
santhi prabodha
సమాచారం అందుకున్న రెండు ఊర్ల పెద్దలూ పోలీస్ స్టేషన్ చేరారు. పోలీసులకు కావల్సింది అందించారు. పోతడొల్ల వీరయ్య నక్సలైట్ అనీ, ఊరి జనంలో చేరి విప్లవ గ్రూపులు చేస్తున్నాడనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనీ, గ్రామ పెద్దల్ని హతమారుస్తానని బెదిరిస్తున్నాడనీ కేసు పెట్టారు. తమకు రక్షణ కావాలని కోరారు.
దుమ్ము రేపుకుంటూ పోలీసు జీపులు దళితవాడకు రావడం చూసిన జనం హతాశులయ్యారు. పోలీసులు దిగీదిగడంతోనే ఏడ్రా ఆ వీరయ్య నక్సలైట్ లం… అంటూ లాఠీలతో స్వైరవిహారం చేశారు.
మగవాళ్ళు చెట్టుకొకళ్ళు, పుట్టకొకళ్ళూ పరిగెత్తారు నలుగురు యువకుల్ని పోలీసులు పట్టుకోవడంతో. దొరికిన వాళ్ళని దొరికినట్లు ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చావబాదారు. లాఠీలతో కుళ్ళ బొడిచారు. పాతడోల్ల వీరయ్య దొరకలేదని అతని అమ్మానాన్నలపై మరింత హీనంగా ప్రవర్తించారు. మానవులు చేయలేని పని చేయించారు. అతని చెల్లెలు 12 ఏళ్ళ సావిత్రిపై అమానుషంగా అత్యాచారం చేశారు నలుగురు పోలీసులు. ఆ తల్లిదండ్రుల కళ్ళముందే. మూడు రోజులు దళిత వాడ అట్టుడికిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో జనం తలుపులు పెట్టుకొని ఇళ్ళలోనే ఉన్నారు. పొయ్యిలెలగలేదు. తిండి తినలేదు.
గౌడ్ ఇంటి దగ్గర మకాం వేసిన వీళ్ళు అక్కడే దళిత వాడలోంచి పట్టుకెళ్ళిన కోళ్ళతో విందులు చేసుకొని ముప్పొద్దులా తిని ముప్పొద్దులా దళిత వాడని ఛిన్నాభిన్నం చేశారు. కులం పేరుతో బూతులు తిడుతూ వీరంగం చేశారు. కన్పించిన ఆడవాళ్ళ మెడలో పుస్తెలు తెంచారు. బంగారు గుళ్ళో, పుస్తె ఏది ఉంటే అది జేబులో వేస్కున్నారు. ఆ యిళ్ళలో తరతరాలుగా ఒకరినుండి ఒకరికి సంక్రమించే మట్టిబానలను పగలగొట్టారు. అందులో డబ్బూ దస్కం ఉందేమోనని వెతుకున్నారు. వీరయ్యకి, వీరయ్య స్నేహితులకు నక్సలైట్ ముద్ర వేశారు. వీరయ్య, వారికి దొరకకపోవడంతో అప్పుడప్పుడూ వచ్చి పల్లెమీద దాడి చేస్తూనే ఉన్నారు. చేతికందినవి అందుకు పోతూనే ఉన్నారు. నక్సలైట్ ముద్రపడ్డ వీరయ్య, తన ఊళ్ళో బతికేందుకు మార్గంలేని వీరయ్య నిజంగా నక్సలైట్‌ల్లో కలవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక దళితులెవరూ భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా నోరెత్తలేరు అని నిర్ధారించుకున్నారేమో నాలుగు నెలల తర్వాత పోలీసు దాడులు ఆగిపోయాయి.
ఓ పక్క పోలీసు దాడులతో ఊరంతా ఉక్కిరి బిక్కిరి అయితే మరోపక్క అనుకున్న ప్రకారమే పోశవ్వకు జోగుపట్టం కట్టడం జరిగిపోయింది. ఆ తర్వాత ఆర్నెల్లకే పోశవ్వ పెద్దదైంది. ఓ మంచి ముహూర్తం చూసి మైలపట్టం కట్టాలనుకుంటున్న తరుణంలో జరిగిందా సంఘటన.
రాజాగౌడ్ ఆమె దగ్గరకు చేరాడు. కోరికతో జ్వలించే అతని వెకిలి క్రీగంటి చూపు చూసి ఆమె బెదిరిపోయింది. ఆమె గుండె చెదిరిపోయింది. సారా కంపు.. మాటలు ముద్దముద్దగా… అతని చర్య అర్థం అయి కానట్లూ… పారిపోవాలి… పారిపోవాలి. అతన్నుండి దూరంగా… అందనంత దూరంగా మనసు ఆరాట పడుతోంది. కళ్ళు తప్పించుకోవడం కోసం దారి వెతుకుతున్నాయి. అతని చేతులు ఆమెను బంధిస్తూ… పెనుగులాడ్తూ ఆమె… అతన్ని ఒక్క తోపు తోసి అతని బంధనాల్నించి తప్పించుకుని ఒక్క అంగవేసింది. నోటికొచ్చిన బూతులు తిడ్తూ బయట పడబోయింది. రయ్‌న వచ్చి ఆమె చెంప చెళ్ళుమనిపించాడతను ”జోగు ముం… ఎందుకోసమనుకున్నావే… ఇంత జేసింది”. అంటూ బూతులు తిడ్తూ అతను.
దెబ్బతిన్న పులిపిల్లలా అతని మీద పడి రక్కబోయింది. అతని ముందు ఆమె ఎంత? పిట్టలాంటి ఆమె శరీరాన్ని ఎత్తి పడేశాడు. మొకాళ్ళమీద కూర్చున్నాడు. అరచిగోల చేయకుండా ఆమెనోట్లో తువ్వాలు కుక్కాడు. ఆమె తెలివి తప్పింది. ఏ స్పందనా తెలీని ఆమె శరీరంతో తనపని కానిచ్చుకు వెళ్ళిపోయాడు అతను. మగవాడి పశువాంఛకి, అహంకారానికి చిహ్నంగా ఆమె ఆచేతనంగా. ఆమెకు సృహ వచ్చేసరికి కాళ్ళ మధ్య తీవ్ర రక్తస్రావం… తల్లి వచ్చింది. ఆమెను పట్టుకుని భోరుమంది. కూచోలేక పోతోంది. నిల్చోలేకపోతోంది. కూతురు పరిస్థితి అర్థమయిన సాయవ్వ ”గిట్లెట్లయింది. బిడ్డా”. అంటూ గుండెలకదుముకుని మౌనంగా రోదించింది. ఏం జరిగిందో నోటితో ఉచ్చరించి చెప్పలేక, మనసుతో ఆలోచించ లేక పోశవ్వ తీవ్ర వేదనకు గురైంది. పోటుపెడ్తున్న ఆమె మర్మాంగం…చిగురుటాకులా వణికిపోతూ ఆమె…
అదే రోజు రాత్రి చీకట్లో మళ్ళీ అతను.. ఉలిక్కిపడింది. భయంతో గజగజలాడింది. బాధతో విలవిలలాడింది. గుండెలవిసేలా కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. అలా ఎన్ని రాత్రులో… ఎన్ని రోజులో….అలా తనకే ఎందుకు జరిగింది? మిగతా ఆడపిల్లలక్కూడా ఇదే విధంగా జరుగుతుందా? వాళ్ళూ తనలాగే బాధపడ్తున్నారా? ఏమోమరి…? ఆమెకు తన బతుకు మీద తనకే రోతపుడ్తోంది. అసహ్యం కలుగుతోంది. అవకాశం దొరికితే గౌడ్‌ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేయాలనుకుంది. తనను అంత బాధపెట్టినందుకు.
మల్లయ్యతో పెళ్ళి… అది పెటాకులు కావడం.. మల్లయ్య మరణం…పోశమ్మ తల్లితో పెళ్ళి.. జోగుపట్టం కట్టడం… ఇవేమీ పోశవ్వకు అర్థం కాలేదు. అప్పుడు ఆమెకు తెల్సిందల్లా కొత్త బట్టలు, చుట్టాల రాకపోకలు లడ్డులు, మేకలు తెగడం కల్లు పెట్టెలు దిగడం… లాంటివి. అలాంటి పోశవ్వ శరీరానికీ, మనసుకు తగిలిన గాయం సామాన్యమైనది కాదు. అది పచ్చిపుండులా సలుపుతూనే ఉంది.
పోశవ్వలానే దళిత వాడలోని ప్రతి ఆడపిల్ల బతుకూ, ఆమె శరీరం, ఆమెకు తెలియకుండానే ఆమె ప్రమేయం లేకుండానే, ఆమె అంగీకారం లేకుండానే ధనమదంతో ఒళ్ళు బలిసి, కామంతో కళ్ళుమూసుకున్న, అగ్రకుల అహంకారంతో అడవి మనుషుల్లా ప్రవర్తించే వాళ్ళ చేతిలో చితికిపోయిందనీ, ఇక జోగోళ్ళ బతుకు గురించి చెప్పనవసరం లేదనీ తెలుసుకునే సరికి, తనేమిటో తన పరిస్థితి ఏమిటో అర్థమయ్యే సరికి, ఆమె రెండేళ్ళ బిడ్డకు తల్లి, వతను గ్రామాలైన లింగాల మల్కాపురం, అచ్చంపేట్, మహ్మద్‌నగర్‌లకు అమ్మ, అవ్వ, ముత్తెమ్మలతో కలసి చావులకు, పండుగలకు, జాతర్లకు పోవడం ఫుల్‌గా తాగడం, వాళ్ళు ఆడమన్నట్లుగా ఆడడం, వడ్ల కల్లాలప్పుడూ పోయి అడుక్కోవడం ఇదీ ఆమె బతుకు. తన బతుకంటే ఏదో అసంతృప్తి పోశవ్వలో. ఇదీ అని తెలియదు.. చెప్పలేదు. తెలిసినా ఆమె చెప్పలేదు. ఎవరికైనా చెప్పుకున్నా ఆరుస్తారా..? తీరుస్తారా…?
” అయిసులున్నప్పుడే ఇంత ఎనకేసుకోవాల్నే బిడ్డా… అయిసయినటే మనల ఎవరు కానడే బిడ్డా. నేను ఎనకేసిందంత నీ లగ్గం కోసరమని దాసిపెడ్తి… మన గాచారంల పాడుబడ… గట్లయ్యే” అంటూ అప్పుడప్పుడూ శోకం వస్తుంటుంది సాయవ్వ. పోశవ్వ మాత్రం నిమిత్తమాత్రురాలిలా ప్రవర్తిస్తుంది. ఎవర్నీ ఇది కావాలని నోరు తెరచి అడగదు. వారిచ్చింది కాదనదు. మౌనమే తన భాషగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా మాటలు నేర్చుకునే చిన్న పిల్లలా, అప్పుడప్పుడూ తన భావప్రకటన తల్లిముందు చేస్తోంది.
దళితులపై కొనసాగుతోన్న వివక్షని నిర్మూలించడం కోసం 1955లోనే పౌరహక్కుల పరిరక్షణ చట్టం చేసింది ప్రభుత్వం. కులం పేరుతో దూషించడం, శిక్షించడం రాజ్యాంగంలోని 17వ అధికరణ ప్రకారం నేరం. 1989లో ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వచ్చింది. ఇందులో ఫిర్యాదు దారుకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నా ఆ చట్టాల గురించి, హక్కుల గురించి వాళ్ళకి తెలీదే. 1988లో చేసిన జోగిని/బసివి/ దేవదాసి నిరోధక చట్టం ఉంది. అవన్నీ వీళ్ళకి తెల్సేదెలా…? వీళ్ళకి చట్టాలు, తమ హక్కుల గురించి చైతన్యవంతం చేసేదెలా..? ఒక వేళ చట్టాలు తెల్సినా వీళ్ళు డైరెక్టుగా ఫిర్యాదు చేయగలరా? అగ్రవర్ణాల మోచేతి నీళ్ళు తాగుతూ, చట్టాలలోని లొసుగులు వెదుకుతూ నీతి నియమాలకు తూట్లు పొడిచే పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎంత వరకూ సహకరిస్తాయి. దళితులపై హింసను నిరోధించడానికి తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తాయా…? పాలన వ్యవస్థ, న్యాయవ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అగ్రవర్ణ భూస్వాముల పెత్తందారుల చేతిలో బందీగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్న వెనుకబడిన వర్గాల వారూ నిచ్చెన మెట్ల కుల వర్గీకరణలో తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న దళితులను చిన్న చూపు చూస్తున్నారే…. హింసిస్తున్నారే మాదిగోడా, మాలోడా అంటూ కులం పేరుతో బండ బూతులు తిడ్తూ మానసికంగా, శారీరకంగానూ హింసిస్తున్నవారికి శిక్ష పడ్తుందా…? నిజ్జంగా శిక్షపడ్తుందా…? ఎన్నెన్నో సందేహాలు ఉన్న విద్య తన ఆలోచనల్ని, సందేహాల్ని పక్కనపెట్టి ” మీ అమ్మ నిన్ను కన్నది అతని వల్లేనా?” అని అడిగింది.
ఆ విషయం అడగడంతోనే జేవురించిన పోశవ్వ మొహంలో ఆత్మనూన్యతా భావం స్పష్టంగా కన్పిస్తోంది. ” ఆడి మొదలార. ఆనికి పొడెగట్ట, ఆడె అచ్చోసిన ఆంబోతోలె ఊరిమీదబడి కంటికి నదరున్న ఆడిదాని మానంతోని ఆడ్కునె… నీయవ్వ… థూ… ఆల్ల సుకం కోసరం,….. సంతోషం కోసం మా బతుకులు బుగ్గి చేత్తున్న….. లం… కొడుకులు పురుగులు….. సావనన్న సావరు. మా కంటే మా బతుక్కంటే అంగట్ల పసులు నయం. పెద్ద కులపోల్లం, పైసగల్లోలం, జమాన మాదె. మా మనసు బడ్డ తీర్గ నడిపిచ్చుకుంటం అన్కుంట మా ఉసురు బోస్కుంటన్నరు. ఆల్ల మొదలారిపోను ఆల్ల పెండ్లం తాళిబొట్టు తెగ….” కట్టలు తెంచుకు వస్తున్న ఆమె కోపోద్రేకానికి కట్టలు వేయడం కష్టం. అతని ఎదుట లేదా ఆ పెద్దల ఎదుట పోశవ్వ ఈ విధంగా ఇంత ధైర్యంగా మాట్లాడగలదా…? తన అక్కసునంతా వెళ్ళగక్కగలదా…? తనకసి తీర్చుకోగలదా…?
మనసులో ఎంత ద్వేషం, పగ, కసి రగులుతూ ఉన్నా నిస్సహాయంగా వారి ముందు తలవంచాల్సిందే… వారు చెప్పినట్లు ఆడాల్సిందే… వీళ్ళు మనుషులు కాదు. ఆటల బొమ్మలు. అందుకే వీరిని మనుషులుగా గుర్తించరు. వీరిలోని ఆవేశకావేశాల్ని లెక్క చేయరు. వీళ్ళలో, వీళ్ళ గుండెల్లో చెలరేగుతున్న బడబాగ్ని జ్వాలల్ని ఎగిసి లావాలా విరజిమ్మకుండా బలవంతగానో, భయంతోనో నీళ్ళు గుమ్మరించేసుకుంటుంటారు. అందుకు కారణాల లోతుల్లోకి ఎవరూ వెళ్ళరు. వెళ్ళనివ్వరు. వెళ్తే ఫలితం అనుభవించి ఉన్నారు. కాబట్టే చల్లార్చుకునేది. అందుకేనేమో, మాలమాదిగల్లో పోశవ్వలాగా కడలి తరంగంలా ఉవ్వెత్తున ఎగిసిపడడం కన్పించదు. అలా ఉంటే వారికి ఆశ్చర్యం గానూ ఆమోదయోగ్యం కాకుండాను కన్పిస్తుంది. తప్పుపడతారు. కానీ పరిస్థితి అర్థం చేసుకుంది విద్య.
ఆమె అలా ఎక్స్‌ఫ్లోర్ అయింది. కాబట్టే ఇంకా అలా ఉండగలిగింది. తన భావాల్ని చెట్టుకోపుట్టకో చెప్పుకుని ఊరట పొందగలుగుతుంది. గతంలోలాగే ఉంటే పోశవ్వ కూడా ముత్తెమ్మ లాగే హిస్టీరిక్ స్థితిలోకి వచ్చేది అనుకుంది విద్య.
అలుపు తీరిందేమో మళ్ళీ తనే మొదలు పెట్టింది. ”గీ మొగోల్లకు మేం గావాలె. మా పెయ్యి గావాలె. మా అందం గావాలె. మేం ఇచ్చే సుకం కావాలె. గని మా మనసుతోటి పనిలేదు. మాకు పుట్టిన బిడ్డలు ఆల్లకేంగారు. ఆల్లకు పిల్లగాల్ల బాధ్యత లేదు. ఆల్లకు తండ్రెవరో చెప్పద్దు. అన్ని బాధలు మేం పడాలె. ఆల్లు రాజుల్లెక్క అస్తరు, పోతరు. ఆల్లు మా ఇంటి సుట్టూతా తిర్గినపుడు మాకు అంటుడు ఉండది. మా పెయ్యితోని సుకం జుర్రినపుడు ముట్టుడు ఉండది. గప్పుడు మా కులం యాదికి రాదు. మంచిగ మా పక్కన పంటరు. అటెన్క మా కులం యాదికొత్తది. ఓసి… మాద్గిదానా… ఏడికే దూరం… దూరం … అంటరు. ఆల్ల బజార్లకు రావద్దంటరు. ఆల్ల ఇండ్లకు రావద్దంటరు. మల్ల ఆల్లకు పనిబడ్తే మంచిగ పిలుత్తరు. అల్కిపిచ్చుకుంటరు. బియ్యం జేపిచ్చుకుంటరు. బాసన్లు తోమిచ్చుకుంటరు. అన్ని జేపిచ్చుకొని పసుపు నీల్లతోని సుద్దిజేస్కుంటరు. మామైల బోగొట్టుకుంటరు.” అంటూ బద్దలవుతున్న అగ్గి పర్వతంలా ఉన్న ఆమె కళ్ళ నుండి ప్రవహిస్తూ కన్నీరు, గొంతునుండి ఒక్కసారిగా ఏడుపు… ఎగిసి ప్రవహిస్తున్న లావాలా….
”అవ్వా అందర్కీ నాయిన ఉన్నడు. మరి నాకేడే? యాడ ఉన్నడే…? ఎట్లుంటడే అని అడిగేటి ఈ పసిదాన్ని ఏమని జెప్పాల్నక్కా. నీ అయ్య నా అయ్య ఒక్కడేనని ఎట్ల జెప్పాలె. ఈ నోటితోని…” హృదయాన్ని ఎవరో చుట్ట చుట్టి మెలిపెడుతున్నంత బాధ… అవుతుండగా కళ్ళు తుడుచుకుంటూ, తనను తాను సంబాళించుకుంటూ పోశవ్వ. తన చేయి ఆమె తలపై వేసి నిమురుతోంది విద్య ఊరుకోమన్నట్లుగా… మనసులో విద్యకి చాలా గిల్టీగా ఉంది. అనవసరంగా కదిల్చి వారిని బాధపెట్టానేమోనని. తల్లి చెప్తున్నది ఏం అర్ధం అయిందో కానీ బిక్క మొహంతో, భయంతో తల్లి వైపూ, విద్య వైపూ మార్చి మార్చి చూస్తోంది సబిత. రేపటి తన పరిస్ధితి ఏమిటో అని ఆ పసిపిల్ల మొహంలో భయం దోబూచులాడుతుండగా..
”ఆల్ల సన్నపు మనసు, కుచ్చితం, కుతంత్రం జర సమజయితాంది. కానీ మా అవ్వ, ఆయి ఒప్పరు. నీ తీర్గ మేం బీ అనుకుంటే ఈ బూమ్మీన నూకలుండేటివా..? అంటరు. ఎంత అరాచకం లేస్తుండెనో. ఈ దునియ ఇట్లుండనా అంటరు. కండ్ల ముందు జరిగెడ్డి అంత అరాచకం గానట్టు.. అన్నిటికెల్లి ఆల్లె అంత కాపాడినట్టు. ఆల్లు సమజయిత ఉన్న కొద్దీ ఆల్లకు నా కాడికి రానిత్తలేను. గౌడ్‌కు దూరం పెట్టిన. అటెన్క రెడ్డి కొడ్కు, పటేల్ కొడ్కులు, అయ్యవార్ల పోరడు నా తాన చేరాల్నని మస్తు చూసిన్రు. ఓల్లను రానియ్యకచ్చిన. జోగుది జోగుదాన్లెక్క ఉండాలె గాని గిదేంది అని మా ఇంటి మీనకొచ్చిన్రు. గిప్పుడంటే గీ శానితనం, ఉషారితనం అచ్చింది గనీ.. గప్పుడు ఎట్లుండి..? ఎడ్డి దాన్లెక్క.. దిమాక్ లేకుంట. ఎవల్లెట్ల ఆడుమంటే అట్ల ఆడుడు. అంగి అంగి దండాలు బెట్టుడు. నెత్తిలేకుంట బతుకుతుంటి” ప్రవాహంలా చెప్పుక పోతోంది పోశవ్వ.
”పోశవ్వా, మరి నీకీ తెలివితేటలు, ఉషారుతనం ఎలా వచ్చాయి?” సందేహంగానూ, ఉత్సుకతతోనూ అడిగింది విద్య.
”గా గౌడ్ దూరమైనంక పంచాయితి ఆఫీసుల పన్జేసేటి సారు నా తానికి వస్తుండె. తబాదలు అయిపోయేతప్పుడు ఆయనతోని తోల్కపోతనన్నడు. తన తోటె ఉంచుకుంటనన్నడు. నేను ఊ.. అనలే.. ఆ అనలే.. గని.. మా అవ్వ గాయిన మాట ఒప్పలే. జోగుదాన్ని జోగుదాన్లెక్కనె ఉండనీయి. సంసారి లెక్క జేస్తనంటే ఎట్ల? లెక్క నడుత్తదా..? ఖర ఉంటదా? మల్ల ఏం ముంచుకొత్తదో.. సారూ, మా బతుకులు ఇట్ల కాలినయ్. ఇట్లనే ఉండనీయ్ అన్నది బతిమాలుకుంట. ఏమనుకున్నడో ఏమో, మారు మాట లేకుంట పదినూర్లు నా చేతిల బెట్టి పోయిండు” ఏ భావోద్వేగం లేకుండా…
రాజాగౌడ్ జోగినీల ఊసెత్తుతేనూ, వాళ్ళింటికి వెళ్తానంటేనూ ఎందుకు చికాకు పడతాడో, ఎందుకు మొహం అప్రసన్నంగా మారిపోతుందో అర్ధమయింది. సబిత తన చేయి పట్టుకుందనీ, అక్కా అని పిలిచిందనీ ఎందుకు గుడ్లురిమి చూశాడో అవగతమవుతోంది విద్యకి.
అంతలో రేషన్ షాపు నుండి బియ్యం మూటతో వచ్చింది సాయవ్వ. అందరికీ వెళ్ళి వస్తానని చెప్పి భారంగా కదిలింది విద్య. రెండడుగులు వేసిందో లేదో ”అక్కా.. మల్ల ఎన్నడొస్తవ్?.! మా తోని నీ తీర్గ మనసుతోని, దిల్‌తోని మాటాడినోల్లు, ముచ్చట బెట్టినోల్లు ఎవ్వల్లు లేరు. మేం నిన్ను ఎన్నటికి మర్వం” విద్యతో పాటే రోడ్డు పైకి వస్తూ అంది పోశవ్వ.
”జల్ది లగ్గం జేస్కొని పెనిమిటిని తోల్కరా బిడ్డా” ఆహ్వానించింది సాయవ్వ. సబిత విద్యతో పాటే బయలుదేరింది. గౌడ్ ఇంటి వరకు కబుర్లు చెప్పమంది సాగనంపడానికి.
ఆ రోజే విద్య ప్రయాణం. హైదరాబాద్ వరకూ కవిత కూడా బయలుదేరింది. రోజూ ఉదయం లేవగానే పేపరు చూసే విద్య ఆ రోజు బయలుదేరే హడావిడిలో పేపరు చూడనేలేదు. టిఫిన్ చేస్తూనో, టీ తాగుతూనో పేపరు చూడడం రాజాగౌడ్‌కి అలవాటు. చివరి పూరీలో కోడికూర నంజుతూ అలవాటు ప్రకారం ఆనాటి వార్తలు చూస్తున్నాడు. ఎదుటి సీట్లో కూర్చోని టిఫిన్ చేస్తున్న విద్య దృష్టి జిల్లా పేపర్ చివరి పేజీలో ఉన్న ” జోగినులు జీవితాలలో కొత్త వెలుగు” అనే వార్తపై పడింది. వెంటనే పేపర్ అడిగి తీసుకుంది.
”వివాహం కాకుండానే చిన్న పిల్లలను దేవతలకు అంకితం చేసే ఆచారం అనాదిగా ఉంది. దీనినే తెలంగాణాలో ‘జోగిని’ అని పిలుస్తారు. ఏడాది మొదలు 12,13 ఏళ్ళ లోపు పిల్లల్ని దేవతకు జోగినిగా అంకితం చేస్తారు. ముఖ్యంగా షెడ్యూల్డు కులాలకు చెందిన మాల, మాదిగ కులాల్లోనే ఈ ఆచారం ఎక్కువగా కన్పిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతంలో ఒక ఊరిలోనే 20 నుండి 30 మంది జోగినీలు కన్పిస్తారు. ఎల్లారెడ్డి ఏరియాలో నాలుగైదు ఊర్లకి కలిపి ఒకరు ఉంటారు. అది ఆ కుటుంబానికి వంశ పారంపర్యంగా వచ్చే ఆచారం.
మూఢనమ్మకాలు, భూస్వాముల పెత్తందారీ తనం, పేదవారైన తల్లిదండ్రుల స్వార్ధం. బానిస మనస్తత్వం అన్నీ కూడా వారికి ఇష్టం ఉన్నా, లేకున్నా ఈ జోగినీ ఆచారాన్ని ఆచరింపజేస్తున్నాయి. ప్రతిఘటించనీయలేక పోతున్నాయి. ఒక సర్వే ప్రకారం ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు రెండు వేల మంది జోగినులు ఉన్నారని వెల్లడైంది. మెడలో తోలుతో చేసిన పుస్తె, ఊరిపండుగలప్పుడూ, జాతరలప్పుడు భక్తులకు కుంకుమ బొట్లు పెడ్తూ, గ్రామ దేవత ముందు నాట్యం చేస్తూ కన్పిస్తారు. శవయాత్రలో ముందు నడుస్తారు. చిల్లర డబ్బులు ఏరుకుంటారు. పంట కళ్ళాల్లో అడుక్కుంటారు. డబ్బున్న వాళ్ళ పంచన చేరిన వాళ్ళు కాస్త సుఖంగా బతికితే, మిగతా వాళ్ళలో సామాన్యమైన జోగినీ జీవితమే. వాళ్ళు ఒకరికంటే ఎక్కువ మందితో కామకలాపాలలో పాల్గొనడం వల్ల సుఖవ్యాధులతో బాధపడుతున్నారు. దయనీయమైన ఈ స్థితిని మార్చడానికి, అసహ్యకరమైన ఈ వృత్తి నుండి బయట పడేయడం కోసం నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రయత్నం ప్రారంభమైంది.
జిల్లా కలెక్టర్ వారి కోసం ప్రత్యేక వృత్తి శిక్షణా శిబిరం ప్రారంభించారు. మొదటి విడతగా 36 మంది జోగినులను చేరదీసి వారికి కుట్టు పనులు, అప్పడాలు తయారీ వంటి వృత్తులలో శిక్షణ ఇప్పించారు. శిక్షణా కాలంలో వారికి ఉచితంగా వసతి, భోజనం కల్పించారు. అంతే కాకుండా జోగినులు ఎక్కువగా ఉన్న చోట్ల వారికి ప్రత్యేకంగా కాలనీలు నిర్మించాలని తలపెట్టారు. శిక్షణ ముగించుకున్న వారికోసం ప్రత్యేకంగా కాలనీ ఏర్పరిచి ఇళ్ళు కట్టించి ఇచ్చారు. అంతే కాకుండా వారికి ఒక పాడిగేద ఇప్పించారు. కొందరికి మేకలు, గొర్రెలు ఇచ్చారు. దాంతో వారి స్వతంత్ర జీవనానికి ఆధారం లభించింది. వారికి ఆరోగ్య పరీక్షలు జరిపి చికిత్స చేయిస్తున్నారు. వారు కుట్టిన బట్టలను సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలోని విద్యార్థులకు పంచాలని నిర్ణయించారు.వారు తయారు చేసిన ‘ఆశ’ అప్పడాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంక్షేమ వసతి గృహాలకు, వారి గేదెల పాలను పాడి పరిశ్రమాభివృధ్ధి సేకరించే ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. పశు సంవర్ధక శాఖ వారు వచ్చి జోగినీలకి ఇచ్చిన పశువులను తరచూ పరీక్షించి తగిన సలహాలు ఇస్తున్నారు. వారిలో అక్షర జ్ఞానం కల్గించడం కోసం వయోజన విద్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ జోగినీ మహిళలు తిరిగి పాత జీవితంలోకి జారిపోకుండా ఉండడం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ చెప్పారు.
జోగినుల పునరావాసానికి కృషి కొనసాగుతోంది. అయితే ఇది కేవలం కొందరు వ్యక్తుల పునరావాసానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది సామాజిక సమస్య. విద్యాగంధం లేకుండా అంధ విశ్వాసాలతో ఉన్న ప్రజలలో సామాజిక చైతన్యం తీసుకు వస్తే కొత్త బాలికలు జోగినులుగా మారరు. అదే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. ప్రజా సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసే ప్రజా ప్రభుత్వాల దృష్టికి ఈ జోగినీ సమస్య వెళ్ళ లేదా…? లేక వెళ్ళినా అది పెద్ద సమస్యగా పరిగణించలేదా? అని అనుమానపడ్తున్న విద్యకు ఆ వార్త చూశాక కాస్త వూరట కల్గినట్లనిపించింది. అయినా ఏదో వెలితి. వార్తా కదన రచయిత చెప్పినట్లు పునరావాసం కంటే ముందు వారిలో చైతన్యం కల్గించాలి. వారిని, వారి ఆలోచనల్ని సంస్కరించాలి. వారిని సంస్కరించడం కంటే ముందు ఈ సమాజంలో ఉన్న సామాజిక వివక్షత పోవాలి. ఈ వ్యవస్థలోని అజ్ఞానాన్ని, అంతులేని మూఢ నమ్మకాల్ని, అంధ విశ్వాసాల్ని, ఆచారాల్ని, పేదలైన ఈ అమాయకులకూ, అణచివేయబడుతున్న దళితులకు వాటితో అవినాభావ సంబంధం ఉంది. ముందు ఆ సంబంధాన్ని ఏర్పరిచి, బలపరిచే పెద్దలను సంస్కరించాలి. లేదా బుద్ది చెప్పాలి. ఆ పని ప్రభుత్వం చేయగలదా..?
ఈ వారం రోజుల్లో విద్యతో ఏర్పడ్డ సాన్నిహిత్యంతో ” మల్ల రా బిడ్డా’ అభిమానంగా ఆహ్వానించింది రాంబాయి.
” జోగోళ్ళ గురించి రీసెర్చ్ చేస్తావని కవిత చెప్పింది. ఎపుడొచ్చినా ఈడికే రా. నీ ఇల్లే అనుకో విద్యా. నాకు కవిత ఎంతో నీవూ అంతే” ఎటో చూస్తూ రాజాగౌడ్. ఎటుకేసి చూస్తున్నారా అని అటు దృష్టి సారించిన విద్యకి టాటా చెప్తూ సబిత. సబిత కేసి చూస్తూ దూరంగా ఉన్న ఆ పిల్ల భావాల్ని చదవడానికి ప్రయత్నిస్తూ విద్య తనూ టాటా చెప్తూ. రిజల్ట్సు వచ్చాయి. విద్యకి ఉమెన్ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఫస్ట్ రాంకు వచ్చింది. గోల్డుమెడల్ సాధించింది. పి.హెచ్.డి. చేయాలన్న తన నిర్ణయం ఇంట్లో చెప్పింది. తల్లీ, తండ్రీ ఇద్దరూ ఒప్పుకోలేదు. ”పి.హెచ్‌డి అంటే మాటలా.? అదయ్యే వరకూ పెళ్ళి చేస్కోనంటే ఎలా…? చెల్లికీ నీకు ఇద్దరికీ ఈ ఏడు పెళ్ళి చేయాలని మేం అనుకుంటూంటే… అవతల బావ తొందర పడ్తున్నాడు పెళ్ళికి” అన్నారు.
”బావ తొందరపడ్తే చెల్లి పెళ్ళి చేసేయ్యండి నాకేం అభ్యంతరం లేదు.” అని ఖరాఖండిగా చెప్పేసింది.
”నీకేమయినా మతిపోయిందా..? అక్క పెళ్ళి కాకుండా, చెల్లెలి పెళ్ళేమిటి? ఆ తర్వాత నీకు సంబంధాలు ఎక్కి రావద్దూ…? పెద్ద పిల్లకి కాకుండా చిన్న దానికి పెళ్ళి చేస్తే జనంలో లేనిపోని అపోహలు సృష్టించినట్లు కాదూ…?” అసహనంగా అంది వనజ.
”అమ్మా … అపోహలు అని నీవే కదా అంటున్నావ్…? జనం అనుకునేవి మనం పట్టించుకోనవసరం లేదు. మనం ఏం తప్పు చేయనప్పుడు” నిదానంగా తక్కువ స్వరంతోనే అయినా ఖచ్చితంగా విద్య. ”విద్యా… నీ విప్పుడు పి.హెచ్.డి. అంటే… ఎలాగే..? నీకంటే ఎక్కువ కాకపోయినా, కనీసం నీకు తగ్గట్టుగా, చదివిన వాడినయినా తేవాలికదా..? ఈ రోజుల్లో అంత చదివిన వాడిని తేవడం అంటే మాటలా..? మనమెంత..? మన స్థోమత ఎంత..? అర్థం చేసుకో” నచ్చజెబుతున్న ధోరణిలో అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంది వనజ అమ్మా… నీవు చదువుకున్నావ్. నలుగురికీ విద్యా బుద్ధులు చెప్పే గౌరవమైన వృత్తిలో ఉన్నావ్. ఎందుకంతలా నా పెళ్ళి గురించి ఆలోచించి దిగులు పడతావ్. అతనితో సమంగా నేనూ చదివినప్పుడు నేనెందుకు ఎదురు ఇవ్వాలి? నేనెందులో తక్కువని? అమ్మా… నాన్నా… మీకు ఇది వరకే ఎన్నో సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. బేరసారాలతో జరిగే పెళ్ళి నాకొద్దు. నేను నచ్చి, నన్ను మెచ్చి చేసుకునే వాళ్ళయితే, నాకూ నచ్చితే నాకన్నా తక్కువ చదువుకున్నా చేసుకుంటాను. నేను ఆ వ్యక్తిలో చూసేది భార్యని తన ఆస్తిగా కాకుండా మనసున్న మనిషిగా, ఒక స్నేహితురాలిగా, ఆత్మీయురాలిగా, ప్రేమగా, గౌరవంగా చూడగల సంస్కారం.
”సరే నీ ఇష్టం. కానీ మంచి సంబంధం కుదిరితే అప్పుడు కాదనకూడదు. చదువు కాలేదని సాకు చూపోద్దు.” అప్పటి వరకూ మౌనంగా తల్లీ కూతుళ్ళ వాదన విన్న రామారావు కండిషన్ పెట్టారు.
ట్రైన్‌లో ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు పుస్తకాలు చదవడం విద్యకి అలవాటు. అందుకే తనతో పాటు డా|| ఎన్. గోపి రాసిన వేమన్న వాదం తెచ్చుకుంది. ఫ్రెంచి మత గురువు అబెదుబెయ్ (1792-1823) 19వ శతాబ్దపు తొలిరోజుల్లో రాసిన ” హిందూ మానర్స్, కస్టమ్స్ అండ్ సెర్‌మొనీస్” అనే గ్రంథంలో వర్ణించిన మత పరిస్థితులు 17వ శతాబ్దం నాటి వేమన్న చెప్పిన మత పరిస్థితులకు ఏ మాత్రం భిన్నమైనవి కావంటూ రాసిన శైవ వైష్ణవాల సంఘర్షణను చాలా ఆసక్తికరంగా చదువుతోంది విద్య. వేమన శైవులను వైష్ణవులను సమానంగా తిట్టాడు. అలా చదువుతూ ఇంకాస్త ముందుకి వెళ్తే బసివిరాండ్రు అని ఓ పేరా కన్పించింది. జోగినినే బసివి అంటారని రాజాగౌడ్ చెప్పగా విన్న విషయం వెంటనే స్ఫురించింది. వేమన కాలంలో కూడా బసివిలు ఉన్నారా అంటూ ఆసక్తిగా గబగబా చదివింది.