బోయ్‌ ఫ్రెండ్‌-2

001య్ ఆ పని మాత్రం చెయ్యకు కృష్ణా! మా అమ్మకు నేనాఖరి కొడుకుని.”
ఆమె నవ్వలేదు. ”నీ కెప్పుడూ వెధవ హాస్యాలే. ఎప్పుడూ నేను నీ దగ్గరనుండి సహాయం పొందడంతోనే సరిపోతోంది. ఎప్పుడైనా నీకు సాయం చెయ్యాలన్నా ఆ అవకాశం ఇవ్వవు నువ్వు నాకు.” ఆమె కంఠంలో మార్పుకు చలించాడు భానుమూర్తి.
”అది కాదు కృష్ణా! నీ దగ్గరనుండి సహాయం తీసుకోవడానికి నాకు మొహమాటమెందుకు చెప్పు? అదీగాక నిన్ను కలుసుకున్నాకే అందమైన జీవితమంటే ఏమిటో తెలిసింది నాకు. అంతకంటే నేను పొందగలిగిన పెద్ద సహాయమేముంటుంది నాకు?”
”అలా చూడకు. నిన్ను పిలవకూడదని కాదు” నాకే మనసేం బాగాలేక….” ఆమె కనుపాపలు వినకూడని మాట విన్నట్టు వేగంగా అటూ ఇటూ కదిలారు.
”మనసు బాగాలేదా?….ఏమైంది?”
భానుమూర్తి సన్నగా నవ్వి ‘ఏమీలేదు’ అన్నాడు.
అంతవరకు గమనించలేదు గానీ, అలిసి పోయినట్టు బరువుగా వాలిపోయున్నాయి అతని కనురెప్పలు. వాడిపోయిన అతని ముఖం వంక పరీక్షగా చూసిన కృష్ణమనసు స్నేహితుని పట్ల జాలితో నిండిపోయింది.
”పోనీ నీ మనసు బాగాలేనప్పుడైనా నన్ను పిలవకూడదా?”
ఆమెవైపు మమకారంగా చూస్తూ అన్నాడు భానుమూర్తి-
”నిన్ను పిలవ కూడదనేం లేదు కృష్ణా! నా మనసు బాగాలేనప్పుడు అమ్మ తర్వాత నువ్వే మొదట గుర్తు వస్తావు నాకు. కానీ అయిన దానికి కానిదానికి నిన్ను పిలవడం ఏం బాగుంటుంది చెప్పు? ఆ తర్వాత నువ్వు ఎవరిచేతనైనా మాటనిపించుకుంటే నన్ను నేను క్షమించుకోలేను.”
”పోనీ నిన్ను నేను అలవాటు ప్రకారం క్షమించేస్తాలే” అని నవ్వేసింది ఆమె. అతనూ ఆమె నవ్వులో నవ్వు కలిపేడు. కొద్ది సేపయ్యాక కుర్చీలో నుండి లేచి అతని ప్రక్కగా వచ్చి కూర్చుంటూ అతని చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయంగా అంది ఆమె-
”నీ బాధేమిటో నాతో చెప్పకూడదా భానూ!”
అతను అరక్షణం సేపు ఆమె కళ్ళల్లోకి చూసి అన్నాడు-
”చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేదు కృష్ణా! అక్క ఉత్తరం వ్రాసింది. అన్నలు ఆస్థుల పంపకం పెట్టుకున్నారట. అందులో ఏదో తగాదా లయ్యాయట…”
”నువ్వు వెళ్ళాలా అక్కడకు?”
”లేదు లేదు. వాళ్ళు ఎంత చేతికి ఇస్తే అంతే పుచ్చుకుంటాను.”
అసలివ్వకపోయినా పర్వాలేదు. కానీ వీటి మధ్య అమ్మ నలిగిపోతోంది. అందరినీ పక్షపాతం లేకుండా పెంచింది గదా, మరిప్పుడు వీళ్ళు పక్షపాతాలు కల్పించుకుంటుంటే….నాకు తెలుసు ఆమె తట్టుకోలేదు.” దూరానవున్న తన ముసలితల్లి కొరకు అతను వ్యధ పడుతుంటే అతని వైపు ఆరాధనగా చూస్తోందామె.
‘తన స్నేహితుడిది ఎంత ఆర్ద్ర హృదయం!’
”అన్నీ సర్దుకుంటారు. బాధపడకు భానూ! ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ జరిగేవే. కాకపోతే ప్రతిచిన్న దానికి నువ్వు కదిలిపోతున్నావు. నువ్వు కాస్త గట్టిపడాలి భానూ” అంతకంటే ఆమెకు ఏమి చెప్పి ఓదార్చాలో అర్థం కాలేదు. కానీ మమకారం, దయనిండిన ఆమె చూపులే అతనికి సానుభూతి చూపి ఓదార్చారు. ఆమె మరలా అంది-
”నువ్వు ఇంత పిచ్చివాడి వయితే ఎలాగ? చూడు చేతికందొచ్చిన మా అన్నయ్య మమ్మల్నందరినీ హఠాత్తుగా, ట్రీట్‌మెంట్‌ ఇవ్వడానికి కూడా అవకాశమివ్వకుండా వదలి వెళ్ళిపోతే మా అమ్మ తట్టుకోలేదూ?”
ఆమెను మధ్యలోనే ఆపుతూ గాభరాగా అన్నాడు భానుమూర్తి-
”వద్దు వద్దు. నువ్వది గుర్తు చేసుకోవద్దు. నేను బాగానే వున్నాను. లే,లే”
కొన్ని నెలల క్రిందట కృష్ణ కుటుంబం ఎదుర్కున్న పెద్ద కష్టం అతనికి తెలుసు. ప్రియమైన అన్నయ్య మృతి, కృష్ణ చిరునవ్వును కొంతకాలంపాటు ఎలా తుడిచిపెట్టేసిందో కూడా అతనికి తెలుసు. ఆమెను మరలా మనిషిని చెయ్యడానికి అతను చాలా ప్రయత్నించాడు. ఇప్పుడు మరలా ఆమె గతంలోకి జారిపోతుందేమోనని భయపడ్డాడు.
భానుమూర్తి భయం ఆమెకు అర్థమయింది. అతని భయాన్ని అబద్ధం చేస్తూ నవ్వేసింది. ఆ విచారకరమైన వాతావరణాన్ని మార్చాలనే ఉద్ధేశంతో అతనితో అర్ధం పర్థం లేని కబుర్లు చెప్తూ కూర్చుంది. ఉన్నట్టుండి ఏదో గుర్తు వచ్చిన దానిలా చటుక్కున లేచి బాల్కనీలోకెళ్ళి క్రిందికి వంగి క్రిందింటి పనిమనిషిని కేకబెట్టింది.
భానుమూర్తి ఆమె వెనకనే వచ్చి ”ఏం కావాలి కృష్ణా!” అన్నాడు.
మరలా మర్చిపోయిన కోపాన్ని గుర్తు తెచ్చుకుంటూ అంది కృష్ణ-
”నీ కసలు అతిధి అభ్యాగతి అని ఏమైనా వుందా? ఇందాకనగా మొత్తుకున్నాను. నాకు ఆకలేస్తోంది మొర్రో అని.
ఆమె మాటలకి హాయిగా నవ్వి పని కుఱ్ఱాడికి రెండు దోశలు ఆర్డరిచ్చి లోపలికెళ్ళి లైటు వెలిగించి కృష్ణను పిలిచాడతను.
”లోపలికిరా ఎండ పడ్తోంది.”
”నేను రాను. నా కిక్కడే బాగుంది.”
”నేనక్కడికి రానా?”
”ఏమి అక్కరలేదు. సుకుమారుడివి. ఎండ పడ్తే జ్వరమొస్తుంది. అక్కడే వుండు.” గట్టిగా అరచి అక్కడే నిలుచుండిపోయింది. సూర్యుడు అస్తమించాక పడమటి దిశ సంతరించుకుంటున్న అందాలు చూస్తూ.
”ఇదుగో దోశలొచ్చాయి రా” అని పిలిచేవరకు ఆమె కదల్లేదు.
తలవంచుకుని తింటున్న ఆమెను తినటం ఆపి తదేకంగా చూడసాగాడు భానుమూర్తి. ఐదడుగులా నాలుగంగుళాలు నిండైన విగ్రహం ఆమెది. గుండ్రటి ముఖం, ఆ ముఖంలో చల్లగానవ్వే ఆమె పెదాలు. మమకారం నింపుకున్న ఆమె కళ్ళు. ఆమె కోపంలాగే కొద్దిగా ఎత్తుగా అందంగా చెక్కివున్న ముక్కు అందాన్నిస్తాయి. ఆమె కనుపాప నలుపులోనూ, ఒంటి నలుపులోనూ చిత్రమైన ఆకర్షణ వుంది. ఆమె కరుకైన మాటల వెనక మార్ధవం తెలిసిపోతూ వుంటుంది. ఆమెను గురించి ఆలోచిస్తున్న అతను ఆమె మాటలకు ఉలిక్కిపడ్డాడు.
”ఏం, నీకు దంతసిరి లేదా? దోశ తినే యోగం లేదా?”
భానుమూర్తి గబగబ దోశ తినటం ప్రారంభించాడు. కానీ అతనికి వివిధమైన భావ సంఘర్షణల మధ్య తినాలనిపించడం లేదు. సగం తిని లేస్తున్న అతనిని ఆపేసింది కృష్ణ.
”ఏం? ఆ సగం దోశ ఎక్కువయిపోయిందా? అసలే పొద్దుటి నుండి ఉపవాసం కూడా.”
”నాకాకలిగా లేదు కృష్ణా”
”అయితే నేనూ తినను” ఆమె మొండితనం తెలిసిన భానుమూర్తి మరలా కూర్చున్నాడు. బలవంతంగా తింటున్న అతన్ని చూచి ఫక్కున నవ్వింది కృష్ణ.
”వద్దులే. తినకు.”
”నేను తింటాను” పంతంగా అన్నాడు భానుమూర్తి.
”నువ్వు తింటే ఇక నేను తిననయితే.”
”మిస్టర్‌ బ్రహ్మ నిన్ను ఏ మూడ్‌లో వుండి తయారుచేసాడో !” విసుగ్గా అన్నాడు భానుమూర్తి.
గలగల నవ్వేసింది కృష్ణ.
”ఇక లే ప్రొద్దుపోయింది దిగబెట్టి వస్తాను.”
”ఒక్క క్షణం తీరిగ్గా కూర్చోనివ్వవు కదా ! విసుక్కుంటూ లేచిందామె.
భానుమూర్తి రూమ్‌కి కృష్ణ ఇల్లు చాలా దగ్గర.
వెడల్పైన రోడ్ల వెంబడి నడుస్తున్న భానుమూర్తికి అతని అపూర్వమైన స్నేహితురాలి మొదటి పరిచయం తాలూకు కొన్ని ఘడియలు స్మృతి పధంలో మెదలసాగాయి.
రెండో ‘అవర్‌’ క్లాసు చెక్కేసి, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కాళ్ళక్రింద మట్టి కణాలతో తన ఆలోచనలన్నీ చెప్తూ హడావిడిగా నడుస్తున్న కృష్ణ చీర కుచ్చెళ్ళు తట్టుకుని ముందుకు పడబోయింది. కానీ మరుక్షణంలో ఎఱ్ఱమట్టిలో వుండవలసింది బోయి, ఒక వ్యక్తి తాలూకు బలమైన చేతుల్లో ఒరిగిపోయింది.
”క్షమించండి. అయామ్‌ సారీ” అంటూ ప్రక్కకు తొలిగి దారిచ్చాడతను. నిజానికి పాపం అతని దోషమేమి లేదు. తనను రక్షించిన రెండు బలమైన చేతుల తాలూకు వ్యక్తి ఎవరా?” అని తలెత్తిన కృష్ణకాంతి కళ్ళు ”ఓ! మీరా!!” అన్నట్టు మెరిసాయి ఒక్కక్షణం.
”అదేమిటి? రెండు భాషల్లో చెప్తేగాని నేను క్షమించననుకున్నారా ఏమి?” ఆమె పెదాలు నవ్వును దాచుకుంటున్నాయి. హైదరాబాద్‌ ఆడపిల్లల చొరవ, చిలిపితనం అతనికేం క్రొత్తకాదు. కానీ ఆ పిల్ల కళ్ళల్లో చిలిపితనమే కాదు, అపూర్వమైన శక్తి ఏదో అతనిని ఒక్కక్షణం కట్టేసి అక్కడే నిలబెట్టేసింది.
”మీరు తెలుగువారని నాకు తెలియదు.”
”అయితే సరే. మిమ్మల్ని క్షమించినట్లే. ఇక వెళ్ళివస్తా.”
అంత దగ్గరగా, అంత చనువుగా మాట్లాడుతున్న, నిరాడంబరురాలైన ఆ పిల్లను నిలిపి ఇంకొద్ది సేపు మాట్లాడాలనిపించింది అతనికి. మూడు సంవత్సరాల హైదరాబాద్‌ జీవితంలో అమ్మాయిలలో గాని అబ్బాయిలలో గాని ఎవ్వరూ స్నేహ పాత్రులుగా అతనికి అన్పించలేదు. ఆడంబరమైన వేషాలు, కృత్రిమమైన స్నేహాలు అతనికి గిట్టవు. అందుకే సుదీర్ఘమైన మూడు సంవత్సరాల కాలం తన వెనగ్గా అతనిని ఒంటరిగానే నిలబెట్టింది.
”భలేవారే మీరు! అసలు దోషం మీది. క్షమించమని అడగాల్సింది మీరు. మిమ్మల్ని రక్షించబోయి నా చేయి నొప్పెడ్తోంది కూడానూ…” అతనిని మధ్యలోనే ఆపుతూ అంది ఆమె-
”నేను మిమ్మల్ని రక్షించమన్నానా? మీరే హీరో లాగ పట్టుకున్నారు. ఇప్పుడు చెయ్యి నొప్పెడ్తే అందుకు బాధ్యురాలిని నేనా?”
”నేను పట్టుకోకపోతే మీరు అన్యాయంగా పడిపోయుందురు. ఇదేం న్యాయంగా లేదు. మీరు క్షమించమని అడిగేయండి” అన్నాడు సన్నగా రాజీపడే ధోరణిలో.
”నేను పడిపోతే మీకేం భానుమూర్తిగారూ!”
అతని వేళ్ళు జుట్టులోకి పోయాయి. అతనికి ఆశ్చర్యం వేసినప్పుడు, అమితమైన వ్యధ కలిగినప్పుడూ జుట్టులోకి వేళ్ళుపోనిచ్చుకోవడం అలవాటు. ఎవరైనా క్రిందనుండి తల బాగా పైకెత్తి చూస్తే భానుమూర్తి తలమిద రింగుల జుట్టు అందంగా కన్పిస్తుంది. దానికి ఒక ఆకారము లేదు, పాపటా లేదు. ఊలు విప్పేసి కుప్పగా పోసినట్లుందది.
”మీకు నా పేరెలా తెలుసు?”
ఓహ్‌! క్లాస్‌మేట్స్‌ పేర్లే తెలియనంత అమాయకురాలినంటారా నేను!”
అతను కళ్ళు విప్పార్చుకుని ఆమె వైపు ఆశ్చర్యంగా, నిశితంగా చూడసాగాడు.” ఈనాడు తనకింత నచ్చిన అమ్మాయి, హఠాత్తుగా దొరికిందనుకున్న ఈ స్నేహితురాలు తన క్లాసులో వున్న పదిహేను మంది అమ్మాయిల్లో ఒకటా? నిరీక్షించే తన చూపుల కవతలగా అపరిచితంగా ఎలా వుండిపోగలిగింది! అతని అవస్థ చూచి కృష్ణకాంతి కిలకిల నవ్వసాగింది. ”ఇంక అదే పనిగా ఆలోచించకండి. మీకు చస్తే నేను గుర్తురాను. ”అని ఇంకా నవ్వ సాగింది. కృష్ణ స్వతహాగా అంత కలుపుగోలు మనిషి కాదు. త్రోవలో కన్పించిన ప్రతి వ్యక్తితో పరిచయం పెంచుకుని పరాచకాలాడే ప్రకృతి కాదామెది. కానీ భానుమూర్తి అంటే ఆమె హృదయపు అట్టడుగు పొరల్లో – అభిమానముంది. రెండు సంవత్సరాల క్రితం తను టెన్త్‌ క్లాస్‌ చదివే రోజుల్లో మొదటి బెంచీలో మొదటి సీట్లో ఒంటరిగా కూర్చుని శ్రద్ధగా పాఠం వింటూ అప్పుడపుడూ పరధ్యానంలో పడిపోయి శూన్యంలోకి చూసే భానుమూర్తి అంటే ఆమెకి చిత్రమైన ఆసక్తితో పాటు, ఆత్మీయతతో కూడిన అభిమానముండేది. తన చుట్టూ గిరిగీచుకుని, అందులో నుండి తనూ బయటకు రాక, ఎవ్వరినీ అందులోకి ప్రవేశించనీయని ఆ అబ్బాయితో పరిచయం పెంచుకోవడం ఆమెకు చేతకాలేదు.ఆ సంవత్సరం పరీక్ష పోవడంతో కృష్ణకాంతి స్మృతి పధంలో నుండి బాటసారి లాటి భానుమూర్తి తప్పుకున్నాడను కోవచ్చు. మరలా హఠాత్తుగా కన్పించిన అతనితో పరిచయాన్ని పెంచుకునే అవకాశాన్ని ఆమె వదులు కోవాలనుకోలేదు. ఆశ్చర్యంగా కుతూహలంగా తనవైపే చూస్తున్న అతనిని ఇక ఏడ్పించాలనిపించ లేదామెకు. చిలిపితనమూ, స్నేహ భావమూ సమపాళ్ళలో కలిసిన కంఠంతో అంది ఆమె.
”టెన్త్ క్లాస్‌లో మీ క్లాస్‌మేట్‌ని నేను”
”గుర్తు రాలేదా! నా పేరు కృష్ణకాంతి” అంది అతని వంక నిశితంగా చూస్తూ. తనతాలూకు జ్ఞాపకం అతని స్మృతి పథంలో ఎక్కడైనా వుందేమో తెలుసుకోవాలని ఆమెకు ఆతృతగా వుంది.
కొన్ని క్షణాల తర్వాత తను ఆశించిన భావం అతని కళ్ళల్లో కన్పించక నిరాశపడి చూచి వెను తిరగబోతున్న కృష్ణకాంతిని ఆపాలనీ, మరికొన్ని నిముషాలు తన వ్యధలనన్నింటినీ మర్చిపోయి ఆ చిలిపి పిల్లతో గడపాలనీ బలంగా అన్పించింది అతనికి. చటుక్కున ఆమె ముందుకు వచ్చి-
”అదేం వెళ్ళిపోతున్నారు? నా బాకీ తీర్చకుండా” అన్నాడు.
”బాకీ….!” తన నిరాశను మర్చిపోయి కళ్ళు పత్తి కాయలంత చేసుకుంది కృష్ణ.
”ఆ! క్షమించమని అడగండి. లేకపోతే నాకు మీరు ఋణపడిపోతారు.”
”మీకు ఋణ పడడం నాకిష్టమే గాని నన్ను వెళ్ళనివ్వండి” తెచ్చి పెట్టుకున్న గాంభీర్యం అది. తొలి యవ్వనం తాలూకు అల్లరి అది.
”మీరు నన్ను క్షమించమని అడగందే నేనిక్కడ నుండి వెళ్ళను.”ఆమె గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నదని ఆమె కళ్ళు అతనికి భరోసా ఇచ్చాయి.
”అయితే మరీ మంచిది. నాకు సినిమా టైమయింది నే వెళ్ళొస్తాను.

మీకూ క్లాసు టైమెట్లాగూ అయిపోయింది. అలా గడ్డిలో కూర్చుని ప్రకృతిని పలకరిస్తూ వుండండి, లాస్ట్‌ హవర్‌ కలుసుకుందురు గాని” అలా అనేసి కదులుతున్న ఆమెతో ఆఖరి ప్రయత్నంగా నీరసించిన స్వరంతో అన్నాడు-

”అయితే మిమ్మల్ని క్షమించే అవకాశం నా కెప్పుడొస్తుందంటారు?”

(ఇంకా ఉంది )

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

21
ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో