జీవితంలోని తారతమ్యాలు , గమ్యాలు , మానవ సంబంధాలు , సూర్యోదయా నంతరమే గోచర మావుతుంటాయి . బ్రతుకులోని తడి , మానవత్వాలు అక్కడక్కడ ఒకింత భావుకతా , ఆవేశం , కలిస్తేనే షమీ ఉల్లా “ కవిత్వం అవుతుంది . అతనిది మృదు స్వభావం . మనసులో ఒకటి పైకొకటి వ్యక్తీకరించే మనిషి కాదు . మనసులో ఏముందో నాలుక మీద అదే పలికిస్తాడు . అతని కవిత్వమూ అంతే . ఎప్పుడూ సాహిత్య అధ్యయనం , పరిశోధనల్లో మునిగి తేలే “ష మీ ‘ కవిత్వాన్ని ఇంత అలవోకగా పలికించడం అబ్బురమైన విషయం .
‘ ష మీ ఉల్లా ‘ రాసిన కవితలు ఇతర భాషల్లోకి అనువాద మయ్యాయి . కొన్ని కవితలకి జాతీయ స్థాయిలో బహుమతులు కూడా వచ్చాయి . ష మీ పాల్గొన్న ఎన్నో సాహిత్య సమావేశాల్లో మైనారిటీ సాహిత్యాన్ని అణచివేతల్ని ఎత్తి చూపుతూ , అనర్గళమైన ప్రసంగాలు చేస్తుంటారు . అతని కవిత్వం దగ్గరకొచ్చేసరికి ఆ ప్రభావాలేవి లేని స్వచ్చమైన కవిత్వం ఆవిష్కృతమైంది . ఒకింత పరిమళించిన భావుకత్వం , గులాబీ అత్తరై చదువరుల్ని అలా స్పర్శిస్తూవెళ్తుంది .
‘ అత్తరు వాసన ‘ అనే కవితలో తన జీవితంలో ఎలా ఒక భాగమై పోయిందో చెప్తూనే ముస్లీంల ఒంటి మీది అత్తరు వాసనల్ని , అసహ్యించుకునే సంస్కృతిని ఈసడించుకున్నాడు .
“ అత్తరుకు నాకు
అవినాభావ సంబంధమేదో ఉండాలి
లేని పక్షంలో
తల్లిదండ్రులు పంచి పెట్టిన
వారసత్వపు ఆస్తిలా
చావులోనూ పుట్టుకలోనూ
ఇలా పరిమళమై / నన్నంటి పెట్టుకుని ఉండేదా ?” అని అత్తరు వాసనని గుర్తు చేసుకుంటూ ఇతర వర్గాల నిరసనని కూడా ఇలా వ్యక్తీకరిస్తాడు .
“ నా ఒంటి మీది / అత్తరు వాసనంటేనే
కుళ్లిన దుర్గంధం / కమ్ముకొస్తుందని కదా నువ్వు అంటావు .
డోకొచ్చినట్టుగా తల్లడిల్లి పోతావు
తిండానికి లేకపోయినా
అత్తరు కేం తక్కువలేదు నవాబు గారికి అనేకదా
నా గుమ్మానికి కట్టిన నీ పరిహాసపు పరదాలు
నా నెత్తుటి శ్రమని / నీ వికటాట్ట హాసాల నోట్లో
నమిలి త్రేచ్చిన తమ్మలా / తడిసి ముద్దయి పోయిన
నా సంస్కృతిని / గొణుక్కుంటూ సణుక్కునే బదులు
గుండెలో / గూడు కట్టుకున్న చీకటి విషాదాన్ని
చూశావా / ఎన్నడైనా నాతో !……..
జీవన్మరణ సందిగ్ధ రేఖల మధ్య బందీయై
ఎప్పటికప్పుడూ ఆఖరి క్షణంగా
బతుకీడుస్తున్న వాళ్లలో
కుళ్లిన వాసన కాకుండా / మంచి వాసనవస్తుంది
అంటూ మైనారిటి వర్గాల నైరాశ్యపు జీవితాలను వర్ణించాడు .
మనుష్యుల మనస్తత్వాలు , వారి ఆడంబరాలు , మాటలతో బతికే చాకచక్యం ఉన్న వాళ్ల గురించే “ కొందరు అంతే “ అనే కవితలో ఇలా అంటాడు .
దేనికి రూపాన్నివ్వరూ / ఏదీ పూర్తి చెయ్యరు / శిఖరారోహణం చేసి వచ్చినట్టు / నఖ శిఖ పర్యంతం /పెళ పెళా విరుచుకు పడుతుంటారు / మూడు క్షణాలు అరవు తెచ్చుకుని / ఆరు క్షణాలుగా ప్రకటిస్తుంటారు ……….వీరితో ప్రమాదం లేదు /ఐతే ఒకసారి చంపరూ /చివరికంటా బతకనివ్వరు /
తన భావ జాలానికి , జీవితానికి అండగా నిలిచిన వ్యక్తుల్ని గుర్తు చేసుకుంటూ , వారి పట్ల కృతజ్ఞత చూపిన నైజం కవిలో ఒక బలమైన కవితను ప్రకటించేలా చేసింది . “ వాళ్లలో ఏ ఒక్కరైనా / నా భుజం మీద / చెయ్యి వేసి వీపుని మరక పోతే / నాలో అన్ని వైపులు / మూసుకుపోయేవి /…….తలా ఒక చెయ్యి వేసి చేర్చకపోతే / కదన కుతూహలమై /కవాతు చేయక పోయేవాడిని …..
శతృ దుర్బే ధ్యమైన కత్తుల కవచంగా తీర్చిదిద్దింది వాళ్లే
తూర్పు వేకువగా మిగిల్చింది వాళ్లే
చెల్లా చెదురైన / ఊపిరి ఆకుల్ని రగిల్చి / నన్ను మంటగా పోగేసింది వాళ్లే …….. అని అంటాడు .
ఒకప్పటి వైభవాన్ని , ఆ రహదారి సోయగాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఇలా అంటాడు . “ మా ఊరి రహదారి “ అనే కవితలో
“ గన్నేరు పూల గుబాళిం పులో / దోసిళ్ళ కొద్ది తూనీగల అడుగులేరు కునే వాణ్ణి !….. చెట్ల కొమ్మల్లోని గిజిగాని గూళ్ల / పంతాలకి కేరింతలకి కొలువై రహదారికిరు పక్కలా / పిల్లల్ని పరుగులు తీయించేవి . / ఎడ్ల మెడల్లో ప్రాణంపోసి / ఏళ్లతరబడి రాగాలు కూర్చిన గంటల శబ్దాలు / రహదారికి సన్నాయి రాగాలయ్యేవి .”
ఇంత అంతమైన ఆ ఊరి రహదారి తన ప్రాభవాన్ని కోల్పోయి మనిషి రక్తం రుచి మరిగిన సింహంలా బయపెడుతుందని మెయిలు రాళ్లు సైతం నోరు మెదపటం లేదని , మూగగా రోదిస్తున్నాయని కవి ఆక్రోశం వ్యక్తీకరిస్తాడు . ఆ భావాన్ని కవితా రూపంలో ఇలా అక్షరీకరించాడు .
“ ఇప్పుడు మా ఊరి దారంటే / ఒక నకిలీ సోయగం / మాటు వేసి మోసంతో హత్య చేయడానికి సంసిద్ధమైన శత్రు శిఖరం “ అంటాడు .
ఇంకా ఈ సంపుటిలో “ ఆరని తడి “ , “ ప్రయాణం “ , “పాప “, “పరారీ “ వంటి మరెన్నో మంచి కవితలతో పాటు మొత్తం 36 కవితలున్నాయి . కవిత్వాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం .
రచయిత : డా . షమీ ఉల్లా .
ప్రచురణలు: షీమా ప్రచురణలు , జనవరి 20 11 ,
వెల : 7 0 రూ
ప్రతులకు: విశాలాంధ్ర , నవోదయ , ప్రజాశక్తి మరియు
v. చంద్ర శేఖర శాస్త్రి
#12 – 3 -5 2 ,సాయినాద్ రెసిడెన్సీ , ప్లాట్ నెం .40 4 ,
సాయి నగర్ , అనంతపూర్ – 515001 ,
సంచార వాణి : 94418831904
– అరసి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~