ధృడగాత్రులు  

కృష్ణ వేణి

కృష్ణ వేణి

ఇంకొక లైంగిక వేధింపు. మరొక కేసు. మరో విద్యావంతుడైన పెద్దమనిషి. తిరిగి తన హోదాని దుర్వినియోగపరచడం! ఇంకొక యువతి కనపరిచిన నిర్భీతి, సాహసం. లైంగిక వేధింపు అన్న విషయం హెడ్ లైన్స్‌కి ఎక్కి, తరుణ్ తేజ్‌పాల్ని కటకటాల వెనక్కి నెట్టింది. మాజీ సుప్రీమ్ జడ్జ్ మీద నిఘా నిలిపింది. ఆ తరువాత కూడా ఒక మహా విద్యావంతుడైన రాజేంద్ర పచౌరీ తన డిపార్టుమెంట్లో పని చేసే ఒక స్త్రీని వేధించి, పీడించి తప్పించుకోగలనని అనుకున్నాడన్నది విభ్రాంతి కలిగించే విషయం.

ఉన్నత చదువులు చదువుకుని, ఒక ఉన్నతస్థానంలో ఉన్న నోబెల్ బహుమతి గ్రహీత తన స్థాయినీ, తన వయస్సునీ (74 సంవత్సరాలయనకి) కూడా విస్మరించి, ఇటువంటి చర్యలకి పాలుపడటం సమాజానికి ఎలాంటి సందేశాన్నిస్తుంది! చేస్తున్న తప్పుకి సంభవించే పరిణామాలని ఎదురుకోలేక గుండె నొప్పి నెపంతో ఇప్పుడు హాస్పిటల్లో చేరి, ఏంటిసిపేటరీ బెయిల్ తీసుకున్న సైంటిస్ట్ ఈయన.

2012 వ సంవత్సరంలో నిర్భయా రేప్ కేస్ తరువాత జస్టిస్ వర్మా కమిటీ ఏర్పడింది. స్త్రీల మీద లైంగిక అత్యాచారాలు చేసే నేరస్థులకి శిక్ష వేయడం, త్వరితమైన విమర్శ విచారణని అమలు పరచడం ఈ కమిటీ లక్ష్యం.
లైంగిక వేధింపుకు గురయిన స్త్రీకి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలి.

అయితే ఆ తరువాత ఏమయింది? ఏమవుతోంది? ఎవరైనా లక్ష్యపెడుతున్నారా? ఇంకా ఎన్నో అత్యాచారపు కేసులు బయటకి వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య మరీ ఎక్కువ సంచలనాత్మకంగా, మన ఇళ్ళలోకి తరచూ టివీల ద్వారా ప్రవేశిస్తున్న/ప్రవేశించిన ఈ రెండు ప్రముఖ కేసులనీ చూద్దాం.

తెహెల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ తన కూతురికి స్నేహితురాలూ, తన వయస్సులో సగం వయస్సున్న తోటి పాత్రికేయురాలూ అయిన అమ్మాయిని లైంగిక వేధింపుకి గురి చేసేడు. ఆ అమ్మాయి అతని మీద వేసిన కేస్ వల్ల సమాజం అతన్ని వెలివేసింది. తెహెల్కా తెరిచిన ముందు అతను ఆ అమ్మాయి తండ్రి కింద జూనియర్‌గా పని చేసేవాడు. తేజ్‌పాల్ చేతుల్లో ఉన్న అధికారంతో పాటు అతని గుడ్డి వాంఛ- విక్టిమ్ పట్ల అతను ఆ విధమైన అత్యాచారపు ప్రయత్నం చేయడానికి సహాయపడిందన్నది స్పష్టం. ఈ సంగతులన్నీ కూడా అతను చేసిన నేరానికి నీతిబాహ్యత యొక్క అదనపు పొరలని తొడుగుతాయి. ఢిల్లీలో దాఖలైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఫిర్యాదురాలి కుటుంబంపై ఒత్తిడి తెచ్చేందుకు తేజ్‌పాల్ ఇంతకుముందు ప్రయత్నించేడు.

స్త్రీ పైన నిర్బంధ అత్యాచారం(ఐపీసీ 376 (2)కె), ఆమె గౌరవానికి భంగం కలిగించడం (ఐపీసీ 354ఏ) – ఈ కేసుల్లో నిందితుడు అయిన తరుణ్ తేజ్‌పాల్‌కి- అతని నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ పొందే అర్హత లేదని కోర్ట్ తేల్చి చెప్పి, అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ నిరాకరించింది.
అతను పిటిషనర్ (పాత్రికేయురాలు)కి గురువు, తండ్రి వంటివాడు. అయితే ఆ స్థానాన్ని అతను దుర్వినియోగం చేసేడు. చిన్నప్పటినుంచీ అతనికి తండ్రి స్థానం ఇచ్చిన ఆ అమ్మాయి నమ్మకాన్ని వమ్ము చేశాడు.
112233
అయితే అప్పుడు కూడా విక్టిమ్ తన ధైర్యాన్ని కోల్పోలేదు. జరిగినవన్నీ ఒక క్రమంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, సహోద్యోగులకి మైల్ చేసి అతని మీద రిపోర్ట్ చేసింది. అతను తనకి ఫోన్లో పంపించిన మెసేజులూ వాటినీ భద్రపరిచి, సాక్ష్యాలతో సహా అతన్ని పట్టిచ్చింది. ఆ సంఘటన తరువాత ఆమె స్నేహితులతోపాటు మిగతా కొందరు కూడా తమ ఉద్యోగాలకి రాజీనామా ఇచ్చేరు. ఫలితం! అతను ఎంతో శ్రద్ధగా, ఏళ్ళ తరబడి నిర్మించుకున్న తెహెల్కా రాజ్యం కాస్తా కూలిపోయింది. మరింక అది తిరిగి నిలబడే ఆస్కారం కూడా లేదనిపిస్తోంది.
సెక్స్యుయల్ హరాస్‌మెంట్ కేస్లో ఇరుక్కున్న రాజేంద్ర పచౌరీ కేస్ కూడా భిన్నమైనదేమీ కాదు. అతనికి తేజ్‌పాల్ కన్నా ఎక్కువ పేరుంది. ఎక్కువ చదువుకున్నవాడు.22222222222222

విక్టిమ్ అతని కన్నా వయస్సులో చాలా చిన్నది. అతనికిందే, అతని డిపార్టుమెంట్లోనే పని చేసేది. తన పని గురించి చాలా ఆసక్తి కలిగి ఉండేది. టెరీలో ఉత్సాహంగా చేరింది. కానీ పచౌరీ ఆమె జీవితాన్ని నరకప్రాయం చేసిపెట్టగలిగే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు.

అతను ఆమెకి పంపించిన అనేకమైన టెక్స్ట్ మెసేజులూ, ఇ మైల్సూ ఆమెని అతను కనికరం చూపకుండా వేధించేడని నిరూపించేయి. ఒక సందర్భంలో ఆమెకి కౌగిలించుకుని, ముద్దు పెట్టుకోడానికి కూడా ప్రయత్నించేడని రుజువయింది. ఇటువంటి ప్రవర్తనని తను సహించనని మొదట ఆమె అతన్ని మందలించింది కూడా.
విద్యావంతుల తరగతి నడుమ సుప్తచేతనంగా వర్ధిల్లుతున్న ఆలోచనల సరిగమలకి పచౌరీ చర్యలూ, వాదనలూ ఒక రూపాన్నిస్తాయి. ఒక స్త్రీకి తన జీవితానికి సంబంధించిన విషయాల్లో ఒక ఎంపిక ఉంటుంది. ఆ విషయాన్ని మన సాంప్రదాయమైన భారతీయ ఆచారాలు బాహాటంగా ఉపేక్షిస్తాయి. ఈ సైంటిస్ట్ ఇలా ప్రవర్తించడానికి కారణం బహుసా అదేనేమో!

పని చేసే స్థలాల్లో స్త్రీల మీద సులభంగా ఉపయోగించగలిగే ఒక అస్త్రం ఈ లైంగిక వేధింపు అని రాజేంద్ర పచౌరీ కేస్ మరోసారి రుజువు చేస్తోంది.

లైంగిక వేధింపులని సంబోధించే మన అంతర్గత వ్యవస్థ ఎంత అసమర్థమైనదో అని ఈ రెండు కేసులూ నిరూపిస్తాయి. దాని వల్ల వీరు తాము చేపట్టిన ఉన్నత హోదాని దుర్వినియోగపరుస్తున్నారు.
స్త్రీలకి చట్టం అందుబాటులో ఉండదన్న అభిప్రాయం భారతదేశపు పురుషుల్లో అధికమందికి ఉంది.
స్త్రీల హక్కుల గురించి మాట్లాడే తెహెల్కాలో విషాఖా గైడ్ లైన్స్ నిర్దేశించిన లైంగిక వేధింపుల ఫిర్యాదులని సంబోధించే క్రియావిధానం కూడా లేకపోయింది. ఏదో హడావిడిగా ఒక కమిటీ ఏర్పాటు చేసింది అతని సంస్థ –ఆ సంఘటన తరువాత.

పచౌరీ విషయంలో టెరీకి అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉంది. విక్టిమ్ దాని శరణు కోరింది కూడా. అయినప్పటికీ ఆ కమిటీ న్యాయం చేయలేదు. విక్టిమ్ ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసింది. తను ఏ వ్యక్తికైతే అసిస్టెంట్‌గా పని చేస్తోందో, అతని బారినుంచి తనని కాపాడటం టెరీ ఉద్యోగుల ధర్మం అనీ, తన సంస్థ తనని సమర్థించలేదు అన్నదీ ఆమె భావన. 29 సంవత్సరాల ఈ పరిశోధక మహిళ అక్టోబర్ 2013 నుంచి జనవరి 2015 వరకు ఇద్దరి మధ్య జరిగిన మెయిల్స్, మెసేజేస్, వాట్సప్ ఛాటింగ్ విషయాలను బహిర్గతపరుస్తూ కేసు నమోదుకోసం పోలీసులను ఆశ్రయించింది.
దీంతో పోలీసులు పచౌరీపై కేసు నమోదు చేశారు.

తేజ్‌పాల్ విషయంలో తెహెల్కా, పచౌరి విషయంలో- టెరీ రెండూ కూడా నిందితుల పక్షమే వహించేయి. అది వారు అధికారం ఉన్న పదవుల్లో ఉండబట్టా? ఇలాంటి కేసుల్లో బాధితురాళ్ళకి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పెద్ద దెబ్బ తగులుతుంది. వారి ప్రతిష్ట, గౌరవం, భవిష్యత్తు, ఆర్థిక భద్రత ప్రమాదంలో పడతాయి. బాధితులు, వారి కుటుంబసభ్యులు సామాజికంగా పరిహాసానికి గురవుతారు.
లైంగిక వేధింపులని రిపోర్ట్ చేయడం అంత సులభం కాదు. ఆ ప్రక్రియ బాధాకరమైనది. పరాభవం ఎదురుకోవాలి. అలసట కలుగుతుంది. కేసులు ఏళ్ళ తరబడి కోర్టులో నలుగుతాయి. వదిలివేయడమే ఉత్తమమేమో అన్న ఆలోచనని కలుగుతుంది. అయినప్పటికీ, వీటన్నిటినీ అధిగమిస్తూ ఈ ఇద్దరమ్మాయిలూ తమ హక్కుల కోసం, తమ మర్యాద/ఆత్మగౌరవం కోసం దేనికీ లొంగక పోరాడేరు/పోరాడుతున్నారు.

ఈ మధ్యకాలంలో స్త్రీలకి ఈ విషయంమీద జాగృతి హెచ్చైనట్టుగా కనిపిస్తోంది. అందుకనే ఇటీవలె కొంతమంది పురుషులైనా ఈ నేరాలకి పట్టుబడుతూ, భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ఈ ఇద్దరి సాహసవంతులైన యువతుల వల్లా మరి కొందరైనా స్పూర్తి పొంది నిశ్శబ్దంగా ఇలాంటి వేధింపులని సహించే బదులు ముందుకి వచ్చి వీటిని ఖండిస్తారేమో! మళ్ళీ ఇలాంటి నేరాలు చేయడానికి- గుడిసెల్లో బతికేవారే కాదు-ఇలాంటి సామాజిక హోదా కలిగి ఉన్న పురుషులు కూడా జంకే పరిస్థితి రాగలదేమో! ఎవరికి తెలుసు! ఆశే జీవితాన్ని నడిపిస్తుంది. సాహసమే పురోగమనానికి పునాది.
గమనిక- ఇది రాసినప్పటికి పచౌరీ కేసులో ఇంకా కోర్ట్ తీర్పు వెలివడలేదు.

–  కృష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
8 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
కిరణ్ కుమార్ కే
కిరణ్ కుమార్ కే
5 years ago

కృష్ణ వేణి గారు,

ఈ సారి మరొక చక్కటి సామజిక రుగ్మత అంశాన్ని చక్కగా వివరించారు. ఇలాంటి అనేక సామాజిక అంశాలను ఎన్నుకుంటూ మీరు రాయటం అభినందనీయం.

Krishna Veni Chari
Krishna Veni Chari
5 years ago

కిరణ్ కుమార్ కె గారూ,
బోల్డు థేంక్స్ . సామాజిక అంశాలయితే బుర్రకి తడతాయి. ఉన్న సమస్యల్లా నాకొచ్చిన తెలుగుతో వాటిని వ్యక్తీకరించడమే..

i j swamy
i j swamy
5 years ago

Y Chromosome makes the difference . It is inexplicable often

Krishna Veni Chari
Krishna Veni Chari
5 years ago
Reply to  i j swamy

I j Swamy gaaru, is the “Y” chromosome that powerfully active at the age of 74? Even if it is- does it neglect one’s education?

Sai Padma
Sai Padma
5 years ago

కృష్ణ గారూ, ఇప్పుడే ఒక ఆర్బిట్రేషన్ కేసులో , సహ మహిళా లాయర్ ని వేధించి .. ఆ కేసు పేపర్లు తిరిగి ఇవ్వటానికి కూడా ఆ అమ్మాయి భయపడేలా వేధించిన సీనియర్ లాయర్ కేసు విని ..ఫస్ట్ స్టేజ్ కౌన్సెలింగ్ చేసాను. నాకు ఈ ఆర్టికల్ హృదయానికి హత్తుకుపోయింది. ఎందుకు ఇలా చేస్తారు ? అన్నది పక్కన పెడితే .. ఎంతోమంది తెలివైన అమ్మాయిలూ కూడా నిశ్శబ్దం లోకి కూరుకుపోయేలా చేస్తున్న సిస్టం అంటే కోపంగా ఉంది ..
ఆమెకి అదే చెప్పాను.. లాయర్ వి నువ్వే మాట్లాడకపోతే వేరే వాళ్ళు నీ తరపు ఎవరూ మాట్లాడరు.. హెచ్ ఐ వీ కన్నా కూడా మింగలేని కక్కలేని పరిస్థితి కాదు కదా.. ఎదుర్కోండి, మిగతా సపోర్ట్ అంతా నేను చేస్తాను అని చెప్పాను
ఎక్కడ చూసినా , చేయాల్సిన పని ఎంతో ఉంది .. తరుణ్ తేజ్పాల్ ని నగ్నంగా నిలబెట్టిన ఆ అనామిక కి నా హృదయ పూర్వక అభినందనలు .. అలాగే పచవురీ కేసులో విక్తిం కి కూడా !

Krishna Veni Chari
Krishna Veni Chari
5 years ago
Reply to  Sai Padma

సాయి పద్మా నిజమే కదా! తమమీద అత్యాచారం జరిగిన చదువుకున్న అమ్మాయిలే ముందుకి రాకపోతే తక్కివవాళ్ళెందరని, దేని కోసమని వాళ్ళకి సహాయం అందించగలరు!

Venkata S Addanki
Venkata S Addanki
5 years ago

మీరు వివరించిన విషయాలు చాలా బాగున్నాయి. పై రెండు కేసులలో కూడా ఈ మెయిల్స్ మరియు టెక్ట్ మెసేజస్ ఉన్నాయి కాబట్టి దోషులని బంధించగల అవకాశాలు ఉన్నాయి, కానీ చాలా చోట్ల ఈ విధమైన ఆధారాలు ఉండవు, మీద చేతులు వెయ్యడమో లేక చేతులు ప్రైవేట్ పార్ట్స్ కి తగిలేలా చూడడమో లేదంటే అసభ్యకరమైన లేక అభ్యంతరకరమైన భాషా ప్రయోగమో ఉంటుంది. శారీరకంగా టచ్ చెయ్యడం పక్కనపెడితే ఈ అభ్యంతరకర భాష అన్నదానికి ఒక నిర్వచనం లేదు ఎందుకంటే స్త్రీలు కూడా ఈ భాషమాట్లాడడం మొదలుపెట్టారు. ఇంక పై రెండు కేసులలో మీరు చెప్పిన మాటలని సమర్ధిస్తూ కూడా కొంత ఆలోచించవలసిన విషయం ఏమిటీ అంటే వారు పోలీస్ వ్యవస్ధని సంప్రదించడానికి తీసుకున్న సమయం ఎందుకు ఎక్కువగా ఉంది అన్నదానికి సరైన సమాధానాలు ఉన్నాయా, ఎందుకంటే ఈ లైగింక పరమైన వేధింపులలో మొదటచూసీ చూడనట్లు వెళ్ళడం అన్నది సహజం, శారీరకంగా టచ్ చేసినపుడు ఒకటిరెండుసార్లు పొరపాటున అని అనుకున్నా ఈమెయిల్ మరియు టెక్ట్ మెసేజస్ దోషుల మనస్ధత్వాన్ని తేటతెల్లం చేస్తాయి. అటువంటప్పుడు అటువంటివాటికి విముఖత తెలియజేసినా కూడా మళ్ళీ పంపడం అంటూజరిగితే వెంటనే ఈ విధమైన కేసులు బుక్ చెయ్యడం జరగాలి , పంపేవారి స్ధాయినిచూసో లేక మరొకటో ఆలోచించి జాప్యం చెయ్యడం అన్నది వివిధరకాల వాదనలకి తెరతీస్తుంది. సమాజంలో ఉండవలసిన సానుభూతికూడా కొన్నిసార్లు కోల్పోయే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఇప్పటికే హెల్ప్ లైన్స్ ప్రారంభించాయి, దాని కన్నా సమాలోచన కౌంటర్లు తెరచి సరైన స్త్రీ సిబ్బందిని నియమించి కౌన్సెలింగ్ ద్వారా బాధితులకి ధైర్యం చెప్పించగల వెలుసుబాటు కలుగజేస్తే బాధితులకున్న అనుమానాలు తొలగి వారికి వారు అనుభవిస్తున్నది లైగింకవేధింపా కాదా అన్నది తెలుసుకోవడానికీ మరియు వారు భయపడుతున్నట్లు వారి పనికి ఆటంకాలు రావు అన్న ధైర్యం కూడగట్టుకోవడానికీ ఉపయోగపడతాయి. ఒకరి మీద ఫిర్యాదు చేయడానికి ముందు ఈ కౌన్సిలింగ్ ఉండడం వల్ల అనవసర కంప్లయింట్స్ ఉండవు. మీ కాలమ్స్ అన్నీ కూడా సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి. మీకు ధన్యవాదాలు. మీ నుండి మరిిన్ని సమస్యలమీద అవగాహన కలిగించే కాలమ్స్ ఆశిస్తూ శెలవు

Krishna Veni Chari
Krishna Veni Chari
5 years ago

వెంకట్ ఎస్ అద్దంకిగారూ, మీరు చెపినది నూరు శాతం సత్యం