నా కళ్లతో అమెరికా- 37 ఎల్లోస్టోన్

 

DrK.Geetaజూలై నెల మొదటి వారపు ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకేండ్ సెలవులు లో ఎటైనా వెళ్లొద్దామని అనుకున్నాం. ఇప్పటికే ఒక సారి చూసిన ప్రదేశాల్ని రెండో సారి మరో సీజన్ లో చూడడం లో భాగంగా యూసోమిటీ, గ్రాండ్ కెన్యన్ లకు మళ్ళీ వెళ్లొచ్చాం. ఈ సారి ఇంత వరకూ చూడని ప్రదేశమైతే బావుణ్ణని అనుకోగానే మా వరు “ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్” అంది. “ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్” వ్యోమింగ్ రాష్ట్రం లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేషనల్ పార్క్ లలో ఒకటి. సాధారణంగా ఇటువంటి ఫేమస్ ప్రదేశాలకు సెలవుల్లో వెళ్లాలంటే ముందు అక్కడ ఎకామడేషన్ దొరకాలి. గూగుల్ బాబాయినడిగి దూరాభారాలు చూసే ముందే అనుకున్నదే తడవుగా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ వెబ్ సైట్ లో కెళ్లి, ఎకాడేషన్ ఖాళీ కోసం చూడడం మొదలు పెట్టేము.

                             సాధారణంగా నేషనల్ పార్కు ల్లో ఎకామడేషన్లు రకరకాల ఆప్షన్ల లో ఉంటాయి. కొన్ని కాంపింగ్ సైట్లు. అంటే మన టెంట్, మన బిచాణాలు మనమే పట్టుకెళ్లి, అక్కడున్న స్థలాన్ని అద్దెకు తీసుకుని బుక్ చేసుకున్నన్ని రోజులు ఉండి రావడమన్న మాట. పిల్లలతో నేనస్సలు ఇలాంటి కాంపింగు పిఫర్ చెయ్యను ఎప్పుడూ. ఇక కొన్ని -బాత్రూములు దూరంగా ఉండే” సెమీ కాంపింగు ఎకామడేషన్లు”. వీటికి ఎకామడేషన్ షెడ్లలో ఉంటుంది. మరి కొన్ని హోటళ్లు, మరికొన్ని బాగా ఖరీదైన రిసార్టులు.

ఇక ఎల్లో స్టోన్ నేషనల్ పార్కులో మాకు తగినట్టుగా ఎటువంటి ఆప్షనూ మేమనుకున్నట్లు నాలుగు రోజుల పాటు ఖాళీ లేదు.

వెతగ్గా వెతగ్గా రెండు రోజులకు మాత్రమే, అది కూడా ఒక్కొక్క రోజు ఒక్కచోట చొప్పున ఖాళీలు కనిపించాయి. అదీ బాగా ఖరీదెక్కువ. అయినా ముందు బుక్ చేసుకుని తర్వాత ఆలోచిద్దామని కనబడ్డ రెండు రోజులకు బుక్ చేసాం. ఇక ఎంత వెతికినా మరి రెండు రోజులకు దొరకలేదు. మరి రెండు రోజులకు నేషనల్ పార్కు బయట దగ్గర్లో ఉన్న ప్రైవేటు రిసార్టుల్లో బుక్ చేసాం. అక్కడి నుంచి నేషనల్ పార్కు మరో 20 మైళ్లలో ఉంది. ఇంతకీ ఎల్లోస్టోన్ మా ఇంటి నుంచి దగ్గరా దాపూ కాదు. దాదాపు వెయ్యి మైళ్ల పైచిలుకు దూరంలో ఉంది. ఇక ప్రయాణ సన్నాహాలు మొదలెట్టాం. ఎప్పటిలానే అన్నీ ప్లాన్ చేసే పని నా మీద పడింది. అయితే అభిప్రాయ సేకరణ తర్వాతే ప్లాన్ అని చెప్పి అందర్నీ కూచో బెట్టేను.

              అంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడమా, లేక ప్లైట్ లో వెళ్ళడం వంటి ఇతర ఆప్షన్లు ఎలా ఉంటాయి అని మొదట ఆలోచించాం. మా ఇంటి నుంచి మేం కారులో వెళ్లేమాటైతే వరుసగా లేక్ తాహో, రీనో, కార్సన్ సిటీ వంటి చూసిన ప్రదేశాల మీదుగా వెళ్లాల్సి ఉంది. పైగా ఒక వైపు డ్రైవ్ ఒక రోజులో అయ్యే పని కాదు, కాబట్టి ఇటు రెండు రోజులు అటు రెండు రోజులు డ్రైవ్ కి కావాలి. పైగా పిల్లల్తో బాగా అలిసి పోతాం.

 [tribulant_slideshow post_id=”13122″]

సత్యకి ఎప్పట్నించో రైలెక్కి దూర ప్రయాణం చేయాలని కోరికగా ఉంది. కానీ తిన్నగా మా ఊరి నించి కాక మా పక్క ఊరి నించి, పైగా ఎల్లోస్టోన్ కి కాకుండా అక్కడి నించి 300 మైళ్ల దూరంలో ఉన్న సాల్ట్ లేక్ సిటీ కి ఉంది. పైగా కారు లో డ్రైవ్ చేసినంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇక ఈ సాల్ట్ లేక్ సిటీ మా ఇంటి నుంచి దాదాపు 800 మైళ్ల దూరం. మేమున్న కాలిఫోర్నియా నుంచి తూర్పు దిశగా వెళితే నెవాడా రాష్ట్రం వస్తుంది. నెవాడా రాష్ట్రం దాటి వెళితే ఉత్తరంగా ఐదహో, తూర్పున వ్యోమింగ్, దక్షిణంగా యూటా రాష్ట్రాలున్నాయి.

                          అయితే మొత్తంగా నెవాడా రాష్ట్రం దాటడమే పెద్ద ప్రయాణం. సాల్ట్ లేక్ సిటీ యూటా రాష్ట్రం లో ఉన్నా, మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న చారిత్రాత్మక నగరం. చూడదగ్గది. అందుకే నేనొక్క మహత్తరమైన అయిడియా వేసాను. మా ఊరి నుంచి సాల్ట్ లేక్ సిటీ వరకు ఫ్లయిట్ లో వెళ్లి అక్కణ్ణించి కారు అద్దెకు తీసుకుని ఆ పక్కనున్న రాష్ట్రాలన్నీ చుట్టి వచ్చేస్తే, ఎలాగూ ఫ్లయిట్ లో వెళతాం కాబట్టి సమయమూ మిగుల్తుంది, ఆ తర్వాత ఆ చుట్టు పక్కల రోజంతా డ్రైవ్ చేసే ఓపికా ఉంటుంది. ఇక ప్లయిట్ టిక్కట్టు రైలు టిక్కట్టుతో సమానం.

ఈ అయిడియా గురించి వరు మాటల్లో చెప్పాలంటే “నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకోక తప్పలేదు అందరికీ”. ఎందుకంటే మాకు సమయం చాలా ఇంపార్టెంట్. సత్యకు ఆట్టే సెలవులు ఉండవు. అయినా మొత్తానికి వారం రోజుల ప్లాను సిద్ధమైంది. ఇక చక చకా ఫ్లయిట్ బుక్ చేసేం. మనిషికి $200 డాలర్లు రానూ, పోనూ. అక్కడి నించి ఆన్ లైనులో రివ్యూలూ గట్రా చదివి కార్ల అద్దె కంపెనీ ఏది బావుందని చెప్పేరో చూసుకుని అందులో కారు కూడా బుక్ చేసేం. మామూలు కార్లు, ఎస్యూవీలు నడిపేసేం కాబట్టి ఈ సారి మిడ్ సైజు జీపు నడపాలని అది బుక్ చేసేం. వారానికి దాని అద్దె, పెట్రోలు దాదాపుగా అయిదు వందలు లెక్కకొచ్చింది.

ఇక ప్లాన్ ఈ విధంగా చదివేను. శుక్రవారం రాత్రి 9 గంటల ఫ్లయిట్ కు బయలుదేరి సాల్ట్ లేక్ సిటీకి 12 గంటలకు చేరతాం. కారు ఎయిర్పోర్టులోనే తీసుకుని, హోటలుకి వెళ్లిపోతాం, మర్నాడు శనివారమంతా సాల్ట్ లేక్ సిటీ టూర్ చూసుకుని, ఆదివారం ఉదయం దారిలో విశేషాలు చూసుకుంటూ సీనిక్ రూట్ ద్వారా పక్క రాష్ట్రాల మీదుగా సాయంత్రానికి వ్యోమింగ్ లోని నేషనల్ పార్కు ఎంట్రన్సు బయట ఉన్న హోటల్ కి చేరతాం. సోమవారం ఉదయం బయలుదేరి నేషనల్ పార్కులోనికి వెళ్ళి విశేషాలు చూసుకుంటూ ఆ రాత్రికి అక్కడే బస చేసి, మర్నాడు మంగళ వారం కూడా మిగతా విశేషాలు చూసుకుని మరలా లోపలే ఉన్న మరో రిసార్టు లో బస చేసి, బుధ వారం తిరుగు ప్రయాణం ప్రారంభించి మరో దారి గుండా పక్క రాష్ట్రాలు చూసుకుంటూ రాత్రికి సాల్ట్ లేక్ సిటీ కి వచ్చి అక్కడ బస చేసి మర్నాడు ఉదయం 6 గంటల ఫ్లయిట్ కి వెనక్కి వచ్చేస్తే ఉదయం 9 గంటల కల్లా ఇంటికి వచ్చేస్తాం. నేరుగా సత్య అదే రోజు ఆఫీసుకి కూడా వెళ్లి పోవచ్చు.

నా ప్లాను ప్రకారం అన్ని హోటళ్లూ బుక్ చేయడం పూర్తి కాగానే వరుకి నేషనల్ పార్కు కి సంబంధించిన గైడు తయారు చేయమని, పరిశోధన చేసి ప్రింట్ అవుట్లతో సహా నోట్సు ప్రిపేర్ చెయ్యమని పని అప్పగించాం. ఇక అందరి లగేజ్ లూ సర్దడం వంటివి నాకు మామూలేగా. ఇవన్నీ ఇరవై రోజుల ముందే ప్లాను చేసేం కాబట్టి కొత్తగా కొన్న కేమెరాతో సిద్ధమయ్యాం. శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శానోజే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కి టాక్సీలో చేరుకున్నాం. ఈ ప్రయాణం లో కోమల్ మాతో రాలేదు. ఇంతకీ సరిగ్గా ఎయిర్పోర్ట్ లో దిగిన పది నిమిషాల్లో గుర్తు వచ్చింది, మేం కొత్తగా కొన్న కేమెరాకి చార్జర్ బాటరీ తో సహా ఇంట్లో గోడకి ఛార్జ్ పెట్టి మర్చి పోయేము. ఇక కేమెరా పని చెయ్యదు, లేదా సాల్ట్ లేక్ సిటీ లో మరలా చార్జర్, బాటరీ కొత్తవి కొనాలి. ఇంతలో మా ఫ్లయిట్ మరో గంట ఆలస్యంగా నడుస్తూందని అనౌన్స్ మెంట్ వచ్చింది.

ఇక నేను త్వరత్వరగా ఆలోచించి ఇంటికి బయలుదేరెళ్లి తెద్దామని నిర్ణయించుకుని ఎయిర్ పోర్టు షటిల్ బస్సెక్కి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసేను. అక్కణ్నించి మా ఇంటికి బస్సులో వెళ్లి రావాలంటే సరిగ్గా 2 గంటలు పడుతుంది. కానీ వెంట వెంటనే బస్సులు దొరకాలి. టాక్సీలో వెళితే 100 డాలర్ల ఖర్చు అవుతుంది. ఇంతలో ఇంట్లో కోమల్ ఉన్నాడు కదా అని గుర్తు వచ్చి ఎందుకైనా మంచిదని ఫోన్ చేసేను. కోమల్ వెంటనే తను బయలుదేరి వస్తాను, నన్ను ఎయిర్ పోర్టుకి మరలా వెళ్లిపోమని చెప్పేడు. నేను వెనక్కి మరో అరగంటలో రాగానే పిల్లలు ఆకలో అని అరవడం మొదలు పెట్టేరు. ఇంకా 7 కూడా కాలేదు కదా అన్నా, ఇప్పుడే తింటామని పేచీ. ఆ ఎయిర్పోర్టు డిపార్చర్ పాయింట్ దగ్గర్లో ఎక్కడా తినేందుకేమీ లేవు, ఏవో చిన్న స్నాక్సు తప్ప.

బయలుదేరడమే అపశకునంలాగా అనిపించింది నాకు. అయినా ఇక చేసేదేముంది, కోమల్ కి మరలా ఫోన్ చేసి, దారిలో మాకొక పీజా, మంచి నీళ్లు కూడా తీసుకు రమ్మని మరలా చెప్పేను. 9 గంటల కల్లా కోమల్ ఇవన్నీ పట్టుకుని తెచ్చి ఇచ్చి వెళ్లేడు. ఫ్లయిట్ 10 గంటలకు వాయిదా పడడం వల్ల అక్కడ అలా లేటైనా సరిపోయింది. మొత్తానికి హడావిడిగా తిని లోపలికి పరుగెత్తేం.

ఇక ఈ ప్రయాణం లో సిరి కి కారు సీటు ఇంటి నుంచి పట్టు కెళ్ళాలని నిశ్చయించాం. నిజానికి అద్దె కార్ల వాళ్ల దగ్గిర ఇలా పిల్లల కోసమని ప్రత్యేక అద్దెకి కారు సీట్లు ఉంటాయి. కానీ ఆ సీటుకి చెల్లించే అద్దె పెడితే కొత్త కారు సీటు వస్తుంది, పైగా శుభ్రత కూడా ఉండదని ఆన్లైను లో చదివేం. అయితే కారు సీటు ఫ్లయిట్ లో పట్టుకెళ్ళడానికి వీలుగా దానికి చక్రాలతో ఉండే ఒక ఫోల్డీంగ్ బండొకటి కొన్నాం. ఇక హేండ్ లగేజీ తప్ప పెద్ద సూట్ కేసుల వంటివి పట్టుకెళ్తే డొమెస్టిక్ ఎయిర్లైన్సులలో ఎక్స్ ట్రా ఛార్జి కట్టాలి. అంచేత కేవలం మా లగేజీ అంతా మాతో కేబిన్ లోకి పట్టుకెళ్లగలిగే సైజు బాగులు, సూట్ కేసుల్లోనే సర్దాం. ఇక సిరి బేబీకార్టు

తప్పనిసరిగా పట్టుకెళ్లాలి. ఇలా వరసపెట్టి మా లగేజి పెరిగిపోయింది. సరిగ్గా బయలుదేరే ముందు ఇంటి దగ్గర మా లగేజీ చూసి “అమ్మ బాబోయ్” అని కళ్ళు తేలేసేడు సత్య. మొత్తానికి వరుకి కూడా లగేజీ లాక్కెళ్లే పనిబడింది ఈ సారి. అన్నీ అక్కడికి సజావుగా జరిగినందుకు ఎయిర్ పోర్టు లో విమానం ఎక్కేక “హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకున్నాం.

(ఇంకా వుంది)

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.