ఆతిథ్యం

ఆతిథ్యం
——————

కొన్ని సత్యాలు ముందే తెలుస్తాయి
చేదువైనా, తీపివైనా…
కొన్ని కలలు నడిరాత్రికి ముందే విరుస్తాయి
అందమైనవైనా, వర్ణాలులేనివైనా….
కొన్ని విశ్వాలు ముందే నిదురలేస్తాయి
ఆద్యంతాలున్నవైనా, లేనివైనా…
కొన్ని మేఘాలు ముందే వర్షిస్తాయి
తుంపరగానైనా, కుండపోతగానైనా…
ముందే రావడం వాటి లక్షణం
అనుకోని అతిథులకు నీవేమి ఆతిథ్యమిచ్చావన్నదే ముఖ్యం!

గీతాలు
——————–

అర్థ మరణాన్ని నా నుదుటిన రాసిన గీతలు
అలవోకగా, అర్థాంతరంగా….
నీకు, నాకు మధ్య నెట్టుకు వచ్చిన
కందకాలంటి గీతలు
అసమంజసమని తెలిసినా…
పర్వతసానువులపైకి నన్ను లాక్కుపోయిన
ఉక్కుతాళ్ళ గీతలు….
ఒంటరి కొండనెక్కించి…
వెన్నెలను రంపపుకోతలుగా నాపైకి తోసిన చంద్రుని కాంతుల గీతలు
దృఢమైన సంకెళ్ళను నా చుట్టూ అల్లేసిన
నా చేతుల చేతల గీతలు
ఒక్కటని ఏమి చెప్పను?
జన్మించక ముందే నన్ను చుట్టుముట్టిన అమ్మ ప్రేగుల గీతల కావల
ప్రపంచాన అడుగిడిన నాటినుండి…
నీడల్లా నను అడుగడుగునా తరిమిన గీతలు
నేడు ఊహలకు సైతం అడ్డుపడి…
నిలువునా బంధనాలను తెంచేసి…
ఒంటరి ప్రవాసిగా నన్ను నిలబెట్టిన నిబంధనల గీతలు…
నా మోహభాష ప్రయాణం
ఇక్కడితో సమాప్తం!
నా మౌనభాష వంతెనలను వెతుక్కుంటూనే ఉంటుంది!
గీతల కావలి లోకాన్ని…
గీతల కీవలి లోకాన్ని….
తిరిగి కలిపే వెచ్చటి రక్తప్రసరణంటి జీవనది గీతల్నో…
ఎవరేమన్నా….ఏమనుకున్నా…
హెచ్చు ఆకర్షణతో రెండు ధృవాలను కలిపే అయస్కాంత గీతల్నో…
వెతుక్కుంటూనే ఉంటుంది!!!

-విజయభాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , Permalink

2 Responses to ఆతిథ్యం

 1. jhanshi says:

  విజయభాను గారు మీ కవిత గీతాలు . బాగుంది . మీరు చెప్పింది నిజం . ఈ గీతల్లోనే కదా నడిచేది మనిషి పయనం .

 2. దడాల వెంకటేశ్వరరావు says:

  మీ మొదటి కవిత ఆతిథ్యం బాగానే ఉంది కాని

  ముందుగా వస్తారని తెలిసిన అతిదులకే ఏమీ చెయ్యలేకపోతున్నాము
  ఇక అనుకోని అతిథులకు ఏమి ఆతిధ్యం ఇవ్వగలము
  ముందే తెలిసిన సత్యాలను లేక్కచేయ్యము
  తరువాత తెలిసిన సత్యాలను మరచిపొతాము
  తెల్లవారుజామున వచ్చే కలలనే నమ్ముతాము
  మనకు తెలిసిన విశ్వం ఎప్పుడూ మేలుకొనే ఉంటుంది

  మేఘాలు వర్షించడానికి ముందు వేనుకలుండవు
  ముందే వచ్చినవి మీ ఆలోచనలు (కవితలు)

  మీ రెండో కవిత గీతలు ( కాదు గీతాలు)
  మీ కవితంతా గీతలతొ చిక్కుకుపోయి ఉంది
  ముందు ఆచిక్కులన్ని తీయండి
  తరువాత చదువుకోవడానికి బాగుంటుంది