పేజీలు
లాగిన్
వర్గాలు
కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్ధిక, రాజకీయ నేపథ్యం
1908-80 సంవత్సరాలు మధ్యగల సుమారు 72 సంవత్సరాల జీవితకాలంలో 1931-80 మధ్యగల సుమారు అర్ధశతాబ్ధి సాహిత్య జీవితకాలంలో – కుటుంబరావుగారు సమకాలీన ప్రజాజీవితాన్ని కుదిపేసిన ఎన్నో సంఘటనలకు వ్యక్తిగా, రచయితగా ప్రతిస్పందించాడు. భారతదేశ ఆర్ధిక, సాంఘిక, రాజకీయ చరిత్రపై బలమైన ముద్రను వేసిన ఎన్నో సంఘటనలకు ఆయన ప్రత్యక్షసాక్షి. రెండు ప్రపంచయుద్ధాలు, ఆర్ధిక మాంద్యం, జాతీయోద్యమం, స్వాతంత్య్రసాధన, దేశవిభజన, కాంగ్రెస్ పరిపాలన, నిరాశనే మిగిల్చిన స్వాతంత్య్రం, మతోన్మాదం, కులతత్వం, పెరిగిన దారిద్య్రం- నిరుద్యోగం, అపహాస్యంగా మిగిలిన ప్రజాస్వామ్యం, రష్యాలో జరిగిన విప్లవం రేకెత్తించిన కొత్త ఆలోచనలు, ఆదర్శాలు – వీటన్నింటి ప్రభావమూ వ్యక్తిగా, రచయితగా కుటుంబరావుగారిపై ఉంది. ఈ నేపథ్యంలోంచి కొ.కు. సాహితీ ప్రస్థానాన్ని అవగతం చేసుకోవలసి ఉంది.
కుటుంబరావు తాను రచించిన ‘చెడిపోయిన మనిషి’ కథలో లేడీడాక్టర్ నోట చెప్పించినట్టు ”మనిషి నుండి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారము, తక్కువ అపకారము జరిగేటట్లు చూచుకొనడమే సరి అయిన ప్రవర్తన. మిగిలినవి బూటకపు నియమాలు” అనేదే ఆయన ఆలోచన. ఈ పనిని సాధించేక్రమంలో ‘ఎదుటివారు, ప్రక్కవారు, ఏమనుకుంటారు అనికాకుండా నీ మనసు ఏం చెబుతున్నది అనే విషయానికి’ ప్రాధాన్యతను యివ్వాలని చలం కోరుకున్నట్టుగా – రసెల్ కోరు కున్నట్లుగా,- కొడవటిగంటివారు కూడా కోరుకున్నారు.
సంప్రదాయనీతులను, పురుషాధిక్య సమాజంలోని రెండునాల్కల ధోరణిని, నిరసించి వ్యక్తిస్వేచ్ఛకు పట్టాభిషేకం చేసిన చలంగారిలో కూడా ఇలాంటి తిరుగుబాటు ధోరణే ఉన్నది. కుటుంబరావుగారిని యిది బాగా ఆకట్టుకుంది.
ఈ విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ మధ్య ఒక సావనీర్ వ్యాసంలో (కొడవటి గంటి సాహిత్య సమాలోచన – ఢిల్లీ ఆంధ్రంసంఘం) నండూరి రామమోహనరావు గారు చేసిన వ్యాఖ్యలు మనోవీధిలో మెదులుతున్నాయి.
దీని ప్రభావం కొ.కు. కథలపై కూడా కొంతవరకూ కనబడుతుందిగాని, కొందరు రచయితల్లా – ఈ సిద్ధాంతాల అవగాహనతో ప్రయోగాత్మకమైన రీతిలో కథలురాసి ప్రత్యేకతను చూపుదామనే తపన కుటుంబరావుగారికి లేదు. ఆయన దృష్టి అంతా ‘జీవిత వాస్తవికత’ను అన్వేషించడం మీదనే ! ఇందుకుగాను ఈ అవగాహన ఎంతవరకూ తోడ్పడగలదో అంతవరకే దానిని ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు కుటుంబరావు గారి ‘అమాయకురాలు’ కథనే తీసుకుందాం. ఒక కథను మనోవైజ్ఞానిక దృక్పథంలోంచి చెప్పబడిన కథగా పేర్కొనేందుకు కావలసిన లక్షణాలన్నీ ఈ కథలో వున్నాయి. కానీ – ఈ కథను చెప్పడంలో కథకుడి లక్ష్యం అంతటితో ఆగిపోదు.
ఈ విషయానికి సంబంధించిన చర్చ అలా ఉంచి, కుటుంబరావుగారిపై గల ఇతర ప్రభావాల గురించి చెప్పేటప్పుడు జార్జి బెర్నార్డ్‌షా, హెచ్‌జి వెల్స్, అనటోల్‌ఫ్రాన్స్, మొదలైనవారి పేర్లు మనోవీధిలో మెదులుతాయి.
వ్యంగ్యాన్ని అభిమానించే కుటుంబరావుగారు ఒక సందర్భంలో ఇలా అన్నారు. ”నన్నడిగితే కసికొద్దీ, మంటకొద్దీ రాసేది నాకు బాగుంటుంది. కసి అంటే పళ్ళు కొరకడమూ, చిందులు తొక్కడమూ, అనుకోనక్కరలేదు. ఆ కసి వీరేశలింగం గారి రచనల్లో ఉన్నట్టే ఉండనవసరం లేదు. ‘కన్యాశుల్కం’లో ఉన్నట్లు కూడా ఉండవచ్చును. చలంగారి కథల్లో కసి ఉంది. ఆయనలో సౌందర్య తృష్ట ఒక పాలు తగ్గి, కసి ఇంకో పాలు పెరిగితే ఇంకా బాగుండునేమో అనిపిస్తుంది. రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి కథల్లో ఉన్నదా కసి. భమిడిపాటి వారి హస్యంలో పళ్ళు పటపటలాడించే కసి ఉండేది. సెటైరంతా కసి సాహిత్యమే”
ఇలాంటి ‘కసి’తోనే కుటుంబరావుగారు తన కథాసాహితీ ప్రస్థానంలో అన్ని థలలోనూ రచనలు చేస్తూ వచ్చారు. రాసిన ప్రతిసందర్భంలోనూ సంఘటనల ప్రాతిపదికగా మొత్తం జీవితానుభూతినీ, వాతావరణాన్నీ సమర్ధవంతంగా పట్టుకున్నారు. ”నేను మామూలుగా బుద్ధిమంతుణ్ణే” (రాజకీయ వ్యాసాలు – పే 366) అని చెప్పుకున్న కుటుంబరావుగారు ఏప్రిల్ 1931లో ‘గృహలక్ష్మి’లో ‘ప్రాణాధికం’ అనే మొదటి కథను రాసేనాటికి తెలుగుసాహిత్యానికి మరో ‘బుద్ధిమంతుడయిన’ రచయిత వచ్చాడని పెద్దలు భావించారు, – ఆ పత్రిక సంపాదకులు ఆండ్ర శేషగిరిరావుగారు ఈ కథకొక ప్రస్తావికను రాస్తూ – ”భారతమహిళ శీలవిషయమున అగ్నిశిఖ. నియమ పాలనమున వజ్రభిత్తి, – భర్తృ సేవ ఆమెకు ప్రాణాధికము. ఈ విషయమునే ఈ కథ నిర్వహించుచున్నది. ఇది భారతమహిళా సతీత్వమును ప్రదర్శించు చక్కని చిన్నకథ” – అని మెచ్చుకున్నారు కూడా.
‘-1942లో మార్క్ ్స రాసిన ‘కేపిటల్’ చదివిందాకా నాకు కమ్యూనిజం యొక్క ఆధారమేమిటో తెలియలేదు. ఒక మిత్రుడు యథాలాపంగా అన్నమాట నామీద బండెడు ప్రభావంకన్నా ఎక్కువ పనిచేసింది. దొరికిన మార్కి ్సస్టు సాహిత్యం చదివాను. భవిష్యత్తు మార్కి ్సజంకే ఉన్నట్లు నమ్మకం కుదరింది”.
”మార్క్స్ ‘కేపిటల్’ చదవడంతో సహా మార్కి ్సజం గురించి చదవడం నాకు మేలు చేసింది. సంఘవ్యాధి గురించి కొంత అర్థం చేసుకోగలిగాను. ఈపాటి జ్ఞానోదయం కలగగానే నేనుచేసిన మొదటిరచన ‘కులంగాడి అంత్యక్రియలు’,- అటు తర్వాత రాసిన కథల్లో మనస్తత్వం గురించి గాలికబుర్లు రాయడం మానేసి ఆ మనస్తత్వాన్ని ఆడించే సాంఘిక శక్తులను చిత్రించడం ప్రారంభించాను. ‘నీ కథలు వెనుక ఉన్నట్లుగా లేవు. అవే బాగున్నాయి’ అని కొందరు అభిమానులు నన్ను హెచ్చరించారు”
ఈ కథలోని భీముడు మరో ప్రపంచపు మరో లెనిన్ అనుకున్నప్పటికీ, ఇంతకు మించి గుర్తుపెట్టుకోదగిన పాత్రలు ఈ కథలో ఉన్నాయి. అవి – బలభద్రుడు, వేదాంతి, బండివాడు. ‘బకాసుర వ్యవస్థ’కు బలియైపోయిన బలభద్రుడి మరణంలో త్యాగం ఉంటే – ముసలి రాక్షసుడి సంగతి తెలిసీ, రాజుగారి క్రౌర్యాన్ని స్వయంగా చవిచూసీ, బ్రతుకు తెరువుకు తలవంచి రోజుకో ప్రాణాన్ని బకాసురుడికి అప్పజెప్పిన బండివాడిలో బానిసత్వపు పిరికిదనం ఉంది. యిక – వేదాంతి గారిలో తిరోగతమనతత్వానికి ఊపిరి అయిన అవకాశవాదం ఉంది ! భీముని అవతారానికి ముందు ప్రతి ‘బకాసుర వ్యవస్థ’ లోనూ ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలే ! ”బకాసురుణ్ణి భయపెట్టగలిగిన వాడినై ఉండి కూడా వాణ్ణి చూచి హడలిపోయే మంత్రి వగైరాలకు తాను లొంగవలసి వచ్చింది” అని బండివాడనుకున్న మాటలనేపథ్యంలోంచి ఈ కథను చదివే పాఠకులు ఆత్మపరిశీలన చేసుకొనవలసి ఉంది.
ఈ కథలోని భీముడు మరో ప్రపంచపు మరో లెనిన్ అనుకున్నప్పటికీ, ఇంతకు మించి గుర్తుపెట్టుకోదగిన పాత్రలు ఈ కథలో ఉన్నాయి. అవి – బలభద్రుడు, వేదాంతి, బండివాడు. ‘బకాసుర వ్యవస్థ’కు బలియైపోయిన బలభద్రుడి మరణంలో త్యాగం ఉంటే – ముసలి రాక్షసుడి సంగతి తెలిసీ, రాజుగారి క్రౌర్యాన్ని స్వయంగా చవిచూసీ, బ్రతుకు తెరువుకు తలవంచి రోజుకో ప్రాణాన్ని బకాసురుడికి అప్పజెప్పిన బండివాడిలో బానిసత్వపు పిరికిదనం ఉంది. యిక – వేదాంతి గారిలో తిరోగతమనతత్వానికి ఊపిరి అయిన అవకాశవాదం ఉంది ! భీముని అవతారానికి ముందు ప్రతి ‘బకాసుర వ్యవస్థ’ లోనూ ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలే ! ”బకాసురుణ్ణి భయపెట్టగలిగిన వాడినై ఉండి కూడా వాణ్ణి చూచి హడలిపోయే మంత్రి వగైరాలకు తాను లొంగవలసి వచ్చింది” అని బండివాడనుకున్న మాటలనేపథ్యంలోంచి ఈ కథను చదివే పాఠకులు ఆత్మపరిశీలన చేసుకొనవలసి ఉంది.
దిబ్బరాజ్యానికి స్వాతంత్య్రం వచ్చిందని విని మనకు కథను చెప్పే వ్యక్తి ఆ రాజుగారిని కలుసుకోవడానికి అక్కడకు వెళ్ళేసరికి రాజుగారి దర్బారు ‘శాసనసభ’గా పేరుమార్చుకుందనీ, దానికి రాజావారు అధ్యకక్షులయిపోయారనీ, జమీందారులందరూ మంత్రులుగా మారిపోయారనీ తెలుస్తుంది! – రాజుగారు మాటల మధ్యలో తమ దేశంలో జమీందారీలు రద్దయిపోయాయని చెబితే – మన కథానాయకుడు చాలా సంతోషించి, ఆ వివరాలు చెప్పమంటాడు.
ఇట్లాంటి కథలను కుటుంబరావుగారు ఏ వ్యవస్థపట్ల ‘కసి’తో రాశారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇలాంటి ‘కసి’తో రాసినదే ‘కరువొచ్చింది’ అనే కథ కూడా – ”-కరువొచ్చింది. పంటలుపండినై, – గింజలు కళ్లాలు దాటగానే మాయమయినై. పైరు పచ్చగా పెరిగినప్పుడూ, కంకులు బరువుగా వొంగి, తమకు ఏపుగా పెంచిన భూదేవికి జోహార్లు చేసినప్పుడూ, బంగారు గింజలు కనక వర్షంలా జలజల రాలినప్పుడూ, కళ్లపండువుగా చూచిన పేదప్రజలకు కన్నుపొడుచుకున్నా గింజ కనిపించలేదు. రైతుల తపః ఫలితాన్ని గద్దలు తన్నుకుపోయినై. కాటకం వచ్చింది” అంటూ మొదలయ్యే ఈ కథలో కరువు నివారణకు ఆకలిని తిడుతూ కవిగారు పద్యరత్నాలు రాయడమూ – కరువు నివారణకు ఏర్పాటు చేయబడిన సభలో – దేశమంతటా కరువు నివారణ హోమాలు, యజ్ఞాలు చెయ్యాలనీ, రామభజనలు చేయాలనీ, పేదప్రజలు రోజూ గీతాపారాయణం చెయ్యాలనీ – బ్రహ్మచర్యం పాటించి సంతానోత్పత్తిని తగ్గించాలనీ – పూటకు పావుశేరుకన్నా ఎక్కువబియ్యం అన్నంగా వండుకోకూడదనీ (తర్వాత దీనిని అర్థశేరుగా సవరించారు) తీర్మానాలు ఆమోదించ బడడమూ, – ఆ కథ చదివినవారికి గుర్తు ఉంటుంది. అయితే – కథ చివరకు వచ్చేసరికి, – పేదవాళ్ళందరూ ఏకం కావడంవల్ల లక్షల కొద్దీ బస్తాల ధాన్యం చీకట్లోంచి బయటకు రావడమూ, కరువు పటాపంచలు కావడమూ, జరుగు తుందనుకోండి – అది వేరే విషయం !
ఫుడ్ కార్పొరేషన్ గోడవున్లలో పేరుకునిపోయి వున్న నిల్వలలో ‘పనికి ఆహారం’ పథకం క్రింద అదనంగా మరికొన్ని పనులు చేబడితే పేదప్రజలకు మేలు సమకూరడం మాత్రమే కాకుండా దేశ ఆర్ధికప్రగతికి అది దోహదం చేస్తుందని ఈ ‘మేధావు’లకు తెలియదనుకోవాలా? – గిడ్డంగుల్లోని ఆహార ధాన్యాలు వినియోగం కాకపోవడానికి కారణం ప్రజలకు వినియోగశక్తి లేకపోవడం అనే కనీస అవగాహనవారికి వుండదను కోవాలా? లేక పెట్టుబడిదారీ మనస్తత్వానికి ఇది పరాకాష్ఠ అనుకోవాలా? అనే ప్రశ్నలకు సమాధానం ఆ మేధావులకే తెలియాలి ! ఇలా ఆలోచించినప్పుడు, – కొ.కు. గానీ 2002 సంవత్సరం వరకూ జీవించి వుంటే ‘కరువొచ్చింది’ కథను ఇంతకుమించిన ‘కసి’తో రాసివుండేవారేమో అనిపిస్తుంది.
కొందరికి లాభాలను ఆర్జించి పెట్టడానికి మరికొందరు ఎలా గానుగ ఆడబడి వ్యర్థపదార్థంగా ఎలా మిగిలిపోతారో – పెట్టుబడిదారీ పారిశ్రామిక నాగరికతలో ఉత్పత్తి కారకంగా శ్రామికుడి స్థానం ఏమిటో ఒక మధ్యతరగతి కుటుంబం కథగా ఇందులో చెబుతారు కుటుంబరావుగారు.ఈ ‘నువ్వులు-తెలగపిండి’ వ్యవహారంలో గానుగ ఆడించేవాడు పారిశ్రామికవేత్త. ఆడబడేవాడు కార్మికుడు, అనే నియమం ఏదీ లేదు. దగ్గర బంధువుల విషయంలో కూడా ‘స్వార్థం’ అనేది చొరబడినప్పుడు మనుషులు నువ్వుల గానుగ ఆడబడుతూనే ఉంటారు. చివరకు తెలకపిండిలా మారి వ్యర్థపదార్థంగా మిగిలిపోతూ వుంటారు అనేదానికి ఈ కథలోని సోమయాజులు అనబడే ఇంటల్లుడే తార్కాణం. అతడికి భగవంతుడు ఇచ్చిన చక్కని గాత్రమే అతడి బ్రతుకును తెలకపిండి చక్కలామార్చేసింది.
”-నెస్సిసిటీ. నా బోటివాళ్ళకు నెస్సిసిటీ అనేది ఒకటి ఉంటుంది. నాకు మీ డాడీ (రాణి తండ్రి) వందరూపాయలు జీతం ఇస్తున్నారు. – ఇలాంటి ట్యూషన్స్ రోజుకు మూడు చెబితే నెలకు మూడువందలు వస్తాయి. డుయు థింక్, ఇట్ ఈజ్ ఎ డీసెంట్ ఇన్‌కం ? – అయితే నేను వందరూపాయలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాను? – సెస్సిసిటీ. నేను సర్వైవ్ కావాలంటే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు ఒప్పుకోవాలి” అనే రాజశేఖర్ ఆవేదనలో ఎక్స్‌ప్లాయిటేషన్ జరగడానికి గల అసలు కారణం తెలుస్తుంది. దీనిని నిర్మూలించాలన్నదే ‘సోషలిజమ్’ ధ్యేయం.
కథలు రాయడం తగ్గించుకున్న తర్వాత కూడా కుటుంబరావుగారుతన సమకాలీన పరిస్థితులపై పలు సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు.’- మనదేశంలో ప్రజాస్వామ్యం ఎన్నికలతో ప్రారంభమై అక్కడే ఆగిపోతున్నది’
వివిధ సందర్భాలలో ’70లలో కుటుంబరావుగారు రాసిన వ్యాసాల్లోని కొన్ని వ్యాఖ్యలు ఇవి. కాలగమనంలో కొన్నిమార్పులు, చేర్పులూ, ఏర్పడినా ఈనాటికీ ఈ వ్యాఖ్యలు చాలావరకు వర్తిస్తాయి.
కుటుంబరావుగారు ‘రోడ్డుప్రక్కన శవం’ అనే కథ ఒకటి రాశారు. అవడానికి ఇది రోడ్డుప్రక్కన దిక్కులేని చావుచచ్చిన ఒక వ్యక్తి కథే అయినా – ఆ కథలో కొ.కు. బ్రతికుండగా ఒక ముష్ఠివాడికి వచ్చిన రెండు కలల గురించి చెబుతారు. మొదటి కలలో – పూరిపాక. పాక మీద సొరపాదు. ఆ పాదుకు కాయలు. పాకలో వంటచేసే ఆడకూతురు. అన్నం వాసన- పులుసు వాసన – పొయ్యి క్రింద ఎర్రెర్రగా మండుతున్న చితుకులమంట ఉంటాయి.
ఇలాంటి స్థితిలో ఉన్న మనం – మన గురించి మరొకసారి ఆలోచించుకోవడానికి ‘కొ.కు.’ కథలు ఇవాళ్టికి కూడా ఎంతగానో ఉపకరిస్తాయి. అంతేకాదు, కథకుడుగా కలం పట్టిన వారి బాధ్యతను కూడా గుర్తుచేస్తాయి.
”- జీవితం చాలా విశాలమైంది. సంఘంలో అనేకవర్గాల వారు, వృత్తులవారు, ప్రాంతాలవారు ఉన్నారు. వీరందరికీ అనేక వందల సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించుకునే నేపథ్యంలో వారు చిత్రవిచిత్రమైన నైతిక, ఆర్ధిక పరిస్థితులకు గురి అవుతున్నారు. విస్తృతమైన ఈ జీవితాన్ని ప్రతిబింబించడానికి ఎన్ని కథలైతే చాలేటట్టు? జీవిత వైవిధ్యంతోబాటు మార్పుకూడా చాలావేగంగా జరుగుతున్నది. రెండేళ్ళ క్రితం ఒక సమస్య ఏ రూపంలో ఉన్నదో ఈనాడది ఆ రూపంలో ఉండడం లేదు. దీనిని సాహిత్యంలో చిత్రించవలసిన ఆవశ్యకత ఉన్నది” అని.



[…] “కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్ధిక, రాజక…“, “కొండ చిలువ” కథానిక సంపుటి పరిచయం – ఈ మాసం విహంగ మాసపత్రికలో వచ్చాయి. […]