బెంగాల్ లో సంపన్న కుటుంబం లో 1883లోమే నెల ఏడవ తేదీన బెహ్రంపూర్ లో జన్మించింది .తండ్రి నఫార్ చంద్ర భట్ట ఆలిపూర్ కోర్టు లో సబ్ జడ్జి గా పని చేశాడు .బాల్యం లో నే వివాహం జరిగి పదిహేనవ ఏటనే భర్తను కోల్పోయి భాగల్పూర్ లో ఉన్న తలి దండ్రులను చేరింది .ఈ సమయం లో ఆమెకు అనురూపా దేవి అనే ప్రసిద్ధ రచయిత్రి తో పరిచయం కలిగి జీవితాంతం ఈ మైత్రిని కొన సాగించింది .పవిత్రం గా వితంతు జీవితాన్ని గడుపుతూ కవిత్వం రాయటం ప్రారంభించింది .శ్రీమతీదేవి అనే మారు పేరుతొ మొదట్లో రచనలు చేసింది .
భాగల్పూర్ నివాసి ప్రసిద్ధ నవలా రచయిత శరత్ చంద్ర చటర్జీ (శరత్)కేంద్రం గా ఒక సాహితీ మిత్ర బృందమేర్పడింది .తాను సాంప్రదాయక వితంతు మహిళ అయి నందువలన ఆ బృందం సమావేశాలు వెళ్ళేది కాదు ,కాని తాను రాసిన కవితలను వారికి అందులో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తన సోదరుడి ద్వారా అంద జేసేది .ఆ కవితలను చదివిన శరత్ వాటిని మెచ్చుకునే వారు .ఇది ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేది .నిరుపమ కు గొప్ప సమర్ధకుడిగా శరత్ నిలబడ్డారని సంబర పడేది .ఆమెను వచనం లో రచన చేయమని శరత్ హితవు చెప్పాడు .వచన రచన లో మహా ప్రసిద్ధుడైన శరత్ వచనం ముందు తాను చేసే వచన రచన వెలవెలబోతుందేమో నని భయపడి మొదట సాహసించ లేక పోయింది .కాని సహరచయిత్రులైన అనురూపాదేవి ,సురూపా దేవి ప్రోద్బలం ,పట్టుదలతో ,ఒప్పించటం వలన వచన రచన కు ఒప్పుకొని ,ప్రయత్నం ప్రారంభించింది .
నిరుపమా దేవి రాసిన మొదటి వచన రచన ‘’ఉచ్చ్రంఖాల్ ‘’అనే నవల .గొప్ప సంచలనాన్ని సృష్టించి ,అందరి అభిమానాన్ని పొందింది ..’’దీదీ’’(పెద్దక్కయ్య)అనే నవల 1915రాస్తే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది . అంతకు రెండేళ్ళ ముందు ‘’అన్నపూర్నార్ మందిర్ ‘’(అన్నపూర్ణ దేవాలయం )ను ,1919లో ‘’శ్యామాలి ‘’నవలరాసింది ఇవీ గొప్ప సంచలన విజయాలను పొందాయి .వీటిలో పాత్రలు సజీవంగా ,ఆదర్శ ప్రాయం గా ఉంటాయి .సామాజిక ద్రుష్టి ,తో రాసిన నవలలు ఇవి .దీదీలో సురోమా పాత్ర చాలా విశిష్టమైనది .సాంప్రదాయ జీవితాన్ని గడుపుతూ ,ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చుకొంటూ సమాజ హితం గా మారాలనేది ఇందులో ఉన్న ముఖ్య సిద్ధాంతం .సంఘ సంస్కరణ అనేది సహజ సిద్ధం గా రావాలని కొరుకునేది .సానుభూతి ,సహవేదన, విస్తృత లోకజ్ఞానం ,ఆత్మ గౌరవం సాధించి ,మార్పు తేవాలని అభిప్రాయ పడింది .
నిరుపమా దేవి రచనలు చేసే కాలం లో మనదేశం లో ముఖ్యంగా బెంగాల్ లో స్వదేశీ ఉద్యమం మాహోద్రుతం గా నడుస్తోంది .సామాజిక మార్పు తో సంఘం ముందడుగు వేస్తోంది .కాని నిరుపమ మాత్రం వ్యక్తీ మానసిక పరివర్తన వల్లనే మార్పు పొందాలనే విషయాలనే రచనల్లో ప్రతి బింబింప జేసింది .సామాజిక బంధాలు విచ్చిన్నం కారాదని భావించింది .ధనిక వర్గాలవారు (భద్రకులు) అందులోని హీరో అమరనాద్ ను బాగా అభిమానించారు . అతనిలాగానే వారూ పల్లెలను వదిలి పట్నాలకు చేరి రాజీయ శూన్యం లో బతుకుతున్నారు .సరోమా అనే వ్యక్తిత్వం ధైర్యం ఆధునిక భావాలు ,ఉన్న మహిళను తీర్చి దిద్దిన తీరు ప్రశంసనీయం గా ఉంది .ఈ పాత్ర శరత్ సృస్టించిన పాత్రలకు విభిన్నం గా ఉండటం గమనించాల్సిన విషయం .సురోమా స్వయం సిద్ధ గా ,స్వయం సమృద్ధితో తనకాళ్ళ పై నిలబడే మహిళగా ,సనాతన ఆచారాలను పాటిస్తూనే ముందడుగేసే ఆదర్శ మూర్తిగా అందరిని ఆకర్షిస్తుంది .ఉమ అనే బాల వితంతువును ప్రకాష్ ప్రేమిస్తున్న విషయం తెలిసి ,ఉమ ను తనతో తీర్ధ యాత్రకు తీసుకొని వెళ్లి ,ప్రకాష్ కు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తుంది .సురోమా ను ప్రకాష్ ప్రేమిస్తాడుకాని ఆమె కరుదనాన్ని అర్ధం చేసుకో లేక పోతూ ఉంటాడు .ఆ కాలం లో ఉమ లాంటి బాల వితంతువు కు పునర్వివాహం నిషిద్ధం . అందుకే ఉమను అతనికి దూరం చేసింది .చాలా ఏళ్ళ తర్వాత ఏంతో ఆలోచించి అమర నాద్ ప్రేమను అంగీకరించింది సురోమ .
జీవితాలం లో తొమ్మిది నవలలు రాసింది .ముందే మనం చెప్పుకొన్న నవలలు కాక ‘’అమేయ ‘’‘’,’’బిదిల్పి’’,’’బంధు’’’’అమర్ డయరి ‘’.’’యుగాంతరేర్ కధ ‘’,’’అనుకర్ష’’ నవలలు రాసింది .ఏ నవలల రాసినా అందులో కుటుంబ నేపధ్యం ఉంటుంది .భారత స్వాతంత్ర్య స్వదేశీ ఉద్యమ సమయం లో ఎన్నో దేశ భక్తీ గేయాలు ,కవితలు ప్రోబోధ గీతాలు రాసి దేశ భక్తిని రగుల్కొల్పింది .అవన్నీ వివిధ పత్రిక లలో ప్రచురితమైనాయి .1938లో ‘’భువన మోహిని స్వర్ణ పతక ‘’పురస్కారాన్ని నిరుపమా దేవి పొందింది .1943లో ‘’జగత్తారిణి బంగారు పతకాన్ని ‘’సాహిత్య సేవకు కలకత్తా యూని వర్సిటి నుండి అందుకొన్నది .జీవిత చరమాంకం లో వైష్ణవ భక్తురాలి గా మారి శ్రీ కృష్ణ దివ్య క్షేత్రమైన బృందావనం లో ప్రశాంత జీవితాన్ని గడిపింది . 7-1-1951న నిరుపమా దేవి 68వ ఏట మరణించింది.
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి