నెలద -3

sumana koduri

sumana koduri

రమణ వీణ తీగలను బిగిస్తున్నాడు(న్నది). రమణ అర్ధనారీశ్వర రూపి. నెలద పసి తనం నుంచి రమణను చూస్తోంది. తమ ఇంట్లోనే తమలో ఒకరుగా ఉండటం, తల్లి ప్రియంవదకు తోడుగా అనుక్షణం సేవలందించటం జరిగినది.నెలద విద్య, నాట్యాభ్యాసం కూడా రమణ దగ్గరుండి చేయించటం గురుతుంది, పెద్దక్కా అని పిలుస్తుంది నెలద రమణను.

పెద్దక్కా.. వీణ తరువాత సవరించుదువు, భోజనం చేద్దాము ఆకలేస్తోంది అన్నది నెలద. అది కాదమ్మా, రానున్నది పౌర్ణమి.. సనివారం రాజుగారు ఆలయానికి విచ్చేస్తారు కదా, అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకుందామని అన్నది(అన్నాడు) రమణ. అరె! అవును మరచిపోయాను సుమా! ఈ క్రూరధరుని వెర్రివేషాలు గురించి యోచిస్తూ… అన్నది నెలద. ఇంతలో హేముడు హడావిడిగా లోనికి వస్తూ కనిపించాడు. చిన్నా… అని పిలిచింది నెలద. ముఖ్య విషయం మాట్లాడలనుకున్నపుడు, బాగా ఆప్యాయత ప్రదర్శించేపుడు నెలద తనని చిన్నా అంటుంది అది తెలిసిన హేముడు.. ఆ.. అక్కా అంటూ చకచకా తన వద్దకు వచ్చాడు. ఇంతకు క్రూరధరుని రాజాస్థానంలోఒప్పగించావా? లేక దారిలో ఏ పాలేగానికో, కడపలోనో వదిలి వచ్చావా? అన్నది కొంత సందేహంగా..

అక్కా… బాణం దెబ్బతిన్నట్లు పలికిందాతని కంటం. సందేహం కాదు నీకింకా పిల్ల చేష్టలు పోలేదు, వీరునివేగాని అన్నీ ఆటగా తీసుకునే పసిబుద్ధిరా నీది. ఆ బుద్దిమీద నా సంశయం అన్నది నెలద తేలికగా.. సౌమ్యనాధుని సాక్షిగా అతన్ని రాజాస్థానానికి తీసుకువెళ్ళి ఒప్పగించాను. వాడు చేసిన దుర్మార్గాన్ని వివరించి చెప్పి మరీ రాజుగారి పాదాల వద్ద పడేసి వచ్చా. ఇంకా నమ్మకం లేకపోతే శశాoకుని తీసుకురానా.. అతన్నీ ఓ మారు అడిగి తెలుసుకుని అనుమానం తీర్చుకుంటావా అక్కా… అన్నాడు. అతని గొంతులో నిజాయితి స్పష్టంగా విన్పిస్తోంది. అరెరె అంతగా మనసు కష్ట పెట్టుకోకురా, రాచనగరు నుండి ఏ విధమైన కబురూ లేదు. మూడు రోజులు గడిచాయి మరి అన్నది నెలద. భలే దానివమ్మా రాచ కార్యాలు ఎన్నో ఉంటాయి. రాజా వారికి తీరిక దొరికి వాడిని విచారించి వీళ్ళకు న్యాయం చేయాలంటే కాస్త సమయం పడుతుంది మరి అన్నది(అన్నాడు) రమణ.

హూ… అసలే నిద్రపోతూ ఆ రాజు గారు, చూద్దాము.. కబురెపుడు పెడతారో అంటూ పళ్ళెరములలో ఆహార పదార్ధాలు వడ్డిస్తూ… దా… చిన్నా.. భోం చేద్దాం అన్నది నెలద. చేతులు తుడుచుకుంటూ అక్కతో కలిసి భోజనంచేయ ఉపక్రమించాడు హేమవర్దనుడు. పెద్దక్కా ఈ మామిడి కాయ పప్పులో కారం బాగా దట్టించారు. అమ్మ ఎలా తిన్నదో పాపం అన్నది నెలద. అమ్మ కేవలం పెరుగన్నం తీసుకున్నరమ్మా నీరసంగా ఉంది తినాలనిపించలేదని జవాబిచ్చింది రమణ. అయ్యో చెప్పలేదే .. పండన్నా తినిపించక పోయావా, నే తర్వాత తినిపిస్తాలే… నువ్వు తిను అన్నది నెలద.

ప్రియంవద కళ్ళు మూసుకుని పడుకున్నదనమాటే గానీ అన్నీ ఆలకిస్తోంది. పౌర్ణమి వస్తోందంటే ఎందుకో కంగారు జ్ఞానధనులవారు వస్తారు. సంవత్సరానికి ఒకసారి అతను వచ్చి కలిసేది. ఆ వేళ నెలద అందరితోను కలిసి ఆలయ నాట్యం చేసేందుకు వెళ్ళిపోతుంది. తను రమణ మాత్రమే ఉండే సమయం కాబట్టి తప్పక ఆ సమయాన్ని సద్వినియోగ పరచుకుని మాట్లాడేందుకు వస్తారు. జ్ఞానధనుల వారి సహాయ సహకారాలు లేకపోతే ఆ విజయవాటిక నుండి నెలదను ఇంతదూరం తెచ్చే అవకాశం ఉండేదా! కృష్ణనీరదతో పాటూ ఆ రాణి చిధ్రూపి నెలదనూ చంపించివేసేదే. అందునా తన భర్తకు పుట్టిన బిడ్డ అమ్మో ఎంత భయానకమైన ఘట్ట్o, అది తలపుకు వస్తే ఒళ్ళు గగుర్పోడుస్తుంది. కృష్ణసింహమోహమని వారసులు ఇప్పటికి తనను గుర్తిస్తే వదలరేమో, అయినా ఇంత దూరమునకు ఈ క్రుపాపుర ప్రాంతానికి రారులే. ఆమె మెదడు లో గత సంబంధమైన సంఘటనలు, తుమ్మెదలా రోద పెడుతున్నాయి. నెలద భోజనం ముగించింది కాబోలు.. ఫలములున్న పళ్ళెరముతో ప్రియంవద చెంతకొచ్చి, అమ్మా… ఒక్క పండన్నా తిని నిద్రపోదుగాని లేమ్మా అంటూ సున్నితంగా భుజంపై తడుతోంది. ప్రియంవద గాఢ నిద్ర నటిస్తూ ఉండిపోయింది. నెలద పోన్లే లేచాక తినిపిస్తా అంటూ వెళ్ళిపోయింది.

యువరాణి అరణ్య విహారం కోసం ఆమెను వెన్నంటి వచ్చిన సేనలు. ఒక సువిశాలమైన సుందర ప్రదేశానికి రాగానే ఆగాయి. యువరాణి చెలికత్తెలు పల్లకిలో ఉన్న జిబేదాతో అమ్మా ఈ స్థలం చాలా బాగుంది ఆగుదామా అని అడిగారు. మేలి ముసుగును కొద్దిగా తొలగించి శేషాచలారన్యమే కదా అన్నది ఆతృతగా జుబేదా… అవునమ్మా.. బాహుదా నది పరీవాహ ప్రాంతం కూడా చాలా అందమైన ప్రాంతం అన్నది సుహిత. అయితే ఆపమందాం అంటూ నా ఆన చెప్పండి అన్నది దర్పంగా. యువరాణి వారి ఆజ్ఞ ఈ స్థలమునే ఆపమని సుహిత సైనికుల్ని ఉద్దేశించి గట్టిగా అన్నది. విశ్వధరుడు నవ్వి నేను చూస్తున్నా కాబట్టి అందమైన ప్రదేశమని తెలిపింది. మరి యువరాణికెలా అర్ధవైందో దీనిని మనసుల భాష అనుకోవచ్చా అని ఏదో లోకంలో వుండి ఆలోచిస్తుండగా సేనాపతి గారూ గుడారం ఏ వైపు వెయ్యాలో చెప్పింది గట్టిగా అరచినట్లు అన్నాడు ఒక సైనికుడు. ఉలిక్కి పడి ఈ లోకంలోకి వస్తూ ఆ పరిసరాలన్నీ పరికించి చెట్లల్లో పొదల్లోకి వేయకుండా అదిగో ఆ విశాలమైన రాతి పై వేయండి, క్రూరమృగాల బెడద ఉండకుండా అన్నాడు. సుహిత అదంతా గమనించి నవ్వుకుంటూ సేనాపతి గారికి నాలుగుమార్లడిగితే గానీ వినబడలేదా అన్నది. ఆ.. అదీ ఈ ప్రాంత సౌoదర్యానికి మైమరిచీ… సర్దుకున్నట్లు తడపడుతూ అన్నాడు విశ్వధరుడు. నిజమే నిజమే పాపం ఆట పట్టిస్తూన్నట్లు సుహిత వేలువూపుతూ అన్నది. వేలిని పెదవులపై ఉంచుకొని అర్దిస్తున్నట్లు ఊర్కోమన్నాడు విశ్వధరుడు. ఊ అమ్మాయి గారికీ కాస్త మనసున్నట్లే ఉందిలే అనుకున్నది సుహిత.

బోయీలు పల్లకి దించారు. నెల తన పాదాల తాకిడికి కందిపోతుందేమో అన్నట్లు అతి సున్నితంగా కాలు నెల మోపింది. రాజా సాహెబ్ జైపూర్ వెళ్ళినపుడు తెచ్చిన బంగారు తీగలు అల్లిన పాదరక్షలు నీరెందుకు తళ్ళుక్కు మన్నాయి. విస్వధరుడు ఆ దృశ్యాన్ని తన కన్నులలో అపురూపంగా బందించుకున్నాడు. మార్షా అల్లాహ్ ఎంత అందమైన స్థలం. మన అంతఃపురం ఈ స్థానం ముందు దిగుదుడుపే సoహితా అన్నది జుబేదా.. అమ్మా అటు చూడండి ఆ బాహుదా నదీ ప్రవాహం మధ్యలో మంటపం ఆ గండశిలలు దాటుకుంటూ సడి చేస్తున్న నది. ఆ గట్టు మీద కూచున్న కలిమి పక్షి(కలివి కోడి) పచ్చని తుంగపై తెల్లని కుచ్చు, నిజంగా మైమరచి చూస్తున్న జుబేదాను అంతకన్నా మై మరచి చూస్తున్నాడు విశ్వధరుడు. సాబ్ నీ శోచ్ హేకడో ఉందీ గట్టిగా అన్నాడు కరీముల్లా అనే సైనికుడు. అతని దృష్టి దాటలేదు మరి విశ్వధరుడు – జుబేదా ల చూపులు సైగలు. ఆ… పదండి అదక్కడ.. ఇదిక్కడ అంటూ దొరికి పోయిన కంగారులో కలగా పులగంగా పనులు ఒప్పగించసాగాడు. ఆ… విశ్వధరా, మేం అలా షికారెళ్ళుతున్నాం వచ్చేసరికి అన్నీ సిద్ధం చెయ్. అల్లరిగా అన్నది జుబేదా.. జీ.. అంటూ తలవంచాడు. పదండి అంటూ తలవంచాడు. పదండీ అంటూ సాగిపోయింది చెలికత్తెలతో. ఓ పది మంది సాయుధ వీరులు వారిని అనుసరించసాగారు. జుబేదా ఆగి వారిని సమీపించి ఇదిగో మేము ప్రశాoతముగా ఆనందంగా పంజరంలో పక్షుల్లా కాకుండా హాయిగా విహరించాలని వచ్చాం. ఈ అడవి ఆణువణువూ తెలిసిన చెలికత్తెలు ఉన్నారు. మీరెందుకు? మళ్ళి అన్నది. హమ్మా … ఇది మా కర్తవ్యం.

మీకే ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడేదే ఆ ఉద్యోగం. తప్పదు అన్నాడు ఓ సైనికుడు హూ …మా అబ్బాజాన్ కి చెప్పనులే.. అన్నది అయినా వాళ్ళు అంగీకరించినట్లు అనిపించకపోవటతో సరే కాస్త దూరంగా రండి మరీ ఆ చుట్టూ ఉండొద్దు అన్నది. సరేమా.. అన్నాడు వారికి నాయకత్వం వహిస్తున్న సైనికుడు. బాహుదా నదీ తరంగాలు శిలపై నుండి ప్రవహించే సవ్వడి మువ్వలు కట్టుకుని ప్రకృతికాంత నడుస్తుందే… అన్నట్లుంది. గుట్టపై ఒంటరిగా కూచున్న కలికి పక్షి రాకతో ఎగిరి పోతుందే అని అందరినీ చేతి సైగతో ఆపింది జుబేదా చెoపలకు రెండు చేతులు ఆంచి తనివి తీరా రమణీయ ప్రకృతి దృశ్యాలను చుట్టూ చూస్తూ ఆస్వాదిస్తోందా!! ఎంత అద్భుతం… మనము అంతఃపురము లో వనంలో ఎంతో జాగ్రత్తగా పెంచిన పూలమొక్కలు ఇలావిరగబూయవు కదూ.. ఇక్కద చూడవే ఎన్ని వన్నెల పువ్వులో అన్నది జుబేదా. మంద్ర స్వరంతో. అవునమ్మా.. ఇవి తల్లి ఒడిలో పిల్లల్లా ఉంటాయి. ఈ స్వేచ్చ స్వచ్చమైన గాలి వెలుతురూ, నేలసారం అక్కడ లభించవు యువరాణీ అన్నది సoహిత. చంచల జుబేదాను తడుతూ అక్కడ లేళ్ళ గుంపు చూడమ్మా అన్నది. అరరె ఎంత ముచ్చటగా గెంతుతోంది. ఆ చిన్న లేడి కూనతల్లి దానిని ఎంతటి వాత్సల్యతో చూస్తోందో హాహ్హాహా అంటూ మైమరచి చూస్తోంది జుబేదా, సoహిత… అక్కడ ఉన్నది నెమలి కదూ అన్నది. ఓ చెట్టువైపు వేలితో చూపుతూ..అవునమ్మా ఆరామ్ గా కూర్చుని ఉన్నది, అన్నది సంహిత.

అదిగో ఆ చెట్టుకిందే ఇంకో నెమలి అరె ఎలా పించము విప్పిందో చూడండీ అన్నది చంచల. ఇంతలో నాలుగు కుందేళ్ళు వీళ్ళ ముందు నుండీ చెంగు చెంగున పరిగెడుతూ పొదల్లోకి దూరాయి. అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి ఆనందంగా నవ్వుకున్నారు. సంహిత నా అంతఃపుర వనం లో కూడా నేను జింకల్ని కుందేళ్ళనీ పెంచుతున్నాను కదా..అవి ఇంత అందంగా ఉత్సాహంగా ఉండవేమిటే ఒకసారయినా నెమలి పురివిప్పటం చూడలేదు. జింకలు ఎదో దిగాలుగా ఉంటాయి. ఎందుకే..? అన్నది జుబేదా..అదామ్మా..ఇది వాటి జన్మ స్థలం. అన్నీ ప్రకృతి సంబంధం గా దొరుకుతాయి. స్వచ్చమైన ఏటి నీళ్ళూ పచ్చని ఆహారమన్నీ దొరుకుతాయి. అక్కడ మనం తెప్పించి పెట్టే ఆహారం సరిపోదు. సంచరించేదుకు ఇంత విశాల స్థలo ఉండదు. ఓ నాలుగైదు తప్ప వాటి జాతికి చెందిన జీవులుండవు. ఒకరకం గా చెప్పాలంటే..అంతఃపురంలో ఉన్న జుబేదమ్మకు ఇక్కడకు వచ్చాక ఉత్సాహంతో ఉరకలేస్తున్న యువరాణికీ ఉన్న తేడాలాటిదే. అన్నది సంహిత. యా అల్లా… ఇంతకాల జంతువుల్ని పెంచుతున్నాననుకున్నా…వాటిలో ఎన్నిటిని వండుతున్నారో నేను గమనించలేదు. రుచికరమైన పదార్ధం తిన్నాననుకున్నా చాలా పొరబాటు చేశాను. మనం నగరానికి వెళ్ళగానే నా ఉద్యానవనంలో ఉన్న జంతువులను పంజరాల్లో ఉన్న పక్షులను తీసుకొచ్చి అడవిలో వదిలివేయాలి అన్నది ధ్రుఢంగా జుబేదా..

మంచి అలోచన తప్పక అలాగే చేద్దాం అన్నది సంహిత. వాళ్ళు చిన్నగా నడుస్తూ అంతదూరo రావటం మాటల్లో పడి వాళ్ళు గమనించలేదు. ఏదో ఘంటానాదం వినబడింది. అరే ఏవిటా శబ్దం అన్నది జుబేదా. అదమ్మా అదిగో ఆ పచ్చని గుట్టపై ఆలయమున్నది. నరసిoహస్వామి ఆలయం. బహుశా అర్చక స్వామి గంట మోగించి ఉంటారు అన్నది బసంతి. మనమూ వెళ్దామా అన్నది ఉత్సుకతతో జుబేదా. అమ్మా అది హైందవ దేవాలయం జవాబిచ్చింది సంహిత. ఏం నే చూడకూడదా! అలా అయితే మా నెలవంక ను మీ నాట్యం చేసే దేవుడు తలలో పెట్టుకుంటాడు కదా. దేవుడు ఎవరైనా మన కోరేది మన క్షేమం. ఏ కష్టం లేకుండా బ్రతికించమని అంతేకదా. ఆ కోరిక హిందువుకైనా ముస్లింకైనా సమానమే కదా అన్నది జుబేదా. ఇన్నాళ్ళూ అమాయకంగా రాజుగారి గారాలపట్టిగా ఉన్న జుబేదమ్మే నా…మాట్లాడేది!! మీకెన్ని విషయాలు తెలుసమ్మా ఆశ్చర్యంగాఅన్నది సంహిత. నేనూ దాది నడిగి చాలా హిందూ దేవుళ్ళు కథలు తెలుసుకున్నా. ఏ దేవుడైనా మనలను కాపాడేందుకే ఉన్నాడని అర్ధం చేసుకున్నాజవాబిచ్చింది జుబేదా. ఓ.. అయితే పదండమ్మా అంటూ ముందుకు దారి తీసింది సంహిత. నాకు అన్నీ ఏర్పాటు చేసేందుకై జహీరా, సౌభాగ్య, పరిణీతలు గుడారం వద్ద ఉండిపోయారు. ఇంత అందాన్నీ ఆనందాన్నీ చూసేందుకు అనుభవించేందుకు రాకుండాన్నది జుబేదా. మరి అదీ ముఖ్యమే కదమ్మా అన్నది సంహిత.

 

– కోడూరి సుమన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, Permalink

Comments are closed.