గౌతమీగంగ

కాశీచయనుల-వేంకట-మహాలక్ష్మి-150x150నలుగుల వేళ రా। రా। కుమార నల్గుకు శ్రీరామ అలుగక పోరాటమేల సీతతో భూపాల చంద్రమా ॥రారా కుమారా॥ తప్పేమి చేసెనో దశరథ నందనా। ఒప్పుల కుప్ప జానకీ హృదయేశా! నందనా ॥రారా కుమారా॥ అని రత్నం పాడిరది.
ప॥ కృష్ణ నలుగుకూ రారా నంద కుమారా శ్యామ సుందరా।
చ॥ అత్తరు పన్నీరు అమరిన గంధము తెచ్చియున్నామురా।
పుత్తడి బొమ్మ సత్తె భామ నీ చెంతనున్నది ॥రారా కుమారా॥
అని రావమ్మా గారూ, సీతమ్మ గారూ పాడారు.
మగపెళ్ళి వారి తరపున ఎవరూ పాడలేదు. సీత అత్తగారికి పాటలు రావేమో అంది ఓ ముత్తయిదువు. సీత ఇక వాళ్ల పిల్లే కదా! అదే పాడుతుంది వాళ్ల తరపున అన్నారు మరొకరు. ఎవరూ అడగకుండానే.
పెండ్లి కొడుకూ ఎంతో చాలా పెంకివాడయా
ఎపుడు చూచినా బేటుబాలూ వదలవేడయా
వీధులంటూ తిరగమంటే విసపు లేదయా
భోజనంబు చాయమంటే బోధలేదయా ॥పెండ్లి॥
అంటూ పదేళ్ల బాల సీత నదురూ, బెదురూ లేకుండా, తన కంచు కంఠంతో పాడిరది.

వధూవరుల్ని పల్లకిలో కూర్చోపెట్టి ఊరేగింపు సాగింది. సన్నాయి మేళం మ్రోగుతుండగా ముత్తయిదువులంతా వెంట నడిచారు. ఊరేగింపు చూడవచ్చిన వారు అయ్యో! ఇంత చిన్న పిల్లని ఈ ముసలాడికిచ్చారేమిటీ? అని కొందరూ, కాకి ముక్కుకు దొండపండులా వుందని కొందరు అంటుంటే మాణిక్యమ్మగారూ, పెళ్లి కొడుకు చెల్లెలు పెళ్లి కొడుకేం వయసు మీరిన వాడు కాదు 22వ ఏడు. ఆరు నెలల క్రితం జబ్బు చేసి ఇలా వున్నాడు. కొన్నాళ్లు పోతే నిక్షేపంలా వుంటాడు అని వాళ్లకు తెలియజెప్పసాగారు. బిందెలో ఉంగరం తీసే వేళ బంగారు ఉంగరం మూడుసార్లు శాస్త్రికే దొరికింది. దాన్ని వారు ఆ బిందెలోనే సీత చెయ్యి అందుకొని అందులో పెట్టారు. సీత గెలిచింది అని ఆమె అప్పగార్లు సంబరపడ్డారు. శాస్త్రి ముసి ముసి నవ్వులు నవ్వుకొన్నారు. దాని కడుపు చల్లగా సీత అసలు సంగతి పైకి చెప్పలేదు. ముందు ముందు సంసారంలో ఎన్నో అనర్ఘ రత్నాల్ని ఆయన ఆమెకు సమకూర్చారు. పెళ్లిలో మిధున విడియాలు, బొమ్మను అప్పగించడం అనే కార్యక్రమం వుంటుంది కదా. పెండ్లి కుమారునీ, పెండ్లి కుమార్తెనీ, పట్టిమంచం వాల్చి క్రొత్త దుప్పటి పరచి కూర్చో బెడతారు. వారి ముందర పళ్లెంలో తమలపాకులు, వక్కలూ, అరటిపళ్లు వుంటాయి. పెండ్లి కుమార్తె 9 ఆకులు, 2 పోకచెక్కలు, 2 అరటిపళ్ళు ఎంచి ఒక తాంబూలంగా పెళ్ళి కుమారుని చేతిలో వుంచుతుంది. ఇద్దరు కలిసి ఆ తాంబూలాన్ని తమ ముందు వున్న దంపతుల చేతిలో పెడతారు. భర్త ఆ తాంబూలాన్ని స్వీకరించి తన భార్య చేతికి ఇస్తాడు. ఇద్దరు కలిసి జంటగా వధూవరులపై అక్షతలు చల్లి దీవిస్తారు. దంపతులు సాటి దంపతులకిచ్చే ఈ తాంబూలం దంపతి తాంబూలం, సంస్కృతంలో మిధున విడియం ( ఈ పేరుతో ఓ నోము కూడా వుంది. క్రొత్తగా కాపురానికి వచ్చిన స్త్రీ ఈ నోము పడుతుంది. ఆమె రోజు ఇటువంటి జంట తాంబూలం ఒక దంపతులకు ఒక సంవత్సరం పాటు ఇవ్వాలి.

ఏడాది పూర్తిగా ఆ ప్రకారం చేసాక దంపతులకు పందిరిమంచం, పరుపు, తలగడలు, దుప్పట్లు, దిండుగలీబులు, పడక గదిలో అలంకరించే అద్దాలు, పటాలు, తాంబూలం సామాగ్రి వుంచే పాందాను అనే భరిణ. సుగంధ ద్రవ్యాలు, 360 తమలపాకులు, 360 పోకచెక్కలు వుంచి దంపతులకు తలంటి నీరు పోసి భోజనం పెట్టి, నూతన వస్త్రాలతో అందింవ్వాలి.) దాంపత్యంలో అనుకూల సిద్ధికోసం పెండ్లిలో దంపతులకు తాంబూలం ఇవ్వడం, తరువాత ఈ వ్రతం చేయడమూను. ఆడపెళ్లివారి, మగపెళ్లి వారి తరపు దంపతులందరికీ వృద్దానుపూర్విగా ఈ మిధున విడియాలు ఇచ్చే సత్కారం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయ్యాక బొమ్మను అప్పగించే లాంఛనం. వధూవరులు కూర్చొన్న మంచం ముందు తెల్లని చీరతో ఊయల కడతారు. ఆ ఊయలలో ఓ తెల్ల శ్రీ చందనం బొమ్మని వుంచుతారు. వరుని అప్పచెల్లెల్లు వచ్చి ఆ బొమ్మ పాపని ఊయల ఊపి బొమ్మపై వసంతం పోసి, ఆ వసంతాన్ని వధూవరులపై చల్లుతుంది. పాపని పెంచడంలో దంపతులకు ఆడపడుచు సహకారం వుండాలన్నమాట. ఆమె అన్నా, వదినల్ని పట్టినిస్తారా? పాడావునిస్తారా? అని అడుగుతుంది. రెండూ ఇస్తాము అంటారు వారు ఏక కంఠంతో పెళ్ళిలో గోదానం చేసి కన్యాదానం చేస్తారు కదా మరి. ఈ విధంగా తెలుగింటి ఆడపడుచు తన అన్నా, వదినలకు చేదోడు వాదోడుగా వుండి మేనకోడల్ని అన్నగారింట పెంచుకొని, తన కొడుక్కి పెళ్లి చేసుకొని తనతో పాటు తన అత్త వారింటికి తీసుకొని వెడుతుందన్న మాట. ఆ తరువాత భర్త నేను వీధిలోకి వెళ్ళాలి పిల్లని తీసుకో అంటే. భార్య నేను ఇంటి పనులు చేసుకోవాలి పిల్లని తీసుకోండి అంటుంది. ఈ విధంగా సంసారానికి సార్థకత, పసి పిల్లల్ని సాకి ప్రయోజకుల్ని చేయడమేనని పెళ్లయిన రోజునే భార్యా భర్తలకు తెలియచెప్తారు.

భోజనాల వేళ వరుస పాటలకు మారుగా ‘క్షీరాన్నమారగించండయ్యా! శ్రీహరి భక్తులూ, మీరు పరమాన్నమారగించండయ్యా! పరంధాముని భక్తులూ, ॥క్షీరాన్న॥ జైజై మని నైవేద్యము చేయుడీ జాజీ ఫలముందీ, భక్తులందర్నీ పిలువండయ్యా బాదం పప్పుంది, మీరు మహనీయులందరిని పిలవండయ్యా మరాటి మొగ్గందుందీ॥క్షీర॥ అని ఒకరు ‘రామ నామ మిఠాయి ఏమి తీపిగనున్నది హాయ్‌! హాయ్‌! రండి రండి కొనుక్కోండి. తినండి రామనామ మిఠాయి ॥రామ॥ నా మాటలు నమ్మండిటు రండీ నారద ప్రహ్లాదుల నడగండీ ॥రామ॥రామ నామమనే హల్వా మిఠాయి! ఏమి తీపిగా నున్నది హాయ్‌ హాయ్‌ రండి రండి కొనుక్కోండి తినండీ॥ సద్భక్తి, మదినమ్మకమే దీనికి వెలసుమండీ ॥రామ॥ అని మరొకరు ఆడ పెళ్లివారు పాడి తమ ముచ్చట తీర్చుకున్నారు. మగ పెళ్లివారి తరపున ఎవరూ ఏమి పాడలేదు. పెళ్లికూతురుకు చెల్లెలు వరుస అయిన శ్యామలాంబ భోజనాలు జరుగుతుండగా ఓ కిళ్లీ తెచ్చి శాస్త్రికి ఇచ్చి, బావగారు భోజనం అయ్యాక వేసుకోండి అంది. శాస్త్రి కనిపెట్టేసారు. ఇంచుమించుగా పెండ్లి కొడుకు సమవయస్కులో అతడికన్నా పెద్ద వారో అయిన వదిన గార్లు ఆ సరికి పెండ్లిండై అత్తవారి ఇంట కాపురాలు చేసుకుంటూ వుంటారు. వారు మరిది కష్ట సుఖాల్ని అర్థం చేసుకొని కొంత సానుభూతిగా స్నేహభావంతో వుంటారు. ఇక మరదళ్ళు వీళ్ళు గడుగ్గాయులు. బావ అంటే అన్నదమ్ముల్లా తమపై అధికారం చెలాయించకుండా వాత్సల్యాన్ని మాత్రం పంచి ఇచ్చే ఆప్తుడు. వారు చనువుగా అతణ్ని వేళాకోళము చేస్తారు. గారాబము చేయించుకుంటారు. ఈ చనువు కాస్త శృతి మించినా పాపం అతగాడు ముఖమాటం వలన ఏమి అనలేడు. అయ్య బాబోయ్‌! చెళ్ళెళ్ళు వున్న అమ్మాయిని మాత్రం పెళ్లాడకూడదు అన్నాడు. ఆకతాయి మరుదలి అమాయకపు బావగారు. శాస్త్రి కొంచెం ఆలోచించారు. సామాన్యంగా తాంబూలం భోజనాలు ముగిసాక ఇస్తారు. ఈ అమ్మాయేమిటీ ముందరే ఇచ్చింది. అదీకాక తాంబూలం మగవారికి ఏ బావమరిది వరుసవారో ఇస్తారు. ఆడవాళ్ళకు ఆడవాళ్ళు ముఖాన బొట్టు పెట్టి ఇస్తారు. ఇందులో ఏదో మతలబు వుందని మాట్లాడకుండా ఆ కిళ్ళీ అలా వుంచేసారాయన. కిళ్ళీలో చింతగింజో, సీమ మిరపకాయో పెట్టి ఇస్తుంది మరుదలు. అది నమిలి పన్ను విరిగి నోరు మంటెత్తుతుంటే ఏడవలేక, నవ్వుతున్న పెళ్లికొడుకును చూసి అందరూ నవ్వుతారు.

ఈ పెళ్లికొడుకు అసాధ్యుడు అనుకున్నారు అంతా.పెళ్లిలో ఊరేగింపు సాగుతుంది. ఓ రోజు పెళ్ళికూతురు వైపు చూసారు శాస్త్రి. 11 ఏళ్ళ పసిమొగ్గ ఈమె. ఈ చిన్నపిల్ల తనను చూచి ఏమనుకుంటూంది. అనేక కారణాల వల్ల తాను ఇంతవరకూ పెళ్లి మాట తలపెట్టలేదు. ఆడపిల్లకు రజస్వల కాకుండా పెళ్లి చేయడం సంఘం కట్టుబాటు. కనుక తాను తనకు ఈడైన పిల్లను చేసుకోవడం కుదరదు. ఈ బాలికను తనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ చిన్న పిల్లతో చనువు పెంచుకొని ఆమె అభిప్రాయాలు, అభిరుచులు తెలుసుకోవాలి అనుకున్నారు. పార్వతీ, పరమేశ్వరులు ఇష్టదైవమైన అతడికి దాంపత్యం పట్ల నిర్థుష్టమైన అభిప్రాయాలు వున్నాయి. నీకు పాటలంటే ఇష్టమా అని మెల్లగా అడిగారాయన. భర్త వద్ద సిగ్గు పడాలని ఆ ముగ్థకింకా తెలవదాయె.. నాకు సంగీతం నేర్చుకోవాలని వుంటుంది కాని మా నాన్న దగ్గర డబ్బు లేదుగా అంది సీత. ప్రక్క ఇంటి వాళ్ళ మీనాక్షి సంగీతం చెప్పుకుంటుంటే అక్కడ కూర్చొని నేర్చుకొనేదాన్ని. నేను దాని కన్నా బాగా పాడుతున్నానని వాళ్ళు ఇప్పుడు తలుపు మూసి పాట చెప్పిస్తున్నారు. అయినా నేను గోడ ఇవతల నుండి విని చాలమటుకు నేర్చుకుంటున్నాను. ఇప్పుడు పిళ్లారి గీతాలు అయి గీతాల్లోకి వచ్చింది ఆమె. నువ్వూ నేర్చుకుందుగాని అన్నారు శాస్త్రి. ఎలాగు అనుకుంది సీత పైకి మాత్రం అనలేదు.

మామగారు తనను చూడవచ్చినప్పుడు 50 రూపాయలు పెట్టి మేలురకం హార్మోని పెట్టెకొని ఇచ్చారు. శాస్త్రి మరో 20 రూపాయలు ఆయన చేతిలో పెట్టి మామగారు మీ అమ్మాయికి సంగీతం అంటే ఇష్టంలా వుంది. మంచి మాష్టారు చేత సంగీతం చెప్పించండి. జీతం నెల నెలా నేను పంపుతాను అన్నారు. సుబ్బారావు గారు సంబరపడుతూ ఇంటికి వచ్చి ఊరిలో మంచి పేరున్న వనమయ్యగార్ని సీతకు సంగీతం చెప్పడానికి నెలకు 4 రూపాయల జీతానికి కుదిర్చారు. సీత శ్రద్ధగా నేర్చుకొని, 2 ఏళ్లలో కృతులు శ్రావ్యంగా పాడటం నేర్చుకొంది. తెలిసిన వారంతా శాస్త్రిగారి సహృదయతకూ, ముచ్చటకూ సంబరపడేవారు. శ్రావ్యంగా పట్టీకీ ఆరు కాసులు పెట్టి మంగళ సూత్రాల గొలుసు చేయించి పెళ్లి కూతురుకు దక్షిణాది పట్టు పరికిణి గుడ్డ, రవికల గుడ్డ కొని ఇచ్చి. అత్తా, మామలకు మేలు జాతి చీర జామారులు కొని ఇచ్చి తల్లితండ్రులని అత్తవారింటికి పంపారు శాస్త్రి. కృష్ణ సోమయాజులు గారు కోడల్ని చూసుకొని ముచ్చట పడుతూ పూజ చేయించడానికి పురోహితుడు వచ్చినా తాము స్వయంగా పూజ చేయించారు. పూజ ముగిసాక సీతా మంగళహారతి పాడమ్మా అన్నారు మామగారు. ‘‘కర్పూర హారతిగైకొను పార్వతీ। సర్పభూషణూ సతీ। సతతమూధీమతి ॥కర్పూర॥ చరణం। వేడుక మీరగా వీణలు మీటగా ఆడగా, పాడగా అతివల జూచి బ్రోచే ॥కర్పూర॥ అని భక్తి పారవశ్యంతో కిన్నెరలు మ్రోగునట్లుగా పాడిరది సీత. తన నగలతో పాటు పసుపు దారన రూపూ క్రొత్త గొలుసు దాల్చి, పట్టు పరికిణీ, రవికా ధరించి తమకు నమస్కరించిన సీతామహాలక్ష్మిని మనసారా దీవించారు ఆ అత్తా మామలు తల్లిదండ్రులూను. సుబ్బమ్మ గారు గారెలు, బూరెలు, అరిసెలు, అప్పాలూ, పూరీలు, కజ్జికాయలు, ఆవడలు, బొబ్బట్లు, పూర్ణపు కుడుములు, నవకాయ పిండి వంటలు చేసారు. చిత్రాన్నం, క్షీరాన్నం గుడాన్నం, చెక్కెర పొంగలి, దధ్యోజనం పంచ విధాన్నాలు వండారు. పప్పు, ధప్పళాలూ, రెండు కూరలు అప్పడాలు, వడియాలూ, ఊరగాయలతో షడ్రసోపేతమైన విందు భోజనాలు వండి వడ్డించారు. ఊరిలో వున్న మాణిక్యమ్మగారిని భర్తను, పిల్లలనూ పూజకు, భోజనాలకు పిలిచారు. సుబ్బమ్మ గారి పెద్ద కొడుకు కోడలు, కూతురు అల్లుడు ఊళ్ల నుండి వచ్చారు. వరలక్ష్మీ వ్రతం వేడుకగా సలక్షణంగా జరిగింది.

దసరా పండుగ వచ్చింది. అల్లుణ్ణి అత్తా మామలు తొలి పండుగకు ఆహ్వానించారు. అప్పటికీ శాస్త్రి ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది. వారు వాడే ఆయుర్వేద కేశ తైలం వలన జుట్టు నల్లగా ఒత్తుగా వుంది. బుగ్గలు కొంచెం పూడాయి. చక్కని సేలం జరి అంచుల పంచ ధరించి, మడతలు పెట్టి ఇస్త్రీ చేసిన సేలం జరీ అంచుల ఉత్తరీయం ధరించారు. తెల్లని కమీజు రోల్డు గోల్డు కప్స్‌, బొత్తాలతో దాల్చి, గోధుమ రంగు లాంగు కోటు తొడిగారు. రెండు చేతులకు వజ్రాల ఉంగరాలు, కోటు జేబులో బంగారు గొలుసు కల గడియారం (అప్పటికి రిస్టు వాచీలు రాలేదు పొడుగుపాటి సన్నని గొలుసుతో గడియారాన్ని కోటు బొత్తాలకు తగిల్చి జేబుపై ధరించడం నాటి ఫ్యాషన్‌) కాళ్లకు నిగనిగలాడే హాఫ్‌ బూట్లు ధరించారు. భర్తను చాటు నుండి చూసి సీత పాపం ఈయన బాగానే వున్నారే. పెళ్లిలో అంతా అలా అనుకున్నారేమిటీ? అనుకుంది. అట్లతద్ది వచ్చింది. సీత నోము పట్టకుండానే దీని మగడు కాస్తా పడుచువాడై కూర్చొన్నాడు. ఇంకా నోము ఎందుకు? అని వారున్న ఇంటిగలావిడ వేళాకోళం చేసింది.

ఆంధ్రదేశంలోని ఆడపిల్లలంతా 3,4 ఏళ్ల వయసు నుండే అక్కలతోనూ, వదినలతోనూ అట్లతద్ది పూజ చేసుకుంటారు. అట్లతద్ది తెలుగింటి ఆడపడుచుల ఉత్సాహానికి తగిన పండుగ. ఈ పండుగ రెండు రోజులు సాగుతుంది. పంచమ వర్ణానికి చెందిన మాలలు అనే ఒక వర్ణం వారంతా అట్లతద్ది మాలలు అంటూ ఆదరంగా తమ వాడలలోకి రావించి వారు పాడే పాటలు విని గౌరమ్మా అనే వారి దేవత దీవెనలు పొంది వారికి బియ్యం, పాత బట్టలూ మొదలైనవి ఇచ్చి ఆదరిస్తారు. మాలెతలు పెద్ద పెద్ద కొప్పుల నిండా బంతిపూలు తరుముకొని, నేటి మన లెమన్‌ ఎల్లో, ఆనంద బ్లూ అనే రంగుల్లోని కాస్త ముదురుగా ఆనే చీరలు ధరించి, వెండి నగలు దాల్చి మెడ, బుగ్గలకూ, ముంజేతులకు దట్టంగా గంధం పూసుకుని ముఖానికి నేటి అర్థ రూపాయి కాసంత బొట్టు ధరించి ‘‘వెళ్లగా వెళ్లగా తుమ్మెదా। వెలగ చెట్టే వచ్చేను తుమ్మెద’’ అంటూ తుమ్మెద పాటలూ. ‘గౌరమ్మ। గౌరమ్మా। మా తల్లి గౌరమ్మ। పసుపు కుంకుమ లిచ్చి రక్షించవే అంటూనూ, పదాలు పాడుతారు. వీరికి అభిజిత్‌ మంచి ముహూర్తమేమో. వారి పెళ్లిళ్లు మిట్ట మధ్యాహ్నం వేళ జరిగేవి. పెళ్లికి వచ్చే ముందు పెళ్ళి కొడుకునూ, పెళ్ళి జరుగగానే మండుటెండలో వధూవరుల్ని గుఱ్ఱం మీద ఎక్కించి వారు సాగించే ఊరేగింపును అందరు వేడుకగా చూసేవారు. వివాహాది వేడుకల్లో, స్త్రీలకు, వర్ణాల మధ్య వున్న నియమ నిబంధనలను మన వాళ్లు కొంత సడలించేవారు. అంతవరకూ గడపదాటిరాని కొన్ని శిష్టాచార కుటుంబాలలో స్త్రీలకు పెండ్లి ఊరేగింపుల్లోను, వేడుకల్లోనూ పాల్గొనడానికి నిషేధం లేదు.

పెండ్లి అయిన ఏడాది నుంచి పది ఏళ్ళ పాటు బాలికలు అట్లతద్ధి నోము పట్టి భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉద్యాపన చేసుకుంటారు. తరువాత కూడా స్త్రీలు తమ జీవిత పర్యంతం అట్లతద్ది పూజ శ్రద్ధాసక్తులతో చేసుకుంటారు. అట్లతద్ది ముందు రోజు భోగి. ఆనాడు ఉదయం కన్యలూ, ముత్తయిదువులూ ఉదయాన్నే అభ్యంగన స్నానం చేస్తారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక గోరింటాకులు పెట్టుకుంటారు. రాత్రి పెద్ద వారు నూపప్పు పొడి, గోంగూర పచ్చడీ, ఉల్లిపాయల పులుసు చేసి ఓ గిన్నెతో అత్తెసరు వేసి వుంచుతారు. రాత్రి ఓ తగరం గిన్నెతో ప్రత్యేకంగా పెరుగు తోడు పెడతారు. తెల్లవారు రaామున 2 గంటలకే ఆడపిల్లల్ని నిద్ర లేపి ముఖాలు కడుగుకొమ్మని, దీపాలు దగ్గర పెట్టుకొని వారికి తలలు దువ్వి పూలు ముడుస్తారు. చెమ్మ పడితే 4 గదులు నడుస్తుంది. ఈ విధంగా పడితే పై పందెం వుంటుంది. అంటే ఆ అమ్మాయికి మళ్లీ పందెం వేసే అర్హత వుంటుంది. ఒక గవ్వ, లేక 3 గవ్వలు ఒక విధంగా పడితే ఆ అమ్మాయికి పందెం వేసే అర్హత వుండదు. మరో ప్రక్కన (కుడి వైపున) కూర్చొన్న అమ్మాయి పందెం వేస్తుంది. ఒక అమ్మాయి గవ్వ వున్న గడిలోకి రెండవ అమ్మాయి గవ్వ వేస్తే మొదటి అమ్మాయి గవ్వ చచ్చిపోయి తన మొదటి స్థానానికి చేరుతుంది. పందెం గెలిచిన అమ్మాయికి గెలుపు పందెం అని మరోసారి పందెం వేసే అర్హత, అవకాశం లభిస్తాయి. ముందుగా ఏ అమ్మాయి కాయలు 4 పండితే ఆ అమ్మాయి ఆట గెలిచినట్లు. తమ హస్త లాఘవం, ఊహాశక్తిని మెరుగు పెట్టుకొంటూ బాలికలు, పెద్ద స్త్రీలు కూడా తీరిక సమయాల్లో ఈ ఆటలు ఆడి వినోదించేవారు. పురాణ దంపతులైన గౌరీ శంకరులూ, లక్ష్మీనారాయణలు కూడా ఈ ఆటలు ఆడి వినోదించినట్లుగా మన కథల్లో చెప్తారు. అయితే వారు గవ్వలు, చింతగింజలకు బదులుగా రత్నాలు, ముత్యాలు, పచ్చలూ, నీలాలు వంటి మణి, మాణిక్యాలు వాడారట. వైకుంఠ పాళిలో తమ పందెపు చాతుర్యం వలన ఒక్క పిక్కతోనే నిచ్చెనలు ఎక్కి, విధి వక్రీకరించినపుడు పాము నోట్లో పడి మొదటి స్థానానికి, జారిపోతూ ఇద్దరు కాని, అంతకన్నా ఎక్కువ మంది కాని క్రీడిస్తూ చివరకు పరమపదం చేరుతారు. అందుకే ఈ వైకుంఠపాళికి పరమపద సోపానం అనే మరోపేరు. వామనగుంటలు, పచ్చీసు పాళి అనేవి చింతగింజలతోనే ఆడే కాస్త పై స్థాయి ఆటలు, వెలుగు వచ్చే వరకూ ఈ ఆటలతో వినోదించిన బాలికలు తూర్పున వెలుగు రేఖలు విచ్చి ప్రజలు లేచి పనిపాటలు ప్రారంభించే వేళకు వాకిళ్లలో చేరి. గవ్వల్లా కోడిీ, కాకీనీచెర్లో బుడుంగ్‌ చాకలిబాన మొదలైన ఆటలు ఆడుతారు. తెల్లగా తెల్లవారే సరికి అందరు ఊర్లో వున్న చెరువుకో, కాలువకో, నదికో చేరి ఆ నీటిలో ప్రతిఫలిస్తున్న చందమామని తమ అరచేతులతో తడ్తూ చల్ల చేయడమనే ఆట ఆడాక ఇంటికి చేరుతారు.

ఆసరికి ఇంట్లో పెద్దవాళ్లు వీరి నోముకు అన్నీ సిద్ధం చేస్తూ వుంటారు. తల్లికాచి ఇచ్చిన వేడి నీరు ఇంటి చూరు క్రింద కూర్చొని పంచ క్రింద పది వుండలు అంటూ ఒకో వుండ పసుపురాసుకొని ఒక చెంబుడు నీరు చొప్పున పది చెంబుల నీరు కంఠ స్నానం చేస్తారు. ఉతికి ఆరవేసిన పట్టు బట్టలు కట్టుకొని పసుపు పారాణులు, బొట్టు, కాటుక ధరించి ఈ బాలికలు వచ్చే సరికి ఇంటిలోని తన పెద్ద ముత్తయిదువులు మహాలక్ష్మీ పెట్టి అనే పూజా మందిరం అలికి ముగ్గులు పెట్టి గడపకు పసుపు, కుంకుమలు, గుమ్మానికి తోరణం అలంకరిస్తారు. పూజా మందిరం ముందు పది పద్మాలు పెట్టి వాటిపై పసుపు కుంకుమలు, అక్షతలు, పూలు చల్లుతారు. ఒక కుందెలో పది పోగుల వత్తి సిద్ధం చేస్తారు. ఎందరు బాలికలు పూజ చేసుకుంటే అందరికీ పదేసి పద్మాలు పది పోగుల వత్తీ ప్రత్యేకంగా వుండాలి. పూలూ, పసుపు, కుంకుమలు, గంధాక్షతలు పళ్ళేలలో తయారు చేస్తారు. ప్రత్తి పసుపులో తడిపి వస్త్రయజ్ఞోప వీతాలు తయారు చేస్తారు. పదేసి పోగులతో మహాలక్ష్మీదేవికి ఒక తోరం, నోము చేసుకొనే బాలికలకు చేతికి ధరించడానికి ఒకటీ, వాయనం ఇవ్వడానికి ఒకటీ చొప్పున తోరాలు తలో మూడు నూలు దారంతో పోసి వాటికి రంగు రంగుల పూలూ, ఆకుపచ్చని ఆకులూ గుత్తులుగా కడతారు.

బాలికల చేత ముందర విఘ్నేశ్వరునికి పూజ చేయించి రాగి డబ్బుకు గంధం పసుపు, కుంకుమలు అలది ఆ ప్రతిమలో రోహిణీ సహిత చంద్రదేవుని ఆవాహన చేస్తారు. గౌరీ మహాలక్ష్మినీ, చంద్రదేవునీ షోడశోపచారాలతో పూజ చేసి, మినపపిండి బియ్యం పిండి కలిపి వేసిన అట్లు పది అట్లు ఓ పళ్ళెంలో వుంచి పైన పేరిన నేతి ముద్ద, బెల్లం వుంచి నివేదన చేస్తారు. తాంబూలం, మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారాలు అయ్యాక తోరాలకు పసుపు కుంకుమలతో పూజ చేస్తారు. ఆ తోరం బాలిక కుడి చేతికి ‘భద్నామి దక్షిణే హస్తే దశ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ, సౌభాగ్యం దేహిమే రమే’’ అని మంత్రం చదువుతూ కడతారు. ఆ తరువాత ముత్తయిదువును పీటపై కూర్చోబెట్టి పసుపు పారాణిలు, కుంకుమ గంధం అర్పించి, ఆమె కుడి చేతికి తోరం కట్టి దక్షిణ తాంబూలం ఇచ్చి, తలపై అక్షతలు వేసి, పది అట్లు నేయి, బెల్లం రాగి నాణెం సహితంగా ఆమెను మహాలక్ష్మి అమ్మగా తలిచి వాయనం ఇస్తుంది. సీత తల్లికి వాయనం ఇచ్చి ముమ్మారు ఇస్తినమ్మా వాయనం అంటే, తల్లి పుచ్చుకుంటినమ్మా వాయనం అంది. నా చేతి వాయనం అందుకున్నది ఎవరమ్మా అంటే తల్లి నేనమ్మా గౌరీ పార్వతీ అంది. సీత కోరితిని వరం అంటే తల్లి ఇస్తిని వరం అంది.

ఈ వ్రత కథ ఈ విధంగా వుంటుంది. ఒక ఊరిలో ఓ బ్రాహ్మణవారి అక్కమ్మ, ఓ రాచవారి అక్కమ్మ, ఓ కోమటివారి అక్కమ్మ, ఓ కాపువారి అక్కమ్మ వున్నారు. వారు నలుగురూ అట్లతద్దె నోము పట్టారు. మిగతా ముగ్గురు రాత్రి వరకు ఉపవాసం వుండి నోము చేసుకున్నారు యధావిధిగా. రాచవారి అక్కమ్మ సుకుమారం వలన శోష వచ్చి పడిపోయింది. అన్నగారు వచ్చి చూచి ఇదేమమ్మా అని తల్లిని అడిగాడు. నాయనా నీ చెల్లెలు ఉపవాసం వుండలేకపోయింది అంది తల్లి. అన్న ఆరె కుప్పకు నిప్పు పెట్టి చింత చెట్టుకు అద్దం కట్టి అద్ధంలో ఆ మంట చూపి చెల్లెల్ని చంద్రుడు వచ్చాడు చూడమ్మా అన్నాడు. ఆ అమ్మాయి ఆ మంట చూసి చంద్రుడనుకొని రాత్రి కాకుండానే పూజ చేసుకొని భోంచేసింది. కొంత కాలానికి స్నేహితురాళ్లందరికి పెళ్లిళ్లు అయ్యాయి. రాచకన్యకు మాత్రం ముసలి మగడు వచ్చాడు. ఆ అమ్మాయి అర్థానపు అడవిలో కూర్చొని తపస్సు చేస్తోంది. పార్వతీ, పరమేశ్వరులు భూమికి సంచారానికి వచ్చారు. కారణం ఏమిటమ్మా! అని అడిగారు ఆమెను. ఆర్చే వాళ్లా, తీర్చే వాళ్లా మీ కెందుకు మీ దారిన వెళ్లండి అంది ఆ పిల్ల. ఆర్చే వాళ్లమూ మేమే, తీర్చే వాళ్లమూ మేమే. చెప్పవమ్మా అన్నారు వాళ్లు. ఆ అమ్మాయి జరిగింది చెప్పింది. నీవు చంద్రుడు రాకుండా పూజ చేసుకున్నావు. అందుచేత ఈ విధంగా అయింది. ఈ సారి ఇంటికి వెళ్లి రాత్రిదాకా ఉపవాసముండి పూజ చేసుకో నీ మగడు పడుచువాడౌతాడు అన్నారు పార్వతీ పరమేశ్వరులు. ఆ అమ్మాయి ఆ ప్రకారంగా చేసింది. ముసలి మగడు కాస్తా పడుచువాడు అయిపోయాడు.

ఈ నోము కలియుగంలో కాంతలంతా పట్టారు. నేనూ పట్టాను. కథలోపమైన వ్రతలోపంకారాదు. భక్తి తప్పినా అక్షతలు తప్పరాదు. అక్షతలు తప్పినా లక్ష వేలేళ్లు ఐదవతనం తప్పరాదు అంటూ ముమ్మారు అక్షతలు మహాలక్ష్మిపైనా తరువాత తమ తలపైనా వేసుకుంటారు నోము పట్టిన వారు ఇక్కడికి పూజా విధానం పూర్తి అవుతుంది. ఈ కథలో రాత్రి వరకు ఉపవాసం వుండి రాత్రి పూజ చేసుకోవాలని చెప్తున్నారు. కాని ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోని వారు, కోనసీమ వారు ఉపవాసం వుండి చేసుకుంటారు. మిగతా గోదావరి జిల్లాల వారు ప్రాంతఃకాలాన్నే పూజ చేసుకొంటారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వారు ఉపవాసం వుండి చేసుకుంటారు. ఈ విధంగా ప్రాంతీయ బేధాలు ఎప్పటినుంచో వున్నాయి. అదే విధంగా నైవేద్యం పెట్టిన అట్లు తుంచరాదని బుల్లి బుల్లివి వేస్తారు కొందరు. ఈ నోము పదేళ్లు చేయాలి. ఉద్యాపనగా పది మంది ముత్తయిదువులకు క్రితం రోజున తలంటు సామాను, గోరింటాకు, ఇచ్చి మరుసటి రోజు ఒకొక్కరికి పదేసి అట్లు నేయి, బెల్లం, ఓ రాగి డబ్బు వుంచి వాయనం ఇవ్వాలి.

అట్లతద్దికి ఊయల ఊగడం ఆచారం. చింతచెట్టుకో, మామిడి చెట్టుకో బలమైన పగ్గాలతో ఊయల కడతారు. ఇరువురు వ్యక్తులు అండగా నిలిచి ఊయల ఊపుతూ వుంటే బాలికలు హాయిగా గాలిలో ఊగుతూ ఆనందిస్తారు. ఈ ఊయల ఊగడం బాలికల మనోధైర్యానికీ ఆరోగ్యానికే నిదర్శనం. అట్లతద్దె రోజు సాయంత్రం బాలికలు 10 ఊయలలు ఊగాలి. అట్లతద్దె అట్ల పిండి బాగా ఊరి అట్లుపోయాగానే చిల్లులుగా ఏర్పడుతుంది. ఈ అట్లకు ఎన్ని చిల్లులుంటే అన్ని వేలేండ్లు తమకు అయిదవ తనం ఉంటుందని స్త్రీలు నమ్మేవారు.ఈ విధంగా నోములూ, వ్రతాలూ, పాటలూ, పద్యాలతో పుట్టినింట హాయిగా కాలం గుడస్తూ వుండగా 13వ యేట సీత రజస్వల అయ్యింది. అర్థరాత్రి అనీ గ్రహస్థితి సరిగా లేదని చాలా శాంతులు జరిపించారు. ఆరు నెలల వరకూ వున్నస్సంధానానిక మాత్రం శాస్త్రిగారు అంగీకరించలేదు.

స్త్రీల ఆరోగ్య పరిరక్షణ పట్లా, సంతాన ప్రాప్తి, పిల్లల పెంపకం పట్ల వైద్యుడుగా నిర్థుష్టమైన అభిప్రాయాలు కలవారు శాస్త్రి. నాటి సాంఘిక పరిస్థితుల్లో స్త్రీలు 12వ యేటనే గర్భవతులు కావడం జరుగుతూ వుండేది. కొన్ని చోట్ల ఆరోగ్యవంతులూ, తగిన సహాయ సహకారాలు కలిగిన వారు అయిన స్త్రీలు ఈ పరిస్థితి నిభాయించుకోగలిగినా, అర్భకురాళ్లు, తగిన సలహా, సహాయాలు లభించని వారు పుట్టిన సంతానాన్ని నష్టపోవడం, కొండకచో తమ ప్రాణాలనే బలిపెట్టవలసి రావడం జరుగుతూ వుండేది. శాస్త్రి యోచించారు ఆ చిన్ని బాలికను ఇప్పుడే సంసారంలోకి దింపరాదని నిశ్చయించుకున్నారు. 14వ యేడు వచ్చే వరకూ ఆమెను పుట్టినింటనే వుంచి తగిన విధంగా సహాయపడుతూ కాలం గడిపారు. 14వ ఏట కాపురానికి వచ్చిన సీత మరుసటి ఏట గర్భం దాల్చింది. శాస్త్రి గారి వైపు నుండి ఆమెకు సహాయంగా వచ్చేవారు ఎవరూ లేరు. 7వ నెలలో ఆమెను పురిటికి పంపారు. అత్త వారి పద్ధతులు వారికి నచ్చడం లేదు. పని చేయాలంటే నూతి నుండి నీరు తోడటం నుండి చేయించడం, విశ్రాంతిగా వుండమంటే అసలు మంచం దిగనివ్వకపోవడం, అతివృష్టి, అనావృష్టిగా వుంది. మీ పెరట్లో పూల మొక్కలూ, కాయల మొక్కలూ వున్నాయి కదా వాటి మధ్య ఉదయం సాయంత్రం ఒక అరగంట సేపు తిరుగుతూ వుండు.

మంచం మీద మధ్యాహ్నం ఓ గంట రాత్రి తప్ప పడుకోకు హాయిగా కూర్చొని నీకు వచ్చిన పాటలన్నీ పాడుకో స్నేహితురాళ్లతో వామనగుంటలో, పచ్చీసో ఆడుకో, గృహలక్ష్మీ, నవ్వులగని, హిందూ సుందరి వంటి పత్రికలనే వచ్చేటప్పుడు నీకు తెచ్చి ఇస్తా హాయిగా కొంతసేపు చదువుకో అని భార్యకు చెప్పి పంపారాయన. పెసరపప్పు, సెనగపప్పు, కంద, పెండలం, గోంగూర, బచ్చలికూర వంటి ఆకు కూరలు, ఎక్కువ కారం, పులుపు వస్తువులు ఆమెను తిననిచ్చేవారు కాదాయన. కమ్మని తియ్యని పదార్థాలు తేలికగా జీర్ణం అయ్యేవి తినమనే వారు అయ్యో ఇదెక్కడిచోద్యమమ్మా। గర్భవతులు ఏది కోరితే అది పెట్టాలి. తాను ఎంత వైద్యుడైనా ఈ ఆంక్షలు పెడితే ఎలా మేం అంతా పిల్లల్ని కనలేదా? పిల్లకు ఏం పెట్టుకోవాలో తెలియదా? అని సీత తల్లీ, అప్పగారూ విసుక్కునేవారు. మీరు తింటే తిన్నారు. ఈమె అర్భకురాలు ఈమెకు అలా కుదురదు అని శాస్త్రిగారు చెప్తే వారికి తెలిసేది కాదు. దానిమ్మ, అంజూర, అల్బూకారా, పచ్చి ద్రాక్ష వంటి పళ్లు ఆమెకు నోటికి రుచి కలగడానికి, బలం చేయడానికి కొని పెట్టేవారు. నరాలకు ఉత్తేజం కలుగుతుందని మేలైన హోటలు నుండి వెండి మరచెంబుతో కాఫీ తెప్పించి ఉదయం, మధ్యాహ్నం ఇచ్చేవారు. అప్పటికీ థర్మాస్‌ ప్లాస్కులు ఏ సంపన్నులకో తప్ప వాడుకలో లేవు. ఇంటిలో ఏ బంధువులో వుంటే అపురూపమైన ఈ కాఫీ చూడగానే పిల్లలు ఎగబడేవారు. మరచెంబులోను, వెండి గ్లాసుల్లోను, మూతలోను వాళ్ల ముచ్చట తీరి సీత వరకూ వచ్చే సరికి ఆ కాఫీ చప్పగా చల్లారిపోయేది.

ఒక నెల గడిచి శాస్త్రిగారు భార్యను చూడవచ్చే సరికి ఆయన కొని ఇచ్చిన ఖరీదైన గర్భ సంరక్షక మందులన్నీ గూట్లోనే వున్నాయి. శాస్త్రిగారు భార్య చేతికి కొంత డబ్బు ఇచ్చి మీ నాన్నగారినో, అన్నయ్యనో, పాలకొల్లో, భీమవరమో పంపి పళ్లు తెప్పించుకొని తిను అని చెప్పారు. పళ్ల వాసన కూడా అక్కడ లేదు. ఆయనకు కష్టం కలిగి అత్త మామల్ని, భార్యను కూడా కోపపడ్డారు. సీతకు చిన్నతనం, నీరసం తనకు కావలసినవి తినడం ఆమెకు తెలియదు. తల్లికి ఇంటి పనులతో తీరదు, మడీ, తడీ ఆమె రుచులకు తగినట్లుగా వండి పెట్టడమైతే చేయగలదు గాని ఇటువంటి సంరక్షణ ఆమె వల్ల కాదు. 

( ఇంకా ఉంది )

– కాశీచయనుల వెంకట మహా లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

226
ఆత్మ కథలు, గౌతమీగంగ, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో