లలిత గీతాలు

ఊపిరి సొగసువు నీవై ఊహల గగనం నీవై
విహరించే మేలి మబ్బు జిలుగు తునక చివరంచువు నీవై
మల్లె పూలై విరగ బూసిన చుక్కలవుతూ
పరిమళాల ప్రవాహాల పలకరించు చిరుగాలి చెక్కిలి
సిగ్గు బరువున మోసుకొచ్చే నెమలీక ప్రేమలు

చూపు శ్వాసకు శ్వాస చూపై మెత్త మెత్తని చినుకు సవ్వడి
ఎద మెట్లపై నా జారి జారి తొలకరింపై చిలకరింపై
హత్తుకున్న వెలుగు వాకల చల్ల చల్లని స్పర్శ గిరికీలలో
విద్యుత్ వరద వెల్లువ పొంగిపొర్లే సంబరాన మెల్ల మెల్లన
పొలక మెరుపై మరకతాలై కళ్ళు విప్పే పైరు పచ్చని గరిక తలలు

మొలకలెత్తే అందమైన ఆకు పాపలు ఉదయకాలపు వెలుగు జిలుగున
నాట్యమాడే అప్సరసలా కాదు కాదు శిల్పి చేతన చెక్క బడిన బంగరు విగ్రహాలా
నేల మాళిగ సందులోన తలదాచుకున్న చీకటికి జోలగ
హోరు హోరున ఎగిసి ఎగిసి నేల కొరిగే అలల సొబగులు

ఉదయకాంతుల అమృతాలను స్వీకరించి
మత్తు మరపున మరపు చాటున మోముదాచుకు
విశ్రమించే జీవితాలిక దాచుకున్న ఉప్పునీళ్ళను పుక్కిళ్లకొద్దీ
సముద్రాలై పరవళ్లు తొక్కే చివరి స్సంధ్యన వెరపు దేనికి

– స్వాతీ శ్రీపాద 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

లలిత గీతాలు, , , , , , , , , , , , , Permalink

Comments are closed.