ఈ పరిపాలనలో క్రొత్త సాంకేతిక కెరటం ఐ క్లిక్
ఈ పరిపాలన అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరిపాలనను భద్రతా రంగంలో కూడా విస్తృతం చెయ్యడం ఒక మంచి పరిణామం.
ముందుగా విశాఖపట్నంలో ఏర్పాటు చెయ్యబడ్డ కియోస్క్ల పనితనం సఫలీకృతం అయితే, ఇక అన్ని పట్టణాల్లోనూ ఈ కియోస్క్ లను (ఐ క్లిక్) ఏర్పాటు చెయ్యవచ్చు.
అయితే, పట్టణాల్లోనే ఈ విధానం అమలు చెయ్యాలా? గ్రామాల్లో మహిళలు భద్రంగానే ఉన్నారా? లేరు కదా!!
గ్రామాల్లోని మహిళలు పోలీసు స్టేషన్లకు వెళ్ళడానికి సరైన వెసులుబాటు ఉందా?
శారీరక లేదా మానసిక హింసను ధైర్యంగా చెప్పే వెసులుబాటు ఉందా?
ఫిజికల్ లేదా మెంటల్ అబ్యూజ్ ను గూర్చి ధైర్యంగా బయటికి చెప్పేందుకు మహిళలు ఎంతో నిబ్బరాన్ని కూడగాట్టుకోవాల్సిన పరిస్థితులు మన సమాజంలో ఇంకా మారలేదు.
పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లెయింటు ఇవ్వడం అంటే అదొక ఎబ్బెట్టు విషయంగానే పరిగణించబడుతుంది.
ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మహిళా కియోస్క్ లను ఏర్పాటు చెయ్యడం ఒక మంచి పరిణామం.
గ్రామాల్లో కూడా ఇటువంటి కియోస్క్ లను ఏర్పాటు చేస్తే మంచిది.
అయితే ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వాలు రూపొందించి అమలు పరుస్తున్నాయి.
మరి చాలా కార్యక్రమాలు ఆరంభ సూరత్వం గానే ఎందుకు మిగిలిపోతున్నాయి?
కొన్ని నెలల తర్వాత వెళ్లి చూస్తే, ఆయా కార్యక్రమాలు కుంటుపడి కనిపిస్తాయి. కొన్నాళ్ళకు ఆనవాళ్ళు కూడా మిగలకుండా పోతాయి.
ఇందుకు కారణాలు ఏమిటి?
మా ఊర్లో ఒక అందమైన పార్కు కట్టారు. మా అబ్బాయి చిన్నపుడు ఆ పార్కుకు వెళ్లి ఆడుకునేవాడు. డైనోసార్లు, మొసళ్ళు, పిల్లల బొమ్మలు పెద్ద పెద్దవి ఉండేవి. ఒక మ్యూజియం, ఫ్లవర్ బిల్డింగ్, కొలను ఎన్నో ఉండేవి. ప్రజలు ఆ పార్కును చూడ్డానికి పెద్ద సంఖ్యలో వచ్చేవారు. కొన్నాళ్ళకు వెళ్లి చూద్దుము కదా, చాలా బొమ్మలు విరిగిపోయాయి. పిల్లలు ఎంతో ఇష్టపడే రైలు రూపు రేఖలు లేకుండా పోయింది. మ్యూజియం మూసేశారు, ఫ్లవర్ బిల్డింగ్ శిధిలమైపోయింది. ప్రజలు రావడం తగ్గిపోయింది. పార్కు ఇపుడొక శిధిల భవనాల సమూహం. దీనికి కారణం?
మానేటారీ ఫండ్ లేకపోవడం.
ఇటువంటపుడు నాకు నోబెల్ బహుమతి గుర్తుకొస్తుంది.
నోబెల్ పేరుతో ఇచ్చే బహుమతి నగదును ప్రతి సంవత్సం ఇవ్వాలంటే, వాళ్ళు ఏం చేస్తారు?
ఇదే పధ్ధతి మన పథకాల అమలుకు ఎందుకు వర్తించడం లేదు?
ఇది ఒక ఉదాహరణ మాత్రమే!
మానెటరీ ఫండ్ లేకపోవడం, సరైన మానిటరింగ్ లేకపోవడం, consistency లోపించడం…ఇవే కారణాలు ఏ పథకం నిర్వీర్యం కావడానికైనా!
వీటిని అధిగమిస్తే, ప్రతి కార్యక్రమం సఫలీకృతమౌతుంది.
ప్రజలకు బాధ్యతను అప్పగిస్తే, ప్రభుత్వ (ప్రజల) ఆస్తులు నిలబడతాయి.
ఇందుకోసం ప్రజలకు ముందుగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి.
మహిళా కియోస్క్ లు ఒక మంచి విధానం. పోలీసు యంత్రాంగానికి ఇదొక సాంకేతిక వరం. మహిళలకు ఫిర్యాదు చేసేందుకు ఒక సులువైన మార్గం. ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ పథకం కూడా కొన్నాళ్ళకు పనికిరాకుండా పోతుంది.
– విజయభాను
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~