చేరా

Chekuri_ramaraoచేరా – ఆ పేరు వినగానే ఏదో ఒకాత్మీయతః అందరికి కళ్ళకు గట్టినట్లు అనిపిస్తుంది. అది ఆయన గొప్పదనం. ఎప్పుడు చిర్నవ్వుతో పలకరించే నిరాబండరత్వం మూర్తీభవించిన మనిషి ఆయన. గొప్ప ప్రొఫెసర్ అన్న అహంభావం గాని, చిన్న పెద్దా తారతమ్యం  గానీ  ఆయనలో కనిపించేవి కావు. తనకి నచ్చిన విషయాన్ని మాత్రమే తన చేరాతలలో  రాశారు. నచ్చని వాటి జోలికి పోలేదు.  

          నేను తిరువూరులో మేనేజరుగా  పనిచేస్తున్నరోజులలో  అయన రెండు సార్లు మా ఇంటికి వచ్చారు. ప్రశాంతంగా వున్న ఆ వూరు ఆయనకు ఎంతగానో నచ్చింది. అప్పుడు ఆయన కోసం ట్రావెలర్స్  బంగ్లాలో వసతి ఏర్పాటు చేశాను.  ఏకాంతంగా ,ప్రశాంతంగా వున్న ఆ  ప్రదేశం  రాసుకోవడానికి వీలుగా వుందని ఆయన ఆనంద పడ్డారు. రెండో సారి మా వూరికి ఆయన రావడం కూడా  కేవలం అక్కడి  వాతావరణం నచ్చే. అప్పుడే ముత్యాలసరాల గురించి, వాటి నడక గురించి ఆయన మాకు వర్ణించి చెప్పారు. అది మా అమ్మాయి రజనీకి (అప్పటికి దానికి తొమ్మి దేళ్ళు) చాలా  నచ్చడం ఆ తర్వాత అది ముత్యాల సరాల్లో కొన్ని పద్యాలు రాయడం  జరిగింది. చిన్న పిల్లలకు కూడా  అర్ధమయ్యేలా చెప్పగల గొప్ప ప్రొఫెసర్ ఆయన. 

           అప్పటికి చాలా కాలం  కిందటి నుంచే  నేను కవిత్వం అనుకున్న కొన్ని పద్యాలు రాసుకుంటూ, పారేసుకుంటూ, మరికొన్ని దాచుకుంటూ  అటు ప్రొఫెషనల్ గా  పైకి రావడం మంచిదా, లేక సాహిత్యం  వైపు  దారి మార్చుకోవడమా  అన్న మీమాంసలో  వున్నాను. (అయితే చివరగా అటూ వెళ్ళక, అంటే నచ్చక, ఇటూ వెళ్లక మధ్యలో నిలిచి పోయాను. కాలాంతరంలో దాని వల్ల  నష్టపోయానని మాత్రం విచారించ లేదు.)  సాహిత్యం గురించి గానీ, కవిత్వం గురించి గాని నేను తరచుగా  ఆయనతో చర్చించింది లేదూ, అంత  సమయం నాకు దొరకనూ లేదు. ఆయన మంచితనానికి, అందరిని సమానంగా చూసే గొప్ప గుణానికి ఒక ఉదాహరణ:నేను  1989లో అచ్చువేసుకున్న పుస్తకాన్ని తిరువూరులో ఆయన  ఆవిష్కరించారు. అందులో కొన్ని పద్యాలు  బాగున్నాయని, కొన్ని  బాగుండలేదని  చెప్పడమే కాకుండా, సరిగా ఎడిటింగ్ చెయ్యనందుకు నన్ను మందలించారు. హైదరాబాద్ వచ్చాక అప్పుడప్పుడూ సమావేశాల్లో కలుస్తుండే వారం కానీ  తక్కువగా మాట్లాడే ఆయనతో  ఎక్కువ సమయం గడపలేక పోయాను.

          ఎనభై ఏళ్ళు ఆయనకు వచ్చాయా అని ఆశ్చర్యం,  ఆయన చనిపోయారనే  నమ్మలేని నిజాన్ని నమ్మలేకపోవడం రెండూ ఎప్పటికి నన్ను విడిచిపెట్టవేమో.

                                         — టి.వి.ఎస్.రామానుజ రావు 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.