ఎనిమిదో అడుగు – 22

n-399-222x300సిరిప్రియ వైపు చూశాడు హేమేంద్ర. ..
ఆమె ఆవుపాలతో కడిగిన బంగారు ప్రతిమలా, వెన్నెల శిల్పంలా ముడుచుకొని కూర్చుని వుంది. ఆమె చేతిని మెల్లగా సృశిస్తూ….
‘‘ ఈ ఊరు, ఈ వాతావరణం, ఈ మానవ సంబంధాలు నాకు నచ్చాయి. కానీ మన పెళ్ళి మిా ఊరిలో చేసి. ఇది మాత్రం ఈ ఊరిలో ఎందుకు చేస్తున్నట్లు…’’ అన్నాడు హేమేంద్ర.
అతనికి ఆమెతో మాట్లాడే ఏకాంతం అప్పుడే దొరికింది.
ఆమె కాస్త సిగ్గుపడ్తూ ‘‘మా తాతయ్య వంశంలో పుట్టిన ఆడపిల్లలకి ఎక్కడపెళ్లి జరిగినా ఈ ఆచారం మాత్రం ఇక్కడే, ఇదే స్థలంలో చేస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్లంతా మా నానమ్మలు, అమ్మమ్మలు, వాళ్ల ఆడపడుచులు, వాళ్ల తోడికోడళ్లు…. ఇలా పెళ్లిళ్లప్పుడు అందరు ఒకచోట చేరి ‘దీన్ని’ ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. చూశారుగా సందడి! ఎంత కళాత్మకంగా వుందో!’’ అంది.
హేమేంద్ర వింటూ అవునన్నట్లు తల వూపాడు.
ఆమె అంతటితో ఆపకుండా … ‘‘ఇంతక ముందు మీారు చూశారుగా పెళ్లికి వచ్చినవాళ్లంతా తాతాయ్య చేత్తో, కొత్తబట్టలు తీసుకొని, తాతయ్య కాళ్లకి దండం పెట్టి వెళ్లటం…! వాళ్లంతా వేరు, వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తూ, ఎక్కడెక్కడో చదువుకుంటూ వున్నారు. ఏ సమస్య వచ్చినా తాతయ్యతో చెప్పుకుంటారు. నలుగురు కలసి ఆ సమస్యకి పరిష్కారం వెతికి సమస్యలో వున్న వ్యక్తిని బయటకి లాగుతారు. ధైర్యం చెబుతారు, మనిషికి, మనిషి ఇచ్చే ఆస్తి ఇంతకన్నా ఏముటుంది? మా అందరికి మా తాతయ్య స్పూర్తి, ఆయన మాకు పంచే ప్రేమ, వాత్సల్యం మా కుటుంబాలకి జీవనాడిలా పనిచేసి మమ్మల్ని నిత్యం సంతోషంగా వుంచుతుంది. ముఖ్యంగా మా తాతయ్య పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు, ఆయన ఆలోచనలని పిల్లలపై మాత్రం రుద్దరు. ‘మిా ఆలోచనలు మీాకుంటాయి వెళ్లండి!’ అన్నట్లు ప్రశాంతంగా చూస్తారు.’’ అంది సిరిప్రియ.
ఎంతో పరిణతి వున్న యువతిలా సిరిప్రియ మాట్లాడుతుంటే గంగానదిలో స్నానం చేసినట్లుంది హేమేంద్రకి…. ఇకముందు తను కూడా ఈ కుటుంబంలో ఓ వ్యక్తి కావటం, సిరిప్రియలాంటి భార్య దొరకటం పూర్వ జన్మలో చేసిన పూజలే కారణమని నమ్ముతూ… ఏం మాట్లాడాలో తోచనివాడిలా, ఏం చెయ్యాలో అంతకన్నా తోచని వాడిలా చూస్తూ…

‘‘మరి నువ్వు ఇంత మంది పెద్దవాళ్ల మధ్యన పెరిగావు కదా! వాళ్ల ద్వారా నువ్వేం తెలుసుకున్నావ్‌?’’ అన్నాడు.అతను అడిగిందే తడవుగా సిరిప్రియ తన చేతివేళ్ల వైపు చూసుకుంటూ ‘‘జీవితంలో ఎప్పుడూ నిరాశ చెందకూడదని,… మన జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా గడిపే అవకాశం మన చేతుల్లోనే వుంటుందని,… మన అడుగులు ముళ్లదారిలో పడ్డా, పూలదారిలో పడ్డా దానికి మూలం మన ఆలోచనలేనని… ఏది ఎలా జరుగుతుందో చూద్దాం అన్నట్లు మొండిగా అడుగువెయ్యాలి కాని సమస్యను చూసి బెదిరిపోకూడదని… ఎదుటి వాళ్ల ఆలోచనలకు, అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి కాని మన ఆలోచనలు, అభిప్రాయాలు అంతకన్నా విలువైనవని… ముఖ్యంగా జీవితాన్ని ప్రేమించాలని… దాన్ని మంచి పనులకు ఉపయోగించాలని. అలా చేస్తే ఆత్మ సంతృప్తి వస్తుందని దాని వల్ల చుట్టూ వున్న మనుషులు హాయిగా వుంటారని. తెలుసుకున్నాను’’ అంది.సిరిప్రియ పెరిగిన పరిసరాలకి, తను పెరిగిన వాతావరణానికి తేడా వుందనిపించింది. అంతేకాదు. సిరిప్రియ`అత్తా, కోడళ్లు, తోడికోడళ్లు కలసికట్టుగా వుండి, మానవ సంబంధాలు పుష్కలంగా వున్న గడ్డ మిాద పుట్టిన బిడ్డ. ప్రకృతితో ప్రత్యక్ష సంబంధాలు వున్న మనిషి. మరి తను…? చేతులకి గ్లౌజులు తొడుక్కుని మట్టిని పిసికిన వాడు.. పూజగదిలాంటి తండ్రి ఎదపై చెప్పుల కాళ్లతో నడిచినవాడు… చదువుకోవలసిన వయస్సులో కాలేజి నుండి బహిష్కరింపబడినవాడు…. ఇవన్నీ తన భార్యతో చెప్పుకోగలడా? బహుశా ఇప్పుడేకాదు, ఎప్పటికీ చెప్పుకోలేడేమో! మెహందీ పెట్టి బాగా పండిన ఆమె చేతుల వైపు చూస్తూ తన జీవితపు డిజైన్ను ఊహించుకుంటున్నాడు.

ఆమె కాస్త కదిలి….‘‘మనకి ఒక వయసు వచ్చాక ఒక్క క్షణం కల్లు మూసుకొని, మనలోకి మనం తొంగి చూసుకొని అక్కడ అహంలాంటిది ఏమైనా వుంటే దాన్ని తొలగించి, ఆత్మవిమర్శ చేసుకుంటే మనం ఏ దారిలో పయనిస్తున్నామో మనకు తెలిసిపోతుంది.’’ అంది. సిరిప్రియలో నేను కొత్త పెళ్లికూతుర్ని అన్న సంశయం లేదు. ఎన్నో ఏళ్లుగా కాపురం చేస్తున్న భర్తతో మాట్లాడుతున్నట్లేవుంది. ఎంతో ఆత్మవిశ్వాసం వున్నవాళ్లే అలా మాట్లాడగలుగుతారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ని హ్యుమన్‌ రిలేషన్స్‌ని పుస్తకాల్లో మాత్రమే చదువుకునే వాళ్లు ఇలా మాట్లాడలేదు. ఇలా వుండరు. వాళ్లలో ఈ ఆర్థ్రత, ఈ అనుభూతి రాదు. ఈ జీవన స్పృహ అంతకన్నా వుండదు. అందుకేనేమో హేమేర్రదకి తెలియకుండానే ఆత్మన్యూనతా భావం అతిసూక్ష్మంగా అతని నరనరంలోకి ప్రవేశించింది. విచిత్రమైన స్థితిలోకి తీసికెళ్లింది. తీవ్రంగా ఆలోచింపజేస్త్తోంది. ఫలితంగా అతని పెదవులు సన్నగా అదిరాయి. వెన్నముద్దల్లాంటి ఆమె చెంపలవైపు చూస్తూ…. ‘‘ సిరీ! నేనొకటి అడుగుతాను చెబుతావా?’’ అన్నాడు. అడగకముందే హేమేంద్ర గొంతు తడారిపోతోంది.
‘‘అడగండి!’’ అంది మెల్లగా….

హేమేంద్ర పెదవుల్ని తడిచేసుకొని, అంతకన్నా మెల్లగా ‘‘నీకు ‘డేట్‌’ ఎప్పుడొస్తుంది?’’ అని అడిగాడు.  సిరిప్రియ షాకైంది. అలాగే ఓ క్షణం అతని ముఖంలోకి చూసి నెమ్మదిగా పెదవి కొరుకుతూ, అయినా ఇప్పుడు ఆ డేట్‌తో ఏం పని? అని ఆలోచిస్తోంది. ఏ భర్త అయినా తొలిరాత్రి తన భార్యతో` నీ అలవాట్లేమిటి? నీ కోరికలేమిటి? ఎలాంటి భర్త కావాలనుకునేదానివి? నీకు ఎలాంటి డ్రస్‌లు నప్పుతాయి? ఎక్కువగా ఏ కలర్‌ని ఇష్టపడ్తావు? నువ్వెలావుంటే మిా ఇంట్లో వాళ్లు ఇష్టపడ్తారు? ఇకముందు నిన్నెలా నడుచుకోమని చెప్పారు? జీవితం ఎలా వుంటే బావుంటుందననుకుంటున్నావ్‌? పిజ్జాలు, ఎగ్‌పప్స్‌, లాంటివి తింటావా? లేక నార్మల్‌ డైట్‌ని తీసుకుంటావా? ఇవి కాక ఇంకా అడగాలనుకుంటే నీకు ఎఫైర్స్‌ లాంటివి ఏమైనా వున్నాయా? అని కూడా అడుగుతారు. అవన్నీ పక్కనపెట్టి ‘డేట్‌’ అడుగుతాడేమిటి? ఇంకా తేరుకోలేదు సిరిప్రియ.

అయినా ఎలా చెప్పాలి? కొత్తగా వుంది. సిగ్గుగా వుంది. ఇబ్బందిగా వుంది. మళ్లీ అడుగుతాడేమోనని భయంగా వుంది. అడగకుంటే బావుండని ఆశగా వుంది. కానీ అడిగాడు హేమేంద్ర… పైగా ‘నేను నీ భర్తను నా దగ్గర ఏదీ దాచాల్సిన అవసరం లేదు. చెప్పు’? అన్నట్లు చూశాడు. ఇక తప్పదన్నట్లు నెమ్మదిగా నోరువిప్పి, సిగ్గును పక్కకి నెట్టి తనకి డేట్‌ ఎప్పుడొస్తుందో చెప్పింది సిరిప్రియ.వెంటనే హేమేంద్ర తన చేతిలో క్యాలిక్యులేటర్‌ లేకపోయినా చేతివేళ్లను కదిలిస్తూ లెక్కలు వేసుకొని ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదన్నట్లు తేలిగ్గా వూపిరి పీల్చుకొని సిరిప్రియను దగ్గరకు తీసుకున్నాడు….చిగురాకులపై కూర్చుని వున్న పక్షి పిల్లను చేతుల్లోకి తీసుకున్నట్లు అతి సున్నితంగా ఆమె మోమును దోసిట్లోకి తీసుకొని అమెను జయించాడు.ఒక జవన అశ్వం తనపై అద్భుతంగా స్వారీ చెయ్యగలిగే రౌతును ఇష్టపడ్తుంది. ఆ రౌతు తనపై స్వారీ చేస్తున్నప్పుడే అది గమనిస్తుంది. రౌతు తన కదలికల్ని ఎంతవరకు అంచనా వేసి తనను నడిపిస్తున్నాడా అని… తనను సరైన విదముగా నియంత్రించి, నిర్వహించగలుగుతున్నాడా లేదా అని….తనకు అన్నీ సరిగ్గా అన్పిస్తేనే ఆ గుర్రం రౌతును కింద పడెయ్యదు. కాలితో తన్నదు.
ఆమూడు రాత్రులు మూడు యుగాలకు సరిపోయ్యేంతగా వాళ్లిద్దరు పొలాల్లో తిరిగారు. కొండలు ఎక్కారు. చెరువుల్లో దిగారు, డొంకలు, దుప్పలు, కాలువలు అన్నీ వాళ్లేఅయి తిరిగారు.ఆ తర్వాత చెప్పాడు హేమేంద్ర…. ‘‘ సిరీ !మనకి ఇప్పుడే పిల్లలు వద్దు, ఆర్థికంగా నేనోస్థాయికి వచ్చేంతవరకు ఆగుదాం!’’ అని.అప్పుడు అర్థమైంది సిరిప్రియకు అతను డేట్‌ ఎందుకు అడిగాడో….

‘‘వరంగల్‌ నుండి వచ్చినప్పటి నుండి హాస్పిటల్‌కి వెళ్దామని ఒకటే గోలచేస్తున్నావు. నీకేమైనా పిచ్చా? నేను హాస్పిటల్‌కి వస్తే ఆ కొద్ది సేపట్లో నాకొచ్చే ఆదాయాన్ని నేను నష్టపోతాను. నాకంత టైంలేదు.’’ అన్నాడు భువనేష్‌.
‘‘ఎవరికోసమండీ ఆ సంపాదన?’’ అంది ఉక్రోషంగా స్నేహిత.అతను అదోలా చూసి… ‘‘మన కోసం! మన పిల్లల కోసం! ఇప్పుడు నేను సంపాయించే ప్రతిపైసాకి నా పిల్లలే రేపటి వారసులు. ఎవరికోసం అంటావేం? అదేం తిక్క ప్రశ్న?’’ అన్నాడు భువనేష్‌.వాళ్లిద్దర్ని వేర్వేరు వైద్య పరీక్షల కోసం పంపారు.సెమెన్‌ ఎనాలసిస్‌ (వీర్యం పరీక్ష) కోసం భువనేష్‌ దగ్గర సెమెన్‌ తీసుకొని అతన్ని పంపించారు. స్నేహితకి వెజైనల్‌న, వెజైనల్‌ హిస్టలాజికల్‌ స్టడీ, అల్ట్రాసోనోగ్రఫి,  హిస్టిరోసాల్పిన్‌ జోగ్రఫి, హిస్ట్రోస్కోపి పరీక్షలు చేశారు. ఇద్దరు వచ్చి ఓ చోట కూర్చున్నారు. రిపోర్ట్సు రావటానికి గంటపడ్తుందని రేడియాలజిస్ట్‌ చెప్పాడు. వెంటనే భువనేష్‌ లేచి నిలబడి…‘‘నువ్వుండు. నేను వెళ్తాను. నాకు వెరీ అర్జంట్‌!’’ అంటూ సెల్‌ఫోన్‌లో టైం చూసుకున్నాడు. ‘‘సరే!’’ అంది స్నేహిత రిపోర్ట్సు పాజిటివ్‌గా రావాలని కోరుకుంటూ, వాటికోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంది స్నేహిత. గంట తర్వాత రిపోర్ట్సు వచ్చాయి. ఆ రిపోర్ట్సుని పట్టుకొని డాక్టర్ని కలిసింది స్నేహిత.

స్నేహిత చేతిలో వున్న రిపోర్ట్సు తీసికొని చూస్తూ ‘‘కూర్చోమ్మా!’’ అంది డాక్టర్‌. కూర్చుంది స్నేహిత. డాక్టర్‌ ఏం చెబుతుందోనని స్నేహితకి ఉత్కంఠగా వుంది. ఆత్రుతగా వుంది. ‘‘చూడమ్మా! నీలో ఎటువంటి లోపం లేదు. గర్భవతి అవటానికి అన్ని అర్హతలున్నాయి.’’ అంది డాక్టర్‌.
ఆ మాటతో స్నేహిత హమ్మయ్య అన్నట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకొని…‘‘బ్రతికిపోయాను డాక్టర్‌! మా అత్తగారు ఇప్పటికే నాకు గర్భ సంచి లేదని  చాలాసార్లు అంది. ఇప్పుడీ రిపోర్ట్సు తీసికెళ్లి ఆమెకు చూపిస్తాను.’’ అంది నిశ్చింతగా… నేను సేవ్‌ అన్న భావం స్నేహిత ముఖంలో కన్పిస్తుంటే ఒక్క క్షణం అలాగే చూసి ‘‘కానీ…’’ అంది డాక్టర్‌. ‘‘చెప్పండి మేడమ్‌!’’ అంటూ డాక్టర్‌వైపు చూసింది స్నేహిత. ‘‘ నీ భర్త వీర్యంలో శుక్రకణాలు  లేవు. కాబట్టి అతనికి తండ్రి అయ్యే యోగ్యత లేదు….’’ అంది డాక్టర్‌. షాక్‌తో నోరు తెరిచింది స్నేహిత. భూనభోంతరాలు దద్దరిల్లినట్లు, భూమి కంపించినట్లు తుఫాన్‌ చుట్ట్టు ముట్టినట్లు వణికింది. జీవితంలో తనకి ఇంతకుమించిన షాకింగ్‌ న్యూస్‌ వుండదేమో! భూమిలోకి కుంగిపోతున్న దానిలా చూస్తూ.. ‘‘నాకంతా అయోమయంగా వుంది. ఇలా ఎందుకు జరుగుతుంది డాక్టర్‌?’’ అంది స్నేహిత.‘‘కొన్నిసార్లు పుట్టుకతో రావొచ్చు. ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల రావొచ్చు. వర్క్‌లోడ్‌ వల్ల రావొచ్చు. బిజినెస్‌ టెన్షన్‌ వల్ల రావొచ్చు. ఆల్కాహాల్‌ తీసుకోవడం వల్ల రావొచ్చు, స్మోకింగ్‌ వల్ల కూడా వచ్చే అవకాశాలు వున్నాయి.’’ అంది డాక్టర్‌.

స్నేహిత కదిలిపోతూ ‘‘మాతృత్వం ఆడవాళ్లకి ఎంత అవసరమో మీకు తెలుసు. దీనికి పరిష్కారం లేదా? నేను తల్లిని కాలేనా? నాకు పిల్లలు కావాలి మేడమ్‌!’’ అంది ఉద్వేగంగా, ఆమె గొంతు ప్రాధేయపడ్తున్నట్లు జీరబోయింది. ‘‘నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. దీనికో అవకాశం వుంది.’’ అంది డాక్టర్‌. ‘‘వుందా! ఎలా డాక్టర్‌?’’ ఆశగా అడిగింది స్నేహిత.

‘‘ఎలా అంటే ! ఇన్‌ విట్రో ఫర్టిలైజేషన్‌ మరియు ఎంబ్రియో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ అనే పద్ధతి ద్వారా మిాకు పిల్లలుపుట్టే అవకాశవుంది. దీనికి వీర్యకణాలు మా దగ్గర వున్న స్పెర్మ్‌ స్టోరేజి బ్యాంక్‌ ద్వారా మేము మీకు అందిస్తాము.లేకుంటే మిారు మిాకు ఇష్టమైన డోనర్ని తెచ్చుకోవచ్చు. అతనికి కూడా మేము వైద్య పరీక్షలు చేసి అతను అన్ని విధాల అర్హు డైతేనే అతని వీర్యకణాలను తీసుకుంటాము. లేకుంటే మా స్టోరేజ్‌ బ్యాంకు నుండి తీసుకోవచ్చు…’’ అంది డాక్టర్‌.స్నేహిత ఆశ్చర్యపోయి వింటూ ‘‘ఇలా పుట్టిన పిల్లల్ని ఎలా పెంచాలి? వాళ్లకి ప్యూచర్‌ వుంటుందా? పెళ్లిళ్లు అవుతాయా? నార్మల్‌గా పుట్టిన పిల్లల్లాగే వుంటారా? ’’అంది. డాక్టర్‌ ఆమె సందేహాలను గమనించి.‘‘చూడమ్మా! స్నేహితా! భూమి మిాద దేవుళ్లు ఎవరూ అంటే ఖచ్చింగా మా డాక్టర్లు అనే చెప్పాలి. దేవుడికి పోటీపడి అద్భుతాలు చేస్తున్నారు డాక్టర్లు. పోయే ప్రాణం కాపాడటమే కాకుండా, ప్రాణం పోసే శక్తిని కూడా 10,నవంబర్‌ 1977లో సంపాయించుకున్నారు బ్రిటన్‌ డాక్టర్లు. అప్పుడే ప్రపంచం అబ్బురపడేలా, సాంప్రదాయవాదులు ముక్కున వేలేసుకునేలా ప్రకృతినే సవాల్‌ చేసే విధంగా మొట్టమొదటి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీకి అంకురార్పణ జరిగింది. అప్పటి వరకు పిల్లలు దేవుడిచ్చే వరాలని, పిల్లలు లేని తల్లులు గొడ్రాళ్లని సమాజం చిన్న చూపు చూసేది…

ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటూ, తొమ్మిది సంవత్సరాలుగా పిల్లలు లేని లెస్లీ ఎన్నో ప్రయత్నాల తర్వాత తల్లినవ్వాలనే కోరికతో డాక్టర్‌ స్టెప్‌టో, డాక్టర్‌ ఎడ్వర్ట్‌లను కలిసింది. అప్పటికి ఇంకా పరిశోధన దశలోనే వున్న ఐవిఎఫ్‌. (ఇన్విట్రో ఫర్టిలైజేషన్‌) పద్ధతిని లెస్లీపై ప్రయోగించాలని నిర్ణయించారు వాళ్లిద్దరు. కలఫలించి, ఆమె గర్బం దాల్చింది…. ఆ తర్వాత లెస్లీకి సిజేరియన్‌ పద్ధతిలో ఆపరేషన్‌ చేసి బిడ్డను తీశారు. ఆ బిడ్డపేరు ‘లూయిస్‌ బ్రౌన్‌’ వరల్డ్స్‌ ఫస్ట్‌టెస్ట్‌ ట్యూబ్‌ బేబి ఆమె. 1978 లో జరిగిన ఈ వింతకి ప్రపంచం మొత్తం విస్తుబోయింది… ఆనాటి బేబి లూయీస్‌ ఇప్పుడు 32 ఏళ్ల మహిళ. టెస్ట్‌ట్యూబ్‌ బేబీ అయిన లూయీస్‌ ఓ పండంటి బిడ్డకు తల్లి కూడా అయింది. టెస్ట్‌ట్యూబ్‌ బేబి అయిన లూయీస్‌ మాత్రం సహజంగా గర్భం ధరించింది. మరో విషయం ఏమిటంటే 2004 లో జరిగిన ఆమె వివాహానికి ఆమె పుట్టుకకు సౖౖెన్స్‌ ద్వారా కారణమైన డాక్టర్‌ ఎడ్వర్ట్‌ కూడా హాజరయ్యారు. లూయీస్‌ జీవితంలో ప్రతీ మైలురాయిని కూడా మిాడియా వాళ్లు ఇప్పటికీ ఆసక్తితో కవర్‌ చేస్తూనే వున్నారు. కాబట్టి నువ్వింకేం డౌట్స్‌ పెట్టుకోకు….’’ అంది డాక్టర్‌.

అది విన్నాక స్నేహితకి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ మిాద నమ్మకం ఏర్పడిరది. ‘‘కానీ మేడమ్‌! ఆ శుక్రకణాలను మా వారిలో మెడిసిన్స్‌ ద్వారా వచ్చేలా చెయ్యకూడదా?’’ అంది రిక్వెస్ట్‌గా చూస్తూ.‘‘అలా వీలు కాదు స్నేహితా! అవి ఆయనలో ముందు నుండే లేవు. ఒకవేళ మధ్యలో లేకుండా పోతే…. అంటే ఏదైనా ఇన్‌ఫె˜క్షన్‌ వల్లనో, బ్యాడ్‌ హ్యాబిట్స్‌ వల్లనో లేక దానికి సంబంధించిన వ్యాధులేమైన ఉంటేనో మెడిసిన్‌ ద్వారా క్యూర్‌ చెయ్యొచ్చు….’’అంది.స్నేహిత షాకుతో మళ్లీ నోరు తెరిచింది.వెంటనే తేరుకుని, వున్న ఈ ఒక్క అవకాశం కూడా పోయిందిగా, ఇప్పుడెలా? అన్నట్లు చూసింది.‘నేను చెప్పిన పద్దతి తప్ప దీనికి ఇంకోసోర్స్‌ లేదు. దానికి కూడా మిా భర్త అంగీకారం కావాలి….’’ అంది డాక్టర్‌.
స్నేహిత తలవంచుకుని….. ‘‘ఆయన తత్వం నాకు తెలుసు మేడమ్‌! తనలో శుక్రకణాలు లేవని తెలిస్తే బ్రతకరు…. ఒకవేళ బ్రతికినా ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ తో క్రుంగి పోతారు… ఐ.వి.ఎఫ్‌.కి అసలు ఒప్పుకోరు.’’ అంది ఖచ్చితంగా.

‘‘ మరీ నీకు పిల్లలు వద్దా?’’ అంది డాక్టర్‌.‘‘కావాలి….’’ అంది స్నేహిత. ‘‘మరి కావాలి అంటే ఎదో ఒకటి వదులుకోవాలి…’’ అంది డాక్టర్‌. ‘‘నేను ఏదీ వదులుకునే స్థితిలో లేను మేడమ్‌!’’ అంది స్నేహిత. డాక్టర్‌ మాట్లాడలేదు. ఆ డాక్టర్‌ ఎందరో ఆడవాళ్లను చూసింది. భర్త తరపున ఆలోచిస్తూ భర్తలోని లోపాన్ని పైకి తెలియనివ్వకుండా బడబాగ్నిని దాచుకున్న మంచు పర్వతంలా వున్న స్నేహిత లాంటి వాళ్లను చూడడం ఇదే ప్రథమం… స్త్రీలను రకరకాలుగా వేధించే సమస్యల్లో ఇదొక సమస్య కావడం సిగ్గుగా వుంది. ఆడవాళ్ల కన్నీటి బొట్ల వేడి తెలిసిన ఆ డాక్టర్‌ బరువుగా నిట్టూర్చటం తప్ప ఇంకేం చేయలేకపోతోంది.

( ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
92

 

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో