మహాలక్ష్మి లో మార్పు

 లక్ష్మీ రాఘవ

లక్ష్మీ రాఘవ

రిటైర్మెంట్ తరువాత భర్త సొంతవూరు ఐన అగ్రహారానికి వెళ్లి పోదామంటే తెగ ముచ్చట పడింది మహాలక్ష్మి. పచ్చటి పొలాలు, పొల్యూషన్ లేని గాలి, రాత్రిపూట పెరట్లో ఆరుబయట, నీలాకాశం కింద మంచాల మీద పడుకొని నక్షత్రాలను చూడటం, పెరట్లో విరగాపూసే గన్నేరు, నందివర్ధనాలు పూజ కైతే, మల్లెపందిరి విరగ పూసి జడలో అలంకరించుకోవడానికి నాలుగు మూరల పూలూ, సంక్రాంతి సమయాల్లో ఇంటిముందర రంగులద్దిన ముగ్గుల్లో ముచ్చటగా కూర్చునే గొబ్బెమ్మలు…..ఇలా వుహల్లో పల్లె వాతావరణం అందంగా కనిపించ సాగింది. పుట్టి పెరిగిందే కాక, ముప్పై ఏళ్ళ వివాహ జీవితమూ హైదరాబాదు లోనే గడిపేసిన మహాలక్ష్మి, భర్త సొంత వూరైన పల్లెటూరులో సెటిల్ అవుదామన్న ప్రపోజల్ కి నూరు మార్కులూ వేసేసింది.

ఓ వారం ముందుగా వెళ్లి పురాతనమైన తన ఇంటిని ఆవాసయోగ్యంగా తయారు చేయించాడు మహాలక్ష్మి భర్త నారాయణరావు. ఊరు చేరాక, పల్లెటూరు తన ఊహల్లోనిదే కానీ వాస్తవం లో పట్నపు పోకడకు చాలా దగ్గర అయిపోయినదని ఇట్టే గ్రహించేసింది మహాలక్ష్మి. ఇంటింటికీ కుళాయిలు, టి.వీ లకు కేబుల్ కనెక్షన్లు, సరుకులకోసం ఇరవైదాకా కిరాణా కొట్లు, వంటి౦టి కి గ్యాసు,…రెండురోజులకి ఒకసారి వచ్చే మినరల్ వాటర్ సప్లయ్ వ్యాను, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోను…..అబ్బా పల్లె ఇంత మారిపోయిందా? అనుకోక తప్పలేదు. పోనీలే తమ జీవన విధానం లో పెద్ద మార్పు వుండదు అనుకుంది.

కానీ రోజులు గడిచే కొద్దీ ఇక్కడ ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది మహాలక్ష్మి కి. ఎందుకంటే చిన్నప్పటినుండి భక్తీ ఎక్కువ తనకి. పుట్టినింటిలో పూజా పునస్క్రారాలే కాక అప్పట్లో జరిగే చిన్మయానంద భగవద్గీత ప్రవచనాలు నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో,ఎక్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎప్పుడూ నాన్నతో కలిసి వెళ్ళేది. అస్సలు మిస్ అయ్యేది కాదు. ఆతరువాతి కాలం లో పెళ్లి అయిపోయాక కూడా భర్త నారాయణరావు ప్రవచనాలకు తీసుకు వెళ్ళేవాడు.

భగవద్గీత,సుందరాకాండ,రామాయణ,భాగవతాలు..లలితా సహస్ర నామాలు ఒకటేమిటి ఎవరు చెప్పినా వెళ్లి అత్యంత శ్రద్ధ తో వినేవారు. ఇప్పుడు ఇక టి. వి ల మాద్యమం వుండనే వుంది అయినా ప్రత్యక్షంగా వారి ముందు కూర్చుని విన్నంత తృప్తి వుండదు. పల్లెటూరు వచ్చాక అది మిస్ అవుతున్నట్టు అనిపించింది.వూరికి వచ్చాక అక్కడ వున్న రామాలయానికి రొజూ టంచనుగా వెళ్లి వచ్చేవారు. గుళ్ళో ఎప్పుడూ ఎక్కువ జనం కనిపించేవారు వారు కాదు, అదేమిటని పూజారిని అడిగితే “సాయంకాలాలు దేవుడి గుడి కన్నా , టి.వి. సీరియల్స్ ఎక్కువగా చూస్తారు. మీరు గమనించండి టి.వి.ల ముందు జనం ఎట్లా కూర్చుంటారో” నీరసంగా అన్నాడతను.

“భజనలూ..సత్సంగులూ….ఏవైనా….” మహాలక్ష్మి మాటలను మధ్యలోనే త్రుంఛి వేస్తూ “గుడికి రావడం కష్టం అమ్మా…దాని బదులు సెల్ ఫోనులో మాట్లాడు కోవచ్చుఅన్న గతికి వచ్చారు” అన్నాడు పూజారి. శ్రీరామనవమికి ఇక్కడ ప్రతీ ఏటా తిరుణాల జరుగుతుందనీ, ఆ సమయం లో వూర్లోని వారందరూ వస్త్తారనీ తెలిసింది. అంతే కాదు కోదండ రాముడి కళ్యాణ వుత్చవం కమనీయంగా జరుగుతుందనీ, రథోత్చవం రోజు సందడి ఎక్కువగా వుంటుందనీ చెప్పారు. అది వినగానే అలాటి సమయం లో ఒక మంచి ప్రవచనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని పించింది మహాలక్ష్మికి.

“ప్రజలలో ఆసక్తి వుండాలి మహాలక్ష్మీ. ఎందుకు ఆరాట పడతావు”అన్నాడు నారాయణరావు.
‘అలా కాదండీ. ఒకసారి పెద్దవారి భాష్యం వింటే అందరూ మారుతారు. తిరుణాల ఇంత ఆసక్తి గా చేస్త్తారు కదా, పైగా కళ్యాణం రోజు అందరూ వస్తారు కూడా…”
మహాలక్ష్మీ కోసమే సంప్రదించాడు తిరుణాల కార్యకర్త లతో నారాయణరావు,కొంచం అయిష్టం గానే.
“ఇన్నేళ్ళలో ఇలాటివి ఎప్పుడూ చెయ్యలేదు. మీరు కార్యభారం తీసుకుని ఎవరినైనా మాట్లాడండి. ఏర్పాట్లు చేద్దాము.” అన్నారు వాళ్ళు.
అది విని ఉచ్చాహంతో పొంగి పోయింది మహాలక్ష్మీ. వివిధ ప్రవచన కారుల అడ్రస్సులు సంపాదించి, వారిని ఆహ్వానించడానికి వెళ్లాలని అనుకుంది.
“ముందు ఫోనులో మాట్లాడుదాం. వారికి మనం ఇచ్చే తేదీలు అనుకూలంగా వున్నాయో లేదో తెలుసుకుని ఆపైన వెడదాం.” అన్నాడు నారాయణరావు.
అదీ నిజమే….తీరా అంతదూరం వెళ్ళాక వాళ్ళు వేరే వూర్లలో ప్రవచనాలు ఒప్పుకుని వుంటే…వేస్టు అవుతుంది కదా..అనుకుని వాళ్ళకు ఫోన్లు చెయ్యసాగారు.
మహాలక్ష్మికి ఏంతో ఇష్టమైన ప్రవచనకారుడికి మొదటిగా ఫోనుచేసారు. ఆయన ఆవిషయం విన్నాక
“ఏ వూరండీ?” అనడిగారు.
“మదనపల్లె అని..చిత్తూరు జిల్లా అండీ..రిషివ్యాలీ స్కూల్, హార్సిలీ కొండా…మీరు వినేవుంటారు.దాని దగ్గర అగ్రహారం లోనండీ”
“జనం ఎంతమంది వస్తారంటారు?”
“చెప్పలేమండీ. ప్రవచనం ఏర్పాటు ఇదే మొదటిసారి ఇక్కడ. మీ ప్రవచనం తో ప్రజలు తరించిపోవాలని మా ఆశ”
“క్షమించండి. అలా మొదటిసారి ప్రయత్నాలు చెయ్యడానికి నేను రాలేను. నేను వచ్చాను అంటే వినేవారు బాగా వుండాలి. మీరు ఇంకెవరినైనా ప్రయత్నం చేసుకోండి.” అని ఫోను పెట్టేసాడు నిర్మొహమాటంగా.
జనం దండిగా వస్తేనే ప్రవచనమా? శ్రద్దగా వినేవారు పదిమంది వుంటే చాలు అన్ని మనిషేనా ఈ మాటలు అన్నది? అని వాపోయింది మహాలక్ష్మీ.
మరొకరికి ఫోనుచేసారు.

“ఎక్కడన్నారు?మదనపల్లె దగ్గరా? కుదరదండీ నేను చిన్న వూర్లకు ప్రవచనాలకు రాను.”
ఆ సమాధానం తో తలతిరిగింది మహాలక్ష్మికి. అంటే సిటీలు తప్ప చిన్న వూర్లకు రానన్న ఇతనేనా ‘మనుష్యులలో అంతరాలు లేవు అని చెప్పిన మనిషి!
ఇంకొకరికి ఫోను….

“నాకు కొన్ని కండీషన్లు వున్నాయండీ. ప్రవచనాలు ఐదు రోజులకి తక్కువ పెట్టకూడదు. జనం బాగా రావాలి. జనం వస్తేనే కదండీ దేవుడికి శోభ, నా ప్రవచానానికి ఓ అర్థమూ. ఇకపోతే రానూ,పోనూ చార్జీలు పెట్టుకోవాలి. పల్లెటూరు అంటున్నారు కాబట్టి నా బస దగ్గరలోని టౌను లో పెట్టాలి. ఈ ఐదు రొజులూ తిరగటానికి కారు ఏర్పాటు చెయ్యాలి. చివరగా మీరు డబ్బు రూపేణ ఏమీ ఇవ్వక్కర్లేదు కానీ అరకేజీ బరువుగల వెండి కంచం, కుందులూ ఇవ్వాలి. ఇవికూడా దేవుడి పూజ గది కోసమే సుమండీ.”

“అంత ఖరీదు గల పళ్ళెం లాటివి ఇవ్వలేమండి. ఏదో పల్లెటూరి వాళ్ళం…అందులోను మొదటిసారి…మరో మాట చెప్పండి”
“ఇంతకీ ఎప్పుడన్నారు?శ్రీరామనవమి కా?అయితే కుదరదు లెండి. అదే రోజు వేరే చోట ప్రవచనం వుంది. మీరు వేరే ప్రయత్నం చేసుకోండి” ఫోను కట్ చేసాడతాను తెలివిగా.

స్పీకర్ ఆన్ లో వుంచి మాట్లాడ్డం వల్ల అతని సంభాషణ విన్న మహాలక్ష్మి హతాసురాలైంది. ఇలాటి వ్యక్తుల ప్రవచానాలా ఇన్నాళ్ళుగా తను విని మురిసిందీ? ఇంకోసారి వీరి భాషణం వినగాలదా? చాలా బాధేసింది మహాలక్ష్మికి. ఆరోజంతా అన్యమనస్కగా వుంది.

సాయంకాలం ఒకతను వచ్చాడు. అరవై ఏళ్లు వుండవచ్చు. బక్కగా వున్నాడు. వేషధారణ బట్టి పూజారి లా వున్నాడు.
“ఏమి కావాలండీ?” అంది మహాలక్ష్మీ.
“అమ్మా, మీరు తిరునాళ్ళలో ప్రవచనం ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు గుడి కెడితే…”
“అవునండీ. ఆ ప్రయత్నం లో వున్నాము”

“ అమ్మా, నాపేరు రామచంద్ర శర్మ. ఇక్కడికి దగ్గరలోని చలవపల్లె లోని రాములవారి గుడిలో పూజారిని. నేను రామాయణం బాగా చెప్పగలను. హరికథలు వచ్చాక పల్లెల్లో ప్రవచనాలు తక్కువ. ఈసారి మొదటిసారిగా తిరునాళ్ళలో ప్రవచనం అంటే సంతోష పడ్డాను. దేవుడి కళ్యాణం రోజు రాత్రి ప్రవచనం పెట్టిస్తే మూడు గంటల్లో మంగళం తో ముగించగలను.” ఏంతో నమ్రతగా, నమ్మకంగా మాట్లాడుతున్న అతన్ని రాములవారు తమ వద్దకు పంపినారనిపించింది మహాలక్ష్మీ కి. నారాయణరావు బయటకు వేళ్ళారనీ రాగానే చేబుతాననీ అంది. ఆయన వెనుదిరగ బోతుంటే
“అయ్యా ఒక్కనిముషం..”అంది. ఆయన ఆగాడు

“మీరు ఎంత డబ్బు తీసుకుంటారో చెబితే ఆయనతో మాట్లాడుతాను.” అంది.
‘అమ్మా…దేవుడి పేరుమీద, ఆయన కళ్యాణం రోజున రామాయణం చెప్పడానికి అవకాసం రావడమే గొప్ప, దాన్ని డబ్బుతో కొలవకండి. మీరేమీ ఇవ్వకపోయినా ఈ అవకాసం ఇస్తే అదే పదివేలు.” అన్నాడు దండం పెడుతూ.
అప్రయత్నంగా రెండు చేతులూ ఎత్తి దండం పెట్టింది మహాలక్ష్మీ.
ఇక్కడే ఇలాటి మనిషి వుండగా డబ్బులు,జనం అని మాట్లాడేవారిని అడగటం ఎంత బాధాకరం…అనిపించి౦దా క్షణంలో.
అందుకే వెంటనే “మీ ప్రవచనం ఖాయం శర్మగారూ. సాయంకాలం వచ్చి ఒక సారి కనబడండి.”అంది హృదయపూర్వకంగా.

***                                  ***                                 ***                                   ***                   ****                 

శ్రీరామ నవమి రోజు రాత్రి కళ్యాణం జరిగే ఆవరణం లోనే ఒక ప్రక్కగా షామియానా వేయించారు రామచంద్ర శర్మ ప్రవచానానికి. ప్రవచనం ప్రార్థన తో మొదలైతే వినడానికి ఆసక్తి చూపిన జనం తక్కువగా అనిపించినా పరవాలేదు అనుకుంది మహాలక్ష్మీ. కోదండ రాముడి కళ్యాణ కార్యక్రమం మొదలవగానే జనమంతా అది చూడడానికి ఎగబడ్డారు. రామచంద్ర శర్మ మాత్రం తన్మయత్వం తో రామాయణ గాధను వివరిస్తున్నాడు.

కాస్సేపటికే డప్పుల మోత, క్రమబద్దంగా పిల్లనగ్రోవి నాదం, గజ్జెల చప్పుడూ వినిపించ సాగాయి. ఏమిటని పక్కవారిని అడిగితే గంగిరెద్దులు వస్తున్నాయి అన్నారు. గంగిరెద్దులు రావటం గుడి చుట్టూ ప్రదక్షణం చేయడం లో చప్పుడూ ఎక్కువై రామచంద్ర శర్మ గొంతు వినపడనే లేదు.
దేవుడి కల్యాణం ముగియటం, మంగళం తో ప్రవచనాన్ని ముగించడం జరిగింది. అతని ప్రవచానానికి ముచ్చటగా ముగ్గురు కూడా లేక పోయినా శర్మ ముఖం లో సంతృప్తి కొండంత కనిపించింది. రామచంద్ర శర్మకి వెయ్యి రూపాయలు తాంబూలం పెట్టి ఇచ్చారు నారాయణరావు దంపతులు.
కళ్యాణం అవగానే అక్కడ చేరిన ఆడవాళ్ళంతా దేవుడికి టెంకాయలు కొట్టి, హారతి పుచ్చుకున్నారు. కళ్యాణం చేసుకున్న రాములవారిని, సతీ సమేతంగా గరుడవాహనం మీదికి కూర్చోబెట్టడానికి సన్నాహాలు మొదలయ్యాయి. గరుడ వాహనం మీద కొత్త దంపతులు వూరేగింపు గా వస్తారు కనుక ఇంటికి బయలుదేరారు మహాలక్ష్మి దంపతులు.అప్పటికే రాత్రి రెండు గంటలు దాటింది .

రోడ్లంతా జనం తో నిండి వున్నాయి. రోడ్డు కిరువైపులా చిన్న, చిన్న దుఖాణాలు వెలిసాయి.అందరూ సరదాగా వున్నట్టు అనిపించింది. అప్పుడు వినిపించింది మైకులో మాడ్రన్ పాటలు హోరేట్టేలా. కొద్దిగా పక్కకు తిరిగి చూస్తే విధ్యుత్ద్దీపాలంకరణ లతో వున్న వాహనాలు కనిపించాయి. వె౦టనే జనం పరుగులుతీశారు.’చాందినీ బండ్లు వచ్చాయోచ్’ అని తోసేస్తున్న జనాన్ని తప్పించుకుంటూ ఇల్లు చేరారు. దేవుడి వూరేగింపు తమ ఇంటికి వచ్చేసరికి తెల్లారి పోతుంది కనుక కాస్సేపు నడుం వాల్చవచ్చు అనుకున్న మహాలక్ష్మికి విపరీతమైన సౌండుతో వస్తున్న ‘ఆ…అంటే అమలాపురం…’ ‘ కెవ్వుకేక’ లాటి పాటలు చెవులు చిల్లులు పడేలా వినపడ్డాయి..తిరునాళ్ళలో ఈ సంబరాలు ఏమిటో చూద్దామనిపించి కిటికీలో నుండి బయటకు చూసింది. చాందినీ బండ్లు అనబడే వాహనాల్లో వెనక భాగం లో అసభ్యకరంగా డాన్సులు…ఒక ఆడ. ఒక మగాడు, జుగుప్సాకరం గా కౌగిలిన్చుకుంటూ డాన్స్ చేస్తుంటే కింద నిలబడ్డ జనం ఈలలు వేస్తూ, చిల్లర డబ్బులు విసరుతూ కనిపించారు. తిరునాళ్ళ లో ఈ పాటలు, డాన్స్ లూ… ఏమిటీ ఘోరం? అనుకుంటూ కిటికీ మూసేసి కుర్చీలో కూర్చుంది మహాలక్ష్మీ…బయట గోల క్రమంగా తగ్గింది. అప్పుడు వినపడింది మంగళ వాయిద్యాల శబ్దం! దేవుడు వస్తున్నాడని టెంకాయ, కర్పూరం పళ్ళెంతో బయటకు వచ్చారు మహాలక్ష్మీ, నారాయణరావు.

గరుడ వాహనం మీద కొత్త పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్ల అలంకారం లో శ్రీ రాములవారు సీతమ్మ ఎంతబాగున్నారో అని చూస్తూ తరించిపోయింది మహాలక్ష్మీ. పూజారి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తూ వుంటే చుట్టూ పరికించి చూసింది. దేవుడి చుట్టూ పట్టుమని పదిమంది కూడా లేరు. అంటే జనం పరుగులుతీసేది చాందినీ బండ్ల వైపే కానీ భగవంతుడి వెనక కాదుఅనిపించి ఏడుపోచ్చింది మహాలక్ష్మికి. ఎటుపోతున్నాం మనం? భగవద్గీత ఆవిర్భవించిన దేశంలో పుట్టి మనం అనుసరిస్తున్నదేమిటి?
అపారమైన జ్ఞాన సంపదతో, ప్రవచనాలు చెప్పేవారు ప్రవచానానికి ఇంత అనీ ,ఇక్కడ అనీ లెక్కలు చెప్పినప్పుడు కలిగిన ఎవగింపే ఇంకా రెట్టింపయ్యింది.

ప్రవచనాలతో జనాలలో మార్పు వస్తుందని లేదా వాళ్ళలో మార్పుతేవచ్చని ఆశించే అవసరం లేదనీ ఎవరికి వారు వారి కర్మలను బట్టి వ్యవహరిస్తారు కనుక , తను అనుసరించే మార్గంలో సత్యాన్ని వెదుక్కుని తనను తాను ప్రక్షాళన చేసుకుంటే చాలని కనువిప్పు కలిగాక మహాలక్ష్మి మారింది చాలా…

– లక్ష్మీ రాఘవ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
10 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
a.gowrirao
a.gowrirao
6 years ago

చాల లేట్గ గ చ ధీ వి నా చాల సంతోషంగా ఉంది .. గొప్పవారి ప్రవచనాలు వస్తుందంటే ఎన్థొఆశక్థిగ వింటూ దానిని చెప్పే వారంటే ఎంతో ఆరాధన బావం కలుగుతుంది కానీ మీ కథ మాకు కనువిప్పు కలగచేసింది .జ్ఞానం ఉంటేనే సరిపోదు తగిన సంస్కారం గూడా వుండాలి కాదు

alluri gouri lakshmi
alluri gouri lakshmi
6 years ago

తనను తాను ప్రక్షాళన chesukundamani
anukunne vallake pravachanaalu..lakshmi garoo

manchi kadha rasinanduku abhinandanalu..

indira.
indira.
6 years ago

రాను రాను పల్లెటూళ్ళు కూడా దూరపు కొండల సామెత ని గుర్తు చేస్తున్నాయి.మీ కధ చాలా బాగుంది.చాలాయేళ్ళ తరువాత ఒక వారం మా వూళ్ళొగదిపిన తరువాత కొంత అసంతృప్తిగానే వెనుదిరిగాం!!

మంథా భానుమతి

కథ చాలా బాగుంది.. ఈ కాలంలో ప్రజల ప్రాధాన్యాలని చూపుతూ. మహలక్ష్మికి అయిన అనుభవం చాలా మందికి అయే ఉంటుంది.
ఆధునీకరణ కి ఆనందించాలో, తగ్గిపోతున్న విలువలకి విచారించాలో తెలియడం లేదు. అభినందనలు లక్ష్మీ రాఘవ గారూ!

Lakshmi raghava
Lakshmi raghava
6 years ago

మీ అభిప్రాయం సంతోషాన్ని ఇచ్చింది భానుమతి గారు

G.S.Lakshmi
G.S.Lakshmi
6 years ago

మనుషులు వాళ్లకి కావలసినదేమిటో తెలీక గొర్రెల మందలా ఒకరి వెనకాల మరొకరు వెడుతున్నారు. ఒక్క క్షణం వారంతట వారు ఆలోచించుకోవటంలేదు. వాస్తవాన్ని బాగా చెప్పారండీ.. కథ చాలా బాగుంది.

Lakshmi raghava
Lakshmi raghava
6 years ago
Reply to  G.S.Lakshmi

ధన్యవాదాలు Laksmi గారు…..ఎప్పుడు ఆలోచిస్తారు అనిపిస్త్తుంది

Lakshmi raghava
Lakshmi raghava
6 years ago

థాంక్స్ హైమవతి గారు .

Aduri.Hymavathy.
6 years ago

లక్ష్మీ రాఘవ గారూ అద్భుతమైన ఆధునిక పల్లెవాతావరణాన్ని కళ్ళలుకట్టారు.నేడు పల్లెలు చిన్న నగరాలైపోయాయి.నగరవాతావరణం గ్రామీణ సుగంధాలను మురికి చేసేసింది. మింగేసింది.అందుకోండి అభినందనలు.

Lakshmi raghava
Lakshmi raghava
6 years ago

హైమవతి గారు,
ఒక విధంగా అనుభవం తో రాసిన ఈ కథ మీ స్పందన Inkatha లోతుగా వుండాలని కోరుతున్న . థాంక్స్