వివాహం – కె.వరలక్ష్మి ఆత్మకథ

కె.వరలక్ష్మి

కె.వరలక్ష్మి

ఏప్రెల్ నెలలో మా ఫిఫ్త్ ఫాం పరీక్షలు ముగిసాయి .ఆరో తరగతి పరీక్షలు వ్రాసిన మా పెద్ద చెల్లిని కూడా నాతో కూర్చో బెట్టుకుని చదివించేను . చిన్న వాళ్లు ముగ్గురికీ ప్రాధమిక పాఠశాలలో పరీక్షలు ఎప్పుడో అయి పోయేయి . ఆ వారం కొండల్రావు గారు వస్తూ వస్తూ చెస్ బోర్డు , పావులు కొనుక్కొచ్చేరు . నేనదే మొదటి సారి చెస్ చూడడం . అందరికీ ఆ ఆట గురించి వివరించి ఇద్దరిద్దరికి ఒక పోటీ లాగ పెట్టేరు . సగం మందికి ఆట అర్ధం కాలేదు . కొందరికి ఆడడం చేత కాలేదు . అందరూ ఆడుతున్నప్పుడు నేను జాగ్రత్తగా గమనిస్తూ కూర్చున్నాను . పిల్లల బేచ్ లో నేనే ఫైనల్ కి వచ్చేను . ఫైనల్ కి వచ్చిన వాళ్లు తనతో ఆడాలని కొండల్రావు గారు ముందే చెప్పేరు . ఆయన్తో ఆడుతూంటే అర్ధమైంది ఆయన కూడా అప్పుడే నేర్చుకుంటున్నారని . త్వరలోనే నేను చెక్ చెప్పే సరికి ఆయన చప్పట్లు కొట్టేసి ‘ మార్వలెస్ , ట్రెమండ్రస్ ‘ అంటూ ఆకాశాని కెత్తేసారు . మోహన్ చాలా’ అదృష్టవంతుడు’ అంటూ ఓ కితాబిచ్చేరు .

ఆ సెలవుల్లో మా అమ్మ నాకిష్టమైన మామిడి కాయ – పప్పు , చింత చిగురు – పప్పు వండి చేరెడేసి నెయ్యి కలిపి పెడుతూ వచ్చింది . పెళ్లి దగ్గర కొస్తోంది కాబట్టి ఎండల్లో తిరక్కుండా నీడ పట్టునే ఉండమని కట్టడి చేసింది . సెలవులకి లీల కూడా కాకినాడ నుంచి వచ్చేసింది . స్నేహితులంతా మా ఇంటికే వచ్చి కబుర్లు చెప్తూండే వాళ్లు . ‘ పెళ్లంటే భయంగా , టెన్షన్ గా లేదా ‘ అని అడుగుతూండే వాళ్లు .

నిజానికి నాకు భయం , టెన్షన్ కన్నా నేను వెళ్లబోయే ఇంటిని గురించీ , మనుషుల గురించీ ఉత్సుకత ఎక్కువుగా ఉండేది . ఒక్క దాన్నీ ఉన్నప్పుడు రకరకాల ఊహలు వస్తూం డేవి . మోహన్ ఉత్తరాల్లో రాసినదాన్ని బట్టి ఒక చక్కని డాబా ఇల్లు , గేటుకి ఇరు వైపులా రెండు కొబ్బరి చెట్లు , ఇంట్లో దేవతలాంటి వాళ్ల అమ్మమ్మ గారు , ఆవిడ మాపై చూపే ప్రేమ , చిలకా గోరింకల్లా మేమూ ….అందాల రాజమహేంద్రి , గలగల ప్రవహించే గోదావరి గురించి కలలు కనేదాన్ని .

అర్ధ రాత్రి వరకూ పుస్తకాలు చదివితే కళ్ళు  నీరసపడి పోతాయని అదీ ఆపించేసారు . కేవలం రేడియో లో నచ్చిన కార్యక్రమాలు , భారతి , సిలోన్ లలో హిందీ పాటలు వినడం , తోచింది రాసుకోవడం అంతే …
పెళ్లి కొడుక్కి పెళ్లి బట్టలు కొనడానికి రమ్మని కబురొచ్చింది . మా నాన్న రాజమండ్రి వెళ్లేరు . అప్పటికి మా ఇళ్లల్లో పెళ్లికి మధు పర్కాలు మాత్రమే ఇచ్చే అలవాటట . వాళ్లేమో మా నాన్న చేత ఫారిన్ టెర్లిన్ షర్టులు , ట్వీడ్ పేంటు , బనీన్లు , డ్రాయర్లు కూడా కొనిపించేరట . బస్టాండుకి వచ్చేసిన మా నాన్నను మోహన్ వచ్చి వెనక్కి పిల్చు కెళ్లి కోటుకి కూడా క్లాత్ కొనిపించి , టైలర్ కి కుట్టడానికి డబ్బులు కూడా ఇప్పించేడట . వాళ్లింటికి రమ్మని గానీ , భోజనం చెయ్యమని గానీ అనలేదట . ఆ రోజు ఆ బట్టలకి 500 రూపాయలు ఖర్చైందట . పద్ధతి ప్రకారం పెళ్లి కొడుక్కి ఇచ్చినదానికి రెట్టింపు పెళ్లి కూతురికి ఇవ్వాలట మగ పెళ్లి వాళ్లు . మా నాన్న అడిగితే ‘ మేం కొని తెస్తాంలే’ అన్నారట. .

మే మొదటి వారంలో మోహన్ తన క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకొనే ఆచారి , శాస్త్రి , శర్మలను వెంట బెట్టుకుని మా ఇంటి కొచ్చేడు . వాళ్లు మా ఇంట్లో తినరని చెప్తే మా నాన్న వాళ్లకి అయ్యరు హోటల్లో భోజనాలు పెట్టించేరు . భోజనాల తర్వాత పక్కనే ఉన్న బాజీ గారి కిళ్లీ కొట్లో కిళ్లీలు , సిగ రెట్టు పేకెట్లు తీసుకుని కాల్చడం మొదలు పెట్టేరట . అప్పటి వరకూ మోహన్ మా అందరికీ సిగరెట్టు కాల్చే అలవాటు లేదని చెప్పేడు . వాళ్లని ఇంటికి తీసుకొచ్చి మా వాకిట్లో కుర్చీలు వేయించి కూర్చో బెట్టి నన్ను పిలిచి పరిచయం చేసేడు . ఆచారి సెవెన్త్ ఫాం ఫెయిలై చదువు మానేసాడట . శాస్త్రి మెడిసిన్ లో జాయిన య్యాడు . శర్మ మోహన్ తో ఆర్ట్స్ కాలేజ్ లో B .Sc చదువుతున్నాడు . పరిచయం లేని వాళ్లతో మాట్లాడలేక నేను గోళ్లు గిల్లుకుంటూ కూర్చునే దాన్ని.వాళ్ళు వెకిలిగా మాట్లాడ్డం మొదలు పెట్టేరు .మా నాన్న “ లోపలికి రా అమ్మా “ అని ఒక్క అరుపు అరిచేరు . వాళ్లంతా వెళ్ళేక “ స్నేహితుల్ని చూసి మనిషిని అంచనా వెయ్యమన్నారు పెద్దలు . ఈ కుర్రోడి స్నేహితులు ఎంత వెకిలి మనుషులో చూడు . సిగరెట్లు కాల్చనని మనతో అబద్ద మాడేడు ఈ అబ్బాయి . ఇంకెన్ని ఎదుర్కో వాలో ? “ అంటూ తలపట్టుకున్నారు .

పెళ్లికి పప్పులు , బియ్యం బాగు చెయ్యడం లాంటి పనులన్నీ చుట్టు పక్కల వాళ్లంతా వచ్చి సాయం చేసేరు .
మే 27 న భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కాలం చేసేరు . మా స్నేహితులంతా ఒగుర్చుకుంటూ పరుగెట్టు కొచ్చేరు . అప్పటి విద్యార్ధులు చాలా మందికి స్వాతంత్ర్యం తెచ్చిన నాయకుల మీద అపరిమితమైన ప్రేమాభిమానాలుండేవి . మా బేచ్ పుట్టడానికి ఒకటి రెండేళ్ల ముందే గాంధీజీ మరణించినా ఆయన్ని మహాత్ముడుగా పూజించే వాళ్లం . ఆ రోజుల్లో చాలా మంది ఇళ్ళల్లో , స్కూల్స్ లో స్వతంత్ర పోరాట యోధుల ఫోటో లుండేవి . మా ఇంటి హాల్లో కూడా ఓ పక్కంతా దేశ నాయకుల ఫోటోలు , మరో పక్క ఫేమిలీ ఫోటోలు ఉండేవి . అది దేవికారాణి ఫోటో అని తర్వాతెప్పుడో తెల్సింది . ఇంతకీ నేనూ , నా స్నేహితులూ నెహ్రూ గురించి మాట్లాడుకుంటూ అసంకల్పితంగా భోరున ఏడ్చేసాం . మర్నాడే నన్ను పెళ్లి కూతుర్ని చేసే ముహూర్తం . మా మేనమామలు , వాళ్ల భార్యలు అంతా వచ్చి ఉన్నారు . మా ఏడుపు విని కంగారుగా అంతా పరుగెట్టు కొచ్చేరు . విషయం విని అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్తూంటే మాకు మాత్రం భలే కోపం వచ్చింది . ఆ సాయంత్రం లోపల ‘నెహ్రూ చాచా ‘ అనే కథొకటి రాసేసి ‘ చందమామ ‘కి పంపించేను . తీరా పంపించేసేక గుర్తుకొచ్చింది ఆయన కోటుకి ఎర్ర గులాబి పెట్టుకుంటే నేను తెల్ల గులాబీ అని రాసేనని .

మర్నాడు ఉదయాన్నే పసుపు రాసి తలస్నానం చేయించి మా అమ్మమ్మ గారింటి తరపునుంచి మా రెండో మేనమామ వెంకటగిరి నుంచి తెచ్చిన సన్నంచు చిన్ని బుటాల కోరారంగు చీర కట్టించి పెళ్లి కూతుర్ని చేసేరు. పుంత వైపు మా ఇంటి పొడవునా తాటాకుల పందిరి వేయించి మామిడాకుల తోరణాలు కట్టేరు . నాకన్నా ముందు ఒక అమ్మాయి పుట్టిపోవడం వలన మా ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా ముందు వీరభద్రుడి సంబరం చెయ్యడం ఆనవాయితీగా వస్తోందట . వీర ముష్టి వాళ్లు ప్రభల్తో , బాజా భాజంత్రీల్తో వచ్చేరు . ఇంటి దగ్గర పూజ చేయించి , తొమ్మిది ఇత్తడి పళ్ళాల్లో విగ్రహాలు , విభూతి పళ్ళు , కొత్త బట్టలు , పళ్ళు ఫలాలు లాంటి వన్నీ పెట్టి సిద్ధం చేసేరు . ఒక పెద్ద దుప్పటిని నలుగురు నాలుగు కొసలు పట్టుకుంటే , మధ్యలో ఒకరు సన్నని కర్రతో ఎత్తి పట్టుకుంటారు . పళ్ళాలు నెత్తిన పెట్టుకున్న తొమ్మిది మందీ ఆ నీడలో నడుస్తూ వెళ్తారు . తార స్థాయిలో మోగే భజంత్రీల శబ్దానికి కొందరికి తలలో ఏదో అయిపోయి పూనకం వచ్చి ఊగిపోతారు . చుట్టాల్లో ఇద్దరికి పూనకం వచ్చింది . సాంబ్రాణి పోగవేసి వాళ్లని చల్ల బరిచేరు . ప్రభలు భజంత్రీలు బయలు దేరేయి . సంబరం ముఖ్య వీధులన్నిట్నీ చుట్టి గద్దెను చేరుకుంటుంది . అక్కడ ఓ గంట పూజా కార్యక్రమం ఉంటుంది . అప్పుడు ఇళ్ళకి తిరిగి వస్తారు . ఎవరు మోసినా మొయ్యకపోయినా పెళ్లి చేసుకుంటున్న వాళ్లు మాత్రం ముఖ్యమైన విగ్రహం ఉన్న పళ్లాన్ని మోయ్యక తప్పదు . అనుకున్న క్షణం రానే వచ్చింది . అప్పటివరకూ పూజలో పాల్గొన్న నన్ను పిలిచి నా నెత్తిన పళ్లెం పెట్ట బోయారు . నేను ఒప్పుకోలేదు . ఎవరెంత నచ్చ చెప్పబోయినా నేను వినలేదు . పోనీ పళ్లెం లేకుండా ఊరికే నడవమన్నారు . దానికీ నేను అంగీకరించ లేదు . మా వీధిలో ఇంకొందరికి పూనకాలో చ్చేయి . ఈ పిల్లకి భయం లేదని కొందరూ భక్తి లేదని ఇంకొందరూ అనేసేరు . గారాబం చేసి పిల్లని చెడగొట్టేడని మా నాన్నని కొందరు ఆడిపోసుకున్నారు . అలా నన్నూ , మా నాన్నమ్మనీ వదిలేసి అందరూ వెళ్లి పూజ చేసి వచ్చేరు .

“ ఇలా చేసే వేంటే తల్లీ ! “ అంది మా నాన్నమ్మ భయంతో చెంప లేసుకుంటూ .
“మామ్మా . భక్తి మనసులో ఉంటే చాలు . దాన్ని వీధుల్లో ప్రదర్శించ నక్కర్లేదు “ అన్నాను .
“సాల్లే నేర్చేవు , సిన్న నోటికి పెద్ద మాటలు “ అంటూ మళ్లీ టపా టపా చెంపలు వాయించుకుంది నాన్నమ్మ .
పెళ్లి కింకా మాడు రోజులు టైం ఉండడం వలన ఉదయం , సాయంకాలం ఎవరో ఒకళ్లు కొత్త చీరలు తెచ్చి పెళ్లి కూతుర్ని చేస్తూనే ఉన్నారు . పట్టణాల సంగతి నాకు తెలీదు కాని పల్లెల్లో యాదవులకి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులుండేవి . ఎవరింటికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు శేరో , రెండు శేర్లో బియ్యం , ఒక కోడిని పట్టుకుని వెళ్లే వారు , అది వీలు కాని వాళ్లు వెళ్లగానే కాని వచ్చేటప్పుడు గాని కొంత చిల్లర చేతిలో పెట్టే వాళ్లు . ఇక పెళ్లి లాంటి శుభకార్యాలు కొందరు ఉత్త ముద్దపప్పు , చారుల్తో ముగిస్తే , ఇంకొందరు పుల్హార కూడా పెట్టేవారు . ఇంకొందరు బూరెలు వడ్డించేవారు . ఈ అన్నిటికీ వెనక ఆర్ధిక పరమైన కారణాలు ఉండేవని నేననుకుంటాను . ఇప్పట్లాగా చేతుల్లో డబ్బులు కదలాడే రోజులు కావవి . ఆడపిల్లకి కట్నం ఇచ్చి పెళ్లి చెయ్యడం అంటే అవమానంగా భావించేవారు . బంగారం , వెండి లాంటివి మగ పెళ్లి వాళ్లే పెట్టి , ఖర్చు మొత్తం భరించి అబ్బాయి ఇంట్లోనే పెళ్లి చెయ్యాల్సి ఉండేది . ఈ తతంగాలన్నీ కుల పెద్దల ఆధ్వర్యం లో జరుగుతూండేవి . పెళ్లి కుదిరిన వెంటనే ‘పప్పు – వణ్ణాలు ‘ (పెద్దల భోజనాలు లేక నిశ్చితార్ధం ) అనే తతంగానికి కుల పెద్దల్ని తప్పకుండా తీసుకెళ్లాలి .

(ఇంకా ఉంది)

 – కె. వరలక్ష్మి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to వివాహం – కె.వరలక్ష్మి ఆత్మకథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో