స్త్రీ యాత్రికులు(6 వ భాగం)

పర్వతాల్లో ప్రయాణాలు చేసిన చిత్రకారిణి నీనా మజుషెల్లీ -2

ఎలిజబెత్ శారా మజు షెల్లీ  ముద్దు పేరు నీనా.ఆమెకి చిన్నతనంనుండీ చిత్రకళల పై ఎంతో ఇష్టం.ఆ నాటి యువతులకి ఎక్కువగా చిత్రకళలో ప్రవేశం వుండేది.సాటి బ్రిటీష్ ఆఫీసర్ల భార్యలందరూ పరిసరాల్లోని కొండ ప్రాంతాల్లో గుర్రపు స్వారీచేస్తుండేవారు.వారితోపాటే నీనా కూడా గుర్రం మీద కొద్ది దూరాలు మాత్రం తిరిగేవి.సాయంకాల వేళలో తనతోపాటుగా స్కెచ్ బుక్ ,రంగులు తీసుకు వెళ్లి తనకి నచ్చిన దృశ్యాన్ని చిత్రిస్తూ ఉండేది.ఆ పర్వతాల్ని,అక్కడి గ్రామాల్లో ఉండే ప్రజలని ప్రేమించేది.దూరంగా కనిపించే నీలి పర్వతాలలో అన్నిటికన్నా ఎత్తైన కాంచెన్ జుంగా  పర్వతంఅంటే నీనాకి ఇష్టం.

ప్రపంచం లోకెల్లా మూడవ ఎత్తైన శిఖరంగాదానికి పేరుంది.వేసవి కాలంలో మేఘాలు లేకుండా ఉన్న రోజున డార్జిలింగ్ నుండి ఆ పర్వత శిఖరాలు బంగారు రంగుతోధగ ధగలాడుతూ దర్శనమిస్తాయి.

 ఆ ప్రకృతి దృశ్యాలకి తన్మయత్వం చెందుతూ,ఎపుడెపుడు ఆ నీలి పర్వతాల సానువుల్లోకి వెళ్లి తిరుగుదామా అనిపిస్తూఉండేది నీనాకి.మంచు నిండిన ఆ శిఖరాలు నీనాను పిలుస్తున్నట్టుగా ఉహించుకునేది.ఆ కాలిబాటలు తననుఎంతదూరం తీసుకు వెళతాయోనని ఆలోచించేది.అక్కడి పూలు,ఆహ్లాదమైన గాలి ,కొండల మధ్యలో జారిపోతూ ఉండేనీటి సానలు,ఎగిరే కీటకాలు అన్నీ ఆమెను ఆకట్టుకోనేవి.ఎలాగైనా ఆ కొండల్లో తిరగాలనీ,వాటి అందాలని తన కుంచెతోబంధించి మంచి చిత్రాలు వేయాలనీ అనుకునేది.నిజాని ఆ పర్వతాల ప్రేమలో పడటం చాలా సులువు.అది కంటికివినిపించే కమ్మని పిలుపు.

   పర్వతాలు అధిరోహించాలి అనే ఆలోచన ఆ రోజుల్లో పురుషులకు మాత్రమే వుండేది కాబట్టి ,భర్తకి తన ఆలోచనలుచెప్పుకోవటానికి ఇబ్బంది పడేది.’మగవారిలాగా ఆలోచించటానికి సిగ్గుగాలేదా’! అని కోపిస్తాడనే భయంతో ఎప్పుడూ తన ఆలోచనలు అతనికి చెప్పలేదు.

    పద్నాలుగు సంవత్సరాల పాటు కళలు కంటూ అలా ఉండిపోయింది కానీ తన ఆలోచనలు ఎవ్వరికీ

చెప్పుకోలేకపోయింది.వయసు పైబడేకొద్దీ తన కలలునిజం చేసుకోవాలన్నకోర్కె ఎక్కువైంది.ముసలి వారికి మాదిరిగా

వాకిట్లో కూర్చుని ఆ పర్వతాలను చూస్తూ వుండటం కంటే, అక్కడికి ప్రయాణం చేయడమే మంచిది అని నిర్ణయం

తీసుకోనేటప్పటికి నీనాకి నలభై సంవత్సరాలు వచ్చేసాయి. చివరికి తెగువ చేసి ఫ్రాన్సిస్ కి తన కలల గురించి

వివరించింది.నీనాకి సంతానం లేదు.కాబట్టి ఇంట్లో వుండే అవసరం లేకుండా పోతుంది.

     “నిజమే మై డియర్ నీనా!నాకూ తిరగాలనే ఉంది,ఈ చర్చి పనులు ఎపుడూ ఉండేవే” అంటూ అతడిష్ట పడగానే నీనా ఎంతో సంతోష పడింది.ఆ సమయం లో ఫ్రాన్సిస్ ఒప్పుకోకపోయినా,ఒకర్తే అయినా పర్వతాల ప్రయాణానికి సిద్ధమవాలని శపధం చేసుకుంది నీనా.

     ఫ్రాన్సిస్  మిత్రులకి, సేవకులకి ఆ కొండల గురించి క్షుణ్ణంగా తెలుసు.వారాంతం లో బ్రిటిష్ అధికారులు అటుగా వెళ్లి వినోదిస్తునే వుంటారు.అందుకని ఆ కొండల్లోకి వెళ్లి యాత్ర చెయ్యడానికి ఫ్రాన్సిస్ వెంటనే ఒప్పుకున్నాడు. తమతో పాటుగా పది మంది కూలీలను కుదుర్చుకొని రెండు వారాల విహార యాత్ర కోసం కావాల్సిన సామాన్లు , గుడారాలు,తినుబండారాలు అన్నీ  తీసుకొని  వెంటనే బయల్దేరారు.నీనా తన స్కెచ్ బుక్స్ ని,రంగుల్ని వెంట తీసుకు పోయేది.

 హడావుడిగా తల పెట్టుకున్న ఈ యాత్రలో నీనాకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.తాను కావాలని వచ్చింది కాబట్టి అన్నిటినీ చాలా ఓపికతో భరించేది.వారి గుడారాల్లోకి రాత్రిపూట  గబ్బిలాలు వచ్చి నీనా బుగ్గల మీద గాట్లు పెట్టేవి.నీటి ఎలుకలు వచ్చి సామానులు కొరికి వేసేవి.’మనం వాటి నివాసాలలోకి దాడి చేస్తున్నాం.కాబట్టి అవి మన మీద కోపాన్ని ప్రకటిస్తున్నాయి”అంటూ ఫ్రాన్సిస్ తో నవ్వుతూ చెప్పేది. చెట్ల కింద వంట చేసుకుని ఆ వండుకున్న పాత్రల్లోనే తినటం లాంటి చిన్న ఆనందాలు వదులుకునేది కాదు.అకస్మాత్తుగా వచ్చే వర్షాల్లో తడవటం ,చెట్ల కాయల్ని నోటితో అందుకుని కొరుక్కు తినటం లాంటి పిల్ల చేష్టలన్నీ ఆమెకి ఆనంద మార్గాలే.

 ఆ పర్వతాల్లో పొంగి వచ్చే దివ్యమైన గాలికి ,పక్షుల కూతలకి వారికి వేకువ జామునే మెలకువ వచ్చేది.ఒక్కొక్క

శిఖరాన్నే  వెలిగిస్తూ పైకొచ్చే సూర్యుణ్ణి చూసి గెంతులేసేది.మహర్షుల మాదిరిగా జుట్టు పెంచుకుని కూర్చున్న శిఖరాల శిరస్సుల మీదకి వెళ్ళాలని ఆమె కోరిక.వాటిల్లోకి ఎక్కువ దూరం వెళ్ళలేక పోతున్నాం అనేదే  ఆమె బాధ.

 (ఇంకావుంది )

– ప్రొ.ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“

UncategorizedPermalink

Comments are closed.