ఆనంద తీరాలకో… అనంత దూరాలకో..

ఇరు సంధ్యల మధ్య కాలంలో,
ఊగిసలాడుతుంది జీవన పెండ్యులం,
శరత్ జ్యోత్స్న రాత్రుళ్ళు
శారదవీణా తంత్రులు
మొగ్గ తొడగని మల్లెతీగె
కలం జారని పద లేమి
భావనలు ఉవ్వెత్తుగా,
మేరు సమాన తరంగ ఘోషలా
విజృంభిస్తున్నా
హృదయం ఒక గంభీర గవాక్షం లా
ఆటు పోట్లన్నిటినీ స్వీకరిస్తూ
నిలుస్తుంది ఓర్పుతో పరిస్థితులకెదురు నిల్చి

ఓ పికమా, నీ కుహుకూజితాలు,
నా ఎడెందను తాకి మూగవారుతున్న
మనోవీణియ తంతృలను మీటుతూ
మరో జన్మ ఇస్తున్నాయి,
మౌనాన్ని మల్లెల పరీమళాలతో
నిలువెత్తుగా నింపుతున్నాయి సువాసనలతో
తిరిగి ప్రకృతి చేలాంచలములతో
కాలపురుషుడిని మేళవిస్తూ
అనంతమైన ప్రయాణానికి
వంకలూ, వాగులూ, గుట్టలూ, మిట్టెలూ
పొలాలూ, పాదులూ, చెట్లూ చేమలూ, ఎడార్లతో
దార్లు సమకూరిస్తూ…..

– ఉమా పోచంపల్లి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

UncategorizedPermalink

Comments are closed.