ఓయినం

Gowri jajula పని దగ్గర మొగులయ్యకి పని కావాలని మేస్త్రిని అడిగాడు చంద్రయ్య. మేస్త్రి అతన్ని తేరిపార జూసి ”వచ్చేవారం నుంచి ఇంకో సైటుకాడ పని సురువైతది ఆడికి తీసుకురా చంద్రయ్య” అన్నాడు.

అంతదూరం నుంచి తిరిగి నడిచొచ్చే ఓపిక లేక మొగులయ్య సాయంకాలం చంద్రయ్య సైకిలు మీదే రావాలని నిర్ణయించుకుని అక్కడే ఉండిపోయాడు.

నీలమ్మ పొలం దగ్గరకు పోయి భర్త గురించి ఎదురుచూసింది. మొగులయ్య సాయంకాలమైనా ఇల్లుచేరలేదు. పిల్లలు ఆకలికి అలమటిస్తుంటే సముదాయించ లేక సతమతమౌతూ సాయంకాలం వరకూ ప్రాణాలుగ్గవట్టుకుని అక్కడే ఉండి చీకటి పడేవేళకు ఇంటికి పోతుంటే గుండెల్లో భయం యింకా వెంటాడుతూనే ఉంది.

సుక్కమ్మ ఇంటి ముందుకు పోయేసరికి అక్కడ ఆడోళ్ళందరు గుమిగూడి ఉన్నారు. వాళ్ళను చూడంగానే నీలమ్మ గుండెవేగం హెచ్చింది మెల్లగా వాళ్ళను చేరి విషయం ఏమిటని ఆరా తీసేసరికి
సిద్దియ్యోళ్ళ సేండ్ల రాత్రి మొక్కజొన్న కంకులు దొంగిలించిండ్రట ఆయన జీతగాన్ని పంపి అన్నిండ్లు సెక్కుజేసి రమ్మన్నడంట అనేసరికి గుండె జారిపోయింది. ఇంటికి వెళ్లటానికి భయమేసి అక్కడే కూర్చుండిపోయింది. భయంతో ఒళ్ళంతా చెమటలు పడ్తుంటే ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తపడసాగింది.

నీలమ్మ పిల్లల ముఖాలు గుంజుకుపోవటం చూసి పిల్లలకు అన్నం పెట్టి నీలమ్మకు చాయి పోసింది సుక్కమ్మ. పిల్లలకు ఓ చేత్తో అన్నం తినిపిస్తూ మరో చేత్తో గబగబా చాయి తాగి గుండె చిక్కబట్టుకునే ప్రయత్నం చేస్తోందామె.

మరో దిక్కు మొగులయ్య తీసుకుని పనిదగ్గర నుంచి బయలుదేరాడు చంద్రయ్య. దార్లో వస్తున్నప్పుడు ”ఒరే మొగులయ్య గిప్పుడన్నా బాగుపడు. బిడ్డా ఇంగనన్నా సంసారం మీదికి రావాలరా నీకు జరిగిన అన్నాళం సిన్నది కాదుకాని ఏం జేస్తవ్‌ సెప్పు నీ కిస్మత్‌ల గంతే బాకీ ఉందన్కో కొడ్కా. నెల రెండునెల్లు పన్జేసిన వనుకో కొన్ని రూపాలు ఎన్కవడ్తయి నీ సంసారం గూడా సక్కవడ్తది నీ పెయిమీద గానీ పిల్లపెయ్యి మీదగాని గింత సెత్తుందా సెప్పు ఆని నియ్యతూ ఆనెంట నీ నియ్యతూ నీయెంట ఇంగనన్న పొలం దిక్కెల్లి రంజిమానుకో సంసారం దిద్దుకో” అంటూ సైకిలు తొక్కుతూ చంద్రయ్య చెప్తుంటే వెనక కూర్చుని మొగులయ్య ఊకొట్టాడే కానీ ఒక్క మాట మాట్లాడలేదు.

లోతుకుంట మలుపుకాడ సైకిలు మీదనుంచి దిగి ఇద్దరు పక్కపక్కనే నడ్చుకుంటూ పోతూంటే చంద్రయ్య ఆమాట ఈమాటా మాట్లాడుతూనే ఉన్నాడు. అన్ని మాటల సారాంశం మాత్రం అతన్ని బాగుపడమనే.
సీకులైను మూలకాడికి పోయి మలుపు తిరిగి ఇండ్ల దిక్కుపోతుంటే తన ఇంటిముందు గుంపుగా జనాలుండటం చూస

”ఏమైందిరా మొగులయ్య సైకిలెక్కు” అంటూ ఆత్రపెట్టి సైకిలెక్కి సైకిలును నడిపాడు చంద్రయ్య. వాళ్ళిద్దరు ఇంటి దగ్గరకు వెళ్లేసరికి ”సెప్పుండ్రి ఎవళ్ళు గిట్లాంటి అర్కతులు జేసిండ్రు గింతవరకు మా వంశంల గిట్లాంటి సుద్దులు జర్గలే. దొర్కిండ్రా అందర్ని నర్కుతా ఆళ్ళ తోళ్ళు వలుస్తా” అంటూ సత్తెన్న రంకెలేస్తుంటే చంద్రయ్యకు అసలు విషయమేమిటో అర్థంకాక ”ఏందన్నా ఏందే నాయింటి ముందు గిట్ల లొల్లి జేస్తుండ్రేంది” అంటూ భార్య దిక్చుచూశాడు.
ఆమె కళ్ళతోనే సత్తయ్య దిక్కు చూపించింది.

”ఒరేయ్‌ చంద్రిగా మన వంశం ఎట్లాంటిదిరా, మనం కులంకు ఎట్లాంటోళ్ళమైనా గావచ్చు గాని గునంకు కాదురా పక్క బాయొడొచ్చి గియ్యాల మనల్ని దొంగలంటుంటే నా కలేజా కాలుతుందిరా” అన్నడు ఆవేశపడ్తూ.
మొగులయ్యకు విషయం అర్థం అయి నిలువునా భూమి కంపించి నట్లయితుంటే భార్య దిక్కు చూశాడు. నీలమ్మ నిప్పులు చెరిగే కళ్ళతో తననే చూడటం గమనించి మిన్నకుండి పోయాడు.

”అరే అన్నా జెర శాంతవడి అసలు సుద్దేందో సెప్పు” అని మళ్ళీ అడిగాడు చంద్రయ్య. ”మన పక్క బాయోడు సిద్దిగాడు లేడు ఆని సేండ్లో రాత్రి మొక్కజొన్న కంకుల దొంగతనం అయినయంట ఆడేమో మీ బాయిగడ్డ దిక్కే తొర్రుంది మీ బాయొల్లే దొంగనతం జేసిండ్రు అని పగటాల ఇంటికి వచ్చి ఒక తీర్గ తిట్టవట్టిండు యిండ్లలల్ల అందరు మొగోళ్ళు వచ్చినంకా అందరి యిండ్లు సెక్కుజేసి రమ్మని పెద్దజీతగాన్ని తోలిండు” అంటూ పక్కనే నిలవడ్డ జీతగాడిని అందరికీ చూపాడు.

”అన్నా దొంగనతం మనమే జేసినం అని గారంటి ఏందన్నా” అని లా పాయింటు లాగాడు రంగయ్య.
”అరే గారంటీ ఉందిరా ఆసేసినోడేందో సక్కంగా సేస్కపోకా తొర్ర మన దిక్కుజేసిండు గిదొక లెక్కయితే ఆడు నడిసొచ్చిన తొవ్వంతా కంకులు పడేస్కుంట వొచ్చిండు గవి సక్కంగా మన బాయిగడ్డ దిక్కే పడ్డాయి గింతకంటే సాచ్చం ఏమిగావాలే సెప్పుండ్రి” అంటుంటే మొగులయ్య గబగబా యింటికి వచ్చి జొన్నకంకులున్న సంచి ఎత్తిచూశాడు సంచికి అడుగు మందమంత రంధ్రం ఉండటం చూసి తలపట్టుకున్నాడు. వాటిని తీసుకెళ్ళి ఎక్కడైనా పడేద్దామని చూస్తే ఎదురుగా పోచమ్మ పిల్లలతో అమ్మోరులెక్క కూర్చుని ఉంది.

”దొంగతనం జేసినోని నోట్ల మన్నువడ, దుమ్మువడ” అంటూ తిడ్తుంటే సంచిని బయటకు తీసుకెళ్ళె దారిలేక తిరిగివచ్చి గుంపులో కలిశాడు. నీలమ్మ భయంతో ఒణుకుతూ అక్కడే కూర్చొని ఉంది.
”ఓరీ మల్లిగా నువ్వు ఎన్నయినా సెప్పు దొంగలెవరో గియ్యల తేల్చాలే మనోళ్ళు అందరొచ్చిండ్రుగా పక్కోడు గియ్యాల గిది అన్నడు రేపు ఇంకోటి అంటడు మనం ఎట్లాంటోళ్ళమొ ఒక్కసారి ఆళ్ళ కల్లముందు తేలిస్తే ఇంగొకసారి మన దిక్కుసూసేందుకే వొన్కుతరు, దొంగతనం జేయ్యనోళ్ళం మనకు భయం ఎందుకురా” అనేసరికి సత్తెన్న మాటలు అందరిపై ప్రభావాన్ని చూపాయి.
తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే ఇళ్ళను సోదాచేయించాలనే నిర్ణయానికి అందరు వచ్చారు.
నీలమ్మ మొగులయ్య ఒక్కమాట మాట్లాడలేదు.

”ముందుగాళ్ల కిరాయోళ్ల యిండ్లను సోదాసెయిండ్రి” అని సత్తయ్య అనగానే కనకలచ్చిమి ఇల్లు, అంజమ్మ ఇల్లు, దుర్గమ్మ ఇండ్లల్లో వెతకటం పూర్తయ్యేసరికి సత్తయ్య, ఎల్లయ్య, రంగయ్య, చంద్రయ్యల ముఖాలు రంగులు మారాయి.
కిరాయికున్న వాళ్ళ ఇండ్లల్లో జొన్నకంకులు దొరకలేదంటే ఇంక మిగిలినయి మనిండ్లే అని గుసగుసలాడాడు.
”ఎట్లయితే అట్లయితది లెకుండ్రిరా” అరిచాడు సత్తయ్య. అందరి గుండెలు అదిరిపడ్డాయి. ఒక్క మొన్నజొన్న కంకి దొరికినా సత్తయ్య తమ పనిపడ్తడు అట్లా జరుగొద్దని ఎల్లయ్య, రంగయ్య, చంద్రయ్యలు దేవుడ్ని మనస్సులోనే ప్రార్థిస్తుంటే మొగులయ్య, నీలమ్మల కింద భూమి కదులుతున్నట్లుంది.

మొదట రంగయ్య ఇల్లు వెతికారు. ఏమీ దొరకలేదు. తర్వాత చంద్రయ్య ఇల్లు, అక్కడా ఏమీ దొరకలేదు. ఇక మిగిలింది రాజు, ఎల్లయ్య, సత్తయ్య ఇండ్లు.
ఆ తర్వాతే ఎల్లయ్యల ఇండ్లు కూడా వెతకటం పూర్తయి అందరు సత్తయ్య దిక్కుచూశారు. అందరిలో దడ తగ్గి అది కోపంగా మారింది. అది గ్రహించిన సత్తయ్య వెంటనే అరే అందరి ఇండ్లు అయినయి ఇంగ నాయిల్లేగా మిగిలింది నడ్వుండ్రి తమ్మి” అంటూ తానే ముందుకు దారితీశాడు.

సత్తయ్య ఇంట్లో కూడా ఏమీ దొర్కలేదు. చివరగా మొగులయ్య ఇల్లు మిగిలింది. అందరు అటు దిక్కు కదలిపోతుంటే…
”ఏందిరా పోయిపోయి మొగులయ్యగానింట్లనా ఆడు ఆని రంజిలవడి ఉన్నదీ లేంది తినుకుంట బత్కుతుండు ఆడు అట్లాంటోడు కాడు” అని చంద్రయ్య అంటుంటే సత్తయ్య ఒక్కమాట మాట్లాడలేదు కానీ
”ఇంగో గిదేం తరీఖావయ్యా, మనిండ్లు అందరు సెక్కుజేసినట్లనే మనం అందరిండ్లు సెక్కుజెయ్యాలే మనకొక లెక్క ఇంకొకలకు ఇంగోలెక్కనా గీడ ఒక్కతానా జూస్తే ఇంగ కత తేలిపోతది” అంటు మొగులయ్య ఇంట్లోకి ప్రవేశించాడు.

నీలమ్మ పిల్లలనూ దగ్గరకు అదుముకుంటూ భర్తను చూసింది. చేతులు కట్టుకుని గోడకు చేరగిలబడి జరిగే తతంగాన్ని నిర్వికారంగా చూస్తున్నాడు. కాని ఇద్దరి కాళ్ళు చేతులు సల్లబడ్డయి. సత్తయ్యకు జంకి ఎవరు గడపలోకి అడుగుపెట్టలేదు.
ఎల్లయ్య సరాసరి ఇంట్లోకి పోయి పెట్టెల పక్కబట్టల కింద ఆమూల ఈమూల చూసి పొయ్యి దగ్గరకు పోయి గోనెసంచి మూతవిప్పి చూసి గతుక్కుమని పొయ్యి మీదున్న బగోనే మూతతీసి చూశాడు.
అందులో ఉడికున్న మొక్కజొన్న కంకులు నిండుగా కన్పించేసరికి ”యింగో దొర్కినయి, దొర్కినయి” అంటూ అక్కడ్నించే అరుస్తూ బగోనే పట్టుకుని బయటకు వచ్చి అందరికి చూపించేసరికి వెంటనే సత్తెన్న లోపలికి పోయి ”సరిగా దేవులాడరా” అన్నాడు. ఎల్లయ్య తటపటాయిస్తూనే సంచిని చూపించాడు. దీపం బుడ్డి తీసుకుని నాలుగుమూలలా వెతికేసరికి గోనెసంచి బయటపడింది.

యిద్దరు కల్సి దాన్ని బరబరా బయటకు ఈడ్చుకు వచ్చి అందరి ముందు గుమ్మరించేసరికి అందులోంచి ముప్పై నలభై జొన్నకంకులు బయటపడ్డాయి. అదిచూసి నీలమ్మ గజగజా వణికింది.
బయటపడ్డ జొన్నకంకులను చూసి అందరూ నోరెళ్ళబెట్టారు. చంద్రయ్య, రంగయ్యలు తలపట్టుకున్నారు. వెంటనే సత్తయ్య, మొగులయ్య ముందుకురికి బద్మాషిగా దొంగతనాలకి ఎప్పుడు అలవాటుపడ్డావురా. మా సిగ్గంత దీస్తివిగదరా బడివే దొంగతనం జెయ్యనీకి నీకు ఎన్ని గుండెలురా” అంటూ మొగులయ్యకు ఇష్టం వచ్చినట్లు కొడ్తుంటే ఎవ్వరూ అడ్డుపడలేదు.
కానీ నీలమ్మ భయపడ్తూనే వెళ్ళి సత్తయ్య కాళ్ళమీద పడి ”మామా కొట్టకు మామా. కొట్టకు. బుద్ధి గడ్డితిని గిట్లాంటి లెక్కలు జేసిండు యింకెప్పుడు సెయ్యడు మామా సెయ్యడు” అంటూ కాళ్ళావేళ్ళా పడ్తుంటే సత్తయ్య అతన్ని వదలలేదు. దెబ్బలకు తాళలేక ఎటుతిరిగితే అటు మర్లి కొడ్తుంటే నీలమ్మ సత్తయ్య కాళ్ళు వదలలేదు.

”సిగ్గులేని దొంగముండా ఆడు దొంగతనం జేస్తే దాసిపెడ్తావే మాకు సెప్పవా అయినా నీకాడ గూడా అన్ని దొంగలెక్కలేనే, నొవ్వొచ్చినపుడు నా యింట్ల సిచ్చురేగిందే” అంటూ పోచమ్మ తిడ్తూనే నీలమ్మను పక్కకు లాగింది. ఇటు కొట్టుడు అటు తిట్టుడు జరుగుతుండంగనే చంద్రయ్య, రంగయ్యలు చెరోదిక్కు అడ్డుపడి ”సత్తెన్నా ఇంగ ఆపు ఇంగ ఆపన్నా ఆడు ఎందుకు దొంగతనం జేసిండో రేపు పొద్దుగాళ్ళ అందరి ముందు తేల్చుదామన్నా గింత రాతిరియాల ఆడ్ని కొడ్తే తగలరాని జాగల దెబ్బలు తగిలి ఆడు గుటుక్కుమంటడు నీకు పున్యాముంటది ఇంగ ఆన్ని ఇడువు” అంటూ ప్రాధేయపడ్డాడు.

”అరేయ్‌ ఆడు గిట్లాటి లెక్కలు గియ్యాల జేసిండంటే మీరిద్దరు ఇచ్చిన అలుసేరా గిప్పుడు అందరి కండ్లు సల్లవడినయన్కుంట మీదేం పోతుందిరా నా ఇల్లే తగలవడింది” అంటూ దూషిస్తూ అరుగుమీద చేరగిల పడేసరికి ఎల్లయ్య సల్లగా జారుకున్నాడు.
మొగులయ్య దగ్గరకు వెళ్లి పలుకరిస్తే సత్తెన్న మళ్ళీ కొత్తరాగం అందు కుంటాడని చంద్రయ్య, రంగయ్యలు గూడా పక్కకు తప్పుకున్నారు.

ఇంటిముందర గుమిగూడిన జనాలు కూడా ఒక్కొక్కరే తప్పుకున్నారు.
మొగులయ్య మోకాళ్ళమీద కూర్చొని నిర్వేదంగా భూమిని చూస్తుంటే నీలమ్మ భర్త దగ్గరకు వచ్చి వీపుమీద కములుతున్న వాతలను నిమురుతూ ఏడుస్తూ కూర్చుండి పోయింది.

జరిగిన సంఘటనను కళ్లారా చూసి పిల్లలు ఏడ్చిఏడ్చి ఎక్కిళ్ళు పట్టారు.
అక్కడే నిలబడ్డ సిద్దయ్య జీతగాడితో ”ఓరి పోరగా పో పోయ్యి మీ అయ్యకు జెప్పు మొక్కజొన్న కంకులు దొరికినయని రేపు పగటాలకు మాకొట్టం కాడికి మాట్లాడనీకి రమ్మను” అని జీతగాడికి సత్తయ్య చెప్పేసరికి ”గట్లనే” అని అతను వెళ్లిపోయాడు.
పోచమ్మ నోరు యింకా ఆగలేదు. పెద్దగా ఏడ్వడానికి కూడా భయపడి నీలమ్మ లోలోపలే కుమలసాగింది.

మర్నాడు మిట్టమధ్యాహ్నం అందరు బర్లకొట్టం దగ్గర చెట్టుకింద సమావేశం అయ్యారు. అందరి ముందు దోషిలా నిల్చొని ఉన్నాడు మొగులయ్య.

ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ నిల్చున్నారే కాని జరిగిన సంఘటన గూర్చి ఒక్కరు పెదవి విప్పి మాట్లాడటం లేదు.
కొంచెం ఎడంగా నిల్చున్న ఆడవాళ్ళలో ఏం జరుగుతుందోనని ఆందోళన పెరగసాగింది. నీలమ్మ పిల్లలిద్దర్ని దగ్గరపెట్టుకుని జీవచ్ఛవంలాగా కొట్టం గుంజకు ఆనుకుని కూర్చొని ఉంది.

పిల్లలందరు కల్సి రాళ్ళతో గోళీకాయలు ఆడుతుంటే అది చూసి తల్లి చెయ్యి విదుల్చుకుని అటు పరుగెత్తాడు సురేందరు.
అందరి నడుమ నిశ్శబ్దంతో మౌనం రాజ్యమేలుతుంటే, ”ఏందయ్య జరిగిన దాని దిక్కెల్లి ఒకరు కూడా మాట్లాడరేంది గట్ల గప్‌చుప్‌మని ఉన్నరేంది వయా” అసహనంగా అన్నాడు పెంటయ్య.”ఇగేం మాట్లాడాలే సిద్దయ్య మావోడు దొంగతనం జేసిండని ఒప్పుకుంటుండుగా అగో సాచ్చంగా ఆడు దొంగిలించిన కంకులు” అంటూ సంచి దిక్కుచూపాడు సత్తయ్య.
”ఏంరా మొగులయ్య మంచి గున్నోడివి గిట్లాంటి గలతు అర్కతులు జెయ్యవడ్తివేందిరా నీకు పొలం లేదనా, మంచి సంసారం లేదనా చెప్పు, ఎందుకు గిట్లాటి లెక్కలు జేస్తున్నవు” అని సిద్దయ్య ఆవేశపడ్తుంటే

”ఆనికి బతుకుదెవరువు లేకనా పటేలా బడివే సోమరిపోతు లెక్క తయారైయి పెయొంచి కష్టంజెయ్యక పాయే పంటేయ్యక పాయే ఇంట్ల యన్ని తీస్కపోయి బజార్ల వెట్టిండు పనికి పోవుడు మానిండు ఇంగ పూటెట్ల ఎల్లుతది సెప్పు ఆనికి తగ్గట్టు ఆని పెండ్లాము. ఆడు ఎట్లంటే అది అట్లాడుతది ముసలోల్లా ముడిగోల్ల సేరోకష్టం జేసుకు బత్కొచ్చు గానీ బాగా బలిసినోళ్లాయే కష్టానికి వంగుతరా” అంటూ సత్తయ్య రామకత చెప్పేసరికి, ఆ మాటలు వింటుంటే రంగయ్య, చంద్రయ్య ముఖాల్లో రంగులు మారాయి. ఈ సమయంలో నోరెత్తి ఏమాటా మాట్లాడినా అది తప్పుకిందే జమకడ్తాడని ఊరుకున్నారు.
”ఏంరా మొగులయ్య మేము గీ తీర్గ అడ్గుతుంటే ఒక్క జవాబు సెప్పవేందిరా అసలు గీ దొంగతనం నువ్వే సేసినవా ఎవలన్నా జేయించిండ్రా” ఆరా తీశాడు సిద్దయ్య.

”ఎవరెందుకు జేయిస్తరు సిద్దన్నా మాకు చోరిజేసి బత్కాల్సిన కర్మేంది అందరం తలా ఒక కష్టం చేస్కుంటున్నం బత్కుతున్నం గంతే” అని ఎల్లయ్య మధ్యన కల్పించుకునే సరికి, ”ఓయ్‌ అడ్గుతుంది నిన్నుగాదువయ్యా ఆడ్ని, ఆడ్ని అడుగుతున్న ఒరేయ్‌ గాడిద కొడ్కా, ఎందుకు జేసినవో చెప్పు గట్లనే ఎవలు చేయ్యమన్నరో గది గూడా జెప్పు” అని మళ్ళీ రెట్టిచ్చాడు. అదే అదనుగా అందరు అదే మాటను మళ్ళి మళ్ళి గుచ్చిగుచ్చి అడిగేసరికి మొగులయ్యకి సహనం చచ్చింది. కండ్లలోంచి నీళ్ళు టపటపరాలుతుంటే…

”ఎవళ్ళు నన్ను దొంగతనం చేయమనలే! నేనే దొంగతనం జేసినా నా పెండ్లాము పిల్లల కడ్పు నింపనీకి గీ దొంగనతం జేసినా! గందుకు మీరు నన్నేం జేసినా సరే” అని మొగులయ్య గట్టిగా అరిచి గోదలేక్క ఓర్లాడు.
మొగులయ్య మాటలు విని మండిపడ్తూ లేచాడు సిద్దయ్య.
”ఒరేయ్‌ దొంగతనం జెయ్యనీకి నా సేనే దొరికిందిరా ఇంకొకసారి గిట్లజేస్తే ముడ్డిబొక్కలు ఇర్గగొడ్తా” అంటూ అందరి దిక్కుతిరిగి ”తిన్నదరగని లెక్కలు జేసి మీదికెని ఆ ఒర్లుడు సూడుండి. మీ వోడు నాసేండ్ల చోరి చేసిండని తేలిపోయింది ఇంగ నాకు జరిగిన నష్టానికి ఏమిస్తరో జెప్పుండ్రి” అన్నాడు.

వెంటనే సత్తయ్య ముందుకువచ్చి ”ఎవళు ఎందుకు నష్టం గట్టిస్తరు సేటూ నావోళ్ళు ఎవళు ఈ పనికి మదతు జేయ్యరు దొంగకొడుకు ఎట్లా దొంగతనం జేసిండో గట్లనే జుర్రుమానా కట్టమను” అంటూ సత్తయ్య ఖచ్చితంగా అనేసరికి అతనికి ఎవ్వరు ఎదురుచెప్పే సాహసం చెయ్యలేదు. ”మొగులయ్య మీ పెద్దనాయినా గిట్లంటుండు. నువ్వేమంటవురా” అన్నాడు పెద్దయ్య.
”ఎంత నష్టం అడిగితే గంత పనిజేసి ఇస్తా” అని మొగులయ్య అనగానే

”ఎప్పుడురా ఇచ్చేది యేడాదికా రెండేండ్లకా బడివే చోరి చేసేటప్పుడు గివన్ని యాదికుండయిరా సూస్తే పీనుగు లెక్కున్నవు కాని గిట్లాంటి అర్కతులు జేస్తున్నవేందిరా” అంటూ సత్తయ్య దిక్కుతిరిగి, ”సత్తయ్య ఈడు జిందగీల గిట్లాటి లెక్కలు మల్లాజేయకుండా యాభై చప్టా దెబ్బలు కొట్టండి” అన్నాడు సిద్దయ్య.
ఆమాట వింటుండగానే నీలమ్మ గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి కాని ఏమి చేయలేని నిస్సహాయతతో మౌనంగా కూర్చుండిపోయింది.

ఆక్కడున్న మిగతా వాళ్ళందరు నిశ్చేష్టులై చూశారే తప్ప ఇది అన్యాయం అని ఎదురు తిరిగి ప్రశ్నించలేదు.
దొరికిందే ఛాన్సు అని ”ఒరేయ్‌ ఎల్లిగా.. ఆ చప్టా దీసుకుని ఎయ్యరా” అని సత్తయ్య అనంగానే ఇదే మంచి అవకాశం అనుకుని చప్టా తీసుకుని మొగులయ్యకు యాభై దెబ్బలు లెక్కపెట్టి కొడ్తుంటే, అదిచూసి గోళీలాట ఆపి పిల్లల గుంపంతా ఆక్కడికి పరుగెత్తుకొచ్చి కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తున్నారు. వాళ్ళలో ఉన్న సురేందరు తండ్రిని కొట్టడం చూసి నాయినా… నాయినా… అంటూ పెద్దపెట్టున ఏడ్వసాగాడు.
మొగులయ్య శిక్షను అనుభవిస్తూ శిలాలా నిల్చుండిపోయాడు. నీలమ్మకు కళ్లు మసకబారి పక్కకు వొరిగి సొమ్మసిల్లింది.

(ఇంకావుంది)

– జాజులగౌరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

69
ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)