ గాంధీ ఎంతటి కరుడుగట్టిన హిందుత్వ వాదో మనకు ఈ పుస్తకం ద్వారా అర్థం అవుతుంది. ఆధిపత్య కుల వర్గాల ప్రయోజనాలు కాపాడడం కోసం ఆయన తపన పట్ల ప్రశ్నలు లేవనెత్తుతుంది. కాంగ్రేస్‌ స్వలాభం కోరె రాజకీయ కుటిలతను బహిర్గం చేస్తుంది. జాతీ ప్రయోజనాలకంటే ఆనాటి ముస్లిం లీగ్‌ను విలీనం చేసుకోవాలని అనుకున్న కాంగ్రేస్‌ కాంక్ష నిన్న మొన్న ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఈ పుస్తకంలో మన హైదరాబాద్‌ విలీనానికి గల కారణాలు రాజ్యం యొక్క హింసాత్మక ధోరణులను కూడా మన ముందు ఉంచుతుంది.

ఇలా ఎన్నో విషయాల పట్ల మన అవగాహనకు పదను పెట్టే పుస్తకం ఖరీదు రూ. 120/`లు హెచ్‌.పి.టి. ప్రచురణ. అన్ని పుస్తక కేంద్రాలో దొరుకుతుంది. ఈ పుస్తక రచయిత పేరీ అండర్‌సన్‌ ఆంగ్లో`ఐరీష్‌ రచయిత. ప్రముఖ మార్కిస్టు మేధావి. చరిత్రకారుడు, వ్యాసరచయిత 1962 నుండి న్యూలెఫ్ట్‌ రివ్యూ సంపాదకుడు. యూరప్‌ చరిత్ర, సమకాలిన ప్రపంచం, పాశ్చాత్య మార్కిస్టు సంప్రదాయము, మేథో పరమైన చరిత్ర వంటి విస్తృత అంశాలలో సునిశిత రచనలకు ఆయన పెట్టింది పేరు. న్యూలెఫ్ట్‌కు సంబంధించిన 1956 తరువాత పాశ్చాత్య మార్క్సిజం రచనలతో ఆయన ఎక్కువ గుర్తింపబడతారు. ప్రస్తుతం యూనివర్సిటి ఆఫ్‌ కాలిఫోర్ని, లాస్‌ఎంజ్‌లలో చరిత్ర, సామాజిక అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు.

– హేమా వెంకట్రావ్‌

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో