ఓడిపోలేదోయ్..

“..చిట్టి చిలకమ్మ చిట్టిచిట్టి చిలకమ్మ ఎంతముద్దుగావున్నావే!” తాతగొంతు! ఎన్నాళ్ళయింది తాతమాటవిని! “అమ్మా! చూడు. తాతనాకు చిలకవేచం వేచాడు” చిన్నిసీత సంతోషంతో కేకలుపెడుతోంది. చిలక లాంటి కాస్ట్యూమ్ లో దూరిన సీత, రెక్కల్లో దూరిన చేతులుల రెపరెపలాడిస్తోంది. “అరె! పాప ఎగురురతోంది!!” అవును సీత ఎగురుతోంది. పచ్చని చెట్ల మీద, బంగారు మామిడిపళ్లమీద ఎర్ర ముక్కుతో పొడుస్తూ తియ్యగా తింటూ. అవుగో జాంపళ్ళు! ఎర్ర ముక్కుతో పొడిస్తే తియ్యగా …అరెరె రెక్కలు ఇరుక్కున్నాయ్! తిన్నపండు చేదుగా ఉం దేంటీ? అమ్మో! గ్రద్ద! చిట్టిచిలకమ్మ పొట్టమీద ఒక్క తన్ను తన్నింది గ్రద్ద. “అమ్మా!” ఉలిక్కి పడి లేచింది సీత. పొట్టలో పాపాయి కి అమ్మ కలెందుకో నచ్చలేదు. చిన్నగా మెత్తగా తన్ని నిద్రలేపేసింది. తనకే ఒక పాపాయి పుట్ట బోతుంటే తను చిన్న పిల్లైనట్టుగా కలేమిటీ? కాస్త నిద్ర మత్తు వదిలి కళ్ళుకష్టం మీద pregnancy_cover_eతెరిచిన సీత కళ్ళల్లో కన్నీళ్ళు. పక్కన మేడమీంచి కాబోలు సన్నగా వినిపిస్తోంది.. “మేడమీదా అలపైడి బొమ్మా నీడనే చిలకమ్మా….” చిన్నతనంలో ఆపాట విన్నప్పుడెప్పుడూ ఆ మాటల అర్ధం తెలియలేదు ఇప్పుడు మిగతా పాటంతాఏ మో గానీ ఆ రెండు మాటలూ తనకోసమే తన బతుకునే వర్ణిస్తున్నాయా అనిపించింది. కాక పోతే ముందు వెనుకలయ్యాయి తన జీవితంలో. ఒకప్పుడు తనూ తన చిన్ని జీవితం …. అమ్మా నాన్నలతో, చల్లని నీడలో, చిక్కని గూటిలో తనో బుజ్జి చిలకమ్మ! ఆ తరవాత తరవాతేమయింది? ఏమయింది? ఉధృ తంగా ఏడుపు ముంచుకొచ్చింది. పెల్లుబికిన వరదలా గుండెని ముంచేసింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న కొద్దీ వరద పొంగుతూనే ఉంది.“అబ్బా! లేచిందిరా నాయనా! మహమ్మారి!” లోపలికి తొంగి చూసిన ఆడపడుచు సీత కి వినిపించేలాగా పెద్దగా విసుక్కుంది. “మహారాణీలాగాసూర్యుడు నడినెత్తికెక్కి తే గానీ లేవదు కానీ ఏదో పేద్ద గండం నెత్తిన పడ్డట్టు ఈ ఏడుపులొకటీ! సేవలన్నీ చేయించుకుంటూనే…” సీత ఆడపడుచు రాజ్యం దండకం ఆగట్లేదు. “మీరెందుకమ్మా మనసు పాడు చేసుకుంటారు? మేమున్నాంగా? సూసుకుంటాం లేండి తవఁరసలు రాకండమ్మా ఇంత పైకి ఈ పెంట అవుసు లోకి” రాజ్యాన్ని ఓదార్చింది సీత కోసమే ప్రత్యేకంగా నియమింప బడ్డ ఆయా ఆదెమ్మ. రాజ్యం గట్టిగా పగలబడి నవ్వింది. “కరెక్టుగా చెప్పావ్ ఆదెమ్మా ఇది పెంటహౌసే! పెంటహౌస్!” పడీపడీ నవ్వింది రాజ్యం “ఆవిడగారారోగం ఎవరికంటిస్తుందో నన్నభయంతో ఎవ్వరం ఇటు రానే రాం. పొరబాటునొచ్చా ఈఏడుపులు వినలేక చచ్చా! అయినా మాఇంట్లో మాకే కదలడానికి లేకుండా చేసేసింది మహాతల్లి!” కచ్చగా ఏదో అంటూనే ఉంది. మెట్లు దిగుతోంది కాబోలు గొంతు దూరమయింది.

“ఆఁ ఏటితల్లీ తెల్లారినాదా?” తిప్పుకుంటూ గదిలోకొచ్చింది ఆదెమ్మ. “ఎందుకా ఏడుపు? లెగిసిసిందగ్గ ర్నుంచీ మూడు పూటలా అన్నీ జరగతానే ఉండాయిగా?” తనేదో తన సొమ్మంతా పోసి సీత ని పోషించేస్తు న్నట్టు విసుగ్గా చూసింది. అప్పటికి కలలు, కన్నీళ్ళు కూడా అదుపులోకొచ్చాయి సీతకి. “సారీ ఆదెమ్మా! ఏదో పీడకలొచ్చింది” “హుఁ నీకు బతుకే పీడకల!” “ఎంత నిజం చెప్పావు ఆదెమ్మా! అక్షర సత్యం చెప్పావ్!” బాధగా అంది నెమ్మదిగా లేచి గోడపట్టుకుని బాత్ రూమ్ వైపు నడుస్తూ.

సీత మఖం కడుక్కొనొచ్చేసరికి వంటావిడ వాణి కాఫీ టిపిను ట్రేలోసద్ది పెట్టి తెచ్చింది అప్పటికే జరిగింది వంటమనిషి వాణి తో చెప్పింది కాబోలు కొంచెం జాలి చూపించు ఆదెమ్మా. నీకు పని, జీతం ఆ అమ్మ వల్లనే వస్తున్నాయి చక్కగా చేసుకో ఆ మె ఏం మాటాడట్లేదుకదా అని పెత్తనం చెయ్యకు” అంటోంది “అట్ట కాదు వాణెమ్మా! మొగుడు సచ్చినా కూడా అత్తింటోళ్ళు ఇంట్లోనే ఉంచుకున్నారుకదా తిండికి బట్టకి లోటు సెయ్య ట్లేదు కదా? పైగా ఏదో మాయదారి రోగమంట ఆ రోగం వొచ్చినాకూడా ఎప్పుడెవరికి అంటిస్తదో అన్న బయ్యమున్నా ఇంట్లోంచి గెంటెయ్యలేదుకదా? ఇందాక నువ్వుచూడలే నిద్ర లేచుడే ఎంత ఏడుపుతో లేచిందో మాతల్లి!” “ఇంక నోర్ముయ్!” కళ్ళతో సీత వచ్చిందని సైగ చేసింది. “సరే నువ్వు స్నానానికి సిధ్ధం చెయ్యి” “రండమ్మా” మంచం ముందుకు చిన్న బల్ల జరిపి, “తినేస్తారా? స్నానం తరవాత తింటారా?” అడిగిం ది వాణి “స్నానం అయ్యాకే తింటాలే” ఆదెమ్మ బాత్ రూమ్ లో వేడినీళ్ళు నింపడానికి వెళ్ళింది. వాణి సీత జడవిప్పి తలదువ్వి జడల్లడం మొదలెట్టింది. “ఆదెమ్మ మాటలు పట్టించుకోకండమ్మా మీ మనసు తేలిగ్గా ఉంచుకోండి. పుట్టబోయే పాపకో సమైనా మనసు కుదుట పరుచుకోవాలి” విరక్తిగా నవ్వి సీత ఏం మాటాడలేదు వాణి కూడా ఇంకెక్కువ మాటాడకుండా జడల్లడం పూర్తి చేసింది. మరీ ఎక్కువ మాటాడితే సీత అత్తా, ఆడపడుచు తన ఉద్యోగం ఊడగొట్టి పంపుతారు ఇంటి దగ్గర తనపిల్లలకింత పెట్టాలంటే ఈ ఉద్యోగం చాలా అవసరం. భారంగా నిట్టూర్చింది. సీత స్నానం చేసోచ్చి కాస్త టిపిన్ తినే వరకూ ఉండి, పక్కనే ఉన్న చిన్న బాల్కనీ లోకెళ్ళి పళ్ళెంలో మిగిలిన వన్నీ చెత్త సంచీలో వేసి అన్నీ కడిగి బోర్లించి “వస్తానమ్మా” అని కిందకి వెళ్ళిపోయింది. సీత అత్తవారిది పెద్దవ్యాపార వేత్తల కుటుంబం. తండ్రి, కొడుకులూ అందరూ రకరకాల వ్యాపారాల్లో చేతినిండా గడిస్తున్నారు సీత పెళ్ళయిన ఏడాదికే ఒక ప్రమాదంలో సీత తల్లిదండ్రులిద్దరూ మరణించారు. సమాజం దృష్టిలో సీత అత్తమామలు మహానుభావులు! సీతకి సేవకులను పెట్టి మరీ కాపాడుతున్నారు! అసలు గుట్టు సీత మామ పెరుమాళ్ళుకే ఎరుక.

సీత తల్లిదండ్రులు సామాన్య కుటుంబీకులు ఉన్న ఒక్క కూతురినీ బుధ్ధిమంతురాలిగా తీర్చి దిద్దారు. సీత కూడా వినయంగా ఎదిగి విద్యావంతురాలై విద్య గరిపే ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో స్థిర పడింది. అప్పుడు పెద్ద వ్యాపారవేత్త పెరుమాళ్ళు కంటపడింది. తన నాలుగో కొడుకు రాజారావుకు చేసు కుంటాం సీతనిమ్మని మధ్యవర్తులద్వారా కబురుపెట్టాడు పెరుమాళ్ళు. మధ్యవర్తి పెరుమాళ్ళునీ, అతని నాలుగో కొడుకు రాజారావునీ ఆకాశానికెత్తి మరీ పొగిడేసాడు. అమాయకుడైన సీత తండ్రి పిల్లనిచ్చేసాడు. పెళ్ళయిన రెండు-మూడునెలలకి మెల్లిగా సీత కర్ధమయ్యింది రాజారావుకు తన అన్నగార్లలాగా వ్యాపారానికి కావలసిన తెలివితేటలు లేవు. వాళ్ళకి లేని వ్యసనాలు చాలా ఉన్నాయి. సీత కి తనపరిస్థితి ఏమిటో అర్ధమయ్యేటప్పటికి మూడోనెల గర్భవతయింది ఘనంగా ఊళ్ళోకెల్లా గొప్ప ఆసుపత్రికి తీసుకెళ్ళి చూపించింది అత్తగారు. మామూలుగా గర్భిణులందరికీ చేయించే పరీక్షలు చేస్తుండగా అనుమానం వచ్చి మరిన్ని పరీక్షలు చేయించగా సీత నెత్తిన పిడుగు పడింది! ఒకే వాక్యం చెప్పింది డాక్టరు.

“సీత హెచ్ ఐవి పాజిటివ్”.

పిడుగు పడితే చేత్తో తీసిపడేసేదేమో సీత!

అప్పుడు మరోవాక్యం చెప్పింది డాక్టరుగారు “నీకు పుట్టబోయే బిడ్డకూడా పాజిటివ్ గానే పుడుతుంది”.

కొండలే రగిలే వడగాలి సుడిగాలిలా సీతని చుట్టి, తిప్పి తిప్పి, అగాధంలో పడేసింది. కుంగి పోయింది సీత. జీవఛ్ఛవమైపోయింది సీత.

“ఉద్యోగం వెలగబెట్టి ఊళ్ళేలింది. ఏం తప్పుడు పనులు చేసిందో సీతమ్మతల్లి!” కొడుకును వెనకేసుకుని అక్కసు వెళ్ళబోసింది అత్తగారు. లోగుట్టు తెలిసిన పెరుమాళ్ళు పెళ్ళాం నోరుమూసాడు. “ఆస్తులూ వ్యవహారాలూ వ్యాపారాలూ చాలా లావాదేవీలున్నాయి. బైటక్కక్కకు” ఆజ్ఞాపించాడు. కొడుకు రోగం కొంపలో అతనికొక్కడికే తెలుసు. ఒకానొక బలహీన క్షణంలో రాజారావు సీత చేతులు పట్టుకు ఏడ్చాడు “నావల్ల నీ జీవితం నాశనం అయింది” అని. చేసేదేవుంది? సీత మాటాడలేదు సీత బాధంతా మరో జీవి కూడా బలయిందే అనే. తండ్రి సలహాతో పెళ్ళినాటికే జబ్బుతో ఉన్న రాజారావు తన రోగం దాచుకుని, ముదరబెట్టు కుని ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. సీతకి ఐదోనెలొచ్చేసరికి రాజారావు మరణించాడు. “ఇంకీ తద్దినం మననెత్తినెందుకూ?” అని అత్తగారు ధ్వజం ఎత్తింది. మళ్ళీ పెళ్ళాం నోరుమూసాడు పెరుమాళ్ళు. ఎప్పుడో మరో బలహీనక్షణంలో రాజారావు తన పేరుమీదున్న ఆస్తి వాటా సీత పేరుమీద బదలాయించాడు. అది సీతని అత్తారింట్లోనే నిలబెట్టింది. “ఎలాగూ ఈమె కూడా పోయేదే! కష్టకాలంలో కోడల్నింట్లోంచి తరిమేసారని చెడ్డపేరు మనకెందుకూ? ఆకాస్త ప్రాణాలు రెండూ గుటుక్కుమనేదాకా ఉండనిద్దాం. మనకి మంచి పేరూ, మన ఆస్తి మనింట్లో మన పిల్లలకే” ఇదీ పెరుమాళ్ళు పథకం. భర్త తెలివికి జోహార్లు సమర్పించి, నోరుమూసు కుంది సీత అత్త. తండ్రీ కొడుకులూ అందరూ కలిసుండేలా మూడు అంతస్తుల ఇల్లు అది. ఎవరికి వారు విడిగా ఉన్నట్టూ ఉంటుంది అందరూ కలిసున్నట్టూ ఉంటుంది. ఉన్న ముగ్గురు కొడుకులు, ఒక్కగానొక్క కూతురూ కోసం కట్టించాడు పెరుమాళ్ళు. కింద అందరికీ వంటగది, భోజనాలగది, అతిధుల గదులు – పైన మూడంతస్తుల్లో ఎవరి అపార్ట్మెంటువారికీ, అన్నిటికీ పైన సీత కోసం సిక్ హౌసు లేక పెంట్ హౌస్ – లేక ఆదెమ్మ అన్నట్టు ‘పెంటహవుసు’! అంత చాణక్య బుర్ర కలిగిన పెరుమాళ్ళు కూడా కథ అడ్డం తిరుగుతుందని ఊహించలేక పోయాడు!

కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ కమల, సీత చెకప్ కి వెళ్ళినప్పుడు ఆయాని నర్సునీ కూడా బయటకు పంపి సీత దగ్గరగా వచ్చింది. భుజాల మీద చేతులేసి దగ్గరగా తీసుకుంది. సీత కళ్ళల్లో నీళ్ళు పెల్లుబికాయి. ఈమాత్రం ఆప్యాయం గా ఎవరైనా తనని స్పృశించి ఎన్ని యుగాలైందో! కమల నెమ్మదిగా అంది “సీతా నీ వైద్యం నాకింక చేతకాదు. నీకు వేరే ఎడ్రస్సిస్తాను అక్కడికెళ్ళు. నీకు బాగాఅక్కడ జరుగుతుంది” గుండె చిక్క బట్టుకుని సరేనని తలూపింది సీత. ఆవిడ ఇచ్చినఅడ్రసు పట్టుకుని వెళ్ళింది. అదో ప్రభుత్వ ఆసుపత్రి. అక్కడ ప్రభుత్వ డాక్టరు సీతతో చిన్నతనంలో స్కూల్లో చదివిన రాజేశ్వరి! సీత ఆనందంతో ఉక్కిరిబిక్కిరవు తూనే గుండె పగిలేలా ఏడ్చింది. రాజేశ్వరి ఓపిగ్గా ఓదార్చింది. సీతకు హెచ్ ఐ వి గురించి ఇంకా బాగా అర్ధమయ్యేలా చెప్పింది. ఎ ఆర్ టి మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దని హెచ్చరించింది. “అలిసి పోవడం, ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది, జాండిస్, దద్దుర్లు, మానసికబాధలు ఈ మందులకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. భయపడకు. భరించలేననుకుంటే నాదగ్గరకు రా. నేను పరిస్థితి సమీక్షించి సలహా ఇస్తాను. సొంత నిర్ణయాలు తీసుకోకు మందుల విషయంలో” ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. ఎన్నో హెచ్చరికలు చేసింది. ఎంతో ధైర్యం చెప్పింది. “ఎందుకొచ్చిన మందులు రాజేశ్వరీ! ఎలాగైనా పోవాలిసిందేకదా!” ఎండిపోయిన కళ్ళతో నిరాశగా అంది సీత. “ఛీఛీ. ఎప్పుడూ అలా నిరాశ చెందకు. నువ్వు ఇప్పటి వరకూ మందులకు చాలా బాగా రెస్పాండ్ అయ్యావు. నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటే జబ్బు ముదరదు. జీవిత కాలం పెరుగు తుంది. అబ్బాయైనా అమ్మాయైనా పుట్టబోయే చిన్నారిని కాపాడవలసింది నువ్వే. ఎవరికి తెలుసు? మన జీవిత కాలంలోనే మనిషి ఈ జబ్బునీ జయిస్తాడేమో! ఏమో కాదు. తప్పకుండా జయిస్తాడు. నీ చిన్నారి నీ కళ్ళముందు అభివృధ్ధి లోకి రావడం చూసినప్పుడు నీకీ నిరాశ నిస్పృహఉండనే ఉండవు”. రాజేశ్వరి మాటలు వింటుంటే సీత కళ్ళల్లో ఆశాదీపాలు వెలిగాయి. “పాప” “చిన్నారి” ఆ మాటలకే మనసు పులకించి పోతోంది. తనూ అందరు తల్లులలాగే మంచి రోజులుల చూస్తుందా? కొత్త ఆశ కొత్త కొత్త చిగుళ్ళు తొడిగింది.

రెండుమూడు సార్లు రాజేశ్వరి దగ్గరికి చెకప్ కి వెళ్ళొచ్చేసరికి సీతలో నూతనోత్సాహం కలిగింది. కానీ సీత అత్తకి మాత్రం ఒళ్ళు మండి పోయింది. “గవర్మెంటాస్పత్రికి పోతోందిట! మన పరువు మంట గలపడానికా ఏం? ఇంత బిల్లులు చెల్లించి అంత పెద్ద ఆస్పత్రిలో చూపిస్తే ఈవిడగారి బుధ్ధి బురదలోకే లాగుతోంది!” అంటూ చాలా రాధ్ధాంతం చేసింది. అప్పటికి పెరుమాళ్ళుకి కూడా ఓపిక నశించింది కాబోలు పెళ్ళాం నోరు అదుపు చెయ్య లేదు. వారంలో ఆత్త సీత కి నరకం చూపించింది. ఏ విషయం మీదా శాస్త్రీయ అవగాహన లేని, నేర్చుకుందా మని చూడని అత్తగారిని భరించిభరించి సీత కూడా విసిగి పోయింది. డాక్టర్ రాజేశ్వరి దగ్గర గోడు వెళ్ళబోసు కుంది. రాజేశ్వరి వెంటనే సలహా ఇచ్చింది . “నువ్వొచ్చి నాతో ఉండు సీతా!” అంది. నివ్వెర పోయింది సీత! “నీ మీద భారంగానా?” “భారం ఎందుకవుతావు? నీకు రావలసిన ఆస్తి, అదే – నీ భర్త వాటా నీకు ఇవ్వాలి కదా మీ మావగారు? నువ్వు నీ హక్కులేమీ వొదులుకోవాల్సిన అవసరం లేదు సీతా! ప్రయత్నిద్దాం. నన్ను నమ్ము. నువ్వు మా ఇంటికొచ్చెయ్. నామీద అనుమానాలు పెట్టుకోకు”. సీత రాజేశ్వరిని మనస్పూర్తిగా నమ్మింది. అత్తగారు పెడుతున్న నరక యాతన భరించే ఓపిక సీతకి ఇంక తగ్గి పోయింది. సీత శాశ్వతంగా అత్తగారిల్లు వదిలి రాజేశ్వరి దగ్గరికొచ్చేసింది. రాజేశ్వరి సీత చేత పెరుమాళ్ళుకి నోటీసిప్పించింది లాయరు సలహాతో.

ప్రసవసమయం వరకూ వరకూ కంటికి రెప్పలా, కన్న తల్లిలా కాపాడింది రాజేశ్వరి. అప్పుడు చూసింది సీత. తనకే కాదు రాజేశ్వరి తన లాంటి వారికి ఎందరికో సహాయం చేస్తుంది. ‘దేవుడు ఇలా మానవ రూపంలో అప్పుడప్పుడయినా రాక పోతే నిర్భాగ్యుల నెవరాదుకుంటారు?’ అనుకునేది సీత రాజేశ్వరిని చూస్తూ. ఎ. ఆర్. టి. మందులవలన హెచ్. ఐ.వి. తీవ్రత తగ్గడం గురించి అందరికీ చక్కని అవగాహన కలిగించి మందులు మానె య్య కుండా చూసుకునేది రాజేశ్వరి. సి.డి.4 కణాల సంఖ్య కై పరీక్షలు యించడం లో అప్రమత్తంగా ఉండేది. ప్రసవ సమయంలో నెవిరపైన్ మోతాదు సీతకి, జన్మించిన చిన్నారికి చుక్కల మోతాదుగా అదే నెవిరపైన్ ఇచ్చి సంరక్షించింది.

పెరుమాళ్ళు లోనూ కాస్త మానవత్వం మిగిలి ఉందో లేక ఈ మనిషి ఇంకెన్నాళ్ళు బతుకుతుందిలే తరవాత అంతా మనకే కదా దక్కేది అనుకున్నాడో గానీ ఎక్కువ పోరాటం లేకుండానే సీత కి రావలసిన ఆస్తి కాస్తా ఇచ్చేసాడు. పాప పుట్టే సమయానికి సీతకు చిన్న ఇల్లు, ఆమె జీవనానికి సరిపడా బ్యాంకు డిపాజిట్లు సీత చేతికి అందాయి. సీత ఆనందానికి అంతులేదు. సీత బాగా కోలుకునే దాకా తన దగ్గరే ఉంచుకుంది రాజేశ్వరి. తరవాత ఆమెకు సాయంగా ఒకమంచి ఆయాను కుదిర్చి, ఆమె ఇంటికి ఆమెను తీసుకెళ్ళి దింపింది.

ఆ ఇంట్లో అడుగుపెడుతున్న సమయాన సీత మనసులో కలిగిన ఆనందోద్వేగాలు వర్ణించడానికి ఏ భాషలోనూ పదాలు లేవు. పాపను ఉయ్యాల్లో పడుకోబెట్టి వచ్చి రెండు చేతులూ జోడించి మనసారా, దేవుడే కనిపిస్తే నమస్కరించినంత భక్తిగా రాజేశ్వరికి నమస్కరించింది సీత. “రాజేశ్వరీ! నువ్వే లేకపోతే నేనేమయి పోయేదాన్నో ఊహించడానికే భయం వేస్తోంది! నీ ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను.” ఉద్వేగంతో గొంతు బొంగురుపోతుండగా అంది సీత. సీత మాటలు విని కిలకిలా పసిపాపలా నవ్వింది రాజేశ్వరి. “తీర్చుకో గలవు సీతా. ఎన్నో జన్మలెత్తక్కర్లేదు. ఈ జన్మలోనే తీర్చుకోగలవు” అంది. సీత ఆశ్చర్యంగా చూసింది. “నేనా? ఎలా తీర్చుకోగలను?” “చెప్పనా? నీలాంటి నిర్భాగ్యులకు నువ్వు కరదీపిక వై నిలబడు. హెచ్. ఐ. వి. తో జీవితం ముగిసిపోదని చెప్పు. నువ్వు ఆరోగ్యంగా నిలబడి వాళ్ళు ఎలా ఆరోగ్యం కాపాడుకోవాలో విశదంగా చెప్పు. నీ పాపలాంటి పాపలకు నీపాపతో పాటు చదువు చెప్పించు. ఎంతమందికి చెయ్యగలిగితే అంతమందికే చెయ్యి. ఇదొక ఉద్యమంలా ఇదే నీ జీవితాశయంగా ముందుకునడు. ఇప్పుడు నువ్వే మార్గదర్శివి”. చిరునవ్వుతోఅంది రాజేశ్వరి. “ఇంత పని నేను చెయ్యగలనా?” “ప్రయత్నించు. ఫ్రయత్నం మొదలెట్టకుండానే అనుమానాలెం దుకు? నువ్వు ఒక్క అడుగు ముందుకు వెయ్యి. వెయ్యి మంది నీతో కలిసొస్తారు” చల్లటి చిరునవ్వుతోనే ఉత్తేజపరిచింది రాజేశ్వరి. సీత మనసులో కోటి ఆలోచనలు. తన దౌర్భాగ్యానికి తను ఏడుస్తూ కూచోకుండా తనకి ఎంతో స్ఫూర్తినిచ్చింది రాజేశ్వరి. “నేనూ ఈ ఉద్యమంలో..” మళ్ళీ భయం, సంకోచం. “నావల్ల జరుగుతుందా?” “ఎందుకు జరగదు? కుడి ఎడమైతే ఖచ్చితంగా పొరబాటే! కానీ ఆ పొరబాటుని సరిదిద్దడమే గెలుపు. నీవల్లనవుతుంది సీతా! అప్పుడు నువ్వే గొంతెత్తి పాడ తావు ‘ఓడిపోలేదోయ్’ అంటూ”.

– పోడూరి కృష్ణ కుమారి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో