ప॥ వద్దురా మనకొద్దురా పరపాలనంబిక ఒద్దురా
హద్దు పద్దూ లేని పన్నుల రుద్దీ పీల్చుచు నుండెరా॥ వద్దు॥
చ॥ 1. కర్ర లాగీ కత్తిలాగి పర్రలను చేసేడురా
బుర్ర తిరుగుడు మందుపెట్టి గొఱ్రెలను చేసాడురా ॥ వద్దు।
2. వెండి బంగారముల నెల్ల దండిగా లాగేడురా
ముండమోపి కాగితాలకు దండమిడమన్నాడురా ॥ వద్దు॥
3. మాన ప్రాణములకు మహమ్మారిjైు వున్నాడురా ॥
కావలేవా కన్నతల్లీ గౌరవము కాపాడవా ॥ వద్దు॥
అంటూ ఆంగ్లేయులు దేశీయ విద్యల్ని నాశనం చేసి మనకు పాశ్చాత్య నాగరికత పట్ల వ్యామోహాన్ని కలిగించి, స్వతంత్య్ర భావాల్ని నాశనం చేసి, గొఱ్ఱెల మందల్లా తయారు చేసారనీ, వెండి బంగారు నాణాల్ని తమ దేశానికి తరలించుకొని విక్టోరియా మహారాణి బొమ్మకల కరెన్సీని మనకు అంటకట్టారనీ, ప్రబొధించారు. మన ఆత్మ గౌరవానికి హాని కలుగుతోందని దేశమాత గౌరవాన్ని కాపాడమని, దేశీయుల్ని ప్రభోధించారు నాటి కాంగ్రెస్ కార్యకర్తలు. పారుపూడి వారి కుటుంబమంతా స్వరాజ్య సమరానికి అంకితం అయ్యారు. తరువాత వచ్చిన ఉప్పు సత్యాగ్రహం నాటికి వీరి దీక్ష పరాకాష్టకు చేరింది. బందరు జాతీయ కళాశాలలో బి.ఎ. చదువుతున్న రామ్మోహనరావు గారు కళాశాల పరిత్యజించి స్వరాజ్య శంఖం పూరించారు. అచ్చట వారికి బెజవాడ గోపాలరెడ్డిగారి వంటి ప్రముఖులు సహాధ్యాయులు. కళా వెంకటరావు గారు విజయనగరం కళాశాలలో ప్రథమ శ్రేణి విద్యార్థిగా వున్న వారు మహాత్ముని పిలుపుతో వచ్చి ఉద్యమాల్లో పాల్గొన్నారు. పళ్లంరాజుగారు బాపట్ల వ్యవసాయ కళాశాలలో పట్టభద్రులై గౌరవ ప్రదమైన గ్రామ మునసబు పదవిలో వున్న వారు సాంబమూర్తి గారి వలన ప్రభావితులై సర్వం పరిత్యజించి కాంగ్రెస్ ఉద్యమంలోకి వచ్చారు. వారి వారి ధర్మపత్నులు ఆ నాటికి లోకం తెలియని 15 సంవత్సరాలలోపు వయస్సు వారు. అసూర్యంపశ్యలు ఇబ్బందులు, కష్టాలు అంటే ఏమిటో తెలియని సంపన్న గృహాలలోని వారు. వీరూ భర్తల వల్లా, మహాత్ముని ప్రబోధం వల్ల స్వరాజ్య సమరంలో వురికి చివరి వరకూ పోరాడుతూ భర్తకు బాసటగా నిలచారు. ఉప్పు సత్యాగ్రహం, కాకినాడ టౌను హాలు ఆవరణలో జరిగిన సభల్లో సాంబమూర్తిగారిపై, లాఠీ చార్జి జరుగుతుంటే సత్యనారాయణ గారూ, రామ్మోహనరావుగారు వారికి అడ్డుపడ్డారు. వృద్ధులైన సత్యనారాయణ గారి మోకాలి చిప్పలు పగిలి రక్తం ప్రవహించింది. కొడుకు తల పగిలిపోయింది అయినా వారు వెనుకంజ వేయలేదు. స్పృ హ కోల్పోయి పోలీసులు ఈడ్చి వేసే వరకూ వారు ఆ ప్రాంతాన్ని వీడలేదు. ఉభయులు ఎన్నో పర్యాయాలు జైలు శిక్ష అనుభవించారు. పల్లవి ॥ గాంధీ మహాత్మా। గాంధీ మహాత్మా। కాచి రక్షించు గాంధీ మహాత్మా।
చ॥ సరుకోరువారు కరుకైన వారు। ఉప్పేరి తేను తప్పేసినారు ॥గాంధీ॥
మాల మాదిగలం మనుషులము కామా కుక్కలకన్నా తక్కువైనామా ॥గాంధీ॥
మా బాధలు వారింప సామోరే దిక్కు। ఆ సామి వారే అవుతారమాయే ॥గాంధీ॥
అని అస్పృశ్యతా నివారణని కోరుతూ అందరికి అత్యవసరమైన ఉప్పుపై పన్ను వేసిన ప్రభుత్వపు దుర్మార్గాన్ని గర్హిస్తూ సాక్షాత్తు భగవంతుడే గాంధీ రూపంలో దిగి వచ్చాడని భావించారు భారతీయులు.
కాకినాడ కాంగ్రెస్ సభలకు నారాయణగారు వాలంటీరుగా వచ్చారు. ఖద్దరు నిక్కరు పొట్టి చేతుల షర్టు ధరించి మెడకు తెల్లని స్కార్ఫ్ కట్టుకొని కాళ్లకు చెప్పులు, చేతిలో పొడుగాటి లాఠీకర్ర ధరించిన వలంటీర్ల సభాస్థలి చుట్టు ప్రక్కలంతా తిరుగుతూ వుండేవారు. ఎవరికి ఏ సహాయం చేయాలన్నా వారు సిద్ధం. జనం కేకలు పెట్టినా, అల్లరి చేసినా వారు చిరాకు పడరు. శాంతంగానే వారికి నచ్చజెప్తారు. అంతగా వినకపోతే వారి చెయ్యి పట్టుకొని నిశ్శబ్ధంగా సభాస్థలికి దూరంగా తీసుకొని వచ్చి వదులుతారు వారు. వారి ముఖాల్లో నిశ్చలతా, ప్రవర్తనలోని సౌమ్యత చూసి అల్లరి చేయడానికి వచ్చిన వారైనా, ఏదో కారణాల వల్ల కోపం వచ్చిన వారయినా ప్రశాంత చిత్తులు అయ్యేవారు. కళా వెంకటరావుగారు, తరువాతి కాలంలో సుభాసుచంద్రబోస్ జాతీయ సైన్యంలో చేరి కర్నూలు రాజుగా ప్రఖ్యాతి పొందిన ప్రముఖ వైద్యులు అయిన డి.ఎస్.రాజు గారు, ఇదే కోనసీమలో అనేక మంది జాతీయ వాదులతోను నారాయణగారికి సన్నిహిత పరిచయాలు వుండేవి. కుడువాపెట్ట లోటు లేని ఇంటి గారాల బిడ్డగా పుట్టిన ఆయనకు జీవితం కోసం కష్ట పడవలసిన అవసరం కాని, ఆలోచించాల్సిన ఆవశ్యకత లేనేలేదు. వారి దృష్టి దేశ పరిస్థితులవైపు మళ్లింది. భగత్‌సింగ్ తీవ్రవాదం, మహాత్ముని అహింసావాదం ఏది అనుసరణీయం అని వారు మధన పడేవారు. ఎక్కడ కాంగ్రెస్ సభలు జరిగినా ఆయా వార్తా విశేషాలు సేకరించి, వాటి వివరాలు, పరిణామాలు ఆలోచించేవారు. ఈ సారి వెదుకబోయిన పెన్నిది ముంగిటకే వచ్చింది. కష్టపడి ఉత్తరాపథంలో జరిగే కాంగ్రెస్ సభలకు వెళ్లడానికైతే పినతండ్రి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు అవకాశం ముంగిటకే వచ్చింది. వారు ఉత్సాహంగా సభలలో పాల్గొన్నారు.
కొండా వెంకటప్పయ్యపంతులుగారి వంటి పూర్వతరం వారు, టంగుటూరి ప్రకాశం, కళా వెంకటరావు వంటి నవ యువకులూ గాంధీ మహాత్ముని స్వరాజ్య పధానుయాయులై, ఆంధ్రులను వారి మార్గానికి పురికొల్పుతూ వాడ వాడలా మహాత్ముని పర్యటనలో ఆయనను అనుసరిస్తూ, ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ, ప్రజలకు వారి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. మహాత్మునీ వారి అనుచరుల్ని ఆంధ్రదేశమంతటా పర్యటన చేయిస్తూ దేశ పరిస్థితుల్ని వారికి వివరిస్తూన్నారు. దేశీయులు వారి దర్శన భాషనాలచే ఉత్తేజితులై స్వరాజ్య సమరం వైపు ఆకర్షితులవుతున్నారు. జయప్రకాష్ నారాయణ, వారి సతీమణి శ్రీమతి ప్రభావతీ దేవి ఆంధ్రదేశంలో పర్యటించడానికి వచ్చారు. జయప్రకాష్‌లో మహాత్ముని భావాలు ఆచరణ యోగ్యం కావనే భావం తరువాతి కాలంలో ఏర్పడి వారు సోషలిస్టుగా మారారు. ప్రభావతీ దేవి మాత్రం తుది వరకూ మహాత్ముని శిష్యురాలుగానే నిలిచారు. త్రికరణ శుద్ధిగా గాంధీ మహాత్ముని సిద్ధాంతాలను నమ్మి అనుసరించిన ప్రభావతి జీవితాంతం అహింసావాది. శుద్ధ ఖద్దరు ధారి. ఉదయమే లేచి దైవ ప్రార్థన చేసుకొని, నూలు వడుకుకునే ఆమె మరో పని చేసేవారు. ఆమె పవిత్రతకు అబ్బురపడిన నారాయణ గారు తరువాతి కాలంలో జన్మించిన తమ కుమార్తెకు ఆమె పేరు పెట్టుకొన్నారు.
నారాయణ నూలు వడకటం, ఖద్దరు ధారణ జీవితాంతం కొనసాగించారు. మధ్యపాన నిషేధాన్ని నారాయణగారు ప్రచారం చేయవలసిన అవసరం లేకపోయింది. శ్రామికులకూ, కష్టజీవులకూ ఆయన మొదటి నుండే పెద్ద అండ. ఆయనకు రెండు పెద్ద పెట్టెల నిండా మేలుజాతి కమీజులూ, కండువాలూ, ధోవతులు ఎప్పుడూ వుండేవి. ఎవరైనా శ్రామికుడు వచ్చి బాబూ ఒక్క పంచె ముక్క దయచేయండి అంటే చాలు నారాయణగారు పెట్టె తీసి చేతికి దొరికినన్ని బట్టలు తెచ్చి వారికి ఇచ్చేవారు. కుటుంబానికంతటికీ ప్రేమపాత్రుడైన అతడి చేతినిండా ఎప్పుడూ పుష్కలంగా డబ్బు వుంటుంది. కష్ట జీవులకు వారి అవసరానికి మించి డబ్బు ఇస్తూ వుంటారాయన. వారి కష్ట సుఖాల్ని కనిపెట్టడంలో ఆయనను మించిన వారు లేరు. గవర్లు అనే ఒక కులం వారు తాటి కల్లు గీయడం కులవృత్తిగా కలవారు. కల్లుగీతకు తాటి చెట్టు ఎక్కిన గవరవానికి అంత దూరాన నారాయణగారు కనిపిస్తే కుండ పగలగొట్టి చెట్టు దిగి తల వంచుకొని మరో దారిన పోతాడు. కల్లు, సారాయి పాటదారులు నారాయణగారు మధ్యనిషేధ ప్రచారం చేయడానికి వస్తున్నారని తెలిస్తే తమ వద్ద వున్న సరుకంతా బైట పారబోసి, కల్లు పాకకు తాళం పెట్టుకొని పత్తా లేకుండా పోయేవారు.
కడజాతి వారుగా బహిష్కరింపబడిన వార్ని నారాయణగారూ, వారి తమ్ముడు తమ ఇంటికి ఆహ్వానించి అరుగులపై కూర్చొండపెట్టి స్వయంగా వడ్డించి భోజనాలు పెట్టే వారు. అంతక్రితం వారెవరికి అగ్రహారంలో ప్రవేశించే అవకాశం లేదు. తప్పనిసరిగా రావలసి వస్తే కడజాతి వాణ్ని వస్తున్నాను బాబయ్య! తొలగండి! తొలగండి! అని సనాతనాచార పరుల్ని హెచ్చరిస్తూ, తమ చేతిలోని మువ్వల కర్ర మ్రోగిస్తూ అగ్రహారంలో అడుగు పెట్టాలి వారు. వారిని తమ పెరళ్లలో రజక కులం వారితో పాటుగా పనులు చేయడానికి నియమించే వారు ఈ యువకులు, ఇంట్లో పెద్ద వారికి ఈ చర్య అయిష్టంగా వున్నా తమ గారాబు బిడ్డల్ని ఏమి అనలేక ఏమోయ్ పశువుల పాలు మాత్రం మీరు పిండవద్దు. మేమే తీసుకుంటాం అనేవారు. ఆ మాటకు అన్నదమ్ములు తమలో తామే నవ్వుకొనేవారు. నారాయణగారి తమ్ముడు రాత్రి పాఠశాల పెట్టి వారికి చదువు నేర్పేవారు. గ్రామంలోని యువకుల్ని ప్రోత్సహించి వారికి హిందీ నేర్పి వారిలో ఉత్సాహవంతులైన వారి చేత పరీక్షలకు కట్టించేవారు. వారు స్వయంగా హిందీ, విశారద పరీక్ష ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అన్నగారితో పాటు తమ్ముడు కూడా ఖద్దరు ధారణ, ప్రచారం, నూలు వడకడం చేసేవారు. ఖద్దరు బట్టలు, నూలు అమ్మగా వచ్చిన డబ్బు స్వరాజ్యనిధికి జమ కట్టేవారు. ఆ అన్నదమ్ముల్ని రామ లక్ష్మణులనే వారు అంతా. విదేశీ వస్తువు బహిష్కరణోద్యమంలో ఆ అన్నదమ్ములు తమ ఇంట కల విదేశీ వస్తువులూ, ఖరీదైన బట్టలూ వీధిలో పారవేసి నిప్పు అంటించారు. ఆ అన్నదమ్ములు ఖాదీ ప్రచార వేళ
పల్లవి ॥ లేవరా ఇదేటినిద్రరా! ఓ భారత సోదర లేవరా ఇదేటి నిద్రరా।
చ॥ 1. వల్లభాయి పటేలు, ఘనుడు సుభాస్ చంద్రబోసు
కారాగారములలో కడు నిడుములు కుడుచుచుండ ॥ లేవరా॥
2. కన్నులుండి చూచు చుండియు కాన నటుల మిన్నకుండి
కాసంతయు నెనరులేని, కఠిన హృదయమేలకలిగే॥ లేవరా॥
3. చచ్చుటకును స్వర్వస్వము నిచ్చుటకునుకలరు ఘనులు
మెచ్చవచ్చిన స్వచ్ఛమైన ఖద్దరు కట్టగ ॥ లేవరా॥
అని దేశ నాయకులు దేశమాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి ఎన్నెన్నో త్యాగాలు చేస్తున్నారని, దేశీయులంతా తమ వంతు సహాయ సహకారంగా ఖద్దరు ధారణకు దీక్ష వహించాలనీ సామాన్య జనుల్ని ప్రబోధించారు.
క్రమంగా ఉద్యమం తీవ్ర రూపాన్ని దాల్చింది. డూ ఆర్ డై మీ లక్ష్యం సాధించండి లేకపోతే ఆ లక్ష్య సాధన కొఱకు ప్రాణాల్ని సమర్పించండి అని దేశ నాయకులంతా స్థిర నిశ్చయులై తమ అనుయాయులకు అనుజ్ఞ ఇచ్చారు. వ్యష్టి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో నారాయణగారూ వారి సమీప బంధువులూ చాలా మంది పాల్గొని జైలు శిక్షలు అనుభవించారు.
గాంధీ మహాత్ముని భగవంతుని అవతారంగా, దరిద్ర నారాయణుడుగా, దాన రక్షకుడుగా భారతీయులు నమ్మారు.
పల్లవి॥ గాంధీ మహాత్ముడు బయలుదేరగా కల కల నవ్విందీ
జగత్తూ కలకలా నవ్వింది
చ॥ 1. గాంధీ మహాత్ముడు చక చక నడువగా
కంపించిపోయిందీ భూదేవి కంపించి పోయింది ॥గాంధీ॥
2. గాంధీ మహాత్ముడు కనులు విప్పగా గడగడా వణికింది
అధర్మం గడ గడ వడకింది ॥గాంధీ॥
3. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గడ గడా వణికింది
అధర్మం గడ గడ వణకింది ॥గాంధీ॥
4. గాంధి మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల కట్టందీ
స్వరాజ్యం కన్నుల కట్టందీ ॥గాంధీ॥
అని బాపూ నాయకత్వంలో తాము స్వరాజ్యాన్ని సాధించి తీరుతామన్న దృఢ నిశ్చయంతో,త్రికరణ శుద్ధిగా వారి బోధనల్ని ఆచరించారు.
పల్లవి॥ వేణునాదం మ్రోగుతుందండోయ్।
ఓ భక్తులారా వేణునాదం మ్రోగుతుందండోయ్
చ॥ వేకువ జాము కోడి కూసే, వేగు చుక్కా తూర్పున పొడిచే
వేగమే నిద్దుర లెండోయ్। వేళమించీ పోయేనండోయ్॥ వేణు॥
1. భార్యల విడిచీ భర్తలు రండోయ్। భర్తల విడిచీ భార్యలు రండోయ్।
తల్లుల విడిచి పిల్లలు రండోయ్। పిల్లల విడిచి తల్లులు రండోయ్।
2. పాపాలన్నీ పటా పంచలై పరమేశ్వర సన్నిధిలో జన్మము
ధన్యత జెందీ ముక్తిని బొందే। తరుణము దొరికెను మరి రారండోయ్॥
అంటూ స్వరాజ్యభానోదయం కానుందనీ, తెల్లవారడానికి అట్టే సమయం లేదని, బంధుత్వాలనీ, ప్రాపంచిక బంధాల్నీ పరిత్యజించి స్వతంత్య్ర సమరంలో దుముకమని, ఈ మహా యజ్ఞంతో పాపాలన్నీ తొలగి పోయి జన్మ తరిస్తుందనీ కవి తల్లజులైన దేశ భక్తులు దేశీయుల్ని ప్రబోధించారు.
శాస్త్రిగారికి దేశ భక్తుడైన తన బావ పట్ల ఎంతో ఆరాధనతో కూడిన ప్రేమ. తాను ప్రభుత్వోద్యోగి నాటి బ్రిటీష్ గవర్నమెంట్ హయాంలో ఏమాత్రం వ్యతిరేకతను ప్రదర్శించినా ఉద్యోగం ఊడటం, జైలు ప్రాప్తి తథ్యం. తాను ఆర్థికంగా పరిపుష్టంగా వుంటే వెనుక నుండి ఆయనను ప్రోత్సహించవచ్చు. ఈ ఉద్ధేశ్యంలో ఆయన పైకి గంభీరంగా వుండేవారు. ఒక పర్యాయం స్థానిక ఎం.ఎల్.ఎ వలన నారాయణ గారికి ఒక సహాయం కావలసి వచ్చింది. నాటి రోజుల్లో ఎంతగా ప్రబోధాలు జరుగుతున్నా ధనికులు, శ్రామికులు మద్యపానపు అలవాటును కలిగి వుండేవారు. సామాన్యులు మాత్రం దాన్ని వ్యతిరేకించి దూరంగా వుండేవారు. ఆ రాజకీయ నాయకుడు మద్యపానం జోలికి పోనంతసేపు బహు పెద్ద మనిషి, ప్రజల ఆపద్భాంధవుడు. మందు పడిరదా ఆయన లోకమే వేరు. శాస్త్రిగారూ, బావగారూ, వారి వద్దకు వెళ్ళి తమ పని చెప్పారు. వారు వినడమైతే బహు శ్రద్దగా విన్నారు. అయితే అప్పటికే మందు తలకెక్కడంతో అస్తవ్యస్తంగా మాట్లాడసాగారు. ఇక ఇక్కడ పని కాదని వీరు మరో మార్గంలో తమ ప్రయత్నాన్ని సాగించారు.
సామాన్య జనుల కష్ట సుఖాల్ని తెలుసుకొని వాటిని తనకు సన్నిహితులైన నాయకుల ద్వారా పరిష్కరింపచేసి వారికి ఆప్తులయ్యేవారు నారాయణ గారు. అదే విధంగా ఎన్నికల సమయంలో తన వలన ఉపకారం పొందిన వారినీ, తన అభిప్రాయాల్ని అర్థం చేసుకొన్న వారిని కూడగట్టుకొని నాయకుల విజయానికి తోడ్పడేవారు. స్వయంగా మాత్రం వారు ఎన్నడూ రాజకీయాల్లో పాల్గొనలేదు. నాయకులకూ, ప్రజలకు మధ్య సేతువులా నిలిచారు.
మధ్యయుగపు మహాంధ్యము నుండి హిందూ జాతిని మేల్కొలిపిన వైతాళికులలో రాజ రామ్మోహన్ రాయ్ ప్రముఖులు. బాల్యంలో తమకు అత్యంత ప్రేమాస్పదురాలైన వదినగారు సతీ సహగమన దురాచారానికి బలికావడం చూచాడతడు. బాల రామ్మోహనుని మదిలో ఘోర హింస సంఘటన చెరగని ముద్ర వేసింది. డప్పులు మ్రోగుతూ వుండగా, జయ జయ ధ్వానాలు చేస్తూ, పసుపు, కుంకుమ, పూలు వెదజల్లుతూ ఆ స్త్రీని మరణించిన భర్త చితిపైకి నెట్టి వేసే ఆ భయంకర హింసా దృశ్యం గొఱ్ఱెలను, మేకలను బలి ఇచ్చే కన్నా ఎన్నో రెట్లు కిరాతకమైనది. పెరిగి పెద్దవాడయిన రామ్మోహనుని మదిలో ఈ దురాచారాన్ని రూపుమాపేదెలాగా అనే మధన ప్రారంభం అయ్యింది. నాటి అధికార వర్గాలతో అతడికి కలిగిన పరిచయాల ద్వారా గవర్నర్‌జనరల్ బెంటింగ్ ప్రభువుతో సన్నిహితత్వం ఏర్పడిరది. భారతదేశంలో ఆంగ్లవిద్యను, సంస్కృతిని ప్రవేశ పెట్టడం ద్వారా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చునని ఆంగ్లేయులు భావించారు. స్త్రీల కోసం ఓ చిన్న ప్రాథమిక పాఠశాలని కలకత్తా నగరంలో నెలకొల్పారు. క్రైస్తవ మిషనరీలు, సంపన్న కుటుంబాలలోని పది సంవత్సరాలలోపు బాలికల్ని ఆంగ్లేయ అధికారుల మెప్పుకోసం తల్లిదండ్రులు ఆ పాఠశాలలకు పంపసాగారు. పది సంవత్సరాలు దాటిన బాలికలకు నాటి శిష్ఠ సమాజంలో ఘోషా తప్పనిసరి. రామ్మోహనుడు ఆలోచించాడు. అసలు ఇల్లు వదిలి బయటకు పంపాలనే ఆలోచన పెద్దలకూ, అవకాశం ఈ బాలికలకూ రావడమంటూ జరిగితే ఎప్పటికో ఒకప్పటికి తన ప్రయత్నం ఫలించి తీరుతుంది. ఎంతటి చిన్న దివ్వెనైనా ఒకటి వెలిగించగలిగితే అది అద్భుత కాంతి నిచ్చే దివ్య జ్యోతి అవుతుంది. ఇల్లు వదిలి బయటి ప్రపంచాన్ని చూడటమంటూ ఒకసారి జరిగితే ఎప్పటికో అప్పటికి ఈ బాలికలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని, తమ చుట్టూ వున్న అక్రమాల్ని గుర్తించి ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తారు. భవిష్యత్తులో జరుగబోయే మహిళాభ్యుదయానికి ఇది నాంది ప్రస్తావన మాత్రమేనని ఆయనకు బాగా తెలుసు. చాలా కొద్ది మంది బాలికలతో ప్రారంభం అయ్యింది కలకత్తా నగరంలోని ఈ తొలి బాలిక పాఠశాల. బెంటింగ్ ప్రభువు సహకారంతో సతీసహగమన నిషేధానికీ, స్త్రీ పునర్వివాహానికి, స్త్రీ విద్యకూ ఉద్యమించిన రామ్మోహనుని, సనాతన మత ద్రోహిగా, ధర్మ వినాశకుడిగా భావించి వ్యతిరేకించేవారు.
సనాతనాచార పరులు ఎందరో పండితులతో చర్చించి, వారి సహాయ సహకారంతో ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాల్ని తరచి చూచి, పండిత, ప్రకాండులతో చర్చలు జరిపి బాల్య వివాహాలు వేద కాలంలో లేవని, స్త్రీ విద్య వేదకాలం నాటికి వుందనీ, స్త్రీ పునర్వివాహం శాస్త్ర సమ్మతమనీ, సతీ సహగమనం దారుణ నరమేధమని నిరూపించగలిగాడాయన. సనాతన మతంలోని వివిధ దేవతారాధన వలన కలిగే కలహ, కల్లోలాల్ని నివారించడానికే, దేవుని పేర జరిగే లక్షలాది ధన వ్యయాన్ని ఆపి ఆ ధనాన్ని మానవాభ్యుదయానికి ఉపయోగించడానికీ ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన వ్యతిరేకత ప్రభోదించే బ్రహ్మ సమాజ మతం ఆవిర్భవించింది. మహర్షి దేవేంద్రనాథ ఠాగూర్ వంటి వారెందరో బ్రహ్మ మతానుయాయులయ్యారు. విశ్వ కవీంద్రుడు తన రచనల్లో బ్రహ్మ సమాజపు టౌన్నత్యాన్ని ఆవశ్యకతనీ కాంతా సమ్మితంగా నిరూపించాడు.
అనతికాలంలో ఆంధ్రదేశంలో కూడా బ్రహ్మ సమాజ ప్రభావం కనబడిరది. రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం వంటి వారు బ్రహ్మ మతాన్ని, స్త్రీ విద్యనీ వ్యాపింప చేసి తద్వారా మహిళాభ్యుదయానికి పునాది వేశారు. కాకినాడ, రాజమండ్రిలో బ్రహ్మ మందిరాలు వెలిసాయి. ‘పి.ఆర్.కాలేజి బోడిముండల మేరేజ్, మెక్లారిన్ హైస్కూల్ ఎక్కి తొక్కరా అని సనాతన సంప్రదాయ మతానుయాయులు బ్రహ్మ సమాజాన్ని క్రైస్తవ మిషనరీల సేవని అధిక్షేపించారు. ఈ హైస్కూళ్ళు, కాలేజీల వలన స్త్రీ విద్యకు అంకురార్పణ, సంప్రదాయపు ఇనుప తెరల్ని చీల్చుకొని బైటకు వచ్చే తెగువను మహిళల్లో కలిగించే ప్రయత్నానికీ అంకురార్పణ జరిగింది. నాటి వరకూ సంప్రదాయ విద్యను మౌఖికంగా మాత్రమే నేరుస్తున్న సామాన్యమహిళలకు అక్షరాస్యత కలిగింది. నాటి రోజుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాలికల ప్రాథమిక విద్య పాఠశాలల వలన కాకినాడలో శ్రీమతి పులుగుర్త లక్ష్మి నరసమాంబ గారు అబల సచ్ఛరిత్ర రత్నమాల అనే గ్రంథాన్ని రచించారు. రాజమండ్రిలో హితకారిణీ సమాజాన్నీ, వివేకవర్థిని పత్రికను స్థాపించారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు వారి సతీమణి శ్రీమతి రాజ్యలక్ష్మమ్మ గారు విద్యాధికురాలు కాకపోయినా సంఘ సంస్కరణ కార్యక్రమాల్ని నిర్వహించడంలోనూ బంధుమిత్రుల ప్రతిఘటనను ఎదుర్కోవడంలోనూ, భర్త అభిప్రాయాల్ని, ఆచరణను, మనసా, వాచా నమ్మి భర్తకు త్రికరణ శుద్ధిగా సహకరించిన మహామనిషి ఆమె.
తాను అనపత్యురాలైనా శరణాలయానికి శరణు కోరి వచ్చిన బాలికల్ని స్వంత పిల్లలుగా భావిస్తూ, వారి అజ్ఞానాన్ని, అవివేకాన్ని ఓర్పుగా సహిస్తూ వారి ప్రవర్తనను తీర్చిదిద్దారామె. వారికి శుచిశుభ్రతలు నేర్పి, విద్యావంతులుగా సత్ప్రవర్తన కలవారుగా తీర్చిదిద్ది తమ దంపతులు స్వయంగా పీటలపై కూర్చొని వారికి పునర్వివాహాలు జరిపారామె. వివాహమైనాక కూడా వారు జీవితంలో నిలదొక్కు కునే వరకూ వారికి అండగా నిలిచే వారా మహాసాధ్వి. వితంతువులు పునర్జీవిత వికాసానికి పాటు పడ్డ రాజ్యలక్ష్మమ్మగారు ప్రాతస్మరణీయురాలు. శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు గీర్వాణాంధ్ర భాషలలో చక్కని ప్రజ్ఞ సంపాదించి తమ పట్టణంలో ‘బాల భారతి వనితావిద్యాలయ’ మనే ఆశ్రమ పాఠశాలను స్థాపించి, ఎందరో యువతులకు తర్పీదునిచ్చి భాషాప్రవీణ పట్టాలు పొందేటట్లుగా చేసి, వారి కాళ్లపై వారు నిలబడే అవకాశాన్ని కల్పించారు. ‘చెట్టు ముచ్చట్లు’ అనే పేరుతో విజయవాడ నుండి వెలువడే ఓ పత్రికలో కొన్ని వ్యాసాలు వ్రాసి తెలంగాణ, గోదావరి, కృష్ణా జిల్లాల మహిళలు బెజవాడలో ఒక ఇంట్లో కాపురాలు వుంటూ మధ్యాహ్నపు వేళ తీరిక సమయంలో ఒక చెట్టు క్రింద చేరి తమ సాధక, బాధకాలు తమ తమ మాండలిక పరిభాషలో, యాసతో మాట్లాడుకుంటున్నట్లు హృద్యమైన వ్యాసాలు వ్రాసారామే.
విజయవాడ నుండి వెలువడిన ఈ వ్యాస పరంపరలో మహిళల నాటి సమస్యలను చక్కగా చిత్రించారామె. తరువాతి కాలంలో కేసరిగారి గృహలక్ష్మీ స్వర్ణకంకణ పురస్కారం ఆమెకు లభించింది. శ్రీమతులు కాంచనపల్లి కనకమ్మగారు, పొణకా కనకమ్మ గారు నాడు వంగ సాహిత్యంలో వెలవడుతున్న సరికొత్త ప్రక్రియ నవలా సాహిత్యాన్ని ఆంధ్ర భాషలోకి అనువదించారు. ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల అన్న పేర ఆ నవలలు ప్రచురింపబడ్డాయి. ఎందరో మహిళలు తమ రచనలతో ఆంధ్ర భాషాయేషకు అమూల్యాభరణాల్ని సంతరించారు. గిడిగు రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావు పంతులు, కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి పండితులు రాజుల అస్థానాలలో పండిత ప్రకాండుల వ్యాస పీఠాలపై బందీగా వున్న ఆంధ్రవాణిని జన సామాన్యానికి అందుబాటులోకి తెస్తూ, వ్యవహారిక భాషా ఉద్యమాన్ని లేవతీసి, సాధించి స్వయంగా జాను తెలుగులో రచనలు చేసారు. గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు, సురవరం ప్రతాపరెడ్డి వంటి వారు గ్రంథాలయోద్యమాన్ని సాగించి ఊరూరా, వాడ వాడలా గ్రంథాలయాల్ని స్థాపించి సామాన్య ప్రజలకు పుస్తకాలు చదువుకొనే అవకాశాన్ని కలిగించారు.
గుంటూరులో ఉన్నవలక్ష్మీ నారాయణ, లక్ష్మీ బాయమ్మ దంపతులు మహిళాభ్యుదయానికి, నారీ జనాభ్యుదయానికీ ఎంతగానో కృషి చేసారు. వారు గుంటూరులో స్థాపించిన స్త్రీ జనాలయం నేటికీ కొనసాగుతూ స్త్రీ స్వయం ప్రతిపత్తికి స్త్రీ జనాభ్యుదయానికి కృషి చేస్తోంది. లక్ష్మీనారాయణగారు రచించిన మాలపల్లి నవల తెలుగు క్లాసికల్స్‌లో ఒకటిగా పేరుగాంచింది. అందులో వారు నాడు సంపన్నుల, శ్రామిక వర్గాల జీవన విధానాలూ, స్వభావాలూ, కష్ట సుఖాలు చౌదరయ్య, రామదాసు పాత్రలలో వివరించారు. నాటి హిందూ సంస్కృతికి ప్రతీకలుగా మాలదాసరులు అధ్యాత్మికవిద్యలో, యోగ విద్యలో పరిణతులైన వారి వివరాల్ని రామదాసుని ద్వారా చిత్రించారు. తిండికి, బట్టకూ లోటు లేకుండా వ్యవసాయం చేసుకుంటూ సాటివారికి తోడ్పడుతున్న రామదాసు భూస్వామి పాశ్చాత్య నాగరికత వ్యామోహితులైన పౌలు అనే పోలీసు ఉద్యోగి వలన వున్న ఇద్దరు కొడుకులూ, కూతురు దుర్మరణం పాలై ఆ బెంగతో భార్య హృదయచలనమాగి మరణించగా మనసా సన్యసించి వారు దాస యాత్రికుడయ్యారు. తుదకు భూస్వాముల గర్వం వుడిగి తమ సర్వస్వాన్ని హరిజనాభ్యుదయానికీ, గ్రామాభ్యుదయానికీ సమర్పించి తాము గ్రామాభ్యుదయ కార్యక్రమాలకు అంకితమయ్యారు. ఈ నవలకు ఎన్నో సాహితీ పురస్కారాలు లభించాయి. కేసరిగారు లోద్ర అనే స్త్రీల ఔషధాన్ని కనుగొన్నారు. మద్రాసులో కేసరి కుటీరం అనే స్త్రీ జనాభ్యుదయ సంస్థను, గృహలక్ష్మీ అనే స్త్రీల పత్రికనూ స్థాపించి చాలా కాలం నిర్వహించారు. గృహలక్ష్మీ స్వర్ణ కంకణమనే మహిళా పురస్కారాన్ని స్థాపించి, సాహిత్యంలో విశిష్ట సేవ చేసిన మహిళలను గౌరవించారు. శ్రీమతి స్థానపతి రుక్మిణమ్మ గారు ఈ పురస్కారాన్ని అందుకున్న తొలితరం మహిళలలో ఒకరు నేటికీ వారి వారసులు ఈ పురస్కారాన్ని నిర్వహిస్తూనే వున్నారు.
కాకినాడలో శ్రీమతి బాలాంత్రపు శేషమ్మగారు కొందరు పెద్దల సహకారంతో హిందూ సుందరి అనే స్త్రీల పత్రికను స్థాపించి చాలా కాలం నిర్వహించారు. విద్యార్థినీ సమాజం అనే బాలిక పాఠశాలను స్థాపించి ఆ రోజుల్లో స్త్రీ విద్యకు దోహదం చేసారు. ఆ పాఠశాలలో శిక్షణ పొంది బాలికలు ఉభయ భాషా ప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వారిలో కొందరు తెలుగు, సంస్కృతం ఉపాధ్యాయినులుగా ఉద్యోగాలు కూడా నిర్వర్తించారు. ఆ సంస్థ తరపున ఒక మహిళా గ్రంథాలయం కూడా నడపబడిరది. ఆ రోజుల్లో ప్రచురింపబడుతున్న ఆంధ్ర ప్రచారిణి గ్రంథమాలవారి గ్రంధాలెన్నో ఆ గ్రంధాలయంలో వుండేవి.
శాస్త్రిగారికి 22వ ఏడు వచ్చింది. ఆ రోజుల్లో మగపిల్లవానికి 10,12 ఏళ్ల వయస్సు బాలికలకు 5,8 ఏళ్ల వయస్సులో వివాహాలు జరిగేవి. 16వ యేడు వస్తే పిల్లవానికి పెళ్లి ఈడు దాటిపోతుందని తొందరపడేవారు. ఆడపిల్లకు 12వ ఏడు వస్తే కట్టు తప్పిపోయనట్టు లెఖ్ఖ. కుటుంబ పరిస్థితుల వల్లా పరిమిత ఆదాయంతో సుఖజీవనం తనకు సాధ్యం కాదనే భావనతోనూ 17వ యేట ఉద్యోగంలో చేరినా నేటి వరకూ వివాహాభిలాషను ఆయన మనస్సులోకి రానివ్వలేదు. ఎవరైనా వివాహ ప్రసక్తి తన వద్ద తెస్తే, దాటవేస్తూ వుండే వారాయన. నాటి రోజుల్లో భూవసతి వున్న వారికే పిల్ల నివ్వడానికి ముందుకు వచ్చేవారు. వీరి తండ్రిగారికి పాండిత్యమైతే వుంది కాని, పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు కరిగిపోయి 2 ఎకరాలు మాత్రం మిగిలింది. ఆరుగురు కొడుకులు ఇంకా పెళ్లి చేయవలసిన ఆడపిల్లలూ వున్నారు. ఎవరైనా పొరపాటున పిల్లనిస్తామని వీరి ఇంటికి రాబోతే వీరి స్థితిగతులు తెలిసిన బంధువులు, పరిచయస్తులు కాలి నడకనైనా సరే వారి గ్రామం వెళ్లి వీరి స్థితిగతులు వారికి చెప్పి వారిని ఆ ప్రయత్నం నుండి మరల్చి పుణ్యం కట్టుకునేవారు.
మాణిక్యం సిఫారసు వుంటే మరి ఆలోచించనక్కరలేదు అనుకున్నారు ఆయన. అల్లుణ్ణి పిలిచి నీవు నరసాపురం వెళ్ళి నా తరపున పిల్లని చూచి నీకు తోచినట్లు చేయి అన్నారు ఆయన. నారాయణగారు మంచి రోజు చూచుకొని సఖినేటిపల్లి రేవులో గోదావరి దాటి నరసాపురం వెళ్లారు. నరసాపురంలో ప్రసిద్ధ పండితులు, వర్థమానకవి, యువకుడూ శిష్టా సుబ్బకవిగారు. వీరి మిత్రుడు వారి ఇంటికి వెళ్లి తన బావమరిదికి ఫలానా వారి పిల్లని చూడటానికి వచ్చానని చెప్పారు. బావమరుదల మధ్య కల మైత్రి పరిచయస్తులకందరికీ తెలుసు.
సుబ్బకవిగారికి ఈ మధ్యనే వివాహం జరిగింది. తమ భార్య కమలమ్మకి ఆ పిల్ల మిత్రురాలని పిల్ల చురుకైనది, బుద్దిమంతురాలు అని చెప్పారు. కుటుంబం మంచిదేనని మీరు ప్రయత్నించవచ్చునని చెప్పారాయన. నారాయణగారు వారిని కూడా తమతో రమ్మని ఆహ్మానించారు. సీతను చూడగానే నారాయణలో వాత్సల్యం పొంగి పొరలింది. ఈ క్షణం నుంచి ఈమె నా చెల్లెలు అనుకొన్నారాయన. తల్లి అంటు మామిడి పండ్లు కోసి వెండి గిన్నెల్లో పెట్టి ఇస్తే వచ్చిన వారికి ఇచ్చింది సీత. చెంబులతో చల్లని మంచినీరు తెచ్చి ఇచ్చింది. నారాయణగారు అడిగిన ఒకటి రెండు ప్రశ్నలకు వద్దికగా సమాధానం చెప్పిందామె. సుబ్బారావు గారూ, నారాయణ గారూ మాట్లాడుకున్నారు. పెండ్లి కుమారునికి వెండి చెంబుల జోడు, పట్టు తాపితాలు పెట్టి 5 రోజులు వివాహం జరిపిస్తానని, తమ శక్తి కొలది పెళ్లి వారికి మర్యాదలు చేస్తానని, అంతకు మించి తనకు శక్తి లేదని సుబ్బారావు గారు అన్నారు. నారాయణ గారు కాస్త యోచించారు. మనవాడికి వస్తున్న సంబంధాలే తక్కువ. వచ్చిన వారు కూడా మధ్యలో వెనుతిరిగి పోతున్నారు. ఇక్కడ తమ పిన్నత్తగారు మాణిక్యమ్మగారు వున్నారు కనుక ఇంతవరకూ నిగ్రహించుకొని వచ్చారు. మనవాడికేం లోటు వాడే సంపాదించుకుంటాడు. వీరు ఇవ్వలేం అంటుంటే బలవంత పెట్టడం ఎందుకు అనుకున్నారాయన. పిల్ల చూడబోతే లక్ష్మీలా వుంది.
సరే మీ అభిప్రాయం మా మామగారికి చెప్తా అన్నారాయన. సుబ్బమ్మ గారు గుమ్మం చాటు నుంచి ‘బాబుగారు మీ తల్లిలాంటిదాన్ని ఒక్క మాట అడుగుతాను మీరు మన్నించాలి అన్నారు’. చెప్పండి అన్నారు నారాయణగారూ పెద్దదాన్ని ఆస్థిపాస్తులున్న వారని, ఒక్కడే పిల్లవాడని ఇచ్చాం. ఆస్తి మీద వారసులు దావా తెచ్చారు. చాలా భాగం ఆస్తి కరిగిపోయింది. వీరికి పదిమంది పిల్లలు ఇలా అంటున్నందుకు మన్నించండి. ఆస్తి పాస్తుల్ని నమ్మలేం కదా. మీరు పెద్దమనుసుతో మీ బావమరిదికి చెప్పి వెయ్యి రూపాయల నగలు పిల్లకు పెట్టిస్తే పిల్లవంటిమీద చూసుకొని మేం సంతోషిస్తాం. రేపు ఏ అవసరం వచ్చినా వారికీ ఈ నగలు ఆస్తిగా వుంటాయి అన్నారు. నారాయణగారు మొదట విస్తుపోయారు. ఏమంటున్నది ఈవిడ. తమవైపు ఆడవారు అసలు అపరిచితుల ఎదుటకేరారు. వచ్చినా ఈ విధంగా అసలు మాట్లాడరు. ఆయన కాస్త నిదానంగా ఆలోచించారు. ఈవిడ మాత్రం తప్పు మాటలు ఏమన్నదని, మన వాడు భార్యకు పెళ్లిలో నగలు పెట్టకుండా ఎలా వుంటాడు. ఈవిడ అడిగిందన్నమాటే మిగులుతుంది. ఒంటి నిండా నగలు పెట్టుకొని ఈ అమ్మాయి తమ ఇంట తిరుగుతుంటే ఆ ఆనందం తమది కాదా అనుకున్నారు ఆయన. మనస్సు వాత్సల్య పూర్ణమైంది అలాగే అన్నారు పెడ్లి వారితో. పెద్ద మామయ్య సంసార స్థితి తనకు తెలిసిందే. ఏ ఖర్చు వచ్చినా మిగతా వారు తలో రూపాయి ఇచ్చిన చోట వీడు పది రూపాయలు ఇవ్వవలసి వస్తోంది. వీడు ఎప్పటికినిలవాకం చేసుకోను. అప్పో, సొప్పో చేసి నగలు పెడితే వీడికి రేపు ఏ అవసరం వచ్చినా కొంత హామీ వుంటుంది కదా అనుకొని నెమ్మదిపడ్డారాయన.
కాకినాడ వెళ్ళి శాస్త్రితో ఈ వివరాలు చెప్పారు నారాయణగారు ఆయన మొదట కొప్పడ్డారు. నా పరిస్థితి తెలిసి కూడా ఇలా చేసావేమిటిరా అన్నారు. నా దగ్గర దమ్మిడి నిలువ లేదు. పెళ్లి ఖర్చులకు ఎలాగా, ఎక్కడో అప్పు చేయాలి అని నేను ఆలోచిస్తుంటే పైగా ఈ నగలొకటా అన్నారు. నాన్న వచ్చినప్పుడల్లా జీతం ఆయన చేతిలో పోసి నెలంతా ఇబ్బంది పడవలసి వస్తోంది. ఇదంతా నావల్ల కాదు. వాళ్లతో మరో సంబంధం చూసుకోమని చెప్పేయి అన్నారు శాస్త్రి. నారాయణ బావకు నచ్చ జెప్పారు. సంసారం అన్నాక ఖర్చులు లేకుండా వుంటాయా. ఇప్పటకే నీకు 22 ఏళ్లు వచ్చాయి. నీ ఈడు వాళ్ళం మేమంతా ముగ్గురు బిడ్డల తండ్రులమయ్యాము. ఎన్నాళ్ళు ఇలా పెండ్లి లేకుండా వుంటావు పాపం ఆవిడ అడిగిందన్నమాట మిగిలింది కాని నువ్వు భార్యకు నగలు పెట్టకుండా ఎలా వుంటావు. ఆ అమ్మాయిని చూస్తే నాకు స్వంత చెల్లెలులా అనిపించింది. పెళ్లి ఖర్చులకు ఎలాగు అప్పుచేయక తప్పదు. మరో వెయ్యి అప్పులో అప్పు. అప్పు పుట్టే ఏర్పాటు నేను చేస్తా. నెమ్మదిగా తీర్చుకోమరి. నా పీకమీద కూర్చున్నావు కదరా, తప్పుతుందా అన్నారు శాస్త్రి. నారాయణగారు అన్నట్లుగానే తమ బంధువులలో ఇరువురి వద్ద 1500 రూపాయలకు రెండు ఫ్రాంసరీ నోట్లు రాయించి ఓ 500 వందలు పెండ్లి ఖర్చులకు శాస్త్రిగారి చేతిలో పెట్టి వెయ్యి రూపాయలు తీసుకొని నరసాపురం వెళ్లారు. అక్కడ ఆడ పెళ్లి వారికి బంధువులైన ఓ సంపన్న గృహస్తుని మధ్యవర్తిగా వుంచి వేయి రూపాయలు వారి వద్ద వుంచారు. పెండ్లి కుమార్తెకు 25 కాసులపేరు, 20 కాసుల వడ్డాణం, కంటే, జిగినీ గొలుసు, 3 పేటల గోవర్థనం గొలుసు, 2 జతల గాజులు, చంపస్వరాలు, ప్రధానపు ఉంగరం చేయించడానికి ఏర్పాటు చేసారు. ముహూర్తాలు పెట్టించి నారాయణ గారు వెళ్ళిపోయారు. అప్పుడు కాసు 13 రూపాయలు.
పెళ్ళి రోజు దగ్గర పడుతుంది. పెళ్లి కొడుకు అన్నగార్లిద్దరూ ఉద్యోగస్తులు. పెద్ద తమ్ముడు కాకినాడలో అన్నగారి వద్ద వుండి బి.ఎ. చదవుతున్నారు. పెళ్లి కొడుకు బావగారికీ జ్ఞాతి అయిన పిన తండ్రికీ భూములు, తోటలూ, వెండి బంగారాలూ బాగా వున్నాయి. సుబ్బారావుగారికీ, సుబ్బమ్మగారికీ సంబరంగా వుంది. బంధువుల్ని బ్రతిమాలుకున్నారు వారు. పెళ్లి వారు గోదావరి అద్దరి వారు. మన పద్దతులకు వారి పద్దతులకూ తేడాలుంటాయి. పెళ్లికొడుకు అన్నగార్లు ఉద్యోగస్తులు. మన పద్ధతులు, సరదాలు వాళ్లకు నచ్చకపోవచ్చు. దయచేసి మీరు మనవైపు పెళ్లిళ్లలోలా సరదాలు, వేళాకోళాలు చేయకండి అని సరి లెమ్మనుకున్నారు వారు. పెళ్ళి వారు స్వగ్రామంలో రాత్రి భోజనాలు చేసి, గోదావరి కాలువపై రాదారి పడవలో బయలుదేరారు. పడవ బొబ్బర్లంక లాకులు వద్ద గోదావరి దాటి మర్నాటి ఉదయానికి పశ్చిమ గోదావరీ జిల్లాలోని తీపర్రు గ్రామం చేరింది. కాలువ ఒడ్డునే వున్న సత్రపు గుమాస్తా ముందుగా వీరు చెప్పినందున వీరికోసం వంటలు చేయించి కనిపెట్టుకొని వున్నారు. పెండ్లివారంతా పడవ దిగి స్నానాద్యనుష్ఠానాలు చేసుకొని భోజనాలు చేసి తిరిగి పడవ ఎక్కారు. ప్రొద్దు వాటారే వేళకు పడవ నరసాపురం చేరింది. పడవల రేవులో సుబ్బారావు గారు, పెద్దళ్లుడు కొడుకులు పెళ్ళి వారిని కలిసి విడిదికి తీసుకొని వెళ్లారు. పెళ్లి వారికి స్వాగతం చెప్పడానికి వెళ్ళిన ఆడ పెళ్లి వారందరి ముఖాలు చిన్నపోయాయి. కొందరి మొఖాల్లో పరిహాసం గోచరించింది. పెండ్లి కుమార్తె మేనమామ రివ్వున విడిదింటి నుండి తిరిగి వచ్చేసారు. బావగారు ఇంటికి రాగానే బారలు చాపుతూ ఆయనతో పొట్లాటకు దిగారు. ‘నీకసలు కళ్లున్నాయా’ మతి మతిలో వుందా? ఆ పెళ్లి కొడుకేమిటి? తల నెరసింది.
బుగ్గలు సొట్టలు పడి వున్నాయి. పారపళ్లు, నల్లటి నలుపు, పొట్టి, పీల. నువ్వు పెళ్లి చేయలేకపోతే పిల్లను పీకనులిమి నూతిలో పారేయలేకపోయావా. మిగతా అన్నదమ్ములంతా బాగానే వున్నారు. మన ప్రాణాలకు ఈ పెళ్లి కొడుకే ఇలా పుట్టుకువచ్చాడు. అని బావగార్ని దులిపేసాడతడు. ‘‘ఒరేయ్! నోరు ముయ్యరా! నీ మాట విని పెద్ద పిల్లకు నీకు నచ్చిన సంబంధం చేసాను. ఒక్క రోజేనా అది సుఖపడిరదా? ఇతడు ఉద్యోగస్తుడు, బుద్ధిమంతుడని ఊళ్లో నలుగురు చెప్పారు. నువ్వు నేను అందంగా వున్నామా? ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నోరెత్తావంటే పళ్లు రాలకొడ్తా. నీకు ఇష్టం అయితే నోరు మూసుకొని వుండు, లేకపోతే పో’’! అని ఉగ్రరూపం ధరించారు సుబ్బారావు గారు. ఆ ఇంట్లో నా పిల్ల సుఖపడుతుందన్న ధైర్యం నాకు వుంది. వియ్యంకుడు మహా పండితుడు ఆయన్ని చూస్తే దణ్ణంపెట్టబుద్దేస్తుంది. అని బావమరిది నోరు మూయించారు. ఈ సంరంభం చూసి మరెవరూ మాట్లాడలేదు.
మర్నాడు ఉదయమే గుండిగతో అన్నం వార్పించి, ఆడ పెళ్ళివారు బాజాలతో విడిదికి వెళ్లి ఆడవార్నీ, మగవార్నీ చల్ధన్నాల పంక్తికి రండి అని పిలిచి వచ్చారు. మగపెళ్ళి వారంతా స్త్రీలు, పురుషులు, పిల్లలతో సహా పట్టుబట్టలు కట్టి, వెండి చెంబులుచేతపట్టి ప్రాంతఃకాల భోజనాలకు వచ్చారు. వారంతా 30 సంవత్సరాల లోపు వారే. పెండ్లి కొడుకు తల్లికి 40 ఏళ్లు. చల్దన్నాల పంక్తిలో ఆమెను చూసి ఆడపెళ్లి వారు ముసి ముసిగా నవ్వుకున్నారు. ఒక్క రోజు ఈమె చల్దన్నం తినకపోతే మునిగిపోతుందా? అని పెండ్లి కొడుకు చెల్లెలు విసుక్కుంది. కంది పొడి, ఆవకాయ వేడి వేడి అన్నం వడ్డించి, నేతి జారీ, నూనె జారీ చేత పట్టి సుబ్బమ్మగారి అక్కగారి అల్లుళ్లు, అల్లుడూ, కొడుకులూ వడ్డన చేసారు. రాత్రి వివాహం జరిగింది. ఉదయం ఊరేగింపు, పసుపుల నలుగులు అయ్యాక అగ్ని హోత్రాల కార్యక్రమం జరుగుతుంది.
( ఇంకా ఉంది )