బహెన్
రచన- బా రహంతుల్లా
జీవితం , మానవ సంబంధాలు రక్త సంబంధాలను వస్తువులుగా తీసుకుని మలిచిన కథలు బహెన్ . ఈ కథల రచయిత రహంతుల్లా జీవితంలోని ఒడిదుడుకులు, బాంధవ్యాలను రుచి చూసిన వాడ ని ఈ కథలే చెబుతాయి . రహం తుల్లా కథల్లో అడుగడుగున అనేక పాత్రల్లో అనేక వాస్తవాలు పాఠకుల కళ్ళ ముందుకు వస్తుంటాయి . కొన్ని చోట్ల చదువరుల గుండె తలుపులు తట్టి తమ జీవితాల్లోని సంఘటనలను పోల్చి చూసుకుని ఆత్మ విమర్శ చేసుకునేలా చేస్తాయి .
ముస్లిం జీవితాలలోని ఆచార వ్యవహారాలు , మత సంబంధమైన కట్లుబాట్లు , నియమాల మధ్య బ్రతుకు బండిని నడిపించే చిత్రణ , శైలి చదువరులని కథల వెంట పరుగులు తీయిస్తాయి . రచయిత రాసిన కథలన్నింటిలో ముస్లిం జీవితం కన్పిస్తుంది . ఈ కథలోని ముఖ్య పాత్ర కరీమున్ ని తమ సొంత చెల్లెలాగో , కూతురులాగో భావించారు కథ చదివిన వారంతా .. ఆ కథలో ఉన్న ఎలిజీ అందరి మనసుల్లోకి ఒక మేఘంలా జ్ఞాపకాల్ని వర్షించింది .
కరీమున్ తో అనుబంధం , రక్త సంబంధం ఉన్న రచయిత ఆమె ప్రతి జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటూ వాటిని అందరి జ్ఞాపకాలుగా మలిచాడు . మనిషి జీవించి ఉన్నప్పటికీ , ప్రపంచంలో లేనప్పటికీ ఉన్న తేడాని ప్రతి వాక్యంలోనూ చిత్రించాడు . చనిపోయిన వారికి సంతృప్తి పరుస్తూ ఉంటారో అనే విషయం ఒకటే కాక చనిపోయిన వ్యక్తులకి నిజమైన నివాళి ఏమిటో ఈ కథ తెలీజేస్తుంది . ఈ కథలోని కరీమున్ చనిపోయినా ఇప్పటికి ఆమె సజీవురాలే .
అలాగే ‘మా ‘కథలు కొడుకుల కోసం , కూతుళ్ల కోసం కష్ట పడుతూ వారి కడుపులు నిండితే చాలు అనుకునే తల్లి కథే ఇది . ఈ కథ 2 00 7 ‘ విపుల ‘ కథల పోటీలో బహుమతి పొందింది . అలాగే ‘ బుచ్చిగాని బాగోతం ‘,’కిరాయి మకాన్ ‘,’బోర్డర్స్ ,నర్గీస్ వంటి కథలు మంకు తెలియని జీవితాలని చవి చూపిస్తాయి .
రహం తుల్లా కథలను విశ్లేషించిన ప్రముఖ రచయితల వ్యాసాలూ కూడా ఈ పుస్తకానికి అనుబంధంగా యివ్వటం బాగుంది . నగ్నముని , పి.సత్యవతి , మధురాంతకం నరేంద్ర , అబ్బూరి ఛాయాదేవి ,ఓల్గా ,పోరంకి దక్షిణామూర్తి , బండి నారాయణస్వామి ,ఖదీర్ బాబు , కాత్యాయని విద్మహే వంటి రచయితలు ఈ రచయిత కథల్ని విశ్లేషించారు .
ఈ పుస్తకాన్ని ఇద్దరు గొప్ప సాహీతీ వేత్తలు కాళోజి , పొట్లపల్లి రామారావు ద్వయానికి అంకితం చేయడం అభినందనీయం .
–అరసి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~