భోగి రోజు తెల్లవారు ఝామునే మా అందరి కుర్రాళ్ల తల స్నానాలు అయ్యేక మా నాన్నమ్మ మోహన్ కి కూడా నూనె రాసి , నలుగు పెట్టి , చిక్కటి కుంకుడు కాయ పులుసుతో రెండు సార్లు తల రుద్ది స్నానం చేయించింది . లోపలికొచ్చి “ఎన్నాళ్లైందో ఈ తలకి నీళ్లోసుకుని ? ఎంత మురికి !” అని సణగడం మొదలెట్టింది .
మధ్యాహ్నం భోజనాలయ్యేయో లేదో , కొండల్రావు గారు ఓ పెద్ద గేంగుని వెంట బెట్టుకుని వచ్చేసారు . అందర్నీ సినిమాకి ప్రయాణం చేయించారు . మా సీతారామా టాకీసుకి లవకుశ సినిమా మొదటి రిలీజ్ గా వచ్చింది .థియేటర్ పుల్లయ్యగారి ఆధ్వర్యంలో ఉందికదా ! మేం వెళ్లే సరికి మేట్నీ ఫ్రారంభమై పోయింది .బైట హౌస్ ఫుల్ బోర్డు పెట్టేసారు . నాకు తెలిసి ఆ హాల్లో అలా జరగడం అదే మొదటిసారి . ఎక్కడెక్కడి నుంచో జనం బళ్ళు కట్టుకుని వచ్చేసారు . ఉదయం నుంచి టైంతో సంబంధం లేకుండా ఆటలు వేస్తూనే ఉన్నారట . మేమంతా సాయంకాలం ఇళ్ల కెళ్లి రాత్రి భోజనాలు చేసేసి మళ్లీ వచ్చేం . చివరికి అర్దరాత్రి పన్నెండు గంటలు ఆటకు టిక్కెట్లు సంపాదించేరు . మోహన్ కి నా పక్కన కూర్చోవాలని ఉంది . కొండల్రావు గారు అదేమీ పడనివ్వలేదు .
కనుమ పండగ రోజు వన భోజనాలకి ప్లాన్ చేసేరు . తేలిక పాటి గిన్నెలు – గరిటెలు లాంటివి ఆడపిల్లలకిచ్చి , బరువుగా ఉండే సంచులు మగవాళ్లు పట్టుకున్నారు . గోకవరం రోడ్డులో ఉండే కొత్త సత్యంగారి తోటలో చేసేరు . దాన్ని మేమంతా లీల వాళ్ల తోట అనేవాళ్లం . ఎందుకంటే లీల వాళ్లమ్మ సత్యం గారితో ఉండేది . ఆయనకు వేరే భార్యా పిల్లల్లూ ఉన్నా , వీళ్లను కూడా ఆయన పిల్లలనే అనేవారు . కాకినాడ నుంచి పండక్కి వచ్చిన లీల కూడా మాతో వచ్చింది . మీనాక్షి వాళ్ల తోటలాగే ఈ తోట కూడా ఎంతో అందమైనది . అన్ని రకాల పళ్ళ చెట్లు , పూల మొక్కలు ఉండేవి . అప్పట్లోనే ఈ తోటలో బెంగుళూరు మిరపకాయలు (కాప్సికమ్ ) ఉండేవి . ఏదో ఒకటి వండడం , తినేసి కాస్సేపు ఆడుకోవడం . పుట్ బాల్ , రింగ్ టెన్నిస్ లాంటివి . రోడ్డు గుమాస్తా గారి అబ్బాయి (పేరు గుర్తు లేదు )లాంటి బ్రాహ్మల అబ్బాయిలు పూనుకుని వంటలు చేసేసారు . సాయంకాలం చీకటి పడేవేళ తిరిగి గిన్నెలు , ఖాళీ సంచులు మోసుకుంటూ నవ్వుకుంటూ – తుళ్లుకుంటూ ఇళ్ళకి చేరుకున్నాం. అలామూడేళ్ల పాటు సందడి చేసిన కొండల్రావు గారు ఇప్పటికీ గుర్తుండి పోయేరు . (ఆయన ఇప్పుడు చికాగోలో ఉంటున్నారు .) డా.గోలిశ్రీరాములు గారి ప్రాక్టీసు అప్పుడప్పుడే జోరందుకుంటుందని చెప్పుకొనేవారు . డా. జయ గారి ఇంటికెదురుగా వీధిలో ఎడం పక్క మొదటి పెంకుటింట్లో అద్దెకు దిగేరు . సొంతంగా గుర్రబ్బండి ఉండేది . ఆ బండిలో వెళ్లి వైద్యం చేసే వారు . శ్రీరాములు గార్ని అందరూ M.B.B.S డాక్టరు అనేవారు . ఆయనే ఈ ఊరికి మొదటి M.B.B.S ప్రాక్టీషనరు . వాళ్ల పెద్దబ్బాయి సత్య క్రిష్ణకి ఎనిమిదేళ్ల వయసుండేది . వాళ్ల ఆఖరబ్బాయో , అమ్మాయో గాని చంటి పిల్లలు . మా వీధిలో ఎవరింట్లో చంటి పిల్లలున్నా మా ఇంటికి తెచ్చేసుకునే వాళ్లం . మా నాన్నకు కూడా చాలా ఇష్టం . వాళ్లు ఎక్కడి నుంచో వచ్చేరు, అడిగితే ఏమనుకుంటారో అని కొన్నాళ్లు సంశయించినా ఒక రోజు డాక్టరు గారు లేని సమయంలో వెళ్లి అడిగితే వరాలమ్మ గారు వెంటనే నవ్వుతూ ఇచ్చేసారు . వెంట సత్య క్రిష్ణ , మిగతా పిల్లలూ వచ్చి మా తమ్ముళ్లతో చెల్లెళ్లతో ఆడుకునేవారు . తర్వాత మోహన్ ఈ ఊరి హైస్కూలుకి టీచరుగా వచ్చేక ఆ పిల్లలంతా ఆయన దగ్గర చదువుకున్నారు . సత్య క్రిష్ణ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ లో చదివేటప్పుడు ఏదో ఎగ్జిబిషన్ కి మేం వెళ్తే వెంట ఉండి అన్నీ చూపించాడు . డాక్టరై ప్రాక్టీసు పెట్టేక కూడా ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించేవాడు . ఈ మధ్య సత్య క్రిష్ణ హార్టె టాక్ తో మరణించినప్పుడు నేను చాలా దుఃఖ పడ్డాను .
పండగకి వచ్చినప్పుడు మోహన్ పోస్టల్ కవర్లు తెచ్చి ఇచ్చి నన్ను ఉత్తరాలు రాయమని మరీ మరీ చెప్పి వెళ్లేడు . తీరా రాయాలని కూర్చుంటే నా పుస్తకం చదివిన పరిజ్ఞానమంతా ఎక్కడికి పోయిందో కాని , ఏం రాయాలో తోచలేదు . హాఫ్ ఇయర్లీ మార్కుల లిస్టు – అవీ ఇవీ కలబోసి రాసి మా అమ్మకిచ్చేను . ఎందుకంటే మా నాన్న చదివి ‘సరే ‘ చెప్పాలి . మోహన్ ఇచ్చిన కాలేజ్ ఎడ్రస్ కి ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేసిన వారం తిరక్కుండా కొత్త చేతి వ్రాతతో ఓ పెద్ద రిప్లై వచ్చింది . ‘చెల్లెమ్మ ‘ అంటూ . మోహన్ తన క్లోజ్ ప్రెండ్ అనీ , నా ఉత్తరాన్ని తనకి చూపించేడనీ , ఓ అన్నగా తననొక ఉత్తరం రాయమన్నాడని . నేను హడలిపోయేను.ఈలోగా మోహన్ నుంచి మరో ఉత్తరం నేను రిప్లై రాయలేదేంటని . జరుగుతున్న దేంటో నాకు అర్ధం కాలేదు . నేను సైలెంటైపోయి నా చదువులో పడిపోయేను.
ఆ తర్వాత మరో వారానికి నేను తదేకంగా నోట్సు రాసుకుంటూండగా నా స్నేహితులు నా భుజం తట్టి రోడ్డు వైపు చూపించేరు . రోడ్డుకవతల చెట్టు కింద చేతిలో ఓ ఎర్ర గులాబీ పట్టుకుని జాలి ముఖంతో మా క్లాస్ వైపు చూస్తూ మోహన్ . నేను చూడనట్టే ముఖం తిప్పుకొని రాసుకుంటూ ఉండిపోయేను . స్కూలు ముగిసేక గేటు దగ్గర కొచ్చి గులాబీని నా చేతికిచ్చి రిప్లై ఎందుకు రాయడం లేదని అడిగేడు . నేను నా పుస్తకాల్లో ఉన్న అన్నయ్యెవరో రాసిన ఉత్తరం తీసి అతని చేతికిచ్చి వెళ్లిపోయేను. మరో నాలుగు రోజుల్లో అతను మళ్లీ స్కూలు దగ్గర కన్పించేడు . ఎప్పట్లాగే చేతిలో గులాబీ , స్కూలు విడిచి పెట్టేక నా వెనకనే మా ఇంటి కొచ్చేడు . నా ఉత్తరం వాళ్ల కాలేజ్ లో ఎవరో ఫస్టియరబ్బాయి చేతుల్లో పడిందని , అతను నాకు ఉత్తరం రాసేడనీ , తను ఫ్రెండ్స్ తో వెళ్లి అతన్ని చితక్కొట్టేసానని చెప్పేడు .నాకు భయం వేసింది , మామూలు విషయానికి కొట్టెయ్యడమెందుకని . ఈసారి వాళ్ల ఇంటి ఎడ్రస్ ఇచ్చాడు . వాటిని ప్రేమ లేఖలు అనొచ్చో లేదో కాని ఇద్దరం చాలానే ఉత్తరాలు రాసుకున్నాం . “ నీ చదువు గురించి , మార్కుల గురించి రాస్తావెందుకు , అవేం ప్రేమ లేఖలు ?” అనే వాడతను నిష్టూరంగా . ‘ ఏదో ఒక వంకపెట్టుకుని ఆదివారాలు మా ఇంటికి రావడం మొదలు పెట్టేడు మోహన్ . రెండు మూడు సార్లు చూసి “ బాబూ , పెళ్లి కాకుండా నువ్విలా రావడం బాగా లేదు “ అని చెప్పేసేరు మా నాన్న . అతను రోజూ ఓ ఉత్తరం రాసేవాడు . ఒకోసారి రెండు , నేను చదువులో పడి అలా రాయలేకపోయే దాన్ని . అతను B.SC సెకండియర్ స్టూడెంట్ . ఎప్పుడు చదువుతాడా అని ఆశ్చర్యం వేసేది నాకు .
కాని , క్రమంగా మా ఉత్తరాలలోని కొన్ని వాక్యాలో , పొయెటిక్ పదాలో నేను స్కూల్ కి వెళ్లినప్పుడో , వస్తున్నప్పుడో రోడ్డు పక్కనున్న హోటల్స్ లోంచో , బడ్డీ కోట్లలోంచో విన్పిస్తూండేవి. అప్పటికి మా ఊరి పోస్టు మాస్టరు అప్పన్నగారబ్బాయి స్కూల్ ఫైనలై ఖాళీగా ఉండేవాడు . అతను తీరి కూచుని ఉత్తరాలు విప్పి చదవడమే కాదు, కాపీ చేసి అందరికీ పంచుతూండేవాడని తర్వాత తెలిసింది . మోహన్ కి చెప్తే ఇతన్తో కూడా కలబడతాడేమోనని భయం వేసి చెప్పలేదు . కాని , ఉత్తరాలకి ఓ సెన్సార్ షిప్ విధించుకోవాల్సి వచ్చింది . అప్పటికి లెక్కల్లో జనరల్ , కాంపోజిట్ అని రెండు విభాగాలుండేవి . తొమ్మిదో తరగతి నుండి మూడేళ్ల పాటు ఏదో ఒక విభాగాన్ని ఎంచుకుని చదవవలసి ఉండేది . క్లాసులో ఎక్కువ భాగం జనరల్ లోనే చదివేవారు . కేవలం తొమ్మిది మంది మాత్రం కాంపోజిట్ లో ఉండే వాళ్లు . ఆడపిల్లలం జనరల్ లోనే ఉన్నాం . పండక్కి వచ్చినప్పుడు మోహన్ నన్ను కాంపోజిట్ లోకి మారమని చెప్పేడు . ఎందుకో ఏవిటో తెలీకుండా నేను మారిపొయేను . అప్పట్నుంచీ నాకు లెక్కల్లో నూటికి నూరు మార్కులొచ్చేవి . మా లెక్కల మాస్టారు పద్మనాభ రావుగారు ఎప్పుడూ మెచ్చుకునే వారు . అది చూసి మోహన్ ఒకసారి ఉత్తరంలో “నీకు కాంపోజిట్ కష్టమై మేథ్స్ చెప్పడానికి అప్పుడప్పుడు నన్ను రమ్మని పిలుస్తావేమో అనుకున్నాను “ అని రాసాడు .
మోహన్ వాళ్లింట్లో ఏం పేచీ పెట్టేడో తెలీదు – ఇంకో ఏడాది తర్వాత నా స్కూల్ ఫైనల్ , తన డిగ్రీ ఫైనల్ అయ్యేక అనుకున్న పెళ్లి ఈ సంవత్సరం సెలవుల్లోనే చెయ్యాలి అని వాళ్లు కబురు చేసేరు . మా వాళ్లు హడావుడి పడిపోయి పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయేరు . స్కూల్ ఫైనల్ అయ్యే వరకూ ఆగమని నేనెంత మొత్తుకున్నా ఎవరూ విన్పించుకోలేదు . హనుమంతవఝల వెంకన్న పంతులు గార్ని పిలిచి ముహూర్తం నిశ్చయించేసారు .
1964 మే 31 అర్దరాత్రి 1.30 ముహూర్తం .
కనీసం వచ్చే సంవత్సరం నేనిక్కడే ఉండి స్కూల్ ఫైనల్ పూర్తి చెయ్యడానికైనా వొప్పుకోమని గోలపెడితే మా నాన్న వెళ్లి వాళ్లకి చెప్పి వొప్పించి వచ్చేరు .
(నేను – నా బాల్యం సమాప్తం )
తర్వాత నేను – నా వైవాహిక జీవిత ప్రారంభం.
– కె .వరలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~