పేజీలు
లాగిన్
వర్గాలు
ఓయినం
ఒకనాడు పంటకని ఇచ్చిన డబ్బులను కూతురు తిరిగి ఇస్తుంటే వద్దని వారిస్తూ ”ఉండనీ తియ్య బిడ్డా నేను నీ కోసమే చిట్టెసి ఆ పైసలు గూడా కట్టెసినా” అన్నది.”అమ్మ నాకాడుంటే ఉట్టిగనే కర్చు అయితయే మళ్ళీ అక్కరొచ్చినప్పుడు తిస్కుంట” అంటూ డబ్బులను చేతిలో పెడ్తూ ”అమ్మ యింగ సురేందరును నీ దగ్గరనే పెట్టుకోయే సుభాషంటే సిన్నోడు ఏసెట్టుకిందనో ఏసి పనిజేసుకుంట. ఈడైతే ఆడిడ ఆడుకుంట పనిజెయ్యనియ్యడు గట్లజేస్తే ఇంగనన్ను కల్వకొయ్యనియ్యరే అంది ”బయట పనికి పొమ్మని నిన్ను ఎవలు కొట్టిండ్రు బిడ్డా పిల్లలని సూస్కుంట ఉండరాదు” అన్నది ఎల్లమ్మ.”గట్లకాదమ్మ సేను పని అయిపోయినంక ఉట్టిగనే ఎన్ని దినాలుందు కలవకొయ్యపోతే నాలుగు రూపాలొస్తేయి ఏదన్నా ఖర్చులెల్తయి ఎన్ని దినాలని నాకు పెడ్తవే” అని అన్నది.”నా పానం ఉన్నన్ని రోజులు నిన్ను సూస్తా బిడ్డా, అదే నాకొడుకుకైతే నేను నా దగ్గరి పెట్టుకోనా, మంచిగుంటే నేనూ పెట్టకపోదునేమొ కాని నువ్వు గిట్లయితివి” అన్నది బాధపడ్తూ.”పోనితియ్యె నా రాత గిట్లుంది ఏదో ఒక కష్టం జేసుకుని నేను బత్కాలే” అంటుంటే సరే తియ్యి బిడ్డా నువ్వన్నట్లనే కానియ్యి అన్నది.తల్లి దగ్గర ఉన్నన్ని రోజుల్లో రాజు సతాయిస్తున్న విషయం తల్లికి చెప్పాలని ప్రయత్నించింది నీలమ్మ.కాని ఈ విషయం తెల్సి తల్లిదండ్రులు మరింత కుంగుతారని, తన వల్ల వాళ్ళు మరింత బాధపడ్తారని వెనక్క తగ్గింది.ఇంటికి తిరిగి వెళ్తున్న రోజు బస్సు ఎక్కించేందుకు తల్లిదండ్రులతో పాటు సురేందరు వచ్చాడు.తల్లి బస్సెక్కి తననూ తీసుకుపోనందుకు ఏడుస్తూ కింద నిలబడి సాలయ్య చేతుల్లో పెనుగులాడుతూ ”అమ్మపోతా, అమ్మపోతా” అని మారాంచేస్తూ తల్లి దిక్కు చూస్తూ వెక్కి వెక్కిఏడ్చాడు. తల్లి తనను అమ్మమ్మ దగ్గర విడిచి వెళ్లటం ఆ చిన్న మనస్సు జీర్ణించుకోలేక పోయింది.బస్సెక్కి కొడుకును చూసిన నీలమ్మ గుండెలవిశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకును విడవాల్సి వస్తున్నందుకు గుండె రాయి చేసుకుంది.అందరి గుండేలు భారమయ్యాయి.
”అక్కా పా అక్కా యింక ఎంతసేపు గిట్లుంటవు పురుగుపుట్ర ఉంటది పా” అంటుంటే.ఆ ఇషం పురుగుల కంటే ఇవేక్వనా సెల్లి” అంటూ చేతులల్లో ముఖం దాచుకుంది.
మొగొళ్ళ దిక్కు రాజు ఆడోళ్ళ దిక్కు నీలమ్మ నిల్చుంటే చెట్టును ఆనుకొని సత్తయ్య చంద్రయ్య రంగయ్యలు కూర్చొన్నారు.అందరి ముఖాలు కళతప్పి ఉన్నాయి.
”సరే ఇంగ అయింది అయిపోయింది గిప్పుడు ఎవలి తప్పు ఏందో ఎవల నాయమేందో అందరికి సమజైంది అసలు ఆఖరి ఫైసలా ఏంది” అంటూ అందరి దిక్కుచూశాడు సత్తయ్య.
రాజేశం ద్వారా విషయం తెలుసుకుని కూతురి దగ్గరకు ఆత్రంగా వస్తున్న ఎల్లమ్మ, సాలయ్యల కండ్లల్లో ఈ దృశ్యం కన్పించేసరికి వాళ్ళిద్దరు పరుగెత్తు కొచ్చారు.
వాళ్ళిద్దరిని అక్కడ్నించి దాటించేసరికి అందరు నోళ్ళు తెరిచారు. జరిగిన నిర్ణయం ఏమిటి ఇప్పుడు కళ్ళముందు జర్గుతున్నదేమిటి అని ఆలోచనలో పడగానే, ”ఓ సత్తెన్న గాళ్ళిద్దరిని గట్ల ఇడిస్తివేందే పోరి మీద నిందల మోపుమోపి ఆఖరికి ఋజువు సేసుకోమనిరి. ఆడపోరి గట్లజేసేగాని ఆళ్ళెందుకు సెయ్యకపాయే గిది లెక్కనేనా” అన్నది దుర్గమ్మ.


