అంకురించని అంతం

కృష్ణ వేణి

కృష్ణ వేణి

మా బాల్కనీకి ఎదురుగా ఉన్న పేవ్‌మెంటుమీద, ఎనిమిదికీ పద్నాలుగేళ్ళకీ మధ్య వయస్సులో ఉన్న కొందరు పిల్లలు ముక్కు ముందు జేబురుమాళ్ళో, గుడ్డపీలికలో అడ్డం పెట్టుకుని వరసగా కూర్చుని కనిపిస్తూ ఉండేవారు. చూసి చూసీ, అర్థం కాక ‘వాళ్ళ ముక్కుల ముందున్న గుడ్డలేమిటని?,’ ఒకరోజు పనమ్మాయిని అడిగేను. “భాభీ, వాళ్ళు నషా చేస్తున్నారు” అందామ్మాయి. ‘ఇదేమి నషా’ అని అడిగితే వివరించింది తనకున్న పరిజ్ఞానంతో- స్టేషనరీ దుకాణాల్లో అమ్మే టైప్ రైటర్ ఎరేసర్ (వైట్నర్) కొనుక్కుని, మత్తెక్కడానికని దాని వాసన పీలుస్తూ ఉంటారని.

Untitledఈ వైట్నర్లు ఇన్హెలెంట్స్ వర్గానికి చెందుతాయి. బాహాటంగా, విచ్ఛలవిడిగా ఇలా అమ్ముడుపడుతున్న ఇన్హెలెంట్స్ మీద మన పోలీసులూ, ప్రభుత్వమూ కూడా దృష్టి సారించడంలేదు. మాదక ద్రవ్యాలకీ, మద్యానికీ అలవాటు పడ్డానికి మొదటి మెట్టు ఇది. దీనికి బలయేవారు సామాన్యంగా చిన్న పిల్లలు. మిగతా మాదక ద్రవ్యాలతో పోల్చి చూస్తే వైట్నర్లు చవక. మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. 15 మి.లీ నుంచి 30 మి.లీ. వరకూ ఉన్న సీసాల ధర స్టేషనరీ దుకాణాల్లో 30 రూపాయలకీ 50 రూపాయలకీ మధ్య. ఇప్పుడివి కిళ్ళీ బడ్డ్డీల్లోనూ, మిగతా దుకాణాల్లో కూడా బ్లాక్లో అమ్ముడుపోతున్నాయి. ఈ పిల్లలకి వీటిని దాచడం కష్టం కాదు. ఒకవేళ పట్టుబడితే కనుక, వీటిని అమ్మడమూ, కొనుక్కోవడమూ కూడా చట్టవిరుద్ధమైన పని కాదు కనుక విపరీతమైన ఫలితాలేమీ ఉండవు.
మహానగరాల్లో వీటిని ఉపయోగించేది సామాన్యంగా సమాజంలో ఉన్న కింద తరగతులకి చెందిన పిల్లలు. వీళ్ళ గురించి పట్టించుకునే తీరిక లేని తల్లీతండ్రీ ఉన్నవారో లేక ఇంటినుంచి పారిపోయినవారో.
వైట్నర్ల వాసన- పేపర్ మీద ఉన్న ప్రింటునే కాక, మనిషి మెదడునుంచి జ్ఞాపకాన్ని కూడా చెరిపేయగలదు. దాన్లో ఉన్న టౌలెన్ మరియు ట్రైక్లోరోథాన్ కొన్ని గంటలపాటు మత్తెక్కించడానికి సహాయం చేస్తాయి. ఈ ఇన్హెలెంట్స్- ఎనీమియా, గుండె జబ్బులనీ, లివర్ ఫైల్యూర్‌నీ కలుగజేస్తాయి. వీటి వినియోగం వల్ల, కండరాల స్థాయి మరియు బలం తగ్గిపోతాయి. నడక దెబ్బ తింటుంది. ఆలోచించే సామర్థ్యత తగ్గుతుంది. మాట్లాడటం కూడా కష్టం అవుతుంది. కొంతకాలానికి వాసన చూసే శక్తి సన్నగిల్లి, జ్ఞాపకశక్తి కూడా పోతుంది.
fdఈ మధ్యే మా ఇంటి కిందున్న మెడికల్ స్టోర్‌కి ఏవో మందులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, అయిదుగురో ఆరుగురో పిల్లలు పది సీసాల కఫ్ సిరప్ (దగ్గు మందు) కావాలంటూ వచ్చేరు. మెడికల్ దుకాణం అతను “అన్ని ఇవ్వను. ఒక్కటే ఇస్తానంటే” ఆ పిల్లలు కలియబడ్డానికి సిద్ధం అయేరు. మొత్తానికి రాజీ పడి మూడు సీసాలిచ్చేడతను. ఆ పిల్లలు వెళ్ళిపోయేక, ఇదంతా అయోమయంగా చూస్తున్న నాకు షాపతను వివరించేడు- ‘వీటిని ఈ పిల్లలు మత్తు ఎక్కడానికి ఉపయోగిస్తారు’ అని.
ఢిల్లీలో ఉన్న వీధిబాలల్లో 60 – 70 శాతం పిల్లలు మత్తుకి బానిసలైన వారే. చెత్త ఎత్తి అమ్ముకుంటూ బతికే పిల్లలూ, ముష్టిపిల్లలూ కూడా ఈ మత్తుకి అలవాటు పడుతున్నారు. సరైన డి-ఎడిక్షన్ ప్రోగ్రాములు కానీ సెంటర్లు కానీ లేవు. వారిని బాగుచేద్దామనుకునే కార్యకర్తలకి కూడా ఇదెంత పెద్ద సమస్యో సరిగ్గా తెలియదు.

24 నాలుగుగంటలూ పోట్లాడుకుంటూ ఉండే తల్లితండ్రుల బాధ భరించలేక లక్నోలో ఉన్న ఒక 15 ఏళ్ళమ్మాయి వైట్నర్ వాసన పీల్చడం మొదలుపెట్టింది. అది తాత్కాలికమైన ఉపశమనం కలిగించడం వల్ల ఆ అమ్మాయి దానికి అలవాటు పడి చదువు నిర్లక్ష్యపెట్టడం మొదలుపెట్టింది. సరిగ్గా చదవకపోవడం వల్ల స్కూల్- పిల్లని సస్పెండ్ చేసింది. ఆ తరువాత ఆమె తల్లికి ఇంచుమించు ఖాళీ అయిన 500 ఇన్హెలెంట్స్ సీసాలు గదిలో కనపడ్డాయి. ఇలాంటి సంఘటనలెన్నిటి గురించో మనం వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటాం.
హానికరమైన డ్రగ్స్ ఏ వీధి చివరో లేకపోతే ఫార్మసీల్లోనే కనిపిస్తాయకోవడం భ్రమ. అవి మన ఇళ్ళల్లోనే, మనం వాడే అనేకమైన పదార్థాలలోనే ఉంటాయి. వాటిలో కొన్ని- జిగురు, థిన్నర్లు, కిరోసిన్, పెట్రోల్, డిసీల్, నైల్ పోలిష్ రిమూవర్, హైర్ స్ప్రే, ఫర్నిచర్ పోలిష్ మొదలైనవి.
విక్స్, నొప్పి నుంచి ఉపశమనం కలిగించే అయోడెక్స్, మూవ్, అమ్రుతాంజనం లాంటి బామ్సే కాక, షూ పోలిష్ లాంటి వాటిని కూడా బ్రెడ్ మీద రాసుకుని తినడం, -అదీ పదార్థ దుర్వినియోగమే.
ఇన్హెలెంట్స్‌కి బానిసలైన పిల్లలు వీటికోసరమైన డబ్బు కోసం చిన్నచిన్న దొంగతనాలకి కూడా అలవాటు పడతారు.

వీటికి అలవాటుపడిన పిల్లల్లో కనిపించే లక్షణాలు.
వాళ్ళ ఊపిరీ, వేసుకున్న బట్టలూ కెమికల్ వాసన కొట్టడం.
నోటి చుట్టూ పుళ్ళు లేక మరకలు.
శరీరం/బట్టలమీదా కనిపించే పైంట్/మరకలు
తాగి ఉన్నట్టుగా కనిపించడం, గాజు కళ్ళూ, ఆకలి మందగించడం, చిరచిర, ఆత్రుత, ఉద్వేగం,
మైకం/నిద్రమత్తు, మతిభ్రమ.
gbప్రస్తుతం కష్మీర్ లోయలో 80 శాతం మంది ప్రిస్క్రిప్షన్ మందులని దుర్వినియోగం చేస్తున్నారన్న వార్తలు పేపర్లలో వస్తున్నాయి. అక్కడ మతం అడ్డొస్తుంది కనుక ఆల్కహోల్ వాడుక తక్కువే కానీ కఫ్ సిరప్సూ, ఏంటీ అలెర్జిక్ మందుల/పెయిన్ రిలీవర్స్ వాడకం మాత్రం ఎక్కువే. కిరాణా దుకాణాలు కూడా ఈ మందులు అమ్ముతాయి. ఒకరోజులో 6000 కొడెన్ సీసాలు చట్టవిరుద్ధంగా అమ్ముడుపోతాయి. స్కూళ్ళ బయటా, కాలేజ్ కాంపస్ లోపలా, బయటా కూడా జరిగే ఈ విక్రయాలని స్కూళ్ళూ, కాలేజీలూ ఆరికట్టలేకపోతున్నాయి. అక్కడ విరివిగా దొరికే నిద్రమాత్రలని దుర్వినియోగం చేసేవారిలో ఆడపిల్లలే ఎక్కువ. ఈ విధమైన పదార్థ దుర్వినియోగానికి ఆర్థికస్థితి ఏ మాత్రం కారణం కాదు కష్మీర్లో. అక్కడ వీటికి అన్ని వర్గాలవారూ బానిసలవుతున్నారు. ఇది మిడ్ నైడ్ నాక్ సిండ్రోమ్ వల్ల కలిగిన పరిణామం అన్నది నిపుణుల అభిప్రాయం.
స్కూళ్ళల్లో చదువుకునే ఆడపిల్లలు షూ పోలిష్, అయోడెక్స్, ఫేవికోల్ నైల్ పోలిష్ రిమూవర్ల మత్తుకి అలవాటు పడి చాలాకాలమే అయింది.
మారిలిన్ మన్రో, విట్నే వైట్ హౌస్, ఏమీ వైన్‌హౌస్ వంటి సెలెబ్రిటీస్ తమ వృత్తుల్లో ఉన్నతశిఖరాలకి చేరుకున్న తరువాత పదార్థ దుర్వినియోగం కారణంగా మరణించేరు.
కానీ ఈ పిల్లలు ఇంకా పసి మొగ్గలేనే! జీవితం అంటే ఏమిటో చూడను కూడా చూడలేదు. వారి భవిష్యత్తు గురించి ఊహించుకోవడం కూడా కష్టం కాదూ!

– క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
16 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Wilson Sudhakar
Wilson Sudhakar
5 years ago

చాలా విచారకరం. ఎవరి దృష్టికీ రాని ఈ దురలవాట్ల మీద రాయడం వల్ల అధికారులు తగిన చర్యలు తీసుకోడానికి అవకాశముంది.కంగ్రాట్స్.
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

Krishna Veni Chari
Krishna Veni Chari
5 years ago

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గారూ,
థేంక్యూ అండీ.

Venkata S Addanki
Venkata S Addanki
5 years ago

మనం ఇళ్ళలోనూ పట్టించుకొవలసిన అంశం ఇది మనపిల్లలూ ఇదేదో బాగుందని వాసన చూస్తున్నరంటే అది తరువాత తరువాత వాళ్ళని బానిసలుగా చేసుకోగలదు.చాలా మంచి విషయాన్ని జనాల ముందుకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు క్రిష్ణవేణి గారు.ఇలాంటి విషయాలు మనం ఇంట్లో అంతగా పట్టించికోము, తరువాత అదే కొంపముంచే విషయంగా తయరయినా ఆశ్చర్యం లేదు.

Krishna Veni Chari
Krishna Veni Chari
5 years ago

థేంక్యూ వెంకట్ అద్దంకిగారూ. మీరు చెప్పినది నిజమే.

Lakshmi raghava
5 years ago

నాకు అనుభవం కానీ విషయం …తెలుసుకోవడం బాగా అనిపించింది. థాంక్స్ Krishna వేణి

Krishna Veni Chari
Krishna Veni Chari
5 years ago

లక్ష్మీ రాఘవ గారూ,
థేంక్యూ.

krishna
krishna
5 years ago

chala manchi vishayalu chepparu andi kakapte manavallaki una daridram endukante miru cheppina vatini manchiga tisukunte parledu ivi kuda ila upayoga padataya ani alochinte medhavulu ondaruntau vallaki information ichinatlu lekapote chalu. but good research and thx for sharing andi.

Krishna Veni Chari
Krishna Veni Chari
5 years ago
Reply to  krishna

క్రిష్ణగారూ,
మెచ్చుకున్నందుకు థేంక్యూ . “కానీ ఇవి కూడా ఇలా ఉపయోగపడతాయి” – అంటే నేను రాసినదీ రోజూ పేపర్లలో వచ్చే వార్తల గురించే కదా! కొత్తగా చెప్తున్నదేమీ లేదు.

కిరణ్ కుమార్ కే
కిరణ్ కుమార్ కే
5 years ago

అమ్మో, ఇలాంటిది ఒకటి ఉన్నది అనే విషయమే నాకు తెలియదు.

మరోసారి సమాజానికి పనికి వచ్చే చాలా చక్కటి వ్యాసం రాసారు కృష్ణ వేణి గారు. అభినందనలు.

Krishna Veni Chari
Krishna Veni Chari
5 years ago

కిరణ్ కుమార్ కే,
ఇది మామూలేనండీ. అన్ని దేశాల్లో కూడా. చాలామంది గమనించరంతే. మా ఇంటిముందరే ఇది జరుగుతూ ఉండటం వల్ల నాకు ఆసక్తి పుట్టి ఏదో రాసేనంతే. థేంక్యూ మీ కామెంటుకి.

TelikaRamu
TelikaRamu
5 years ago

కిక్ మూవీ లో ఒక డయలాగు ఉంటుంది
“పెద్దవాళ్ళకు అడగకున్న 1/- కిలో బియ్యం,పించను,ఉచిత కరెంటు ,ఇస్తారు
పిల్లల గురుంచి ఎందుకు ఆలోచించరు
ఓహో వాళ్ళకు ఓటు హక్కు ఉండదు కదా”

Krishna Veni Chari
Krishna Veni Chari
5 years ago
Reply to  TelikaRamu

తెలికరాముగారూ,
సరిగ్గా చెప్పేరు. థేంక్యూ. 🙂

mala kumar
5 years ago

కృష్ణవేణిగారు,
మీ వ్యాసం బాగుందండి.

Krishna Veni Chari
Krishna Veni Chari
5 years ago
Reply to  mala kumar

మాలగారూ, థేంక్యూ. అందరికీ తెలిసిన సబ్జెక్టే కానీ ఎందుకో ఈ మధ్య జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చి రాసేను 🙂

Sai Padma
Sai Padma
5 years ago

ఒక అలవాటు అనేది , ఇలా చేస్తున్నాం అని ఆలోచించే లోగా అలవాటు గా మారిపోయి, వ్యసనం గా రూపాంతరం చెందుతుంది. చాలా మంచి వ్యాసం కృష్ణ వేణి గారూ..!

Krishna Veni Chari
Krishna Veni Chari
5 years ago
Reply to  Sai Padma

థేంక్యూ సాయి పద్మా 🙂