ముజఫర్ నగర్ లో ఏమి జరిగింది? – వాస్తవ కళ్ళద్దాల పరిశీలన

పుస్తకం పేరు:
ముజఫర్ నగర్ మారణయాత్ర – నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర
రచన : అనిశెట్టి రజిత, భండారు విజయ
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ప్రచురణ
పుస్తక పరిచయం :
రమాసుందరి బత్తుల

రమా సుందరి

రమా సుందరి

“ముజఫర్ నగర్ లో ఏమి జరిగింది?” అని తెలుసుకోవాలంటే భారత ప్రజలకు ఉన్న దారుల్లో ఒకటి ప్రభుత్వ నివేదికల ద్వారా తెలుసుకోవటం, రెండు న్యూస్ మీడియా ద్వారా తెలుసుకోవటం. ప్రభుత్వ నివేదికలలోని విశ్వసనీయత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటుందనే విషయం అందరికీ తెలిసినదే. ఇక పెట్టుబడి ప్రవేశం ఇటీవల విశేషంగా జరిగిన మీడియా ప్రపంచంలో ఇదివరకటి విశ్వసనీయతను ఆశించలేము. పాక్షిక సత్యాలు చాలా ముసుగులతో కన వస్తాయి. వినవస్తాయి.
సమాజం పట్ల బాధ్యత, సరైన చూపు ఉన్న మనుషులు చేసే క్షేత్ర పర్యటనలు చాలా ప్రాముఖ్యత సంతరించుకొంటాయి. “ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక” నుండి ఈ సారి ఈ కర్తవ్యాన్ని మోసుకొంటూ ఇద్దరు మహిళలు బయలుదేరారు. భారతదేశంలో ఉష్ణ ప్రాంతంగా గుర్తించబడిన ఆంధ్ర ప్రదేశ్ నుండి శీతల ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ కు జనవరి నెలలో ప్రయాణం కట్టారు. అప్పటికి ముజఫర్ నగర్ అల్లర్ల గురించి వార్తలు వచ్చి రెండు నెలలు దాటి పోయింది.
1 001              భండారు విజయ, అనిశెట్టి రజిత చేసిన ఈ ప్రయాణం ప్రజాస్వామిక రచయిత్రుల దృక్కోణం నుంచి చూస్తే ఒక నిబద్దతతో కూడిన బాధ్యత. నిజ వార్తా ప్రపంచం నుండి చూస్తే ముసుగు వేయని, రంగులు అద్దని ఒక నికార్సైన ప్రయత్నం. ప్రజల పట్ల ఒక జవాబుదారీతనం. ఇవన్నీ ఉండబట్టే అనిశెట్టి రజిత ఈ పుస్తకంలో చెప్పినట్లు “చలి ఆడవాళ్ళను వేటాడే సైకోల్లా విచ్చలవిడిగా” మీద పడినా … శరీర ధర్మాలు గడ్డకట్టుకొని పోతున్నా… ఎడతెగని ప్రయాణం చేసి ఉత్తర భారతదేశంలోని పశ్చిమ ప్రాంతానికి చేరుకొన్నారు. చూసిన దృశ్యాల్ని ఛాయాచిత్రాలలో బంధించటమే కాక వాళ్ళ మనసు కేన్వాసు మీద ముద్రించుకొని వచ్చారు. కళ్ళతో బాటు ఇంద్రయాలన్నీ స్పందించినట్లున్నాయి. వీరు రాసిన నివేదికలో పచ్చి నెత్తుటి వాసన వస్తుంది. కటిక చేదు వాస్తవిక రుచి తగులుతుంది. నిజాయితీ, నిజాల రంగులతో ఈ రాతలు మెరుస్తున్నాయి. సిరాతో బాటు హృదయంలో కలాన్ని అద్ది రాసినట్లున్నారు. జీవన వేదన తాలూకు స్పర్శ కూడా ఈ పుస్తకం ద్వారా మనసుకు తాకుతుంది. రచనలకు నైపుణ్యం, శిల్పం అవసరమని అంటారు. కానీ ఏ సృజనలో నైనా ఉండాల్సిన వాస్తవిక దృష్టి, నైపుణ్యం కంటే గొప్పది. ఆ చూపు ఈ రచనకు ఉంది. ముజఫర్ నగర్ నుండి వాస్తవాలని బయటకు నడిపించాలనే ఈ ఇద్దరు రచయిత్రుల ప్రయాణంలో ఉన్న సాహసం రచనా శిల్పం కంటే పేర్కొనదగ్గది.
రచనలకు సామాజిక దృష్టి, దృక్పధం అవసరం లేదనే వాదనలు నడుస్తున్న కాలమిది. ఈ వాదనలు ఇప్పుడు కొత్తవి కావు. అయితే ఇదివరలో ఇలాంటి వాదనలు రాగానే నాలుగు వైపులా నుండి చెంప చెళ్ళుమనిపించే సమాధానాలు వచ్చేవి. ఇప్పుడు సడి చెయ్యని గొణుగుళ్ళు, ముక్తసరి ముక్తాయింపులు తప్ప గొంతులు గట్టిగా లేవని స్థితి ఉంది. అందరు ప్రేమలు, సౌందర్యాలు గురించి రాస్తే మరి ముజఫర్ నగర్ బాధితుల గురించి ఎవరు రాయాలి? తమిళనాడు పరువు హత్యల గురించి ఎవరు రాయాలి? హర్యానా ఖాఫ్ పంచాయితుల గురించి, ఈశాన్య రాష్ట్రాలలో జరుగుతున్నా అత్యాచారాల గురించి ఎవరో ఒకరు, ఎక్కడో ఒక చోట కలం విదల్చాలి. ఆ పని ఈ సారి ఈ రచయిత్రులు ఇద్దరు చేశారు.
2 001రెండు పెద్ద కవితలు, బాధితుల హృదయ ఘోష (ప్రధానంగా స్త్రీలది), బాధిత గ్రామాల సమాచారం, ఎన్.ఏ. అన్సారీ గారి వ్యాసం, చాలా ఫోటోలు , కాత్యాయని విద్మహే గారి ముందు మాటతో ఇది ఒక 64 పేజీల పుస్తకం. ముజఫర్ నగర్ లో ఏమి జరిగింది అనే ప్రశ్న నుండి మొదలైన ఈ పుస్తకం ఇంకా ఎన్నో ప్రశ్నలను మనకు వేసి ముగుస్తుంది. భండారు విజయ “గుజరాత్ అయినా …. ముజఫర్ నగర్ అయినా …/ ప్రతి యుద్దం లో గాయాల గురి … మహిళలే!!/ ప్రతి శవము అత్యాచారాలా బాధితురాలే!!? పితృస్వామ్య దౌర్జన్యంలో/ పురుష అహంకార దౌష్ట్యంలో … మత ఛాందస విశ్వాసాలలో ఎన్ని సార్లని మరణిస్తాం/ ఎన్నేళ్ళని భరిస్తాం?” అంటే, రజిత అనిశెట్టి “ఆడదంటే ఇక్కడ లైంగిక పరికరం … అత్యాచారాలకు/ అనువైన ఒకే ఒక ప్రాణ యంత్రం…ఆడజన్మలు నిషిద్ధ మేఘాలు! … ఎక్కడా సగ భాగస్వామ్యం మానవహక్కులూ లేని అభాగ్యలు విస్మృతులు … “ అంటారు. ఇంకా “నేరాలూ నేర రాజకీయాలు … మాఫియాలూ / ఏలుకోండిరా శవాల కుప్పలను/ సాగు చేసుకోండిరా ముజఫర్ నగర్ లను/ చేయండిరా మురుగు కంపు శవరాజకీయాలను …” అంటూ సవాలు విసురుతారు.
షామిలీ మండలంలో వేసి ఉన్న డేరాలలో బతికి ఉన్న ప్రాణాలు చెబుతున్న కధలు హృదయవిదారకంగా ఉన్నాయి. వందల సంవత్సరాలుగా వారు ఏర్పరుచుకొన్నామనుకొన్న సుస్థిర జీవనం గాలి బుడగే నని ఒక్క రోజులో తేటతెల్లం అయ్యింది. నివాసాలు బస్మీపటలం అయ్యి … శరీరాలు ఖండా ఖండాలు అయ్యి.. అసలేమీ జరిగిందో తెలియని అయోమయంలో నిర్వేదంగా జీవచ్ఛవాల్లాగా చాలా మంది మిగిలిన వాస్తవాన్ని ఈ పుస్తకం చెబుతుంది. సూర్యరశ్మి నుండి, జడివానల నుండి రక్షణ ఇవ్వలేని ఆ గుడారాలలో ఎన్ని రోజులు ఉండాలో, ఉండకూడదని అనుకుంటే ఎక్కడకు వెళ్ళాలో తెలియని గందరగోళంలో దినమొక గండంగా బతుకులు వెల్లబారుస్తున్నారు. ఈ శిబిరాలు ప్రారంభమయిన నెలలోపునే పసిపిల్లలు అరవై మంది దాకా చలికి చనిపోయారనే నిజం చదివితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తడిసిన డేరాలలో, బురదలో, టాయిలెట్లు, మంచినీళ్ళు లేని అనాగరిక లోకంలో బ్రతుకుతున్న జీవనస్థితి గురించి ఈ పుస్తకం ఫోటోల రూపంలో , అక్షరాల రూపంలో దృశ్యీకరించింది.
అత్యాచారం ఆధిపత్య భావజాల ప్రకటన అయినప్పుడు అవి విశ్వమంతా జరుగుతాయి . ప్రజల ఆగ్రహావేశాలను చల్లార్చటానికి నిర్భయ చట్టాన్ని తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఒక పక్క ఆదివాసీ స్త్రీలపై అత్యాచార పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆదివాసీ స్త్రీలనే కాదు ఎక్కడ ప్రజలు ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారో .. అక్కడ వాటిని ప్రభుత్వ బలగాలను ఉపయోగించి ‘రేపు’ల ద్వారా అణుస్తూనే ఉంది. అంటే ప్రభుత్వమే ఒక రేపిస్ట్ గా వ్యవహరిస్తున్నప్పుడు ముజఫర్ నగర్ అత్యాచార బాధితులకు న్యాయం ఈ వ్యవస్థలో జరుగుతుందని ఎలా ఆశించగలం? అత్యాచారాలకు ఇక్కడ అనధికార ఒప్పుకోలు ప్రసాదించబడింది. అందుకే పదహారు ఏళ్ళ బాలిక ఛాతిని కోసివేసి రొమ్ము విరుచుకొని తిరగగలిగారు. ఎనిమిది ఏళ్ళ బాలుడి పై ఇద్దరు పురుషులు ఎనిమిది కుట్లు పడేంతవరకు అఘాయిత్యం నీచంగా చేయగలిగారు. వయసు ఆడపిల్లల్ని బట్టలు విప్పించి నగ్న నృత్యాలు చేయించగలిగారు.
ప్రభుత్వాలు బాధితుల పక్షాన నిలవవు. స్త్రీల పక్షాన అంతకంటే నిలబడవు. ఓట్ల పక్షాన నిలుస్తాయి. అందుకే బాధితులు ఈ మురికి గుడారాల్లో ఉండాల్సిన పరిస్థితుల కంటే రాబోయే ఎన్నికలు వాళ్ళను భయపెట్టాయి. తిరిగి వెళ్ళిన వాళ్ళకు మాత్రమే భృతిని ప్రకటించి చేతులు దులుపుకొన్నాయి. జరిగిన మారణకాండకు ఎవరు సమాధానం ఇవ్వటం లేదు. ముందు జరుగుబాటు ఎలా అనే అనిశ్చిత పరిస్థితినుండి కూడా ఎవరూ వాళ్ళను గట్టెక్కించటం లేదు. “అంతా బాగానే ఉంది” అనే సిద్ధాంతాన్ని తాము ప్రవచిస్తూ, బాధితుల్ని కూడా వంత పలకమనే ఒత్తిడి రెండు ప్రభుత్వాల నుండి వారికి వస్తుంది. (రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల నుండి)
“మా జ్ఞాపకాల నిండా ముళ్ళ కంపల్లా లేచిన ప్రశ్నలు …!
మా యాత్రంతా మహిష్కాన్ని చుట్టేసిన సవాళ్ళూ …!
మేము వాళ్ళ మీద మట్టి చిమ్మేసి వచ్చామో లేక వాళ్ళ కన్నీళ్ళలో తడిసి వణుక్కుంటూ వచ్చామో, వాళ్ళ గాయాలను తడిమి రక్తపు మరకలు పూసుకొని వచ్చామో… మొత్తానికి ఒక పీడకలను మోస్తున్న కళ్ళతో వచ్చేశాము.” అని పుస్తకం చివర్లో చెప్పిన ఈ రచయిత్రులు ఆ ప్రశ్నల కొడవళ్ళను మనకు బదిలీ చేసి, ఆ జీవన వేదనను మనకు పూర్తి స్థాయిలో పంచారు. సాహిత్యానికి ఇంతకంటే ప్రయోజనం ఏముంటుంది?

– రమాసుందరి బత్తుల

9440568912

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలుPermalink

3 Responses to ముజఫర్ నగర్ లో ఏమి జరిగింది? – వాస్తవ కళ్ళద్దాల పరిశీలన

 1. రెండు నెలల క్రితం ఇదే పుస్తకంపై వెలువడిన సమీక్ష చదివి చాలా ఆలోచించాను మళ్ళీ ఇప్పుడు .ఇలా ! రమ గారు మనసంతా వికలమైంది. మీ సమీక్షతో అక్కడికి వెళ్లి పరిస్థితులను కళ్ళకి కట్టినట్లు చూపిన రచయిత్రుల అనుభవంతో స్వీయానుభవస్థితిలోకి వెళ్లి మళ్ళీ గుండె బరువైంది
  ఇలాంటి పర్యటనలు అవసరం వాస్తవ పరిస్థితులు అందరికి అర్ధమవుతాయి .

 2. raghava says:

  రమ గారూ!….అవును-గాయాల గురించి మరెవరు రాస్తారు?…చాలా బాగా అడిగారు-ఇంత ఆర్ద్రంగా పట్టించుకుని మనసుపెట్టి నాలుగు మాటలు రాసే వాళ్ళున్నంతకాలం..భరోసా నిలిచే ఉంటుంది భవిష్యత్తు మీద-

 3. Thirupalu says:

  రమా సుందరి గారు,
  మీరు సమీక్ష చేస్తే ఆ పుస్తకాలు చదివినంత తృప్తి. వాస్తవ దృక్పదాన్ని కోల్పోతున్న ఇప్పటి సాహిత్య లోకంలో మీ లాంటి వాళ్లు వెలుగు దివ్వెలు. కొన సాగించండి ఈ వెలుగు నివ్వడం.