ఆ నీలి కళ్ళ సంద్రంలో ఎక్కడివా నీలాలు
పొడి బారిన నదులా అవి ప్రేమ కధా కావ్యాలు
ఎడారిలో ఎండమావి మెరుపు ల్లా
ఎప్పటివా వట్టిపోయి వగచే పంటపొలాలు
కన్నీరై ప్రవహించే కరుణామృత హృదయం
సవరించిన సరిగమలై మది పలికే చిరు గీతం
మరపురాని గతం మళ్ళీ వసంతమై తిరిగొస్తుందని
ఎన్నాళ్ళీ ఎదురు చూపు ఎద వాకిట తలపు వెనక
మబ్బు నలుపు నీడలోనొ మసక వెలుగు తుది మలుపునొ
మోమంతా పరచుకున్న మధురమైన దరహాసపు వెన్నెలలా
ఆ ఘడియలు ఏక్షణమో ఎదుట నిలిచి పిలిచేనని వలచేనని
రెప్ప వాల్చలేని బ్రతుకు ఎదురు చూపు తూపులలో తూగుటలో
అరఘడియో రెప్పపాటు పొరబాటో తూలి సోలి వేసారిన
విరహపు తుది క్షణమో అలవోక నీడగా తొలి చినుకు పాటలా
అలికిడే తోచనీ మునిమాపు ముసురులా కరగిపోయావా
కదలిపోయావా కన్నీటి చెక్కిళ్ళు గాలిలా తాకుతూ .
– స్వాతీశ్రీపాద
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~