మానవ హక్కుల దినోత్సవం- డిసెంబర్ 10

జంతువుగా పుట్టినందుకు జంతువుకు కూడా జీవించే హక్కుంది. కానీ ఆ హక్కుల గురించి ఆ జీవికి తెలియదు. హక్కును సృష్టించిందీ మనమే! కాలరాసేదీ మనమే!మనిషిగా పుట్టినందుకు మనిషికీ కొన్ని హక్కులున్నాయి. ఈ హక్కులను కూడా సృష్టించింది మనమే….ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు కాలరాసేదీ మనమే!

మనకి మానవ హక్కుల గురించి తెలుసా?
ఈ నెల పదో తేదీన మానవ హక్కుల దినోత్సవం.
బాల్యం నుండి వృద్ధాప్యం వరకూ మానవ హక్కుల అణచివేత ఎలా జరుగుతుందో మనకు తెలియదా?
న్యాయాన్ని పొందడానికి అత్యాచారానికి గురైన మహిళలు కోర్టుల చుట్టూ దశాబ్దాల పాటు తిరగడం మానవ హక్కుల ఉల్లంఘన కాదా?
అసలు అత్యాచారమే మానవ హక్కులను కాలరాసే ప్రక్రియ కాదా?
జీవించే హక్కు అతి ముఖ్యమైనది….అసలు స్వేచ్చగా తమ ఆశలకు అనుగుణంగా జీవించగలిగే వ్యక్తులు ఎంతమంది?
వివక్ష లేని మానవ సమాజ నిర్మాణం అనే అత్యుత్తమ లక్ష్యంతో మానవ హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపబడుతుంది.
ఈ లక్ష్యాన్ని మన జీవితాల్లో ఆపాదించుకోగలుగుతున్నామా?
మన హక్కుల గురించి మనకు తెలిసి మసలుకుంటున్నామా?
మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు అనుభవించే వారిని అడిగితే తెలుస్తుంది.
భావ స్వాతంత్ర్యం కూడా మానవ హక్కుల్లో ఒక హక్కని ఎంత మందికి తెలుసు?
తమ భావాలను నిస్సంకోచంగా బయటకు చెప్పలేక నియంతృత్వాన్ని భరించే వ్యక్తుల హక్కుల పరిస్థితి ఏమిటి?
బయటికి అడుగు పెడితే తిరిగి ఇంటికి భద్రంగా వస్తామో, లేదో తెలియని మనకు సాంఘిక భద్రత ఉందా?
పౌరులందరికీ ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండే హక్కు నిజంగా ఉంటే, పనుల కోసం కాళ్ళరిగేలా కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం? బల్ల క్రింద చేతులు పెట్టే అధికారులను ఎందుకు పోషిస్తున్నాం?
ఆరోగ్యకరమైన ఆహారం, భద్రమైన ఇల్లు కలిగి ఉండడం మన హక్కైతే భారతదేశం పౌష్టికాహారం కొరవడిన దేశంగా ఎందుకుంది? ఇప్పటికీ సొంత గూడు లేని కోట్ల మంది ప్రజలు ఇక్కట్లు ఎందుకు పడుతున్నారు?
విద్యా హక్కు నిజంగా అమలు జరుగుతుంటే, బాల కార్మికత్వం క్రింద బాల్యం ఎందుకు హింసించబడుతుంది?
ప్రపంచదేశాలన్నింటిలోనూ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నది వాస్తవం.
సంపన్న దేశాల నీడలో, గ్లోబలైజేషన్ భూతాన్ని భరిస్తున్న వెనుకబడిన దేశాల్లో జరిగే మానవ హక్కుల ఉల్లంఘన చాప క్రింద నీరు లాంటిది.
దమన నీతి, దౌర్జన్యం ఎక్కడున్నా, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగి తీరుతుంది.
హక్కులు, బాధ్యతలు నాణేనికి ఉన్న రెండు ముఖాలు.
వీటిని ఎరిగి నడుచుకుంటే సరిపోదు, ఉల్లంఘనను అడ్డుకోవాల్సిందే!

 – విజయభాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, సమకాలీనం, , , , , , , , , , , , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
vali
vali
5 years ago

miru cheppedi akshara sathyam vijaya bhaanu gaaru . meerannatlu thelisi naduchukunte saripodu. maanava hakkulanu kaapadukovaalsi undi .