ఎనిమిదో అడుగు – 21

Anguluri Anjani devi

Anguluri Anjani devi

‘‘ ఓ.కె. స్నేహిత! రా! వెళ్దాం!’’ అంటూ లేచి స్నేహిత చేయిపట్టుకొని లేపింది చేతన. ఇద్దరు కలిసి చేతన కారు వైపు వెళ్లారు.

కారును అవలీలగా నడుపుతోంది చేతన.
‘‘ ఈ కారును అన్నయ్య నాకు గిఫ్ట్‌గా కొనిచ్చారు. ఎందుకో తెలుసా! నేను డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ అయినందుకు….’’ అంది చేతన.స్నేహితకి చేతన చాలా కొత్తగా, నిండుగా, గంభీరంగా, గుంభనగా, కత్తి చివరన తళుక్కున మెరిసే మొనలా కన్పిస్తోంది. ఇంకో కోణంలో చూస్తే కష్టపడి అంచెలంచలుగా ఎదిగి కూడా ఒదిగివుండటంలో మంచి నేర్పరితనం ప్రదర్శిస్తున్నట్లు అర్థమవుతోంది. ఆదిత్యకి, చేతనకి చాలా దగ్గర పోలికలు వున్నాయి. ఎంతయినా ఒక తల్లి పిల్లలు కదా!
చేతన అవసరాన్ని బట్టి స్టీరింగ్‌ తిప్పుతూ, రోడ్డు వైపు చూస్తూ..

‘‘ స్నేహితా! ప్రభాత్‌ను చూడక చాలా రోజులైంది. ఈ జాబ్‌లో చేరాక నేను బిజీ కావటమే కారణం. ఫోన్లో మాట్లాడుకోవటమే… ఒకరకంగా ఇద్దరం బిజీ అనే చెప్పాలి….’’ అంది.పని లేని వారు కూడా ఏంపని చెయ్యాలన్న ఆలోచనలో బిజీగానే వుంటారు. కానీ కొన్ని ‘‘పనుల బిజీ’’ మనుషుల్ని మణిదీపాలై నిలబెడతాయి, కరదీపికలై బాసిల్లేలా చేస్తాయి. కొన్ని లక్ష్యాలు పెట్టుకొని, ఆ లక్ష్యాల కోసం ప్రయత్నించి సాధించిన వాళ్లలో ప్రభాత్‌, చేతన వున్నారని అర్థమై అభినందనగా చూసింది స్నేహిత.

‘‘ స్నేహితా! నువ్వు మరీ ఇంత డల్‌గా వుండాల్సిన అవసరం లేదు. సమస్యలు నాకు లేవా? నిద్రలేచినప్పటి నుండి మళ్లీ నిద్రపోయేంత వరకు నా విధినిర్వహణలో నేను తిరిగే జనారణ్యాన్ని నువ్వు చూస్తే నిజంగా నీకు కళ్లు తిరుగుతాయి. మా డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్స్‌ కూడ డాక్టర్స్‌ లాగే 24 గంటలు సేవ చెయ్యాలి. మా సేవ ప్రజలకి అంత అవసరం. ఎక్కడ ఏ మందుల షాపులో ఏం జరిగినా వెంటనే అటెండ్‌ కావాలి. మాది మామూలు సర్వీసు కాదు, ఎమర్జన్సీ సర్వీస్‌… ముఖ్యంగా మేము నకిలీ మందులు, నాసిరకం మందులు మెడికల్‌ షాపుల్లో లేకుండా చూసుకోవాలి. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే మందులు కన్పిస్తే వెంటనే తగలబెట్టెయ్యాలి….’’ అంది.

చేతనలో ఏకాగ్రతను మించిన శ్రద్ధ కన్పిస్తోంది. శ్రద్ధ ఒక అద్బుత శక్తి. అది ఎక్కడ వ్యాపిస్తే అక్కడ చైతన్యం వుంటుంది. చేతన చైతన్యానికే చైతన్యంలా డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌గా అన్పిస్తోంది.‘‘ అయినా కానీ నువ్వు చెప్పే పనులను ఆడవాళ్లం చెయ్యగలమా? అసలు నువ్వీ జాబ్‌ చేస్తున్నావంటేనే నాకు ఆశ్చర్యంగా వుంది.’’ అంది స్నేహిత.చేతన సన్నగా నవ్వి… ‘‘ఇప్పుడు అన్నిచోట్ల ఆత్మస్థైర్యం వున్న ఆడవాళ్లే ఎక్కువగా వున్నారు. అలా వుండటానికే ప్రయత్నిస్తున్నారు. ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు, బావిలో కప్పలు అన్న బిరుదుల్ని మరుగునపడేలా చేసి వ్యోమగామిగా ఎదిగి తమకు తాము ప్రూవ్‌ చేసుకుంటున్నారు…. పాద దాసీలుగా పడివున్న వాళ్లే పాలక వర్గాధినేతలు అవుతున్నారు… అక్షర జ్ఞానంతో అధికార పీఠం అందుకుంటున్నారు….. కావ్య నాయికల్లా అందంగా కన్పిస్తూ కూడా అన్ని రంగాల్లో ఆరితేరిన ధీరల్లా కొంగు బిగిస్తున్నారు…. ఆధారపడి బ్రతకడమే కాదు ఆధారమివ్వగలమని నిరూపించుకుంటున్నారు…. లోకమెరుగని వాళ్లు కూడా లోకాలు మెచ్చే మేధావులవుతున్నారు… ఉరుములకు బెదిరిన రోజుల్ని మరిచి ఉద్యమాలు నడిపే ఉప్పెనలవుతున్నారు…. ఇదంతా మన ఆడవాళ్లు కొందరిలో వచ్చిన మార్పు. కానీ ఈ మార్పు వెనుక మౌనంగా కురిసిన కన్నీటి తడి తప్పకుండా వుంటుంది. తుడిచేవాళ్లు లేని నిస్సహాయత వుంటుంది’’అంది చేతన.

స్నేహిత ఆలోచిస్తోంది. చేతన చెప్పిన వాళ్లలో ఒక్కరిలా అయినా తను కాగలదా? పెళ్లయ్యాక కన్నీరు కార్చటం తప్ప తనకింకేమైనా తెలిసిందా? కనీసం తనకో వ్యక్తిత్వం వుందని, అస్థిత్వం వుందని… ప్చ్‌! లేదు. అంతా ఎడారిలో కన్నీటి యాత్రలాగే సాగింది, సాగుతోంది.ఎడమ చేయి స్నేహిత మిాద వేసి… ‘‘స్నేహా! మనం మనుషులం. రాతి నేలలో మొక్కలా చొచ్చుకొని రావాలి. మనకేం కావాలో తెలుసుకోవాలి. నిత్యం మన ఆలోచనలు మనవే కావాలి. ఆత్మన్యూనతా భావాన్ని జయించాలి. నిండుగా బ్రతకాలి. నిర్బయంగా బ్రతకాలి. రోజుకి పదిసార్లు చావొద్దు. ఇంకొకళ్లని చంపొద్దు. మనకు నచ్చిన పని మనకి హాని చెయ్యనది అయినప్పుడు నిస్సంకోచంగా చెయ్యెచ్చు… అప్పుడే మనం పరమానందం స్థాయినుండి బ్రహ్మానందం స్థితికి చేరుకుంటాం.’’ అంది చేతన.

‘‘చేతనా ! నిన్ను చూస్తుంటే సంతోషం వేస్తోంది. చదువు, హోదా, మనిషిని ఇంత గొప్పగా ఎదిగేలా చేస్తుందా? ఇంత ఉన్నతంగా చూపిస్తుందా అని ఆశ్చర్యంగా వుంది.’’ అంది స్నేహిత.‘‘ ఎంత ఎదిగినా ఎవరికి ఏం కావాలో అది అందివ్వలేనప్పుడు మనలో ఎంత ప్రతిభ వున్నా ఎంత సామర్థ్యం వున్నా అది కురవని మేఘంలా, కూయని కోయిలలా,పరిమళం లేని తోటలా, ప్రేమలేని జీవితంలా నీర్జివమైపోతుంది.’’ అంది కవితాత్మకంగా చేతన.
ఎంతయినా ఆదిత్య చెల్లెలు కదా! మాటల్లో ఆ మాత్రం పద ప్రయోగం లేకుండా వుంటుందా అనుకుని మౌనంగా వింటోంది స్నేహిత.

అంతలో డా॥ప్రభాత్‌ హాస్పిటల్‌ రాగానే కారాపింది చేతన.స్నేహిత కారు దిగి ఆ హాస్పిటల్‌ వైపు చూసి ఆశ్చర్యపోతూనే లోపలికి అడుగుపెట్టింది. ఆ తర్వాత హాస్పిటల్‌లో నడుస్తూ చుట్టూ కలియజూసింది. ఆ హాస్పిటల్‌ అత్యంత ఆధునికంగా, పేషంట్లకి అన్ని రకాల సౌకర్యాలతో చూడగానే వైద్య రంగం ఎంత అభివృద్ధిలోకి వచ్చిందో తెలిసిపోయేలా వుంది.ప్రభాత్‌ది స్వతహాగా డెడికేటెడ్‌ మైండ్‌ అవటం వల్ల అభివృద్ధి అనేది చాలా వేగంగా పద్దతిగా జరిగింది. అక్కడున్న రోగుల్ని, ఆ వాతావరణాన్ని చూస్తుంటే మనిషి తాము ఎంచుకున్న రంగంలో వాయువేగంగా దూసుకుపోవటం అంటే ఏమిటో కళ్లముందు ప్రత్యేక్షమవుతోంది. అప్పుడే ఓ.పి. అయిపోయినట్లుంది. అక్కడ కూర్చుని వున్న నర్స్‌ టి.వి.ని మ్యూట్‌లో పెట్టుకొని చూస్తోంది. అక్వేరియంలోని చేపపిల్లలు ఆగి, ఆగి కదులుతూ తమాషా చేస్తున్నాయి. అప్పుడప్పుడు మనుషులు నడుస్తున్న చప్పుడు తప్ప ఎలాంటి సందడిలేని ఆ హాస్పిటల్‌ వాతావరణం రోగులపాలిట దేవాలయ ప్రాంగణంలా వుంది.

 చేతన స్నేహితతో కలసివస్తున్నట్లు ముందుగా కాల్‌ చెయ్యటం వల్ల ప్రభాత్‌ ఓ.పి. అయ్యాక అదే చెయిర్లో రిలాక్స్‌గా కూర్చుని వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు.చేతన, స్నేహిత నేరుగా లోపలకివెళ్లి డా॥ప్రభాత్‌ని విష్‌ చేసి ఎదురుగా కూర్చున్నారు.ప్రభాత్‌ తన టేబుల్‌ మీాద వున్న పేపర్‌ వెయిట్‌ను చేతితో కదిలిస్తూ, దాన్నే దీక్షగా చూస్తూ….‘‘చెప్పు! స్నేహితా! ఏంటి ప్రాబ్లమ్‌? చేతన ఎప్పుడు కాల్‌ చేసినా నీ టాపిక్‌ తెచ్చి, నీ గురించి బాధపడ్తూనే మాట్లాడుతుంది…..’’ అన్నాడు.స్నేహిత కాస్త తలవంచుకొని….‘‘సర్‌! నా ప్రాబ్లమ్‌ నాకు పిల్లలు పుట్టకపోవటం… కానీ మా అత్తగారు పిల్లల కోసం నా చేత చేయించే పూజలకి, వ్రతాలకి విసిగిపోయాను. చుట్టు పక్కల వాళ్ల చూపుల మాటల దాడికి ఏ బాణాలు, చాకులు, ఈటెలు, గొడ్డళ్లు సరిపోవటం లేదు. అంత పరుషంగా, నిర్దాక్షిణ్యంగా నన్ను బాధపెడ్తున్నారు. ఈ బాధతో నాకు సరిగా నిద్రపట్టడం లేదు. డాక్లర్ల ప్రిష్కిప్షన్‌ లేనిదే నిద్రకు మాత్రలు ఇవ్వమంటున్నారు మందుల షాపుల వాళ్లు…. బహుశా డాక్టర్లు కూడా నేను అడిగినన్ని రాసివ్వరేమో! మీరు నాకు తెలిసిన డాక్టర్‌ కదా! నా బాధను అర్థం చేసుకొని నిద్రమాత్రలు ఇస్తారని వచ్చాను. ఇవ్వండి సర్‌! ప్లీజ్‌! ’’ అంది స్నేహిత.

పక్కనే కూర్చుని వింటున్న చేతన ఆశ్చర్యంతో ఉలిక్కిపడి స్నేహిత భుజంపై చేయివేసి తన వైపుకి తిప్పుకుంటూ… ‘‘ ఏ పిచ్చీ! నిన్నిక్కడికి తీసుకొచ్చింది ఇందుకా? ఇందుకేనా నన్ను ప్రభాత్‌ దగ్గరకి తీసికెళ్లమన్నావు? ఇదేనా నువ్వు ప్రభాత్‌తో చెప్పుకుంటానన్నావ్‌!’’ అంటూ ఆమె భుజాన్ని నొక్కి పట్టుకొంది చేతన.స్నేహితకి భుజం నొప్పిగా వుంది. ఓర్చుకుంటూ ‘‘ నీకేం తెలుసే నా బాధ! ఇంటా బయటా అందరు కలసి నన్ను సామూహిక హత్య చేసేలావున్నారు. పిల్లలు లేకపోవటం కొరతే, కాదనను, కానీ ఇంతలా శిక్షించాలా?’’ అంది.

చేతన నచ్చ చెబుతున్న దానిలా చూస్తూ….‘‘ ఏదైనా ఒకటి లేనప్పుడు అది కొరతే కదా! అక్కడ వేలు పట్టేంత స్థలం వున్నట్లే కదా! కొరతను కొరతలాగే రిసీవ్‌ చేసుకో… ప్రపంచంలో ఏదీ పరిపూర్ణం కాదు. అసలు నీకున్న లోపం లాగే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం వుంటుంది. దాన్ని పెద్దది చేసి చూసే వాళ్లను పట్టించుకోవద్దు. బాధపడొద్దు. హాయిగా కళ్లు మూసుకొని నిద్రపో. ప్రభాత్‌ దీనికి అరచి గీపెట్టినా స్లీపింగ్‌ టాబ్లెట్లు ఇవ్వకు…’’ అంది చేతన.

ప్రభాత్‌ వాళ్లిద్దర్ని చూస్తూ…. ‘‘స్నేహితా! నీ ప్రాబ్లమ్‌ అంత పెద్దదేం కాదు, ప్రతి దానికి సొల్యూషన్‌ వున్నట్లే దీనిక్కూడా వుంది. నేనొక డాక్టర్‌ అడ్రస్‌ యిస్తాను. నువ్వు మిా వారిని తీసికెళ్లి ఆ డాక్టర్ని కలువు…’’ అంటూ ఆ డాక్టర్‌ గారి విజిటింగ్‌ కార్డు ఇచ్చాడు ప్రభాత్‌.

స్నేహిత ఆ విజిటింగ్‌ కార్డు తీసుకొని పేరు చదివింది.చేతన స్నేహిత ముఖంలోకి చూస్తూ….‘‘ఇంకేం! సరిపోయిందిగా ప్రాబ్లమ్‌ గాన్‌! నవ్వవే.. ’’ అంది. స్నేహిత నవ్వితే చూడాలనివుంది చేతనకి….స్నేహిత నవ్వి `ప్రభాత్‌కి ‘థ్యాంక్స్‌’ చెప్పి… కుర్చీలోంచి లేచి ‘‘చేతనా! నువ్విక్కడేవుండు. ఇప్పుడే వస్తాను బయట మనం వచ్చేముందు నాకు తెలిసినావిడ కన్పించి ఒకసారి మాట్లాడిపో అన్నట్లు చూసింది…’’ అంటూ బయటకెళ్లింది.

అక్కడ స్నేహిత కోసం ఎదురు చూస్తూ ఒక నలబై సంవత్సరాల స్త్రీ నిలబడివుంది. మానసిక వికలాంగుడైన తన ఏడు సంవత్సరాల కొడుకును బెంచిమిాద పడుకోబెట్టుకొని వుంది.స్నేహితను చూడగానే ‘‘స్నేహితా! బాగున్నావా? మిావారు, మిా అత్తగారు, మామగారు బాగున్నారా?’’ అంటూ ప్రేమగా పలకరించి, దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా నిమిరింది.ఆ ప్రశ్నలన్నింటికి ఒకే ఒక్క తల వూపుతో సమాధానమిచ్చి ‘‘ఎలా వున్నావు పిన్నీ! బద్రీకి మాటలొస్తున్నాయా?’’ అంది స్నేహిత.

‘‘ ఇంకా లేదు స్నేహితా! ఇంత వయసొచ్చినా మనిషిని గుర్తు పట్టలేకపోతున్నాడు. ఇప్పటికీ నాకు వాడు పొత్తిళ్లలో పసివాడే… డా॥ ప్రభాత్‌ గారి దగ్గరకి అప్పుడప్పుడు పారిన్‌ డాక్టర్స్‌ వస్తుంటారు. కనీసం వాళ్ల ట్రీట్‌మెంట్‌ ద్వారా అయిన బద్రీ మామూలు మనిషి అవుతాడని ఆశ…. కానీ అంత డబ్బు నా దగ్గర లేకపోయినా ప్రభాత్‌ గారి దయార్థహృదయం నాకు ధైర్యాన్నిస్తోంది. ఏం చెయ్యను చెప్పు! విధి రాత ఇలా వున్నప్పుడు….’’ అంది.ఆమెను చూస్తుంటే జాలిగా వుంది స్నేహితకి…ఆమె తన కళ్లముందే పిల్లల కోసం చాలా కాలం ఎదురు చూసి, చూసి చివరకి ఈ బద్రీని కన్నది…

ఒకరోజు ‘‘స్నేహా! పిల్లల కోసం నేను అన్ని రకాల మందులు వాడాను. ఆయుర్వేదం మందులు కూడా వాడాను….. రావి చెట్టూ, వేప చెట్టూ కలిసి వున్నచోట 28 సార్లు ప్రదక్షిణలు చేశాను. ఎందుకంటే రావి చెట్టు పురుష అంశం అయితే వేపచెట్టు స్త్రీ అంశం కావటం వల్ల వాటి చుట్టూ తిరిగినప్పుడు మన శరీరం వాటి నుంచి ఆమ్లజనితము ఇట్లే గ్రహిస్తుందని ఎవరో చెప్పగా విని. అలా ఎక్కువ రోజులు ప్రదక్షిణలు చేస్తే గర్భదోషాలు పోతాయని, వాటిపై నుంచి పడిన సూర్యకిరణాల వల్ల గర్భకోశ శక్తి పెరుగుతుందని….

ఆ తర్వాత రామేశ్వరం దగ్గర శ్రీరాముడు నిర్మించిన ధనుష్కోటి వద్ద స్నానం చేస్తే ` అక్కడ నీటిలో బంగారము,వెండి, పాదరసము, అల్యూమినియం ఎక్కువగా వుండి అక్కడ స్నానం చెయ్యటం ద్వారా చర్మపు రంద్రముల నుంచి ప్రవేశించి గర్భం వచ్చే అవకాశాలు వున్నాయని వైద్యశాస్త్రము చెబుతుందంటే తెలుసుకొని అక్కడికెళ్లి సేతు స్నానము చేసి వచ్చాను. ఇదిగో ఇన్నాళ్లకి నా కడుపు పండిరది.’’ అనటం గుర్తొచ్చి బద్రీ తలను నిమిరి ఆ బాబు ఎటు చూస్తున్నాడో తెలియక….

‘‘ పిన్నీ! ఈ హాస్పిటల్లో ఇంకా ఎన్ని రోజులు వుంటావు?’’ అంది స్నేహిత.
‘‘ ఈ రోజుతో ట్రీట్‌మెంట్‌ అయిపోతుంది స్నేహితా! ఇంటికి తీసికెళ్లి బద్రీకి మంచి తిండి పెట్టుకోమని చెప్పారు డాక్టర్‌ గారు! నాకెందుకో బద్రీ ఎప్పటికైనా మామూలు మనిషై కంప్యూటర్‌ ముందు కూర్చుని వర్క్‌ చేసుకుంటూ గొప్పవాడవుతాడని ఆశగా వుంది.’’ అంది.

స్నేహిత వెంటనే వంద రూపాయల నోట్లు కొన్ని బద్రీ జేబులో పెట్టి… ‘‘పిన్నీ! బద్రీని నువ్వెంత కష్టపడి కన్నావో నాకు తెలుసు. ఏ బిడ్డ ఏ తల్లికి ప్రాప్తమో! ఏతల్లి ఏ బిడ్డకు ప్రాప్తమో! ముందు తెలియదు. అది విధిలీల… కానీ నువ్వు బద్రీ మిాద పెట్టుకున్న ఆశ, పెంచుకున్న ప్రేమ నన్ను కదిలించాయి. నిజానికి కొందరు తల్లులు రాబడిని, ఫలితాలను దృస్టిలో పెట్టుకొని, బయట పనులు వెతుక్కొని తమ పిల్లల్ని చిన్న వయసులోనే హాస్టళ్లలోవుంచుతున్న ఈరోజుల్లో బద్రీని నువ్వింత బాధ్యతగా చూసుకుంటుంటే ` నీలోని మాతృమూర్తి పాదాలను తాకాలని వుంది నాకు….’’ అంటూ ఆమె కాళ్లవైపు వంగబోతుంటే సున్నితంగా వారించి, స్నేహిత కడుపుపై ప్రేమగా చెయి ఆన్చి….

‘‘ఆమధ్యన అమ్మ చెప్పింది స్నేహితా! నీకింకా పిల్లలులేరని అవునా?’’ అంది.అవునన్నట్లు తలవూపింది స్నేహిత.‘‘పిల్లలు పుట్టకపోవటానికి కారణాలు తెలుసుకోకుండా పూజల పేరుతో ఉపవాసాలుంటే మన ఆడవాళ్లలో ముందుగా వచ్చేది వంధ్యత్వం. అంటే పిల్లలు పుట్టకపోవటం… ఆ తర్వాత పనుల ఒత్తిడి వల్ల నెర్వస్‌ సిస్టమ్‌ దెబ్బతిని ప్రవర్తనలో మార్పు రావడం… ఎ.సి.టి.హెచ్‌.అనే హార్మోను పెరగటం వల్ల వ్యాధినిరోధక శక్తి తగ్గటం. ….. అంతేకాదు ఈ మానసిక ఒత్తిడి జీవకణాల ఆయుష్షుని తగ్గించటం. ఒకవేళ తల్లి అయ్యే అవకాశం ఏ మాత్రం వున్నా ఇదిగో ఇలాంటి పిల్లలే పుట్టటం… ఇదంతా స్వయంకృతం….’’ అంటూ అక్కడ వున్న మానసిక వికలాంగులైన పిల్లల్ని చూపించిందామె.
స్నేహిత ఒళ్లు జలదరించింది.

ఆమె ఎటో చూస్తూ…‘‘ ఇలాంటి పిల్లలు పుట్టటానికి కారణాలు నేను చెప్పినవే కాకపోవచ్చు, కాని మనకు పిల్లలు పుట్టనంత మాత్రాన పూజల పేరుతో మన కడుపుల్ని ఎండబెట్టుకోవలసిన అవసరం లేదని చెబుతున్నాను. ముఖ్యంగా తమ కుటుంబాల గురించి ఆలోచించుకోకుండా ఇతరుల కుటుంబాల గురించి ఆలోచించే దౌర్భాగ్యుల్ని అసలు పట్టించుకోవద్దు…. చెడుకు, నమ్మకానికి వున్నంత ఆకర్షణ, మంచికి, మనిషికి వుండదు. ఇది నీకు తెలుసు. ఇదే శాశ్వతం అనుకొని చీకట్లోనే కూర్చోకుండా ఒక దీపాన్ని వెలిగించుకో. నీ స్వంత విషయాలను అడుతున్నాననుకోకు డా॥ప్రభాత్‌ గారు ఈ విషయంలో నీకేమైనా సలహా ఇచ్చారా?’’ అంది.
‘‘ఇచ్చారు. సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లమన్నారు.’’ అంది స్నేహిత.

‘‘అప్పట్లో నన్ను కూడా అక్కడికే వెళ్ళమన్నారు డాక్లర్లు. మా దగ్గర అంత డబ్బులేక వెళ్లలేదు. అక్కడికెళ్తే అన్ని రకాల చాన్సెస్‌ వుంటాయి. ముఖ్యంగా….’’ అంటూ స్నేహిత చెవి దగ్గరకి వెళ్లి గొంతు తగ్గించి … ‘‘ఒకవేళ నీ భర్తలో ఆ యోగ్యత లేక పోయినా అక్కడ వేరే వాళ్లది తీసి నీకేస్తారు. తప్పని సరై,తప్పేది లేనప్పుడు అది తప్పు కాదనుకో… కానీ నువ్వలా వేయించుకోకు… ఏదో వస్తుంది కదాని ఆలోచన లేకుండా ఎగబడితే వాసనలేని మల్లె లాగ, అందం లేని అంత:పుర కన్యలాగ, పౌరుషం లేని ప్రియునిలాగా, పటిష్టం లేని కోటగోడలాగ ఉపయోగం లేకుండా పోతుంది. అర్థమైందనుకుంటా… అందుకే నీకు నచ్చిన డోనర్‌ని సెలక్ట్‌ చేసుకో… విత్తనాన్ని బట్టే చెట్టు…’’ అంది గొంతులో సౌండ్‌ తగ్గినా గట్టిగా వత్తి పలుకుతూ…

ఆ మాటలు మనసులోతుల్లోకి జొరబడి కళ్లు తిరిగాయి స్నేహితకి… కలలో కూడా ఇష్టపడని విషయాన్ని వింటున్నట్లు ముడుచుకుపోయింది. ఆమె చెప్పిన దాన్ని దృశ్య రూపంలోకి తెచ్చుకుంటూ వణికిపోయింది.
అంతలో చేతన వచ్చి స్నేహితను తీసికెళ్లింది.

హేమేంద్రకి పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో అందరి చూపులు పెళ్లికూతురు సిరిప్రియ మిాదనే వున్నాయి, అంతేకాదు…
‘‘పెళ్లికూతురు ఆదిత్య బంధువట. అందుకే అంత అందంగా వుంది మన హేమేంద్ర కూడా ఆ అమ్మాయికి తగినట్లు బాడీ బిల్డర్‌లా వున్నాడు.’’ అనుకుంటున్నారు.ఆ మాటలు వింటుంటే శేఖరయ్య, ఆయన భార్య, కూతురు కలలో కూడా వూహించని విధంగా, విస్మయంగా చూస్తూ ఆనందిస్తున్నారు.ఈ సంబంధం కుదరటానికి కొద్ది రోజుల ముందు ఒకరోజు హేమేంద్ర ఆదిత్యతో…. ‘‘ సర్‌! మిారు నాకు మందుల షాపు ఇప్పించి మంచిపని చేశారు. కానీ దాని మిాద కొంత అప్పుంది. వాళ్లు తొందర పెడ్తున్నారు. నేను ఎకనామికల్‌ గా పికప్‌ కావాలంటే కొంత టైం పడ్తుంది. ఈలోపల నాకేదైనా సంబంధం వుంటే చూడండి! వాళ్ళు ఇచ్చే కట్నం డబ్బుల్ని అప్పుకి కట్టేస్తాను….’’ అన్నాడు.
ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడే హేమేంద్ర అంటే ఆదిత్యకి మంచి అభిప్రాయం వుంది. హేమేంద్ర ఆదిత్య దగ్గర దాన్ని నిలుపుకోవాలని చూస్తాడు…

వెంటనే ఆదిత్యకి వాళ్ల సూర్యనారాయణ బాబాయ్‌ గుర్తొచ్చాడు.‘‘మన సిరిప్రియకు నీకు తెలిసిన అబ్బాయి వుంటే చూడు పెళ్లి చేద్దాం! నాకు అబ్బాయి వాళ్ళ కుటుంబం మిాద కాని, అబ్బాయి మిాద కాని పెద్ద, పెద్ద ఆశ లేమిా లేవు. వాళ్ల బయోడేటాలతో కూడా పని లేదు. ఎందుకంటే అవన్నీ చూసి పెళ్లిళ్లు చేసుకున్న కొందరు నెల తిరక్కుండానే విడిపోతున్నారు. నాక్కావలసింది నా కూతుర్ని ఇంట్లోనే వుంచుకొని. చివరిదాక అంత తిండిపెట్టుకోగలిగితే చాలు’’ అనటం గుర్తొచ్చి నేరుగా సూర్యనారయణను కలిశాడు ఆదిత్య….

‘‘హేమేంద్ర గురించి తనకెంత వరకు తెలుసో అది మాత్రమే చెప్పాడు. ఆయన అంతావిని, నచ్చడంతో అందుకు అంగీకరించి, వెంటనే హేమేంద్ర తల్లిదండ్రుల్ని కలిశాడు.… పెళ్ళికి ముహుర్తాలు పెట్టించారు. శుభలేఖలు వేయించారు. బంధువులకి, స్నేహితులకి పంచారు. అందరూ వచ్చారు. సన్నాయిలు మోగాయి. గుడిలో పంతులుగారొచ్చి మంత్రాలు చదివాడు. నవవధువుల తలలపై జీలకర్ర బెల్లం పెట్టించాడు. అందరు అక్షింతలు వేసి ఆశీర్వదించారు, బోజనాలయ్యాయి. హేమేంద్ర పెళ్లి సిరిప్రియతో జరిగిపోయింది.చేతన హేమేంద్ర పెళ్లికి రాలేదు. కారణం అప్పుడెప్పుడో తనని కాలేజిలో ర్యాగింగ్‌ చేశాడని కాదు. ఇప్పుడు కూడా అతను అలాగే వుంటాడని ఆమె అనుకోవటం లేదు. అందుకే హేమేంద్ర గురించి వాళ్ల అన్నయ్యకి చెడుగా కాని, మంచిగా కాని చెప్పలేదు. అంత టైం కూడా ఆమెకు లేదు.
‘‘సిరికి కాల్‌ చేసి బ్లెసింగ్స్‌ చెపుతా అన్నయ్యా! నాకిప్పుడు అర్జంట్‌ పని వుంది.’’ అంటూ తను వెళ్తున్న పని ఎంత ముఖ్యమైందో చెప్పింది ఆదిత్యతో.

…. రిప్రజెంటీటివ్‌లు నలుగురు పెళ్లికి వచ్చారు. పెళ్ళి అయ్యేంత వరకు హేమేంద్రతోనే వున్నారు. మేము హేమేంద్ర వెన్నుదన్నులం అన్నట్లే తిరిగారు. జోక్‌లు వేసుకుంటూ సందడి చేశారు. అంతేకాదు పెళ్లి అయ్యేంతవరకు సెంటర్‌ ఎట్రాక్షన్‌లో ఫోకస్‌ అయ్యారు. అక్షింతలు వేసి వెళ్లిపోయారు, ఎక్కడివాళ్లు అక్కడ వెళ్లిపోతున్న సమయంలో……. ఒక కారును అందంగా అలంకరించి….ఆడవాళ్లంతా ముసి, ముసి నవ్వులతో సిరిప్రియను కారెక్కించారు. వాళ్లంతా సిరిప్రియ వయసు వాళ్లే… వాళ్లందర్ని అలా ఓ చోట కలిపి చూస్తుంటే కళ్లు చెదిరిపోతూ, అలసిపోతున్నాయి. అలాగే హేమేంద్ర వయస్సున్న మగవాళ్లు హేమేంద్ర వెంట కారు దాకా వచ్చి కారెక్కించారు. వాళు ్ళకూడా చాలా హుషారుగా, ఉత్సాహంగా హేమేంద్ర భుజం తట్టారు.కారు కదిలింది. ఆ కారు ఎక్కడికి వెళ్తుందో సిరి ప్రియకు తెలుసు. హేమేంద్రకి తెలియదు. తెలుసుకోవాలని వుంది. కాని అక్కడ చెప్పే వాళ్లెవరూ లేరు.

కారు రోడ్డు మిాద పచ్చటి పొలాల మధ్యన ప్రయాణం చేస్తోంది. రోడ్డుకి అటు, ఇటు వున్న చెట్ల కొమ్మలు ఒకదాని వైపుకిౖ ఒకటి వంగి పెనవేసుకుపోయి ఆకుపచ్చని కప్పులా గమ్మత్తుగా వున్నాయి. వాటికింద నుండే చాలా దూరం ప్రయాణం చేశారు. ఆ అనుభవం బాగుంది హేమేంద్రకి….
కారు ఊరిలోకి ప్రవేశించింది.
ఆ ఊరు ఆకుపచ్చని ఆకులతో నిండిన వృద్ధ చెట్టులా వుంది.
కారు ఓ ఇంటి ముందు ఆగింది.
కారు దిగగానే హేమేంద్రను, సిరిప్రియను లోపలకి తీసికెళ్లారు.

ఆ ఇల్లు పాతకాలం నాటి మండవాలోగిలిని తలపింప జేసేలా వుంది. పెద్ద, పెద్ద దూలాలతో ఎత్తైన గోడలతో, నేలంతా నాపరాళ్లు పరచి, అతి శుభ్రంగా వుంది. గోడలు ఎత్తుగా వున్నందువల్ల ఫ్యాన్లు పైకప్పులకి వేస్తే గాలి రాదని ఎక్కడికక్కడ స్టాండిరగ్‌ ఫ్యాన్లు అమర్చివున్నాయి…. వంట ఇంట్లో ఆరితేరిన వంట మనుషుల్లా ఆ ఇంటి పెద్ద కోడళ్లు ఏలుతున్నారు…. ఆ వంటగదిని ఆనుకొని కరివేపాకు చెట్టు, అరటి చెట్లు, తులసి చెట్టు వున్నాయి. ఇంటి బయట గోడవారగా బోలెడన్ని కొబ్బరి చెట్లు, ఎత్తుగా పెరిగి వున్నాయి.

అంతేకాదు బయట గేటు దగ్గర నుండి లోపల ఇంటి గోడ వరకు మట్టి దారి వుంది. ఆ దారికి ఇరువైపుల నిమ్మ, దానిమ్మ, జామ చెట్లు కాయలు కాసి వూగుతున్నాయి…. దొడ్లో గడ్డివాములు, చింత చెట్లు, వేపచెట్లు, తాటిచెట్టు నిశ్చింతగా నిలబడి వున్నాయి. ఆ ఇంటికి కాస్త దూరంగా రెండు కొండలు…. ఇంటి నుండి కొండలు దాకా పచ్చని పొలాలు. వాటిపక్కనే నీటిని ఆపుతూ చెరువు గట్టు… ఆ గట్టు మిాద దేనికో రక్షణ ఇస్తున్నట్లు దట్టంగా దడికట్టినట్లు వున్న, చిల్ల చెట్లు, తుమ్మచెట్లు…. పొలం నిండా కనుచూపు మేర పొట్టకొచ్చిన మొక్కజొన్న పైరు ఏపుగా పెరిగి కేకలేస్తూ, ఆకుపచ్చగా వూగుతూ, గాలితోలిన ప్రతిసారి పక, పక నవ్వుతోంది.

 హేమేంద్రకి పంట పొలాలు, తాటి చెట్లు కొత్త కాకపోయినా ఆ ఇంటి వాతావరణంలో, ఆ ఇంట్లో వున్న మనుషుల్లో ఏదో ప్రత్యేకత వున్నట్లనిపిస్తోంది. ఆశ్చర్యం, ఆనందం మిళితమై అప్పుడప్పుడు ఒళ్లంతా కళ్లు చేసుకొని చూస్తూ ఇంద్ర ధనస్సును చేత్తో తాకుతున్న అనుభూతికి లోనవుతున్నాడు. ఇంకా అబ్బురపరిచే విషయం ఏమిటంటే ` ఆ ఇంట్లో వున్న మంచాలన్నీ గట్టిగా పేనిన నులకతాడుతో అల్లినవే…. అందులో బాగా వాడిన, బలంగా వున్న నులకమంచంపై తెల్లటి దుప్పటి పరచి, మెత్తటి దిండ్లు పెట్టి, చుట్టూ తెలుగు సంస్కృతిని చుట్టినట్లు అలంకరించి హేమేంద్రను, సిరిప్రియను ఆ మంచంపై కూర్చోబెట్టారు. వాళ్ల తోటలో ప్రత్యేకంగా పూయించిన పూలన్నీ ఆ గదిలో పరుచుకొని, పరిమళాలను పంచుతున్నాయి. అంతలో పండు ముత్తైదువులు ఒకరి వెంట ఒకరు మెల్లగా ఆ గదిలోకి వచ్చి సిరిప్రియ చేత ఒక స్వీటు, తాంబూలం తీసుకొని కాళ్లకి దండం పెట్టించుకొని వెళ్తున్నారు. వాళ్లంతా అరవై సంవత్సరాలు దాటిన పుణ్య స్త్రీలు. వాళ్ల భర్తలు పొడవు చేతి చొక్కాలు, పంచెలు కట్టుకొని, చేతికర్రలు పట్టుకొని ఆరుబయట కూర్చుని పురాణ కాలం నాటి శృంగార కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఇంత వయసున్న వాళ్లని ప్రస్తుతం ఇక్కడ తప్ప ఇంకెక్కడ చూసినట్లు లేదు హేమేంద్రకి … ఒకవేళ వున్నా కోడళ్లు సరిగా తిండిపెట్టకనో, సుగరులాంటి దీర్ఘ వ్యాధులు రావటం వల్లనో త్వరగా చనిపోతున్నారు. అక్కడక్కడ మొండి ప్రాణాలు వున్నా వాళ్లను తీసికెళ్లి వృధ్దాశ్రమాలలో చేర్పిస్తున్నారు… అదీ చెయ్యలేకపోతే ఏ రోడ్డు పక్కనో వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇంతవయసొచ్చి పాతబడిపోయిన ముసలివాళ్లను ఇళ్ళల్లో ఎక్కడా వుంచుకోవటం లేదు. ఒకవేళ వున్నా మూలన కూర్చోమంటారు కాని ఇంత శుభప్రదంగా, ఇంత పరిశుభ్రంగా వాళ్లను వుంచరు, గౌరవించరు. భారత చిత్రపటంలో ఓ చిత్రాన్ని చూస్తున్నట్లు అలాగే కూర్చున్నాడు.

అరవై వసంతాలకు పైనే చూసిన ఆ ముత్తైదువులు ` ముఖమంతా నవ్వు చేసుకొని హేమేంద్ర తలను ప్రేమగా నిమిరి` సిరిసంపదలతో, పిల్లా, పాపలతో చిరాయువుతో జీవించమని దీవించి వెళ్తున్నారు….
వాళ్లంతా వెళ్లిపోయారు. హేమేర్రద, సిరిప్రియ మాత్రమే మిగిలారు. పరిసరాలు నిశ్శబ్దంగా మారాయి.

( ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
85
 
ధారావాహికలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో