ఎనిమిదో తరగతిలో – 2

కె.వరలక్ష్మి

కె.వరలక్ష్మి

జగ్గంపేటకు దక్షిణంగా ఉన్న కాట్రావులపల్లి లో అప్పటికి హైస్కూలు లేదు . చుట్టు పక్కల చాలా ఊళ్ల పిల్లలు జగ్గం పేట హైస్కూలుకే వచ్చేవారు . మగ పిల్లలు సైకిళ్ల మీద , ఆడ పిల్లలు బస్సుల్లోనూ వచ్చేవారు . కాట్రావులపల్లి నుంచి మాత్రం దివాన్ జల్దంకి ,ప్రసాదరావు గారి అమ్మాయి గౌరీ మాణిక్యం , సుబ్బలక్ష్మి , ప్రసాదరావు గారు అన్న గారు పిల్లలు లక్ష్మి , శ్రీరామమూర్తి , మరొకరి అమ్మాయి విశాలాక్షి గుర్రబ్బండిలో వచ్చేవారు . వాళ్ల బండి హైస్కూలు లోపలి గేటు వరకూ వచ్చి ఆగగానే అందరి కళ్లూ అటు తిరిగి నిలిచి పోయేవి . చామన చాయలో పొడవు జడతో అందంగా నడిచే గౌరీ మాణిక్యం , పసిమి చాయలో సుబ్బలక్ష్మి , శ్రీ రామమూర్తి చాలా బావుండేవారు . నాలో సౌందర్యాన్ని ఆస్వాదించే లక్షణమేదో ఉన్నట్టుంది . నేనూ వాళ్లని చూస్తూ అలా ఉండిపోయేదాన్ని . వాళ్లు నా పై తరగతుల వాళ్లు . వాళ్ల నుంచి ఏమేం నేర్చుకోవచ్చో గమనిస్తూ ఉండేదాన్ని . వాళ్లు కూడా నాతో ఇష్టంగా మసలుకొనే వాళ్లు . నేను అస్తవస్తంగా వేసుకున్న ఓణీని చక్కగా కుచ్చిళ్ళు పెట్టి , భుజం మీద అమరేట్టు వేసేవాళ్ళు . వాళ్ల ఊరికి రమ్మని చాలా సార్లు పిలిచే వారు . చివరకి మర్నాడు సెలవు వచ్చిన ఒక రోజు నేనూ లీలా వాళ్ల బండిలో కాట్రావులపల్లి వెళ్లేం . అతి పెద్ద దివాణం లోగిలి . ఇంటి నిండా నౌకర్లు . ఒక్కసారే వంద మంది కూర్చుని తినగలిగేంత భోజనాలశాల . వాళ్ల అమ్మ , నాన్న గార్లు మమ్మల్ని ఎంతో ఆదరంగా చూసేరు . అప్పటికింకా డైనింగ్ టేబుల్స్ రాలేదు . సన్నని చాపల మీద కూర్చుని అరటి ఆకుల్లో వడ్డించిన బ్రాహ్మణ వంటకాల , గడ్డ పెరుగు భోజనం ఇప్పటికీ నాకు గుర్తుండి పోయింది . వాళ్ల వంటావిడ సుశీల పాడిన పాటల్ని అచ్చం అలాగే పాడడం కూడా నాకు బాగా గుర్తు .

నా

శ్రీ పల్లా వె౦కటరమణ, శ్రీమతిబ౦గారమ్మ,

ఇంకోసారి మా ఊరికి దగ్గరలో తూర్పున ఉన్న బూరుగుపూడి వెళ్లేను . బూరుగుపూడి నుంచి కట్టిమేని రత్నం అనే అమ్మాయి వచ్చేది . మా లీల చిన్నక్కని ఆ ఊరే చేసేరు . ఇకనేం , రత్నంతో బాటు రెండేసి నోట్ బుక్స్ పట్టుకొని ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసేం . రత్నం వాళ్లదీ తాటాకుల చుట్టు గుడిసె లాంటి ఇల్లు . వాకిట్లో కోళ్లు , ఇంటి ముందు గేదెలు . రత్నం తల్లిగారు గిన్నెల్లో వేడివేడి అన్నం , కోడి గుడ్ల కూర – అన్నం లోపల ఒక గుడ్డు , పైన ఒక గుడ్డు వడ్డించి విసనకర్రతో విసురుతూ కూర్చున్నారు . గాలికి నా జుట్టు ఎగిరినప్పుడల్లా ఆవిడ సవరిస్తూ ఉండేవారు . ఎక్కడి కెళ్లినా పాటలు , పద్యాలు పాడక తప్పేది కాదు . ఆ పాడడం వలనో ఏమో అందరిలో నన్ను ప్రత్యేక గుర్తింపుతో చూసేవారు .

                      ఆ సంవత్సరం శివరాత్రికి మా వీధిలో ఆడవాళ్లంతా దాక్షారామం వెళ్లాలని అనుకుని మా అమ్మకి చెప్పేరు . మా అమ్మ మా నాన్నకి చెప్పి బండి ఏర్పాటు చేయిస్తుందని . మా వాకిలి పెద్దగా ఉండడం వల్ల మధ్యాహ్నం భోజనాల తర్వాత అందరూ బాగు చేసుకోవడానికి బియ్యమో , పప్పులో చేటల్లో పోసుకుని మా ఇంటికి చేరే వారు . ప్రయాణాల నిర్ణయాలన్నీ అక్కడే జరిగేవి . ఏం జరిగిందో గుర్తు లేదు కాని , బండికి బదులు బస్సులో వెళ్లాలని నిర్ణయించేరు .

                   మా చెల్లెళ్ళనీ తమ్ముళ్లనీ మా నాన్నమ్మకి అప్పగించి నన్ను వెంట తీసుకుని మా అమ్మ బయకుదేరింది . మా పక్కింటి రాఘవమ్మ వాళ్లబ్బాయి నారాయణరావుని తీసుకొచ్చింది . ఆ ప్రయాణంలో అతనొక్కడే మగపిల్లాడు . తొమ్మిదో తరగతి చదువుతున్నా బక్కగా , పొట్టిగా ఉండేవాడు . కండక్టరు టిక్కెట్లు తీస్తూ నాకు పూర్తి టిక్కెట్టు , ఆ అబ్బాయికి అర టిక్కెట్టు తీసేడు . ఇక మా అమ్మ బాధ చూడాలి – “ ఏడాది పెద్దోడికి అర టిక్కట్టూ చిన్న పిల్లకి పూర్తి టిక్కట్టూనా ..” అంటూ ఒకటే నొచ్చు కుంది .

                                   కాకినాడలో బస్సుమారి దాక్షారామం చేరుకొని గుడి ముందున్న పైండా వారి సత్రంలో బస చేసేం . అందరికీ కలిపి ఒకటే చిన్న గది ఇచ్చేరు . సగం గదిని సంచులు ఆక్రమించే సేయి . మేం వెళ్లే సరికి పొద్దు గూకుతూ ఉంది . గుడి ముందున్న వీధిలో కోట్లను చూస్తూ రెండు మాడు సార్లు తిరిగేం . అందరూ అన్నీ బేరమాడే వాళ్లే గాని కొనే వాళ్లెవరూ లేరు . కాణీ వస్తువు పది పైసలైన రోజులు . అందరూ అంతంత మాత్రపు ఆదాయాల వాళ్లే . పది పైసల్ని పది ముళ్లు వేసి దాచుకునే వారు . ఇంట్లో పాలు పెరుగు అమ్మడం వలన మా అమ్మ దగ్గర మాత్రమే చిల్లర దండిగా ఉండేది . అయినా కూడా మా అమ్మ దేనికిపడితే దానికి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టేది కాదు . వెళ్లిన పిల్లలిద్దరం బూరలు . బుడగలూ కొనుక్కునే వయసు వాళ్లం కాదు . ఆ రోజుల్లో నూపప్పు అద్దిన బెల్లం జీళ్లు మంచాల మీద పోసి అమ్మేవాళ్లు . నమిలే కొద్ది సాగుతూ బలే రుచిగా ఉండేవి . అవి మాత్రం చెరో పది పైసలవీ కొనుక్కుని తింటూ వాళ్ల వెంట తిరిగేము . ఎనిమిది గంటల వేళ సత్రానికి వచ్చి , వాళ్లు వడ్డించిన ఉచిత భోజనాలు తిని , కోనేటి పక్కనున్న సినిమా హాల్లో ‘ జగదేక వీరుని కథ ‘ సినిమా చూసేం రెండో ఆట . తిరిగొచ్చి సత్రం వాకిట్లో దుప్పట్లు పరుచుకుని పది నిద్ర పోయాం .

                           తెల్ల వారక ముందే లేచి కోనేట్లో స్నానాలు కానిచ్చి భీమేశ్వరస్వామినీ , మాణిక్యాంబనూ దర్శించుకుని బైటికొచ్చేం . అంతలో ఎవరో చెప్పేరు అక్కడికి దగ్గరలో ఉన్న ఆదివారప్పేటలో   ఒక యోగి వెలిసేడని , అతన్ని శివబాల యోగి అంటున్నారనీ . ఇంకేముంది , అందరం పొలోమని అటు బయలు దేరం . కొత్తగా వేసిన మట్టి రోడ్డుకి యిరు వైపులా చలివేంద్రాలు పెట్టి మంచి నీళ్లు , మజ్జిగ , బెల్లపు పానకం పంచుతున్నారు . అందరూ కాలినడకన వెళ్లోస్తున్నారు . ఇప్పట్లా ఎవరికిపడితే వాళ్లకి కార్లుండేవి కావు . శివరాత్రి ఎండ నెత్తి మాడుస్తోంది . నాలుగడుగుల కొకసారి మజ్జిగో , బెల్లపు పానకమో తాగుతూ ఆదివాప్పేట చేరుకున్నాం కొబ్బరి చెట్ల మధ్య ఒకే ఒక్క వరస కొద్దిపాటి ఇల్లున్న చిన్న ఊరది . అన్నీ చీరలు నేసె సాలె కుటుంబాలు కాబోలు . వాకిళ్లలో పాతి ఉన్న నడిమెత్తు కర్రలపైన పొడవుగా నేసి ఉంది . పచ్చని కళ్లాపు జల్లి ముగ్గులు వేసిన వాకిళ్లు అద్దాల్లా మెరుస్తున్నాయి . శివరాత్రి సందర్భంగా ఇళ్లూ , మనుషులూ పులు కడిగిన ముత్యాల్లా ఉన్నారు . ఇళ్లకు ఎదురుగా ఎడమ వైపు బాటలో కొంత ముందుకు నడిస్తే అక్కడొక చిన్న గది ఒక్కటే నిర్మించి ఉంది . దానిలో ధ్యానంలో , పద్మాసనంలో కూర్చుని ఉన్న అబ్బాయే శివబాల యోగి . పెద్ద క్యూలో ఆ గది ముందుకు చేరితే అతన్ని కాస్సేపైనా చూడనీకుండా తోసేస్తున్నారు వలంటీర్లు . నేను రెయిలింగు అవతలికెళ్లి నిలబడి పరిశీలనగా చూసేను . పాలిపోయి లాంటి తెలుపు మేని చాయ , అప్పుడప్పుడే వస్తున్న నూనూగు మీసాలు , భుజాల మీదికి పెరిగిన జుట్టు , ఎముకలు లెక్క   గలిగేంత బక్క పల్చని శరీరం , దట్టమైన కన్రెప్పల్తో అందమైన ముఖం . ఈ అబ్బాయి హాయిగా చదువుకోకుండా ఇలా ఎందుకు కూర్చున్నాడా అని నాకు దిగులేసింది . అప్పటికి ముమ్మిడివరం బాలయోగి , ఆయన తమ్ముడు చిన బాలయోగి ప్రభావం జనం మీద బాగా ఉంది . బాలయోగిని దర్శించిన వాళ్లందర్నీ భోజనాలు చేసి వెళ్లమని మైకుల్లో చెప్తున్నారు . శుభ్రమైన ఖాళీ ప్రదేశంలో నేల పైన ఆకులు వేసి వేడి వేడి అన్నం , కూరలు , పెరుగు వడ్డిస్తున్నారు . అందరూ ఇరవై ఏళ్లలోపు కుర్రాళ్లే . నాకలా మట్టిలో చతికిలబడి అన్నం తినడం ఇష్టం లేకపోయింది . నేను తిననని వెనక్కి నడిచి ఓ ఇంటి అరుగు మీద కూర్చుండి పోయేను . “ కళ్లు తిరిగి పడిపోతావు “ అని మా అమ్మ గోల గోల పెట్టేసింది . ఎందుకో తెలీదు , ఎంత కోపం వచ్చినా మా అమ్మ మా తమ్ముళ్లనీ , చెల్లెళ్లనీ తిట్టినట్లు నన్ను తిట్టేది కాదు . నేను అన్నం తినకుండా ఉండి పోయినందుకు మా అమ్మకి కోపం , ఏడుపు కలిసి వచ్చేసాయి . అలా కన్నతల్లిని ఏడిపించినందుకో , పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని నిర్లక్ష్యం చేసినందుకో తెలీదు కాని తర్వాతి కాలంలో కొన్నేళ్లు ఆకలితో అలమటించి పోయే రోజులు నడిచేయి నా జీవితంలో . తిరుగు ప్రయాణంలో చలివేంద్రాల్లోంచి మజ్జిగ , పానకం తెచ్చి పదే పదే నా చేత తాగించి అమ్మ . అదే కదా అమ్మ మనసు .

                   దాక్షారామంలో సత్రం గదిలోని సంచుల్ని తీసుకుని బస్సులో కోటిపల్లి వెళ్లేం . అక్కడ పై అంతస్తు నుంచీ క్యూలో నడిచి ఛాయా సోమేశ్వర లింగాన్ని , రాజరాజేశ్వరీదేవి విగ్రహాన్ని దర్శించి , పక్కనే ఉన్న గోదావరిని తనివితీరా చూసి తిరుగు ప్రయాణమై అర్ధ రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకున్నాం . ఆంధ్ర ప్రదేశ్ లోనే అతి పెద్దదైన దాక్షారామ శివ లింగాన్ని , అతి చిన్నదైన కోటిపల్లి శివ లింగాన్ని ఒకేసారి చూసి వచ్చామని అప్పుడు నాకు తెలీదు .

మా ప్రాంతం వాళ్లకి పచ్చగా పసిమించి పోయే కాలవకింద ఊళ్ల గురించి తెలీదు అందరికీ అదే మొదటిసారి అటు వైపు వెళ్లడం . మళ్లీ మారో ప్రాంతానికి వెళ్లోచ్చే వరకూ అదే చర్చనీయంశం అందరికీ .

       ఆ వేసవి కాలంలో మా అమ్మ చెల్లెలు – మా పిన్నికి పెళ్లైయింది . చెల్లూ పంచదార ఫేక్టరీల కార్మికుడు , రెండవ పెళ్లి వాడిన ఏల్చి రామారావుకి చేసారు పిన్నిని .

ఆ పెళ్లికెళ్లినప్పుడు కాకినాడలో ‘పెళ్లికానుక’ సినిమా చూసేను . ఆ సినిమా ముగింపు నా మనసును పట్టి పిండేసినట్టైంది . అప్పుడే మా ఊరి గ్రంధాలయానికి కొత్త పుస్తకాల్లో శరత్ దేవదాసు వచ్చింది . ఆ కథ కూడా అంతే . ఆ రెండు కథలూ నన్ను కొన్ని నెలల పాటు బాధలో ముంచెత్తాయి .

                         ఎనిమిదో తరగతి పరీక్షలు రాయనీయకుండా భాగ్యానికి వాళ్లింట్లో వాళ్లు పెళ్లి చేసేసారు . తన కన్నా చాలా పెద్ద వాడిన వాళ్ల మేన మామకిచ్చి . అప్పటికే అతను ఎస్ .సి కులానికి చెందిన అమ్మాయిని పెళ్లాడి ఇద్దరు బిడ్డల్ని కన్నాడు . భాగ్యానికి తండ్రి లేదు . తల్లి అమాయకురాలు , మూగది . అయినా , అప్పట్లో ఆడ పిల్లలకి స్వతంత్రం లేదు . భాగ్యం చాలా తెలివైంది . ఎంతో బాగా చదివేది . చదివించి ఉంటె ఎంతో పైకొచ్చేది . నేను స్కూలు పెట్టేక తనకి టీచింగు నేర్పించి ఉద్యోగ మిచ్చేను . ఇప్పటికీ తనొక ప్రైవేటు స్కూలు టీచరుగా పని చేస్తూనే ఉంది .

– కె . వరలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

ఆత్మ కథలు, నా జీవన యానంలో...Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో