నా కళ్లతో అమెరికా-41

 

ఎల్లోస్టోన్ -5

Dr K.Geetha

Dr K.Geetha

ముందు రోజంతా ఎల్లోస్టోన్ లో కడుపులో తిప్పే వాసనల్లో తిరుగుతూ ఉన్నామేమో ఇవేళ ముక్కుకి కట్టుకోవడానికి కట్టుదిట్టంగా తెచ్చుకున్నాను. అక్కడి మా బస ని మేం ఖాళీ చేసి బయలుదేరేం. సాయంత్రం మరో చోట కి మారాలి మేం. రాట్రి తాలుకు గొడవలన్నీ తెల్లారి మెరిసే వెల్తురు మాయం చేసి మరలా హుషారు నింపింది. నాకు, సిరికి దోమ కాట్ల వల్ల రూపాయి కాసంత సైజులో దద్దుర్లు వచ్చి అలానే ఉండిపోయాయి.

ఇవేళ మేం ఎల్లోస్టోన్ లోని మిగిలిపోయిన ప్రదేశాలన్నీ చుట్టి రావాల్సి ఉంది. మర్నాడే తిరుగు ప్రయాణం.

మేం ఉన్న కేన్యన్ లాడ్జి నించి పార్కు ఉత్తర ముఖ ద్వారానికి వెళ్లే దారి రెండుగా చీలి ఉంది. అందులో ఒక దారి పట్టుకుని వెళితే రెండో దారిలో తిరిగి రావొచ్చు. ముందు రోజు చూసిన నోరిస్ మీంచి వెళ్ళే దారి ఒకటి, డన్ రావెన్ పాస్ అనే కొత్త రోడ్డొకటి.

మేం కొత్త దారిలో, అంటే డన్ రావెన్ పాస్ మీదుగా ముందు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. 

నిన్నంతా దక్షిణ ప్రాంతాలు చూసేం కాబట్టి ముందుగా ఉత్తరానికి బయలుదేరి  అక్కడి పార్కు ఉత్తరపు సరిహద్దును చూసి, తిరిగి వస్తూ  మిగిలినవి చూడాలని అనుకున్నాం. బ్రేక్ ఫాస్టుగా కాస్త బ్రెడ్డు, పళ్లు వగైరా స్టోర్ లో కొనుక్కుని పది గంటల వేళ బయలుదేరేం.

యెల్లోస్టోన్ ఉత్తర భాగం నిన్న చూసిన దానికి పూర్తి విభిన్నంగా ఉంది. పచ్చని చెట్ల పర్వతాలు, శిఖరాగ్రాల్లో తెల్లని మంచు టోపీలు.

ఏ పర్వతమ్మీద ఆగినా కనుచూపుమేర కనిపించే లోయలు, పర్వతాలు.

మరి కాస్త ముందుకి వెళ్లగానే రోడ్డు పక్కనే అందంగా పేరుకున్న మంచు మమ్మల్ని దాటిపోతూ కనిపించింది.

ఆ వేసవిలో తొలిసారి కనిపించిన మంచు కావడం వల్ల వెనక్కి వెళదామని పేచీలు పెట్టేం. కారు వెనక్కి తీసుకుని దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆగకూడదని బోర్డు ఉంది.  ఇక చేసేదిలేక ముందుకి వెళ్లేం.

అలా పచ్చదనాల్ని కళ్లనింపుకుంటూ పర్వతాల్ని ఎక్కి దిగుతూ మా జీపుని  అక్కడక్కడా ఆపుతూ ఫోటోలు తీసుకుంటూ ముందుకెళ్ళేం.

హాంగింగ్ వేలీ:- దారిలో హాంగింగ్ వేలీ దగ్గిర ఆగి రోడ్డు వార నించి కొద్దిగా ముందుకి దిగేం.

అక్కడ దిగువన రెందు కొండల మధ్య జడ ముందుకు వేసుకున్నట్లు చిన్న జలపాతం అందంగా ప్రవహిస్తూంది. అక్కడే మరికొంచెం ముందుకి నడిస్తే అందమైన లైం స్టోన్ ల తో అలరారే విభిన్న పర్వతాలు దర్శనమిస్తాయి.

ఒక వంపులో దిగువన మెలికలు తిరుగుతూ ప్రవహిస్తున్న నదీ ప్రవాహపు సోయగం కనువిందు చేసింది.

మరి కొంచెం ముందుకి రాగానే ఒక్క పచ్చని మొక్కా లేని గ్రాండ్ కెన్యన్ వంటి నిలువెత్తు శిలలు ప్రత్యక్షమయ్యాయి.

యెల్లోస్టోన్ లో  ఉత్తర ప్రాంతమంతా యూసోమిటీ, గ్రాండ్ కెన్యన్  కలిపి అటూ ఇటూ విసిరేసినట్లు  అనిపించింది.

ఫ్లోటింగ్ ఐలాండ్ లేక్: ఫ్లోటింగ్ ఐలాండ్ లేక్  దారి పక్క చిన్న అందమైన సరస్సు మాత్రమే కాదు. అద్భుతమైన సరస్సు. సరస్సు అటు ఒడ్డున వరుస కాపలా సైనికుల్లా నిలబడ్డ పైన్ వృక్షాల అందాల నీడలు సరస్సు పొడవునా ప్రతిఫలిస్తూ అద్భుత చిత్రపటంలా ఉంది ఫ్లోటింగ్ ఐలాండ్ లేక్.

డన్ రావెన్ పాస్ లో దారి పొడవునా దూరాన కనిపించే “మౌంట్ వాష్ బర్న్” మంచు పర్వతాన్ని చూస్తూ మైమరుస్తూ ముందుకు సాగేం.

అక్కడక్కడా ఎల్క్ లన బడే దుప్పులు దొరికిన లేత గడ్డిని మెడలు వంచి కొరుకుతూ కనిపిస్తే, బైసన్ లన బడే అడవి దున్నలు  బద్ధకంగా పడుకుని కనిపించాయి.

దారిలో  కొండల మధ్య కురుస్తూ చిన్న  “రైన్ జలపాతం”  కనువిందు చేసింది.

మామోత్ :- మామోత్ కి చేరేసరికి 12 గంటల వేళ అయ్యింది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఎలోస్టోన్ నార్త్ ఎంట్రన్సు వస్తుంది. ఈ గేటు మోంటానా రాష్ట్రం లోకి తెరుచుకుంటుంది. అయితే మేం మామోత్ నించి వెనక్కు వచ్చేసేం. మధ్యాహ్న భోజనాలకు ఎక్కడైనా ఆగాల్సి ఉంది. పైగా ఇక్కడ చూడాల్సినవి పెద్ద ఎక్కువగా ఏవీ లేవు.

మామోత్ హాట్ స్ప్రింగ్స్ ఏరియా:- చూడదగ్గ ప్రాంతం “మామోత్ హాట్ స్ప్రింగ్స్ ఏరియా” ఒక్కటే.  ఇక్కడ ఎప్పటి కప్పుడు సుద్దరాయి కరుగుతూ, భూమిలో నుంచి లావా ఉబుకుతూ భూతలం మారుతూ వస్తూందట. అందులో ఒకటి రోడ్డు వారనున్న “లిబర్టీ కేప్” అనే సుద్దరాయి స్థూపం వంటిది.

కానీ జనం విరగబడి ఉన్నారు అన్నిచోట్ల. రెస్ట్రూంస్ ఒకే ఒక చోట ఉన్నాయి. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా కారు ఆపుకుందుకు పార్కింగు ఖాళీ లేదు. సిరి నిద్రపోతూండడం వల్ల నేను కిందనే కారులో ఉండిపోయాను.

సరిగ్గా పదిహేను నిమిషాలలో రావాల్సిన వాళ్లు మధ్యలో బైసన్ల గుంపు  దారికడ్డంగా రావడంతో  మరో అరగంట లేటుగా వచ్చారు.

ఇక అక్కణ్ణించి తిరిగి నోరిస్ మీదుగా వచ్చేసి లంచ్ చేద్దామని అనుకున్నాం. 

లిటిల్ గ్రాండ్ కెన్యన్:- అయితే వచ్చే దారి మలుపులో చిన్న సైజు గ్రాండ్ కెన్యన్ అని బోర్డు చూసి అటు లోపలికి కారు పోనిచ్చాం.  ఆ రోడ్డులో అలా కనబడినవి చూసుకుంటూ వెళ్తూ మరో గంట తర్వాత బయటికి మరో దారిలో వచ్చి కలిసేం. అక్కడ పర్వతం ఎలా పుడుతుందో ఆనవాలుగా లోపలెక్కడో లావా పైకి తోస్తూ ఉన్న పర్వతం చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు నేల చదునుగా ఉండేదట. ఇప్పుడు ఒక మాదిరి గుట్ట తయారైందక్కడ.

అప్పటికే ఆకలి వేస్తూంది అందరికీ. ఇక అక్కడి నించి దారిలో ఎక్కడ తినడానికి దొరికితే అక్కడ ఆగాలని అనుకున్నాం.

అక్కడి నుంచి నోరిస్ జంక్షన్ కు మరో అరగంట లో చేరతాం. అక్కడేమీ లేకపోతే తిన్నగా మేం ఉదయం బయలుదేరిన చోటికి వెళ్లొచ్చని అనుకున్నాం.

అయితే ప్లాన్ చేసినంత సాఫీగా జరగలేదు అవేళ్టి ప్రయాణం.

ఇంకా నోరిస్ కు మరో పావుగంట లో చేరుతామనగా రెండు మైళ్ల పొడవునా రోడ్డు కన్స్ట్రషన్ వల్ల కార్ల ని ఒక వైపు తర్వాత మరో వైపు వదులుతూండడం వల్ల కొంత, అడవి దున్నలు దాటుతూండడం వల్ల కొంత, దారిలో రోడ్డు కూలడం వల్ల కొంత ట్రాఫిక్ జాము అయ్యి దాదాపు గంటన్నర సేపు జాములో చిక్కుబడిపోయాం. సత్య డ్రైవ్ చేస్తున్నాడు. పిల్లలూ, నేనూ ఒక పక్క ఆకలి వేస్తూన్నా, పడి నిద్రపోయాం. ట్రాఫిక్ జాము అయ్యేక లేచేం. అప్పటికే అక్కడే ఉన్నామని తెలిసి నవ్వుకున్నాం. కానీ డ్రైవ్ చేస్తున్న సత్యకి మాత్రం నవ్వు రాలేదు.  

నోరిస్ లో చిన్న గిఫ్ట్ షాఫు తప్ప ఏవీ లేదు తినడానికి. ఇక మాకు ఉదయం బయలుదేరిన కేన్యన్ విలేజే గతి అయ్యింది. మధ్యాహ్నం 3 గంటల వేళ భోజనానికి హోటలుకి చేరుకున్నాం. కానీ అప్పటికి అందరికీ ఆకలి పోయింది. ఏవో కాస్త సూప్స్, మొక్కజొన్నలు, ఐస్క్రీము లతో కడుపు నింపుకున్నాం.

తర్వాతగా మా రాత్రి బసకు దక్షిణంగా ఉన్న లేక్ విలేజ్ కు చేరాల్సి ఉంది. కేన్యన్ విలేజ్ కు, లేక్ విలేజ్ కు మధ్య దాదాపు 20 మైళ్ల దూరం ఉంటుంది. ఈ మధ్యలో వచ్చే విశేషాలు ఆ రోజు పూర్తయేలోగా అంటే మరో 2,3 గంటల్లో చూడాల్సి ఉన్నాయి. ఐస్క్రీము తినే సరికి పిల్లలకి హుషారు వచ్చింది.

భోజనానంతరం చూడాల్సినవి ఆ రోజు లో మరిచిపోలేని జ్ఞాపకాలు. బహుశా: ఆ రోజు లోనే కాదు, యెల్లోస్టోన్ ప్రయాణం మొత్తమ్మీద మరిచిపోలేని అనుభవాలు.

యెల్లోస్టోన్ రివర్ :- దారిలో కిందుగా “యెల్లోస్టోన్ రివర్” ప్రవహిస్తూ కనిపించింది.  మట్టి లోయల్ని ఒరుసుకుంటూ మహోధృతంగా ప్రవహిస్తూంది యెల్లోస్టోన్ నది. ఆ చుట్టు పక్కల గ్రాండ్ కేన్యన్ బాగా జ్ఞాపకం వచ్చింది. నది కాస్సేపు మన పక్కనే ఉన్నట్లు అనిపించినా మరి కాస్సేపటికి ఎక్కడో లోయల్లోకి జారిపోతూ కనిపిస్తుంది.

అంతలోనే రోడ్డు వారకు చేరి మనతో బాటూ ప్రవహిస్తూ ప్రయాణిస్తుంది. మనతో సహ ప్రయాణీకుడిలా తోడు వస్తున్న నది తో కబుర్లు చెప్పుకుంటూ వెళ్లడం గొప్ప అందమైన అనుభూతి.

వాల్కానిక్ లాండ్ స్కేప్:- ఇక దారిలోనే ఉన్న వాల్కానిక్ లాండ్ స్కేప్ దగ్గిర కుతకుతా ఉడికే మట్టి గుంటల్ని చూసేం.  సల్ఫర్ కాల్ డ్రాన్ దగ్గర, మడ్ వాల్కనో దగ్గిర రోడ్డు మీద కారు ఆపేసరికే భయంకరమైన దుర్గంధం.  ముక్కు మూసుకుని రోడ్డు మీద నుంచి ఆనుకుని ఉన్నవి చూడడం, పరుగెత్తుకురావడం చేసేం.

ఉదయం నించీ సరిగా తినకపోయినా కడుపులో తిప్పడం వల్ల నాకు వాంతులు పట్టుకున్నాయి. పైగా ముందు రెండు రోజుల్లో కుట్టిన దోమ కాట్లు బాగా ఎఫెక్టు చూపించడం మొదలు పెట్టాయి.

[tribulant_slideshow post_id=”14197″]

యెల్లోస్టోన్ లేక్:- సాయంత్రం 5 గంటల వేళ లేక్ విలేజ్ ని దాటి యెల్లోస్టోన్ లేక్ విహారానికి వెళ్లేం. యెల్లోస్టోన్ లేక్ సముద్రమట్టానికి 7700 అడుగుల  ఎత్తున దాదాపు 20 మైళ్ల విస్తీర్ణం లో విస్తరించిన అతి పెద్ద మంచినీటి సరస్సు.

మేం బాగా ఆలస్యంగా, ఇక సాయంత్రం క్లోజింగ్ టైములో వచ్చినందువల్ల షేర్డ్ బోట్ లు క్లోజ్ అయిపోయాయి.

ఎవరికి వాళ్లు డ్రైవ్ చేసుకెళ్లే బోట్లలో ఒకటి అద్దెకి తీసుకున్నాం. అదొక అల్యూమినియం రేకుతో తయారు చేసిన మోటార్ బోట్ అది. దాదాపు పెద్ద కారంత ఉందా బోట్. జెట్టీ నుంచి బోట్ ని బయటకు తీసేందుకు డ్రైవింగు సీటు లో సత్య కూచుని బోట్ బయటకు తీసీ తీయడమే ఏదో గాభరా పడి రివర్స్ గేరు వేసి ఒకటే వేగంతో వెనక ఉన్న మరో బోటుని,గట్టుని గుద్దేడు.

బోట్ మాకు ఇచ్చిన వాడు ఇంకా గట్టు మీద నుంచి వెనక్కి తిరిగాడో లేదో మా బోట్ ని గమనించి ఒక్క ఉదుటున పక్క గట్టు మీదికి పరుగెత్తుకొచ్చాడు. సత్య బోట్ వదిలేసి ఇక వెనక్కి వెళ్లిపోదామన్నాడు.

వంద డాలర్లు అద్దె కట్టి వెనక్కు వెళ్లేదేవిటని, నేను డ్రైవింగ్ తీసుకుని ముందుకు పోనిచ్చాను. బయలుదేరేటప్పుడు సరస్సు మధ్య వరకూ వెళ్ళొద్దని, అక్కడ ఉన్న ఆరెంజ్ కోన్లు దాటి వెళ్లొద్దని చెప్పేరు. జెట్టి నుంచి కనుచూపుమేరలో ఒక వంతెన ఉంది. అది దాటి కొంచెం ముందుకు వెళ్లగానే అతి పెద్ద కెరటాలు మొదలయ్యేయి.

నాకు స్టీరింగ్ మీద కంట్రోల్ పోతున్నట్లు అనిపించడంతో  వెనక్కు తిప్పేసాను. తిరిగి వంతెన వరకు వచ్చేక, సత్య స్టీరింగ్ తీసుకుని మరలా కెరటాల వైపు అతి వేగంగా పోనిచ్చేడు. నేను వద్దు, వద్దని అరుస్తూనే ఉన్నాను. అయినా ఏదో సాహసమన్నట్లు  ముందుకు వేగంగా పోనిస్తూనే ఉన్నాడు. అతి పెద్ద కెరటాలతో భీకరంగా ఉంది సరస్సు లో ముందుకు వెళ్లేకొలదీ.  నాకు వొళ్ళంతా గగుర్పొడిచింది. అసలే వంతెన దాటి వస్తూ ఉండగా వంతెన మీద పెద్ద అక్షరాల్తో ఈ సరస్సు లో పడితే అక్కడున్న ఫ్రీజింగ్ టెంపరేచర్ కి వెంటనే చనిపోయే ప్రమాదముంది కాబట్టి, అసలు నీటిలోకి దిగే సాహసం చేయొద్దని రాసేరు. 

పిల్లలకి తెలీక ఇంకా స్పీడుగా వెళదామని కేరింతలు పెట్టేరు. నేనిక స్టీరింగ్ నాకు మరలా ఇచ్చి బోట్ వేగం తగ్గే వరకూ ఊరుకోలేదు. మొత్తానికి మరో అరగంటలో ఒడ్డుకు వచ్చినా నాకు వణుకు పోలేదు. మొత్తం ట్రిప్ లో అదొక భయంకరమైన అనుభవం.

లేక్ లాడ్జిలో అందమైన గదిలో మా బస లో సేదతీరి, అక్కడే ఆనుకుని ఉన్న రెస్టారెంట్ లో భోజనం చేసి,  బయటకు వచ్చినా వేసవి కాలపు పొద్దు కావడం వల్ల ఇంకా వెలుతురుగా ఉంది. లేక లాడ్జ్ విజిటింగ్ సెంటర్ బాగా నచ్చింది.

లేక్ ని ఆనుకుని సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తూ ఉంది.

కానీ దోమల భయం వల్ల ఎక్కువ సేపు ఆరుబయట్లో గడిపే సాహసం చెయ్యలేదు మేం.

ఎన్నాళ్లు గానో కలలుగన్న యెల్లోస్టోన్ నేషనల్ పార్కు నించి మర్నాడే బయలుదేరాల్సి ఉంది.  గంధకపు భీకర వాసనలు, అతి శీతల జలాలతో ఎగిసి పడే సరస్సు, భయంకరమైన దోమలు తప్పిస్తే యెల్లోస్టోన్ లో అన్ని రకాల భూతలాలూ ప్రత్యక్షమై మరపురాని అనుభూతులు మిగిల్చాయి.

బయటకు వెళ్లే దారిలో టేటన్ పార్కులో  చూడాల్సినవి మర్నాటికి కూడా మిగిలే ఉండడంతో పెందరాళే నిద్రకుపక్రమించాం.

– డా.  కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యంPermalink

Comments are closed.