జోగిని

santhi prabodha

santhi prabodha

తక్లీబయినం. గపుడు ఒక్కల్లు మా దిక్కు సూస్తే పాపం. ఇంత దయ సూపకపోతిరి. కనికరం సూపకపోతిరి. అడిలకు పోయి పనిసేత్తమంటే రానియ్యకపోతిరి.
మీరు మా పొలాలల్ల దిగితే మా కరిష్టం అవుతదంటిరి. దేవతకు పెండ్లి జేస్కున్నోళ్ళు మీరు. మీ తోని పని జేపిత్తమా… అని పన్లెకు రానియ్యకపోతిరి. గా పొద్దు మందిల గల్సి నేనూ పనికి పోయిన. కడుపు తిప్పలకు. చిన్నప్పటి కెల్లి ఎన్నడూ పనికి పోయిన దాన్ని కాకపోతి. నడుం అంచి ఎన్నడూ పన్జేసిన దాన్ని కాకపోతి, నాటేసుడే అస్తలేదు. దూరం కెల్లి జూసిండు ఎంకన్న దొర.
”ఏందే జోగుదానా… చేన్ల దిగినవు. ముందుగల్ల మడిలకెల్లి బయటకు నడువ్‌.” అని కేకలేసి గాయి గాయి జేసి.
మల్ల ఎన్నడు చేన్లకు బోలె, పని ముట్టలే. కానీ, నోట్లకు బుక్క బోని ఒద్దులు మా లెస్స. ఎన్నడు, ఎవ్వడూ కానలె.
గిప్పుడు నా మీనకు ఎల్లమ్మచ్చిందని మొక్క బట్టె, తోచింది ఇయ్యబట్టె. గిది జూసినంక, గిట్లనే ఎప్పుడు దేవుడొస్తే గపుడు నాకవుసరమున్నయ్‌ గోర్తననుకున్న. అట్లనే జేసిన. జేస్తున్న. గందుకే నేను బీ శుక్రారం శుక్రారం పొద్దుగాల్లనే నెత్తిమీనకెల్లి బోస్కుంట. సోమారం అట్లనే జేత్త. ఎల్లమ్మ పటం ఇంట్ల బెట్టిన. దానికి నిత్తెం దీపం బెడ్తున్న. నాకే మంత్రం రాకున్న. మంత్రం ఏయ్‌మని కొందరస్తరు. ఎల్లమ్మ ముంగట బెట్టిన తాడు దెచ్చిస్త. కండ్లకద్దుకొని ఐదోపదో ఇచ్చి పోతరు” ఏ మాత్రం దాపరికం లేకుండా ఉన్న విషయం చెప్పింది ముత్తెమ్మ.
మతం అనుమతించిన, సంప్రదాయం ఆమోదించిన సమాజ కట్టుబాట్లకు తనకు తెలీకుండానే తన ప్రమేయం లేకుండానే జోగినిగా మారి తీవ్ర మానసిక ఒత్తిడికీ, ఘర్షణకూ లోనైన ముత్తెమ్మ అదే సమాజంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలను, ప్రజలలో బలంగా నాటుకుపోయి ఉన్న మూఢనమ్మకాలనూ, అంధ విశ్వాసాలనూ ఆసరాగా చేసుకుని, జీవనోపాధిగా మల్చుకొని జీవనం సాగిస్తుండడం ఆశ్చర్యం కల్గించింది విద్యకి.
జోగినీ ఆచారంలోంచి, సంప్రదాయంలోంచి బయట పడకుండా ఉండడం కోసం, ఆచారాన్ని సజీవంగా నిలపడం కోసం, తర్వాత తరాలకు అందించడం కోసం ఆమెను ఆ చట్రంలోనే బంధించిందీ పెట్టుబడిదారీ వ్యవస్థ, కుల వ్యవస్థ, వర్గ వ్యవస్థ. మరి ముత్తెమ్మ ఎందుకిలా చేసింది…? ఆలోచిస్తూ… ముత్తెమ్మ చెప్పే మాటలు వింటూన్న విద్య వాళ్ళ దగ్గరికి ఎర్రటి కారం మెతుకులతో ఉన్న సత్తు పళ్ళాన్ని పట్టుకొని వచ్చింది పెద్ద సాయమ్మ.
ఆమెది ముత్తెమ్మ ఇంటి వెనక ఇల్లే. ముత్తెమ్మకు వరుసకు చిన్నమ్మ అవుతుంది. ఆమెను పరీక్షగా చూసింది విద్య. పచ్చ రంగులో ఉన్న ఆమె ఎండా వానలకు కష్టపడి పని చేయడం వల్లనేమో కావి పట్టిన తెల్ల పంచెలా… మొహం తప్ప పైకి కనబడే ప్రతి శరీర భాగంలోనూ మానిన గాయాల తాలూకు మిగిలిన మచ్చలూ… చిన్న చిన్న గీతలుగా.. లెక్కకు మించి అలా ఎందుకు ఏర్పడ్డాయో…? విద్య ఊహకి అందడం లేదు. ఆ విషయమే వాళ్ళని అడిగింది.
”దీనికి సొమ్మరోగం ఉండె. సొమ్మచ్చి పడ్డప్పుడు చెడ్డ నెత్తురు తీసెతందుకు రేజర్‌ పత్తి తోనన్న, కత్తితోటన్న గాట్లు పెట్టెటోల్లు. ఆ గాట్లల్లకెల్లి నెత్తురు కారుతుంటే రోగం తగ్గుతుండె. సొమ్మ దిగుతుండె” వివరించింది ముత్తెమ్మ.
సొమ్మ అంటే… అది ఒక రకమైన హిస్టీరియా లేదా ఎపిలెప్సి అయివుంటుంది. ”ఆ గాట్లు నీకు బాధ కల్గించలేదా…? నొప్పి పెట్టలేదా?” పొగ చూరి మసిబారినట్లున్న పెద్ద సాయవ్వ కళ్ళలోకే చూస్తూ అడిగింది విద్య.
”అయ్యో ఎందుకు నొయ్యయి దొరసానీ… మస్తు నొస్తుండె. గా నెప్పులన్నీ తీయాల్నంటే ఆరం పది దెసాలు పడ్తుండె. అసలే మొగడు లేని రండ ముండనైతి. ఇద్దరు పోరగాల్లకు తల్లినైతి. గరీబుదాన్నైతి. జీవనం ఎట్ల? మస్తు పరేశానుండె. గా నొప్పులతోనే కైకిలుకు పోలేకుంట… గా దినాలు ఎట్ల నడిసెనో యాదికొస్తే కడుపుల బాదయితది. పొల్లగాండ్లు ఏడేండ్లకు రాంగనే దొరలకాడ జీతం ఉంటిరి. గట్లనే నడుపుకుంటి. ఇగో గిప్పుడు పోరగాల్ల లగ్గాలయినయి. ఆల్ల పోరగాల్లకు సుతం లగ్గాలు జేసిన్రు. ఆల్లె నడుపుతున్నరు ఆనాటి కెల్లి” ట్రాన్స్‌లో చెప్పినట్లు చెప్పుకొచ్చింది పెద్ద సాయవ్వ.
చిన్న తనంలోనే పెళ్ళి, పిల్లలు, భర్త పోవడం, సమాజంలో ఒంటరి ఆడదానిపై ఉండే చిన్న చూపూ, స్త్రీ వివక్షా, ఆర్థిక స్థితి, కులవివక్షా అన్నీ కల్సి పెద్ద సాయమ్మ జీవితాన్ని అలా చేసి ఉంటాయనుకుంది విద్య.
ఎటువెళ్ళి వచ్చిందో … మా ఇంటికి పోదంరా అంటూ లాక్కెళ్ళింది సబిత. వేడి వేడిగా లేతగా కమ్మని వాసన వస్తాన్న మొక్కజొన్న పొత్తులు విద్య కందించింది.
”నాకా… ఒద్దమ్మా నువ్వే తిను”
”ఏంది… మా ఇంట్ల తినవా… మా జేతిమీన ఇచ్చినయి అంటుడయితదనా?” మొహం చిన్న బుచ్చుకున్న సబిత.
”ఛ..ఛ.. అలాని కాదు.” నొచ్చుకుంటూ విద్య
”కమాను కాడ అమ్ముతున్నరట. పోయి కాల్పిచ్చుకచ్చింది. నీ కొరకేనక్కా.” అంటూ లోపల్నించి బయటికొచ్చింది పోశవ్వ.
అంత అభిమానంతో తెచ్చిన సబితను చిన్న బుచ్చకూడదనీ, అది వారిని అవమానపరిచినట్లు, కించపరచినట్లూ అవుతుందనీ భావించిన విద్య తీసుకొని నాలుగ్గింజలు ఒలిచి నోట్లో వేస్కుంది.
”ఓహ్‌ా… చాలా బాగున్నాయి. ఇంత టేస్టీగా నేనేప్పుడూ తినలేదు”.
అప్పుడు గమనించింది విద్య. తను వాడిన ఇంగ్లీషు పదం ఆమెకు అర్థం కాలేదని” చాలా రుచిగా కమ్మగా ఉన్నాయి. ఇంత కమ్మగా ఉంటాయని నాకు ఈ రోజే తెల్సింది”
నిజంగానా అన్నట్లు విద్య మెహంలోకి చూస్తూ ”అక్కా, ఈ కంకులు పొద్దుగాల్ల ఇర్సుకొచ్చిన్రు. వెంటనే కాలుత్తున్నారు. గందుకే ఇంత మంచిగున్నాయి. రేపటికి ఇంత కమ్మగ ఉండయ్‌” చెప్తోంది సబిత.
వాళ్ళ మనసుల్లాగే.. ఈ పొత్తులు కూడా… కమ్మగా, తీయగా, అనుకుంది విద్య. పోశవ్వ మాటల్లో మొదట్లో తను చూసినప్పటి వాడి వేడి కన్పించడం లేదు. కొద్దిగా మృదుత్వం ధ్వనిస్తూంది. ఆమెతో మాట్లాడ్డానికి ఇదే మంచి సమయం అనుకొని ”సాయవ్వ లేదా పోశవ్వా?” వాకబు చేసింది విద్య
”సొసైటి కాడ బియ్యం అచ్చినయట. కారటు, బస్త పట్కబోయింది అక్కా” అవ్వతోని నేను బీ బోయిన. ఆడ మక్కలు అగుపడ్డయ్‌. అవ్వతోని కొనిపిచ్చిన నువు నాకు పట్నపోల్లు పెట్టుకునే తీరుతీరు. పిన్నులు, రంగు రంగుల రిబ్బన్లు, బొట్టు బిళ్ళలు ఇచ్చినవ్‌ గద. మరి నేను నీకు మక్కలన్న బెట్టద్దా..? మీరు పెద్ద కులపోల్లు మన చేతిది తింటరో లేదో అన్నది అవ్వ… ఏం గాదు. అక్క మంచిది. మనను మట్టుకుంట లేదా.. నేనైతే తింటదని కాల్పిచ్చిన కళ్ళు తిప్పుతూ, చేతులు, ఊపుతూ చెప్తున్న ఆమెలో తన విశ్వాసం వమ్ము కాలేదన్న ఆనందం. పరీక్షగా చూస్తోంటే సబితలో ఎక్కడో కవిత పోలికలున్నట్లన్పించింది ఆ క్షణంలో. విద్యకి తాను మొక్కజొన్న పొత్తులు అంత ఇష్టంగా ఎప్పుడూ తినదు. అందుకే సబిత ఇవ్వగానే వద్దంది. కానీ తను తీసుకోకపోతే సబిత ఎంత బాధపడేదో అనుకుంది విద్య మనసులో. గోడవారగా కూర్చోని మొక్క పొత్తు తింటూన్న పోశవ్వ మధ్య మధ్యలో కొన్ని గింజలు ఒలిచి కోళ్ళకు వేస్తోంది. ఆ దృశ్యాన్ని తదేకంగా విద్య చూస్తూ. పోశవ్వ అది గమనించినట్లుంది.
”ఏందక్కా అట్ల సూడబడ్తివి…” అడిగింది
”ఆహా… ఏం లేదు. ఏదో ఆలోచిస్తున్నానులే” అని మళ్ళీ తానే ” మీ అమ్మకి నీ ఒక్కదానివే సంతానమా…?” అడిగింది విద్య
”లే.. ఇద్దరు అక్కలున్నరు”
”వాళ్ళెక్కడ ఉంటారు…?”
”లింగాల కాడ ”
”ఇద్దరూ ఒక ఊళ్ళూనే ఉంటారా…?”
”అక్క ఇద్దర్నీ ఒక్కింటికే, ఒక్కనికే ఇచ్చిన్రు. పెద్దక్కకు నల్గురు ఆడ పోరగాండ్లే. మగ నలుసు ఒక్కటన్న కాలేదని మా అత్త గునిగింది. మారు మనుపు సేస్త కొడుక్కు అని ఊగులాడబట్టె. మా బావకు సిన్నక్క మీన మనసుండే. బయటిదెవత్తో సవితి అయితే మా పెద్దక్కనెట్ల జూస్తరో… ఎన్ని బాధలుంటయోనని మా అవ్వ, తాతలు అంత గల్సి చిన్నక్కకు చేసిన్రు. ఇద్దరు పక్క పక్క ఇండ్లల్ల ఎవల్లింట్ల ఆలుంటరు. బావకు యాడ ఉండబుద్దయితే, యాడ మనసయితే ఆడ ఉంటడు అంటరు. కనీ, మా సిన్నక్క కాడనే బగ్గ ఉంటడు. కొడుకు ఉన్నడని.
” అక్క మొగుడ్ని చేస్కోవడానికి మీ అక్క ఒప్పుకుందా..?
” అక్క.. నువు జెప్పు. మా ఇండ్లల్ల ఎవ్వల్లకన్న అసలు నెత్తి వున్నదా? తరీఖు ఉన్నదా? పెద్దోల్లు ఎట్టంటే గట్ల ఇనుకోవాలె. మారుమాట ఉండద్దు. మాలోల్లకు, మాదిగోల్లకు నెత్తి ఉండద్దు. ఉండి ఏదన్న, ఎన్నడన్న అడిగిన్రా ఇగ గంతే… పెద్ద కులపోల్లయితే ఏంది, మాలోల్లకు మాద్గోల్లకు నోరుబగ్గ లేత్తాంది అని మమ్ముల సంపుకతింటరు. మమ్ముల పసులకన్న ఈనంగ సూత్తరు. మా వోల్లు పెద్దలు సెప్పినట్టు ఇనాల్నంటరు. అందరు గూడి ఒక్కమాట జేసిన్రంటే. అంతే. లగ్గమయి నంక ఇద్దరికి నడువకుంటే ఎవర్దాల్లే అయితరు. నడిసిందా కలిసుంటరు. అక్క… మా నసీబు ఎట్లుంటే అట్ల నడుత్తది. మా సోది మీకెందుకులే…” అంది పోశవ్వ.
” అదేంటి పోశవ్వా… అలా అంటావ్‌. నేను వచ్చింది మీ గురించి తెల్సుకోవడానికే కదా!”
” అవ్‌ గనీ, మాకు మీ లెక్క మనసుంటది. మా లోతుల్ని తవ్వేదెవల్లు?
మాకు సుత అందర్లెక్క బాధ ఉంటది. దుఃఖఃం అస్తది. మాకు ఎట్ల చెప్పాలె. మీ కెట్ల ఎరుకయితయ్‌..? మీరు పెద్దింటోల్లు, పైసల్ల మెసిలినోల్లు, సదుకున్నోల్లు, నెత్తి ఉన్నోల్లు, మీరు ఏమన్న మీ ఇండ్లల్ల నడుస్తది. మా ఇండ్లల్ల అట్ల నడుత్తదా..? తినెతందుకే ఉండదు. ఇగమాట ఎట్ల నడుత్తది. బుక్కెడు బువ్వకోసం పెద్దోల్లకు ఇనాలె. నీ బాంచన కాల్మొక్త అనాలె నేకుంటే… దొరల, పైసలున్నోల్ల, పెద్ద కులపోల్ల పెద్దరికం ఏంగాను? గిదంత నీకు ఎట్ల ఎర్కయితది..? నీకు ఎట్ల ఎర్క జేయాల్లో నాకు సమజయితలేదు.
జోగుదైన మా అవ్వ మస్తు బాధలు పడ్డది. అవమానాలు పడ్డది. దాని నాయనమ్మ, బతుకు, అత్త బతుకు మంటగల్సింది. గాక తన బతుకు బీ బుగ్గి చేసిన్రని ఎన్నడన్న లోపల్లోపల్నే ఏడ్సేడ్తట. నా బిడ్డకు ఎట్లన్న సంపారి జేయ్యాలె అనుకున్నదట. గందుకే నాకు బండారు పెట్టలేదట. నాకు 5 ఏండ్లల్ల ఎంటుకలు తీపిస్త అనుకున్నదట. అప్పట్ల మా పెద్ద తాత సచ్చిండని ఊకున్నదట, వతను కాదని, ఆచారం కాదని పిల్లకు జుట్టు తీపిత్తనంటివి. అగో, గందుకే పెద్ద దిక్కు పుటుక్కుమన్నడు అన్నరట ఊర్లో. అందరు అదే నిజమనుకున్నారు. మరి ఏమనుకున్నదో మా అవ్వ నా జుట్టు అట్లనే ఉంచిందట. కొన్ని ఒద్దులున్నంక మా ఆయికి ఏదో భీమారయిందట. గా బీమార్ల ”నా పేరు బెట్టుకున్నది. నన్ను గాదని అది సంసారి ఎట్లయితది.? బండారు బెట్టాలె లేకుంటే…” తప్పయిందని లెంపలేస్కోని మా అవ్వ జోగు ఇడుస్తనని బండారు పెట్టిందట. చిన్నంగ మా ఆయి రోగం నెలరోజుల్ల తగ్గి మంచిగయిందట. తర్వాత మా అవ్వ ఈ ముచ్చటనే మర్సింది. నాకు లగ్గం సేత్తనని సంబంధాలు ఎతికింది. ఆ ముచ్చట ఎట్ల ఎరుకయిందో పెద్ద గౌడ్‌కు మా అవ్వకు కబురు పెట్టిండు సుంకరోనితోని. ఏందే.. జోగుము.. నీతి నియమాలు ఉండాల్నే… ఈ మాదిగోల్లకు ఎంత జెప్ప దున్నపోతుల్లెక్క మల్ల మొదటి కొత్తరు. బిడ్డ పెండ్లి జేసుడంటే పీనుగల్లేత్తయ్‌… తోలు దీసుకొమ్మను మీ పెద్ద మాదిగను అని నోటికొచ్చినట్టు తిట్టిండట. మా అవ్వ ఊ అనలె… ఆ.. అనలె. ఊర్ల ఎవ్వరు మా దిక్కు చూడొద్దన్నడు. మాతోని మాటాడొద్దన్నడు. ఆటకు మమ్ముల పిలవొద్దన్నాడు. ఎవరూ ఇంత బిచ్చం ఏయద్దన్నడు. అవ్వ ఇనలె. లగ్గంకు మూర్తం పెట్టి పిచ్చింది. మల్ల బోయి గౌడ్‌సాబ్‌కి బతిమాలుకున్నదట.
ఆయన ఏమనలేదట. గమ్మున ఉన్నడట. అటెనుక నా లగ్గంకు బట్టలు పంపిండు. సామాన్లు పంపిండు లగ్గంకు బోయెతందుకు ఎడ్లబండి పంపుతనన్నడు. ఇక మా అమ్మ సూడాలె. ఎంతయిన కన్నతండ్రి గద. గందుకే ఇదంత సేత్తున్నడని సంబరపడింది.
లగ్గంకి మస్తు దుందాం సేసింది. పోశమ్మ పండుక్కి అందర్కి కబురు పెట్టింది. అంత అచ్చిన్రు. పోశవ్వ పండుగ అయినంక రాంపూర్‌కి బయలెల్లినం లగ్గంకు. ఎడ్లబండ్లల్ల మల్లయ్య ఇంటి ముంగిట మల్లయ్యతోని లగ్గం అయపోయింది. ఇంక పసుపుబట్టల్లనే ఉన్నం. మేకలు తెగినయ్‌. కల్లు పెట్టెలు దిగినయ్‌. అగ్గో… గప్పుడు ఉరికురికి వచ్చిన్రు. చేతిల మా చిన్నక్క కొడ్కు ఉర్కి అస్తున్న ఎడ్లబండి మీది కెళ్ళి ఎగిరి కింద బడ్డడట. బండకు కొట్టుకొనుడు పానం పోకడ ఒక్కసారే అయినయ్‌. అంత చణంల అయిపోయినయ్‌. ఏడ నెత్తురు సుక్కలేదు.
ఇక సూడు.. అందరూ… నా మీన, మా అమ్మ మీన ఇర్సుకబడ్తిరి. మా సిన్నక్క, బావ, అత్త అయితే దుమ్మెత్తి పోసిన్రు. బూతులు తిట్టిన్రు. శాపాలు పెట్టిన్రు. పంచాయితీ పెట్టిపిచ్చిన్రు.
ఊరంతా జమయింది. పట్వారి రాంరావు, పటేల్‌ రాజాగౌడ్‌, ఎంకన్నదొర, గంగారాంపటేల్‌, రాంపూర్‌కెల్లి ఒసంతరావ్‌ పటేల్‌, పెద్దరెడ్డి కొడుకులు అంత గద్దెమీన తక్కినోల్లంత కచేరి కాడ సుట్టుత నిలబడి వాళ్ళు ఏం చెప్తారో తెల్సీ… ఎదురు చూస్తూ… మల్లయ్య కుటుంబం కూడా ఆ జనంలో…
ఆ గద్దె మీది పెద్దలేం మాట్లాడుకున్నరో… గానీ, నిన్న లగ్గంకు అయిన కర్సంత మల్లయ్య కుటుంబానికి దండుగ కట్టాల్ననీ, పెళ్ళి పెటాకులయిందనీ చెప్పిన్రు.
అది అందరూ ఊహించిందే అయినా ”నీ కాల్మొక్త దొర నీ బాంచెన్‌… గులాం గాల్లం. దయసేయండి. కనికరం సూపండి”. అంటూ గద్దె మీద ఉన్న ప్రతివాళ్ళ కాళ్ళు పట్టుకుంది. దండుగ మాఫీ చేయమని కోరింది మా అవ్వ సాయవ్వ. ఎవరి మనసులూ కరగకపోగా అంతా నీ వల్లనే. బండారు బెట్టిన పోరిని సంసారిని జేస్తనని అంటే నడుస్తదా.. గిట్లనే అయితది. అంటూ కసిరి, వచ్చే 10 రోజుల్లోగా జోగు పట్టం కట్టమని ఆదేశించారు… ఆచారాన్ని, సంప్రదాయాన్ని కాదంటే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేమని బెదిరిస్తూ హెచ్చరించారు. పెద్దల కుట్ర, డబ్బున్నోల్ల కుట్ర, కులం ఉన్నోల్ల కుట్ర, అధికారం ఉన్నోల్ల కుట్ర ఇది అని అర్థం కాలేదు పోశవ్వకూ… ఆ కుటుంబానికీ, ఆ ఊరి జనానికి.
ఈ పేదోళ్ళు కూటికి గతిలేనోళ్ళు, కులం లేనోళ్ళు, ఈ అలగా జనం ఆలోచిస్తే… వాళ్ళ ఆలోచనలకు రూపం వస్తే… ఇక తమ గతి ఏం కాను. తమ పెద్దరికం ఏం కాను…? పరపతి ఏం కాను! మా కాళ్ళ కింద చెప్పుల్లా పడి ఉండాల్సిన వాళ్ళు అలాగే ఉండాలి. వారికి ఏ మాత్రం సందుపెట్టకూడదు. వాళ్ళల్లో ఎవరికైనా ‘ఆలోచన’ మొదలైతే మొగ్గగా ఉన్నప్పుడే తుంచెయ్యాలి. మొక్కగా ఉన్నప్పుడే వంచేయ్యాలి అని అంతా కూడా బలుక్కుని ఇచ్చిన తీర్పని ఈ బానిసగాళ్లకు తెలీదు. అర్థం కాదు. అర్థం కానీయరు. అంత దూరం ఆలోచించే తెలివితేటలు వారికి లేవు. ఆచారం పేరుతోనో, వతను అనో, మూఢనమ్మకాల ముసుగులోనో, దైవం పేరుతోనో వాళ్ళలో ఆలోచన మొలకెత్తనీకుండా అడ్డు పడ్తున్నారు పెద్దలు. మొలకెత్తినా మధ్యలో తుంచేస్తున్నారు. అలాంటప్పుడు ఇది దైవ నిర్ణయం అంటూ సరిపుచ్చుకుంటున్నారు. అలాగే బతుకు బండి ఈదడానికి అలవాటు పడిపోతున్నారు. తాము ఆచరించేది సరైనది కాదని, అనాగరికమని తెల్సుకోలేకపోతున్నారు.
సాయవ్వ కూడా అదే విధంగా భావించింది. దైవ నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరనుకుంది… తన బిడ్డ ఖర్మ. ఏం చేస్తుంది. దాని నొసట అంతే రాసిపెట్టి ఉంటే ఇంకోలా చేదామంటే ఎలా కుదురుతుందనుకుంది. మనసుకు నచ్చజెప్పుకుంది. తన కున్న వెండి కడియాలు, చేతి, ముంజేతి కడియాలూ తెగనమ్మి కొంత అప్పు చేసి జరిమానా కట్టాలనుకుంది. పెద్దల నిర్ణయం మేరకు జోగి పట్టం కట్టడానికి వారంలోగా ముహూర్తం పెట్టారు.
అంత వరకూ మౌనంగా గమనించిన మల్లయ్య మనసు కుతకుతలాడుతోంది. తను కావాలనుకున్న పిల్లను తనది కాకుండా చేస్తున్నందుకు, తమ వ్యవహారాల్లో ఊరు జోక్యం చేసుకున్నందుకు అతని మనసు ఉడికి పోతుంది. గతంలో తమకు సంబంధంలేని విషయాల్లో తమ ఊరి పెద్దలు జోక్యం చేసుకోవడం, జరిమానాలు వేయడం, వెలివేయడం వంటి సంఘటనలు చూసి ఉన్నా ఆనాడు అతను దాని గురించి అంతగా ఆలోచింఅడిగినమా..? పంచాయితీ బెట్టిండ్రు. పెడ్తెగిడ్తె నేను బెట్టుమనాలె. లేకుంటే మా వోల్లు అనాలె ఏది లేకుంట… సేసుకున్న లగ్గం తెంచుతున్నరు. నేనేమన్న మీ ఇంట్ల పోరి నెత్తుకొచ్చినన్నా… నాశనం జేసిన్నా.. అంతే గద్దె మీది పెద్దలంతా మరింత ఉగ్రులయ్యారు. ఈ విధమైన సమాధానం ఆశించని, ఈ మార్పు సహించలేని అగ్రకుల భూస్వాములకు, వెనకబడిన వర్గాల్లోంచి ఎదిగొస్తున్న భూస్వాములకు ఒంటిమీద కారం రాసినట్లయింది. చింతకింద నిప్పుపెట్టినట్లనిపించింది. తమ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లు భయం ఆవరించింది. ఆ భయలోంచి తమను తమస్థాయిని తాము కాపాడుకోవాలన్న తపన మాలమాదిగోళ్ళ ప్రశ్నించే స్థాయిని, తమని ఎదిరించే స్థితిని సమాధి చేయాలని ఎవరికి వాళ్ళు తలపోశారు. లేకపోతే జనం ఇది అలుసుగా తీసుకుని పేట్రేగి పోవచ్చుననుకున్నారు. అందుకే మల్లయ్యను చెట్టుకు కట్టేయించి చింత బరిగెలతో ఒళ్ళంతా వాతలు తేలేటట్లు కొందరు బాదితే, రాజాగౌడ్‌ మాత్రం దుడ్డుకర్ర తీసుకున్నాడు. ఒకరికొకరు సమర్ధించుకుంటూ ఎంత చిత్రహింసలు పెట్టగలరో అంతా పెట్టారు. అన్ని దెబ్బల్ని, ఆ చిత్రహింసనీ కిక్కురు మనకుండా భరించాడు. తమ మల్లయ్యకు కళ్ళముందే జరుగుతున్న దారుణాన్ని చూస్తూ తట్టుకోలేక పోతున్నారు అతని తల్లిదండ్రులు.
”మీ కాల్మొక్త బాంచన్‌ గులాంగాల్లం, పోరగాన్కి ఎర్కలేక మాటాడిండు దొర.. ఆ పోరడిని ఒగ్గెయిన్రి దొరా అంటూ ఆ గద్దెమీది పెద్దలందరి కాళ్ళు పట్టుకున్నారు. గుండెలవిసేలా రోదించారు. ఎదురు గుట్టకు ఉన్న రాళ్ళయినా కరిగాయేమో కానీ అంత కంటే కఠిన హృదయులైన వాళ్ళెవరి మనసూ కరగలేదు సరికదా… అంతమంది అంత హింసిస్తున్నా అదే తిరస్కారమైన చూపు చూస్తున్న మల్లయ్య’తప్పయింది దొరా’ అంటాడేమోనని ఎదురు చూశారు. కానీ మల్లయ్య మౌనాన్ని వారు భరించలేక పోతున్నారు. చాచి లెంపకాయ కొట్టినట్లు ఫీలవుతున్నారు. ”ఇంత గ్యాస్‌ నూనె తెచ్చి పోయిన్రి గప్పుడు గాని ఈనికి బుద్ది తెల్వది” మల్లయ్య ఊరి పట్వారి ”గిసాంటోల్లు ఒక్కల్లు ఊర్ల ఉన్నరంటే ఊరంత సత్తెనాశనమయితాది” అన్నాడు మళ్ళీ తనను సమర్ధించుకుంటూ అతను.
”ఒరేయ్‌ సుంకరోడ పోయి మా దుకాన్ల గ్యాస్‌ నూనె పట్కరా” పురమాయించాడు షావుకారు గురువయ్య
” అట్లనే సావుకారి” అని సుంకరోడు అటు పరుగెత్తాడు.
మల్లయ్య అదే స్థిర చిత్తంతో… కదలిక లేకుండా… అలాగే మౌనం అదే తిరస్కారపూరితమైన చూపు.
తీవ్ర పదజాలంతో దూషిస్తూ పెద్దలనే వాళ్ళు.
”పాపం పోరడు సక్కదనం గున్నడు” ఒక్క మాట సెప్తే ఏం బోతాది. తప్పయిందీ దొర. అంటే ఆల్లె మాఫీ జేత్తరు గద! అనుకుంటున్నారు కొందరు.
అంతలో సుంకరోడు గ్యాస్‌ నూనె తెచ్చాడు. అయ్యావారి సలహామేరకు మల్లయ్యపై పోశాడు వసంతరావు దేశాయ్‌ అగ్గిపుల్ల గీయబోయాడు
అంతలో జానారెడ్డి అందుకుని ”ఏం జుస్తున్నర్ర ఈడ. నడుండ్రి ఈడికెళ్ళి” గదిమాడు. మనసులో బాధ సుళ్ళు తిరుగుతుండగా తమవాడిని ఒంటరిగా ఒదిలి వెళ్ళలేకా, పెద్దలకు ఎదురు తిరిగి అతనికి సపోర్టు ఇవ్వలేకా, ఏం జరుగుతుందోనన్న భయంతో బిక్కు బిక్కుమంటూ కదిలారు. రెండూళ్ళ జనం. భయంతో రాజాగౌడ్‌ అందుకుని ”అగ్గిపెట్టుడు ఎందుగ్గానీ, అట్లనే వదిలేద్దాం. నాలుగు రోజులు తిండి తప్పలు లేకుంటే ఆడే దారికొత్తడు” అన్నాడు.
వెంకన్న పటేల్‌ రక్తం ఓడుతున్న అతని శరీరంపై ఒంటేలు పోయించాడు సుంకర సాయిలుతోనూ, ఎట్టి రాములుతోను. శరీరం భగభగ మండుతున్నా, మనసు అంతకంటే కణకణలాడుతున్నా మౌనం వీడలేదు. ఆ చూపు మారలేదు మల్లయ్యలో.
సుంకరోడిని, ఎట్టోడిని అక్కడే కాపలా పెట్టి మల్లయ్యకు ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వవద్దని, వాడికి ఏమైనా తిండి పెట్టినట్టో, నీళ్ళు ఇచ్చినట్లో తెల్సిందా వాడికి పట్టినగతే మీకూ పడ్తుందనీ హెచ్చరించి వెళ్ళిపోయారు ఆ నాయకగణం.
ఐదో రోజుకి మల్లయ్య ఈ కుత్సితపు, కుతంత్రాల మనుషులకి దూరంగా, అందుకు అతీతంగా ఉండే చోటికి వెళ్ళిపోయాడు. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాడు. మాదిగోళ్ళ, మాలోళ్ళ దృష్టిలో అమరుడయ్యాడు. ఆరాధ్యుడయ్యాడు.
మల్లయ్యలా తమలో చేవలేనందుకు తమలో తామే నిందించుకొన్నారు ఆ దళితుల్లో కొందరు. అగ్రకుల అహంకారాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నించిన మల్లయ్య, అతని చూపులు ఆ రెండు వూళ్ళ ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని రెండు ఊళ్ళలోని యువకుల్లో కొందరు అనుకున్నారు. కాని అది ఎలా? తర్జన భర్జన పడ్డారు.
విషయం తెల్సుకున్న దళిత పెద్దలు భయంతో కంపించారు. ఆ యువకులది ఉడుకు రక్తం అనీ అందుకే అలా ఆలోచిస్తున్నారనీ భావించారు. వారి ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నరు. పెద్దోళ్ళ మాటకాదని మనలాంటి చిన్నోళ్ళ, చిన్న కులపోళ్ళు ఊరికి ఎట్టి జేస్కోని బతికేటోళ్ళు బతకలేరన్నారు. లేదంటే ఊరు వల్లకాడవుతుందన్నారు. నిలువనీడ లేక బుక్కెడు బువ్వ పుట్టక చావాలన్నారు. జమానలకెల్లి చూస్తున్నామన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా మల్లయ్యలాంటి వ్యక్తులు పుట్టినప్పుడు అదే జరుగుతోందన్నారు. తొందర పడవద్దన్నారు. వాళ్ళ అంత్రం అది. మన అంత్రం ఇది. ఎగిరెగిరి పడొద్దు. అణిగిమణిగి ఉండాలన్నారు. ఎగిసిపడ్తున్న వారి ఉద్రేకం మీద, ఆగ్రహం మీద నీళ్ళు చల్లి సమదాయించబోయారు.
అయినా పోతడోల్ల వీరయ్య విన్పించుకోలేదు. ఎల్లారెడ్డికి పోయి పోలీస్‌ స్టేషన్‌లో ఊరి పెద్దలపై కంప్లైంట్‌ ఇచ్చాడు. అగ్రకుల పెత్తందారుల అడుగులకు మడుగులొత్తే పోలీసులు కేసు నమోదు చేయకుండా ఆ సమాచారాన్ని ఆ పెద్దలకు చేరవేశారు. సిరిపురం ఊరి చరిత్రలో ఇదే మొదటిసారి ఒక దళితుడు పోలీస్‌ స్టేషనుకు వెళ్ళడం, అగ్రవర్ణాల వారిపై కేసు పెట్టడం. ఇది తెల్సుకున్న ఊరిజనంలో ఒకలాంటి ఉత్సుకత, దళితుల్లో ఆ ఉత్సకతతో పాటు భయం. ఎవరి నోట్లో చూసినా ఇదే విషయం జనం గుంపులు గుంపులుగా ఇదే చర్చ.

(ఇంకా వుంది)

శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

29
ధారావాహికలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)