మళ్ళీ మాట్లాడుకుందాం !

ఎర్ర రంగు బొల్లి మచ్చలు

వాడ్రేవు వీర లక్ష్మీ దేవి

వాడ్రేవు వీర లక్ష్మీ దేవి

ఇది చాలా ఏళ్ల కిందటి ముచ్చట . కానీ నిన్నో మొన్నో జరిగిన సంగతిలా నా మనసుని అంటి పెట్టుకునే ఉంటుంది . ఎందుకంటె అరచేతులనించి భుజాల దాకా అంటు రోగ మచ్చల్లా పాకేసి పాదాల మించి కాళ్ల మీదకు కూడా పాక్కుంటూ వెళ్లిపోయే హెన్నా తాలూకు వికృత సౌందర్యను కరణ చూస్తుంటే వికారం వచ్చి ఆ పాత ముచ్చట గుర్తు చేసుకోవలసి వస్తోంది . ఈ వికారపు అందాలు భరించడం కష్టం అవుతోంది .
గంగమ్మ అయిదడుగుల ఆరంగుళాల పొడుగు ఉండేది ఆదివాసీ అమ్మాయి . చీర కచ్చాపోసి కట్టేది . నెలకొకసారి మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దఖాళీ కొబ్బరి చిప్పలో పెట్టి తెచ్చేది . గోరింట చెట్టు ఎవరో రాజుల ఇంట్లో ఉంటే తెచ్చి వాళ్ళ పెరట్లో వేసి పెంచుకుంది . గంగమ్మ ఇల్లు మా ఇంటి వెనకే ఉండేది . ఊళ్లో అందరికీ తాటాకు ఇళ్ళు లే . ఆమెది తాటాకు పాకే .
నేను పదేళ్ల పిల్లని సాయంత్రం నా రెండు చేతులకీ గోరింటాకు పెట్టి , మా అత్తని నాకు అన్నం తిని పించమని చెప్పి వెళ్లేది . రాత్రి అన్నాల వేళ అయ్యాక వచ్చి అత్త మంచం పక్కన కూర్చుని ఆమె అరచేతిని కబుర్ల మధ్య గోరింటాకుతో అలంకరించేది . ఒక్కక్కసారి ఒక్కక్కరకంగా బంతి ఆకో , తులసి ఆకో చేతి మీద పెట్టి దాని అచ్చు పడేలా పెట్టడమో , చెయ్యి నిండా పూలో , లతలో ఏవేవో అందాలు చెక్కేది .
వేసవి రాత్రయితే రాత్రంతా వెన్నెల చూస్తూ మగత నిద్రపోతూగోరింట చేతుల్ని కదపకుండా ఎడంగా పెట్టుకుంటూ …అందంతా ఒక పండగ . అట్లా తద్ది అయితే మరీనూ . తెల్లవారి మా ఇంట్లో పనోలోకి వచ్చే గంగమ్మ రాగానే లేపి తన చెయ్యి చూపించేది . చేతిలో మళ్లీ రాత్రి కలిగినట్టుండేది . చందమాన , చుట్టూ వేలాది చుక్కలు . అంత ఆవగింజ ప్రమాణంలో చుక్కల్ని ఎలా పెట్టుకునేదో ? మరీ మైనంతో పెట్టుకొంటాననేది . ఏమైనా మా చేతుల్లో కంటే మరింత అందంగా పెట్టుకునేది . ఆ గోరింటాకు చేతులు ఆ ఆకు తాలూకు సువాసనతో రెండు మూడు రోజులు పాటు పరవశించేవి . దాదాపు నెల్లాళ్ల పాటు చెథుల్నిఆ రంగులు అంటి పెట్టుకుని ఉండేవి .
గోరింటాకు అనడంతో వెలిగే చేతిలో ఆవకాయ అన్నం కలుపు కుంటుంటే అదో వింత అనుభూతి . గంగమ్మ వాకిట్లో పేడ కళ్లాపి జల్లి రోజుకో చుక్కల ముగ్గు పెట్టేది ప్రతిరోజూ . ఈ కళే గోరింటాకు పెట్టడంలో కూడా కనిపించేది .
ఇంటింటా ప్రతి ఆడపిల్లా కళాత్మకంగా అమర్చుకోవలిసిన ఈ అందం బజారు వస్తువయి పోవడం ఆ మధ్య పెళ్లికి వెళ్లినప్పుడు మరీ కొట్టొచ్చినట్టు కనిపించింది .
పెళ్లి వారింట్లో ముందురోజు రాత్రి మెహందీ పండగట . ఇది పెళ్లిళ్లలో కొత్తగా మొలిచిన పండగ . నేను వెళ్లే సరికి వాళ్ళ ఇంటి హాల్లో సోఫాలో ఒక ఇరవై ఏళ్ల కుర్రవాడు కూర్చుని పెళ్లి కూతురికి హెన్న పెడుతున్నాడు . రెండు చేతులకీ పెట్టడం అయిపోయినట్టుంది ఒక కాలు ఆ అబ్బాయి వడిలో ఉంది . ఆ కాలి పాదం మీద పెట్టడం అయిపొయింది . మోకాలి దాహా లతలు గీస్తున్నాడు . నేను అలాంటి దృశ్యాన్ని అదే మొదటిసారి చూసానేమో తెల్ల బోయి అలాగే నిలబడిపోయాను . వాళ్ళ నాన్న , మిగిలిన మగ ఆడ బంధువులంతా అదేమీ పట్టకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు .
హైస్కూల్లో రంజని అనే స్నేహితురాలు ఉండేది . కాళ్లకి గోరింట పారాణి పెట్టుకుని వచ్చేది . వెండి పట్టాల కింది నుంచి ఎర్రని గోరింట రంగు మెరుస్తుంటే ఆ పాదాలు ఎంత అందంగానో ఉండేది . నడిచినంతమేరా ఆ సింధూరం రంగు నేలకి అంటు తుందేమో అనిపించేది .
పెళ్లి కూతురికి అయ్యాక ఇంట్లో ఉన్న ఆడ కూతుళ్లం దరికీ చేతులకి అటూ , ఇటూనూ , మరింత ఉత్సాహవంతులకి మోచేతుల దాకానూ హెన్నా లతలతో నింపాడు . నాకూ తప్పలేదు . అవలీలగా అయిదు నిమిషాల్లో ట్యూబ్ నొక్కుతూ చెయ్యి ఖరాబు చేసేసాడు .
అరచేతుల్లో హెన్నా ట్యూబయినా అందంగానే మెరుస్తుంది కానీ మిగతా భాగాల మీద కూడా గీసుకుని అది అందమని ఈ బ్యూటీ క్లినిక్ భామలు మహిళా సమూహాలను సౌందర్య భ్రాంతిలో పడేస్తున్నారే ! ఔరా ? ఇది ఎంత విచిత్రం ! అనుకున్నారు .
కానీ తర్వాత విషయం విన్నాక ఇది విచిత్రం కాదు . ఘోరం అనిపించింది . హెన్నా కుర్రవాడు చేతికి వందరూపాయలు వసూలు చేసాడు . పెళ్లి కుమార్తెకు రెండు చేతులూ రెండు కాళ్లూ వెరసి రెండు వేల ఆరు వందలు . వాడు రెండు గంటల్లో రంగు పూసి అయిదు వేలు పట్టుకెళ్లాడు .
కింది మధ్య తరగతి కుటుంబాలలోని హెన్నా ముచ్చట ఇది . యింత అవసరమా ? అని నాబోటి వాళ్లం ముక్కు మీద వేలు వేసుకుంటే అలాంటి దాన్ని నేను ఒక్క దాన్నే అవుతున్నాను .
పోనీ ఆ హెన్నా ఏ అరచేతులకి అందంగానీ ఒళ్లంతా కాదని ఎందుకు తెలీడం లేదూ ? ఒకరిని చూసి ఒకరు వాత పెట్టుకునే ఈ సౌందర్య భ్రమాన్విత అనారిగ్యానికి మందేది ? .
గోరింట పూచింది కొమ్మ లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
అని కవి ‘ అరచేత ‘ అన్న మాట గుర్తు చెయ్యాలని ఉంది .
అమ్మాయిలూ ఈ హెన్నా బిజినెస్ ని మనం పిచ్చిగా పెంచి పోషించాలో ఒకసారి ఆలోచించరూ ! మన అరచేతులకి మనమే ముచ్చటగా గోరింట పూయించుకోలేమా ?

– వాడ్రేవు వీరలక్షిదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

One Response to మళ్ళీ మాట్లాడుకుందాం !