చెపితే నమ్మవు .
కానీ !లీలగా మొదలయిన పాట
జ్వాలా వలయాలుగా
రగుల్కోవడం ప్రారంభమైంది .
మునుపెన్నడూ
విననంతగా పెట్రేగిపోతోంది .
మంట యి ప్రజ్వరిల్లిన
పాటనిండా
బ్రతుకును కాటేసిన గాట్లు కన్పించాయి .
పాటలో
వీరుల్ని సంకెళ్లు కరచిన వైనం చూశాను .
తెగ్గోయ బడ్డ తలలు
విర గొట్టబడ్డ మోకాళ్లు
దీపకళికలయి
పాటలో లయిస్తుంటే
కొడిగట్టిన దుఃఖాల దైన్యాలు
గుండెలో
మేకులయి దిగాబడ్తున్నాయి .
నిస్సందేహంగా ,
అతడి పాటనిండా
ఘనీభవించిన దుఃఖమే పోర్లుతోంది .
ఒకర్నొకరు
కలుసుకోవడానికి వీల్లేకపోయినా
ఎదురెదురుగా నిలబడి
మాట్లాడుకోవడానికి
అవకాశం దొరక్కపోయినా
అతడి పాట
నాలో భాగమైంది .
నేను పూర్తిగా లీనమయ్యాను .
అందుకేనేమో
ఈదురు గాలి తాకిడికి
కిటికీ రెక్కలు కొట్టుకున్నట్లు
అతడి పాట తాకిడికి
ప్రభంజనమై తల్లడిల్లి పోయాను .
ఉండుండి పాట
గుండె తీగల్ని లాగి వదుల్తుంటే
కెరటాలు , కెరటాలుగా విరిగిపడ్డాను .
ఉచ్చ్వాస , నిశ్వాసాలకి
పాట
మౌలికమైన మూలకమై
అడ్డుపడ్తోంది .
నన్నొక సంక్షుభిత సాగరాన్ని చేసి
నా ఆనందాన్నతా
కొల్లగొడ్తోంది .
అదేమీ చిత్రమో
పాట విన్తున్నట్లుండదు .
బ్రతుకు చిత్రం
కళ్ళ ముందు కదలినట్లుంది .
అరణ్యంగా మలుచుకున్నానో
ఆయుధంగా రూపు దిద్దుకున్నానో
అర్ధం కాదు …కానీ!
అతడి పాట
వింటున్నంత సేపూ
నన్ను నేను
పాటలో కలబోసి వడబోసుకున్నాను .
తనివితీరా
పాటలో జీవితాన్ని దర్శించాను .
– ఎస్ .షమీ ఉల్లా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2 Responses to అతడి పాట