తిమిరంతో సమరం

Mercy Margaret

Mercy Margaret

ఒకరినొకరం హత్తుకుని ఏడుస్తున్నప్పుడు,
ఇద్దరి కళ్ళు కన్నీటితో కొన్ని ఉదయాలు చూడని ప్రవాహ౦లా
గుండెను నీరుగారుస్తున్నప్పుడు,
నాకెందుకో తరుముకొస్తున్న చీకట్లతుఫానులో
కొట్టుకుపోతున్నాం అనిపించింది.

తప్పు నీదేనని నువ్వు నన్ను గట్టిగా హత్తుకుని
కన్నీటి సాక్షిగా క్షమాపణ అడిగినప్పుడు
కండోమ్ వాడని – పెళ్ళికి ముందటి నీ భయసంబంధం బహూకరించిన క్రిమి,
పెళ్లి తర్వాత ,నాలోకీ ప్రవేశించి, కొంత కాలాన్ని దొంగలించిందేమో కాని,
ఇద్దరికీ శిక్షవేసిన కాలాన్ని
నువ్వు ప్రాయశ్చిత్తంతో ప్రక్షాళనచేస్తున్నప్పుడు
నీ మీద నాకు కోపం ఎందుకు వస్తుంది?

హృదయాలతో మాట్లాడే దివ్యభాష ప్రేమ, మన దేహాలనే కాదు
మనసులను ఆత్మలను కలిపికుట్టే దారం ప్రేమ,
పల్లవి చరణాలుగా జీవితకాలం బంధాలను,
అనుబంధాలను అల్లుతూ సాగే పవిత్రగానం ప్రేమ.
పొరపాట్లను తప్పిదాలను కప్పిఉంచే ప్రేమ, దేదీప్యంగా వెలుగుతున్న హృదయాల్లో
జీవితం ఎంత అందంగా ఉంటుందో కదా ..!? అచ్చంగా మనలాగే.
అమ్మానాన్నల తోబుట్టువుల సహృదయుల ఆలింగనం లాగే …!! భగవంతుని
సాక్షాత్కరింపజేస్తూ మన వెంటేవున్నప్పుడు, మనం HIV తో చేసే పోరాటంలో ఒంటరెందుకవుతాం?
అవును అప్పుడు ఓటమి మనది కాదు, మనం పోరాడే HIV క్రిమిది..

కొన్నిఉదయాలే లెక్కలో మిగిలున్నాయని తెల్లకాగితం మీద నిర్ధారణగా పరుచుకున్న
‘HIV positive’ అనే అక్షరాలు అద్ద౦లామారి, ఆ గాజు నదిలోకి మనల్ని లాగినప్పుడు,
నాకింకా గుర్తు,
జీవనదులన్నీ వెనక్కి ప్రవహించినట్టు, లోపలి రసోద్రేకపు పాదరసపు వాగులు అడుగంటినట్టు
ఉక్కిరిబిక్కిరి చేసే చుట్టుకుంటున్న వలయాలలో,
మనం చిక్కుకుంటున్న సమయంలో ఏమని చెప్పను ?
జీవితం గడ్డిపువ్వని, గాలిబుడగని, విన్న ప్రవచనాల వర్షంలో కొట్టుకుపోతూ,
జీవితం ప్రశ్నలా ముడుచుకుని, కన్నీటిని అరచేతులకు తాగించి ఆసరా అడిగింది ఆ రోజు .

images

కానీ ..,
మనిద్దరం భయాన్ని వెనక్కి తన్ని
HIV కౌన్సిలింగ్ సెంటర్ కొచ్చాక, తరుముకొచ్చిన అనుమానాల చీకట్లన్నీ
ఒక్కొక్కటిగా తొలగిపోతుంటే, మళ్ళీ మనిద్దరి చేతులు ఎంత గట్టిగా పెనవేసుకున్నాయో,
అప్పుడే HIV ఓడిపోయింది ..!!

ఇక అప్పుడు,
మేఘాలు వీడిన గగనంలా, స్పష్టంగా తేరుకొని తెలుసుకున్నాం.
ఇదీ షుగర్ ,బీ పీ లాంటి దీర్ఘకాలవ్యాధేనని .
పోరాడాల్సింది శరీర వ్యాధినిరోధకశక్తిని హరించే HIV క్రిమితోనని.
‘ప్రియా ’, – ప్రియాలాంటి ఎంతో మంది మన ముందే HIV పాజిటివ్ అయినా,
పదిహేనేళ్ళుగా విజేతలుగా నిల్చుని అపోహలమీద, అనుమానాల మీద
తమ పోరాటాలతో జీవితం అంటే ఇదని నిరూపిస్తుంటే,
“సామాన్యులకంటే మనకే జీవితం అంటే ఏంటో మరెక్కువగా అర్ధమయినట్టు” అనిపించింది కదా !.
ఆ క్షణ౦ మనిద్దరం
జీవన దివ్వెల ఒత్తులను సరి చేసుకున్నాం కూడా .. !

ఇలా నీ కౌగిలిలో ఉండి చెబుతున్నా ఏది మారలేదు.
అప్పుడూ ఇప్పుడూ.. అప్పటిలాగే అదే ఆనందంతో మనం.

ఇక
ఒక్కో అడుగు ముందుకేద్దా౦..
ముక్కలయిన ఇంద్రధనస్సుని అతికించుకుంటూ,
చెల్లాచెదురైన ఆశలన్నీ కుప్పనూర్చి,
కోటి ఆశలకు కొత్తభాష్యం చెప్పుకుంటూ,
మూసిన మస్తిష్కపు పుస్తకాలను తెరిచి
జీవించబోయే ప్రతీ క్షణం కొత్తగా నిర్వచించుకుంటూ,
అందమైన జీవితానికిది అర్ధాంతర ముగింపుకాదని,
నిరాశామయ నిశ్శబ్ద ప్రాణ గ్రంధానికి వెలుగులు నింపి
విజేతల్లా
ముందుకు సాగే కాగడాలమవుదా౦.
HIV / AIDS లేని ప్రపంచాన్ని కాంక్షించి
ఆ రోజును యదార్ధంగా చూసి తీరేందుకు సంకల్పించుకుందా౦.

– మెర్సీమార్గరెట్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink
0 0 vote
Article Rating
3 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
vipraas
vipraas
5 years ago

ఈ సమరాన్నివైద్య శాస్త్రం ఏదో ఓనాడు నెగ్గుతుంది .

Vanaja Tatinei
5 years ago

మీ కవనం బావుంది మెర్సీ ! నిజంగా తిమిరంతో సమరమే ! బీతవహులైన పాజిటివ్ లకి ఆశావాదంతో వ్రాసిన ఈ కవనం ఎందరికో స్పూర్తినివాలి. అభినందనలు.

క్రిష్ణ వేణి
క్రిష్ణ వేణి
6 years ago

సందర్భానుచితమైన పోస్ట్ 😉 బాగుంది.