జోగిని

santhi prabodha ”నీ కాల్మొక్త – దేనికి దొర ”
”గదేందిర … అంతల్నే యాది మర్సినావుర?”
”సమజ్‌ కాకచ్చింది దొర.. నీ బాంచన్‌”
”గదేర – మీ మాలోల్లతోని, మాదిగోల్లతోని పరేశాన్‌… మాట మరుస్తరు… బిడ్డను జోగిడ్సిన ముచ్చట మార్సినావుర? నీ బిడ్డ పోసానికి పట్టం కట్టెతందుకుర” ఎల్లయ్య మొహంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ…

”నీ కాల్మొక్త దొర, పెద్ద బిడ్డకు పట్టం గట్టిన గద దొర. సిన్న దాన్కి సంసారి లగ్గం జేస్త దొర, నీ బాంచెన్‌… గులాపోల్లం దొర” అదిరి పడిన ఎల్లయ్య ఒక్కొక్క మాట కూడదీసుకుంటూ… అతని కాళ్ళు పట్టుకోబోతూ…

”ఓరి… ఎల్లిగా.లెవ్‌..లెవ్‌.. ఏందిర, నీకు దమాక్‌ గిన ఖరాబయిందా…? ఎల్లమ్మకు బండారు బెట్టి బిడ్డను బతికించుకుంటివి. ఏరెల్లినంక తెప్ప తగలేసినట్టు గిప్పుడు బిడ్డను సంసారి జేస్తనంటే ఎట్లనడుస్తదిర? బిడ్డకు బండారుబెట్టి ఊరిని కాపాడినవు అనుకున్నం. గిప్పుడు గిట్ల ఎదురు మాట్లాడ్తవ్‌రా బాడ్కవ్‌” మొదట నెమ్మదిగా మాట్లాడినా తర్వాత ఉగ్రనరసింహావతారమెత్తాడు భోజాగౌడ్‌.

”దొర, నీ కాల్మొక్త దొర.. నా బిడ్డకు ఒగ్గెయ్‌ దొర…” అంటూ భోజాగౌడ్‌ కాళ్ళకు చుట్టుకు పోయాడు ఎల్లయ్య.
”ఏందిర, మాటలు బగ్గస్తున్నయ్‌… ఏంది మాటకు మాట జెప్తున్నవ్‌? ఆ పోరి నీ బిడ్డ కాదు. ఎన్నడైతే అమ్మోరి బండారు అద్దినవో, ఎన్నడైతే మొక్కినవో… గప్పుడు అది దేవుడి సొమ్మైంది. దేవుళ్ళు ఎవలు? దేవతలు ఎవల్లు..? ఊరందరోల్లు, దేవుని సొమ్ముని నా సొమ్మంటే నడుత్తదా..? నా ఇష్టం వచ్చినట్లు చేస్కుంటనంటే ఊరు ఊకుంటదా..? అమ్మోరు ఊకుంటదా…? అమ్మోరు ఆగ్రహిస్తే ఏమయితదో ఆలోచించినావా…?” కాలితో ఎల్లయ్యను తన్నేస్తూ బెదిరింపుతో కూడిన హుంకరింపు.

” నీ బాంచన్‌ దొర… కాల్మొక్త దొర” ఎల్లయ్య
కొన్ని రోజులు గడిచాయి. ఊర్లో గత్తర లేచింది. ఊరంత ఎల్లయ్యని తప్పుపట్టడం మొదలు పెట్టారు. ” ఆపద వచ్చినపుడు ఆమ్మోరికి ముడుపులు కట్టి, మొక్కి గిప్పుడు మరిస్తే… ఇట్లాగే అవుతుంది.” అన్నాడు భోజాగౌడ్‌.
” ఏదో ఒకటి ఈ క్షణంల తేల్చాల” భోజాగౌడ్‌
తరతరాలుగా దొరతనం సంకెళ్ళలో, బానిసలుగా మగ్గుతూ దారిద్య్రం, అవిద్య, అజ్ఞానం, అంధవిశ్వాసాల కబంధ హస్తాలలో చిక్కిన ఊరి జనం తలో మాట….
ఎల్లయ్య కుటుంబాన్నే తప్పుపడ్తూ… తాము పీల్చేగాలి, తాము తినే తిండి అన్నీ పెద్దోళ్ళ దయా దాక్షిణ్యమే.. ఈ అమాయకులకు తమదంటూ ఏం లేదు. తమ పిల్లలపై కూడా తమకు హక్కులేదు. అంతా గులాంగిరి గాళ్ళ బతుకులింతే అనుకుంటారు. పెద్దోల్ల మాటల్ని మీరేంత ధైర్యం, సాహసం అక్కడున్న వాళ్ళెవరికీ లేదు.
” మీ బాంచెన్‌ దొర… మీ గులాపోల్లం.. ఈ తప్పు కాయిన్రి దొర… నీ కాల్మొక్త.. పెద్దోల్ల మాట ఎన్నడన్న కాదన్నమా… అట్లనే జేత్త దొర… నీ బాంచెన్‌ దొర” అశక్తుడైన ఎల్లయ్య వంగి వంగి దండాలు పెడ్తూ…

పోసానికి అపుడు తొమ్మిదేళ్ళు ఉంటాయేమో! ఆ రోజు ఆమెకు బాగా గుర్తు. కారణం అది ఆమెను దేవతతో పెళ్ళి చేసిన రోజు. ఆమె జోగినిగా మార్చబడిన రోజు. పెళ్ళి ముహూర్తాన్ని ఊరంతా చాటింపు వేసి చెప్పించాడు ఎల్లయ్య. అంతకు ముందు గుడిసెకు కొత్త కంపతో దడికట్టి దాన్ని మట్టితో మెత్తి అలికి ముగ్గులు పెట్టారు. ఇంటి ముంగట పందిరి వేశారు. పందిరికి మామిడి తోరాలు కట్టారు. పోశమ్మ పండుగ చేశారు. ముత్తైదువులు వచ్చి పోశాని ఒళ్ళంతా పసుపు రాసి తలారా స్నానం చేయించారు. బిందెలతో నీళ్ళు గుమ్మరించారు.

                 అంతలో, గౌడ్‌ ఇంటి నుండి సుంకరోడు సామాన్లు తెచ్చాడు. పోసానికి తెల్ల చీర, రవిక, ఇంట్లో వాళ్ళందరికీ బట్టలూ. కూతురికి ఎల్లయ్య కూడా బట్టలు కొన్నాడు. కాళ్ళకు పట్టగొలుసులు చేయించాడు. ఆ రోజు సాయంత్రం అయేసరికి ఎల్లయ్య ఇంట్లో అంతా సందడి. గౌడు పంపిన కల్లు.. సారా… తాగినంత తాగి తూలుతూ… పేలుతూ… చుట్టుపక్కల ఊళ్ళలోని జోగోళ్ళు అంతా అక్కడే… డప్పులవాళ్ళు పీకలదాక పట్టించి భాజాలు వాయిస్తుండగా… ఆ చప్పుడికి అనుగుణంగా కొందరు నాట్యం చేస్తూ… లగ్గమంటే కల్లుముంతలు, భాజాలు, కూర(మాంసం) అంత మామూలే… లగ్గమంటే అందరు నవ్వుకుంట, పరాచికాలాడుకుంట ఉంటరు గద! మరి అవ్వ.. ఊకే కండ్లల్ల నీళ్ళూరుతున్నయ్‌….ఏమైంది…? ఎందుకు? ఎవరు సూడకుంట కండ్లు ఒత్తుకుంటది. అయ్యబీ అట్లనే ఉన్నడు. ఉషారి లేడు. సరిగ మాటాడ్తలేదు. పైసలు బాగ అయినయేమో! కల్లు బుంగలకంత గౌడ్‌ సాబ్‌ పంపిండు గద… మరెందుకట్లున్నడు? ఓహో… రాజక్క లగ్గంల కమ్మలు గున్నాలు చేపిచ్చుకున్నది గద… నాకు బీ జేపిత్తవా… అని అడిగిన గద… గందుకేనేమో… అని మనసులో అనుకున్నా పోసానికి మాత్రం పెళ్ళంటే చాలా ఉత్సాహంగానే ఉంది.
                       కొత్త బట్టలు… ఎప్పటి నుంచో కోరిక పెంచుకున్న పట్టాగొలుసులు, లడ్డూలు, చట్టాలు… ఆమె ఉత్సాహానికి కారణం. భాజాలు మోగుతున్నాయి. ఊళ్ళో ఉన్న తమ కులం వాళ్ళు – చుట్టాలు- పొరుగూళ్ళ నుండి వచ్చిన జోగినిలు వెంటరాగా.. ముత్తైదువలు పోసానిని ఎల్లమ్మ గుడికి తీసుకొచ్చారు. పోతరాజు పట్టుపోసిన దగ్గరికి తీసుకొచ్చి కూచోబెట్టారు.

                     గంగవ్వ లగ్గంకు పసుపు, కుంకుమలతోని గిట్ల ముగ్గెయ్యలే… నాకే ఏసిన్రు అని మురిసిపోతూ పీటలపై కూర్చొంది. భాజాలు మోగుతున్నాయి. పెండ్లి కొడుకు రావట్లేదు… ఏంటి అనుకుంటున్న ఆమె మెడలో తానెపుడూ పోతరాజు సాయిలు మావా అని పిలిచే పోతరాజు సాయిలు తాళిబొట్టు కట్టాడు. అదేంటి? గంగ లగ్గంల పెండ్లి కొడుకు వచ్చిండు గద! అతనే గంగ మెడలో తాళి కట్టిండే… మరి తనకేంటి పోతరాజు మావ కడ్తున్నాడేంది? పోతరాజు మావే పెండ్లికొడుకా… ఏమో కావచ్చు అనుకొంది ఆ చిన్నారి.

                నిజానికి తాళి కట్టిన పోతరాజు ఆమె భర్త కాదు.ఆ రోజు నుండి ఆమె జోగు పోసానిగా మరింది. పోసాని వాళ్ళమ్మని అడిగింది అమాయకంగా ‘పోతరాజు మావే పెండ్లి కొడుకా…’ అని. ఆమె తల్లి కండ్ల నిండా నీళ్ళు చిమ్మినయ్‌. నోట్లో చెంగు పెట్టుకొని ఏడ్సుకుంట ఆవలికి పోయింది

                    ”బిడ్డా నీకు ఎల్లమ్మతోని లగ్గమయింది. ఇయ్యాల్టికెల్లి నువు ఊరు మడిసివి.ఊరు చెప్పినట్టు ఇనుకోవాలె. కాదనద్దు. నీకీ లగ్గం సెయ్యబట్టె ఊరు బతికి బట్ట గట్టింది. లేకుంటే…ఎన్ని శవాలు లేసునో… గిది దైవ కార్యం. దేవుడు మన మొకాన ఏది రాత్తే అది జరుగుతది.” అంది నొసటిపై గీతలు చూపుతూ మనవరాలికి హితోపదేశం చేస్తున్నట్లుగా లస్మవ్వ.
అమ్మమ్మ చెప్పిందంతా పోసానికి అర్థం కాలేదు సరిగ్గా. కానీ… ఎవరికీ జరగనట్లు తనకు దేవతతో పెళ్ళి జరిగిందనీ, తన పెళ్ళి వల్లే ఊరు బతికిందనీ మాత్రం అర్థం చేసుకుంది.
                    ఈ పెళ్ళి వెనక ఉన్న కుత్సితం, స్వార్థం, మోసం, దగా తెలిసే వయసు కాదామెది. అందుకేనేమో…! అమాయకత్వం నిండని పసివాడని ఆ పసి వయసులోనే, ఈ తంతు ముగియాలని ఊరి పెద్దలు పట్టుపట్టేది.!పోసాని ఎప్పటిలాగా యమునతో ఆడుకోవడానికి వెళ్ళింది పెళ్ళి అయిన నాలుగోరోజున. ”ఇటెందుకచ్చినవే, పో…” అంటూ గదిమింది యమున తల్లి పర్వవ్వ. ఎందుకో పోసానికి అర్థం కాలేదు. ఆమె మనసు చిన్నబోయింది. ఆనాటి నుండి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తే పోసానిని ఎవరూ రానీయడం లేదు. ఎందుకిలా తనని బహిష్కరిస్తూన్నారో అర్థం కాని పోసాని తల్లడిల్లి పోయింది. ఇంటికి వచ్చి తల్లితో చెప్పి ఏడ్చింది. అంతకు ముందు అయితే ఎవరన్నా పోసానిని ఏమన్నా అంటే ఊరుకోని తల్లి, పోయి ఎదుటి వాళ్ళతో కయ్యమాడి వచ్చే తల్లి ఏమీ మాట్లాడకుండా మొహం చిన్నగ చేసుకుని ఆవలికి పోయింది. ఇలాంటివే మరికొన్ని సంఘటనలతో పోసాని అలవాటు పడింది ఆ జీవితానికి .

                        పోసాని పుష్పవతి అయింది. పెద్ద పండుగ చేసినట్లే చేసింది తల్లి. చుట్టు పక్కల ఉన్న జోగోళ్ళందరికి కబురు పెట్టింది అమ్మమ్మ. అందరి సమక్షంలో మైల పట్టం కట్టి పెద్ద పండుగ చేసింది.

                    నును లేత మొగ్గలా… ఇపుడిపుడే రేకలు విచ్చుకుంటున్న గులాబీలా ఉన్న పోసాని శరీరాన్ని చిదిపి… నలిపి… నలిపి… తన కోరికను తీర్చుకుంది భోజాగౌడ్‌ కామం. తుమ్మ మొద్దులా ఉన్న పాతికేళ్ళ అతని చర్యకు చిగురుటాకులా కంపించిపోయింది. వణికిపోయింది ఆ పసిమొగ్గ.

                       అతని బలీయమైన కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ఆమె తరతరాల ‘బాంచెన్‌ నీ కాల్మొక్త’ బానిస మనస్తత్వపు చిహ్నమైన ఆమె… అతనే తన భర్త కావచ్చు అనుకున్న ఆమె.. అతన్నీ, అతని చర్యనీ ప్రతిఘటించలేక పోయింది.
ఏదేమైనా… భోజాగౌడ్‌ నీడలో రెండేళ్ళు బాగానే గడిచాయి. ఆ రెండేళ్ళు, ఆమె ఇంటికి కల్లుకి కొదువ లేదు. బట్టలు, అవసరమైనపుడు డబ్బులు ఇచ్చేవాడు. బాగానే చూసుకుంటున్నాడులే అని తృప్తిపడేది పోసాని తల్లి
తన 14వ యేట తల్లియింది పోసాని, మొదటి కాన్సులో పోసానికి బాలెంత రోగం వచ్చింది. కానీ గండం గడిచి తల్లి బతికింది. బిడ్డ 10వ రోజునే పోయాడు.

                పోసాని జబ్బు పడిన సమయంలో కూడా గౌడ్‌ వచ్చి ఆమె శరీరాన్ని బలవంతంగా ఆక్రమించడం ఎనలేని బాధకల్గుతున్నా, పచ్చి పుండులా ఉన్న శరీరం చిత్ర వధ చేసినట్టున్నా కాదనలేని బానిస మనస్తత్వం, దైవ నమ్మిక, మూఢనమ్మకాలు ఆమెని ప్రతిఘటించనీయలేదు.  మరో ఏడాది తిరిగే సరికి మరో కాన్ఫు. రెండోసారి ఆమె పురిటి మంచంలో ఉన్నప్పుడు రావడమే.. ఆ తర్వాత భోజాగౌడ్‌ అటుకేసి చూడనేలేదు. ఆ తర్వాత పోసాని దగ్గర ఆమె మేనబావ మక్కయ్య చేరాడు. దాదాపు ఏడాది గడిపాడు. అతను ఒక్కపైసా ఇవ్వక పోవడంతో పోసాని అతన్ని రానీయలేదు. ఆ తర్వాత ఇంకొకరు… అలా ఎందరో… పోసాని చీకటి బతుకుకు సాక్ష్యంగా ఆమె 7గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు బిడ్డలు పురిట్లెనే పోగా, నలుగురు కొడుకులు, ఒక కూతురు తండ్రెవరో తెలియకుండా ఈ ప్రపంచలోకి అడుగుపెట్టారు.నలుగురు కొడుకులు ఉన్నా… ఏ కొడుకు జోగిని అయిన తల్లితో ఉండడానికి ఇష్టపడలేదు.

                              కారణం తల్లి జోగిని కావడం వల్ల ఆ రోజుల్లో వాళ్ళకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే. జోగినీ పిల్లలను పెళ్ళి చేస్కోవడానికి మళ్ళీ జోగినీ పిల్లలనే వెతుక్కోవలసి రావడమే. దొరతనపు స్వార్థప్రయోజనాల కోసం, ఊరి ప్రజల మూఢ నమ్మకాల కోసం తన జీవితాల్నే ఊరికి అంకితం చేసిన ఆమె తన ఒక్కగానొక్క కూతుర్నీ తన దోవలోనే బతుకమంటూ దేవతకిచ్చి చిన్న వయసులోనే పెళ్ళి చేసేసింది. తన వంశ ఆచారాన్ని… ఆనవాయితీని నిలపడం కోసమో… ఊరిని కాపాడ్డం కోసమో…. ముసలి తనంలో తనకింత గంజి పోస్తుందన్న స్వార్థంతోనో…

                  భోజాగౌడ్‌ కన్ను ఎపుడు పడిందో.. ఆమె మీద… మళ్ళీ ఆ ఇంటికి రాకపోకలు మొదలయ్యాయి. ఈ సారి అతను వచ్చేది పోసాని కోసం కాదు ఆమె కూతురు ముత్తెమ్మ కోసం….! ఆమె కన్యత్వాన్నయితే అనుభవించగలిగాడు కానీ… ఆమె మనసులో ఏనాడూ చోటు చేసుకోలేదు. అతనంటే అసహ్యం తప్ప మరో భావన లేదు ముత్తెమ్మలో… అతని చర్యలతో మగవాళ్ళంటేనే.. ద్వేషం కల్గింది ఆమె మనసులో. కానీ, దాన్ని బయట పెట్టలేని అసహాయురాలు ఆమె. అందువల్లేనేమో! వారిని కాదనీ అనేది కాదు. జీవశ్ఛవంలా ఏ ఫీలింగ్సూ లేకుండా ఒళ్ళప్పగించేది. ఈ బాంచన్‌ బతుకు ఇంతే, ఇలా తెల్లారాల్సిందే… అని భావించేది. ఆమె ప్రవర్తనకి జనం విసిగి రావడమూ మానేశారు. అలా నలుగురైదుగురుతోనే నాలుగేళ్ళు గడిపిన ముత్తెమ్మకి పిల్లలు కలుగలేదు.

                       కాల చక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది. ఎవరి కోసం ఆగదు కదా… క్యాలెండర్లో తేదీలు, నెలలు, సంవత్సరాలు మారిపోతున్నాయి. ఊళ్ళో ఉన్న జోగినుల్లో జోగు లస్మవ్వ కాలం చేసింది. జోగు పోసాని వయసు మీరి పోతోంది. జోగు ముత్తెమ్మ కొజ్జాదానిలా ఉంది. మగాడెవరూ ఆమె దరిచేరడం లేదు. ఏం చేయాలి. ఊరికి వయసులో ఉన్న జోగిని కావాలి. లేకపోతే, ఈ ఆచారం అంతరించి పోయే ప్రమాదం ఉంది. వతనుగా చేయడానికి ముత్తెమ్మకు పిల్లలే లేరు. ఎలా…? ఆ యింటి ఆడపడుచునే దేవతకి అంకితం ఇవ్వాలి.

                      ఈ చర్చ ఎవరు లేపారో కానీ ఊరంతా అదో పెద్ద చర్చనీయాంశం అయింది. అలా చర్చ జరుగుతున్న సమయంలోనే పోసాని మూడో కొడుకు నడిపి సాయిలు ఏదో జబ్బు చేసి చనిపోయాడు. అంతకు రెండు నెలల ముందే అతని భార్య కాన్పులో చనిపోయింది. ఇక మిగిలింది తొమ్మిదేళ్ళ సాయవ్వ. ఆమె తమ్ముడు చిన్న సాయిలు.ఎపుడు ఎవరికి ఏ జబ్బు వస్తుందోనని భయపడుతున్నారు మిగతా కుటుంబ సభ్యులు. భోజాగౌడ్‌ పెద్ద కొడుకు చదువుకుని టీచర్‌ ఉద్యోగం సంపాదించుకుని నిజామాబాద్‌లో సెటిల్‌ అయ్యాడు. రెండో కొడుకుని పదిహేనవ ఏటే పెళ్ళి చేసి అత్తారింటికి ఇల్లరికం పంపేశాడు. ఇక ఇంట్లో మిగిలింది చిన్న కొడుకు రాజాగౌడ్‌. అతను నూనూగు మీసాల వాడవుతున్నాడు.

                                 జోగినీ వ్యవస్థ గురించి ఎరిగి ఉన్న రాజాగౌడ్‌కి తండ్రి అలవాట్ల గురించి తెల్సు. ఆయననే ఆదర్శంగా తీసుకుని, అదే బాటలో నడిచే రాజాగౌడ్‌ దృష్టిలో మగవాడికి ఎంత మంది ఆడవాళ్ళతో తిరిగితే అంత మగతనం అనుకునే రకం.
అతని దృష్టి చక్కని శరీర సౌష్టవంతో ఎదుగుతున్న సాయవ్వపై పడింది. రాజాగౌడ్‌ దృష్టిలో ఓ ఆడపిల్ల పడిందంటే… అతన్నుండి తప్పించుకోలేదు. నయానో… భయానో… ఆమెను అనుభవించి తీరాలనుకొనేవాడు. అలాంటి రాజాగౌడ్‌ దృష్టిలో సాయవ్వ పడింది. అయితే ఆమె వయస్సు మరీ చిన్నది. ప్రతాపరెడ్డి కొడుకు దృష్టి కూడా సాయవ్వ పైనే. ఆ విషయం గమనించాడు భోజాగౌడ్‌. తన లక్షణాలు పుణికి పుచ్చుకున్న చిన్న కొడుకంటే ఆయనకి వల్లమాలిన ప్రేమ. కొండ మీద కోతినైనా తెచ్చివ్వడానికి సిద్ధపడతాడు.

               రాజాగౌడ్‌ వ్యవహారాం గమనించిన భోజాగౌడ్‌ సాయవ్వని దేవతకిచ్చి పెళ్ళి చేయకపోతే ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుందని సాయవ్వ పెద్దనాన్నలను, చిన్నాన్నను కచేర్లకు పిల్చి చెప్పాడు. తెల్సీ తెలియక ముందే.. ముగ్ద మనోహరంగా అమాయకత్వం చిందే ఆమె జోగినిగా మార్చ బడింది.

”చాలా చాలా విషయాలు ఎంతో ఓపికతో చెప్పావు. వెళ్ళి పండుకో ఆయీ” అంది విద్య తిమ్మెర్లు పట్టి కాళ్ళు అటూ ఇటూ కదుపుతున్న పోసానితో.

”ముసలి సోది ఎవరింటరు ! ముసలోల్లను, అయిసయిపోయినోల్లను చెత్తకుండీ మీద చెత్త కన్న కనా కట్టంగ, ఈనంగ సూత్తరు. అసొంటిది నువు మా ఇండ్లకొస్తివి. మా కొంపజూస్తివి. పెద్దంత్రం చిన్నంత్రం లేకుంట మాతోని కూసుంటివి. గింతగనం ముచ్చట బెడ్తివి. మల్లరా… బిడ్డా…” అంది ఆప్యాయంగా, ఆనందంగా మెటికలు విరుస్తూ.

”తప్పకుండా మళ్ళీ వస్తా… నీ నుండి నాకింకా చాలా కబుర్లు చెప్పించుకోవాలని ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాను” అని లేచి రెండడుగులు వేసింది విద్య సబితతో.
అంతలో ఢమాల్న ఏదో పడిపోయిన చప్పుడు. ఏమిటా అని వెనక్కి తిరిగి చూశారిద్దరూ. అప్పటి వరకూ పోసాని చెప్పే తమ గాధ వింటూ కూర్చున్న ముత్తెమ్మ లేచి నిల్చోబోయిందిలా ఉంది. ఒక్కసారిగా ఢమాల్న పడిపోయింది. కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. గబగబా సాయవ్వ, ఆమెను తన ఒడిలోకి తీసుకోబోయింది. ముత్తెమ్మ లేచి కళ్ళు పెద్దవిగా చేసి గుండ్రంగా తిప్పుతూ,

”నా మాట వినరు కదా… నేనెవరు…? ఎల్లమ్మను. ఊరిదేవత ఎల్లమ్మనురో…. ఆ…. హు… అంటూ వణికిపోతుంది. ఊగిపోతుంది. జుట్టు విరబోసుకున్న ముత్తెమ్మ, మళ్ళీ ”ఊ… హూ… నేను ఎల్లమ్మను ఏందిరా… నన్ను మర్సినార్రా…” అంటూ గుడ్లురిమింది.

అప్పుడామె కళ్ళు ఎర్రగా… ఆగ్రహంగా…చుట్టు పక్కల వాళ్ళంతా అక్కడ జమయ్యారు. ముత్తెమ్మకు దేవుడొచ్చిందంటూ సంభ్రమంగా చూస్తున్నారు. ప్రతి సోమవారం ఇన్ని బియ్యం, ఇంత పప్పు, కొబ్బరికాయతో ఎల్లమ్మకు నైవేద్యం పెట్టడంలేదని ఆగ్రహించింది. ఆవేశపడింది. ఎల్లమ్మ ఆగ్రహించిందంటే, ఊరు ఏమైపోతుందోనని బెదిరించింది. నెలకొకసారి కోడి, కల్లు సీసా సాక పెట్టాలని ఆజ్ఞాపించింది. అలా ఊగిపోతూనే, అంతలోనే చుట్టూ మూగిన జనంలోంచి కొందరు వెళ్ళి హారతి పుట్టుకొచ్చి ఆమె చుట్టూ తిప్పారు. కొందరు కొబ్బరికాయ కొడుతున్నారు. ఎవరు తెచ్చారో గానీ కోడి తల తెగింది. కల్లు సీసాలు వచ్చాయి…” నన్ను మర్చిపోయారంటే ఏమవుతుందో గుర్తుంచుకోండ్రా అంటూ హెచ్చరించి ఊ… హూ… అంటూ మళ్ళీ దబేల్న పడిపోయింది. స్పృహ కోల్పోయింది. సాయవ్వ నీళ్ళు తెచ్చి ఆమె మొహాన చల్లింది. కొంగు తీసి గాలి విసిరింది. రెండు మూడు నిముషాల్లోనే ముత్తెమ్మ లేచింది. ఆమె ఒళ్ళంతా చెమటతో తడిసింది. కానీ, ఆమె మామూలుగానే ఉంది. ఏమీ జరగనట్లుగానే…. ఎరగనట్లుగానే..

విద్యకి చాలా ఆశ్చర్యంగా ఉంది. జనం అంతా ఇంటికి వెళ్ళిపోతుంటే తానూ మౌనంగా కదిలింది.
విద్య చేయిపట్టుకొన్న సబిత ”అక్కా మల్ల అస్తవా…?” అడిగింది.

వీలైతే రేపు వస్తాను సబితా. ఎల్లుండి మా ఊరు వెళ్ళిపోతున్నాను కదా…
”ఏంది గప్పుడే మీ ఊర్కి పోతున్నవా…? అక్కా నన్ను సుత తీస్కపోరాదు నీతోని…” కొద్దిగా ఆగి మళ్ళీ తానే ”నేనీడ ఉండ. ఈడ ఎవ్వల్లు మంచోళ్ళుకారు. అంత పిచ్చోల్లే… నీ

(ఇంకా వుంది)

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

22
UncategorizedPermalink

One Response to జోగిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో